92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/n1d3UzeEsAQ (పార్ట్ 1) [50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 21 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషిచేయడం గురించి, ఇహ లోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది. మొదటి ఆయతులో వచ్చిన ‘లైల్’ (రాత్రి) అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని, ఇహపరలోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని, మనం అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేస్తే, అల్లాహ్ పట్ల భయభీతులు కలిగి ఉండి, దానధర్మాలు చేస్తే, సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమనీ, అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని తెలిపింది. కాని మనిషి దుర్మార్గానికి కట్టుబడి, అల్లాహు దూరమైతే, స్వార్ధంతో, దురాశతో వ్యవహరిస్తే, సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు. అల్లాహ్ఆ దేశాలను తిరస్కరించిన వారికి భగభగమండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది.

92:1 وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
(చీకటిని) అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా! [1]

92:2 وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా! [2]

92:3 وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ
మగ, ఆడ జాతులను సృష్టించిన వాని సాక్షిగా! [3]

92:4 إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ
నిశ్చయంగా మీ కృషి (ప్రయత్నం) అనేక విధాలుగా ఉంటుంది. [4]

92:5 فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
ఎవరైతే (దైవమార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు) భయపడుతూ ఉన్నాడో, [5]

92:6 وَصَدَّقَ بِالْحُسْنَىٰ
ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో, [6]

92:7 فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వొసగుతాము. [7]

92:8 وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
మరెవరైతే పిసినారిగా తయారై, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, [8]

92:9 وَكَذَّبَ بِالْحُسْنَىٰ
సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, [9]

92:10 فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
అతనికి మేము కఠిన (దుర్) మార్గపు సామగ్రిని సమకూరుస్తాము. [10]

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/T4lr5h3uhN0 (పార్ట్ 2) [41 నిముషాలు]

92:11 وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు. [11]

92:12 إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే. [12]

92:13 وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
పరలోకం, ఇహలోకం కూడా నిజంగా మా అధీనంలోనే ఉన్నాయి. [13]

92:14 فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.

92:15 لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు. [14]

92:16 الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
వాడు (సత్యాన్ని) ధిక్కరించి, (దాన్నుండి) ముఖం తిప్పుకుని పోయాడు.

92:17 وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు – [15]

92:18 الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
(ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. [16]

92:19 وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ
పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. [17] (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు).

92:20 إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ
మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. [18]

92:21 وَلَسَوْفَ يَرْضَىٰ
కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. [19]

[1] పగలు – రేయి, వెలుగు – చీకటి, ఆడ – మగ మొదలగునవి ఒండొకదానికి విరుద్ధంగా ఉన్నట్లే మనిషి చేసే కర్మల్లో కూడా మంచీ – చెడు అనే పరస్పర విరుద్ధమైనవి ఉంటాయి. రానున్న వాక్యాలలో ఆ విషయం చెప్పటానికి ఈ ప్రమాణం చేయబడింది. రాత్రి చీకటి కూడా పగటి వెలుగును వెంటాడుతూ ఉంటుంది.

[2] పగలును రాత్రి తరుముకుంటూ వచ్చినట్లే రాత్రిని పగలు కూడా వెంటాడుతూ వస్తుంది. తెల్లవారు జామున ఆకాశంలో ధవళరేఖలు ప్రస్ఫుటం అయ్యేకొలదీ చీకటి విడిపోతూ ఉంటుంది. చివరికి మసక మసక వెలుతురు కాస్తా చీకటి తెరలను చీలుస్తూ పూర్తిగా ప్రత్యక్షమవుతుంది.

[3] ఇక్కడ అల్లాహ్ తన గురించి తానే ప్రమాణం చేశాడు. ఎందుకంటే లోకంలో ఆడ మగ (లేక పెంటి – పోతు) జతలను సృష్టించినవాడు స్వయంగా ఆయనే.

[4] అంటే కొందరు సత్కర్మలు చేసుకుంటారు. మరికొందరు దుష్కర్మలు చేస్తారు. సత్కర్మలు చేసినవారు తమ సంపాదనకు ప్రతిఫలంగా స్వర్గం పొందుతారు. దుష్కర్మలకు పాల్పడినవారు తమ సంపాదనకు బదులుగా నరకానికి ఆహుతి అవుతారు.

[5] అంటే, ఎవరు మంచి పనుల కొరకు తన ధనాన్ని ఖర్చుపెడతాడో, అల్లాహ్ అధర్మంగా ఖరారు చేసిన పనులకు దూరంగా ఉంటాడో ఆ వ్యక్తి.

[6] అంటే – దైవమార్గంలో ధనాన్ని వెచ్చించినందుకు, భయభక్తులతో జీవితం గడిపినందుకు అల్లాహ్ బహుమానం ఇస్తాడని ఎవరు దృఢంగా నమ్ముతాడో….

[7] యుస్రా‘ అంటే సత్కార్యాలు లేక సద్బుద్ధి. అంటే, ఇలాంటి సజ్జనునికి మేము మంచి పనులు చేసే, దైవవిధేయతా మార్గాన నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాము. ఆ మార్గాన్ని అతని కొరకు సులభతరం చేస్తాము. ఈ ఆయతు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నేపథ్యంలో అవతరించినదని ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఆరుగురు బానిసలకు బానిసత్వం నుండి విముక్తి కల్పించారు. వారు ఇస్లాం స్వీకరించినందుకు మక్కా అవిశ్వాసులు వారిని తీవ్రంగా వేధించేవారు (ఫత్ హుల్ ఖదీర్).

[8] అంటే దైవమార్గంలో ఖర్చుపెట్టకుండా, దైవాజ్ఞలను లక్ష్యపెట్టకుండా నిర్భయంగా ఉండే వ్యక్తి.

[9] ఇంకా – పరలోకంలో అల్లాహ్ ఇచ్చే బహుమానాన్ని లేక విధించే శిక్షను నమ్మనివాడు.

[10]ఉస్రా‘ అంటే గడ్డుస్థితి అని అర్థం. చెడుల మార్గం, నష్టకరంగా పరిణమించే విధానం అన్నమాట! అంటే దైవమార్గంలో పిసినిగొట్టుగా తయారై, దైవాదేశాలను సయితం ఖాతరు చేయకుండా పోయేవాడికి మేము అవిధేయతామార్గాన్ని మరింత సులువు చేస్తాము. దాంతో అతనికి మంచిని, శుభాన్ని ఆస్వాదించే భాగ్యం మరింత కష్టమైపోతుంది. దివ్య ఖుర్ఆన్లో ఈ విషయాన్ని దేవుడు పలుచోట్ల పలు విధాలుగా వివరించాడు. సారాంశం మాత్రం ఒక్కటే – శ్రేయస్కర మార్గాన్ని అవలంబించిన వ్యక్తికి దేవుడు ఆ మార్గంలో ఇంకా ముందుకు సాగిపోయే సౌకర్యాన్ని ఇస్తాడు. దానికి బదులు దుర్మార్గాన్నే అంటిపెట్టుకుని ఉండే వాడ్ని దేవుడు వాడి మానాన వదలిపెట్టేస్తాడు. ఇదంతా అల్లాహ్ తన జ్ఞానంతో రాసిపెట్టిన విధివ్రాత ప్రకారమే జరుగుతుంది (ఇబ్నె కసీర్). ఈ మాటే హదీసులో ఈ విధంగా చెప్పబడింది : “మీరు ఆచరణకు ఉపక్రమించండి. ప్రతి వ్యక్తీ తానేపని కోసం పుట్టించబడ్డాడో అది అతని కోసం సులభతరం చేయబడుతుంది. సౌభాగ్యవంతునికి సౌభాగ్యానికి నోచుకునే కర్మలను చేసే సద్బుద్ధి వొసగబడుతుంది. దౌర్భాగ్యునికి దౌర్భాగ్యానికి లోను చేసే కర్మలు సులభతరం చేయబడతాయి” అని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (సహీహ్ బుఖారీ – అల్ లైల్ సూరా వ్యాఖ్యానం).

[11] అంటే వాడు నరకంలో పడిపోయే సమయంలో వాడు కూడబెట్టిన ధనం వాడికేమాత్రం ఉపయోగపడదు.

[12] అంటే – ధర్మాధర్మాలను, మంచీచెడులను, ఉచితానుచితాలను, సత్యాసత్యాలను విడమరచి చెప్పి సన్మార్గమేదో – అపమార్గమేదో సూచించే బాధ్యత మామీదే ఉన్నది (అయితే ఆ పనిని మేము చేసేశాము) అని అల్లాహ్ అంటున్నాడు.

[13] అంటే-ఇహపరాలు రెండింటికీ యజమానులం మేమే. ఈ రెండు లోకాలలో కూడా మేము తలచినట్లుగా చేస్తాము. కాబట్టి మా దాసులలో ఎవరయినాసరే – తమకు ఇహం కావాలన్నా, పరం కావాలన్నా – మమ్మల్నే అడగాలి. ఎందుకంటే అభ్యర్థించే ప్రతి ఒక్కరికీ మేమే మా ప్రణాళిక ననుసరించి ప్రసాదిస్తాము.

[14] ఈ ఆయతును అర్థం చేసుకోవటంలో మురియా అనే ఒక వర్గంవారు పొరబడ్డారు. అవిశ్వాసులు మాత్రమే నరకానికి ఆహుతి అవుతారని, ముస్లింలు ఎన్ని పాపాలు చేసినా వారిని నరకాగ్ని తాకదని వక్రభాష్యం చెప్పారు. ఈ భాష్యం సరైనది కాదు. ఎంతోమంది ముస్లింలు కూడా తమ పాపాల మూలంగా నరకానికి పోతారు. అయితే అల్లాహ్ వారిని, వారి దురాగతాలకుగాను కొంతకాలం పాటు శిక్ష విధించి, దైవప్రవక్తల, దైవదూతల, పుణ్యపురుషుల సిఫారసుపై వారిని నరకం నుంచి విముక్తి కల్పిస్తాడు. కరడుగట్టిన అవిశ్వాసులు దౌర్భాగ్యులనీ, నరకం అసలు వారికోసమే చేయబడిందని చెప్పటం ఈ ఆయతు ముఖ్యోద్దేశం. వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు. అదే ముస్లింలలోని తలబిరుసులు, అవిధేయులైతే వారు తమ పొగరు మూలంగా నరకానికి తప్పకుండా ఆహుతి అవుతారు. కాని వారు నరకంలో కలకాలం ఉండరు. కొంతకాలం తరువాత నరకం నుంచి తీయబడతారు (ఫత్ హుల్ ఖదీర్).

[15] అంటే, అతను నరకానికి దూరంగా ఉంచబడతాడు. స్వర్గంలో ప్రవేశింపజేయ బడతాడు.

[16] అంటే – అతను తన సంపదను దైవాజ్ఞల కనుగుణంగా ఖర్చుచేస్తాడు. తద్వారా తన ఆత్మను పరిశుద్ధపరచుకోవటంతో పాటు, తన సంపదను కూడా పరిశుద్ధపరచు కుంటాడు. జకాత్ ద్వారా ధనం పరిశుద్ధమవుతుంది కదా!

[17] అంటే – ఒకరు తనకు చేసిన ఉపకారానికి బదులు తీర్చుకునే ఉద్దేశంతో గాకుండా మేలుచేసే ఉద్దేశంతో ఇస్తాడు.

[18] అతను ఎవరికి ఏ ఉపకారం చేసినా, ఎవరికి ఏ సహాయం చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా అతని లక్ష్యం ఒక్కటే అయి ఉంటుంది – తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేయాలి, తద్వారా స్వర్గం పొందాలి.

[19] దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉన్నది. 1. ఆయన (అంటే అల్లాహ్) కూడా సంతోషిస్తాడు. లేదా 2. ఈ సద్గుణాలున్న వ్యక్తికి అల్లాహ్ స్వర్గభాగ్యాలు ప్రసాదిస్తాడు. దాంతో ఆ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తాడు. ఈ ఆయతు హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) నేపథ్యంలో అవతరించిందని చాలామంది ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు ఆధారాలతో సహా అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాక్యం సదరు సద్గుణాలున్న విశ్వాసులందరికీ వర్తిస్తుందనేది నిజం.

30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr