107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/eeOM0ICPkPo [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

(1) తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు.

(2) కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచి పనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

    107:1 أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
    తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?! [2]

    107:2 فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ
    వీడే అనాధను గెంటివేసేవాడు. [3]

    107:3 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
    నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు. [4]

    107:4 فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
    ఆ నమాజీలకు వినాశం తప్పదు (‘వైల్’ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది).

    107:5 الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
    (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. [5]

    107:6 الَّذِينَ هُمْ يُرَاءُونَ
    వారు (ఒకవేళ నమాజు చేసినా)పరులకు చూపటానికి చేస్తారు. [6]

    107:7 وَيَمْنَعُونَ الْمَاعُونَ
    అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. [7]

    [1] ఈ సూరాను సూరయె దీన్ , సూరయె అరఐత్ గా , సూరయె యతీమ్ గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్ హుల్ ఖదీర్).

    [2] నీవు చూశావా? లేక నీవు గమనించావా? అని దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అనబడిన మాటలివి. తీర్పుదినాన్ని, శిక్షా బహుమానాలను త్రోసిపుచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో నీవు పరికించావా? వాడి గుణం ఎలా ఉంటుందో తదుపరి వాక్యంలో చెప్పబడింది.

    [3] 1.వాడు పరమ పీనాసి. 2. అంతిమ దినాన్ని తిరస్కరించేవాడు. ఇలాంటి వాడు తండ్రిలేని బిడ్డలను ఎలా ఆదరిస్తాడు? మానవీయ విలువల పట్ల, నైతిక నియమాల పట్ల నమ్మకం గలవాడు, పరలోకంలోని శిక్షా బహుమానాలను సత్యమని విశ్వసించేవాడు మాత్రమే సాధారణంగా అనాధల, నిరాధార జీవుల యెడల దయతో మెలగుతాడు. అలా కాకుండా ధన వ్యామోహంలో పడి, పిసినిగొట్టుగా తయారైనవాడు అభాగ్య జీవులపై జాలి చూపడు. వాడి గుండె కరకు గుండెగా మారిపోతుంది.

    [4] ఈ పని కూడా పరలోకంపై దృఢ విశ్వాసం గలవాడు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే తాను చేసిన ఈ పుణ్యకార్యానికిగాను తన ప్రభువు పుణ్యఫలం ఇస్తాడన్న ఆశ అతనికి ఉంటుంది.

    [5] ఎవరు వీరు? అసలు నమాజులను పట్టించుకోనివారు. లేదా ఒకప్పుడు నమాజు చేస్తూ ఉండి ప్రస్తుతం నమాజు చేయటం మానేసినవారు. లేదా నమాజులను నిర్ణీత వేళకు చేయకుండా తమకు వీలు చిక్కినప్పుడు చేసేవారు. నమాజులలో ఏకాగ్రతపట్ల, అణకువ, వినమ్రత పట్ల తగినంత శ్రద్ధ చూపకుండా చాలా అజాగ్రత్తగా వుండేవారు. మరీ బద్దకంతో, బలవంతంగా నమాజు చేసేవారు. ఈ అంశాలన్నీ ఈ ‘అశ్రద్ధ’లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి నమాజు చేసేటప్పుడు ఈ లోపాలన్నింటినీ అధిగమించి,శ్రద్ధాభక్తులతో నమాజు చేయాలి. సాధారణంగా పరలోకంపై లెక్కల ఘడియపై గట్టి నమ్మకం లేని వారు మాత్రమే తమ ప్రార్థనలలో ఈ రకమైన ఏమరుపాటుకు, అలసత్వానికి గురవుతుంటారు. ముఖ్యంగా కపట విశ్వాసులలో ఇలాంటి ధోరణి అధికంగా ప్రబలుతుంది. అందుకే వారినుద్దేశించి ఇలా అనబడింది -“వారు నమాజ్కొ రకు లేస్తే, బద్దకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ ను చాలా తక్కువగా స్మరిస్తారు.” (అన్ నిసా 142).

    [6] అసలు ఇలాంటి వారి నమాజులో చిత్తశుద్ధి ఉండదు. వారు జనుల వెంట ఉన్నప్పుడు మాత్రం నమాజు చేస్తారు. అన్యధా అసలు నమాజు గురించే ఆలోచించరు. అంటే కేవలం నలుగురికి చూపే ఉద్దేశంతో మాత్రమే వారు నమాజు చేస్తారు.

      [7] ‘మాఊన్’ అంటే ‘జకాత్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ‘జకాత్’ కూడా చాలా తక్కువ పరిమాణంలో (కేవలం రెండున్నర శాతం) ఉండటం వల్ల బహుశా ‘మావూన్’ అనేది ఇదే అని వారి వాదన. మరికొంతమంది ప్రకారం ‘మావూన్’ అంటే ఇండ్లలో ఉపయోగించే చాలా చిన్న చిన్న వస్తువులు, సాధారణ పనిముట్లు. ఇరుగుపొరుగు వారు వాటిని అవసరానికి అడిగి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వస్తువులను తమ పొరుగువారు అడిగినప్పుడు అన్యధా భావించకుండా ఇస్తూ ఉండటం మంచి లక్షణం. దీనికి భిన్నంగా పిసినారితనం ప్రదర్శించటం మంచిది కాదు. పైగా ఇది పరలోకంపై విశ్వాస రాహిత్యానికి నిదర్శనం.

      30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
      https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr