[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/milad-un-nabee-in-shariah
[PDF] [28 పేజీలు]
ప్రముఖ అంశాలు:
- 1) సహాబాల ఆచరణల వెలుగులో ఖుర్ఆన్ మరియు హదీసుల అవగాహన.
- 2) ధార్మిక పరంగా మిలాదున్నబీ (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదినం ఉత్సవానికున్న విలువ.
- 3) మూడు ముఖ్య నియమాలు
- 4) ధర్మంలో ‘బిద్దతే హసన’ (మంచి క్రొత్త పోకడ) యొక్క అస్తిత్వం వుందా?
- 5) మిలాదున్నబీని జరుపుకొనే వారి ఆధారాలు మరియు వాటి జవాబులు.
ఇస్లామీయ సహెూదరులారా!
ఒక ముస్లిం యొక్క సాఫల్యత అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడంలోనే వుంది. దివ్య ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన విషయాలను అనుసరిస్తూ, వాటి తిరస్కరణ, అవిధేయతలకు ఎల్లప్పుడూ దూరంగా వుండాలి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల విధేయత చూపే వారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గం) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం వుంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడిని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి వుంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే వుంది.” (నిసా:13- 14)
పై ఆయతులపై ఒక్కసారి దృష్టి సారించండి. వీటిలో అల్లాహ్ – విధేయత చూపుతూ తనను అనుసరించే వారికి స్వర్గపు శుభవార్తనూ, దీనికి వ్యతిరేకంగా అవిధేయత చూపి తనను తిరస్కరించే వారికి నరక శిక్షను గూర్చి తెలియజేశాడు. అందుకే ప్రతి ముస్లిం తన హృదయంలో తొంగి చూసి, తనే మార్గంలో పయనిస్తున్నాడో విశ్లేషించుకోవాలి. స్వర్గానికి తీసుకెళ్ళే మార్గంలోనా లేక (అల్లాహ్ శరణు) నరకంలోకి తీసుకెళ్ళే మార్గంలోనా అని. అల్లాహ్ కు విధేయత ఎలా సాధ్యమవుతుంది? అతనికి విధేయత అనేది – దివ్య ఖుర్ఆన్ ను చదవడం, నేర్పించడం ద్వారా మరియు దాని (ఆజ్ఞల)పై దృష్టి సారించి, దానినే మన జీవితపు కొలమానంగా నిర్ధారించడం ద్వారా సాధ్యమవుతుంది.
ఇక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు విధేయత ఎలా సాధ్యమవుతుంది?
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులను చదివి, వాటి ప్రకారం ఆచరించడం ద్వారా సాధ్యమవుతుంది. విశ్వాసాలైనా, ఆరాధనలైనా, ఇతర వ్యవహారాలైనా, సుగుణాలైనా – ప్రతి విషయంలోనూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుసరించాలి.
ఆయన పరిశుద్ధ జీవిత చరిత్రను చదవాలి మరియు ఆచరణ రీత్యా దానిని మన జీవితాలలో ప్రతిబింబింపజేయడానికి ప్రయత్నించాలి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడం వాస్తవానికి అల్లాహ్ కు విధేయత చూపడమేనన్న విషయం అందరికి తెలిసిందే. ఎందుకంటే అల్లాహ్ యే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మన కోసం ఆదర్శంగా చేసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగుజాడల్లో నడవమని మనల్ని ఆదేశించాడు.
ఇంకో విషయమేమిటంటే – ఇహపరలోకాల సాఫల్యం అనేది అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపుతూ ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఆచరించడం ద్వారానే సాధ్యం అన్న విషయం సుస్పష్టం. కానీ, ఇక్కడ జనించే ప్రశ్న ఏమిటంటే – ఈ విషయంలో మనం ఎవరిని కొలమానంగా భావించాలి? ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? అని.
ఎవరినైతే స్వయంగా అల్లాహ్ యే కొలమానంగా, ఆదర్శంగా ఖరారు చేశాడో వారినే మనం కొలమానంగా, ఆదర్శంగా చేసుకోవాల్సి వుంటుంది. వారెవరంటే -దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను స్వయంగా దర్శించి, ఆయన్ను విశ్వసించిన ఈ అనుచర సమాజపు మొట్టమొదటి ముస్లిములు. ఎవరినైతే అల్లాహ్ స్వర్గపు శుభవార్త నందించి ‘తాను సంతృప్తి చెందాను’ అని ప్రకటించాడో, ఎవరినైతే తన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొరకు ఎన్నిక చేసి ఆయన నోటి ద్వారా అల్లాహ్ గ్రంథాన్ని మరియు హదీసులను వినే సౌభాగ్యాన్ని కలుగజేశాడో వారు… అంటే.. సహాబాలు (ప్రవక్త సహచరులు).
ఆ సహాబాల విశ్వాసాన్ని అల్లాహ్ ఇతరుల కోసం కొలమానంగా ఖరారు చేశాడు. (దీనికి సంబంధించి) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఒకవేళ వారు కూడా మీరు (సహాబాలు) విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైర భావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం.” (బఖర : 137)
ఆ సహాబాల మార్గం వదలి ఇతర మార్గాలపై నడిచే వారికి అల్లాహ్ నరక శిక్షను గురించి హెచ్చరించాడు. (దీనికి సంబంధించి) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“తనకు రుజుమార్గం (సన్మార్గం) విశదమైనప్పటికీ ఎవరైనా ప్రవక్తకు వ్యతిరేకంగా పోతే, విశ్వాసుల మార్గాన్ని వీడి ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలిన వైపునకే మరల్చుతాము. కడకు అతణ్ణి నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ నివాసం.” (నిసా : 115)
ఈ ఆయత్ లో ‘విశ్వాసుల మార్గం‘ అంటే ‘సహాబాల మార్గం‘ అని అర్థం. ఎందుకంటే – దివ్య ఖుర్ఆన్ అవతరించే సమయంలో కేవలం సహాబాలే విశ్వాసులుగా ఉన్నారు.
ఈ సంక్షిప్త వివరణ ద్వారా తెలిసిందేమిటంటే – ముస్లిములు తమ క్రియాశీలక జీవితాల్లో ఖుర్ఆన్ మరియు హదీసులనే తమ ముందు వుంచాలి. ఈ విషయంలో – సహాబాల ఆచరణల ద్వారా మార్గదర్శకత్వం పొందుతూ ఖుర్ఆన్, హదీసులపై వారు ఆచరించినట్లుగానే ఆచరించాలి. ఎందుకంటే అల్లాహ్ వారినే సత్యానికి ప్రామాణికంగా / కొలమానంగా ఖరారు చేశాడు.
ప్రత్యేకంగా, విభేదాల విషయంలోనైతే – ఖుర్ఆన్, హదీసులు, సహాబాల ఆచరణ వెలుగులోనే వీటిని పరిష్కరించుకోవాలి. అంతిమ నిర్ణయం – తమ కోరికలు లేదా కొన్ని ప్రత్యేక దృష్టి కోణాలతో కాకుండా, కేవలం ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం తీసుకోవాలి. ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలు లభించాక సహాబాలు ఏ విధంగానైతే వాటి ముందు తల వంచేవారో, ఖచ్చితమైన ఆధారాలు దొరికిన తర్వాత వ్యర్థంగా, మూర్ఖంగా వాదించడం ధర్మయుక్తం కాదని వారెలాగైతే భావించేవారో మనం కూడా అలాగే ఆచరిస్తూ ఖుర్ఆన్ మరియు హదీసుల ముందు శిరస్సులు వంచేయాలి. (అంటే మనస్పూర్తిగా వాటిని స్వీకరించి ఆచరించాలి).
