[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 25 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా తీర్పుదినం గురించి బోధించింది. మొదటి ఆయతులోనే దీనికి పేరుగా పెట్టబడిన పదాలు వచ్చాయి. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను క్లుప్తంగా అభివర్ణిస్తూ ఈ సూరా ప్రారంభమవుతుంది. రోదసి(అంతరిక్షం)లో చోటుచేసుకునే ప్రళయభీకర పరిస్థితుల గురించి ఈ సూరా వివరించింది. ఆ రోజున ఆకాశం తెరువబడుతుంది. భూమి చదునుగా చేయబడుతుంది. పర్వతాలు చెల్లాచెదరవుతాయి. అందరిని అల్లాహ్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ సూరాలో అవిశ్వాసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పరలోకంలో ఎదురయ్యే తీవ్రమైన శిక్ష గురించి హెచ్చరించడం జరిగింది. సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారికి శాశ్వత స్వర్గవనాలు లభిస్తాయని ఈ సూరా పునరుద్ఘాటించింది.
84:1 إِذَا السَّمَاءُ انشَقَّتْ
ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు, [1]
84:2 وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆజ్ఞను వింటుంది.[2] దానికదే తగినది మరి! [3]
84:3 وَإِذَا الْأَرْضُ مُدَّتْ
మరి భూమి (సాగదీయబడి) విస్తృత పరచబడినప్పుడు,[4]
84:4 وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
అది తన లోపల ఉన్నదంతా బయట పడేసి, ఖాళీ అయిపోతుంది.[5]
84:5 وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశాన్ని (ఖచ్చితంగా) వింటుంది.[6] దానికదే శోభాయమానం మరి!
84:6 يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునేవరకు ఈ సాధనలో, (ఈ కఠోర పరిశ్రమలోనే) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ని చేరుకుంటావు. [7]
84:7 فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
(ఆ సమయంలో) ఎవరి కర్మల పత్రం అతని కుడిచేతికి ఇవ్వబడుతుందో –
84:8 فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. [8]
84:9 وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
అతను తనవారి వైపు సంబరపడుతూ వెళతాడు. [9]
84:10 وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో
84:11 فَسَوْفَ يَدْعُو ثُبُورًا
అతను చావు కోసం కేకలు వేస్తాడు.[10]
84:12 وَيَصْلَىٰ سَعِيرًا
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు.
84:13 إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. [11]
84:14 إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
తానెన్నటికీ (అల్లాహ్ వద్దకు) తిరిగి పోనని తలపోసేవాడు.[12]
84:15 بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
ఎందుకు పోడు?! [13] నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు.[14]
84:16 فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
సాయంకాలపు ఎర్రని కాంతి తోడు![15]
84:17 وَاللَّيْلِ وَمَا وَسَقَ
రాత్రి తోడు! అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు![16]
84:18 وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
పూర్ణచంద్రుని తోడు![17] (గా చెబుతున్నాను)
84:19 لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతుంటారు.[18]
84:20 فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
అసలు వారికేమైపోయింది, వారు ఎందుకని విశ్వసించరు?
84:21 وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
వారి ముందు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు వారెందుకని సాష్టాంగపడరు?[19]
84:22 بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
పైగా విశ్వసించని ఈ జనులు (దీనిని) ధిక్కరిస్తున్నారు?[20]
84:23 وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
వారు తమ లోపల దాచి పెట్టుకునే లోగుట్టును గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.[21]
84:24 فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన ‘శుభవార్త’ను వినిపించు.
84:25 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది.
—
Footnotes :
1. అంటే – ప్రళయం సంభవించినప్పుడు…
2. అంటే – బ్రద్దలైపొమ్మన్న తన ప్రభువు ఆజ్ఞను అది శ్రద్ధగా వినటమేగాక, దాన్నిఅక్షరాలా పాటిస్తుంది.
3. ప్రభువాజ్ఞను విని, దాన్ని తు.చ. తప్పకుండా పాటించటం తప్ప దానికి వేరే మార్గాంతరం కూడా లేదు. ఎందుకంటే సర్వాధిపతి ఆ ప్రభువు మాత్రమే. అందరూ తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనకు లోబడి మసలుకోవలసిందే. మరలాంటప్పుడు ఆయన ఆజ్ఞను ఎదిరించే దుస్సాహసానికి ఎవరు ఒడిగట్టగలరు?
