81. తఫ్సీర్ సూర తక్వీర్ (Tafsir Surah Takweer) [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తక్వీర్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1eUZmfRFb8Sghnt6K-nwlM

81:1 إِذَا الشَّمْسُ كُوِّرَتْ
సూర్యుడు చుట్టివేయబడినప్పుడు,

81:2 وَإِذَا النُّجُومُ انكَدَرَتْ
నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు,

81:3 وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ
పర్వతాలు నడిపింపబడినప్పుడు,

81:4 وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ
పదిమాసాల సూడి ఒంటెలు (వాటి మానాన) వదలివేయబడినప్పుడు,

81:5 وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ
అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు,

81:6 وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
సముద్రాలు రాజేయబడినప్పుడు,

81:7 وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ
ఆత్మలు (వాటి తనువులతో) అనుసంధానం చేయబడినప్పుడు,

81:8 وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ
సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు,

81:9 بِأَيِّ ذَنبٍ قُتِلَتْ
‘తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది?’ అని.

81:10 وَإِذَا الصُّحُفُ نُشِرَتْ
కర్మల చిట్టాలు తెరువబడినప్పుడు,

81:11 وَإِذَا السَّمَاءُ كُشِطَتْ
ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు,

81:12 وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ
నరకం మండించబడినప్పుడు,

81:13 وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ
స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు,

81:14 عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ
అప్పుడు (ఆ రోజు) ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది.

81:15 فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ
కనుక అది కాదు. వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను.

81:16 الْجَوَارِ الْكُنَّسِ
అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి.

81:17 وَاللَّيْلِ إِذَا عَسْعَسَ
గడచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా!

81:18 وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ
ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా (చెబుతున్నాను)!

81:19 إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు (జిబ్రయీల్) తెచ్చిన (దైవ) వాక్కు.

81:20 ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ
అతడు శక్తిశాలి. అతడు సింహాసనాధిపతి (అయిన అల్లాహ్) దగ్గర ఉన్నత స్థానం కలవాడు.

81:21 مُّطَاعٍ ثَمَّ أَمِينٍ
(ఊర్థ్వ లోకాలలో) అతని మాట అనుసరనీయం. అతను ఎంతో నిజాయితీపరుడు.

81:22 وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ
(ఓ ప్రజలారా!) మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాడు.

81:23 وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ
అతనా సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు.

81:24 وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ
ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాడు.

81:25 وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ
ఇది (ఈ ఖుర్ఆన్) శాపగ్రస్తుడైన షైతాన్ వాక్కు కూడా కాదు.

81:26 فَأَيْنَ تَذْهَبُونَ
మరి మీరు ఎటుపోతున్నారు?

81:27 إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం.

81:28 لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ
(ముఖ్యంగా) మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం.

81:29 وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంతవరకు మీరేదీ కోరలేరు.