77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [వీడియో]

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [4 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2R3mGtZwe7XSQ2iNzLDPT5

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 50 ఆయతులు ఉన్నాయి. ఈ సూరాలో ముఖ్యంగా ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో వచ్చింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది తప్పనిసరిగా జరిగే సంఘటన అని ఈ సూరా నొక్కి చెప్పింది. ఆ రోజున నక్షత్రాలు మసకబారిపోతాయి. ఆకాశం తునాతునకలవుతుంది. పర్వతాలు దుమ్ముమాదిరిగా ఎగురుతాయి. ఆ రోజున ప్రవక్తలందరినీ పిలిచి వారుఅల్లాహ్ సందేశాన్ని మానవాళికి అందించడం జరిగిందా లేదా అన్న విషయమై వాంగ్మూలంఇవ్వమని కోరడం జరుగుతుంది.

ఈ సూరాలో అల్లాహ్ శక్తిసామర్ధ్యాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపడం ఆయనకు చాలా తేలికని నిరూపించడం జరిగింది. సత్యతిరస్కారుల వాదన అసత్యంగా రుజువవుతుందని చెప్పడం జరిగింది. తీర్పుదినాన్ని చాలా కఠినమైన రోజుగా, దుస్థితి దాపురించే రోజుగా అభివర్ణించడం జరిగింది. ఆ రోజున భారీ నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఆ రోజున సత్యతిరస్కారులు మాట్లాడే స్థితిలో ఉండరు. వారికి ఎలాంటి సాకులు చెప్పే అనుమతి కూడా ఉండదు. దైవభీతి కలిగినవారు చల్లని నీడలో, సెలయేర్లతో, వివిధ రకాల ఫలాలతో సంతోషాన్ని పొందుతారు.

[1] బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ప్రామాణిక హదీసుల ప్రకారం ఈ సూరా మక్కాలో అవతరించింది. హజ్రత్ ఇబ్నె మసూద్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు : మేము ‘మినా’లోని ఒక పర్వత గుహలో ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ సూరా అవతరించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూరాను పారాయణం చేస్తుంటే నేను ఆయన నుండి గ్రహించ సాగాను. అంతలో అకస్మాత్తుగా ఒక పాము ప్రత్యక్షమయింది. దాన్ని చంపమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పురమాయించారు. కాని ఆ పాము మెరుపు వేగంతో ఎటో మాయమై పోయింది. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “నువ్వు దాని కీడు నుంచి రక్షించబడ్డావు. అది నీ కీడు నుంచి తప్పించుకుంది” అని అన్నారు (బుఖారీ – తఫ్సీర్ సూరతుల్ముర్సలాత్; ముస్లిం – కితాబ్ ఖత్లుల్ హయ్యాత్ …). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొన్నిసార్లు మగ్రిబ్ నమాజులో కూడా ఈ సూరా పఠించారు (బుఖారీ కితాబుల్ అజాన్; ముస్లిం – కితాబుస్సలాత్).



77:1 وَالْمُرْسَلَاتِ عُرْفًا
నిరాఘాటంగా వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా! [2]

77:2 فَالْعَاصِفَاتِ عَصْفًا
మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా! [3]

77:3 وَالنَّاشِرَاتِ نَشْرًا
మేఘాలను లేపి చెల్లాచెదురు చేసే గాలుల సాక్షిగా! [4]

77:4 فَالْفَارِقَاتِ فَرْقًا
మరి (సత్యాసత్యాలను) వేరుపరచే వా(టి)రి సాక్షిగా! [5]

77:5 فَالْمُلْقِيَاتِ ذِكْرًا
జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా! [6]

77:6 عُذْرًا أَوْ نُذْرًا

సాకులు లేకుండా చేయటానికి, హెచ్చరించటానికి. [7]

77:7 إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ
ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది. [8]

77:8 فَإِذَا النُّجُومُ طُمِسَتْ
నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు…[9]

77:9 وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
ఆకాశం బద్దలైపోయినప్పుడు ….

77:10 وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగుర వేయబడినప్పుడు… [10]

77:11 وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ
ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు…. [11]

77:12 لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ
ఏ రోజు కోసం (వారందరిని) వాయిదా వేసినట్టు? [12]

77:13 لِيَوْمِ الْفَصْلِ
తీర్పుదినం కోసం! [13]

77:14 وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ
తీర్పుదినం ఏమిటో నీకేం తెలుసు?

77:15 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.[14]

77:16 أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ
ఏమిటి, మేము పూర్వీకులను అంతమొందించలేదా?

77:17 ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ
మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకు వచ్చాము. [15]

77:18 كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
మేము నేరస్తుల (పాపాత్ముల) పట్ల ఇలాగే వ్యవహరిస్తాం. [16]

77:19 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:20 أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
ఏమిటి, మేము మిమ్మల్ని అల్పమైన నీళ్ళతో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?

77:21 فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన, సురక్షితమైన చోట ఉంచాము –[17]

77:22 إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
ఒక నిర్ణీత కాలం వరకు. [18]

77:23 فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ
మేము తగురీతిలో లెక్క వేశాము. ఆహా! మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారమో! [19]

77:24 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:25 أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
ఏమిటి, మేము భూమిని తనలో ఇమిడ్చుకునేదిగా చేయలేదా? [20]

77:26 أَحْيَاءً وَأَمْوَاتًا
సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో.

77:27 وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
ఇంకా మేమందులో ఎత్తైన, బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్టించాము.[21] మీ దాహాన్ని తీర్చే మంచి నీరును మీకు త్రాపాము.

77:28 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:29 انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ ఉన్న ఆ నరకం వైపే పదండి!” [22]

77:30 انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” [23]

77:31 لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. [24]

77:32 إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. [25]

77:33 كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి. [26]

77:34 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:35 هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
ఆ రోజు వారు మాట్లాడనూ లేరు. [27]

77:36 وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
సంజాయిషీ ఇచ్చుకొనే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు. [28]

77:37 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:38 هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
ఇది నిర్ణయ దినం. (దీని కోసం) మేము మిమ్మల్నీ, మీ పూర్వీకులందరినీ సమీకరించాము. [29]

77:39 فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
మరి మీరు నా నుండి (తప్పించుకునే) ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి. [30]

77:40 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:41 إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
నిశ్చయంగా దైవభీతిపరులు చల్లని నీడలలో,[31] (సల్లగసాగే) సెలయేరుల మధ్య ఉంటారు.

77:42 وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
ఇంకా, తాము మెచ్చిన పండ్లు, ఫలాల మధ్య [32] (హాయిగా) ఉంటారు.

77:43 كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
“మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి”[33] (అని వారితో అనబడుతుంది).

77:44 إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.[34]

77:45 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. [35]

77:46 كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(ఓ ధిక్కార జనులారా! మీరు ప్రాపంచిక జీవితంలో) అంతో ఇంతో తినండి, లబ్దిని పొందండి. మీరెలాగూ నేరస్థులే. [36]

77:47 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.

77:48 وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ
(దైవ సన్నిధిలో) “వినయపూర్వకంగా తలవంచండి” అని వారితో అన్నప్పుడు వారు తలవంచరు. [37]

77:49 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. [38]

77:50 فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఇక ఈ (ఖుర్ఆన్) విషయం తరువాత వారు విశ్వసించటానికి ఏం ఉంది(ట)? [39]

[2] ఆహ్లాదపరచే విధంగా పంపబడే గాలులు అని కూడా చెప్పవచ్చు. మరికొందరు ‘ముర్సలాత్‘ అంటే దైవదూతలు లేదా దైవప్రవక్తలు అని భావించారు. ఈ రెండవ అనువాదం సరైనదని భావించిన పక్షంలో ‘ఉర్పా‘ అనే పదం దైవవాణి (వహీ) లేక షరీయతు ఆదేశాలు అన్న అర్థంలో వస్తుంది.

[3] అవి గాలులూ కావచ్చు లేదా దైవదూతలు కూడా కావచ్చు. వారు కొన్నిసార్లు శిక్ష రూపంలో తీవ్రగాలులతో పాటు పంపబడతారు.

[4] అంటే మేఘ మాలికలను గగన తలంలో నలువైపులా వ్యాపింపజేసే లేదా తమ రెక్క లను విప్పే దైవదూతల సాక్షి. అయితే ఇమామ్ ఇబ్నె కసీర్, ఇమామ్ తబ్రీలు మాత్రం మొదటి మూడు ఆయతులు గాలుల నేపథ్యంలోనే ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. మేము కూడా దీనిని అనుసరించే అనువాదం చేశాము.

[5] అంటే సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను వేరుపరచే ఆజ్ఞలను తీసుకుని వచ్చే దైవదూత లన్నమాట. లేదా సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను స్పష్టంగా వేరుపరచే ఖుర్ఆన్ఆ యతులన్నమాట! లేదా దైవవాణి (వహీ)ని పురస్కరించుకుని సత్యాన్ని అసత్యం నుండి వేరుపరిచే దైవప్రవక్తలు కూడా కావచ్చు.