4. అంటే – భూమి పొడవు, వెడల్పు మరింత పెంచబడుతుంది. లేదా నేలపై ఉన్నపర్వతాలు తుత్తునియలుగా చేయబడి, నేలంతా చదునుగా చేయబడుతుంది. అందులో అప్పుడు ఎలాంటి ఎత్తుపల్లాలు ఉండవు.
5. అంటే – భూమి లోపల ఖననమై ఉన్న మృతులంతా బ్రతికి బయటికి వస్తారు. భూమి తన లోపల నిక్షిప్తమై ఉన్న నిధులు, నిక్షేపాలన్నింటినీ బయటికి కక్కేసి అదిమాత్రం నిక్షేపంగా ఉండిపోతుంది.
6. భూమ్యాకాశాలే తమ ప్రభువు ఆదేశాలను యధావిధిగా పాలిస్తున్నప్పుడు మనిషికి మాత్రం ప్రభువు ఆజ్ఞలను ఎదిరించే అధికారం ఎక్కడుంది?
7. ఇక్కడ ‘మానవుడు’ అన్న పదంలో మంచివారు చెడ్డవారు, విశ్వాసులు – అవిశ్వాసులు అందరూ చేరి ఉన్నారు. ‘కద్ హన్’ అంటే కఠోరశ్రమ, క్లిష్టసాధన అని అర్థం. కఠోర పరిశ్రమ మంచి కోసం జరిగినా, చెడుకోసం జరిగినా శ్రమ శ్రమే కదా! దీని భావం ఏమిటంటే-ఓ మనిషీ! ప్రళయం వచ్చినప్పుడు నువ్వు నీ ప్రభువును ఎలాగూ కలుసుకుంటావు. ఆ సమయంలో నీవు చేసిన కర్మలు – అవి మంచివైనా, చెడ్డవైనా – నీ ముందు ఉంటాయి. వాటి ప్రకారమే నీకు పుణ్యఫలమో, పాపఫలమో లభిస్తుంది. దీని వివరాలు తరువాతి వాక్యాలలో వచ్చాయి.
8. తేలికపాటి లెక్క అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? అంటే విశ్వాసి (మోమిన్) కర్మల పత్రం విచారణకు వస్తుంది. అతని తప్పులు కూడా అతని ముందుకు తేబడతాయి. అయితే అల్లాహ్ తన దయాదాక్షిణ్యాలతో వాటిని మన్నిస్తాడు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు : “లెక్క తీసుకోబడినవాడు చచ్చాడన్నమాటే!” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించినపుడు, ”ఓ దైవప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం)! అల్లాహ్ నన్ను మీకు అర్పించుగాక! ‘ఎవరికర్మల పత్రం వారి కుడిచేతికి ఇవ్వబడుతుందో వారినుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంద’ని అల్లాహ్ సెలవిచ్చాడు కదా! (ఈ ఆయతు ప్రకారం లెక్క తీసుకోబడిన విశ్వాసి వినాశం పాలవుతాడని చెప్పబడలేదే!) అని నేను సందేహపడ్డాను. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా విశదీకరించారు : “ఇది అల్లాహ్ సమక్షంలో హాజరవటం మాత్రమే (అసలు విశ్వాసి పట్ల ఖచ్చితంగా లెక్క తీసుకోబడదు). విశ్వాసులు తమ ప్రభువు ఎదుట హాజరుపరచ బడతారు. ఎవడయినా నిలదీసి అడగబడ్డాడంటే అతనికి మూడినట్లే” (సహీహ్ బుఖారీ – ఇన్షిఖాఖ్ సూరా తాత్పర్యం). ఒక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ విధంగా తెలియజేశారు: ”దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడప్పుడూ నమాజులలో అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ య్యసీరా (ఓ అల్లాహ్ ! నానుండి తేలికపాటి లెక్క తీసుకో) అని ప్రార్థించేవారు. ఆయన నమాజును ముగించిన తరువాత ‘హిసాబయ్ య్యసీరా’ (తేలికపాటి లెక్క) అంటే ఏమిటని నేను అడగ్గా, ‘అల్లాహ్ తన దాసుని కర్మల పత్రాన్ని స్థూలంగా చూసి, అతన్ని మన్నిస్తాడు’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు.” (ముస్నదె అహ్మద్ – 6/48).
9. అంటే – తన కుటుంబీకుల్లో స్వర్గం పొందినవారి వద్దకు. లేదా స్వర్గం పొందిన తన తల్లిదండ్రుల వద్దకు. లేదా స్వర్గంలో తనకు లభించే కన్యల వద్దకు.
10. అంటే; అతను కేకలు వేస్తాడు, అరుస్తాడు. గోలపెడతాడు. తాను సర్వనాశనమై పోయానని తలబాదుకుంటాడు.
11. అంటే – అతను ప్రాపంచిక జీవితంలో తన మనోవాంఛలకు బానిసై, భోగభాగ్యాలలో మునిగితేలేవాడు. పొద్దస్తమానం వాడికి వాడి లోకమే తప్ప వేరే ధ్యాస ఉండేదికాదు.
12. వాడి ‘సంబరానికి’ కారణం పరలోకం పట్ల వాడికి విశ్వాసం లేకపోవటమే. ఈ విశ్వాస రాహిత్యం అతన్ని మరీ భౌతికవాదిగా, స్వార్ధపరునిగా మార్చేసింది. ‘హౌర్’ అంటే మరలివెళ్ళటం అని అర్థం. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ హౌరి బాదల్ కౌర్” (ఓ అల్లాహ్ ! విశ్వసించిన మీదట అవిశ్వాసానికి లోనవటం నుండి, విధేయత చూపిన తరువాత అవిధేయుడుగా మారటం నుండి, మేలువైపు మరలిన తరువాత కీడు వైపుకు మొగ్గిపోవటం నుండి నేను నీ శరణువేడుతున్నాను). (సహీహ్ ముస్లిం, తిర్మిజీ, ఇబ్ను మాజ).
13. తప్పకుండా తన ప్రభువు వద్దకు మరలిపోతాడు. తనకిష్టం ఉన్నా లేకున్నా అతని ఈ పయనం ఆగదు.
14. అంటే – అతను చేసే ఏ పనీ అతని ప్రభువు నుండి దాగిలేదు.
15. సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో ప్రస్ఫుటమయ్యే ఎరుపుదనాన్ని ‘షఫఖ్‘ అంటారు. ఇషా నమాజు వేళ మొదలయ్యేవరకు ఈ ఎరుపుదనం ఉంటుంది.
16. చీకటిపడగానే ప్రతి వస్తువూ తన గమ్యం వైపుకు, విశ్రాంతి స్థలం వైపుకు వెళ్ళి పోతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే రాత్రి చీకటి వాటిని తన ఒడిలోనికి తీసుకుంటుంది.
17. అంటే చంద్రుని దశలు రోజు రోజుకూ పెరిగి పరిపూర్ణతను సంతరించుకున్నప్పుడు… 13వ తేదీ రాత్రి నుండి 16వ తేదీ రాత్రి వరకు చంద్రుడు ‘పూర్ణచంద్రుడు’గా వెలుగొందుతాడు.
18.’తబఖ్’ అంటే తీవ్రమైన, కఠినమైన అని అసలు అర్థం. ప్రళయదినాన ఎదురయ్యే ప్రతి అవస్థ పూర్వపు అవస్థకన్నా ఎంతో కఠినంగా ఉంటుంది (ఫత్ హుల్ బారీ – ఇన్ షిఖాఖ్ సూరా వ్యాఖ్యానం). గత ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం ఈ ఆయతులో ఇవ్వబడింది.
19. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారు, ఆయన ప్రియసహచరులు (రదియల్లాహు అన్హుమ్) కూడా ఈ ఆయతు వచ్చినప్పుడు సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసేవారని హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.
20. అంటే – విశ్వసించాల్సింది పోయి దానిని త్రోసిపుచ్చుతున్నారు.
21. అంటే వారు రహస్యంగా చేసే పనులు, వారు తమ ఆంతర్యాల్లో దాచిపెట్టే ధిక్కారవైఖరి – ఏదీ అల్లాహ్ కు తెలియకుండా లేదు.
30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr