ఇస్లాం నైతిక విధానం | అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) [పుస్తకం]

ఇస్లాం నైతిక విధానం | అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) [పుస్తకం]

అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) గారి ‘సీరత్’ (మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మరియు సందేశం) గ్రంథాలలోని, ముఖ్యంగా నైతిక పర్వంలోని సారం ఆధారంగా ఈ పుస్తకం రచించబడింది

ఇస్లాం నైతిక విధానం – పార్ట్ 1 [PDF] [47 పేజీలు]
ఇస్లాం నైతిక విధానం – పార్ట్ 2 [PDF] [41 పేజీలు]

కూర్పు: మౌలానా ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌
తెలుగు అనువాదం: ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్

ముందుమాట

పుడమిపై కాలిడిన ప్రతి మనిషికీ ప్రపంచంలోని ప్రతి వస్తువుతో ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక విధమయిన సంబంధం తప్పక ఏర్పడి ఉంటుంది. ఈ సంబంధాల వల్ల పడే బాధ్యతను సక్రమంగా, సజావుగా నిర్వర్తించటమే సత్ప్రవర్తన. అదే ఉత్తమ నడవడిక! మనిషికి గాలి, నీరు, వెలుతురుతో సంబంధమున్నట్లే! పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు, సెలయేళ్లతో సంబంధమున్నట్లే పుడమిలోని ప్రాణులతో కూడా అతనికి అవినాభావ సంబంధముంటుంది. ఈ బాంధవ్యంలో అతని తల్లిదండ్రులు, ఆలుబిడ్డలు, ఆత్మీయులు అందరికన్నా ముందు పరుసలో నిలుస్తారు. ఇరుగు పొరుగు వారితో, ఊరు వారితో, ప్రాంతం వారితో, జాతి వారితో, దేశ వాసులతో అతనికి ప్రగాఢమైన సంబంధాలుంటాయి. ఆఖరికి తన పరిసరాలలో, తన ఆధినంలో వున్న పశుపక్ష్యాదులతో కూడా అతనికి సంబంధం ఉంటుంది. ఈ కారణంగా వాటి పట్ల తనకు గల బాధ్యతలను కూడా అతను నెరవేర్చవలసి ఉంటుంది.

ఈ బాధ్యతల నిర్వర్తన ఎంత సజావుగా సాగితే ప్రపంచంలో సుఖసంతోషాలు అంతే పుష్కలంగా ప్రాప్తిస్తాయి. అసలు నిజం చెప్పాలంటే లోకంలోని సుఖనంతోషాలు, శుభశ్రేయాలు, శాంతిభద్రతలు – ఇవన్నీ ‘సద్వ్యవహారం” మరియు ‘ఉత్తమ నడవడిక’తోనే ముడిపడి ఉన్నాయి. ఈ నైతిక నిథి ఎప్పుడు ఖాళీ అవుతున్నట్లు అనిపించినా ప్రభుత్వాలు, సామాజిక నంస్థలు తమ శక్తినీ, బలాన్నీ ఉపయోగించి ఈ మాంద్యాన్ని పూరించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఒకవేళ ఆయా మానవ సముదాయాలే గనక ఎప్పటికప్పుడు తమ నైతిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో అవి సజావుగా పరిఢవిల్లేలా జాగ్రత్తపడితే ప్రభుత్వాల బలప్రయోగాలకు, చట్టపరమయిన ఆంక్షలకు గురి కావలసిన అగత్యం కూడా ఏర్పడదు.

అందుకే మనిషికి; తానవలంబించే మత ధర్మం నైతికంగా సంపూర్ణ మార్గదర్శకత్వం వహించాలి. దాని నైతిక ప్రబోధనల ప్రభావం అతనిపై ఎంత గట్టిగా పడాలంటే జీవితంలోని ఏ విభాగంలోనూ, ఏ దశలోనూ అతని అడుగులు తడబడ కూడదు.

చిట్టచివరి ధైవసందేశహరులైన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ద్వారా ప్రవచించబడిన, క్రియాత్మకంగా ప్రవేశపెట్టబడిన నీతీ నియమాలను, షరీయత్‌ను మీ ముందున్న ఈ పుస్తకంలో విశదీకరించే వ్రయత్మం జరిగింది.

ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఇస్లాం నైతికతకు ఎంత ఎక్కువ ప్రాధాన్యతనిఛ్చిందో నేటి ముస్లింలు దినిని అంతే విస్మరిస్తున్నారు. మరికొన్ని చోట్లయితే వారు ఈ అంశాన్ని అసలు పట్టించుకోవటమే లేదు. జాతుల ఉత్తానంలో, సంస్కృతీ నాగరికతల ప్రగతీ వికాసాలలో నైతికతకు, సద్వర్తనకుగల ప్రాముఖ్యతను ముస్లింలు ఎంత త్వరితంగా గుర్తిస్తే అంతే మంచిది.

20వ శతాబ్దిలో భారత ఉపఖండంలో – ఉర్దూ భాష ద్వారా – ఇస్లామీయ సాహిత్య పురోభివ్యద్ధికి ఇతోధికంగా తోడ్పడిన విద్వాంసులలో అల్లామా సయ్యిద్‌ సులైమాన్‌ నద్వి (రహిమహుల్లాహ్) ఒకరు. ‘సీరత్‌‘ (మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మరియు సందేశం) పై ఆయనకున్న అవగాహన అపారం. ‘సీరతున్నబీ‘ పేరుతో ఆయన గురువర్యులు అల్లామా షిబ్లీ నూమానీ (రహిమహుల్లాహ్) ప్రారంభించిన రచనను ఆయన తదనంతరం అల్లామా సులైమాన్‌ నద్వి (రహిమహుల్లాహ్) గారు పూర్తి చేశారు. 6 భాగాలుగా వెలువడిన ఈ రచన ఆయన పాండితీ ప్రకర్షకు అద్దం పడుతుంది. ఆ సీరత్‌ గ్రంథాలలోని, ముఖ్యంగా నైతిక పర్వంలోని సారాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న ‘అల్‌హఖ్‌ తెలుగు పబ్లికేషన్స్‌’ అభిలాషకు కార్యరూపమే మీ ముందున్న ‘ఇస్లాం నైతిక విధానం” (మొదటి భాగం). అల్లాహ్ చిత్తమయితే మరో రెండు భాగాలు కూడా త్వరలోనే వెలువడగలవని ఆశిస్తున్నాము. కారుణ్యప్రభువు ఈ చిరు కృషిని ఆమోదించి, దీనిని మా మన్నింపుకు దోహదపడే సాధనంగా చేయాలని ప్రార్థన. (ఆమీన్‌)

ప్రపంచంలోని మతాలన్నీ మౌలికంగా నైతికతపైనే ఆధారపడి ఉన్నాయనటంలో సందేహం లేదు. నైతికతను రక్షించడానికి వచ్చిన ప్రవక్తలు, సంస్కర్తలందరూ ఇచ్చిన శిక్షణ ఒక్కటే 1) సత్యం పలకటం మంచిది 2) అసత్యం చెప్పటం చెడు 3) న్యాయం వల్ల మేలు కలుగుతుంది 4) అన్యాయం వల్ల కీడు కలుగుతుంది. 5) దాన ధర్మాలు పుణ్యప్రదం 6) దొంగతనం దుర్మార్గం.

మరయితే మతం యొక్క ఇతర విభాగాల మాదిరిగానే ఈ నైతికతకు కూడా పరిపూర్ణత నివ్వడానికి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రభవించారు. ఆయన స్వయంగా ఇలా ప్రబోధించారు :-

“నేను ఉత్తమ నైతికతకు పరిపూర్ణత్వం ప్రసాదించడానికి పంపబడ్డాను.

తాను ప్రవక్తగా ప్రభవించిన రోజు నుంచే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధిని నిర్వర్తించసాగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాలో ఉన్న కాలంలో ఈ నూతన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థితిగతులను దర్యాప్తు చేసే ఉద్దేశ్యంతో హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) తన సోదరుణ్ణి మక్కా నగరానికి పంపారు. ఆ సోదరుడు మక్కా నుండి తన ఊరికి తిరిగి వచ్చాక ఇచ్చిన సాక్ష్యం ఇది:

“ఆయన ప్రజలకు సత్ప్రవర్తన గురించి నొక్కి వక్కాణించడం నేను గమనించాను.”

మక్కాలోని కొంతమంది ముస్లిములు అబిసీనియా దేశానికి వలసపోయినప్పుడు అక్కడి నజాషీ చక్రవర్తి ముస్లిములను తన దర్బారుకు పిలిపించి ఇస్లాం గురించి వాకబు చేశాడు. ఆ సందర్భంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియ సహచరుడైన హజ్రత్ జాఫర్ తయార్ (రదియల్లాహు అన్హు) ఇచ్చిన సమాధానంలోని కొన్ని వాక్యాలు ఇవి:

“ఓ చక్రవర్తీ! మేమొక అజ్ఞాన జాతిగా బ్రతికేవాళ్లం. విగ్రహాలను పూజించేవాళ్ళము. నిషిద్ధ జంతు మాంసాన్ని భక్షించే వాళ్ళము. వ్యభిచారానికి ఒడిగట్టే వాళ్ళము. పొరుగు వారిని వేధిస్తూ ఉండే వాళ్ళము. మాలో ప్రతి ఒక్కరూ సాటి సోదరుణ్ణి వేధిస్తూ ఉండేవాడు. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే వాడు. ఇలాంటి (నికృష్ణ) పరిస్థితుల్లో ఒక వ్యక్తి మా మధ్య జన్మించాడు….. మేము విగ్రహారాధనను మానుకోవాలనీ, సదా సత్యం పలకాలనీ, రక్తపాతాన్ని అరికట్టాలనీ, అనాధల సొమ్మును స్వాహా చేయరాదని, పొరుగు వారిని సుఖంగా ఉండనివ్వాలనీ, సౌశీల్యవంతులైన స్త్రీలకు అపనిందల కళంకం అంటగట్టరాదనీ ఆయన మాకు ఉపదేశించాడు.”

అలాగే రోము చక్రవర్తి దర్బారులో అబూ సుఫ్యాన్ ఇచ్చిన సాక్ష్యం గమనించదగ్గది. చూడబోతే అప్పటికింకా ఆయన ముస్లిం కాలేదు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సంస్కరణా సందేశం గురించి అబూ సుఫ్యాన్ ఎంతో క్లుప్తంగా వ్యక్తపరచిన అభిప్రాయం ఇది:

“ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ఏ కత్వం మరియు దైవారాధన సందేశం ఇవ్వటంతో పాటు సౌశీల్యాన్ని అలవర్చుకోవాలనీ, సత్యం పలకాలనీ, బంధువుల హక్కు నెరవేర్చాలనీ జనులకు శిక్షణనిస్తున్నారు.” (సహీహ్ బుఖారీ)

దివ్యఖుర్ఆన్లో సయితం అల్లాహ్ తన సందేశహరుని ప్రభవనంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని ప్రస్తావిస్తూ ఇలా మెచ్చుకున్నాడు:-

 يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ

“ఈ ప్రవక్త వారికి (ఈ నిరక్షరాస్యులైన జనులకు) ఆయన వాక్యాలను వినిపిస్తాడు. వారి ఆత్మశుద్ధి చేస్తాడు. ఇంకా వారికి గ్రంథ జ్ఞానాన్ని వొసగడంతో పాటు వివేకవంతమైన మాటలను నేర్పుతాడు.” (జుమా 62:2)

పై వచనంలో రెండు అతి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి వాటిలో ఒకటి : శుద్ధి చేయడం లేక సంస్కరించడం. (దీనినే ఖుర్ఆన్ ‘తజ్కియ’ గా పేర్కొన్నది. రెండవది: వివేకము.

1.తజ్కియ : ‘తజ్కియ’ అంటే పరిశుద్ధ పరచడం, వన్నె తేవటం, మలినాన్ని పారద్రోలడం అని అర్థం. అయితే ఖుర్ఆన్ ఈ పదాన్ని – మనిషి లోని మనసును అన్ని రకాల మలినాల నుండి, దుమ్ము ధూళి నుంచి ప్రక్షాళనం చేసి పరిశుభ్రంగా ఉంచే భావంలో ఉపయోగించింది. అంటే మనసనే అద్దానికి పట్టిన తుప్పును దూరం చేసి దాన్ని ఎంతో నిర్మలంగా, స్పష్టంగా ఉంచాలన్నదే దీని ప్రధానోద్దేశ్యం. ఆ మాటే మరో చోట ఇలా అనబడింది;

 وَنَفْسٍ وَمَا سَوَّاهَا فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا وَقَدْ خَابَ مَن دَسَّاهَا

“మానవాత్మసాక్షిగా ! ఆ ఆత్మను సంస్కరించి, ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసిన వాని సాక్షిగా! నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు.” (అష్ షమ్స్ 91 : 7 – 10)

మరోచోట ఇలా అనబడింది:

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ

“నిశ్చయంగా తనను పరిశుద్ధపరచుకున్న వాడు, తన ప్రభువు నామాన్ని స్మరించినవాడు, ఆపైన నమాజు చేసిన వాడు సాఫల్యం పొందాడు.” (అల్ ఆలా 87 : 14,15)

పైన ఉదహరించిన వచనాల ఆధారంగా దివ్యఖుర్ఆన్లో “తజ్కియ” అనే పదం ఏ భావంలో తీసుకోబడినదో స్పష్టంగా అవగతం అవుతోంది. మరి ఈ ‘ఆత్మశుద్ధి’కి ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ప్రాధాన్యం అపారమైనది. అసలు మానవాత్మను మేల్కొల్పడం, దానిని అన్ని రకాల రుగ్మతలనుండి, మలినాల నుండి పరిశుభ్రంగా ఉంచి అతని గుణగణాలు, ఆచరణలు సవ్యంగా సజావుగా ఉండేటట్లు చూడడమే అంతిమ దైవప్రవక్త ప్రభవనం యొక్క అసలు ఉద్దేశ్యం అని కూడా దీని ద్వారా మనకు బోధపడుతుంది.

2. వివేకం: ఇక రెండవ ముఖ్యాంశం వివేకం. ఇది ఖుర్ఆన్లో ‘హిక్మత్’ గా పేర్కొనబడింది. దీని భావం చాలా విస్తృతమైనది. కాని ఇక్కడ నైతికతకు సంబంధించినంతవరకే తీసుకుంటే అల్లాహ్ ఆరాధన, తల్లిదండ్రుల యెడల గౌరవభావం, బంధువుల హక్కు, నిరుపేదలకు సాయం, అనాధల ఆదరణ, వాగ్దాన పాలన, కొలతలు తూనికల్లో సరిగ్గా వ్యవహరించడం, నేలపై నిక్కుతూ నడవకుండా జాగ్రత్తపడటం వంటి ఆదేశాలు ఖుర్ఆన్లో వచ్చినప్పుడు తక్షణమే ఆ తరువాయి వచనంలోనే ఈ విధంగా చెప్పబడింది:

“ఇవి వివేకంతో నిండిఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు వహీ ద్వారా తెలియజేశాడు.” (బనీ ఇస్రాయీల్-39)

అలాగే ‘లుక్మాన్’ సూరాలో- ‘హకీమ్ లుక్మాన్కు చేయబడిన ఉపదేశాన్ని గుర్తుచేస్తున్నప్పుడు.

“మరి మేము లుక్మాన్కు వివేకంతో నిండి ఉన్న విషయాలను బోధించాము.”

అని పరమ ప్రభువు సెలవిచ్చాడు. మరి వివేకంతో నిండి వున్న ఆ విషయాలలో వరుసగా ఏం వచ్చాయో చూడండి:

1. అల్లాహ్ కు భాగస్వామిగా ఎవరినీ నిలబెట్టకు.
2. తల్లిదండ్రుల యెడల దయార్ద్రతతో మెలగు.
3. నమాజును స్థాపించు.
4. మంచి గురించి ప్రజలకు ప్రేరేపించు.
5. చెడుల నుండి ఆపు.
6. కష్టాల్లో ఉన్నప్పుడు సంయమనం పాటించు.
7. వైముఖ్య ధోరణి ప్రదర్శించకు.
8. నేలపై నిక్కుతూ నడవకు.
9. నెమ్మదిగా (మర్యాదపూర్వకంగా) మాట్లాడు.

పై విషయాలన్నీ సహజంగా మంచి విషయాలనీ, మానవ శ్రేయాన్ని ఉద్దేశించినవనీ అన్ని జాతులు, అన్ని మతాలు ఒప్పుకుంటాయి. మరి ఇటువంటి నీతివంతమైన విషయాలను ఖుర్ఆన్ “హిక్మత్” – వివేకవంతమైన విషయాలుగా ప్రకటించింది.

పై వివరాల ద్వారా తెలిసేదేమిటంటే ఇస్లాంలో ఆరాధనలకు, ఇతర అల్లాహ్ ఆదేశాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో నైతికతకు కూడా దాదాపు అంతటి ప్రాముఖ్యం ఉంది. దివ్యఖుర్ఆన్లోని హజ్ సూరాలో చూడండి:

“ఓ విశ్వాసులారా! రుకూ చేయండి. సజా చేయండి. మీ ప్రభువుకు దాస్యం చేయండి. మంచి పనులు చెయ్యండి. తద్వారా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (అల్ హజ్ : 77)

మనిషి అల్లాహ్ ను విశ్వసించిన మీదట అతను చేయవలసిన రెండు అతిముఖ్యమైన పనులున్నాయి. వాటిల్లో ఒకటి దైవారాధన. రెండవది : సత్ప్రవర్తన. ఇవి రెండూ ‘విశ్వాసి’ యొక్క రెండు భుజాల వంటివి. మొదటిది సృష్టికర్త హక్కు (ఆరాధన) అయితే రెండవది సృష్టితాల హక్కు (సత్ప్రవర్తన). ఈ రెండింటి సముదాయమే ఇస్లాం.

మరో రకంగా చూస్తే ఇస్లాంలో ‘అఖ్ లాఖ్’ (సత్ప్రవర్తన)కు ఆరాధనలకన్నా అధికంగా ప్రాధాన్యత ఉందేమోననిపిస్తుంది. సాటి మానవులతో వ్యవహారానికి, సంబంధాలకు గల మరో పేరే నైతికత లేక మంచి నడవడిక కదా! కాగా; ఆరాధన అల్లాహ్ హక్కు మరి అల్లాహ్ అపార కరుణామయుడు. పరమ కృపాశీలుడు. ఆయన దయాదాక్షిణ్యాల ద్వారాలు కేవలం మంచి వారికే పరిమితం కావు. షిర్క్ మరియు కుఫ్ర్ మినహా మరే ఇతర అపరాధాన్నయినా ఆయన తలచుకుంటే తన ప్రణాళికానుసారం క్షమించగలడు. కాని సాటి మానవుల హక్కును నెరవేర్చటంలో లోటు కనబరిస్తే, లేదా సాటి మానవుల హక్కును కాజేస్తే మటుకు క్షమాభిక్ష పెట్టే అధికారం అల్లాహ్ తన చేతుల్లో పెట్టుకోలేదు. ఈ అధికారాన్ని అల్లాహ్ అన్యాయానికి, వేధింపుకు గురైన బాధిత దాసులకే వదిలేశాడు. మరి అపార కరుణామయుడైన అల్లాహ్ క్షమాభిక్ష పెట్టినట్లుగా బాధిత మానవులు తమను బాధించిన వారిని క్షమిస్తారని ఎవరూ ఆశ పెట్టుకోలేరు. అందుకే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారేమని ప్రబోధించారంటే:

“ఎవరయినా ఒక సోదరుడు మరో సోదరుణ్ణి వేధించి ఉంటే అతను ఈ లోకంలోనే ఆ బాధిత సోదరుడి నుంచి క్షమాభిక్ష పొందాలి. లేకుంటే అక్కడ (పరలోకంలో) మూల్యం చెల్లించడానికి ఎవరి దగ్గరా దిర్హమ్లుగానీ, దీనార్లు గానీ ఉండవు. అక్కడ ఉండేవల్లా కర్మలు మాత్రమే. బాధ పెట్టిన వాని సత్కర్మలు బాధితుని ఖాతాలో వేయబడతాయి. ఒకవేళ బాధించిన వ్యక్తి వద్ద సత్కర్మలు లేకుంటే బాధితుని ఖాతాలోని దుష్కర్మలు అతనికి వడ్డించబడతాయి.” (సహీహ్ బుఖారీ)

హదీసుల ప్రకారం – ఈమాన్ (విశ్వాసం) తరువాత పేర్కొన దగ్గ ఇస్లాం నాలుగు ప్రధాన స్తంభాలు 1) నమాజ్, 2) రోజా, 3) జకాత్ మరియు 4) హజ్. ఈ నాలుగు స్తంభాలపైనే ‘ఇస్లాం’ అనే కట్టడం నిలబడి ఉంది. మరి ఇస్లాం యొక్క ఈ కట్టడంలో ‘ఉత్తమ నైతికత’కు స్థానం ఇవ్వబడలేదా? అన్న సందేహం ఈ సందర్భంగా కొందరిలో కలగవచ్చు. సదవగాహన లేని ప్రసంగాల వల్లనూ, మిడిమిడి జ్ఞానంతో కూడిన రచనల వల్లనూ ఇలాంటి సందేహాలకు మరింత బలం చేకూరే ప్రమాదం కూడా ఉంది. కాని వాస్తవానికి మనిషిలోని నీతి బాహ్యతను దూరం చేసి అతనిలో సత్ప్రవర్తనని పెంపొందించటం కూడా ఆరాధనల ప్రధాన ఉద్దేశ్యాలలో ఒక ఉద్దేశమన్న సంగతిని ఇక్కడ మరువరాదు. దివ్యఖుర్ఆన్ అనేక చోట్ల ఈ దృక్పథం స్పష్టంగా చాటబడింది. ఉదాహరణకు నమాజ్ మనిషిని సిగ్గుమాలిన విషయాల నుండి దూరంగా ఉంచుతుందనే వచనం ఉండనే ఉంది. కాగా; ఉపవాసం (రోజా) మనిషిలో దైవభీతి (తఖ్వా)ని సృజిస్తుందని ఉపదేశించబడింది. ఇక జకాత్ వ్యవస్థనే తీసుకోండి – అది మనిషిలో నిరుపేదల పట్ల సానుభూతిని, అగత్యపరుల యెడల సహకార భావాన్ని పెంపొందిస్తుంది. హజ్ కూడా అనేక విధాలుగా మనలో ఉత్తమ నైతికపు భావాలను పెంపొందించి సంస్కరణా సరణికి బాట వేస్తుంది. సంఘీభావాన్ని పెంపొందిస్తుంది.

పై వివరాల వల్ల తేటతెల్లమయ్యేదేమంటే ఇస్లాం యొక్క ఈ నాలుగు ప్రధాన స్థంభాల పేర్లు వేర్వేరు అయినప్పటికీ వాటి మౌలిక ఉద్దేశ్యాలలో నైతిక శిక్షణా రహస్యం కూడా ఇమిడి ఉంది. ఒకవేళ ఈ ఆరాధనల (నమాజ్, రోజా, జకాత్, హజ్) ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక, నైతిక విలువలు తొణకిసలాడకపోతే అతను ఈ అల్లాహ్ ఆదేశాలను మనస్ఫూర్తిగా పాటించలేదన్న మాట! అతను కేవలం వాటిని నోటితో ఉచ్చరించి చేతులు దులుపుకున్నాడన్న మాట!! అంటే ఈ ఆరాధనల సారాన్ని అతను ఏ మాత్రం గ్రహంచలేదు. అతని ఉపమానం కాయలు కాయని వృక్షం వంటిది. అతని ఉదాహరణ సువాసన లేని పుష్పం వంటిది; ఆత్మలేని హృదయం వంటిది.

ప్రముఖ ఇస్లామీయ తత్వవేత్త ఇమామ్ గజాలీ (రహిమహుల్లాహ్) “ఇహ్యాయె ఉలూమ్”లో ఇలా వ్రాశారు:

“తన స్మరణ కొరకు నమాజ్న నెలకొల్పమని అల్లాహ్ సెలవిచ్చాడు. ఇంకా, ‘మరుపుకు గురయ్యేవారు కాకండి’ అని కూడా సెలవిచ్చాడు. నిషా స్థితిలో ఉన్నప్పుడు – మీరు ఏం పలుకుతున్నారో మీకు సయితం అర్థం కాని స్థితిలో-నమాజ్ చేయకండి అని సెలవీయబడింది. అనేక మంది నమాజీలు, తాము మద్యం సేవించకపోయినప్పటికీ – వారు నమాజ్ చేస్తున్నప్పుడు వారేం పలుకుతారో వారికే అర్థంకాదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఏమని ఉపదేశించారంటే; ‘ఏ వ్యక్తయినా ప్రాపంచిక విషయాల వైపుకు ధ్యానం మళ్ళించకుండా కేవలం రెండు రకతుల నమాజు చేసినా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు’. ఇంకా ఆయన ఇలా ఉపదేశించారు- ‘దీనావస్థతకు, అశక్తతకు, బాధాతప్త మనసుకు, తహతహకు మరో పేరే నమాజ్! చేతులు కట్టుకున్న మీదట ‘ఓ నా దేవా!!’ అన్న భయభక్తుల భావం తొణకిసలాడేలా చేయండి. ఎవరయితే ఈ దైన్య స్థితిని సృజించలేడో అతని నమాజ్ లోపభూయిష్ట మైనదవుతుంది. పూర్వపు గ్రంథాలలో ఉంది అల్లాహ్ ఏమని అంటున్నాడంటే, “నేను ప్రతి ఒక్కరి నమాజును స్వీకరించను. నా గొప్పదనం ముందు లొంగిపోయి, నా దాసుల ముందు బడాయి చాటకుండా ఉండేవారి మరియు నా ప్రసన్నత కొరకు ఆకలిగొన్న నిరాధారజీవులకు అన్నం పెట్టే వారి నమాజును మాత్రమే నేను స్వీకరిస్తాను.” (ఈ నేపథ్యంలో) మహాప్రవక్త ఇలా ప్రబోధించారు: “నమాజ్ విధిగా చేయబడింది ఇందుకోసమే. దీని కొరకే హజ్ క్రియలు కూడా రూపొందించ బడ్డాయి. అల్లాహ్ నామస్మరణ చేయాలన్నదే వీటి ఉద్దేశ్యం.” మరలాంటప్పుడు ఈ ప్రధాన ఉద్దేశమే మనసులో జనించకపోతే అల్లాహ్ ధ్యానానికి విలువేముంటుంది? హదీసులో ఉంది – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా ప్రబోధించారు: “ఎవరి నమాజు అయితే అతన్ని చెడుగు నుండి, నీతి మాలిన తనం నుండి ఆపలేదో అలాంటి నమాజ్ అతన్ని అల్లాహ్ నుండి మరింత దూరం చేసివేస్తుంది.”

ఇలాంటి హెచ్చరికతో కూడిన ఆదేశాలే ఉపవాసం (రోజా) విషయంలో కూడా వచ్చాయి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “ఏ వ్యక్తయితే ఉపవాస ముండి కూడా అబద్దం చెప్పడాన్ని, మోసం చేయడాన్ని మానుకోడో అలాంటి ఆకలి దప్పులతో బాధపడే మనిషి అల్లాహ్ కు అక్కరలేదు.” (సహీహ్ బుఖారీ)

ఆరాధనల యొక్క ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి మనిషిలో ఉత్తమ నైతికతను సృజించటం అని ఈ ప్రబోధనల వల్ల అవగతమవుతోంది.

ఈమాన్ (విశ్వాసం) మనిషి అంతరంగంతో ముడిపడి ఉన్న విషయం. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నోటితో ఖరారు చేస్తాడు. కాని అతని మనోగతం గురించి ఎవరికి తెలుసు? అయితే అతని ‘విశ్వాసం’ అతనిలో సృజించే మంచి గుణానికి ఆనవాలు వంటిదని అంటారు. అందుకే దివ్యఖుర్ఆన్లోని మోమినూన్ సూరాలో విశ్వాసుల గుణగణాలను గురించి చెబుతున్నప్పుడు ఆరాధనలతోపాటు వారి సత్ప్రవర్తనను కూడా ప్రస్తావించటం జరిగింది.

“తమ నమాజులో వినమ్రతను పాటించే, అపసవ్యమైన విషయాల పట్ల విముఖత చూపే, జకాతు ఇస్తూ ఉండే, తమ మర్మాంగాలను పరిరక్షించుకునే…… తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే, తమ నమాజులను పరిరక్షించుకునే విశ్వాసులు (మోమిన్లు) నిశ్చయంగా సాఫల్యం పొందారు.” (మోమినూన్ : 1 – 9)

పై వచనాలలో విశ్వసించిన వారి సాఫల్యానికి నమాజుతోపాటు దోహదకారి కాగల గుణాలలో ప్రముఖమైనవి ఏవో చూడండి:

1) సంస్కారవంతమైన జీవితం గడపటం (అంటే, అపసవ్యమైన విషయాలకు దూరంగా మసలుకోవటం)
2) దాతృత్వ స్వభావాన్ని వంటబట్టించుకోవటం (జకాత్ను ఇస్తూ ఉండటం)
3) సౌశీల్యాన్ని, పారిశుద్ధ్యాన్ని అలవరచుకోవటం.
4) వాగ్దానానికి కట్టుబడి ఉండటం.

ఇస్లాం పరిభాషలో మనిషి మనోమయ భావానికి నామాంతరమే ‘తఖ్వా’- మస్త సత్కార్యాలకు ప్రేరక శక్తిగా పనిచేసేదే ‘తఖ్వా’. ‘తఖ్వా’ గల ప్రజలలో ఉండే లక్షణాలు క్రింది విధంగా ఉంటాయని ఇస్లాం విపులీకరించింది: –


لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.(అల్ బఖర 2:177)

పై ఆయతు ద్వారా తేటతెల్లమయ్యిందేమిటంటే మనిషి తనలోని భయభక్తుల మూలంగా ఏ విధంగానయితే విశ్వాసంపైన, సన్మార్గంపైన నిలకడ కలిగి ఉంటాడో అదే విధంగా అతడు దాతృగుణం కలవాడుగా రాణిస్తాడు, ఇచ్చిన మాటను నిలుపుకుంటాడు. కష్టకాలంలో ఓరిమిని, నిగ్రహాన్ని కనబరుస్తాడు. ఇది ‘తఖ్వా’ (భయభక్తుల) యొక్క అనివార్య పరిణామం అన్నమాట!

ఇస్లాంలో మంచి గుణం కలవారే అల్లాహ్ సన్నిధిలో ఇష్టకరమైన, ఆదరణీయులైన దాసులుగా పరిగణించబడ్డారు. అటువంటి సద్గుణ సంపన్నుల లక్షణాలు కొన్ని ఫుర్కాన్ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తుతించబడ్డాయి.

“దయామయుడైన అల్లాహ్ (సిసలైన) దాసులు ఎవరంటే, వారు భూమిపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో వాదనకు దిగినపుడు ‘మీకో సలాం’ అని అంటారు. ఇంకా, తమ ప్రభువు సన్నిధిలో (ప్రార్థనలో) సాష్టాంగపడి మరియు నిలబడి రాత్రులు గడుపుతారు. ఇంకా వారిలా వేడుకుంటూ ఉంటారు – ‘ఓ మా ప్రభూ! నరకయాతన నుండి మమ్ముల్ని కాపాడు. దాని శిక్ష భరించశక్యం కానిది. ఇంకా అది ఎంతో దుర్భరమైన నివాసం, అతి చెడ్డ ప్రదేశం! ఖర్చుపెట్టవలసి వచ్చినప్పుడు అటు దుబారా గానూ ఖర్చుపెట్టక, ఇటు మరీ లోభత్వాన్నీ ప్రదర్శించక రెండు అతి వాదాలకు నడుమ మధ్యే మార్గాన్ని అవలంబిస్తారు. వారు అల్లాహ్ తో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఒడిగట్టారు. ఇలాంటి పనులకు పాల్పడిన వాడు పాపఫలం పొంది తీర్తాడు…. ఇంకా (దయామయుడైన అల్లాహ్ నిజమైన దాసులెవరంటే వారు అబద్దానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా అపసవ్యమైన వాటి మీదుగా పోవటం జరిగితే ఎంతో హుందాగా – ఉదాత్తుల మాదిరిగా – నిష్క్రమిస్తారు. ఇంకా తమ ప్రభువు సూచనలను గురించి వారికి వినిపించినపుడు వారు అంధులుగా, బధిరులుగా ఉండిపోరు వారిలా ప్రార్ధిస్తూ ఉంటారు -‘ఓ ప్రభూ! మా ఆలుబిడ్డల ద్వారా కంటి చలువను ప్రసాదించు. ఇంకా మమ్ముల్ని సద్వర్తనుల సారధిగా చేయి”. (అల్ ఫుర్కాన్ 25: 63 – 74).

చూశారా!

ఒక్క ఈమాన్’లో ఎన్ని సుగుణాలు అంతర్లీనమై ఉన్నాయో!!

మన్నింపుల వైఖరిని అవలంబించటం, సమతూకం పాటించటం, రక్త పాతాన్ని సృష్టించకుండా జాగ్రత్తపడటం, అక్రమ సంబంధాలకు ఆమడదూరాన ఉండటం, మోసపూరిత వ్యవహారాలలో భాగస్వాములు కాకుండా జాగ్రత్త వహించటం వంటి ఉత్తమ నైతికపు విలువలు ఇందులో అంతర్లీనమై ఉన్నాయి మరి!

అల్లాహ్ దృష్టిలో ప్రియతములు, ప్రసన్నులు అయిన దాసులు సుగుణాలు ఇలా ఉంటాయి:-

فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ وَالَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ وَالَّذِينَ إِذَا أَصَابَهُمُ الْبَغْيُ هُمْ يَنتَصِرُونَ وَجَزَاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَٰئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ

1.”మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు (తాత్కాలిక) సంపద మాత్రమే. అల్లాహ్‌ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వితమైనది. విశ్వసించి, కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది. (మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు.ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు.తమపై దౌర్జన్యం జరిగినప్పుడు, ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు.అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా (సరిసమానంగా) ప్రతీకారం తీర్చుకుంటే, అలాంటి వారిపై (నిందలు మోపే) మార్గమేదీ లేదు.ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించబడుతుంది”. (షూరా 42 : 36 – 43)

2. “మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.వారు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”.(ఆలి ఇమ్రాన్ 3: 133, 134)

3. “అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు..” (దహర్ 76: 8)

పై ఆయతుల, ఇలాంటివే మరికొన్ని ఖుర్ఆన్ వాక్యాల తాత్పర్యాన్ని కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు స్వయంగా విడమరచి చెప్పారు. ఈ తాత్పర్యమంతా హదీసు రూపంలో సురక్షితంగా ఉంది. ఆ హదీసులనే గనక ఓసారి నెమరు వేసుకుంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉపదేశాలలో నైతిక శిక్షణకు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం అవుతుంది.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తరచూ నమాజ్ సందర్భంగా చేసే దుఆ (వేడుకోలు)లో ఈ వాక్యం ముఖ్యమైనది:

“ఓ అల్లాహ్! నీవు నన్ను అత్యుత్తమ నడవడి వైపుకు దర్శకత్వం వహించు. నీవు తప్ప మరొకరెవరూ ఉత్తమ నడవడి వైపుకు మార్గం చూపలేరు. దుర్గుణాలను నా నుండి మళ్ళించు. నీవు తప్ప వేరొకరెవరూ వీటిని (ఈ దుర్గణాలను) నా వైపు నుంచి మళ్ళించలేరు.” (ముస్లిం : నమాజ్లో ‘దుఆ’ల అధ్యాయం)

ఒక దైవప్రవక్త, తాను అల్లాహ్ ప్రార్థనలో నిమగ్నుడై ఉండి – అల్లాహ్ కు అత్యంత సామీప్యంలో ఉన్న తరుణంలో – దీనంగా కోరుకుంటున్న కోర్కెల్లో ఒక కోరిక “మంచి నడవడిక”. ఈ ఒక్క మాట చాలు ఇస్లాంలో మంచి నడవడికకు గల ప్రాముఖ్యాన్ని అంచనా వేయడానికి.

వాస్తవానికి ఇస్లాంలో ఈమాన్ (విశ్వాసము)ను మించిన వస్తువేదీ లేదు. కాని ఆ విశ్వాసానికి కూడా సంపూర్ణత చేకూరేది మంచి నడవడిక (హుస్నే అఖ్ లాఖ్) ద్వారానే.

“ముస్లిములలో ఎవరి నడవడిక అందరికన్నా ఉత్తమంగా ఉందో అతని విశ్వాసమే పరిపూర్ణమైనది.”

పై హదీసు తిర్మిజీ ఇబ్నె హంబల్, అబూదావూద్ లలో ఉంది. దీన్నిబట్టి అవగతమయ్యిందేమిటంటే, ఇస్లాంలో విశ్వాస పరిపూర్ణతకు ప్రమాణం ఏదైనా ఉందంటే అది మంచి నడవడిక మాత్రమే. ‘మంచి నడవడిక’ అనే ఈ పండు ద్వారానే ‘విశ్వాసమనే’ మహా వృక్షం గుర్తించబడుతుంది,

ఇస్లాంలో నమాజ్ మరియు ఉపవాసం వంటి ఆరాధనలకు గల ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కోసారి మంచి నడవడిక సయితం వాటి సరసన నిలబడగలుగుతుంది. ఉదాహరణకు ఒక హదీసులో ఇలా ఉంది :

“మానవుడు పగలంతా ఉపవాసం పాటించడం వల్ల, రాత్రంతా ప్రార్ధనలో నిమగ్నుడై ఉండటం వల్ల పొందగలిగే ఉన్నతిని మంచి నడవడిక ద్వారా పొందగలుగుతాడు.”

పై హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే రాత్రంతా నఫిల్ ఆరాధనల ద్వారా, పగలంతా నఫిల్ ఉపవాసాల ద్వారా మనిషికి ప్రాప్తమయ్యే ధర్మనిష్ఠ సత్ప్రవర్తన మూలంగానూ సిద్ధిస్తుంది. పైగా ‘మంచి నడవడి’ అనే ఈ ప్రమాణ నికషం (గీటురాయి) ద్వారా ప్రజల్లో ఉత్తములెవరో – అధములెవరో నిర్ధారించడానికి వీలవుతుంది. క్రింది హదీసులో ఏమనబడిందో చూడండి.

“మీలో ఎవరి నడవడిక మంచిదో అతడే మీలో అందరికన్నా ఉత్తముడు”.

మరొక హదీసులో ఇలా ఉంది –

“(ప్రళయ దినపు) త్రాసులో మంచి నడవడిక కన్నా బరువైన వస్తువేదీ ఉండదు. మంచి నడవడిక గల వాడు తన మంచి నడపడి మూలంగా నిరంతరం నమాజ్ రోజాలు పాటించే వ్యక్తి స్థాయికి చేరుకుంటాడు.” (తిర్మిజీ)

సద్గుణ సంపన్నులైన వ్యక్తులు అల్లాహ్ కే కాదు, దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కు కూడా ప్రియతములవుతారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఈ విషయాన్ని తెలియ జేశారు:

“మీలోని మృదు స్వభావి నాకు అందరికన్నా ప్రియతముడు, స్థాయిరీత్యా అందరికన్నా సన్నిహితుడు అవుతాడు. మీలో దుష్ప్రవర్తన గలవారు నా దృష్టిలో అయిష్టకరమైన వారు. ప్రళయదినాన ఇలాంటి వారు వాకు చాలా దూరమైపోతారు.”

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కాలంలో పరస్పర విరుద్ధ వైఖరి గల ఇద్దరు మహిళలుండేవారు. వారిలో ఒకామె రాత్రంతా నమాజులో లీనమై ఉండేది. పగటిపూట ఉపవాస వ్రతాలు పాటించేది. విస్తృతంగా దాన ధర్మాలు చేసేది. కాని ఆమె తన నోటి దురుసుతనం వల్ల ఇరుగు పొరుగు వారిని ప్రశాంతంగా బ్రతకనిచ్చేది కాదు. రెండవ మహిళ కేవలం ఫర్జ్ నమాజులు చేసేది. పేదవారికి కొన్ని బట్టలు మాత్రం పంచేది. అంతే. కాని ఎవరి మనసునూ నొప్పించేది కాదు.

ఈ ఇరువురు మహిళల గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించగా మొదటి మహిళ గురించి ప్రవక్త వారు వ్యాఖ్యానిస్తూ, “ఆమెలో ఎలాంటి మంచీ లేదు. పైగా ఆమె తన దుష్ప్రవర్తనకు గాను (శిక్షను) అనుభవిస్తుంది” అని పలికారు. రెండవ మహిళ గురించి అభిప్రాయపడుతూ, “ఆమె స్వర్గంలో స్థానం సంపాదిస్తుంది” అని అన్నారు. ఇద్దరు మహిళల ప్రవర్తన గురించి ఇస్లాం ప్రవక్త వెల్లడించిన రెండు విభిన్న పరిణామాలే ఇస్లాంలో నైతికత లేక నడవడికకు గల విశేష ప్రాముఖ్యాన్ని చాటి చెబుతున్నాయి.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ప్రకారం – ఒకసారి ఒక పల్లెటూరి వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, తనను, స్వర్గానికి గొనిపోయే పనుల గురించి ఉపదేశించమని ప్రాధేయపడగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ఉపదేశించారు:

“మనిషిని బానిసత్వం నుండి స్వేచ్ఛ నొసగు. మనిషి మెడను రుణ భారం నుండి విడిపించు. దుర్మార్గుడైన బంధువును చేయిపట్టుకుని నిలువరించు. ఒకవేళ నీవు ఇది చేయలేని పక్షంలో ఆకలిగొన్న వానికి అన్నం పెట్టు. దప్పికతో బాధపడే వాని దాహం తీర్చు. మంచి గురించి (ఇతరులకు) ప్రబోధించు. చెడు నుండి ఆపు. ఒకవేళ ఈ పని కూడా చేయలేకుంటే (కనీసం) మంచి మాట తప్ప మరోదాన్ని నీ నోట రానివ్వకు.”

పై హదీసు నైతికౌన్నత్యాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఆలోచించండి!

ఇంత వరకూ ఉదహరించిన హదీసులే గాక మరి కొన్ని హదీసులు ఉన్నాయి. అవి ఈమాన్ (విశ్వాసం) వాంఛించే అనివార్యమైన ప్రత్యేకతలు అని అనబడతాయి. వాటి హెచ్చుతగ్గులను బట్టి మనిషిలోని విశ్వాసం యొక్క హెచ్చు తగ్గులను బేరీజు వేసుకోవచ్చు. మన మనసులో ఉన్న ‘విశ్వాసం’ మన ఇంటి లోని దీపం వంటిది. మరి ఆ దీపం విరజిమ్మే వెలుగును బట్టే దాని నాణ్యత ఎటు వంటిదో తెలుస్తుంది కదా! ఈ నేపథ్యంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు :

1. ఈమాన్ (విశ్వాసం) శాఖలు డెబ్బయికి మించి ఉన్నాయి. వాటిలో వ్రీడ (లజ్జ – బిడియం) ఒకటి.

2. ఈమాన్ కు ఎన్నో శాఖలున్నాయి. వాటిలో ‘అల్లాహ్ ఏకత్వం’ (తౌహీద్) గురించి చేసే ప్రకటన అన్నిటికీ మించినది. కాగా; దారిలో పడివున్న ఏదైనా బాధాకరమైన వస్తువును మీరు తొలగిస్తే అది ఈమాన్ యొక్క అన్నిటికన్నా తక్కువ స్థాయి సదాచరణ అనిపించుకుంటుంది.

3. ఎవరిలోనయితే మూడు విషయాలున్నాయో అతడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు. మొదటిది: అతనికి అల్లాహ్ మరియు దైవ ప్రవక్త అందరికన్నా ప్రియతములై ఉండాలి. రెండవది: అతడు కేవలం అల్లాహ్ మెప్పుకై ఇతరులను ప్రేమించే వాడై ఉండాలి. మూడవది: విశ్వసించిన మీదట తిరిగి తిరస్కార వైఖరికి ఒడిగట్టడం పట్ల అతనికి కలిగే బాధ అగ్నికి ఆహుతి అవటం వల్ల కలిగే బాధలాంటిదై ఉండాలి.

4. ఎవరిలోనయితే ఈ క్రింది మూడు విషయాలున్నాయో అతడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు.(1) సత్యం ముందు వాదులాటకు దిగకుండా జాగ్రత్త పడాలి. (2) కష్టాలు వచ్చిపడినా అబద్దం చెప్పకుండా ఉండాలి. (3) (దైవికంగా) ఎదురైనదేదీ తొలగిపోదని దృఢంగా విశ్వసించాలి.

5. మూడు అంశాలు ఈమాన్ లో అంతర్భాగాలు : ఒకటి: లేమిలో సయితం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం.రెండు : లోకంలో శాంతినీ, సౌమరస్యాన్ని వ్యాపింపజేయటం.మూడు: వ్యవహారం తన కాడికి వచ్చినప్పుడు సయితం న్యాయ సమ్మతంగా మసలడం.

6. మీలో ఎవరయినా సరే తన స్వయం కొరకు ఇష్టపడేదే తన సాటి సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకూ సంపూర్ణ విశ్వాసి కాలేడు.

7. ఎవరి నోటి ద్వారా, చేయి ద్వారా సాటి ముస్లిం సురక్షితంగా ఉండగలడో అతడే (సిసలయిన) ముస్లిం. మరే వ్యక్తి ప్రవర్తన అయితే జనులు తనను అమితంగా నమ్మి ఆఖరికి తమ ధన ప్రాణాలను సయితం తన చెప్పుచేతుల్లో అప్పగించడానికి సంసిద్ధమయ్యే స్థితికి చేరుస్తుందో అతడే (సిసలయిన) విశ్వాసి.

8. ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ దైవ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఏ ఇస్లాం అన్నిటికన్నా శ్రేష్టమైనది?’ అని ప్రశ్నించగా,“(ఆకలిగొన్నవారికి) అన్నం పెట్టడం, తెలిసిన వారికీ, తెలియని వారికీ – ప్రతి ఒక్కరికీ – శాంతి నొసగే ప్రార్ధన చేయటం (సలాం చేయటం).

9. ఒక వ్యక్తి వచ్చి, “ ఓ దైవప్రవక్తా! ఇస్లాం అంటే అసలేమిటి?” అని ప్రశ్నిస్తాడు. “మంచి మాట పలకటం. (ఆకలిగొన్న వారికి) అన్నం పెట్టడం” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిచ్చారు. “మరి ఈమాన్ అంటే ఏమిటీ?” అని అడగ్గా, “సంయమనం పాటించడం, నైతిక శౌర్యాన్ని చూపడం” అని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు.

10. మోమిన్ (విశ్వాసి) అయినవాడు ఎవరినీ ఎగతాళి చేయడం గానీ, ధూత్కరించడం గానీ, దూషించడం గానీ, చెడు అనడం గానీ చేయడు.

11. ప్రతి ముస్లిం సాటి ముస్లింకు సోదరుడవుతాడు. కనుక అతనికి అన్యాయం చేయడం గానీ, అతన్ని తిట్టడం గానీ చేయకూడదు. ఎవరైతే తన సోదరుని సహాయమై నిమగ్నుడవుతాడో అతని సహాయంలో అల్లాహ్ నిమగ్నుడవుతాడు. మరెవరయితే తోటి ముస్లింకు ఎదురైన ఆపదను తొలగిస్తాడో అతనిపై వచ్చి పడిన ఆపదను అల్లాహ్ తొలగిస్తాడు.

12. ‘ప్రజల చేత నిజాయితీ పరుడని భావించబడిన వాడే మోమిన్. తన నోటి ద్వారా, చేతి ద్వారా జనులకు రక్షణ నివ్వగలిగిన వాడే ముస్లిం. చెడును విడిచి పెట్టినవాడే సిసలయిన ముహాజిర్. ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను- ఎవరయినా తన కోపతాపాల బారి నుండి పొరుగువారికి రక్షణ నివ్వనంతవరకూ స్వర్గానికి పోలేడు.’

13. విశ్వాసి అయినవాడు తన అతిథికి మర్యాద చేయాలి.

14. అవిశ్వాసి (కపటి, మునాఫిక్) అయినవాడి ఆనవాళ్ళు మూడు. (1) వాడు పలికితే అసత్యమే పలుకుతాడు. (2) వాగ్దానానికి విరుద్ధంగా చేస్తాడు. (3) తన దగ్గర భద్రపరచబడిన (అప్పగింత) సొమ్మును తన స్వయం కోసం వాడుకుంటాడు.

పై హదీసుల్లోని ఒక్కొక్క హదీసును శ్రద్ధగా గమనిస్తే ఇస్లాం మరియు ఈమాన్ యొక్క నైతిక భావన ఎంత ఉన్నతమైనదో బోధపడుతుంది.

నైతిక విషయాలకు సంబంధించి ఇస్లాం ఖరారు చేసిన మరో విశేషమేమిటంటే, మనిషి వాటిని నెరవేర్చేటప్పుడు అవి అల్లాహ్ ఆదేశాలని భావించి మరీ నెరవేర్చాలి.

ఒక బాటసారిని ఆదుకోవడాన్ని గానీ, ఒక రోగగ్రస్తుని సేవ చేయడాన్ని గానీ – అది అల్లాహ్ ఆజ్ఞగా తలపోసి మరీ చేయాలి. మరి ఆ సేవలో నిమగ్నుడైన వాని అంతరాత్మ సయితం ఆ మేరకు ప్రబోధించాలి. నఖశిఖ పర్యంతం అతడు ఆ పని కొరకు చిత్తశుద్ధితో సమాయత్తం కావాలి. ఆ పని చేస్తున్నందుకు అతని మనసు సంతోషంతో పులకించాలి. ఇలాంటి సత్కార్యాలకుగాను తాను కేటాయిస్తున్న సమయంలో ఒక పెద్ద మానవ సమూహానికి మేలు కలుగుతుందన్న అనుభూతికి అతను లోనుకావాలి. చెప్పవచ్చిందేమిటంటే, మంచి విషయంలో అతని మనోవాక్కాయ కర్మలు ఎంత ఎక్కువగా సామరస్యం చెందుతాయో అంతే ఎక్కువగా అతని ఆధ్యాత్మికత పరిణతి చెందుతుంది. ఒకవేళ ఆ సామరస్యం గనక వాటి మధ్య సన్నగిల్లినట్లయితే అతని ఆధ్యాత్మికతలో, విశ్వాస స్థితిలో ఎక్కడో ఏదో వెలితి ఉందన్న మాట!

ఒక సత్కార్యాన్ని మనం అల్లాహ్ ఆజ్ఞ అని తలపోసి చేయడానికైతే చేస్తున్నాము. కాని మన మనస్సాక్షి దాన్ని సత్కార్యంగా తలపోయటం లేదు, పైగా మన బుద్ధి దానికి విరుద్ధంగా మనకు మార్గం చూపుతోందనుకోండి- దాని అర్థం ఏమిటీ ? అంటే- అది నిజంగా అల్లాహ్ ఆదేశం అయి ఉంటుందనే విషయంలో మనకింకా నమ్మకం కుదరలేదన్న మాట!

ఇస్లాంలో సత్ప్రవర్తన కూడా ఇతర ధార్మిక విధుల మాదిరిగా ఇబాదత్ (ఆరాధన) క్రిందికే వస్తుంది గనక దీని ఉద్దేశ్యం కూడా అన్ని రకాల ప్రాపంచిక, మానసిక, స్వార్థప్రయోజనాలకు అతీతంగా – స్వచ్ఛంగా – ఉండాలి. ఒకవేళ పరిస్థితి తద్భిన్నంగా ఉంటే ఈ పనులలో ఎలాంటి పుణ్యం లేనట్లే లెక్క. పైగా స్వార్థబుద్ధితో కూడిన మంచి పనులు ఆరాధన కోవలోకి రానేరావు. ధార్మిక వ్యవహారాల సంగతి అటుంచండి, ఆఖరికి ప్రాపంచిక వ్యవహారాలు కూడా అంతే. ప్రాపంచిక విషయాలయినా సరే వాటిలో చిత్తశుద్ధి ఎంత అధికంగా ఉంటే వాటి విలువ అంతే అధికమవుతుంది. ఉదాహరణకు ఒక అతిథిని తీసుకోండి. మనం అతన్ని అతిగా మర్యాద చేస్తాం. అతనికి లెక్కలేనన్ని వంటకాలు వడ్డిస్తాం. కాని ఆ ఆతిథ్యంలో నిష్కల్మషమైన ప్రేమ లేదు. పైగా అతన్నుండి ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నామనో, లేక మన బడాయిని చాటుకోవడానికి అలా చేస్తున్నామనో ఆ అతిథికి అర్థమైపోయిందనుకోండి- అటువంటి అతిథి మర్యాదకు ఆ వ్యక్తి దృష్టిలో ఎలాంటి విలువా ఉండదు. కాని దానికి బదులు అతిథికి ప్రేమతో, నిస్వార్థ మనసుతో సాదాసీదా భోజనం వడ్డించినా చాలు. అది అతని దృష్టిలో ఎంతో విలువను సంతరించుకుంటుంది. ప్రాపంచిక విషయాలలోనే చిత్తశుద్ధి ఇంత ఎక్కువ ప్రభావం చూపుతున్నప్పుడు ధార్మిక విషయాలలో అది ఇంకెంత ప్రభావం చూపగలదో ఆలోచించండి!?

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తన ఉపదేశాలలో సంకల్పాన్ని- అంటే మనిషి అంతరంగాన్ని ప్రతి మంచి పనికీ, చెడు పనికీ మూలాధారంగా ఖరారు చేశారు. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మరింత విపులంగా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎవరినో రేజీకటిలో తన ఇంటికి రమ్మని మరీ మరీ కోరాడు. అలా ఆహ్వానించడంలో అతని అంతరార్థం వేరుగా ఉంది. దారిలో బందిపోట్లు అతన్ని చంపేస్తారులే లేక అతన్ని చితక తంతారులే అన్న ఉద్దేశ్యంతో పిలిచాడతను. కాని కాకతాళీయంగా ఆహ్వానితుడు చీకటిలో దారి తప్పి మరో దారిన నడవసాగాడు. ఆ దారిలో అతనికి నాణాల సంచి దొరికింది. పరిణామం రీత్యా ఈ నడక అతనికి లాభదాయకం కాగలిగినా ఆహ్వానించిన వ్యక్తి సంకల్పం మాత్రం మంచిది కాదనటంలో ఇప్పటికీ ఎలాంటి సందేహం లేదు. మరి అతను రాత్రి పూట ఆ వ్యక్తిని ఆహ్వానించి అతనికి మేలు చేశాడని కూడా అనజాలము. కాని ఒక వ్యక్తి అతన్ని రేజీకటిలో నిజంగా మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఆహ్వానించాడనుకోండి. అయితే ఆహ్వానించబడినవాడు యాదృచ్ఛికంగా మార్గమధ్యంలో ఏ నూతిలోనో, గోతిలోనో పడి చనిపోయినా అట్టి పరిస్థితిలో ఆహ్వానించిన వాడు పాపికాలేడు. చనిపోయిన వాని ప్రయాణం పరిణామం దృష్ట్యా హానికరమైనంత మాత్రాన ఆ దోషం ఆహ్వానకుని మీద వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు వ్యక్తి వలే ఈ వ్యక్తి సంకల్పంలో ఎలాంటి దోషం లేదు.

మరో ఉదాహరణ: ఒక వ్యక్తి దారిలో నడుస్తున్నాడు. అతనికి ఒక స్త్రీ కనిపించింది. ఆమె పరాయి స్త్రీ అనుకుని చెడు సంకల్పంతో ఆమెను వెంటాడాడు. కాని వాస్తవానికి ఆమె అతని భార్యేనని తీరా దగ్గరి కెళ్ళాక తెలిసింది. మరొక పరిస్థితిలో అతను తన భార్య అని తలపోసి పరాయి స్త్రీ పై చేయి వేశాడు. అటువంటప్పుడు మొదటి స్థితిలో అతని మనసు పాపభూయిష్టమై పోయింది. కాని రెండవ స్థితిలో అతను నిర్దోషి అన్నది సుస్పష్టమే.

నమాజ్ ను మించిన పుణ్యకార్యం ఏముందో చెప్పండి! కాని అది కూడా బడాయి కోసమో, ప్రదర్శనా భావంతోనో చేస్తే దానివల్ల పుణ్యఫలం చేకూరే బదులు అది వృధా ప్రయాసే అయిపోతుంది. అలాగే మీరు ఒక వికలాంగునికి సహాయం చేయబోయి జనులు మిమ్మల్ని ఒక దాతగా పొగడాలని కాంక్షిస్తే మీ సహాయం పుణ్యకార్యంగా పరిగణించబడదు.

 وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا

“ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో పనిచేసే వాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాము. పరలోక ప్రతి ఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతి ఫలాన్ని పొందుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 145)

బడాయి కోసం చేసే సత్కార్యాలు నిరర్ధకమని, బూడిదలో పోసే పన్నీరు వంటివని మరోచోట స్పష్టం చేయబడింది –

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ

ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.” (అల్ బఖర 2 : 263)

ఇలాంటి ఉదాహరణలు ఖుర్ఆన్ లో మరెన్నో ఉన్నాయి. వీటికి తాత్పర్యంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎంతో క్లుప్తంగా (కాని ఎంతో సమగ్రంగా) ఇలా ప్రవచించారు:

“ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్”
(మనిషి ఆచరణలన్నీ అతని సంకల్పాన్ని బట్టి ఉంటాయి).

అందునా నైతికత అనే చర్చనీయాంశంలో సంకల్పం ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. సంకల్పంలో గనక దోషం వచ్చేస్తే ఎంత గొప్ప కార్యమైనా నైతికత యొక్క పరిధి నుండి బహిష్కృతం అయిపోతుంది.

పై వివరాల వెలుగులో నైతికత అనేది మనసుతో ముడిపడిన అంశం అని తేలుతుంది. మరి ఆ మనసు యొక్క అంతర్గత స్థితి చక్కబడటానికి గాను విశ్వాసానికి మనిషి కట్టుబడటం అనివార్యం. అదేమంటే ఒకానొక శక్తి ఉందనీ, అది మన మనసులోని ఒక్కో మూలను ఒక్కో కోణం నుంచి తరచి చూస్తోందనీ, మనం జన సమూహంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, వెలుతురులో ఉన్నా ఆ శక్తి సూక్ష్మ దృష్టితో గుండెల్లోని లోతుల్లోకి పోయి చూస్తోందన్న దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ప్రపంచంలోని జాతులన్నీ కేవలం శరీరంపైనే హుకుం జారీ చేస్తాయి. కాని ఆ అద్వితీయ శక్తిమంతుడు మనసులపై హుకుం జారీ చేస్తాడని నమ్మాలి. మనం మన కర్మలన్నింటికీగాను ఆయన సమక్షంలో సమాధానం ఇచ్చుకోవాల్సి ఉందనీ, మన కర్మల ఆధారంగా బహుమానమో లేక శిక్షయో లభించే రోజు తప్పక రానున్నదని కూడా నమ్మాలి. ఈ భావన మనసులో గట్టిగా నాటుకు పోనంత వరకూ అతని సత్ప్రవర్తన అతనికే మాత్రం ప్రయోజనకరం కాజాలదు. అందుకే అల్లాహ్ మరియు మరణాంతర జీవితంపై విశ్వాసం ప్రతి సత్కర్మకు మూలం అని ఇస్లాంలో స్పష్టం చేయబడింది.

وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا

“(అల్లాహ్ ను, అంతిమ దినాన్ని) తిరస్కరించిన వారి కర్మల ఉపమానం ఎండమావి వంటిది. తప్పిక గొన్నవాడు దాన్ని చూసి నీరు అనుకున్నాడు. కాని తీరా అక్కడకు చేరినాక ఏమీ పొందలేక పోయాడు.” (నూర్ 24 : 39)

ఈ లక్ష్యమే (అల్లాహ్ ఏకత్వం మరియు మరణానంతర జీవితంపై విశ్వాసం) మనకు అంధకారంలో కాంతిరేఖగా పనిచేస్తుంది. ఇదే గనక లేకుంటే అన్ని వైపులా చీకటే! మనం చేసే ఏ పనికీ ఒక ఆశయం, ఒక లక్ష్యం లేకుండా పోతుంది :

(అల్లాహ్ ను, ప్రళయ దినాన్ని త్రోసిపుచ్చేవారి కర్మల ఉపమానం చీకటి క్రమ్ముకున్న సముద్రం వంటిది. దానిపై అలలు ఆవరించి ఉన్నాయి. ఆ (చీకటి) అలపై మరో అల. దానిపైన కారు మబ్బు క్రమ్మి ఉంది. చీకట్లు ఒక దానిపై ఒకటి అలుముకున్నాయి. మనిషి తన చేతిని బయటికి తీస్తే దాన్ని చూడనైనా లేడు. అల్లాహ్ ఎవరికి తన వెలుగును ప్రసాదించడో అతనికి మరే వెలుగూ లభించదు.” (నూర్ – 40)

ప్రతి పనికీ ఒక ఆశయం, ఒక ప్రేరణ తప్పక ఉంటుంది. ఉండాలి. అలాగే ఒక ఆగోచర శక్తి, సూక్ష్మ దృష్టితో తన గుండెల్లోని ఒక్కో అణువును గమనిస్తున్నాడనీ, తాను చేసే ప్రతి చిన్న పనికీ ఆయన ఎదుట నిలబడి జవాబు ఇవ్వవలసి ఉందని దృఢంగా విశ్వసించిన నాడు మనిషి మనసులో చిత్తశుద్ధి వచ్చేస్తుంది. ప్రాపంచిక స్వార్ధ ప్రయోజనాల నుండి అతని మనసు పరిశుభ్రమవుతుంది. నిస్వార్థ భావంతో అతను ముందడుగు వేస్తూ నైతికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు.

ఇస్లాం ప్రకారం కర్మలకు ఉద్దేశ్యం అవసరం. పైగా ఆ ఉద్దేశ్యం సదుద్దేశ్యమై ఉండటం అనివార్యం. మనిషి చేసే ఏ పని కూడా ఉద్దేశ్యం లేకుండా ఉండదని నీతి శాస్త్రజ్ఞులు అంటారు. అయితే ఈ ఉద్దేశ్యం ఏమై ఉండాలనే దానిపై వారు ఇంత వరకు ఏకీభవించలేక పోయారు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ కాలం నుంచి నేటి వరకు డజన్ల కొద్దీ సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. కాని యదార్థ రహస్యం ఇంతవరకూ ఛేదించబడలేదు.

నైతికత యొక్క ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? అనే విషయంతో ఇస్లాంకు అంతగా ఆసక్తి లేదు. ఉద్దేశ్యం ఏమై ఉండాలి? అనే దాని గురించే అది నొక్కి చెబుతుంది. వాస్తవానికి మనం చేసే పనికి అనేక చిన్న పెద్ద ఉద్దేశ్యాలుండవచ్చు. మసం మార్గ మధ్యంలో ఒక ముసలివాని భుజాలపై ఉన్న బరువుము దించి మన మీద వేసుకుంటాం.ఆ ముసలి వాణ్ణి సాదరంగా అతని ఇంటికి చేరుస్తాము. మనం చేసిన ఈ పనికి ఉద్దేశ్యమేమై ఉంటుంది?

(అ) ఆ ముసలివాడు సంతోషించి ఇంటికి చేరిన మీదట ప్రతి ఫలం ఇస్తాడని మనం అనుకుని ఉండవచ్చు.

(ఆ) మన ఈ త్యాగశీలాన్ని చూసి జనులు మెచ్చుకుంటారనీ, ప్రజా ప్రాతినిధ్యపు హోదా ఏదైనా మనకు కట్టబెడతారని కూడా మనం ఆశించి ఉండవచ్చు.

(a) లేదా దారిలో తారసపడే వారంతా మనల్ని చూసి సజ్జనుడుగా, ధార్మికునిగా ప్రశంసిస్తారని కూడా మనం తలపోసి ఉండవచ్చు.

(ఈ) లేదా ఈ రోజు యువకులమైన మనం ముసలివారి పట్ల ఆదరణతో మెలిగితే రేపు యువకులు తమ యెడల ఆదరణతో మెలగుతారని ఊహించి ఉండవచ్చు.

(ఉ) కొంత మంది ఇలాంటి పనుల పట్ల ఎంతో మక్కువ కలిగి ఉంటారు. ఇలాంటి సహాయ కార్యాలు చేసినప్పుడు వారి అంతరంగం ఆనందంతో పులకిస్తుంది.

(ఊ) మరి కొంతమంది వృద్ధులను అలాంటి స్థితిలో చూసి జాలిపడి వారిని ఆదుకుంటారు.

చెప్పవచ్చిందేమిటంటే ఒక్క పని వెనుక ఇలాంటి ఉద్దేశ్యాలు అనేకం ఉంటాయి. ఈ విభిన్న ఉద్దేశ్యాలే పని కొరకు ప్రజలకు ప్రేరణనిస్తాయి.

అయితే పైన పేర్కొనబడిన రకరకాల ఉద్దేశ్యాల జాబితాను మరోసారి పరికించి చూడండి. క్రమంగా ఆ ఉద్దేశ్యాలు క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళుతున్నాయి. ఎవరి ఉద్దేశ్యం స్వార్థప్రయోజనాల నుండి ఏ మేరకు అతీతంగా ఉందో ఆ మేరకే అది ఉన్నతం, ఆదరణీయం కాగలుగుతుంది. ఏదైనా ఆర్థిక, శారీరక ప్రతిఫలాన్ని ఆపేక్షించి మంచి పని చేస్తే అది అన్నిటికన్నా తక్కువ స్థాయి ఆశయం అవుతుంది. ఆ తరువాత కీర్తి ప్రతిష్ఠల్ని ఆశించి సత్కార్యం చేస్తే అతని ఆశయం కూడా అధఃస్థితిలోనే ఉంటుంది. అయితే మొదటి దాని కన్నా ఇది కొంత మేలైనది. ఆ తరువాత ఆత్మతృప్తి కోసం, అంతరాత్మను ఓదార్చటం కోసం సత్కార్యం చేసేవారి వంతు వస్తుంది. వీరి ఉద్దేశ్యం మంచిదే అయినా ఇందులోనూ స్వప్రయోజనం, ప్రాపంచిక వ్యామోహం అంతర్లీనమై ఉంది. ఒక మనిషి తోటి సోదరుని యెడల ఎంత ఆప్యాయంగా మెలగినా అతను ఒలకబోసే ఆప్యాయత వెనుక ఫలానా స్వార్థం దాగి ఉందని తెలిసినట్లయితే ఆ సోదరుని దృష్టిలో ఆ ఆప్యాయతకు గల విలువ తగ్గిపోతుంది. ఇది ఎంతో సహజమైన విషయం.

మనిషి మనోమయ భావాలు, భావనలకు మరో పేరు ఇది. దీని మూలంగానే మనిషి మంచీ-చెడుల మధ్య విచక్షణను పాటించగలుగుతాడు. దీని మూలంగానే అతని హృదయపు లోతుల్లో నుంచి తాను మంచి కొరకు సమాయత్తం కావాలనే ఘోష పుట్టుకు వస్తుంది. దిక్కులేని నిరుపేదను చూసినప్పుడు అతని పట్ల ప్రతి వ్యక్తిలో సహజంగానే జాలి కలుగుతుంది. హంతకుడు, కిరాతుకుని పట్ల ప్రతి వ్యక్తిలో సహజంగానే ద్వేషం పుట్టుకు వస్తుంది. ఈ సహజ శక్తి ప్రతి వ్యక్తి అంతరంగంలో ప్రోది చేయబడి ఉంది. ప్రతి మంచి లేక చెడు పని చేసే సమయంలో అతని మనసు పొరల నుంచి ప్రశంస లేక విమర్శల వాణి అతనికి తప్పక వినిపిస్తుంది. అయితే చెడు సహచర్యం, చెడు శిక్షణ మరియు నకారాత్మక భావాల ప్రతాపం వల్ల అంతర్ వాణి ప్రభావ రహితం కూడా అయిపోతుంది. ఈ కారణంగానే ప్రతి చెడు పనిని చేసే ముందు మనిషి జంకుతాడు. భయపడతాడు, అతని కాళ్ళు చేతులు వణుకుతాయి. చెడు కార్యపు తలంపుతో అతని మనసంతా కకావికలమవుతుంది. ఒక్కోసారి అతను సిగ్గుతో కుమిలిపోతాడు. పశ్చాత్తాప భావంతో కృంగిపోతాడు. చేసిన పాపాన్ని తలచుకున్నప్పుడల్లా అతని నుదుటి పై చెమట బిందువులు ఏర్పడతాయి. కాని అతడు మాటి మాటికీ అంతరాత్మ ప్రబోధాన్ని బలవంతంగా నొక్కి వేయ సాగితే అది క్రమక్రమంగా అణగారిపోతుంది. క్రమంగా అతనిలోని పశ్చాత్తాప భావం కూడా పటాపంచలైపోతుంది.

ఈ ప్రభావాలు దేని పరిణామం? ఇస్లాం నైతిక సూత్రాల ఆధారంగా దీనికి సమాధానమేమంటే- అల్లాహ్ మంచీ చెడులకు సంబంధించి ప్రతి మనిషిలో ప్రోది చేసిన సహజ శక్తుల పరిణామమే ఇది. దివ్య ఖుర్ఆన్లో ఉంది:

وَنَفْسٍ وَمَا سَوَّاهَا فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا
“మానవాత్మ సాక్షిగా! ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను తెలియజేసిన వాని సాక్షిగా!!” (అష్ షమ్స్ 19 : 7-8)

అదే అంతరాత్మ!

ఇక, మనం చెడు వైపునకు మొగ్గు చూపినప్పుడల్లా ‘నీవు చేయబోయేది చెడు’ అని హెచ్చరించి మనల్ని అప్రమత్తుల్ని చేసేది “నఫ్సె లవ్వామ” (నిందించే మనసు, మధనపడే మనసు) గా ఇస్లాంలో ఖరారు చేయబడింది. ఇది కూడా మన హృదయంలో ఉంది.

بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ
“మానవుడు ఎన్ని సాకులు చెప్పినా స్వయంగా అతనికి తనను గురించి బాగా తెలుసు.” (అల్ ఖియామహ్ 75 : 14, 15)

నవాస్ బిన్ సమాన్ అన్సారీ (రదియల్లాహు అన్హు) అనే ఒక సహాబి (సహచరుడు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా పాప పుణ్యాలు వాస్తవికతను అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మదీనాలో ఒక ఏడాది కాలం పాటు మకాం వేశారు. ఆఖరికి ఆయన ఒకసారి ఆ విషయమై ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “సత్ప్రవర్తనే పుణ్యం. దేని విషయంలో నీ మనసు మధనపడుతుందో, నీవు చేసిన ఏ పని గురించి ప్రజలు తెలుసుకోవటాన్ని నీవు ఇష్టపడవో అది చెడు (పాపం) అని తెలుసుకో” అని ఉపదేశించారు.

అలాగే వాబిస బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు) అనే మరొక సహాబి మంచీ చెడుల వాస్తవికతను తెలుసుకోగోరి అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి విచ్చేశారు. ఆ సమయంలో నలువైపులా ప్రవక్త గారి ప్రియ శిష్యులు గుమిగూడి ఉన్నారు. వాబిస గారు అత్యుత్సాహంతో, అమితాసక్తితో అందరినీ ప్రక్కకు తోసేస్తూ ముందుకు దూసుకు పోసాగారు. ప్రజలు ఆయన్ని ఆపబోయినా ఆగకుండా ఆయన ముందుకు తోసుకుపోయారు. ఆయన ఆత్రుతను గమనించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “వాబిస! దగ్గరికి రండి” అని చెప్పారు. ఆయన దగ్గరకెళ్ళి కూర్చోగానే “వాబిస! మీరు ఎందుకు విచ్చేశారో నేను చెప్పనా? లేక మీరు చెబుతారా?!” అని ప్రశ్నించారు. “తమరే చెప్పండి” అని కోరారు. “వాబిస! మీరు మంచీ చెడుల వాస్తవికతను గురించి నా ద్వారా తెలుసు కోదలిచారు. ఔనా?” అని ప్రవక్తగారు పలకగా “నిజమే ఓ దైవప్రవక్తా!” అని ఆ సహాబి ధృవీకరించారు. ఆ పైన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ఉపదేశించారు:

“ఓ వాబిస! నీ అంతరంగాన్ని అడుగు. నీ మనస్సాక్షిని సంప్రదించి సమాధానం పొందు. దేనివల్ల నీ హృదయం మరియు నీ మనసు కుదుట పడతాయో అది మంచిదని గ్రహించు. మరి దేనివల్ల నీ హృదయం అశాంతికి లోనవుతుందో, దేని మూలంగా నీ మనసు కలత చెందుతుందో అది చెడు అని తెలుసుకో, ఒకవేళ ఆ పని సమంజసమే అని ప్రజలు నిన్ను ప్రోత్సహించినప్పటికీ (అది చెడు సుమా!)” (మస్నద్ బిన్ హంబల్)

ఈ నైతిక కోణానికే ప్రజలు “అంతరాత్మ ప్రబోధం” అని నామకరణం చేశారు.

మొదట్లో మనిషి తన అంతరాత్మ ప్రబోధానికి వ్యతిరేకంగా ఏదేని మాట పలికితే నిర్మలమైన, స్వచ్ఛమైన అతని మనోఫలకంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఆవేశం చల్లారిన తరువాత అతడు పశ్చాత్తాపం చెంది అల్లాహ్ ను క్షమాపణ కోరుకుంటే, జరిగిన తప్పుపై బాధపడితే ఆ మచ్చ చెరిగిపోతుంది. అయితే ఆ పాపానికే అతడు పదేపదే పాల్పడసాగితే ఆ మచ్చ పెరిగి పెద్దదవసాగుతుంది. క్రమక్రమంగా అది హృదయాన్నంతటినీ ఆవరించి అన్ని రకాల మంచి భావాల నుండి అతణ్ణి దూరం చేసివేస్తుంది. ఈ భావాన్నే కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా ఉపదేశించారు:

“దాసుడు ఏదైనా పాపానికి ఒడిగట్టినపుడు అతని హృదయంపై కళంకమనే నల్లని బిందువు ఏర్పడుతుంది. మరి అతడు గనక దాన్నుండి వేర్పడి క్షమాపణకై దైవాన్ని అర్ధిస్తే, పశ్చాత్తాపం చెందితే అతని హృదయం నిర్మలమవుతుంది. అతను గనక మళ్లీ అదే అపరాధానికి పాల్పడితే ఆ మచ్చ పెరగసాగుతుంది. ఆఖరికి అది హృదయాన్నంతటినీ ఆవరిస్తుంది.” (జామె తిర్మిజి)

ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు “హృదయానికి పట్టిన తుప్పు అంటే ఇదే.” దాని ప్రస్తావన క్రింది వచనంలో ఉంది –

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
“ఎన్నటికీ కాదు, అసలు వారి దుష్కార్యాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.” (ముతఫ్ఫిఫీన్ 83 :14)

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఒక ఉపమానం ద్వారా ఈ విషయాన్ని విశదీకరించారు. ఒక తిన్నని మార్గం ఉంది. అది గమ్యస్థానానికి చేరుస్తుంది. ఆ మార్గానికి అటు వైపున, ఇటు వైపున కూడా రెండు గోడలు ఉన్నాయి. ఆ రెండు గోడల్లోనూ కొన్ని తలుపులు తెరుచుకుని ఉన్నాయిగాని వాటిపై తెరలు ఉన్నాయి. తిన్నని మార్గం ఆఖరి అంచు నుండి ప్రకటన గావించే వాడొకడు మార్గంపై తిన్నగా నడవమనీ అటూ ఇటూ పోవద్దనీ ప్రకటిస్తున్నాడు. ఆ సమయంలో దారిలో పోతున్న దైవదాసుడు కుడి ఎడమల్లో ఉన్న ద్వారాలకు వేలాడుతున్న తెరలను ఎత్తి చూడదలిచాడు. అప్పుడు పై నుండి ఒక ప్రకటన వెలువడింది – “జాగ్రత్త ! పరదాను ఎత్తకు. ఎత్తావంటే జారి పడిపోతావు” అని! అనంతరం ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఈ (తిన్నని) మార్గమే ఇస్లాం. ప్రక్కనున్న ఈ ద్వారాలు అల్లాహ్ నిషేధించినవి. ఈ పరదాలు వాటి చివరి హద్దులు వంటివి. తిన్నని మార్గం ఆఖరి అంచు నుంచి పిలిచేదే ఖుర్ఆన్. కాగా; పై నుండి పిలుపు నిచ్చేవాడు ‘ప్రతి మోమిన్ హృదయంలో ఉన్న అల్లాహ్ తరఫు బోధకుడు’ అన్న మాట!” (మిష్కాత్)

ఎంత చక్కని ఉపమానమిది! ఎంత గొప్ప తత్వవేత్త అయినా, మరెంత గొప్ప నీతి శాస్త్రజ్ఞుడైనా మనస్సాక్షి గురించి ఇంతకన్నా చక్కగా వివరించగలడా?!

ఇస్లాంలో ప్రతి మంచి పని (సత్కార్యం) యొక్క ఉద్దేశ్యం మరియు లక్ష్యం ఒక్కటే. అదే అల్లాహ్ మెప్పు! ఒక నిజమయిన ముస్లిం నిరంతరం పాటుపడవలసింది దీని కొరకే. అతను చేసే పనికి ఇది తప్ప మరో ఉద్దేశ్య ముండకూడదు. నైతిక సూత్రానికి – ఇస్లామీయ నైతికతకు మధ్యగల వ్యత్యాసం ప్రస్ఫుటం అయ్యేది ఇక్కడే.

మానవ నైతికతకు ‘ఉద్దేశ్యం’ ఏమై ఉండాలి? అని నీతి శాస్త్రజ్ఞులు మల్లగుల్లాలు పడుతుండగా, మానవుడు “ఫలానా వస్తువు”ను తన నైతికత యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకోవాలని దైవ ప్రవక్తలు ప్రబోధిస్తారు. మనిషి దగ్గర ఉండే రెండు ప్రధాన జీవన సాధనాలు ధన ప్రాణాలు. ఈ రెంటినీ అల్లాహ్ మార్గంలో వెచ్చించటమే త్యాగం మరియు సత్కార్యం. కాగా; ఒక విశ్వాసి ‘ప్రాణం’ గురించి ఇలా చెప్పబడింది:

وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ

“మరో వైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందడానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అటువంటి తన దాసుణ్ణి అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు”. (అల్ బఖర 2: 207)

ఆ తరువాత ‘ధనం’ గురించి ఇలా సెలవీయబడింది:

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ

“తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లులు పడినా అదే దానికి చాలు.” (అల్ బఖర 2 : 265)

వేరొక సూరాలో మరింత స్పష్టంగా చెప్పబడింది:

الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ

“(ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు).మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు.” (అల్ లైల్ 92 : 18-20)

ఈ వచనాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేక హదీసులు ద్వారా విశదీకరించారు. ఒక వ్యక్తి వచ్చి, “ఓ దైవప్రవక్తా! విజయ ధనం కోసం ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొంటాడు. మరొక వ్యక్తి గొప్ప యోధునిగా గుర్తింపు పొందే సంకల్పంతో యుద్ధానికి వస్తాడు. ఇంకొక వ్యక్తి జనుల మన్నన పొందే ఉద్దేశ్యంతో కదన రంగానికి కదలి వస్తాడు. మరి వీరిలో వాస్తవానికి అల్లాహ్ మార్గంలో పోరాడిన యోధుడు ఎవరు?” అని ప్రశ్నించగా “అల్లాహ్ వాక్కు ఉన్నతికై పోరాడేవాడు మాత్రమే సిసలయిన యోధుడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు.

వేరొక సందర్భంలో అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు – “గుర్రాలను కట్టి ఉంచటం ఒకరికి పుణ్యప్రదం కాగా, మరొకరికి ఆసరా అవుతుంది. ఇంకొకరికి అది పాపంగా పరిణమిస్తుంది. అదెలాగో తెలుసా! అల్లాహ్ మార్గంలో ఉపయోగించే ఉద్దేశ్యంతో గుర్రాన్ని కట్టి ఉంచితే అది పుణ్యప్రదం కాగలదు. అట్టి పరిస్థితిలో ఆ గుర్రం మేత మేసినా, నీరు త్రాగినా దాని పుణ్య ఫలం సయితం యజమానికి లభిస్తుంది. అవసరార్ధం గుర్రం ఉంచే వానికి అది అండగా ఉంటుంది. ఎందుకంటే అల్లాహ్ తనకు సిరిసంపదలను ప్రసాదించిన తరువాత తనకు అవసరం పడిన వస్తువుకై ఇతరుల్ని దేవురించే స్థితి ఏర్పడరాదన్న ఉద్దేశ్యంతో అతడు ఆ గుర్రాన్ని పోషిస్తున్నాడు. పైగా ఆ గుర్రంతో ధర్మసమ్మతంగా పని చేయించుకుంటున్నాడు. దాని హక్కును నెరవేరుస్తున్నాడు. ఆ విధంగా అతడు తన మర్యాద మంటగలసిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక గుర్రాల పెంపకం పాప ప్రదంగా పరిణమించే దెవరికో తెలుసా?! ఎవడు గర్వాతిశయంతో, డాబు దర్పం కోసం వాటిని పోషిస్తాడో వాడి పాలిట అది పాపంగా పరిణమిస్తుంది.” (సహీహ్ బుఖారీ – కితాబుల్ జిహాద్)

ఈ శిక్షణా పర్వంలో అన్నిటికన్నా ప్రభావ పూరితమైన వృత్తాంతం ఇంకొకటి ఉంది. హజ్రత్ అబూహురైరా (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఈ వృత్తాంతం తిర్మిజీ గ్రంథంలో విపులంగా పొందుపరచబడింది. దీనిని ఉల్లేఖిస్తూ హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) మూడుసార్లు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సంఘటనను విని హజ్రత్ ముఆవియ (ర.అ) దుఃఖంతో విలపించారు. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి మరీ ఉల్లేఖించిన ఆ వృత్తాంతం ఇలా ఉంది –

ప్రళయ దినమున అల్లాహ్ ప్రజల తీర్పు చేయడానికి సిద్ధమయినపుడు ప్రతి మానవ సమాజం (ఉమ్మత్) మోకాళ్ళు నేలకానించి కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో అందరికన్నా ముందు దివ్య ఖుర్ఆన్ను అధ్యయనం చేసిన పండితులు, ధర్మయుద్ధం (జిహాద్)లో అమరగతులయిన వారు, శ్రీమంతులు హాజరు పరచబడాలని ఆజ్ఞాపించబడుతుంది. ఆ తరువాత ప్రళయదిన అధినేత అయిన అల్లాహ్ పండితుణ్ణి ఉద్దేశించి, “నేను నీకు పైగంబరుపై అవతరించినదంతా నేర్పాను కదా! నీవు దీనిని ఏ మేరకు ఆచరణలో పెట్టావు?” అని ప్రశ్నిస్తాడు. దానికతడు “ఓ అల్లాహ్! నేను రేయింబవళ్ళు నమాజ్లో ఖుర్ఆన్ పారాయణం చేసేవాణ్ణి” అని వివరణ ఇచ్చుకుంటాడు. “నీవు అబద్ధమాడుతున్నావు.” అని అల్లాహ్ అంటాడు. “ఇతను చెప్పేది నిజం కాద”ని మరో వైపు నుంచి దైవదూతలు కూడా సాక్ష్యమిస్తారు. “ప్రజలు నిన్ను గొప్ప విద్వాంసునిగా, ఖుర్ఆన్ పరితునిగా పొగడాలన్న ఉద్దేశ్యంతోనే నీవు అలా చేసేవాడివి. నీవు ఆశించింది ప్రపంచ జీవితంలోనే నీకు దక్కింది.” అని తీర్పు దినపు యజమాని తరఫున చెప్పబడుతుంది.

ఆ పైన అల్లాహ్ ధనవంతుణ్ణి ఉద్దేశ్యించి “నేను నీ కొరకు ప్రపంచాన్ని ఎంతో విస్తృతపరచాను. ఎవరి ముందూ చేయిచాచి అర్ధించవలసిన స్థితి ఏర్పడకుండా (కలిమిని) అనుగ్రహించాను. ఔనా?” అనంటాడు. “నిస్సందేహంగా నీవు నాకు ఇదంతా అనుగ్రహించావు” అని ఆ ధనవంతుడు ఒప్పుకుంటాడు. “మరి నేను అనుగ్రహించిన దానిని ఏం చేశావు?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. “నేను హక్కుదారులకు హక్కు ఇచ్చాను, దాన ధర్మాలు చేశాను (నీ ప్రసన్నత కోసమే ఇదంతా చేశాను)” అని అతను విన్నవించుకుంటాడు. “నీవు చెప్పేది నిజం కాదు” అని అల్లాహ్ అంటాడు. దైవదూతలు కూడా ఆ ధనవంతుని మాటలు అబద్ధాలని ధృవీకరిస్తారు. “జనులు నిన్ను ధర్మదాతగా కీర్తించాలన్న కోరికతోనే నీవు ఇదంతా చేసేవాడివి. నువ్వు కోరుకున్న కీర్తి ఇహలోకంలోనే నీకు లభించింది” అని తీర్పు ఇస్తాడు తీర్పు దినపు యజమాని.

అనంతరం ధర్మయుద్ధంలో అమరగతి నొందిన యోధుడు హాజరు పరచబడతాడు. “నీవు ఎలా చంపబడ్డావు?” ప్రభువు ప్రశ్నిస్తాడు. “ప్రభూ! నీ మార్గంలో పోరాడవలసిందిగా నీవు ఇచ్చిన ఆదేశాన్ని శిరసావహిస్తూ నేను యుద్ధరంగంలో అడుగుపెట్టాను. అమరగతి నొందే దాకా పోరాడాను” అని అతను సమాధానమిస్తాడు. “నీవు చెప్పేది అబద్ధం” అని అల్లాహ్ అంటాడు. “అతను చెప్పేది నిజం కాదని” దైవదూతలు కూడా సాక్ష్యమిస్తారు. “లోకం నిన్ను గొప్ప యోధునిగా, శూరునిగా పొగడాలన్న సంకల్పంతోనే నువ్వు ఈ పని చేశావు. ప్రపంచంలోనే నీకీ కీర్తి ప్రతిష్ఠలు ప్రాప్తించాయి” అని తీర్పు ఇవ్వబడుతుంది.

మరి అందరికన్నా ముందు నరకంలో పడవేయబడేది ఈ ముగ్గురు వ్యక్తులే అని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (తిర్మిజీ)

ఈ హదీసును విని హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) చాలా సేపు ఎక్కి ఎక్కి ఏడ్చారు. తరువాత గద్గద స్వరంతో ఇలా అన్నారు: “అల్లాహ్ మరియు దైవప్రవక్త సత్యసంధులు.” ఈ హదీసుకు సమర్ధింపుగా ఆయన దివ్య ఖుర్ఆన్ లోని ఈ వచనాలను పఠించారు.

مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ

“ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు.అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.” (హూద్ 11: 15, 16)

మన నీతీ నడవడికలయినా, సత్కర్మలయినా – వాటి అసలు లక్ష్యం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమై ఉండాలి గానీ, స్వార్ధ ప్రియత్వమై ఉండరాదు. స్వార్థమే పరమార్థమైనపుడు అందులో పుణ్యఫలం దెబ్బతినే ప్రమాదముంటుంది. అల్లాహ్ మెప్పును ఆశించి ఒక మంచి పనిని చేసినపుడు పరలోకంలో పుణ్యఫలం ఎలాగూ లభిస్తుంది. అయితే ఇహలోకంలో కూడా ఆ మంచి పని మూలంగా మన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తే అల్లాహ్ తరఫున దీన్ని అడ్వాన్సు కానుకగా భావించాలి. ఇస్లాం యొక్క ఈ నైతిక శిక్షణ మనిషిని ఇటువంటి సంకుచిత, స్వార్థ స్థితి నుంచి వెలికితీసి నిస్వార్థత, నిజాయితీ తత్పరతల ఉన్నతికి చేరుస్తుంది.

ఈ విధంగా సెలవీయబడింది:

(1) “మీరు ఏది ఖర్చు చేసినా అల్లాహ్ కొరకు తప్ప మరోదాని కొరకు కాదని తెలుసుకోండి.” (అల్ బఖర: 37 వరకూ)

(2) “ఒకరు చేసిన మేలుకు బదులు తీర్చుకునే ఉద్దేశ్యంతో కాదు, మహోన్న తుడైన ప్రభువు ప్రసన్నతను చూరగొనడం కోసం మాత్రమే అతడు ఈ పని చేస్తున్నాడు.” (అల్ లైల్ -19,20)

నైతిక ఆజ్ఞల పరిపూర్తి, హక్కుల చెల్లింపు గురించి తాకీదు చేస్తూ ఇలా సెలవీయబడింది:

(3) “కనుక (ఓ విశ్వాసీ!) బంధువునకు అతని హక్కును ఇచ్చివేయి. పేదవానికి, బాటసారికీ (వారి హక్కులను ఇచ్చివేయి. అల్లాహ్ ప్రసన్న తను కోరుకునేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారు వారే.” (రూమ్-38)

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా నైతిక సూత్రాలకు పరిపూర్ణత చేకూరిందన్నది తిరుగులేని సత్యం. అంతకుమునుపు ఉన్న మతాలలో ఈ పరిపక్వత కానరాదు. “తౌరాత్ లోని నైతిక శిక్షణలో రాజదర్పం తొణికిస లాడుతుంది. అందులో ఒక సూత్రంగానీ, ఒక ఉద్దేశ్యంగానీ, పరమార్థంగానీ స్పష్టంగా ద్యోతకమవుతున్నట్టు కనిపించదు. ఇక బైబిల్ విషయానికి వస్తే అందులో అందమైన అక్షరాల కూర్పు తప్ప, నైతిక ఆదేశాల మూలసూత్రమనేదేదీ నెలకొన్నట్టు కానరాదు. అయినప్పటికీ క్రైస్తవ మతంలో కొన్ని సూత్రాలున్నాయనేది మాత్రం నిర్వివాదాంశం. అయితే వాటికి గల పునాదులు చాలా బలహీనమైనవి. వాటిలో ఒకటి మానవసృష్టికి సంబంధించినది.

మానవ సృష్టి ఖుద్దుగా పాపంతో కూడుకున్నదని క్రైస్తవ మతం అంటుంది, దాని ప్రకారం మానవుడు జన్మతః పాపి. ఎందుకంటే అతని తల్లిదండ్రులైన ఆదం హవ్వాలు పాపానికి ఒడిగట్టారు. ఈ పాపం వారసత్వంగా ప్రతి మనిషికీ సంక్రమిస్తూ వస్తోంది. దీన్నుండి తనను రక్షించుకోవటం ఏ ఒక్కరి తరమూ కాదు. ఈ విషయంలో క్రైస్తవ నమ్మకం ఎంత వరకూ పోయిందంటే పుట్టిన ఏ శిశువైనా సరే “బాప్టిజం” పుచ్చుకునే దాకా పరిశుద్ధత నొందలేడు. దానికి ముందు ఒక క్రైస్తవుని శిశువు చనిపోయినా సరే. అతడు ఆకాశ సామ్రాజ్యహద్దుల్లోకి ప్రవేశించజాలడు. పైగా అతడు నరకంలోకి నెట్టివేయబడతాడు. ఎందుకంటే ఏసుక్రీస్తు పేరుతో అతడు “మోక్షం” పొందలేదు.

అయితే ఇస్లాం సిద్ధాంతం దీనికి పూర్తిగా భిన్నమైనది. దాని దృష్టిలో తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) ఎంతో ముఖ్యమైనది. ఇస్లాం ప్రకారం మనిషి పుట్టుకరీత్యానే – స్వాభావికంగానే అల్లాహ్ విధేయుడుగా ఏకేశ్వరోపాసిగా ఉంటాడు. ‘అలస్తు బిరబ్బికుమ్’ (నేను నీ ప్రభువును కానా?) అని అల్లాహ్ ప్రశ్నించినప్పుడు ‘ఖాలూ బలా’ (ఎందుకు కావు?!) అని అతనన్నాడు. అంటే ఉన్నతుడైన ప్రభువును అతడు అంగీకరించాడు. అతని ఈ ‘అంగీకారం’ అతని నిర్దోషిత్వాన్ని నిరూపిస్తోంది. కాగా, పుట్టుకకు ముందు మనిషి మనోఫలకంపైన అల్లాహ్ సువర్ణాక్షరాలతో లిఖించిన ఈ వాగ్దానాన్ని మానవుడు స్పృహలోకి వచ్చిన తరువాత మరింత మెరిసిపోయేలా చేయటమో, చెరిపి వేయటమో చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఇలా అంటున్నాడు!

  1. “మేము మానవుణ్ణి అద్భుతమయిన ఆకృతిలో సృజించాము.” (అత్తీన్ -4)
  2. మరోచోట ఇలా అనబడింది:
    “ఆయనే నిన్ను సృజించాడు. మరి నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. నిన్ను సమపాళ్ళలో మలిచాడు. మరి తానుకోరిన రూపంలో నిన్ను రూపొందిం చాడు.” (ఇన్ఫితార్ -7,8)

ఈ వచనం ఇన్ఫితార్ సూరాలోనిది. ఇందులో ప్రళయదినం గురించి, మనిషికి లభించే శిక్షా బహుమానాల గురించి చెప్పబడింది. ఆ తరువాత పై ఆయత్ వచ్చింది. ఈ ఆయిల్లోని ‘ఫ అదలక్’ అనే పదానికి మేము “సమ పాళ్ళలో మలిచాడు” అని అనువదించాము, అంటే ఒక మనిషి మనుగడకు ఏ ఏ శక్తి యుక్తులు అవసరమవుతాయో అవన్నీ అతనిలో పొందుపరచబడ్డాయని భావం. ఇతర ఆయతులలో ఈ భావం మరింత స్పష్టంగా చెప్పబడింది.

“ఓ (ప్రవక్తా!) మహోన్నతుడగు నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. ఆయన (విశ్వాన్ని) సృష్టించాడు. (దానిని) తీర్చిదిద్దాడు. మరి అన్ని రకాల అంచనాలను నిర్ధారించాడు. ఆపై మార్గదర్శకత్వం వహించాడు.” (అల్ ఆలా: 1 – 3)

మార్గదర్శకత్వం వహించటం – అంటే మనిషికి సన్మార్గమేదో ఎరుకపరచటం – అనేది మనిషి స్వభావంలోనే జన్మతః ఉంది. ఇతర శక్తియుక్తులు పుట్టుకతో వచ్చినట్లే సన్మార్గాన్ని కనుగొనే తెలివితేటలు కూడా అతనిలో ఇమిడి ఉన్నాయన్న మాట!

“మేము మానవుణ్ణి పరీక్షించే నిమిత్తం అతన్ని ఒక మిశ్రమ వీర్యపు బిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతన్ని వినే వాడుగా, చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము. మరి సన్మార్గుడవటమైనా, దుర్మార్గుడవటమైనా అతనిపైనే ఆధారపడి ఉంది.” (అదహ్ర్-23)

అంటే అతనికి కావలసిన సన్మార్గ దర్శకత్వం ఏనాడో ఇవ్వబడిందన్న మాట! ఇక లోకజ్ఞానం వచ్చిన మీదట – సన్మార్గాన్ని అవలంబించి అల్లాహ్ కు కృతజ్ఞుడుగా మెలగాలో, మార్గ విహీనతకు గురై చేసిన మేలును మరచిన వాడుగా జీవించాలో అతడే నిర్ధారించుకోవాలి. ఆ మాటే షమ్స్ సూరాలో మరింత సూటిగా చెప్పడం జరిగింది:

“మానవాత్మ సాక్షిగా! ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసిన వాని సాక్షిగా!! నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచి వేసిన వాడు విఫలుడయ్యాడు.” (అష్షమ్స్: 7-10).

మొత్తం మీద తేలిందేమంటే ఇస్లాం శిక్షణ ప్రకారం మానవ నైజం జన్మతః పాపాల పుట్టగా చిత్రీకరించబడలేదు. పైగా అతని నైజంలో సన్మార్గం మరియు విచక్షణా జ్ఞానం నూరిపోయబడి ఉంది. అందుకే ఈ విధంగా వక్కాణించబడింది:

“కనుక ఏకాగ్ర చిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా ఉంచండి. ఇకపోతే అల్లాహ్ స్వభావం; దేని ప్రాతిపదికపై ఆయన మానవులను సృజించాడో (దానిపై నిలకడగా ఉండండి. అల్లాహ్ సృష్టి ప్రక్రియ మార్చనలవి కానిది. ఇదే సరైన ధర్మం. కాని చాలా మందికి తెలియదు.” (అర్ రూమ్ – 30)

ఇంతకీ ఆ సరైన ధర్మం ఏది? అంటే అదే ఇస్లాం. అది చూపే మార్గమే రుజుమార్గం. దాని మౌలికాంశం అల్లాహ్ ఏకత్వం (తౌహీద్). ఈ దివ్య వచనానికి సారాంశంగా మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

“ప్రతి పిల్లవాడు సహజ ధర్మంపైనే జన్మిస్తాడు. ఆపైన అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, జొరాస్ట్రియన్ గానో చేసేస్తారు” (సహీహ్ బుఖారీ, ముస్లిం).

ఏ విధంగానయితే ఒక జంతువు పిల్ల యధాస్థితిలో పుడుతుందో, దాని చెవి తెగి ఉండదో అదే విధంగా మానవ శిశువు కూడా తన సహజ స్వరూపంలో, సిసలైన నైజంపై పుడుతుంది.

ఈ అంశాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మరో విధంగా కూడా విడమరచి చెప్పారు. మానవుల పుట్టుకకు మునుపు అల్లాహ్ మానవాత్మలతో “అలస్తు బిరబ్బికుమ్” (నేను మీ ప్రభువును కానా?) అని అడిగాడు. దానికి మానవాత్మలు ముక్త కంఠంతో ‘బలా?’ (ఎందుక్కావు? నిస్సందేహంగా నీవే మా ప్రభువువి) అని సమాధానమిచ్చాయి. మానవుడు అల్లాహ్ తో చేసిన ఈ ‘బాస’ను ఖుర్ఆన్ పదే పదే జ్ఞాపకం చేసింది. పైగా మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తూ ఇలా అన్నది : “చూడు, షైతాన్ నీ తండ్రి ఆదమ్ ను పెడత్రోవ పట్టించాడు. జాగ్రత్త! నీవు అతని (మాయ) మాటల్లో పడకు సుమా!!”

ఈ ఉపదేశాలను బట్టి స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే, మానవుడు తన సిసలైన నైజం దృష్ట్యా సాత్వికుడు, అమాయకుడు, నిష్కళంక స్వభావిగా జన్మిస్తాడు. అతడు పుట్టుకతోనే తన పితామహుని వారసత్వ పాపభారాన్ని తన వీపుపై మోసుకుని రాడు. దీని గురించి ఖుర్ఆన్ నిర్ద్వంద్వంగా తీర్పు ఇచ్చేసింది:

“పాపభారం మోసేవాడెవడూ మరొకరి పాపభారం మోయడు.” (ఫాతిర్ -18)

“ప్రతి ప్రాణీ తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంది.” (తూర్-21)

ఈ వచనానికి తాత్పర్యంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

“తండ్రి చేసిన అపరాధానికి కొడుకుగానీ, కొడుకు చేసిన పాపానికి తండ్రిగానీ బాధ్యులు కారు. (ఎవరి పాపం వారి నెత్తిమీదే వేయబడుతుంది) (సునన్ ఇబ్నె మాజ)

ఇక పునర్జన్మ, పరకాయ ప్రవేశం లాంటి విశ్వాసాలతో జనసామాన్యం లోకి వచ్చిన మతాలు కూడా మానవ జన్మను ఒక విధంగా పాపఫలంగానే అభివర్ణించాయి. ఆ మతాలు మనిషి యొక్క ప్రతి పుట్టుకను, ప్రతి జీవితాన్ని ప్రతి జన్మను పూర్వజన్మతో ముడిపెట్టి మానవుని వీపుపై మోయలేనంత బరువును వేసాయి. అంటే ఏ మనిషైనా జీవిత కాలంలో కష్ట నష్టాల్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తే పూర్వజన్మలో అది అతడు చేసుకున్న పాపాల ఫలితంగా భావించాయి.

ఈ పూర్వ రంగంలో ఆలోచించినప్పుడు మనిషి పుట్టుకరీత్యా నిష్కళంక స్వభావి, ఏ పాపం ఎరుగని సాత్వికుడు అన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రబోధనం శోక సంతప్త ప్రపంచాన్ని ఓదార్చే శుభవార్త అని అనటంలో సందేహమే లేదు. ఎందుకంటారేమో, అభం, శుభం తెలీని ఒక పసికందును పట్టుకొని, ‘నీవు పాపిష్టివి, నీ పుట్టుకే పాపభూయిష్టమైనది. కాబట్టి నీవు నరక నివాసివి’ అనే దౌర్జన్యకరమైన మాటలకు ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రబోధనలు అతీతమైనవి. పైగా లోకజ్ఞానం, బుద్ధి వివేకాలు, విచక్షణా జ్ఞానం అబ్బని ప్రతి చంటి పిల్లవాడు నిర్దోషి, అమాయకుడు అన్నది ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి శిక్షణలో ఒక ముఖ్యాంశం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి ఇలా అన్నారు:

“అల్లాహ్ కలము పిల్లవాడు మంచీ చెడుల విచక్షణను తెలుసుకునే ప్రాజ్ఞ వయస్సుకు చేరే దాకా ఆ పిల్లవాని నుండి (అంటే అతని దుష్కర్మలు లిఖించటం నుండి) లేపబడింది.” (సహీహ్ బుఖారీ)

బాలవనములోని ఈ లేత (మానవ) మొగ్గలు వికసించకమునుపే వాడిపోయిన పక్షంలో ఇస్లాం దృష్టిలో వారు స్వర్గంలోని పూలు అవుతాయి. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రవచించారు: “ఏ ముస్లిం పిల్లలు బాల్యంలో చనిపోతారో వారు అల్లాహ్ దర్బారులో తమ తల్లిదండ్రుల యెడల కరుణగా, క్షమా సాధనంగా తోడ్పడతారు. వారిని స్వర్గానికి గొనిపోతారు.” (సహీహ్ ముస్లిం)

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పాలు త్రాగే చంటి పిల్లవాడు చనిపోయి నప్పుడు, “ఇతను స్వర్గంలోకి పోయి స్వర్గవాసులైన మాతల పాలు త్రాగుతాడు.” అని ఆయన సెలవిచ్చారు. (ఇబ్నెమాజ)

అవిశ్వాసులు, బహుదైవారాధకులు పసిపిల్లల పరిణామం గురించి ఆయన్ని (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రశ్నించగా, “వారి వ్యవహారం అల్లాహ్ కే ఎరుక (సహీహ్ ముస్లిం) అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. అయితే వేరొక సందర్భంగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయాన్ని కూడా విపులీకరించారు ఒకసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కలలో హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను చూచారు. ఆయన స్వర్గంలో కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ చిన్న పిల్లల సమూహం ఉంది. “వారంతా పసితనంలోనే – సహజ ధర్మంపై చనిపోయిన పిల్లలు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలిపారు. “ఓ దైవ ప్రవక్తా! మరి బహుదైవారాధకుల పిల్లల సంగతేమిటీ?” అని సహచరులు ప్రశ్నించగా “బహుదైవారాధకుల పసిపిల్లలు కూడా స్వర్గవాసులే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు.

ఒకసారి ప్రవక్త ప్రియ సహచరుని శిశువు చనిపోయింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్ని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ వార్తను విని, ‘ఓ దైవప్రవక్తా! ఆ శిశువు ధన్యజీవి. ఆ పసికందు స్వర్గంలోని పక్షులలో ఓ పక్షిగా చేరిపోయింది. ఆమె ఏ పాపమూ ఎరుగదు. పాపం చేసే కాలాన్ని కూడా పొందలేదు కదూ!’ అనన్నారు. దానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆయిషా! అల్లాహ్ స్వర్గం కొరకు కొందరిని, నరకం కొరకు కొందరినీ పుట్టించాడు.” అని బదులిచ్చారు. (సహీహ్ ముస్లిం)

ఆలోచించండి!

క్రైస్తవ మతం ఒక వైపు ‘బాప్టిజం’ పుచ్చుకోకుండా చనిపోయిన చిన్న పిల్లలను నరకంలోకి నెట్టివేస్తుండగా – రెండవ వైపు ఇస్లాం ఆ అన్నెం పున్నెం తెలీని అమాయక బాలల కొరకు స్వర్గ ద్వారాలు తెరుస్తోంది. పైగా అలాంటి చిన్నారి బాలల కోసం అంత్యక్రియలలో ఈ విధంగా ప్రార్థించమని ఆదేశించ బడింది: “అల్లాహ్! ఇతన్ని (ఈ పసికందును) నా కొరకు మునుముందు ఉపయోగపడే నిధిగా చేయి. ఇతన్ని నా కొరకు సిఫార్సు చేసే వానిగా, నీ కొలువులో ఇతని సిఫార్సు స్వీకారయోగ్యం అయ్యేలా చేయి.”

“సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ నూ, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయ పూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, యాచించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చేయడానికీ వ్యయ పరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించే వారూ, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటంలో స్థయిర్యం చూపేవారూ సన్మార్గులు. వాస్తవంగా అల్లాహ్ యెడల భయభక్తులు గలవారు వీరే.” (దివ్యఖుర్ఆన్- అల్ బఖర 177)

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

గ్రీకు తత్వవేత్తలలో రెండు కోవలకు చెందినవారున్నారు. ఒక కోవకు చెందినవారు ట్రాజెడీ ఫిలాసఫర్లుగా ప్రసిద్ధిచెందగా రెండవ కోవకు చెందిన వారు కామెడీ ఫిలాసఫర్లుగా పేరు మోశారు. మొదటి కోవకు చెందిన వారి ధోరణి ఎలా ఉంటుందంటే, ఏ విషయాన్ని వారి ముందుకు తీసుకు వచ్చినాసరే నిరాశా నిస్పృహలతో కూడిన ఫలితాలనే అన్వేషిస్తారు. వారికి ఈ ప్రపంచమంతా అంధకార బంధురంగా కానవస్తుంది. ఇక రెండవ కోవకు చెందిన తత్వవేత్తలు దీనికి పూర్తిగా విరుద్ధం. వారంతా సంబరాల రాంబాబులే. ఈ లోకంలో ఆడుతూ పాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ బ్రతకమనటం తప్ప మరొకటేదీ వారికి పట్టదు, గిట్టదు. మొదటి కోవకు చెందినవారు మౌనంగా ఉండమనీ, జీవితంలో జీవచ్ఛవంలా ఉండాలనీ, ఇదే ఈ లోకపు ఆఖరి మజిలీ అని అంటారు. రెండో కోవకు చెందినవారు – “తినండి, త్రాగండి, ఖుషీఖుషీగా ఉండండి, రేపటి గురించి చింతించకండి” అని అంటారు.

వాస్తవానికి నైతికత దృష్ట్యా ఈ రెండు వాదాలూ సంస్కరించదగినవే. మొదటి సిద్ధాంతంపై గనక నమ్మకముంచితే మనిషి శక్తియుక్తులన్నీ నిరర్ధకమైనట్లే. ఇక రెండవ సిద్ధాంతంపై నమ్మకం గలవాడు ఈ ప్రపంచపు ఆటపాటల్లో, విలాసాలలో మునిగిపోతాడు, మంచీ-చెడుల మధ్య ఉండవలసిన తేడా అతనికి తెలియకుండా పోతుంది. ఇస్లాం శిక్షణ యొక్క రహదారి ఈ రెండు కుడిఎడమల అపవాదాల మధ్యనుంచి వస్తుంది. అది ఒకవైపు ప్రపంచం క్షణభంగురమనే విషయాన్ని పదేపదే జ్ఞాపకం చేసి మనిషి మనసును అప్రమత్తత నుంచి రక్షిస్తూనే రెండవ వైపు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదని చెబుతుంది. చివరి ఘడియ వరకూ అల్లాహ్ పై ఆధారపడి జీవించే శిక్షణనిస్తుంది. ఇస్లాం శాసనాంగం ప్రకారం అల్లాహ్ పట్ల నైరాశ్యానికి లోనవటం అవిశ్వాసానికి ఆనవాలు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అది ఒక ముస్లింను నిరాశా నిస్పృహల లోయల్లోకి నెట్టి వేయదు. దివ్యఖుర్ఆన్ లో హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)కు దైవదూత ద్వారా ఇలా ఉపదేశించబడింది.

“(ఓ ఇబ్రాహీమ్!) మీరు నిరాశ చెందిన వారిలో చేరకండి.” (అల్ హిజ్ర్ -55)

హజ్రత్ యాఖూబ్ (అలైహిస్సలాం) తన కుమారులకు హజ్రత్ యూసుఫ్ ను గురించి దర్యాప్తు చేయమని చెబుతూ ఇలా ఉపదేశించారు:

“(ఓ నా కుమారులారా!) అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు.” (యూసుఫ్-87)

పాపపంకిలంలో కూరుకుపోయిన మానవ సముదాయాన్ని (ముహమ్మద్ అనుచర సమాజాన్ని) ఉద్దేశించి ప్రేమానురాగాలతో వెలుపరిస్తున్న ప్రకటనను చూడండి –

“మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలనూ క్షమిస్తాడు.” (జుమర్ – 53)

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సదా హదీసులలో మనిషిని ఆశాపూరితమయిన జీవితం గడపాలని తాకీదు చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు – “నేను నా దాసుని ఊహకు సమీపంగా ఉంటాను అని అల్లాహ్ సెలవిచ్చాడు”. (జామె తిర్మిజీ). అంటే మనిషి నా గురించి ఎలా ఊహించుకుంటే అలాగే జరుగుతుంది అని భావం. ఈ విషయంలో ఇస్లాం విశ్వాసానికి క్రింది ఆయత్ దర్పణం వంటిది:

“(ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా) ఎవడయితే విధేయుడో, రాత్రి ఘడియలలో (నమాజు చేస్తూ) నిలబడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో?!” (జుమర్ – 9)

అంటే; అతని హృదయంలో రెండు రకాల భావనలు ఉన్నాయి. పాపభీతి మరియు అల్లాహ్ సమక్షంలో సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉందన్న భావంతోపాటు అల్లాహ్ కారుణ్యం తనకు అండగా ఉంటుందన్న కొండంత ఆశ కూడా ఉంది. ఒకవైపు అల్లాహ్ ఆగ్రహానికి భయపడుతూ మరోవైపు అల్లాహ్ కారుణ్యంపై ఆశ పెట్టుకోవటం ఇదే ఇస్లాం బోధన. ఈ బాధ్యతా భావన అతన్ని మరుపుకు, అలసత్వానికీ లోను కానివ్వదు. విశృంఖలత్వానికి దారితీయనివ్వదు. అలాగే ఈ ఆశావహ దృక్పథం అతన్ని నిస్పృహలోకి నెట్టివేయదు. దుఃఖానికి, ఖేదానికి గురి కానీయదు. అందుకే ఒక ముస్లిం మనసు నిత్యం దుష్పరిణామం పట్ల భీతిచెందుతూ ఆశతో నిండి ఉంటుంది. ఈ విషయాన్నే సూచిస్తూ దివ్యఖుర్ఆన్ విశ్వాసులనుద్దేశించి ఇలా అంటోంది –

“అల్లాహ్ నుండి అవిశ్వాసులు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు.” (నిసా – 104)

ఆపద సమయాలలో ఒక విశ్వానికీ- అవిశ్వానికీ ఆంతర్యంలో ఉత్పన్నమయ్యే భావాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే మరి. అవిశ్వాసి తానెంచుకున్న ప్రతి పనినుండీ, ప్రతి ఆచరణ నుండి ప్రాపంచిక ప్రయోజనాలను ఆశిస్తాడు. అవి గనక అతనికి లభ్యం కాకపోతే నిరాశకు గురవుతాడు. అతని మనసు వ్యాకులత చెందుతుంది. భౌతిక విజయాన్నే సిసలయిన విజయంగా భావించటం మూలంగా అతని మనసు బాధపడిందన్నమాట. కాని ఒక విశ్వాసికి (మోమిన్ కి) ప్రాపంచిక విజయాలు ప్రాప్తించకపోయినా, గోచరమయిన ప్రయోజనాలు చేకూరకపోయినా అతను కలత చెందడు. అతనికి మనసు ప్రశాంతంగా, ప్రఫుల్లంగానే ఉంటుంది. ఎందుకంటే అతను సత్కార్యం చేశాడు. తన సత్కార్యానికి ప్రతిఫలం ఇక్కడ లభించకపోయినా అక్కడయినా తప్పక లభిస్తుంది. ప్రాపంచిక విజయం చేకూరకపోతే పోనీ, అల్లాహ్ ప్రసన్నత మరియు పుణ్యఫలం మాత్రం తప్పక లభిస్తాయి. ఈ విశ్వాసమే ఒక ముస్లింను సదాచరణ చేసే సమయంలో అతని మనసును కుదుటపరచి, సాహసవంతునిగా తీర్చి దిద్దుతుంది. అతనిలో చిత్తశుద్ధిని నూరిపోస్తుంది. ఏ మానవ సమాజంలో నయినా సరే మనిషి ఆలోచన ఈ దిశలో సాగినపుడు అక్కడ వైఫల్యాలు, నైరాశ్యాల నేపథ్యంలో ఆత్మహత్యలు జరగవు. ఉరేసుకుని చావటం, రైలు పట్టాలపై పడుకుని ప్రాణత్యాగం చేయటం, నిద్రమాత్రలు మింగి మృత్యువు ఒడిలోకి జారుకోవటం లాంటి సంఘటనలు దేనికి నిదర్శనాలు? ఇవన్నీ నిరాశా నిస్పృహలకు, ఓర్వలేనితనానికి ప్రతీకలు కావా? కాని అల్లాహ్ పై, పరలోకంపై దృఢ విశ్వాసం గల ముస్లింలో చరమ ఘడియ వరకూ ఆత్మహత్యా భావన ఏర్పడదు. అల్లాహ్ కృపవల్ల ఆఖరి క్షణం వరకూ అతనిలోని ఆశ అవిసిపోదు. అతడు ధనవంతుడయినా నిరుపేద అయినా, ఆరోగ్యవంతుడయినా, రోగగ్రస్తుడయినా, సంతాన ప్రాప్తిరస్తుడయినా – సంతానహీనుడైనా, సఫలీకృతుడయినా – విఫలుడయినా సర్వకాల సర్వావస్థల్లో అతడు ధైర్యంగా ఉంటాడు. ఆశాజీవిగా ఉంటాడు. ఆపదల్లో, అస్వస్థతలో, లేమిలో అతడు ఓరిమి వహిస్తూ అల్లాహ్ కారుణ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నైరాశ్యానికి తన మతంలో చోటులేదనీ, నైరాశ్యం అవిశ్వాసానికి తార్కాణమని భావిస్తాడు. తన కర్మకు ప్రతిఫలం ఇక్కడ లభించకపోయినా, అక్కడయినా తప్పక లభిస్తుందనీ, ఇది అల్లాహ్ వాగ్దానమని గట్టిగా నమ్ముతాడు. అతని ప్రభువు అతనికి ఈ విధమయిన వాగ్దానం చేసి ఉన్నాడు.

“మీలోని ఎవరి శ్రమనూ నేను వృథాగా పోనివ్వను.” (ఆలి ఇమ్రాన్ – 195)

మానవుల పరస్పర సంబంధ బాంధవ్యాల్లో, వ్యవహారాల్లో సౌమనస్యం, సదవగాహన, నమ్మకం లాంటి వాటిని అమలులో పెట్టడమే వాస్తవానికి నైతికత లేక సత్ప్రవర్తన. లేదా ఒండొకరిపై ఉన్న హక్కులు-బాధ్యతలను నెరవేర్చటమే సత్ప్రవర్తన అనుకుందాం. నైతికత యొక్క ఈ వాస్తవికతనుబట్టి అర్థమయ్యే దేమిటంటే మానవ సముదాయాల మధ్య సంబంధ బాంధవ్యాల ఉనికి ఉన్నప్పుడే నైతికతా ఉనికి కూడా ఉంటుంది. సన్యాసత్వం, బైరాగితనం, బ్రహ్మచర్యం వల్ల నైతికత మనుగడ సాగించజాలదు. ఏకాంత జీవితం గడపటం, ప్రజాజీవితంతో సంబంధాలను త్రెంచుకోవటం, సంఘజీవితంతో వేర్పడటం, బంధుత్వసంబంధాలను త్రెంచుకోవటం, సంసార జంఝాటాలతో తెగతెంపులు చేసుకోవటం లాంటి పోకడల మూలంగా “నైతికత” అనేదే ఉపయోగంలోకి రాదు. వచ్చినా అంతంతమాత్రంగానే వస్తుంది.

ఈ అంశంపై కొంత చర్చ అవసరం. ఎందుకంటే “భవబంధాలను త్రెంచుకుని ఏకాంత కుహరాల్లో జీవితం గడిపిన మనిషి మతావలంబనలో నికార్సుగా నెగ్గుకు రాగలిగాడు” అనే వాదన ఒకటి ఉంది. ఇస్లాంకు పూర్వం సన్యాసులు, బైరాగులు ఈ సూత్రంపైనే జీవితం గడిపేవారు. వారు మరియు వారి అనుయాయులు సయితం ఈ పద్ధతిని తమ సాత్వికతకు, సదాచరణకు సోపానంగా తలపోసేవారు. కాని యదార్థానికి ఆయా వ్యక్తులుగానీ, ఇజాలుగానీ సాధారణంగా ఈ పోకడను అనుసరించటంలోని ఉద్దేశం వేరే ఉంది. తాము ప్రజా జీవితానికి అల్లంత దూరాన ఉండటం మూలంగా సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత లభిస్తుందనీ, రాజులు చక్రవర్తుల పట్ల మాదిరిగా ప్రజలకు తమపట్ల కూడా ఒక విధమయిన భయము భక్తి కలుగుతాయనీ, ఆ విధంగా సమాజంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవచ్చుననీ ఈ ‘సన్యాసులు’ ఆశించేవారు. మరోవైపు తమ జీవితాన్ని తెరచాటున ఉంచుకుని బూటకపు పవిత్రతను, బూటకపు సాత్వికతను సంతరించుకోవచ్చు. ఇంకోవైపు ఈ ఏకాంత జీవితాన్ని ఆసరాగా పెట్టుకుని బంధుమిత్ర సంబంధాలనుండీ, హక్కులు, బాధ్యతల నుండి తప్పించుకోవచ్చు. ముక్తసరిగా చెప్పాలంటే ఇది ఒక విధమయిన పలాయన వాదం. అందుకే ఇస్లాం తన నైతిక సూత్రాలలో సన్యాసత్వం, బ్రహ్మచర్య, వైరాగ్య జీవితాన్ని ప్రోత్సహించలేదు. దైవప్రవక్త పదవి లభించిన తరువాత మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) 23 సంవత్సరాల పూర్తి కాలంలో ప్రజా బాహుళ్యంలోనే ఉండి, వారి మధ్యలోనే జీవితం గడిపి జీవిత సమస్యలను పరిష్కరించారు. ధర్మ ఖలీఫాల (రదియల్లాహు అన్హుమ్) జీవన విధానం కూడా ఇదే. ఏ కొద్ది మందినో మినహాయిస్తే ప్రవక్త ప్రియసహచరులందరి విధానం కూడా ఇదే. దివ్య ఖుర్ఆన్ చూపే మార్గం కూడా ఇదే. ఖుర్ఆన్ ఆది నుండీ అంతం వరకూ నిరంతర జీవన పోరాటాన్ని, మానవ సముదాయాల పట్ల సత్ప్రవర్తననే నొక్కి చెప్పింది. బ్రహ్మచర్యాన్నిగానీ, ఏకాంత వాసాన్నిగానీ, సన్యాసత్వాన్నిగానీ ప్రోత్సహించే ఒక్క వచనం కూడా దివ్యఖుర్ఆన్ లేదు.

సామాజిక హక్కులుగానీ, బాధ్యతలుగానీ సంఘంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సజావుగా నెరవేర్చబడతాయి. సంఘ జీవితంతో సంబంధం త్రెంచుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు. జనవాసాలకు కోసుల దూరంలో నిర్మానుష్య ప్రాంతాలలో, కొండల్లో కోనల్లో తపస్సు చేసుకునేవారు సామాజిక ఇక్కట్లను దూరం చేయగలరా? జాతులు నైతిక పతనానికి లోనుకాకుండా వాళ్లు చూసుకోగలరా? అంతదూరాన ఉంటూ అభాగ్యజీవులను ఆదుకోగలుగుతారా? అనాధల సంరక్షకులుగా ఉండగలుగుతారా? ప్రజాసేవకు సంబంధించిన ఏ చిన్న విభాగాన్నయినా వారు పర్యవేక్షించగలుగుతారా? వారు ప్రజలను మార్గ విహీనత, మార్గభ్రష్టతల నుండి ఆపగలుగుతారా? అంతెందుకు, వారు తమ స్వహస్తాలతో ఉపాధిని సంపాదించి బ్రతకగలుగుతారా? వాళ్లు ప్రజలకు సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించగలుగుతారా? ప్రజలను మంచి వైపుకు ఆహ్వానించి, చెడునుండి వారించే విధిని నిర్వర్తించగలుగుతారా? మరి చూడబోతే నైతికపరమయిన సదాచరణలను నెరవేర్చే చక్కని అవకాశాలు దొరకేది ఈ సందర్భాలలోనే. పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ఉపదేశించబడింది:

“విశ్వాసులారా! మీరు మిమ్మల్నీ, మీ ఆలుబిడ్డలనూ నరకాగ్నినుండి కాపాడుకోండి”. (అత్ తహ్రీమ్ – 6)

అంటే మానవుడు కేవలం తన్ను తాను అగ్నిగుండం నుండి కాపాడు కుంటే సరిపోదు, తనతోపాటు ఇతరుల్ని కూడా అగ్ని గుండం నుండి కాపాడ వలసిన బాధ్యత అతనిపై ఉంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమస్త ముస్లిముల నుద్దేశించి స్పష్టంగా ఇలా ఉద్బోధించారు. “కుల్లుకుమ్ రాయిన్ వ కుల్లుకుమ్ మస్ వూలిన్ అన్ రయీత” (మీలో ప్రతి ఒక్కరూ రెండోవాని విషయంలో బాధ్యులు మరియు పర్యవేక్షకులు. అతని పర్యవేక్షణలో ఉన్న వారందరి గురించీ అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది.) నాయకుడు తన నాయకత్వంలో ఉన్న ప్రజలకు కావలివాడు. పురుషుడు తన కుటుంబ సభ్యులకు బాధ్యుడు. భార్య తన భర్త ఇంటికి పర్యవేక్షకురాలు. (సహీహ్ బుఖారీ)

సామూహిక విపత్తులు వచ్చిపడినపుడు అవి పాపం చేయని నిర్దోషులను కూడా వదలిపెట్టవు. ఈ దావానలం లోపలున్న వారిని బయటవున్న వారినందరినీ కాల్చి భస్మీపటలం చేసివేస్తుంది. అందుకే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అవతరించిన ‘వహీ’ ఈ కోణాన్ని కూడా బహిర్గతం చేసేసింది.

“ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు.” (అన్ ఫాల్ -25)

పైపెచ్చు ఈ దావానలం దోషులను, నిర్దోషులనూ, విధేయులను, అవిధేయులను – అందరినీ చుట్టుముట్టేస్తుంది. సమాజం సమస్త పాపాలకు బాధ్యతవహించగా, పాపాలు తమ కళ్ల ముందరే జరుగుతున్నప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ సందేశ ప్రధాన బాధ్యతను విస్మరించిన పుణ్యాత్ములు కూడా దీని వాతన పడతారు. దివ్యఖుర్ఆన్ తెలియపరచబడిన శనివారం వాళ్ల గాథ మనందరికీ కనువిప్పు లాంటిది. ఆ గాథలో పాపాలు చెయ్యనివారినీ – సందేశ ప్రచార బాధ్యతను విస్మరించిన వారినీ కూడా పాపాత్ములలో చేర్చటం జరిగింది.

వాస్తవానికి ఈ ప్రపంచం కార్యక్షేత్రం, నిరంతర కృషికీ, పోరాటానికి పెట్టింది పేరు. ఇందులో మనుషులంతా పరస్పర సహకారంతో తమతమ గమ్యం వైపుకు సాగిపోతున్నారు. మార్గంలో అందరితో కలిసి పోతున్నప్పుడు నిశ్చయంగా ఎన్నో అడ్డంకులు, బాధలుంటాయి. ప్రతి ఒక్కరూ ఇతరుల బాధలను, వారి సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగవలసి ఉంటుంది. కాబట్టి తన సొసైటీలోని కష్టాలకు తాళలేక, కలవరం చెంది, కేవలం తన బరువును మాత్రమే తనపై వేసుకుని ముందుకు సాగిపోవాలనుకునేవాడు మగధీరుడు కాడు; వాడు వట్టి పిరికిపంద అనబడతాడు. అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు:

“జనులతో కలసి మెలసి ఉండని వానికంటే, వారి తరఫున ఎదురయ్యే కష్టాలపై ఓర్పు వహించని వానికంటే జనులతో కలసి మెలసి ఉండే, వారి తరఫున ఎదురయ్యే కష్టాలపై ఓర్పు వహించే ముస్లిం ఎంతో ఉత్తముడు.” (బైహఖీ, తిర్మిజీ)

ఏకాంతవాసానికీ, సంఘంతో తెగతెంపులు చేసుకోవడానికి ఒకే ఒక పరిస్థితిలో మాత్రమే అనుమతించబడుతుంది – అదెప్పుడు అంటే – ఆ సంఘ పెద్ద ఒక నీతి నియమాన్ని పాటించనంత చెడ్డవాడై ఉండాలి. సమాజంలో కలహాలు, కలతల దావానలం ఆర్పడానికి వీలులేనంతగా ప్రబలిపోయి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మంచిని ప్రేమించేవారు ఆ అగ్నిని ఆర్పి పరిస్థితిని అదుపులోనికి తీసుకురాగలిగే శక్తి బలం తమవద్ద లేదనుకుంటే అప్పుడు వారు ఆ సముదాయం నుండి వేరు కావచ్చు. ఉపద్రవాలు ప్రబలినపుడు సంఘాన్ని వదలి పెట్టే హదీసు ఇలాంటి పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుంది, అంతేగాని ప్రతి చిన్న విషయానికీ కాదు. బలవంతుడైన ప్రతి ముస్లిం ఇలాంటి పరిస్థితిలో దైవధర్మ ప్రచారం చేసి, మంచిని ప్రబోధించే విధిని నెరవేర్చి సమాజాన్ని రక్షించే పూర్తి ప్రయత్నం చేయాలి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు లోకానికి అందించిన విధానం ఇదే! పెద్ద పెద్ద సహాబా (ప్రవక్త ప్రియసహచరులు) సయితం తమతమ కార్యపరిధుల్లో ఉండి ఈ విధానాన్నే అవలంబించారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు. “చెడును తన చేత్తో ఆపటం, నిర్మూలించటం ప్రతి ముస్లిం విద్యుక్త ధర్మం. ఒకవేళ చేత్తో నిర్మూలించలేకపోతే నోటితో నిర్మూలించాలి. ఇదీ సాధ్యం కాకపోతే మనసులోనయినా దాన్ని చెడుగా భావించాలి. ఇది విశ్వాసం (ఈమాన్) యొక్క అత్యంత బలహీన స్థితి”, (సహీహ్ ముస్లిం-కితాబుల్ ఈమాన్)

ఇస్లాం యొక్క ఈ నైతిక సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరో నైతిక సూత్రం కూడా దానంతట అదే మన ముందుకు వచ్చేస్తుంది. అదేమంటే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణానుసారం సంఘంలోని వ్యక్తులపై వారి స్థోమతకు తగ్గట్టుగా – సంఘంలోని ఇతర వ్యక్తుల్ని పర్యవేక్షించే బాధ్యత కూడా మోపబడుతుంది. ఈ నైతిక బాధ్యతకు షరియత్ పెట్టిన పేరే “అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్” (మంచి గురించి ఉపదేశించటం, చెడు విషయాల నుండి వారించటం). దీనిని దివ్య ఖుర్ఆన్ ముస్లింల విశిష్ట గుణంగా అభివర్ణించింది:

  1. “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు.” (ఆలి ఇమ్రాన్ – 110)
  2. “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారందరూ ఒకరి కొకరు సహచరులు. వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు.” ప్రత్యేకంగా ఇలా ఆజ్ఞాపించబడింది (అత్ తౌబా-71)
  3. “మంచిని ఆజ్ఞాపించు. చెడు పనుల నుండి నిరోధించు.” (లుక్మాన్ – 17)
  4. ముస్లింల దైనందిన జీవన పరిస్థితి ఈ విధంగా ఉంటుంది – “వారు సత్యం, స్థయిర్యం గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉంటారు.” (అల్ అస్ర్)
  5. “వారు పరస్పరం సహన స్థయిర్యాల గురించి, దయా దాక్షిణ్యాలతో మెలగటం గురించి ఒండొకరికి తాకీదు చేసుకుంటూ ఉంటారు.” (బలద్ – 17)

ఇది ఎంతగొప్ప శిక్షణ అంటే – ప్రపంచంలోని మతాలన్నింటిలోనూ – ఇస్లాం యొక్క నైతిక పర్యవేక్షణా విధానాన్ని స్పష్టంగా వేరుచేసి చూపిస్తోంది. మనోనిబ్బరం, గుండె ధైర్యంగల వ్యక్తులు సొసైటీ స్వభావ స్వరూపాలను బేరీజువేస్తూ, సంఘ పెద్దలలో పొడసూపే చెడుగును ఎత్తిచూపుతూ ఉండాలనీ, ఇది వారి విద్యుక్త ధర్మమనీ ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది.

తౌరాత్లో “నేను నా సోదరునికి కావలివాడినా?” అన్న పలుకు ఒకటి ఉంది. క్రైస్తవ మతంలో కూడా ఇదొక ముఖ్య నీతిసూత్రంగా మారిపోయింది. ఈ నీతి సూత్రమే పాశ్చాత్య ప్రపంచంలో “వ్యక్తి స్వాతంత్య్ర పునరుద్ధరణ”గా రూపుదాల్చి చట్టపరమయిన అంశంగా ఉత్పన్నమయింది. అయితే ఇందుకు భిన్నంగా ఇస్లామీయ శాసనాంగంలో ప్రతి వ్యక్తీ తన సోదరునిపై కావలి వానిగానే ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు నిర్దిష్టంగా ఈ ప్రకటన చేశారు: “కుల్లుకుమ్ రాయిన్. వ కుల్లుకుమ్ మస్ ఊలిన్ అన్ రయీత” (మీలో ప్రతి ఒక్కడూ రెండోవాని విషయంలో బాధ్యుడు. అతని పర్యవేక్షణలో ఉన్న వారందరి గురించీ అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది). ప్రజలను మంచి వైపుకు దారిచూపే, చెడులనుండి ఆపే బాధ్యతను దివ్యఖుర్ఆన్ ముస్లింలపై అనివార్యంగా ఖరారు చేసింది. దీని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే సొసైటీలో లజ్జావ్రీడలు పరిఢవిల్లాలి. సంఘంపట్ల, సామాజిక కట్టుబాట్ల పట్ల ప్రజల్లో భయముండాలి. సమాజంలో సత్ప్రవర్తనకు ఆదరణ లభించాలి. దాంతోపాటు సమాజంలోని ప్రతివ్యక్తీ తనతోటి సోదరుణ్ణి మార్గవిహీనత యొక్క చీకట్లనుండి వెలికితీసి సన్మార్గపు వెలుగులో వేసే బాధ్యతను తనపై వేసుకోవాలి.

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇస్రాయీల్ సంతతికి సంబంధించిన ఒక గాథను విశదీకరించాడు. ఇస్రాయీల్ సంతతికోసం శనివారంనాడు ఏ రకమైన ప్రాపంచిక వ్యవహారంగానీ, వ్యాపారంగానీ చేయటం హరామ్ (నిషిద్ధం) గావించ బడింది. బనీ ఇస్రాయీల్ కు చెందిన ఒక తెగ సముద్ర తీర ప్రాంతంలో నివసించేది. వారు ఏదో ఒక సాకు చెప్పి శనివారం నాడు చేపలు పట్టుకునేవారు. (అదేమిటోగాని ఆ రోజే చేపలు అధికంగా లభించేవి. అంటే అది వారి పాలిట ఒక పరీక్షగా మారిందన్నమాట!) ఆ జనవాసంలో మూడు వర్గాల వారుండేవారు. ఒక వర్గం బహిరంగంగా అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లంఘించి నిర్భయంగా పాపకార్యాలు చేసేది. రెండో వర్గం వారు చెడులనుండి ప్రజలను నిరోధించే వారు. అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించరాదని జనులకు ఉపదేశించేవారు. మూడో వర్గానికి చెందిన వారు పాప కార్యాలకైతే పాల్పడేవారు కారు గాని పాపాల నుండి ప్రజలను ఆపేవారు కూడా కాదు. పైగా చెడులనుండి వారించే వారి నుద్దేశించి, “ఇలాంటి మూర్ఖుల్ని ఉపదేశించి ప్రయోజనమేమిటీ? వారు చేసే అపరాధానికిగాను అల్లాహ్ ఏదో ఒకనాడు వాళ్లని శిక్షించకపోతాడా ఏమి?” అని అనేవారు. కాని ఆ బస్తీపై అల్లాహ్ శిక్ష అవతరించగా, చెడుల నుండి నిరోధించే రెండోవర్గం మాత్రమే సురక్షితంగా ఉండగలిగింది. మొదటి వర్గం వారునూ, మూడవ వర్గం వారునూ వినాశానికి గురయ్యారు. మొదటి వర్గం తమ పాపాల కారణంగా నాశనమవగా, మూడవ వర్గం ధర్మసందేశ బాధ్యతను విస్మరించిన కారణంగా శిక్షించబడింది. ఆరాఫ్ సూరాలోని 20వ రుకూలో ఈ వృత్తాంతం వచ్చింది. ఆఖరిలో ఇలా అనబడింది –

“వారిలోని ఒక వర్గం వార్డు మరొక వర్గం వారితో ఇలా అన్నారు: ‘మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు – అల్లాహ్ నాశనం చేయనున్న వారికి లేక కఠినంగా శిక్షించనున్న వారికి?’ వారు ఇలా సమాధానం చెప్పారు: ‘మేము మీ ప్రభువు ముందు క్షమింపబడటానికి ఒక కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము.’ చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధలను పూర్తిగా విస్మరించినప్పుడు, మేము చెడునుండి ప్రజలను వారించేవారిని రక్షించాము. దుర్మార్గులైన ఇతరు లందరినీ వారి అవిధేయతల కారణంగా కఠిన శిక్షకు గురిచేశాము.” (అల్ ఆరాఫ్: 164,165)

ఇస్లాం దృష్టిలో తోటి సోదరులను జారిపడకుండా ఆపటం, జారిపడే వారిని చేయూతనిచ్చి నిలపటం ఎంత ముఖ్యమో ఈ గాథ చెబుతోంది. ఈ నైతిక బాధ్యతను నెరవేర్చకపోతే కలిగే దుష్పరిణామం ఎటువంటిదో కూడా బోధపడుతోంది. అయితే హితబోధ చేసిన తరువాత సాటి సోదరుని బాధ్యత తీరిపోతుంది. బలవంతం చేయటం అతని విధికాదు. ఆఖరికి ప్రవక్తలు కూడా తమ జాతి వారిని బలవంతంగా ఒప్పించరు.

“ప్రవక్త పని సందేశాన్ని అందించటం వరకే.” (అల్ మాయిద, నూర్)

ఈ బాధ్యత గనక నెరవేరిందంటే, అతని తలపై ఉన్న భారం దిగిపోయినట్లే. అందుకే అల్ మాయిద సూరాలో ఈ విధంగా ఉపదేశించబడింది:

“విశ్వాసులారా! మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు గనక స్వయంగా సన్మార్గంలో ఉంటే, ఇతరులు మార్గభ్రష్టులైనప్పటికీ మీకు ఎంత మాత్రం హాని కలగదు.” (అల్ మాయిద:105)

హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ పవిత్ర వచనాన్ని పఠించిన పిదప జనులనుద్దేశించి ఇలా అన్నారు:

“ఈ ఆయతులోని బాహ్య అర్థం మిమ్మల్ని మోసంలో పడవేయరాదు సుమా! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను. (ఆయన ఏమని ప్రవచించారంటే), దుర్మార్గుడు దుర్మార్గానికి పాల్పడుతుండగా ప్రజలు చూచి కూడా అతని రెండు చేతుల్ని పట్టుకోకపోతే బహుశా వారందరూ శిక్షకు గురికావచ్చు.”

ఈ ఆయతు సారాంశమేమిటని మరో సహాబీ అబూ షాలబ (రదియల్లాహు అన్హు)ను ప్రశ్నించగా ఆయన ఇలా జవాబిచ్చారు:

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ ఆయతు గురించి అడగ్గా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: ‘ముమ్మాటికీ కాదు. పరస్పరం మంచిని చేయమని ఆజ్ఞాపించండి. చెడు నుండి ఒండొకరిని ఆపండి. అయితే పేరాశ, పిసినారితనాలకు విధేయత కనబరుస్తున్నప్పుడు, మనో వాంఛలకు బానిసలైనప్పుడు, ధర్మంపై ప్రపంచానికి ప్రాధాన్యత నిస్తున్నప్పుడు, ప్రతి ఒక్కడూ తన అభిప్రాయమే సరైనదని విర్రవీగినప్పుడు ప్రజలను వదలిపెట్టి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీ తరువాత ఒక కాలం రానున్నది. అప్పుడు (దైవధర్మంపై) నిలకడ కనబరచడం అగ్ని జ్వాలను చేత్తో పట్టుకోవటం వంటిదే.” (తిర్మిజీ)

ఇస్లాం యొక్క ఈ బోధనలు “నేను నా సోదరునికి కావలి వాడినా?” అన్న లోప భూయిష్ట సిద్ధాంతాన్ని రద్దుపరచాయి. యదార్ధమేమిటంటే నైతిక ఉపదేశాలను సమాజం తన చెప్పుచేతల్లో తీసుకోనంత వరకూ అవి సురక్షితంగా, స్వచ్ఛంగా ఉండజాలవు. జాతుల రీతులు, ఆచార సంప్రదాయాలు ఈ నియమాలపైన్నే నెలకొని ఉన్నాయి. మరో గమనార్హ విషయమేమిటంటే నైతిక వ్యవహారాలు పైకి ఒక వ్యక్తి యొక్క ప్రైవేటు లేక స్వంత విషయాలుగా కాన వస్తాయి. వాటి లాభం లేక నష్టం కూడా ఆ వ్యక్తి అవలంబనతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కాస్త నిశితంగా చూస్తే, మరి కాస్త లోతుగా ఆలోచిస్తే వాటి పరిణామాలు యావత్తు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనీ, ఒకరి నుండి రెండో వ్యక్తి వరకు, రెండో వ్యక్తి నుండి మూడో వ్యక్తి వరకు ఇలా సమాజమంతా వాటి ప్రభావానికి గురవుతుందన్న సంగతి బోధపడుతుంది.

ఇంకొక విషయమేమిటంటే ఆ చెడుల చెడుగు చాలా స్వల్ప విషయంగా తోస్తుంది. ప్రజలు దానిని చాలా చిన్న విషయంగా తలపోసి ఊరుకుంటారు. వీటిని నిరోధించక పోయినట్లయితే క్రమక్రమంగా ఈ విష ప్రభావం సొసైటీ నంతటినీ ఆవహిస్తుంది. ఆఖరికి జన సామాన్యం ఈ చెడులను చెడుగా భావించటానికి కూడా జంకుతారు. ఫలితంగా కొన్నాళ్ళకు యావత్తు జాతి నైతిక స్వభావమే మారిపోతుంది. (భ్రష్టుపట్టి పోతుంది) ఆ జాతి తన ఉన్నత ప్రమాణం నుంచి పడిపోతుంది. ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒక సమావేశంలో తన ప్రియసహచరులనుద్దేశ్యించి ప్రబోధించారు. ‘బనీ ఇస్రాయీల్లో నైతిక పతనం ఇలాగే మొదలయింది. ఆ సంతతిలో చెడులు ప్రబలిన తొలి రోజుల్లో వారి పండితులు ఆ చెడుల నుండి వారించారు. కాని ఆ చెడులను జన సామాన్యం వదలలేకపోయింది. అయినప్పటికీ (ఆ పండితులు) వారితో కలసి కూర్చోవటం, తిరగటం, తినటం అన్నీ చేసేవారు. సహవాస దోషంతో వాళ్లు కూడా ప్రజల మాదిరిగానే తయారయ్యారు. అల్లాహ్ దావూద్ (అలైహిస్సలాం) మరియు ఈసా (అలైహిస్సలాం)ల ద్వారా ఆ జాతిని ధూత్కరించాడు”. ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒదిగి కూర్చున్నారు. తరువాత ఇలా చెప్పారు: “కాదు. మీరు దుర్మార్గుని చేయిపట్టు కోనంతవరకూ, సత్యం వైపుకు అతన్ని వంచనంతవరకూ” (జామె తిర్మిజీ)

ఇదీ ఈ అంశం క్రింద మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చేసిన హితబోధ.

అయితే మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడులనుండి వారించే ఈ బాధ్యత ప్రతి సాధారణ వ్యక్తిదీ పామరునిదీ కాదు. దీని అవగాహన లేనివారు కూడా దీనిని తమపై వేసుకుంటే అది ఉపద్రవానికి దారితీసే ఆస్కారముంది. స్వయంగా ఈ చెడులకు దూరంగా ఉన్నవారే తొలుత ఈ బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది. దివ్య ఖుర్ఆన్ సెలవీయబడింది –

“సన్మార్గాన్ని అవలంబించమని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటీ?” – (అల్ బఖర 44)

అలాగే ఉపదేశం చేసేటప్పుడు ఎంతో ఓర్పుతో, నేర్పుతో మృదుత్వంతో చేయటం కూడా ఎంతో అవసరం. స్వయంగా దైవ సందేశహరులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఉద్దేశించి ఇలా తాకీదు చేయబడింది –

‘ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో, చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమమయిన రీతిలో వాదించు.” (అన్ నహ్ల్ – 125)

దైవ ప్రవక్తలయిన హజ్రత్ మూసా, హజ్రత్ హారూన్ (అలైహిముస్సలాం) లను దైవధిక్కారి అయిన ఫిర్ ఔన్ చక్రవర్తి వద్దకు పంపిస్తున్నప్పుడు అల్లాహ్ చేసిన ఉపదేశం ఏమిటో చూడండి –

“మీరిరువురూ వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి”. (తాహా -44)

వేరొక చోట ఈ విధంగా హితబోధ చేయబడింది –

“వారికి నచ్చజెప్పు. వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధచేయి.” (అన్ నిసా – 63)

ప్రజలు మంకుతనానికి పోకుండా, హఠం చేయకుండా ఉండగలందులకే ఇన్ని విధాలుగా జాగ్రత్తపడటం జరిగింది. ఈ ముందు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే మంచి వ్యాప్తి చెందే బదులు చెడులు పెచ్చరిల్లే ప్రమాదముంది.

“అమ్ర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్” అసలు ఉద్దేశ్యం సమాజాన్ని సంస్కరించటం, సంఘ సభ్యుల నైతికతను పరిరక్షించటం. అంతేగాని ఇతరులు వ్యక్తిగత విషయాలలోకి తలదూర్చి, కూపీలు తీసి రచ్చకీడ్వటం కాదు. ఇలా కూపీలు తీయడాన్ని ఇస్లాం నిషేధించింది. ఒక ముస్లిం ఇంట్లో జొరబడి అతని అంతర్గత విషయాలను బయటకి రాబట్టే అధికారం అనుమతి మరో ముస్లింకు ఎంతమాత్రం లేదు.

ఈ రకమయిన సంస్కరణా విధానం వల్ల కక్షలు, కార్పణ్యాల ద్వారం తెరుచుకుంటుంది. దీనివల్ల ఏ వ్యక్తీ తన ఇంట్లో, సయితం సురక్షితంగా ఉండ లేడు. దీని వారింపులోని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే ఏ వ్యక్తయినా తన ఇంటి నాలుగు గోడల మధ్య దాక్కుని ఏదయినా చెడు పని చేస్తే దాని దుష్ప్రభావం కేవలం అతనొక్కనికే పరిమితం అవుతుంది. ఆ ప్రభావం సమాజంపై పడదు. అందుచేత సమాజానికి అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. అందులో ఉన్న మరో పరమార్థం ఏమిటంటే, ఏ వ్యక్తయినా తన ఇంట్లో కూర్చొని రహస్యంగా పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఇప్పటికీ అతనిలో లజ్జావ్రీడలున్నా యన్నమాట! ఈ లజ్జా గుణమే మునుముందు అతనిలో పరివర్తనను తీసుకు రావచ్చు. కాని ప్రజలు చాటుమాటుగా అతణ్ణి వెంటాడసాగారనుకోండి, అతను బెదిరిపోవచ్చు లేదా అతడు మొండి వాడుగా మారిపోవచ్చు. అతనిలో పరివర్తనకు దోహదపడే మంచి గుణం కాస్తా మటుమాయమై పోవచ్చు. ఒకరి ఇంట్లో లేక గదిలో అకస్మాత్తుగా ప్రవేశించడాన్ని ఇస్లాం నిషేధించడంలోని మర్మాలలో ఇది కూడా ఒకటి.

ఈ సందర్భంగా విస్మరించరాని విషయాలలో మరొకటి ఏమిటంటే లోపమున్న వ్యక్తి గురించి చాడీలు చెప్పరాదు. అంటే అతని పరోక్షంలో అతని లోపాలను ఎత్తి చూపరాదు. ఇది సంస్కరణా సరణి అనిపించుకోదు. సంస్కరణకు నడుం బిగించిన వ్యక్తి తన గురించి ఇతరుల ముందు ఈ విధంగా చెప్పుకుంటున్నాడని అతనికి తెలిస్తే సంస్కర్త పట్ల అతనిలో వ్యతిరేక భావన ఏర్పడవచ్చు. అదే గనక జరిగితే ఇక అతన్ని బాగుపరచే అవకాశాలన్నీ మృగ్యమై పోతాయి. అందుకే అతిగా అనుమానించటం, పరోక్ష నిందకు పాల్పడటం వంటివి ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఈ విధంగా సెలవీయబడింది –

“విశ్వాసులారా! అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూఢచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరయినా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను.” (అల్ హుజురాత్ – 12)

వీపు వెనుక ఒకరి గురించి చెడుగా చెప్పటం మృతకళేబరం మాంసాన్ని కొరికి తినటం వంటిదే. ఏ విధంగానయితే మృతుడు తన శరీరాన్ని భక్షకుల బారినుండి రక్షించుకోలేడో అదే విధంగా పరోక్ష నిందకు గురయ్యే వ్యక్తి కూడా తనపై వేయబడే నిందలకు జవాబు ఇవ్వలేడు. అందుకే పరోక్షనింద (చాడీలు)ను అత్యంత అసహ్యకరమైన చేష్టతో పోల్చటం జరిగింది. పరోక్షనింద ప్రబలిన చోట మంచిని పెంపొందించే కార్యక్రమం ముందడుగు వేయజాలదు. అంతేకాదు, పరోక్ష నిందకు గురైన వ్యక్తి సంస్కరణ కూడా దీనివల్ల సాధ్యం కాదు. పైగా నిందాస్త్రాలను ప్రయోగించే వ్యక్తి యొక్క నైతిక దివాలాకోరుతనం బట్టబయలవుతుంది. అందుకే అంతిమ దైవ సందేశహరుల వారు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “మీరు గనక ప్రజల తప్పులను ఎంచుతూ వెనుకబడ్డారంటే వారిని సర్వనాశనం చేసేస్తారు (జాగ్రత్త).” (సునన్ అబూదావూద్)

ఆలోచించండి!

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నైతిక ప్రబోధనలలో నైతికతకు సంబంధించిన ఎన్నెన్ని సున్నిత పరమార్థాలు నిబిడీకృతమై ఉన్నాయో కాస్త యోచించండి!

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవనానికి పూర్వం యూద, క్రైస్తవాల కాలం గడచింది. ఈ రెండు మతాలలోని వైపరీత్యాలను సరిచేసే ఒక మధ్యస్థ మతం కోసం ప్రపంచం ఎదురుచూడసాగింది. ప్రపంచం యొక్క ఈ అవసరాన్ని తీర్చడానికే ఇస్లాం ఆవిర్భవించింది.

ఇక ‘సమత్వం’-సమతూకం’ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ వస్తువే విశ్వ వ్యవస్థను నిలబెట్టి ఉంది. దయ, ఉపకారం, మృదుత్వమనే అంశాల మేళవింపు ఈ ‘సమతూకానికి’ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఇస్లాంకు పూర్వం మత రాజకీయం యొక్క ఈ రెండు అంశాలు వేర్వేరుగా ఉండేవి. ఫలితంగా అంత వరకూ విశ్వవ్యవస్థ అసంపూర్ణంగా ఉండేది.

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీఅత్ న్యాయబద్ధ మైనది. అయితే అందులో ఉపకారం, క్షమ వంటి నైతిక గుణాలు చాలా అరుదు.[1] అలాగే హజ్రత్ ఈసా (ఏసుక్రీస్తు) మూర్తీభవించిన కారుణ్యంగా ఏతెంచారు. కాని ఆయన షరియత్లో న్యాయాన్ని, సమతూకాన్ని నెలకొల్పే గుణం బహుకొద్దిగా ఉంది.[2] హజ్రత్ మూసా (అలైహిస్సలాం) షరియత్ ప్రపంచం కొరకు న్యాయం ధర్మాల నిబంధనలను నెలకొల్పగా, వాటికి ప్రతిగా హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) తన నైతిక ప్రబోధనలను ఈ మాటల్లో ప్రకటించారు :

“కన్నుకు బదులు కన్ననీ, పన్నుకు బదులు పన్ననీ మీరు విని ఉంటారు.[3] కాని నేను మీకు ఉపదేశిస్తున్నాను – చెడును చెడుతో ఎదుర్కొనకండి. పైగా మీ కుడి చెంపపై కొడితే మరో ఎడమ చెంపను అతనికి ఇవ్వండి. ఎవరయినా మీతో జగడానికి దిగి మీ చొక్కా పట్టుకుంటే దుప్పటిని కూడా అతనికి ఇచ్చి వేయండి. ఎవరైనా ఒక కోసు దూరం మీ వెంటవస్తే మీరు అతని వెంట రెండు కోసులు నడచివెళ్లండి. మిమ్మల్ని అడిగే వారికి మీరు ఇవ్వండి. మీనుండి రుణాన్ని ఆశించిన వారిని మీరు (లేదని) వాపసు చేయకండి.”

“మీ మిత్రుల్ని ప్రేమించాలనీ, మీ శత్రువుల పట్ల వైర వైఖరి ననుసరించాలనీ చెప్పగా మీరు విని ఉంటారు. అయితే మీ శత్రువులను ప్రేమించాలని నేను మీకు తాకీదు చేస్తున్నాను.” (మత్తయి – 5వ అధ్యాయం)

హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)కు పూర్వం ఈ ప్రపంచంలో నడచిన శాసనం ఏదంటే అది హజ్రత్ మూసా (అలైహిస్సలాం) తెచ్చిన శాసనమే. ఈ శాసనం పూర్తిగా న్యాయబద్ధమైనది. అయితే ఆ తర్వాత ఈ ప్రపంచం హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) నోట వెలువడిన నీతిబోధను విన్నది. శిరసావహించింది. ఈ నీతి బోధ ఆసాంతం దాక్షిణ్యంతో, పరోపకారభావంతో కూడుకున్నది. అయితే ఇస్లాం ఒకవైపు న్యాయాన్నీ, మరోవైపు పరోపకారాన్ని కూడా మేళవిస్తూ ప్రాపంచిక పరిపాలనా వ్యవస్థకు పరిణతినీ, పరిపక్వతనూ ప్రసాదించింది.

“న్యాయం చెయ్యండి, ఉపకారం చెయ్యండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు.” (అన్ నహ్ల్-90)

మూసా, ఈసాల వేర్వేరు విధానాలను సమ్మిళితం చేసి సమతౌల్యాన్ని సాధించే సైద్ధాంతికమయిన ఆదేశం ఇది.

న్యాయం, ఉపకారాల నిజ భావనను అర్థం చేసుకునేందుకు ఇక్కడ కొంత వివరణ అవసరం. చట్టం లేక శాసనం అనేది వాస్తవానికి ‘అదల్’ పై ఆధారపడి ఉంది. ‘అదల్‘ అంటే సమత్వం, సమతూకం అని అసలు అర్థం. ఎవరయినా ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే అతని పట్ల కూడా సరిగ్గా అదే విధమయిన వ్యవహారం చేస్తే అది ‘అదల్’ అవుతుంది. కాగా అటువంటి వ్యక్తిని వదలివేయటం, క్షమాభిక్ష పెట్టడం, మన్నింపుల వైఖరిని అవలంబించటం – ఇది ‘ఇహ్సాన్’ (ఉపకారం). ఇస్లాంలో ఈ రెంటికీ వేర్వేరు అంతస్థులు ఉన్నాయి. న్యాయవ్యవస్థను ఆయన ఒక సంఘానికో, లేక ఒక ప్రభుత్వానికో ఇచ్చాడు. ఇది ఒక వ్యక్తి పని ఎంత మాత్రం కాదు. అయితే ‘ఇహ్సాన్’ (ఉపకారం) అవేది వ్యక్తులందరి చేతుల్లో ఉంటుంది. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం. సమాజమయినా, ప్రభుత్వమయినా న్యాయ వ్యవస్థపైనే నెలకొంటుంది. దీనిని గనక రూపుమాపితే సమాజం మరియు ప్రభుత్వం యొక్క పునాదులే కదలిపోతాయి. అదే గనక జరిగితే వ్యక్తుల ధన మాన ప్రాణాల రక్షణకు ఇక గ్యారంటీ ఇచ్చేవారే ఉండరు. కనుక న్యాయ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టడం అరాచకానికీ, అవ్యవస్థకు ద్వారం తెరవటం వంటిదే. కాని సెయింట్ పాల్ ఈ పనే చేసి క్రైస్తవ జగతి ముందు సరికొత్త పోకడను ప్రవేశపెట్టాడు. తౌరాత్లోని న్యాయశాసనాన్ని సమూలంగా రూపుమాపాడు. న్యాయ శాసనం లేకుండా కేవలం నీతి సూత్రాల భరోసాపై భూమండలంలోని ఏ ఒక్క ద్వీపంలో కూడా శాంతిభద్రతలు నెలకొల్పడంగానీ, సామాజిక రుగ్మతలను నిరోధించటంగానీ సాధ్యపడలేదు. స్వయంగా క్రైస్తవ రాజ్యాల చరిత్రే దీనికి ప్రబల సాక్షి!

గమనార్హమైన మరో విషయం ఏమిటంటే ఒక వ్యక్తి సమాజంలోని ఒక సభ్యునిపై అత్యాచారానికి పాల్పడితే ఆ పాపం యదార్థానికి అతనొక్కనిదే కాదు; యావత్తు సామాజిక వ్యవస్థకు అది వర్తిస్తుంది. మొదటిసారి అత్యాచారానికే అతన్ని నిలదీసి మెడలు వంచకపోతే అతను మలిసారి కూడా మరింత నిర్భయంగా చెలరేగి అదే పాపానికి ఒడిగట్టవచ్చు. మరో వ్యక్తి జీవితంతో కూడా అతడు ఆడుకోవచ్చు. అందుచేత తనను బాధ పెట్టిన దుర్మార్గునికి క్షమించి వదలిపెట్టే పూర్తి అధికారం బాధితునికి లేదు. ఎందుకంటే ఆ బాధిత వ్యక్తి ఈ విధంగా దుర్మార్గుని పట్ల మంచి వ్యవహారం చేసి సమాజంలోని వేలాది మందికి పరోక్షంగా కీడు కలిగిస్తున్నాడు. అందుకే నీతీ నియమాలను న్యాయశాసనాల స్థానంలో ప్రవేశపెట్టేముందు లోతుగా ఆలోచించి, ఆచితూచి అడుగువేయవలసి ఉంటుంది. ముహమ్మద్ వారి(సల్లల్లాహు అలైహి వసల్లం) గారి షరీయత్లో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోబడ్డాయి. ఎందుకంటే అది ప్రపంచానికి శాశ్విత ప్రాతిపదికన అందజేయబడిన శాసనమాయె!

మరి ప్రపంచంలో మనుషులంతా ఒకే విధంగా ఉండరు. స్వభావాలు, ప్రవృత్తులు వేర్వేరుగా ఉంటాయి. కొందరు సాధు స్వభావులు, మృదుమనస్కులు, సహనశీలురు అయి ఉంటారు. క్షమాభిక్ష పెట్టడం, సడలింపుల వైఖరిని అవలంబించటం, ప్రతీకారం తీర్చుకోకపోవటం – ఇలాంటి వారికి సులువే. కాని సొసైటీలో మరికొందరు ఆవేశపరులు, ఆగ్రహోదగ్రులు, కఠిన మనస్కులు, పట్టుదల గలవారు కూడా ఉంటారు. ప్రతీకారం కోసం వారు పరితపిస్తూ ఉంటారు. ప్రతీకారానికి మించి కూడా ఆశిస్తూ ఉంటారు. అటువంటి వారిని ‘దెబ్బకు దెబ్బ’ సరిపోతుందని నచ్చజెప్పి, అంతకు మించిన చర్యకు ఒడిగట్టకుండా ఆపగలిగితే చాలు. అందుచేత యావత్తు ప్రపంచాన్ని సంస్కరించడానికి వచ్చిన విశ్వజనీన షరీయత్లో అదల్ (న్యాయం) మరియు ఇహ్సాన్ (ఉపకారం) – రెండింటి మేళవింపు ఎంతో అవసరం.

పైన పేర్కొనబడిన వాక్యాల సారాంశం ఏమిటంటే, ప్రపంచంలో శాంతిభద్రతల్ని పరిరక్షించడానికి, న్యాయం ధర్మాలను నెలకొల్పడానికీ, అశాంతి అలజడులను, సామాజిక రుగ్మతలను నివారించడానికి రెండు వస్తువుల అవసరం ఎంతైనా ఉంది. అవే 1) శాసనం 2) నీతి. ఈ రెండింటి మౌలిక ఉద్దేశ్యం ఒక్కటే అయినప్పటికీ వాటి లక్ష్యసాధనకై గల మార్గాలు వేర్వేరు. ఆ రెండింటినీ విడదీసి ఒక్కొక్క దాన్నీ తరచిచూస్తే ప్రతి దానిలో ఏదో ఒక కోణం నుంచి ఎంతోకొంత వెలితి కనిపిస్తుంది. ఆ వెలితి రెండవ దాని ద్వారా పూడుతుంది. శాసనం (చట్టం) చెడునయితే ఆపగలుగుతుందిగానీ, ఆ చెడుకు సంబంధించి మనిషిలోని మనసులో ఏహ్యభావాన్ని సృజించే ఆధ్యాత్మిక ప్రక్రియను మాత్రం కొనసాగించజాలదు. కాగా; నైతిక విధానాన్ని అవలంబించే విషయమై ప్రతి వ్యక్తినీ బలాత్కరించజాలము. అంచేత నీతి సూత్రాల ద్వారా సమాజంలో చట్టాలను అమలు చేయటం, రుగ్మతలను రూపుమాపటం సాధ్యం కాదు. తౌరాత్ కేవలం శాసనాంగం కాగా, బైబిల్ కేవలం నైతిక విధానం. అందుకే ఇవి రెండూ వేర్వేరుగా ఉండి శాంతిభద్రతలను, న్యాయశాసనాలను నెలకొల్పడంలో, అరాచకం అవ్యవస్థలను నిర్మూలించటంలో సఫలీకృతం కాలేకపోయాయి. అయితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెచ్చిన షరియత్ న్యాయంతో పాటు ఉపకారభావాన్నీ, శాసనంతో పాటు నైతికతను కూడా సంతరించుకుంది. అదే దాని విశిష్టత. అది న్యాయశాసనం మరియు నీతి – రెండింటి మధ్య ఉండవలసినంత దూరాన్ని ఉంచి వాటి హద్దులను నిర్ధారించింది. అది తన షరీఅత్ గ్రంథంలో చట్టాన్ని చట్టముండవలసిన స్థానంలో, నైతికతను నైతికత ఉండవలసిన స్థానంలో ఉంచి మానవతను పరిపూర్ణ స్థితికి చేర్చింది.

ఒకరి నుండి ఇంకొకరికి సోకే ఈ చెడుల మహమ్మారిని అరికట్టే అంశాన్ని ఇస్లాం చట్టానికి లోబడి ఉండేటట్లు చేసింది. ఉదాహరణకు మానవ హత్య, దొంగతనం, వ్యభిచారం, అభాండాలు మోపటం మొదలగు చెడుగులు. ఇలాంటి అపరాధాలకు గాను దివ్య ఖుర్ఆన్ శిక్షలను నిర్ధారించింది. ఈ శిక్షలు ఇస్లామీయ ప్రభుత్వం తరఫున విధించ బడవచ్చు. మరే విషయాలయితే మనిషి వ్యక్తిగతంతో ముడిపడి ఉంటాయో వాటిని అది నైతిక పరిధుల్లో ఉంచింది. ఉదాహరణకు : అసత్యం పలుకకుండా ఉండటం, దయ చూపటం, పేదలకు సహాయ పడటం ఇత్యాదివి. ఈ విధంగా షరీయతె ముహమ్మదీ (సల్లల్లాహు అలైహి వసల్లం) అటు శాసనానికీ ఇటు నీతికీ సంగమం వంటిది.

ఇంకొక విధంగా కూడా ఇస్లాం చట్టం మరియు నీతి యొక్క సమ్మిశ్రమము. అదెలాగంటే చట్టరీత్యా అది ప్రతి బాధిత వ్యక్తికీ, హక్కుదారునికీ ప్రతీకారం తీర్చుకునే లేక క్షమాభిక్ష పెట్టే స్వేచ్ఛనొసగింది. అతను గనక తలిస్తే తౌరాత్ ఆదేశానుసారం ప్రతీకారమూ తీర్చుకోవచ్చు; అలా గాకుండా మేలు చేయదలచి బైబిల్ అనుసారం దుర్మార్గుణ్ణి క్షమించి వదలివేయనూ వచ్చు. అంటే అపకారానికి బదులు ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయవచ్చు. ఈ సమగ్ర శిక్షణ అటు ప్రభుత్వ శాసన వ్యవస్థను, ఇటు వ్యక్తి నైతిక రీతినీ రెంటినీ తమతమ స్థానాలలో నెలకొని ఉండే అవకాశం కల్పిస్తుంది. అందుకే అది మానవ జాతుల రక్షణ, ప్రగతీ వికాసాలకు సంబంధించిన పూర్తి హామీనిస్తుంది. అది న్యాయ శాసనాల ఆధారంగా న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించడానికి గట్టి చర్యలు తీసుకునే శక్తిని కలిగి ఉండటంతో పాటు, నీతీ నడవడికల ద్వారా ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి కూడా తోడ్పాటునిస్తుంది. అది యూదుల షరీయతు మాదిరిగా మృతశరీరమూ కాదు, క్రైస్తవుల ఉపదేశాల మాదిరిగా స్పందన లేని ఆత్మ కూడా కాదు. పైగా అది శరీరం మరియు ఆత్మల కలయిక. భావాలు భావనలతో కూడుకున్న నిండు ఆకారం.

మూసా, ఈసా, ముహమ్మద్ ల నైతిక ప్రబోధనలలో పరస్పరం ఉన్న సున్నిత వ్యత్యాసానికి కారణం ఈ శాసనం మరియు నీతి వేర్పాటు పర్యవసానమే. ఇస్లామీయ చట్టాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది వ్యతిరేకులు, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలలో నైతిక స్ఫూర్తి లేదని విమర్శించారు. కాని ఈ విమర్శకులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చట్టాలతోపాటు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నైతిక ప్రబోధనలను కూడా ముందు పెట్టుకుని చూస్తే వారి సందేహాలకు ఆస్కారమే ఉండేది కాదు. తేలిందేమంటే ‘తౌరాత్’ యొక్క న్యాయసూత్రం ప్రతీకారభావంపై ఆధారపడి ఉంది. అది ఇలా ఆదేశిస్తోంది –

“….. కనుక మనిషిని వధించిన వాడు వధించబడతాడు. మరెవరయినా తన పొరుగు వారికి బాధకలిగిస్తే చేసిన దాన్ని అనుభవిస్తాడు. విరగ్గొట్టిన దానికి బదులు విరగ్గొట్టడమే. కన్నుకు బదులు కన్నే. పన్నుకు బదులు పన్నే”

బైబిల్ ప్రబోధన ఆసాంతం క్షమతో కూడుకున్నది. యుక్తితో కూడిన దాని ఉపదేశం ఇలా సాగుతుంది –

“కన్నుకు బదులు కన్ననీ, పన్నుకు బదులు పన్ననీ చేసిన ఉపదేశాన్ని మీరు విని ఉన్నారు. అయితే దుర్మార్గుణ్ణి ప్రతిఘటించరాదనీ, కుడి చెంపపై కొడితే రెండవ వైపు చెంప అతనికి సమర్పించాలని నేను మీకు ఉపదేశిస్తున్నాను. (మత్తయి: 5-38)

అయితే ఆపాదమస్తకం ఆధ్యాత్మికత, నైతికతతో కూడుకున్న ఈ విధానంపై ప్రపంచ వ్యవస్థ ఒక్కగానొక్క రోజుకూడా నడవజాలదు. ఏ క్రైస్తవ జాతిగానీ, క్రైస్తవ రాజ్యంగానీ, ఏనాడయినా ఈ కారుణ్య ఉపదేశంపై అమలు చేసిందా? అంటే ‘లేద’నే జవాబు వస్తుంది. అదే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందజేసిన విధానం క్షమాపణతో పాటు న్యాయసమ్మతమైన ప్రతీకారంతో కూడా కూడుకుని ఉంది. చట్టంతోపాటు నీతి నియమాన్ని కూడా పుణికి పుచ్చుకుని ఉంది. అందులోని న్యాయం చట్టరూపంలో ప్రతిపాదించ బడగా, ఉపకారం ‘నైతిక విధానం’గా ప్రపంచానికి ప్రవేశపెట్టబడింది. ఇస్లాంలోని ఆదేశాలన్నింటి లోనూ ఈ రెండు సిద్ధాంతాలు పాదరసంలా ప్రవహిస్తున్నాయి. ఈ చర్చనీయాంశం క్రింద తౌరాత్, బైబిల్ లోని ఆదేశాలు ఏ విధంగానయితే పైన పేర్కొనబడ్డాయో అదేవిధంగా మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా లోకానికి అందజేయబడిన ప్రబోధనలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాము.

“విశ్వసించిన ప్రజలారా! హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడయితే, ఆ స్వతంత్రుణ్ణి శిక్షించాలి. బానిస అయితే ఆ బానిసనే వధించాలి. స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి.” (అల్ బఖర: 178)

ఇదయితే ప్రతీకార న్యాయానికి సంబంధించిన శాసనం. ఆ తరువాత వెంటనే నైతిక ఉపదేశం కూడా వస్తుంది.

“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే, న్యాయ సమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్త ధనాన్ని ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం; కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులను అతిక్రమించే వారు ఘోర శిక్షకు గురవుతారు.” (అల్ బఖర – 178)

పై వచనంలో గల ఔదార్యంపై కాస్త ఆలోచించండి. హంతకునికీ హతుని వారసులకు మధ్య బద్ద వైరం ఉన్నప్పటికీ కనికార వైఖరిని ప్రదర్శించే ఉద్దేశ్యంతో హంతకుణ్ణి హతుని వారసులు సోదరునిగా సంబోధించటం జరిగింది. తౌరాత్ గ్రంథంలో హంతకునికి క్షమాభిక్ష పెట్టే అధికరణ లేనందున (ఖుర్ఆన్లో) క్షమాపణను ఒక సౌలభ్యంగా, కారుణ్యంగా అభివర్ణించటం జరిగింది. హంతకునికి “మేలు” గురించి జ్ఞాపకం చెయ్యటం జరిగింది. హతుని వారసులకు క్షమాభిక్ష యొక్క గొప్పదనం గురించి ఉపదేశించటం జరిగింది. రక్తపరిహారం పుచ్చుకున్న పిదప కూడా ప్రతీకారం తీర్చుకుంటే ఘోరశిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించటం జరిగింది. ఇస్లాం యొక్క ఈ ఆజ్ఞ ఒకవైపు తౌరాత్ బైబిల్ గ్రంథాలలోని శాసనాలను, నీతీనియామాలను, మరోవైపు ప్రతీకారం మరియు మన్నింపులను ఎంత చక్కగా మేళవించిందో చూడండి!

ఈ సమగ్ర స్వరూపాన్నే దివ్యఖుర్ఆన్ వేరొకచోట ఈ విధంగా బహిర్గతం చేసింది. –

“మరియు తౌరాతు గ్రంథంలో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాశాము: ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను – ఇలా సమస్త గాయాల కొరకు సమానమయిన ప్రతీకారం. కాని ఎవరయినా ప్రతీకారం చెయ్యకుండా క్షమిస్తే, అది అతనికి కఫ్ఫారా (పాపపరిహారం) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే దుర్మార్గులు. ఈ ప్రవక్తల తరువాత మేము మర్యమ్ కుమారుడైన ఈసాను పంపాము. ఆయన తన కాలంలో ఉన్నటువంటి తౌరాతు గ్రంథంలోని విషయాన్ని ధృవీకరించేవాడు. మేము ఆయనకు ఇంజీలు (బైబిలు)ను ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతి ఉండేవి. అది కూడా ఆ కాలంలో ఉన్న తౌరాతులోని దానిని ధృవీక రించేది. అల్లాహ్ యందు భక్తి శ్రద్ధలు కల వారికి అది మార్గ దర్శకం. అంతేకాదు, హితోపదేశం కూడా.” (అల్ మాయిద – 45, 46)

ఇవి తీవ్రమయిన పాపాలకు సంబంధించిన క్రిమినల్ చట్టాలు మరియు నైతిక ఆదేశాలు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా ఇస్లాం ఇంతటి సమగ్రమైన దృక్పథాన్నే కలిగి ఉంది. సెలవీయబడింది –

“కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే (వడ్డీని విడిచిపెట్టకపోతే) మీ పై అల్లాహ్ తరఫు నుండి ఆయన ప్రవక్త తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడయినా మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు.” (అల్ బఖర – 279)

పైన పేర్కొనబడిన వచనంలో శాసనం (చట్టం) ఉంది. ఇక నైతిక కోణాన్ని చూడండి –

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే, ఆ బాకీని అతనికి దానం చెయ్యండి (వదలిపెట్టండి). అది మీకు ఎక్కువ శ్రేయస్కరం.” (అల్ బఖర – 280)

పాక్షిక సాపేక్షిక విషయాలను అలా పక్కన పెడితే సూత్రప్రాయంగా కూడా ఈ సమగ్రతను ఇలా నెలకొల్పటం జరిగింది –

“ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకుంటే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం తీర్చుకోండి. కాని మీరు సహనం చూపితే, అది నిశ్చయంగా సహనం చూపే వారికే మంచిది.” (అన్ నహ్ల్-126)

ఇదే భావం మరొక చోట ఈ విధంగా వివరించబడింది:

“తమపై దౌర్జన్యం జరిగినప్పుడు వారు దానిని ఎదుర్కొంటారు. చెడుకు ప్రతిక్రియ అదే రకమయిన చెడు. కాని ఎవడయినా క్షమించి రాజీపడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత. అల్లాహ్ దుర్మార్గులను ఇష్టపడడు. తమకు అపకారం జరిగినప్పుడు ఎవరయినా ప్రతీకారం తీర్చుకుంటే వారిని నిందించటానికి వీలులేదు. అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే; భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే. అటువంటి వారికి వ్యధాభరితమయిన శిక్షపడుతుంది. అయితే ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని.” (అష్ షూరా : 39-43)

పై వచనాలలోని మొదటి వచనం సారాంశమేమంటే; ముస్లింలు తమంతటతామై దౌర్జన్యానికి ఒడిగట్టడంలో ఎన్నడూ ముందంజవేయకూడదు. అయితే ఎవరయినా వారిపై దౌర్జన్యానికి దిగివస్తే, వారికి అన్యాయం జరిగిన మేరకు వారు బదులు తీర్చుకోవచ్చు. చట్టరీత్యా ఇది ఏమాత్రం దోషం కాదు. తౌరాత్ లో చెప్పబడింది కూడా ఇదే. కాని ఏ ముస్లిమయినా విశాల హృదయంతో ఆ అన్యాయాన్ని క్షమించివేస్తే, క్షమించివేయటమే కాదు, పెద్ద మనసుతో ఆ దుర్మార్గుడికి పొసగమేలు చేసి పొమ్మంటే అల్లాహ్ అతని యెడల ప్రసన్నుడవుతాడు. అతనికి పుణ్యం లభిస్తుంది.

చెప్పవచ్చిందేమంటే ‘క్షమాభిక్ష‘ లేక ‘ప్రతీకారం‘ ఈ రెంటిలో ఏదో ఒక దానిని మాత్రమే అవలంబించటమనేది లోకంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక వ్యవస్థలలో గల ఒక లోపం. శిక్ష లేక ప్రతీకారం సిద్దాంతం గనక లేకపోతే సామాజిక వ్యవస్థే నెలకొనజాలదు. రాజ్యంలో శాంతిభద్రతలు కూడా స్థాపించబడవు. ప్రజా సముదాయాలను చెడులకు దూరంగా ఉంచటం కూడా సాధ్యం కాదు. అలాగే ‘క్షమాపణ’ సూత్రం కూడా అవశ్యమే. అది లేని పక్షంలో ఆధ్యాత్మిక వికాసం, ఆత్మశుద్ధి, నైతికోద్ధరణ వంటి వాటికి అర్థమే ఉండదు. మరి చూడబోతే ఒక నిజ ధర్మం కోరుకునేది ఇలాంటి వాటినే కదా! కాబట్టి వీటిలో (క్షమ-ప్రతీకారం) ఏదో ఒకదానిని తీసుకుని రెండవదానిని విడనాడటమంటే ప్రాపంచిక వ్యవస్థను అసంపూర్ణంగా ఉంచటం లేక సగం స్వీకరించి మిగతా సగాన్ని వదలిపెట్టడం వంటిదే.

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒక విశిష్టమయిన శిక్షణను, అపూర్వమయిన శిక్షాస్మృతిని తీసుకువచ్చారు. దాని దృష్టి మానవ వ్యవస్థనంతటినీ పరివేష్టించి ఉంది. అది ‘శిక్ష’ మరియు ప్రతీకారాన్ని ప్రభుత్వానికీ లేదా సామూహిక వ్యవస్థకు అప్పగించింది. దాన్ని జారీచేయటంలో ఎలాంటి దాక్షిణ్యానికీ, రాయితీకి ఆస్కారముండరాదనీ అందులో చిన్నవారు, పెద్దవారనీ, ధనికులనీ- పేదలనీ, తన వారనీ – పరాయివారనీ ఎలాంటి తారతమ్యాలు హెచ్చుతగ్గులు చూపకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ గట్టిగా తాకీదు చేసి మరీ ఈ బాధ్యతను అప్పగించింది. ప్రభుత్వం మరియు సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఇలా ఉండటం అవసరం.

రెండవ వైపు క్షమాభిక్ష ఉంది. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని ఇనుమడిస్తుంది. అంతేకాదు, మనిషిని మహామనీషిగా మలుస్తుంది. కనుక ‘క్షమాపణ’ను వ్యక్తి ఇష్టాయిష్టాలకు వదలిపెట్టింది. అతని ఆత్మశుద్ధికీ, ఆధ్యాత్మిక వికాసానికి, నైతిక పరాకాష్ఠకు ఈ స్వేచ్ఛ నొసగటం ఎంతో అవసరమాయె.

కాగా; సామూహిక వ్యవస్థను సంస్కరించడానికి రాజ్యం లేక ప్రభుత్వం శిక్షల్ని విధించేటప్పుడు నిర్దిష్టంగా, సూటిగా వ్యవహరించవలసి ఉంటుంది. అక్కడ కనికారం లేక మానవత్వం పేర ప్రభుత్వం ఊగిసలాటకు లోనవుతే వ్యవస్థకు తీవ్రమయిన హాని కలుగవచ్చు. అందుకే ఈ సందర్భంగా ఇలా ఆదేశించబడింది:

“మీరు అల్లాహ్ పై, అంతిమ దినంపై విశ్వాసం ఉన్న వారే అయితే, వారి మీద కనికరం చూపే తలంపు అల్లాహ్ ప్రసాదించిన ధర్మ (నిర్వహణ) విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు.” (అన్ నూర్ 2)

అంటే ఈ అపరాధానికిగాను ప్రళయ దినాన అల్లాహ్ వద్ద నిర్ధారితమయివున్న శిక్ష ఇంతకన్నా తీవ్రమయినది. కనుక ఈ అపరాధానికిగాను ప్రపంచంలోనే శిక్ష విధించటం ఒక విధంగా పాపాత్ముడైన తమ సోదరునికి ఉపకారం చేయటం వంటిదే. అందుకే ఈ శిక్ష విధించటంలో ఎలాంటి మీమాంస, మెతకదనం పనికిరాదు.

అలాగే ఒక శిక్షను విధించేటప్పుడు నిమ్నోన్నత భేదభావాలకు, ధనిక-బీద తారతమ్యాలకు ఏ మాత్రం తావుండరాదు. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలో మదీనాలో మర్యాదస్తురాలైన ఒక ముస్లిం మహిళ దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఏ విధంగానయినా ఆమెకు శిక్షపడకుండా ఉంటే బావుండునని ఖురైషులు భావించారు. ఆ మేరకు వారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు సిఫార్సులు కూడా పంపారు. దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు: “ప్రజలారా! మీకు పూర్వం జాతులవారు ఈ కారణంగానే నాశనమయ్యారు. ఎవరైనా కులీనుడు దొంగతనం చేస్తే వారతన్ని వదిలేసేవారు. సాధారణ మనిషి ఆ తప్పు చేస్తే అతన్ని పట్టుకుని శిక్షించేవారు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె ఫాతిమా దొంగతవానికి పాల్పడి వున్నా నేనామె హస్తాన్ని ఖండించే శిక్షనే విధించేవాణ్ణి. ” (సహీహ్ బుఖారీ)

సామూహిక వ్యవహారంలో ఇంత నిర్దిష్టంగా వ్యవహరించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన స్వంత విషయంలో మాత్రం సతతం మన్నింపుల వైఖరినే అవలంబించారు. తనపై కక్షగట్టిన వారెవరిపై ఎన్నడూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతీకారం తీర్చుకోలేదు అనీ, ఎవరయినా అల్లాహ్ ఆదేశాలలో దేనినయినా ఉల్లంఘిస్తే మాత్రం (చట్టరీత్యా) వారిని శిక్ష విధించటం జరిగిందని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు. (సహీహ్ బుఖారీ)

ఇదీ ఆయన ఆచరణ. ఇక ప్రబోధనల విషయానికి వద్దాం. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “ప్రతీకారం కోరుతూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో వివాదాన్ని నివేదించుకున్న వారెపరినీ నేను చూడలేదు. కాకపోతే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మన్నింపుల గురించి జనులకు ‘సలహా’ ఇస్తుండేవారు.” (అబూదావూద్, నిసాయి) అంటే ప్రతీకారం తీర్చుకోకుండా పూర్తిగా క్షమాభిక్ష పెట్టవలసిందిగా లేక కొంత నష్టపరిహారంగానీ, జరిమానా గానీ తీసుకొని నిందితుణ్ణి వదలిపెట్టాలని సూచించేవారు. చిన్నచిన్న తగాదాలకు, తప్పులకు సంబంధించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులను, “పరస్పరం మన్నింపుల వైఖరిని అవలంబించండి. (గొడవను నా దాకా రానీయకండి). విషయం నా వరకూ వచ్చిందంటే శిక్ష పడితీరుతుంది” (అబూదాపూద్) అని తాకీదు చేసేవారు. అంటే వివాదాన్ని ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన తరువాత విచారణ జరిపి శిక్ష విధించటం అనివార్యమనీ, అలా జరిగినప్పుడే ప్రభుత్వ శాసనాల పట్ల ప్రజల హృదయాల్లో భయముంటుందని భావం. నిజమే మరి.

ఆ కాలంలో ఒకసారి ఒకాయన దుప్పటికప్పుకుని నిద్రపోతుండగా, ఒక వ్యక్తి వచ్చి నెమ్మదిగా ఆ దుప్పటిని తీసేసుకున్నాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి న్యాయ స్థానంలో కేసు నివేదించుకోబడింది. దొంగ హస్తాన్ని ఖండించే శిక్షను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) విధించారు. కేసుపెట్టిన వ్యక్తి (దుప్పటి యజమాని)కి అతనిపై దయకలిగింది. “దైవప్రవక్తా! కేవలం 30 దిర్హముల దుప్పటికోసమని ఒక మనిషి చేతినే నరికివేస్తారా? నేనీ దుప్పటిని ఈ వ్యక్తికి అప్పుగా అమ్మివేస్తున్నాను. ఇతన్ని వదలిపెట్టండి.” అని అతను విన్నవించుకున్నాడు. “కేసు నా దాకా రాకముందే ఈ పని ఎందుకు చేయలేదు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మందలించారు. (అబూదావూద్ – కితాబుల్ హుదూద్)

ఈ రకంగా చూచినపుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి శాసనాంగం ప్రస్తుత ప్రభుత్వాల చట్టాలకన్నా ఎంతో మృదువుగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉందనవచ్చు. అయితే “సర్వసాధారణ మన్నింపుల వైఖరి”కి సంబంధించిన నైతిక శిక్షణా పరిధి ఇస్లాంలో ఇంతకన్నా విస్తృతంగా ఉంది సుమా!

క్షమించమనటం తేలికే. కాని క్షమించటం అంత తేలికైన పనికాదు. తీవ్ర శిక్షకు గురికావలసినవాడు చేతికి చిక్కినప్పుడు అతనిపట్ల మంచి వ్యవహారం చేయడానికి చాలా పెద్దమనసు ఉండాలి. ఆవేశాన్ని అణచుకోవాలి. కోపాన్ని దిగమ్రింగాలి. ఉత్తమ సహనాన్ని స్వంతం చేసుకోవాలి. అప్పుడే క్షమాభిక్ష సాధ్యమవుతుంది. అయితే ఇస్లాం అత్యంత కఠినమయిన, దుర్గమమయిన ఈ మార్గాన్ని కూడా అలవోకగా అధిగమించింది. ఇస్లాంలో బహుదైవారాధన ఎంత అవాంఛనీయమైన విషయంగా పరిగణించబడిందో అందరికీ ఎరుకే. అల్లాహ్ ఏకత్వం, అల్లాహ్ ఔన్నత్యం గురించి అది ఎంత దృఢమైన, తిరుగులేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందో కూడా ప్రపంచానికి తెలిసిందే. అయినప్పటికీ “మీరు బహుదైవోపాసకుల విగ్రహాలను దూషించకండి” అని ముస్లిములను గట్టిగా తాకీదు చేయటం విశేషం. దివ్యఖుర్ఆన్ ఈ విధంగా సెలవీయ బడింది:

“(ముస్లిములారా!) వారు అల్లాహ్ ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే, వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో” (అల్ అన్ ఆమ్-108)

ఇస్లాంలోని సహన భావానికి ఇదొక మచ్చుతునక!

ఇక ముష్రిక్కుల, దైవతిరస్కారుల ఆగడాలను దూషణలను భరించే విషయమై స్వయంగా ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేయబడే తాకీదును కూడా గమనించండి:

“ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు. ఒకవేళ ఎప్పుడైనా షైతాను నిన్ను ఉసిగొల్పితే అల్లాహ్ శరణు వేడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు.” (అల్ ఆరాఫ్ – 200)

ప్రశాంత పరిస్థితిలో మన్నింపుల వైఖరినవలంబించటం సులువే. కాని ఆగ్రహావేశాల స్థితిలో కూడా మనిషి అదుపు తప్పకుండా – తనను తాను నిగ్ర హించుకోవటం ఎంతో అవసరం. మహా ప్రవక్త ప్రియసహచరుల గుణగణాలను గురించి ప్రస్తుతిస్తూ అల్లాహ్ ఇలా కితాబు ఇచ్చాడు.

“మరియు కోపం వచ్చినపుడు కూడా వారు క్షమించివేస్తారు.” (అష్ షూరా – 38)

సజ్జనులైన దాసుల వ్యవహారశైలిని కొనియాడుతూ, కోపాన్ని దిగ మ్రింగటం, క్షమించటం అల్లాహ్ ప్రీతిని పొందే సాధనమని చెప్పటం జరిగింది:

“వారు కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” (అలి ఇమ్రాన్ – 134)

పగతీర్చుకునే అవకాశం, శక్తి ఉండి కూడా శత్రువును క్షమించి వదలి పెట్టడమే అసలు సాహసోపేతమయిన కార్యం ఈ నేపథ్యంలో ఇలా చెప్ప బడింది –

“కాని ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని.” (అష్ షూరా – 43)

మంచిని పెంచే, చెడులను నిర్మూలించే ప్రయత్నంలో ఒక ముస్లిం అన్ని రకాల బాధలను భరించాలి. ఈ భరింపు కూడా పెద్ద సాహసానికి, ఆత్మస్థయిర్యానికి ప్రతీక. విజ్ఞులైన లుక్మాన్ తన కుమారునికి చేసిన ఉపదేశంలో ఇది కూడా భాగమే.

“(కుమారా!) మంచిని ఆజ్ఞాపించు. చెడు పనుల నుండి నిరోధించు. ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు.” (లుఖ్మాన్ – 17)

అవిశ్వాసులు, బహుదైవోపాసకుల దూషణలను సహించటం, వాళ్ళ తరఫున సృష్టించబడిన ఆగడాలను భరించటం కూడా మొక్కవోని సాహసానికి నిదర్శనమే –

“ఈ పరిస్థితులలో మీరు గనక సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే, ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం.” (ఆలి ఇమ్రాన్ – 187)

పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వచనాలన్నింటిలోనూ ఓర్పు, సహనం, నిగ్రహం, క్షమ, కనికారం వంటి వాటిని పెద్ద సాహసంతో కూడిన విషయాలుగా, ఉన్నత నైతిక ప్రమాణాలుగా, అల్లాహ్ ప్రసన్నతను బడసే సాధనాలుగా అభివర్ణించటం జరిగింది. ముస్లింలు ఈ విధానాన్ని అవలంబించవలసిందిగా పిలుపు నివ్వటం జరిగింది. మరికాస్త ముందుకు పోయి చూస్తే, శత్రువులను కూడా క్షమించి వదలిపెట్టవలసినదిగా విశ్వాసులను ఆజ్ఞాపించిన విషయం మనకు కానవస్తుంది.

“ప్రవక్తా! విశ్వాసులతో ఇలా అను: ‘అల్లాహ్ తరఫునుండి చెడ్డ రోజులు వస్తాయని భయపడని వారి చేష్టలను క్షమించండి.” (అల్ జాసియ – 14)

అల్లాహ్ తరఫునుండి చెడ్డ రోజులు వస్తాయని భయపడని వారు ఎవరై ఉంటారు? అవిశ్వాసులు, బహుదైవారాధకులే వారు. అటువంటి వారి పట్ల ఇస్లాం ఎంతగా విసుగు చెందిందో కూడా మీకు తెలుసు. అయినప్పటికీ వ్యవహారం దగ్గరకొచ్చేసరికి వాళ్లను క్షమించాలనీ, వారి తప్పులను మన్నించాలనీ ముస్లింలకు తాకీదు చేయటం గమనార్హం. ఇంతకన్నా ఇస్లాం తరఫున వర్షించాల్సిన ఔదార్యం ఇంకేముంటుంది. అల్లాహ్ ముస్లింలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మన్నింపుల వైఖరిని, క్షమాపణను తన ప్రత్యేక గుణంగా చెప్పుకుని, దానిని అవలంబించే ప్రేరణ ఇస్తున్నాడు.

“మీరు బహిరంగంగానూ, చాటుగానూ మేలే చేస్తూ పోతే లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ (గుణం కూడా ఇదే, ఆయన) క్షమించేవాడు”. (అన్ నిసా – 149)

పాపాత్ములను, అపరాధులను క్షమించటం అల్లాహ్ గుణం అయినప్పుడు దాసులలో కూడా అల్లాహ్ ఈ గుణం తొణకిసలాడుతుండాలి. అల్లాహ్ ఐతే అన్ని రకాలుగా శక్తియుక్తులు గలవాడు. ఆయనకు ఎవరి అక్కరాలేదు. అయినప్పటికీ ఆయన తన దాసులపై జాలిచూపుతూ, విశాల హృదయంతో వారిని మన్నిస్తూనే పోతున్నాడు. మరి మనిషినే చూడండి – అతని శక్తి పరిమితమైనది, అతనికున్న స్వేచ్ఛాధికారం షరతులతో కూడుకున్నది. అతని అశక్తత, నిస్సహాయస్థితి కూడా విదితమే. అతడు అనుక్షణం అల్లాహ్ దయాదాక్షిణ్యాలపై, క్షమపై ఆధారపడి ఉన్నాడు. కనుక అతడు కూడా సాటి జనులను క్షమించటం అలవాటు చేసుకోవాలి. క్రింది ఆయతు ద్వారా ఈ భావమే వ్యక్తమవుతోంది.

“(మీరు) వారిని క్షమించాలి, వారిని (తప్పులను) ఉపేక్షించాలి. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే, ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను.” (అన్ నూర్ – 22)

అంటే; మీరు ఇతరుల్ని క్షమిస్తే అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. సర్వ సాధారణమయిన మన్నింపులకు సంబంధించి ఇందులో ఎంత గొప్ప ప్రేరణ, ప్రోద్బలం ఇవ్వబడిందో ఆలోచించండి!

క్షమాపణ, ఉపేక్షల తరువాత అంతకన్నా ముఖ్యమయిన ప్రబోధన అపకారికి ఉపకారము చేయాలన్నది. ఎవరయినా తమకు కీడుచేస్తే అతన్ని మన్నించటమేగాక, వీలయినంతవరకు అతనికి మేలు చేయాలి. వైర వైఖరిని అవలంబిస్తున్న వారికి స్నేహ హస్తం అందించాలి. ఈ దివ్యప్రబోధనలపై ఆచరించే వారిని అల్లాహ్ సహనమూర్తులుగా, ధన్యజీవులుగా అభివర్ణించాడు. ఇది బద్ద శత్రువులను ప్రాణ మిత్రులుగా మలచుకునే విధానం అని కూడా అల్లాహ్ తెలియజేశాడు.

“(ప్రవక్తా!) మంచీ, చెడూ ఒకటి కావు, నీవు చెడును శ్రేష్ఠమయిన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహనశీలురకు తప్ప మరెవరికీ లభ్యంకాదు. ఈ స్థానం మహా అదృష్ట వంతులకు తప్ప మరెవరికీ దక్కదు.” (హామీమ్ అస్ సజ్జాహ్ – 34, 35)

ఈ గొప్ప ప్రబోధనను ఆస్వాదించిన వారిని అల్లాహ్ “మహా అదృష్ట వంతులు”గా అభివర్ణించాడంటే దీనికున్న ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతుంది. అవిశ్వాసులు, బహుదైవారాధకుల దూషణలకు రెచ్చిపోరాదని కూడా మరోచోట ఉద్బోధించడమైనది. ఎందుకంటే ధర్మావలంబనలో ఆవేశానికిలోనై అనుచితమయిన చర్యకు ఒడిగట్టడం వాస్తవానికి షైతాన్ చేష్ట. అలాంటి పరిస్థితి ఎప్పుడయినా ఎదురయినట్లయితే, ‘షైతాన్ మాయోపాయం నుండి కాపాడమనీ, కోపాన్ని దిగమ్రింగే సంయమనాన్ని ప్రసాదించమనీ దైవాన్ని ప్రార్థించాలి.

“ఓ ప్రవక్తా! చెడును ఉత్తమమయిన పద్ధతిద్వారా నివారించు. ఏ విషయాలను వారు నీ గురించి కల్పిస్తున్నారో, అవి మాకు బాగా తెలుసు. ఇలా ప్రార్థించు; ‘ప్రభూ! షైతానుల ప్రేరణల నుండి నేను నిన్ను శరణువేడుకుంటున్నాను. నా ప్రభూ! అవి నా వద్దకు అసలు రాకుండేటట్లు నిన్ను శరణువేడుకుంటున్నాను” (అల్ మూమినూన్ – 96-98)

వేరొక చోట అల్లాహ్ నమాజ్, దాన ధర్మాలు, సహనం మరియు మన్నింపులను ప్రస్తావించి, వాటికి బదులుగా స్వర్గం లభిస్తుందని వాగ్దానం చేశాడు. అయితే ఈ సత్కార్యాలన్నింటిలోకీ ‘సహనాన్ని’ రెండేసి సార్లు ప్రస్తావించి, ముఖ్యంగా దీని మూలంగానే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పటం గమనార్హం. ఇదిగో చూడండి:

“వారి వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరపరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు. తమ ప్రభువునకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్కతీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు. తమ ప్రభువు ప్రసన్నతకోసం సహనంతో వ్యవహరిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా, రహస్యంగా ఖర్చుచేస్తారు. చెడును మంచి ద్వారా పారద్రోలుతారు. పరలోక గృహం వారి కొరకే ఉన్నది. అంటే, వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు. వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు.” (అర్రాద్ : 19 – 28)

వారితో ఇలా అనబడుతుంది:

“మీపై శాంతి వర్షించుగాక! ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం వల్ల ఈ రోజు మీరు దీనికి అర్హులయ్యారు.” (అర్రాద్ – 24)

చూశారుగా, స్వర్గసుఖాల శుభవార్త అందించే ఈ శుభసమయాన నమాజ్ ప్రస్తావనగానీ, దాన ధర్మాలు ప్రస్తావనగానీ, దైవభీతి ప్రస్తావనగానీ రాలేదు. కేవలం ఇది ‘సహనానికి’ ప్రతిఫలంగా లభించిన బహుమానమని నొక్కి పలకబడింది. పై ఆయతుల ద్వారా మన దృష్టికి వచ్చే మరో ముఖ్య విషయం ‘చెడు’ను ‘మంచి’ ద్వారా పారద్రోలటం. ఇది కూడా ఎంత గొప్ప సత్కార్యమంటే దీనిని సమాజ్ మరియు దానధర్మాలతో కలిపి ప్రస్తావించటం జరిగింది.

ఇంకొక వచనంలో తమ జాతివారి ఎత్తిపొడుపులను ఆవేదనా భరిత మయిన మాటలను విని, వాటిని సహిస్తూ ఉండే నవ ముస్లిం యూదులను కొనియాడుతూ ఇలా సెలవీయబడింది:

“తాము చూపిన స్థయిర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని రెండుసార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు. మేము వారికి ఇచ్చిన జీవనోపాధినుండి ఖర్చుపెడతారు. వారు ఎప్పుడైనా అసహ్యకరమయిన మాటను వింటే, ఇలా అంటూ దూరంగా జరిగి పోతారు: ‘మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మీకు శాంతి కలుగుగాక! మేము అజ్ఞాసుల పద్ధతుల్ని అవలంబించదలచుకోలేదు.” (అల్ ఖసస్ – 54, 55)

ఈ పచనాలలోని ఒక్కో ముక్కను గురించి యోచనచేయండి. వారు చెడును మంచితో నివారించడమేగాక, పారదర్శక వైఖరిని ప్రదర్శించడమేగాక, వేధించేవాళ్లకోసం దీవెనల వర్షం కురిపిస్తున్నారు.

సహీహ్ బుఖారీలో ఉంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు : “ఉపకారానికి బదులు ఉపకారం చేసేవాడు ఆత్మీయత యొక్క హక్కును నెరవేర్చినట్టు కాదు. దుర్వ్యవహారానికి బదులుగా సద్వ్యవహారం చేసేవాడే వాస్తవానికి ఆత్మీయతా హక్కును నెరవేర్చాడు”.

ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, “ఓ దైవ ప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారి యెడల సద్వ్యవహారం చేస్తాను. కాని వారు నా యెడల దుర్వ్యవహారం చేస్తున్నారు. నేను వారికి మేలు కలిగిస్తున్నాను, కాని వారు నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారి పట్ల మృదు వైఖరి నవలంబిస్తుండగా వారు నా పట్ల కరకుగా ప్రవర్తిస్తున్నారు” అని విన్నవించు కున్నాడు. దీనికి సమాధానంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీవు చెప్పేదే నిజమయితే, నీవు వాళ్ల నోటిలో మట్టి నింపుతున్నావు. అంటే సత్కార్యం అనే ముద్దతో నీవు వాళ్ల నోళ్లు మూయిస్తున్నావు. నీవు నీ ఈ వైఖరిపై నిలకడగా ఉన్నంతకాలం అల్లాహ్ సహాయం నీ పక్షాన ఉంటుంది.” (సహీహ్ ముస్లిం)

హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు: “జనులు మీకు మేలు చేకూర్చినట్లయితే మేము కూడా మేలు చేకూరుస్తామని, దౌర్జన్యం చేస్తే మేము కూడా అలాగే చేస్తామని మీరంటారు. ఇది సరికాదు. మిమ్మల్ని మీరు శాంతపరచుకోండి, నెమ్మదించండి. జనులు మీకు మేలు చేకూరిస్తే మీరు వారికి మేలు చేకూర్చండి. ఒకవేళ వారు కీడు కలిగించినా సరే మీరు వారికి అన్యాయం చేయకండి.” (జామె తిర్మిజీ)

ఇస్లాం మరియు ముస్లింలకు తమ మోసపూరిత పథకాల ద్వారా, బూటకపు వాగ్దానాల ద్వారా, వంచనా పూరితమయిన ఒడంబడికలద్వారా, దగాకోరు సంధుల ద్వారా మోసం చేసే వారి గురించి కూడా నుహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఈ ఆదేశం ఇవ్వబడింది:

“అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ (వారు ఈ స్థితికి దిగజారి పోయినప్పుడు, వారు ఏ దుర్మార్గాలు చేసినా, అది పూర్తిగా అనుకున్నదే) కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లాహ్ ప్రేమిస్తాడు.” (అల్ మాయిద – 13)

ఆలోచించవలసిన విషయమిది! ఇటువంటి దగుల్బాజీ జనాన్ని క్షమించి, వాళ్ల తప్పుల్ని చూచీ చూడనట్లుగా ఉపేక్షించటం ఇస్లాంలో చాలా గొప్ప సత్కార్యంగా పేర్కొనబడింది. ఇటువంటి సత్కార్యం చేసే ఉదార స్వభావుల్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడన్న శుభవార్త కూడా ఇవ్వబడింది.

ఈ తఫ్సీలన్నిటి ద్వారా ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనలు ఈ నైతిక అధ్యాయం క్రింద ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నవో, మరెంత సమగ్రతను సంతరించుకున్నవో సుబోధకమవుతోంది.

సామాజిక హక్కులుగానీ, బాధ్యతలుగానీ సంఘంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సజావుగా నెరవేర్చబడతాయి. సంఘ జీవితంతో సంబంధం త్రెంచుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు. జనవాసాలకు కోసుల దూరంలో నిర్మా నుష్య ప్రాంతాలలో, కొండల్లో కోనల్లో తపస్సు చేసుకునేవారు సామాజిక ఇక్కట్లను దూరం చేయగలరా? జాతులు నైతిక పతనానికి లోనుకాకుండా వాళ్లు చూసుకో గలరా? అంతదూరాన ఉంటూ అభాగ్య జీవులను ఆదుకోగలుగుతారా? అనాధల సంరక్షకులుగా ఉండగలుగుతారా? ప్రజాసేవకు సంబంధించిన ఏ చిన్న విభాగాన్నయినా వారు పర్యవేక్షించగలుగుతారా? వారు ప్రజలను మార్గవిహీనత, మార్గభ్రష్టతల నుండి ఆపగలుగు తారా? అంతెందుకు, వారు తమ స్వహస్తాలతో ఉపాధిని సంపాదించి బ్రతకగలుగుతారా? వాళ్లు ప్రజలకు సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించగలుగుతారా? ప్రజలను మంచి వైపుకు ఆహ్వానించి, చెడునుండి వారించే విధిని నిర్వర్తించ గలుగుతారా?