[6] ఈ పనిచేసే వారు దైవదూతలూ కావచ్చు లేదా దైవప్రవక్తలూ కావచ్చు.

[7] అంటే – మమ్మల్ని హెచ్చరించే వారెవరూ రాలేదని సాకులు చెప్పే అవకాశం లేకుండా చేయటానికి. నరకం గురించి భయపెట్టడానికి లేదా విశ్వాసులకు శుభవార్తగా మరియు అవిశ్వాసులకు హెచ్చరికగా. ఇమామ్ షౌకానీ ఇలా అంటున్నారు: ముర్సలాత్, ఆసిఫాత్, నాషిరాత్ అంటే గాలులని అర్థం. ఫారిఖాత్, ములియాత్ అంటే దైవదూతలని భావం. ఈ అభిప్రాయమే ఎన్నదగినది.

[8] అంటే ప్రళయదినం అన్నమాట! ప్రళయం తథ్యమని మీకు పదే పదే చేయబడుతున్న వాగ్దానం ఉత్తుత్తి వాగ్దానం కాదు సుమా! అది తప్పకుండా వస్తుంది. ఇందులో సందేహానికి ఏమాత్రం తావులేదు. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. పరలోకంలో మీకు ఉపయోగపడే సామగ్రిని సమకూర్చుకోవాలి. ఇంతకీ ఈ ప్రళయదినం ఎప్పుడు సంభవిస్తుంది? రానున్న వాక్యాలలో ఈ విషయం విశదపరచబడింది.

[9] తమ్స్‘ అంటే ఎలాంటి ఆనవాలు లేకుండా చెరిగిపోవటం, అంతరించటం అని అర్థం. ‘తమస్సు’ (అంధకారం, చీకటి) అనే సంస్కృత పదం బహుశా దీనినుండే వచ్చి ఉంటుంది. నక్షత్రాలు నిస్తేజమై, నామరూపాలు లేకుండా పోయినప్పుడు…

[10] అంటే – వాటిని భూమి నుండి పెకలించి, ఎడాపెడా దంచి వేయటం జరుగుతుంది. అప్పుడు భూమి చదునుగా అయిపోతుంది.

[11] అంటే – న్యాయవిచారణ నిమిత్తం ప్రవక్తలు పిలువబడతారు. వారి నివేదిక ఆధారంగా జాతుల గురించి న్యాయనిర్ణయం తీసుకోబడుతుంది.

[12] ఈ వాక్యం ఒకింత విశేషంగా, ఒకింత గౌరవసూచకంగా వచ్చింది. ఆనాటి ఉగ్ర రూపాన్ని కళ్లముందు చిత్రీకరించటానికే ఇలా అనబడింది. ప్రవక్తలందరినీ సమావేశ పరచి వారి కాలాల నాటి జాతుల స్థితిగతులను విచారించే దినం సాధారణ దినం కాదు మరి!

[13] ఆ రోజు మనుషుల మధ్య న్యాయనిర్ణయం జరుగుతుంది. దాని ప్రకారం ఒక వర్గం వారిని స్వర్గం కోసం, మరోవర్గం వారిని నరకం కోసం వేరుపరచటం జరుగుతుంది.

[14] ‘వైల్’ అంటే వినాశం అని ఒక అర్ధం. ‘వైల్’ అనేది నరకంలోని ఒక లోయ అని మరికొంతమంది భావిస్తున్నారు. ఈ ఆయతు ఈ సూరాలో పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దైవధిక్కారి నేరం ఇతర ధిక్కారుల నేరాలకు భిన్నంగా ఉంటుంది. దాని ప్రకారమే వారికి పడే శిక్ష కూడా – నేర స్వభావాన్ని బట్టి – భిన్నంగా ఉంటుంది. అందుకే వైల్ అన్న పదం పలుమార్లు పలు విధాలుగా పునరావృతం అయింది. (ఫత్ హుల్ ఖదీర్).

[15] అంటే మక్కాలోని తిరస్కారులు ఇంకా వారి మిత్రులన్నమాట! వీరు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ధిక్కరించారు.

[16] ఇహలోకంలోగానీ, పరలోకంలోగానీ వారిని పట్టుకుని శిక్షిస్తాం.

[17] అంటే మాతృగర్భంలో అని భావం.

[18] గర్భకాలం పూర్తయ్యేవరకూ. ఈ గడువు 6 మాసాల నుండి 9 మాసాల వరకూ ఉంటుంది.

[19] అంటే – శిశువు గర్భంలో ఉండగా శరీరావయవాల పొందిక ఎలా ఉండాలో నిర్ధారిస్తాము. ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఏ పరిమాణంలో ఉండాలో, వాటి మధ్య ఎంత అంతరం ఉండాలో నిర్ణయిస్తాము. కళ్లుండవలసిన చోట కళ్లే ఉంటాయి. కాళ్లుండవలసిన చోట కాళ్లే ఉంటాయి. ఇతర వస్తువులు కూడా మేము నిర్ధారించిన దాని ప్రకారం సరిగ్గా తయారవుతాయి. చివరకు ఏ లోపమూ లేని – సంపూర్ణ మానవాకారం గల శిశువు మాతృగర్భం నుండి బయటికి వస్తుంది.

[20] అంటే – భూమి బ్రతికి ఉన్నవారిని తన వీపుపై మోస్తుంది, మరణించిన వారినితన గర్భంలోపల సమీకరించుకుంటుంది.

[21] ‘రవాసియ’ అంటే పర్వతాలు; ‘షామిఖాతున్’ అంటే ఎత్తైనవి అని అర్థం.

[22] దైవదూతలు నరకవాసులతో చెప్పేమాటలివి.

[23] నరకం నుండి లేచే దట్టమైన పొగ మూడు శాఖలుగా చీలి విస్తరిస్తుంది. దాని నీడ గోడ నీడలాగా లేదా వృక్షం నీడలాగానే ఉంటుంది. ఆ నీడలో కాస్త విశ్రాంతి తీసుకుందామని వారు ఆశిస్తారు. కాని నిజానికి అది చల్లదనాన్ని, హాయిని ఇచ్చే నీడకాదు.

[24] అంటే – నరక ఉష్ణం నుండి తప్పించుకోవటం వారివల్ల అయ్యే పనికాదు.

[25] ఈ ఆయతుకు మరో అనువాదం ఇది : ఆ నిప్పు రవ్వలు కొయ్య దుంగల వలే ఉంటాయి.

[26] ‘సుఫ్రున్’ (పసుపు పచ్చని) అనే అరబీ పదం అరేబియాలో ‘నల్లని’ అన్న అర్థంలో కూడా వాడుకలో ఉంది. నరకం జిమ్మే ఆ నిప్పు రవ్వ ఒక్కొక్కటి ఒక్కో భవనమంత ఉంటుంది. ఆ నిప్పు పగిలి మరిన్ని కణాలను వెదజల్లుతుంది. ఒక్కో కణం ఒక్కో ఒంటె అంత ఉంటుంది.

[27] ప్రళయదినాన సత్యతిరస్కారులు వివిధ పరిస్థితులను ఎదుర్కొంటారు. వారు ఒక దశలో అక్కడా అబద్ధాలు చెప్పి తప్పించుకోజూస్తారు. దేవుడు వారి నోటికి తాళం వేస్తాడు. వారి శరీరావయవాలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. తరువాత వారు నరకం వైపు తీసుకుపోబడతారు. ఆందోళనాభరితమైన ఆ సమయంలో కూడా వారి నోరు పెగలదు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారేదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాని వారి దగ్గర ఎలాంటి ఆధారమూ ఉండదు. అందువల్ల వారికి ఏమీ పాలుపోదు. మనం ప్రపంచంలో సయితం చూస్తూ ఉంటాము ఏ ఆధారమూ లేకుండా కేవలం వాగ్ధాటితో ఎదుటి వారి నోరు మూయించేందుకు ప్రయత్నించేవారు ఒక్కోసారి నిజం బయటపడేసరికి ఏం చెప్పాలో అర్ధంకాక నీళ్లు నములుతుంటారు. ఆ క్షణంలో అసలు వారి నోరు పెగలదు. పరలోకంలో సత్య తిరస్కారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.

[28] ఎందుకంటే అసలు వారి దగ్గర సముచితమైన సంజాయిషీ (కారణం) ఏదీ ఉండదు.

[29] దేవుడు తన దాసులతో పలికే మాటలివి : “ఈ రోజు మేము మాశక్తితో మీ అందరినీ ఒకే మైదానంలో సమీకరించాము. ఈనాడు మీ వ్యవహారాలన్నీ తేల్చబడతాయి.”

[30] ఇదొక హెచ్చరిక! ఓ అవిధేయులారా! ఈ రోజు మీరు తెలివినంతటినీ ఉపయోగించి, నానుండి తప్పించుకునే ఉపాయం ఏదయినా ఆలోచించగలిగితే ఆలోచించండి అంటాడు దేవుడు. కాని ఆ ధైర్యంగానీ, ఆ శక్తిగానీ ఎవరికుంటుంది? ఈ ఆయతుకూడా అర్రహ్మాన్ సూరాలోని 33వ ఆయతులాంటిదే. అందులో ఇలా అనబడింది: “ఓ జిన్నులారా! ఓ మానవులారా! భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి మీలో గనక ఉంటే పారిపోయి చూడండి. శక్తి, ప్రాబల్యం లేకుండా మీరెన్నటికీపారిపోలేరు.”

[31] నరకవాసుల మాదిరిగా ఇక్కడ అగ్నికీలల ఛాయ ఉండదు. పైగా ఇక్కడ దట్టమైన వృక్షాల, పెద్ద పెద్ద భవంతుల చల్లని నీడలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి.

[32] అక్కడ రకరకాల పండ్లు వ్రేలాడుతూ ఉంటాయి. స్వర్గవాసులు ఏ పండును ఆరగించాలన్నా అవి వారి ముందుకు వచ్చేస్తాయి.

[33] ఉపకారానికి బదులు ఉపకారమే కదా! అందుకే వారు ఇహలోకంలో చేసిన మంచి పనులకు బదులుగా వారికి ఈ బహుమానం ఇవ్వబడిందని తెలుపటం జరిగింది. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే దైవకారుణ్యానికి మనిషి నోచుకుని, స్వర్గంలో ప్రవేశించాలంటే అతను సత్కర్మలు చేయాలి. సదాచరణ చేయకుండా దైవకారుణ్యాన్ని ఆశించేవారి ఉపమానం నేలను దున్ని విత్తనం నాటకుండా వదిలేసిన రైతులవంటిది. లేదా చేదు విత్తనాలను నాటి తీపి ఫలాలను ఆశించే మూర్ఖుల వంటిది.

[34] ఈ ఆయతు ద్వారా తెలిసే సత్యం కూడా అదే – మీరు పరలోకంలో సత్ఫలితాన్ని పొందగోరుతుంటే ఇహలోకంలో సత్కార్యాలు ఇతోధికంగా చేయండి, సన్మార్గాన నడవండి.

[35] దైవభక్తి పరాయణులు దైవానుగ్రహాలకు నోచుకున్నారుగాని ధిక్కారజనుల వాటా క్రిందికి పరాభవమే మిగిలింది. ఇంతకన్నా నష్టం ఇంకేముంటుంది?

[36] ప్రళయదినాన్ని త్రోసిపుచ్చే దుర్మార్గులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. నిజానికి ఇది తీవ్రమైన హెచ్చరిక! సరే కొంతకాలంపాటు ప్రాపంచిక సుఖసౌఖ్యాలను జుర్రుకోండి. మీరెలాగూ పాపాత్ములే మీలాంటి దుష్టుల కోసం యాతనా సామగ్రి సిద్ధంగానే ఉంటుంది’ అని చెప్పబడింది.

[37] అంటే – నమాజు చేయండని వారికి చెప్పినప్పుడు వారు నమాజు చేయరు.

[38] అంటే – దైవాజ్ఞలను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యం చేసిన వారిని ఆ రోజు అవమానం క్రమ్ముకుంటుంది.

[39] దివ్య ఖుర్ఆన్లాంటి అద్భుత విషయాన్నే వారు త్రోసిపుచ్చినప్పుడు ఇక వారు మరే విషయాన్ని విశ్వసిస్తారు? ఈ ఆయతులో కూడా దివ్య ఖుర్ఆన్ను ‘హదీసు’ అనే పదంతో పేర్కొనటం జరిగింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా అనేకం ఉన్నాయి. బలహీన ఆధారాలతో ఉల్లేఖించబడిన ఒక హదీసులో ఇలా ఉంది: “అత్తీన్ సూరాలోని చివరి వాక్యం “అలైసల్లాహు పఠించినప్పుడు సమాధానంగా, ‘బలా వ అన అలా జాలిక మినషాహిదీన్” అనాలి. సూరె ఖియామాలోని చివరి వాక్యం చదివినప్పుడు కూడా జవాబుగా ‘బలా’ అని పలకాలి. అలాగే ముర్సలాత్ సూరాలోనిచివరి వాక్యం – ఫబిఅయ్యి హదీసిమ్ బాదహు యూమినూన్ పఠించినప్పుడు, దీనికి సమాధానంగా ‘ఆమన్నా బిల్లాహి” అనాలి (అబూ దావూద్). కొంతమంది పండితుల ప్రకారం ఈ ఆయతుల పఠనం విన్నవారు కూడా పై విధంగా సమాధాన మివ్వాలి.