విభేదాల పరిష్కారానికి గాను అల్లాహ్ తన ఆఖరి గ్రంథంలో ఈ పద్దతినే నిర్దేశించాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలో నైనా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి. మీకు నిజంగా అల్లాహ్ పై, అంతిమ దినంపై విశ్వాసం ఉన్నట్లయితే ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటి కంటే ఉత్తమమైనది.” (నిసా : 59)
ఈ ఆయత్ లో “ఫీ షయ్యిన్” అనేది నామవాచకం మరియు “ఒకవేళ విభేదాలు తలెత్తితే” అన్న షరతు తర్వాత వచ్చింది.
అరబ్బీ భాషలో ఎక్కడైనా ఈ పద్ధతి గనక అవలంబిస్తే, దానితో సాధారణ విషయాలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. దీని అర్థం ఏమిటంటే ధార్మిక పరమైన ముఖ్యాంశాలు మరియు వాటి వివరణలకు సంబంధించిన విషయాలన్నింటిలోనూ ఎప్పుడైనా విభేదాలు తలెత్తితే, వాటి పరిష్కారం కోసం ఖుర్ఆన్, సున్నత్ లను సంప్రదించాలి. ఒకవేళ అన్ని విభేదాల పరిష్కారం, ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ లలో లేకుండా వుంటే, అల్లాహ్ ఎప్పుడు కూడా ‘వాటి వైపునకు మళ్ళించండి’ అని సెలవిచ్చి వుండేవాడు కాదు.
ఇలాగే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఈ విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పారు. .
“నేను మీకు అల్లాహ్ కు భయపడడం గురించి, అమీర్ (నాయకుడు)కు విధేయత చూపడం గురించి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఒకవేళ అతను (అమీర్) నల్ల జాతికి చెందిన బానిసైనా సరే. (బాగా గుర్తుంచుకోండి)! నా తదనంతరం జీవించి వుండేవారు ఉమ్మత్ లో ఎన్నో విభేదాలను చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీరు నా సున్నత్ లపై ఆచరించడాన్ని అనివార్యం చేసుకోండి మరియు సన్మార్గగాములైన ఖలీఫాల పద్ధతిని పట్టుకోండి. వాటితో అతుక్కుపోండి, వాటిని దంతాలతో అదిమి వుంచండి. ఇంకా ధర్మంలో సృష్టించబడిన కొంగ్రొత్త విషయాలకు (బిదాత్ లకు) దూరంగా వుండండి. ఎందుకంటే ధర్మంలో సృష్టించబడిన ప్రతి క్రొత్త విషయం బిదత్ అవుతుంది మరియు ప్రతి బిదత్ మార్గభ్రష్టతకు ఆనవాలు.” (అబూదావూద్ : 4607, సహీ-అల్ బానీ)
నిసా సూరా ఆయత్ మరియు అబూదావూద్ లోని ఈ సహీ హదీసు – ఈ రెండింటినీ ముందుంచితే – ఇంతకు ముందు మేము వివరించిన – ‘అన్ని విభేదాల పరిష్కరణ విషయంలో ఖుర్ఆన్, హదీసులను సంప్రదించడం తప్పనిసరి’ – అన్న విషయానికి సంపూర్ణ బలం చేకూరుతుంది. దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహివ సల్లం) వసీయతు ప్రకారం, ముస్లిములందరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ మరియు సన్మార్గం పొందిన ఖలీఫాల సున్నత్ లను గట్టిగా పట్టుకున్నప్పుడే విభేదాలన్నీ దూరమవుతాయి. ఒకవేళ ప్రతి వ్యక్తి తన కోరికలకు లేదా కొన్ని ప్రత్యేక దృష్టి కోణాలకే అతుక్కుపోతే ఖచ్చితంగా విభేదాలు ఎప్పుడూ అంతం కావు. పైగా అవి రోజు రోజుకూ పెరుగుతూ పోతాయి. (దురదృష్టవశాత్తూ) నేడు ముస్లిముల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
మీరు కొంచెం ఈ హదీసుపై దృష్టి సారించండి!
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుగా – తన సున్నత్ మరియు సన్మార్గగాములైన ఖలీఫాల పద్దతిని గూర్చి వివరించారు. తదుపరి, క్రొత్త పోకడలు ఆరంభించడాన్ని వారిస్తూ, ప్రతి క్రొత్త ఆచరణను బిదాత్ మరియు మార్గభ్రష్టతగా ఖరారు చేశారు. దీని ద్వారా తెలిసిందేమిటంటే – ఒకవేళ ముస్లిములు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతి మరియు ఖలీఫాల పద్ధతిని విడనాడితే వారు ధర్మంలో క్రొత్త పోకడలల్లో (ఆచారాల్లో) మునిగిపోయి సన్మార్గం నుండి దూరంగా వెళ్ళిపోతారు.
నేడు ముస్లిముల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. వల్లాహుల్ ముస్త’ఆన్ – అల్లాహ్ యే మనల్ని రక్షించేవాడు!
విభేదాలకు లోనయిన విషయాల్లో ఒక ప్రధానమైన విషయం – రబీ ఉల్ అవ్వల్ మాసపు 12వ తారీఖును మిలాదున్నబీ (దైవప్రవక్త జన్మదినోత్సవం) జరుపుకోవడం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా మంది ముస్లిములు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుభ పుట్టుకకు సూచనగా ప్రతియేడు రబీ ఉల్ అవ్వల్ మాసపు 12వ తేదీన మిలాదున్నబీ పేరుతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. కట్టడాలను (ఇండ్లు, మసీదులు, దర్గాలు వగైరా….) దీపాలతో, జెండాలతో అలంకరిస్తారు. నాత్ (ధార్మిక కవిత్వం)ల పఠన నిమిత్తం ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడతాయి. కొన్ని దేశాల్లోనయితే ప్రత్యేకంగా ఈ రోజు ప్రభుత్వపరంగా సెలవు ప్రకటించబడుతుంది.
ఖుర్ఆన్ మరియు హదీసులను గూర్చి మేము ఇంతకు ముందు ఇచ్చిన వివరణను దృష్టిలో పెట్టుకుని – ఖుర్ ఆన్, హదీసులలో మిలాదున్నబీ ఉత్సవానికి సంబంధించి ఏవైనా ఆధారాలు వున్నాయా? అన్న విషయాన్ని పరిశీలించాలి.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జన్మదినాన్ని పండుగగా ఎప్పుడైనా జరుపుకున్నారా? లేక దాన్ని ప్రోత్సహించారా? సన్మార్గ గాములైన ఖలీఫాలలో ఎవరైనా తమ పరిపాలనా కాలంలో ఈ జన్మదినానికి సూచనగా ఉత్సవం జరుపుకున్నారా? మొట్టమొదటి శ్రేష్ఠ తరం (సహాభాల తరం) నందు ఈ పండుగ అస్తిత్వం వుందా?
ఒకవేళ ఖుర్ఆన్, హదీసులు మరియు మొదటి శ్రేష్ఠ తరం చరిత్రను పూర్తి నిజాయితీతో గనక పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇలా లభిస్తుంది:
- ఖుర్ఆన్, హదీసుల్లో మిలాదున్నబీ ఉత్సవానికి ఆధారమేదీ లేదు.
- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జన్మదినాన్ని ఎప్పుడూ జరుపుకో లేదు మరియు దానిని ప్రోత్సహించనూ లేదు.
- ఆ తర్వాత, సన్మార్గగాములైన ఖలీఫాలలో ఎవ్వరు కూడా తమ పరిపాలనా కాలంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుభపుట్టుకకు సూచనగా ఈ దినాన్ని ప్రభుత్వపరంగా కానీ, ప్రైవేటు పరంగా (వ్యక్తిగతంగా) కానీ ఉత్సవంగా జరుపుకోలేదు. ఈ దినాన్ని పండుగ దినంగా కూడా ఖరారు చేయలేదు. మరి చూడబోతే, వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అత్యధికంగా ప్రేమించేవారు. కనుక, వారు అలా చెయ్యాలని అనుకొని వుంటే అతి సులభంగా ఈ పని చేయగలిగే వారు. కారణం, అప్పుడు ప్రభుత్వం వారి చేతుల్లోనే వుంది. అన్నింటికన్నా శ్రేష్ఠమైన కాలం-అంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖరారు చేసిన సహాబాలు, తాబయీలు, తబా తాబయీల కాలం – ఈ కాలంలో కూడా ప్రజలలో మిలాదున్నబీకి సంబంధించిన ఆలోచనే లేదు మరియు దానిని వారు ఉత్సవంగా కూడా జరుపుకొనేవారు కాదు. దానితోపాటు, ఈ అనుచర సమాజపు సుప్రసిద్ధ ఉలమాల (ధార్మిక పండితులు) వద్ద కూడా ఈ పండుగకు సంబధించి ఆలోచనే లేదు. వారు కూడా దీనిని ఎప్పుడూ పండగ గా జరుపుకోలేదు. తమ శిష్యులకు కూడా వారు దీనిని గురించి బోధించలేదు.
మిలాదున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆవిష్కరణ కర్త
మిలాదున్నబీ ఉత్సవాన్ని మొట్టమొదట అబూ సయీద్ కబూరీ బిన్ అబుల్ హసన్ అలీ బిన్ ముహమ్మద్ ఉర్స్ అల్ మలికుల్ ఆజమ్ ముజప్పరుద్దీన్, ఇర్బిల్ (మౌసల్), మరణం, 18 రమజాన్ 630 హి. శ. ప్రారంభించాడు. ఈ ఉత్సవానికి సంబంధించిన శిబిరాల్లో లెక్కలేనంత డబ్బు ఖర్చు చేసేవాడు. నృత్యంతో పాటు పాటల కచేరీలు కూడా ఏర్పాటు చేసేవాడు.
మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి ఇలా తెలియజేశారు:
చరిత్రకారులు వివరించిన విషయాలేమిటంటే- ఈ రాజు నాట్య కారులను, గాయకులను సమీకరించి సంగీత వాయిద్యాలతో పాటలు వింటూ, తను కూడా నృత్యం చేసేవాడు. ఇలాంటి వ్యక్తి యొక్క విశ్వాస లేమి మరియు మార్గభ్రష్టతల్లో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి ఇదైనపుడు అతని ఈ ఆచరణను మరియు అతని మాటలను ఎలా నమ్మగలం? , (ఫతావా రషీదియా : 132 పేజీ)
ఆయన (రషీద్ అహ్మద్ గంగోహి) ఇంకా ఇలా తెలియజేస్తున్నారు:
ఈ దురాచరణ మరియు బిదత్ యొక్క సంక్షిప్త స్వరూపం ఎలా ఉండేదంటే- ఈ మిలాదున్నబీ ఉత్సవ శిబిరాల నిమిత్తం కలపతో, విశాలమైన 20 గుడారాలు నిర్మించేవాడు. ప్రతి గుడారంలో ఐదు అంతస్తులండేవి. సఫర్ నెల ప్రారంభం నుంచే వాటిని అలంకరించి, ప్రతి అంతస్తులో, గాయకుల, కవుల, నాట్యకారుల ఒక్కో సమూహాన్ని కూర్చోబెట్టేవాడు. స్వయానా ముజఫ్ఫరుద్దీన్ రాజు తన మంత్రులతో, చుట్టుప్రక్కల వాళ్ళతో కలిసి ప్రతి రోజూ సాయంత్రం వేళ ఈ గుడారాల్లోకి వెళ్ళి, నాట్య గాన ప్రదర్శనను తిలకించేవాడు, తను కూడా వారితో కలిసి నృత్యం చేసేవాడు. తదుపరి, తన గుడారంలో రాత్రంతా ఈ పనుల్లోనే గడిపేవాడు, మిలాదున్నబీకి సరిగ్గా రెండు రోజులు ముందుగా ఒంటెలు, ఆవులు మరియు మేకలను ఒక మైదానంలో జిబహ్ చేసి జన సమూహం కొరకు రకరకాల వంటకాలను సిద్ధం చేయించే వాడు. ఇక మిలాదున్నబీ రోజు రాత్రివేళ తన కోటలో ప్రత్యేక నాట్యగాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. (ఫతావా రషీదియా : 132 పేజీ)
ఇదండీ వాడి ఆవిష్కరణ. ఇక దీని (మిలాదున్నబీ) ఆచరణ కొరకు ఫత్వా జారీ చేసిన వ్యక్తి పేరు అబుల్ ఖత్తాబ్ ఉమర్ బిన్ అబుల్ హసన్ అల్ మారూఫ్ బాబిన్ వహియత కల్బి (మరణం 633 హి.).
హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: ఇబ్నె నజ్జర్ ఇలా సెలవిచ్చారు:
ఇతడు పచ్చి అబద్దాల కోరు, బలహీన ఉల్లేఖకుడు అని నిర్ధారించడంలో అందరూ ఏకీభవించారు. (లిసానుల్ మీజాన్ : 2వ సంపుటం, 259 పేజీ)
‘అతడు – ధార్మిక పండితులు, సలఫుస్సాలిహీన్ల గురించి చెడుగా మాట్లాడే వాడు. నోటి దురుసుతనం కూడా ఎక్కువ. అత్యంత మూర్ఖుడు మరియు గర్విష్టి. ధార్మిక వ్యవహారాలలో అత్యంత అశ్రద్ధ చూపేవాడు.” (లిసానుల్ మీజాన్ : 2వ సంపుటం, 296 పేజీ)
ఇతనే, ఇర్బిల్ రాజును మిలాదున్నబీ ఉత్సవాలు జరుపుతుండడం చూసి, దాని ఆచరణ నిమిత్తం ఫత్వా (ధార్మిక తీర్పు) జారీ చేయడమే గాక, వాటి వివరాలను సేకరించి ‘అత్తన్వీర్ ఫీ మౌలిద్ అస్సిరాజుల్ మునీర్’ అనే పుస్తకాన్ని రచించాడు. తదుపరి ఈ పుస్తకాన్ని ఇర్బిల్ రాజుకు బహూకరించగా అతడు ఇతనికి 1000 నాణాలు బహూకరించాడు. (వఫియాత్ అల్ అయ్యాన్ లి ఇబ్నె ఖల్ కాన్ : 3వ సంపుటం, 449 పేజీ)
ఈ వాస్తవాలన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జననాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం తర్వాత దాదాపు 600 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది.
మీరు కొంచెం గమనించండి!
మిలాదున్నబీ ఉత్సవానికి ఆధారం – ఖురానులోగానీ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల ఆచరణలోగానీ, సలఫుస్సాలిహీన్ల జీవిత కాలంలో గానీ దొరకదు. ధార్మిక పండితులు కూడా ఎవరూ దీనిని సమర్థించలేదు. మరి అలాంటప్పుడు నేటి ముస్లిములు ఈ ఉత్సవంపై ఎందుకంత పట్టుదలతో వున్నారు? ఏ విశ్వాస ప్రేమానురాగాలను (ఈ ఉత్సవానికి) సాకుగా నేటి ముస్లిములు చూపిస్తున్నారో ఆ ప్రేమాభిమానాలు గతించిన సజ్జనులకు లేవా? ఒకవేళ వుంటే – నిశ్చయంగా వీరికన్నా ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు, వాళ్ళెందుకు ఈ ఉత్సవాన్ని జరుపుకోలేదు?
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేమిటంటే ఆరాధనలో భాగంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దేనినైతే ఆచరించలేదో అది ఎట్టిపరిస్థితుల్లోనూ ధర్మంలో భాగం కాజాలదు. అంతేకాక, దానిని ధర్మంలో భాగమని తలపోసి, పుణ్యఫలాపేక్షతో ఆచరించడం, ఏ ముస్లిముకూ శోభించదు.
ఉదాహరణకు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ నమాజు, జనాజా (అంత్యక్రియలు) నమాజులకు అజాన్ చేయించలేదు. సహాబాల కాలంలో కూడా దీని అస్తిత్వం లేదు. కనుక ప్రళయం వరకు కూడా దీనిని ధర్మంలో ఒక భాగమని తలంచడం ఏ ముస్లిముకూ ధర్మయుక్తం కాదు. దీనికి కారణం ఏమిటి?
అజాన్లో అల్లాహ్ స్మరణ లేదా? నిశ్చయంగా అజాన్ – అల్లాహ్ గొప్పతనం మరియు ఔన్నత్యాలతో నిండి వుంది. కానీ, పండుగ నమాజుకు, జనాజా నమాజుకు ముందు దీనిని పలకడం ధర్మశాస్త్రములో లేదు. – అలాగే మిలాదున్నబీ ఉత్సవం కూడా. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయానా ఎప్పుడూ దీనిని జరపలేదు. సన్మార్గం పొందిన ఖలీఫాలు కూడా దీనిని ఆచరించలేదు. అలాంటప్పుడు దీనిని ధర్మంలో అంతర్భాగం అనీ, ఒక సదాచరణ అని తలపోయడం ఎంత మాత్రం సమంజసం కాదు. అందుకే హుజైఫా (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చేవారు: , సహాబాలు చేయని ఏ ఆరాధనా కార్యాన్నైనా మీరు ఆరాధనగా భావించి ఆచరించకండి.” (హుజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) లిల్ అల్ బానీ – 100 పేజీ)
“మీరు కేవలం విధేయతే చూపండి. (ధర్మంలో) కొంగ్రొత్త విషయాలు ఆవిష్కరించకండి. ఎందుకంటే -దీని నుండి మీరు రక్షించబడ్డారు. మీరు కేవలం మొదటి నుండి (సహాబాల కాలంలో) వున్నఆజ్ఞలనే గట్టిగా పట్టుకోండి.”
ఇప్పటి వరకూ ఆధారాలతో సహా చర్చించిన విషయాలు ఒక సున్నితమైన, నీతిమంతుడైన వ్యక్తికి – మిలాదున్నబీ ఆచారానికి ధర్మంలో ఏ విధమైన స్థానం లేదు – అని తెలియడానికి చాలు. అయినా, దీని గురించి మరింత విపులంగా అర్థం చేసుకోవడానికి – యావత్తు ముస్లిములు ఏకాభిప్రాయం కలిగివున్న కొన్ని ఆదర్శాలు మీ ముందు వివరించాలనుకొంటున్నాం. వీటి ద్వారా కూడా, మిలాదున్నబీ ఆచార మనేది ధర్మంలో ప్రవేశింపజేయబడ్డ ఒక క్రొత్త పోకడ (బిదత్) అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
1) ఇస్లాం ఒక పరిపూర్ణ ధర్మం
ఇస్లాం విశిష్టతలలో ఒక విశిష్టత ఏమిటంటే – ఇదొక పరిపూర్ణ ధర్మం . జీవితంలో అన్ని రంగాలలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ దీనిలో స్పష్టమైన ఆదేశాలు వున్నాయి. దీని రూపకర్త (అల్లాహ్) దీనిలో ఏ విధమైన హెచ్చుతగ్గులు చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ, దురదృష్టవశాత్తూ, నేడు ముస్లిములు ఆధారాలతో సహా స్థాపించబడ్డ ఆచరణలను విస్మరించి, ఆధారాలు లేని కొంక్రొత్త ఆచారాలను ధర్మంలో చేర్చి, వాటినే వాస్తవిక ధార్మిక ఆచరణలని తల పోస్తున్నారు. వాస్తవానికి ఇస్లాం ఒక సంపూర్ణ ధర్మమై, దీని ఉపదేశాలు చాలా స్పష్టంగా, యావత్ ప్రపంచానికి తెలిసేలా, చిరస్థాయిగా నిలిచి వున్నప్పుడు, దీనిలోకి నూతన విషయాలు చేర్చి, వాటిని ధర్మం యొక్క అంతర్భాగంగా భావించడం ఎలా ధర్మ సమ్మతమవుతుంది?
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (మాయిద : 3)
ఇలా, మన ధర్మాన్ని పరిపూర్ణం గావించి అల్లాహ్ మనపై ఎంతగానో అనుగ్రహించాడు. ఒకవేళ తను దీనిని అసంపూర్ణంగా వదలివేస్తే, ప్రతి వ్యక్తి తనకు తగ్గట్టుగా దీనిలో హెచ్చుతగ్గులు చేసుకొనేవాడు. తత్ఫలితంగా, ధర్మం ప్రజల చేతుల్లో ఒక ఆటబొమ్మగా అయిపోయేది.
సహియైన్ (రెండు ప్రామాణిక హదీసు గ్రంథాలైన బుఖారీ, ముస్లిం) లోని ఒక హదీసు ద్వారా గూడా అల్లాహ్ యొక్క ఈ మహోన్నత అనుగ్రహానికి గల విలువ, ప్రాధాన్యత అర్థమవుతుంది.
ఉమర్ (రదియల్లాహు అన్హు పరిపాలనా కాలంలో ఒక యూద పండితుడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు: ఓ విశ్వాసుల నాయకా (అమీరుల్ మోమినీన్)! అల్లాహ్ గ్రంథం (దివ్య ఖుర్ఆన్)లో ఒక ఆయత్ వుంది. ఒకవేళ అది మాపై (యూదులపై) గనక అవతరించి వుంటే, అది అవతరించిన దినాన్ని మేము పండుగ దినంగా జరుపుకొనేవాళ్ళం. దీనిపై ఉమర్ (రదియల్లాహు అన్హు అతనితో – ఆ ఆయత్ ఏది? అని ప్రశ్నించారు. అతనిలా జవాబిచ్చాడు: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (మాయిద : 3)
ఇది విని, ఉమర్ (రదియల్లాహు అన్హు) అతనికి ఇలా జవాబిచ్చారు. ఈ ఆయత్ పండుగరోజే అవతరించింది. ఆ సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అరాఫాత్ మైదానంలో వున్నారు మరియు ఆ రోజు శుక్రవారం. (బుఖారీ : 45, 3017)
మరి, ఆ యూద పండితుడు – ‘ఒకవేళ ఈ ఆయత్ మాపై అవతరించి వుంటే మేము ఆ రోజును పండుగ దినంగా జరుపుకొనేవాళ్ళం’ అని ఎందుకు అడిగాడు? ఎందుకంటే, ధర్మ పరిపూర్ణత యొక్క విలువ మరియు ప్రాధాన్యత అతనికి తెలుసు కాబట్టి, కానీ, నేటి ముస్లిములలో చాలా మందికి దీని విలువ తెలియని కారణంగా ఎన్నో క్రొత్త ఆచారాల్లో (బిదాత్) మునిగిపోయి, వాటిని ధర్మంలో అంతర్భాగమని తలపోస్తున్నారు. వాస్తవానికి వీటికి (క్రొత్త ఆచారాలు) ధర్మంతో ఎలాంటి సంబంధమూ లేదు.
2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి మంచి విషయం గూర్చి సెలవిచ్చి వున్నారు.
ఈ పరిపూర్ణ ధర్మాన్ని అల్లాహ్, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అవతరింపజేశాడని, దానిని ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) యధావిధిగా దాని సంపూర్ణ రూపంలో తన అనుచర సమాజానికి చేరవేశారని ప్రతి వ్యక్తికీ తెలుసు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు దగ్గరగా చేసే, నరకం నుండి దూరం గావించే ప్రతి విషయాన్ని నేను మీకు ఆజ్ఞాపించి వున్నాను. అలాగే, నరకానికి దగ్గరగా చేర్చే, అల్లాహ్ నుండి దూరం గావించే ప్రతి విషయం నుండి నేను మిమ్మల్ని వారించాను.”(హుజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) లిల్ అల్ బానీ : 103 పేజీ)
“స్వర్గానికి దగ్గరగా చేర్చే, నరకం నుండి దూరం గావించే ప్రతి విషయం మీకు వివరించబడింది.” (అస్సహీహ లిల్ అల్ బానీ : 1803)
అలాగే, ఇలా కూడా సెలవిచ్చారు: “అల్లాహ్, ఏ కార్యాలను చేయమని మీకు ఆదేశించాడో నేను కూడా ఆ కార్యాలను గురించి మీకు ఆజ్ఞాపించాను. అలాగే, అల్లాహ్, ఏ కార్యాలను (మీ కోసం) నిషేధించాడో నేను కూడా వాటి నుంచి మిమ్మల్ని వారించాను.” (అల్ మర్జల అస్సాబిఖ్ )
ఈ హదీసుల ద్వారా తెలిసిందేమింటే – మంచికి సంబంధించిన ఏ విషయమైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సమాజానికి చేరవేయకుండా లేరు, అలాగే చెడుకు సంబంధించిన ఏ విషయం గురించైనా తన అనుచర సమాజానికి వారించకుండా లేరు.
కనుక, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మనం తేలిగ్గా ఈ నిర్ణయానికి రావచ్చు. అదేమిటంటే – ప్రజల దృష్టిలో మంచి కార్యంగా తలచబడే ప్రతి కార్యమూ – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని గురించి ఆజ్ఞాపించడం గానీ, స్వయంగా ఆచరించడం గానీ చేయనంత వరకు (ధర్మం దృష్టిలో) మంచి కార్యం కాజాలదు. అలాగే, చెడు కార్యం విషయంలో కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానిని వారించనంత వరకు అది చెడుగా భావించబడదు.
అంటే – ఏది మంచీ, ఏది చెడు అని నిర్ధారించడానికి కొలమానం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), అంతేగాని ఒకరి ఇష్టాయిష్టాలు కావు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ధర్మంలో తమ ఇష్ట ప్రకారం మంచి కార్యాలు చేర్చడానికి మరియు చెడు పనులుగా ఖరారు చేయడానికి
ఇంకో విషయం కూడా ఆలోచించదగ్గదే –
క్రొత్త ఆచారాలను (బిదాత్) ఆవిష్కరించి, వాటిని ధర్మంలో ప్రవేశపెట్టడం ద్వారా – ‘దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ధర్మాన్ని పూర్తిగా చేరవేయలేదు, కొన్ని మంచి కార్యాలు ఆయన మరియు తొలుత ఆయనను విశ్వసించిన వారు వదిలిపెట్టారు, కనుక ధర్మంలో ఇప్పటికీ కొన్ని హెచ్చుతగ్గులు చేసుకోవడానికి అవకాశం వుంది’- అన్న అనుమానం రాదా?
తప్పకుండా వస్తుంది.
అందుకే ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు – “ఎవరైనా ఇస్లాంలో ఒక క్రొత్త ఆచారాన్ని (బిదత్) ప్రవేశపెట్టి, దానిని మంచి కార్యంగా భావించాడంటే – అతను -దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన దౌత్య బాధ్యత (దైవధర్మాన్ని చేరవేయడం)ను సరిగా నెరవేర్చలేదు (అంటే ధర్మాన్ని పూర్తిగా చేరవేయ లేదు) అని నిర్ధారించిన వాడైపోతాడు, మీరు అల్లాహ్ ఇచ్చిన ఈ ఆజ్ఞను చదువుకోండి – “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా, ఇస్లాం ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (మాయిద : 3)
తదుపరి ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు – “ఈ అనుచర సమాజపు (ఉమ్మత్) మొదటి తరాల ప్రజలు వేటి ద్వారానైతే రజువర్తనులు అయ్యారో (సన్మార్గం పొందారో), దీని ఆఖరి తరాల ప్రజలు కూడా వాటితోనే రుజువర్తనులు కాగలరు (సన్మార్గం పొందగలరు). ఏ ఆచర అయితే అప్పుడు ధర్మంలో అంతర్భాగంగా లేదో అది నేడు కూడా ధర్మంలో భాగం కాలేదు.”
ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ప్రవచనం – ‘ఏ ఆచరణయితే అప్పుడు ధర్మంలో భాగంగా లేదో అది ఇప్పుడు కూడా ధర్మంలో భాగం కాలేదు’ ను ప్రజలు ప్రళయం వరకు తమ ముందుంచాలి. ప్రతి ధార్మిక విషయానికి ఆధారాన్ని ఖుర్ఆన్ మరియు మొదటి మూడు తరాల సజ్జనుల (సలఫుస్సాలిహీన్) ఆచరణలో అన్వేషించాలి. ఒకవేళ వీటిలో ఆధారం దొరికితే, దానిపై ఆచరించాలి. ఒకవేళ దొరక్కపోతే, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మంగా భావించకూడదు.
3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరి కన్నా ఎక్కువ దైవభీతి పరులు మరియు ఉపాసకులు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) అందరికన్నా ఎక్కువ దైవభీతి పరులు మరియు అత్యుత్తమ దైవ ఉపాసకులన్న వాస్తవాన్ని ఎవరూ తిరస్కరిం చరు. అందుకే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా నిరూపించ బడిన ఆరాధనలనే ఆచరణలో పెట్టాలి. క్రొత్త విషయాలను (బిదత్) ధర్మంలో చేర్చి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మించిపోయే ధైర్యం చేయకూడదు.
సహిహైన్ (బుఖారీ, ముస్లిం గ్రంథాలు)లో అనస్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇలా ఉల్లేఖించబడింది.
కొందరు వ్యక్తులు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఆరాధనలను గూర్చి తెలుసుకొనే నిమిత్తం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకూ మరియు ఆయన సతీమణుల వద్దకు పోయి అడిగారు. వారికి దీని గురించి తెలియజేయబడింది. దీనిని (దైవ ప్రవక్త ఆరాధన) వారు స్వల్పమని భావించి తమదైన రీతిలో స్పందిస్తూ, ఇలా అనసాగారు : దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో మనకు పోలికేంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గడిచిన మరియు (భవిష్యత్తులో) జరుగబోయే పాపాలన్నింటినీ అల్లాహ్ క్షమించి వున్నాడు! తదుపరి, వారిలో ఒకరు – ఇక నుండి నేను రాత్రిళ్ళు ఎల్లప్పుడూ మేల్కొనే వుంటాను (రాత్రిళ్ళు ఆరాధనలో గడుపుతాను) అని, రెండో వ్యక్తి – నేను ఎల్లప్పుడూ ఉపవాసం పాటిస్తాను, దానిని విరమించను అని, మూడో వ్యక్తి – నేను స్త్రీలతో దూరంగా వుంటాను, ఎప్పటికీ వివాహం చేసుకోను అని అన్నారు.
వారి ఈ మాటలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరగా, ఆయన వారి వద్దకు వెళ్ళి – ఇలా, ఇలా పలికింది మీరేనా? అని అడిగి నిర్ధారించుకొని, తదుపరి వారికి ఇలా హితోపదేశం చేశారు:
“మీ అందరిలోకెల్లా నేను అత్యధికంగా అల్లాహు భయపడేవాణ్ణి మరియు అందరికన్నా ఎక్కువ దైవభీతిపరుడను అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మరి నేను ఉపవాసం కూడా వుంటాను మరియు దానిని విరమిస్తాను కూడా. రాత్రిళ్ళు మేల్కొని వుంటాను మరియు నిద్రిస్తాను కూడా. నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక, ఎవరైనా నా పద్ధతికి భిన్నంగా వ్యవహరిస్తే అతను నాలోని వాడు కాదు.” (బుఖారీ : 5063, ముస్లిం : 1401)
ఈ హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుగా తన స్థాయిని గూర్చి వివరిస్తూ – తను అందరికన్నా ఎక్కువ దైవభీతిపరులని, దైవ ఉపాసకులని తెలియజేశారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పద్ధతిని గూర్చి వివరించారు. ఆ తర్వాత – ఇక నా పద్ధతి (సున్నత్)ను వదలిపెట్టి మరొక క్రొత్త పద్దతిని ఆచరణలో పెట్టే వారితో నాకే మాత్రం సంబంధం లేదు – అని ప్రకటించారు.
దీనిద్వారా తెలిసిందేమిటంటే – కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా నిరూపించబడిన ఆరాధనలనే ఆచరించాలి, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా నిరూపించబడని ఆచరణలను ఆరాధనగా నిర్ధారించ కూడదు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు, ధర్మంలో హెచ్చుతగ్గులు చేసుకోవడానికి ఏ మాత్రం అవకాశం కల్పించలేదని మరియు ధర్మంలో క్రొత్త ఆచారాలు సృష్టించడం, దానిని ఆచరణలో పెట్టడం పూర్తిగా హరాం (నిషిద్ధం) అని గ్రహించడానికి మనకు ఈ మూడు నియమాలు చాలు.
కనుక ఈ మూడు నియమాలను ఆధారంగా చేసుకొని మేము చెప్పేదేమిటంటే – మిలాదున్నబీ సంప్రదాయానికి షరీఅత్ (ధర్మశాస్త్రం)లో ఏ విలువా లేదు మరియు ధర్మంలో ఇది అంతర్భాగం కూడా కాదు. ఒకవేళ ధర్మంలో ఇది భాగమై వుంటే, దివ్య ఖుర్ఆన్, హదీసులు మరియు సహాబాల ఆచరణలో మనకు ఆధారం తప్పకుండా లభించి వుండేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా తన అనుచర సమాజానికి ఈదుల్ ఫిత్ర, ఈదుల్ అద్ హా పండుగల గురించి వివరించినట్లు దీని గురించి కూడా తప్పకుండా వివరించి వుండేవారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శ్లాఘించడంలో మితిమీరడం
ఒకవేళ మిలాదున్నబీని మరో కోణం నుండి ఆలోచించి, అవలోకనం చేస్తే ఇది – బిదత్ (క్రొత్త పోకడ) అవడమేగాక, ఎన్నో చెడులను తన ఒడిలో దాచుకొని వుంది. ఉదాహరణకు – (పరదా సంస్కారాన్ని పెడచెవిన పెట్టి) స్త్రీ పురుషులందరూ ఒకే చోట గుమిగూడడం, సంగీత వాయిద్యాల వాడకం, తబల, డోలు వాయిద్యాల తాళానికి యువకులు చేసే నృత్యం మరియు ఇలాంటి ఎన్నో చెడులు దీనిలో వున్నాయి. మరి చూడబోతే, మిలాద్ పేరుతో పుణ్య కార్యమని తలపోసి ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాక, ఈ శిబిరాల్లో అన్నింటికన్నా పెద్ద పాపాన్ని (షిర్క్) సయితం చేస్తుండడం మనం వీక్షించవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శ్లాఘించడంలో మితిమీరి ప్రవర్తిస్తారు. దైవేతరులను అర్థిస్తూ వారి సహాయం కోరడం జరుగుతుంది. ‘దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అగోచర విషయాలు సయితం తెలుసు’ అని బాహాటంగా ప్రకటించడం జరుగుతుంది. వాస్తవానికి ఈ గుణం కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ధర్మంలో మితిమీరకుండా జాగ్రత్త పడండి. గతించిన వారు దీని ద్వారానే నాశన మయ్యారు.” (నసాయి : 3057, ఇబ్నె మాజా : 3029, సహీ-అల్ బానీ)
అలాగే, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా కూడా ఉద్బోదించారు: “క్రైస్తవులు ఇబ్నె మర్యమ్ (ఈసా అలైహిస్సలాం)ను శ్లాఘించడంలో హద్దులు మీరినట్లు మీరు నన్ను శ్లాఘించడంలో హద్దులు మీరకండి. నిశ్చయంగా నేనొక దైవదాసుణ్ణి. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడినని, ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారీ : 3445)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విచ్చేయడం
మిలాదున్నబీ జరుపుకొనే వారు భావించేదేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా (వారి దగ్గరికి) విచ్చేస్తారు, అందుకే, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాము పలికి స్వాగతించడానికి వారు నిలబడి వుంటారు.
వాస్తవానికి ఇదొక పెద్ద అసత్యం మరియు ఆజ్ఞానము. ఎందుకంటే -దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారు. ఆయన ఆత్మ ‘ఆలా ఇల్లియ్యీన్ దారుల్ కిరామ’ నందు తన ప్రభువు వద్ద వుంది. ప్రళయం రోజు వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాధి నుండి బయటకు రాలేరు.
దీని గురించి అల్లాహ్ మోమినూన్ సూరాలో ఇలా సెలవిచ్చాడు:
“తుదపరి మీరు మరణిస్తారు. ఆ తర్వాత మీరు ప్రళయం రోజు లేపబడ తారు.” (మోమినూన్ : 15-16)
అలాగే, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రళయం రోజు నేను ఆదమ్ సంతతికి నాయకుడిగా వుంటాను. అందరి కన్నా ముందుగా నా సమాధి తెరవడం జరుగుతుంది. అందరి కన్నా ముందుగా నేను సిఫారసు చేస్తాను మరియు అందరి కన్నా ముందుగా నా సిఫారసు స్వీకరించబడుతుంది.” (ముస్లిం : 2278)
ధర్మంలో బిద్దతె హసన (మంచి నూతనాచారం) అస్తిత్వం వుందా?
కొంతమంది భావించేదేమిటంటే – మిలాదున్నబీ ఒక బిదాత్ (క్రొత్త ఆచారం) అయినప్పటికీ చెడు బిదత్ కాదు, మంచి బిదాత్ (బిద్దతె హసన). కానీ, మా విశ్వాసమేమిటంటే – ధర్మంలో చేర్చబడే ప్రతి క్రొత్త పోకడ కూడా చెడు బిదత్ మరియు మార్గభ్రష్టతే. బయటికి అది ఎంత పుణ్య కార్యంగా కనిపించినా సరే.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తను ఇచ్చే ప్రతి ‘ఖుత్బా-ఏ హాజత్’ నందు ఇలా సెలవిచ్చేవారు: “దైవస్తోత్రం తర్వాత! నిశ్చయంగా అన్నింటికన్నా ఉత్తమ గ్రంథం అల్లాహ్ గ్రంథం (దివ్య ఖుర్ఆన్), అన్నింటికన్నా ఉత్తమ పద్దతి ముహమ్మద్ (సల్లలల్లాహు అలైహి వసల్లం) పద్ధతి, అన్నింటికన్నా చెడ్డ విషయాలు ధర్మంలో క్రొత్తగా చేర్చబడే ఆచారాలు (బిదాత్) మరియు ప్రతి బిడ్లాత్ మార్గభ్రష్టతకు ఆనవాలు.” (ముస్లిం : 867)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- అల్లాహ్ గ్రంథం ( ఖుర్ఆన్) మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ల ద్వారా ఆధారం దొరకని, ధర్మంలో సృష్టించబడే ఏ కార్యమైనా అది అత్యంత చెడ్డ కార్యము. అది ప్రజల దృష్టిలో ఎంత మంచిదైనా సరే, ధర్మంలో సృష్టించబడ్డ ప్రతి క్రొత్త కార్యమూ బిదత్ మరియు ప్రతి బిదాత్ మార్గభ్రష్టత.
కొంచెం ఆలోచించండి! ఒకవేళ మంచి కార్యం పేరుతో ధర్మంలో ఏదైనా క్రొత్త ఆచరణను సృష్టించడం ధర్మయుక్తమై వుంటే – మరి రాత్రిళ్ళు జాగారం చేస్తానని, ఎల్లప్పుడూ ఉపవాసముంటానని, ఎప్పుడూ స్త్రీలను వివాహమాడనని గట్టిగా సంకల్పించుకున్న ఆ ముగ్గురు వ్యక్తుల్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎందుకు మందలించి వుండేవారు? వారు సంకల్పించుకున్నది మంచి కార్యాలనుద్దేశించి కాదా? ఆ ముగ్గురిలో ఎవరైనా చెడు కార్యం తలంపు కలిగి వున్నారా?
మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని గట్టిగా ఎందుకు మందలించారు?
నిస్సందేహంగా వారు మంచి కార్యాల నిమిత్తమే సంకల్పించు కున్నారు. కానీ, వాటిని ఆచరించే పద్ధతులు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతులకు భిన్నంగా వున్నాయి, తద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మించిపోయే ప్రయత్నం జరుగుతూ వుంది. దీని ద్వారా, రుజువైనదేమిటంటే – ‘బిద్దతె హసన’ లాంటి ఏ విషయమూ ఇస్లాంలో లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి (సున్నత్) ద్వారా ఆధారం లభించనంత వరకు (బయటికి కనిపించే) ఏ మంచి కార్యమైనా మంచిదని పిలవబడదు మరియు ధర్మంలో భాగం కూడా కాజాలదు.
ఆయెషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా మా ధర్మంలో లేని క్రొత్త ఆచరణను ధర్మంలో ప్రవేశపెడితే అది తిరస్కరించబడుతుంది.” (బుఖారీ : 2697, ముస్లిం : 1718)
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి: “ఎవరైనా మేము ఆజ్ఞాపించని క్రొత్త ఆచరణను గనక పాటిస్తే అది తిరస్కరించబడుతుంది.”
ఈ హదీసు ద్వారా గూడా – ధర్మంలో సృష్టించబడే ప్రతి క్రొత్త ఆచరణ, పద్ధతి తిరస్కరించబడతాయి, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకార యోగ్యం కావు – అన్న విషయాలు బోధపడతాయి.
ఓసారి అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఇంటికి విచ్చేసి ఆయనతో : ‘నేనిప్పుడే మస్జిద్ లో ఒక విషయం చూశాను, దానిని నేను సరైనదిగా భావించడం లేదు. వాస్తవానికి, అల్ హమ్దు లిల్లాహ్ నేను మంచినే చూశాను’ అని అన్నారు.
దీనిపై ఆయన- మీరు చూసిందేమిటి? అని అడిగారు.
అబూ మూసా (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ – “మీరు స్వయంగా మస్జిదు వెళితే మీకే తెలుస్తుంది. నేను మస్జిద్ లో కొందరిని చూశాను. వారు వలయాకారాల్లో కూర్చొని నమాజు కోసం నిరీక్షిస్తున్నారు. వారి చేతుల్లో కంకర్రాళ్ళు వున్నాయి. ప్రతి వలయంలో ఓ వ్యక్తి, మిగతా వారితో, మీరు 100 సార్లు అల్లాహు అక్బర్ పలకండి అని అంటే వారు 100 సార్లు అల్లాహు అక్బర్ ని పటిస్తారు. తదుపరి అతను వారితో, మీరు 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి అని అంటే వారు 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తారు. ఆ తరువాత అతను, ఇప్పుడు మీరు 100 సార్లు సుబహానల్లాహ్ పలకండి అని అంటే వారు 100 సార్లు సుబహానల్లాహ్ అని పఠిస్తారు!” – అని వివరించారు,
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఆయనతో – ఇదంతా చూసి మీరు వారితో ఏమన్నారని అడిగారు. – ఆయన ఇలా జవాబిచ్చారు : ముందుగా మీ అభిప్రాయం తెలుసుకుందా మని నేను వారితో ఏమీ అనలేదు.
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఆయనతో -(ఈ కంకర్రాళ్ళపై) మీరు మీ పాపాలను లెక్కించండి (పుణ్యాలు కాదు), మీ పుణ్యాలేవీ వృధా కావని నేను గ్యారంటీ ఇస్తాను – అని మీరు వారికి ఆజ్ఞాపించలేదా? అనడిగారు.
తదుపరి, అబ్దుల్లా బిన్ మస్ ఊద్(రదియల్లాహు అన్హు) మస్జిదు విచ్చేసి, వలయాకారంలో వున్న ఒక సమూహం దగ్గరికెళ్ళి – మీరు చేస్తున్నదేమిటి? అని అడిగారు. వారు ఆయనతో – ఓ అబూ అబ్దుర్రహ్మాన్! ఇవి కంకర్రాళ్ళు, వీటి ద్వారా మేము అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు సుబహానల్లాహ్ తస్బీలను లెక్కిస్తున్నాం! అని జవాబిచ్చారు.
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) వారితో- మీరు వీటిపై మీ పాపాలను లెక్కించండి, మీ పుణ్యాలేవీ వృధా కావని నేను గ్యారంటీ ఇస్తాను, అని పలికి, తదుపరి ఇలా సెలవిచ్చారు: ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచర సమాజమా! మీ పాడుగాను! ఇంత త్వరగా మార్గభ్రష్టత వైపునకు నడవడం మొదలు పెట్టారా? ఇంకా మీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు పెద్ద సంఖ్యలో (మీ మధ్యే) వున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బట్టలు కూడా పాతబడలేదు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) (వాడిన) పాత్రలు కూడా విరగలేదు. నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ అల్లాహ్ సాక్షిగా! మీరు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గం కన్నా ఉత్తమమైన మార్గం పైన వున్నారని అనుకొంటున్నారా? లేదా మార్గభ్రష్టత ద్వారాలు తెరుస్తున్నారా? దీనిపై వారు – ఓ అబూ అబ్దుర్రహ్మాన్! అల్లాహ్ సాక్షి! మేము దీని (ఈ ఆచరణ) ద్వారా మంచినే కాంక్షించాం అని విన్నవించుకోగా, ఆయన వారితో “ఎంతోమంది మంచిని కాంక్షిస్తారు, కానీ దానిని పొందలేరు”, అని జవాబిచ్చారు. (సిల్ సిలహ్ అహదీస్ అస్సహీహ: 2005)
కొంచెం ఆలోచించండి!
తస్బీహలను పఠించడం చెడు ఆచరణనా? నిశ్చయంగా కాదు, అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కూడా వారిని తస్బీహ్ లను పఠించినందుకు మందలించలేదు. ఆయన మాటల్లో కోపానికి, కరకు దనానికి కారణం, వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్, సహాబాల పద్ధతికి భిన్నంగా తస్బీహ్ లను పఠిస్తుండడం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు సహాబాలు కంకర్రాళ్ళతో కాక తమ కుడిచేతి వేళ్ళతో తస్బీలు లెక్కించేవారు. అంతేగాక, వారు వలయాకారంలో కూర్చొని సామూహికంగా కాక ఒక్కొక్కరూ వ్యక్తిగతంగా పఠించేవారు. కానీ, వీరి ఆచరణ (వలయాకారంలో కూర్చొని తస్బీలు లెక్కించడం) ప్రజల దృష్టిలో సత్కార్యంగా కనిపించినప్పటికీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ కు విరుద్ధంగా వుంది. అందుకే, అబ్దుల్లా మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) వారితో కరకుగా వ్యవహరించారు. కొత్త ఆచరణ అయితేనేం? మంచిదేగా అని ఆయన అనలేదు, పైగా దానిని మార్గభ్రష్టత ద్వారంతో పోల్చారు.
దీని ద్వారా రూఢీ అయిన విషయమేమింటే – ధర్మంలో ఏ విధమైన ‘బిద్దతె హసన’ లేదు. ప్రతి బిదత్ కూడా చెడ్డదే మరియు మార్గభ్రష్టతే.
మిలాదున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) జరుపుకునే వారి కొన్ని ఆధారాలు మరియు వాటి జవాబులు
మిలాద్ ను నిర్వహించేవారు సాధారణంగా 5 ఆధారాలు ఇస్తూ వుంటారు.
1) మిలాద్ అనేది ఒక వార్షిక జ్ఞాపిక. దీనిని జరుపుకోవడం ద్వారా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద ప్రేమ పెరుగుతుంది.
దీని సమాధానం ఏమిటంటే – ప్రతి రోజూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పలుమార్లు గుర్తుకు తెచ్చుకోని ముస్లిమెవరైనా వుంటే, అతను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను గుర్తు చేసుకుని ఆయనపై వున్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి గాను ఇలాంటి వార్షిక, నెలవారీ జ్ఞాపిక సదస్సులు నిర్వహించవచ్చు. కానీ, ఒక ముస్లిం, రేయింబవళ్ళలో ఎన్నోసార్లు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను జ్ఞాపకం చేసుకుని, ఆయనపై దరూద్, సలాములు పంపుతూ వుంటే – అలాంటి వ్యక్తికి ఇదే ఉద్దేశ్యం కొరకు వార్షిక సదస్సులు నిర్వహించడం అనేది ఒక అర్థరహిత విషయం కాదా?
2) మిలాద్ లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీరాకృతి, శీల సద్గుణాలు మరియు ఆయన వంశం గురించి తగినంత జ్ఞానం సముపార్జించు కోవచ్చు.
ఈ ఆధారానికి జవాబు ఏమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సద్గుణాలు మరియు శ్రేష్టతలను సంవత్సరానికి ఒకసారి వింటే సరిపోదు. ఎందుకంటే, ఆయన జీవిత చరిత్ర ఎలాంటిదంటే – దాని గురించి సంవత్సరం పొడుగునా వింటూ, నేర్చుకుంటూ వుండడం తప్పనిసరి మరియు వదిలి పెట్టలేని విషయమూను.
3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టుకపై సంతోషం వ్యక్తం చేయడం అనేది విశ్వాసానికి సూచన.
ఈ ఆధారానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే – ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమిటంటే – సంతోషానికి కారణం దైవప్రవక్తా? లేక ఆయన జన్మించిన దినమా?
ఒకవేళ సంతోషానికి కారణం ఆయనే (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయితే, ఆ సంతోషం ఎల్లప్పుడూ వుండాలి గాని ఒక రోజు కోసం ప్రత్యేకం కాకూడదు. ఒకవేళ సంతోషమనేది ఆ దినం కోసమైతే, ఆయన మరణించింది కూడా అదే రోజు! మరి తమ ప్రియతమ వ్యక్తి మరణంపై సంబరం జరుపు కోవడం ఏ తెలివిని సూచిస్తుంది?
4) మీలాద్ రోజు ప్రజలకు అన్నం పెడతారు, దీనిలో ఎంతో పుణ్యం వుంది.
ఈ ఆధారమైతే అన్నింటికన్నా బలహీనమైనది. ఎందుకంటే – అన్నం పెట్టడాన్ని ప్రోత్సహించేది పూర్తి సంవత్సరానికి గాని, ఒక ప్రత్యేక రోజు కోసం కాదు.
5) మీలాద్ లో దివ్య ఖుర్ఆనను పఠించడం జరుగుతుంది మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్, సలాములు పంపడం జరుగుతుంది.
ఈ ఆధారం కూడా పై నాలుగు ఆధారాల లాగా అసత్యమే. ఎందుకంటే – దివ్య ఖుర్ఆనను పఠించడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)పై దరూద్, సలాములు పంపడానికి ఒకచోట సమావేశం కావడం-స్వయానా ఇదే ఒక బిదాత్ (కొత్త ఆచరణ). అలాగే పాటల లాగా రాగాలు తీస్తూ దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)ను శ్లాఘించే కవిత్వాలు పఠించడం, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను శ్లాఘించడంలో మితిమీరడం కూడా తప్పే.
ఈ ఐదు ఆధారాలు ఈ కారణం వల్ల కూడా సరిపోవు. అదేమిటంటే – ఒకవేళ వీటిని సరైనవని స్వీకరిస్తే, అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా (అల్లాహ్ శరణు) తప్పిదం జరిగిపోయింది మరియు ఆయన తన జన్మదినం నాడు ఈ విషయాల వైపునకు (ప్రజల) ధ్యానాన్ని మరల్చలేదు. కనుక, ఆ లోటును ఈ మిలాద్ జరుపుకొనే వారు భర్తీ చేస్తున్నారన్న విషయం నిర్ధారించబడుతుంది!!
మీలాద్ ను సరైనదని నిర్ధారించే వారి కొన్ని బలహీన సందేహాలు
1) ఒక సంఘటన ఉల్లేఖించబడుతూ వుంటుంది: దురదృష్టవంతుడైన అబూ లహబ్ ను కలలో చూడడం జరిగింది. అతని యోగక్షేమాలను గూర్చి విచారించగా అతను-అగ్ని శిక్షలో పడి వున్నాను, అయినప్పటికీ ప్రతి సోమవారం, శిక్ష కొంచెం తగ్గించబడుతూ వుంటుంది మరియు తన రెండు వేళ్ళ మధ్య నుండి వ్రేళ్ళ పైభాగాన్ని చూపుతూ, తను ఇంత నీళ్ళను పీల్చుకుంటానని చెప్పి, దానికి కారణం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జనన శుభవార్తను తన బానిసరాలు ‘సోయెటా’ అందించినప్పుడు తను ఆనందంలో ఆ బానిసరాలికి స్వేచ్ఛను ప్రసాదించడం అని అన్నాడు.
దీని సమాధానం ఏమిటంటే –
- 1) ఒకరి కల ద్వారా షరీయత్తు (ధర్మశాస్త్రం) ఆజ్ఞ నిర్ధారించబడదు.
- 2) రెండవది – ఈ ఉల్లేఖనం ముర్సల్ (హదీసు పరంపరలో దైవప్రవక్త, తాబయీల మధ్య సహాబీ పేరు లేని ఉల్లేఖనం) అయిన కారణంగా దీనిని ఆధారంగా స్వీకరించలేం.
- 3) మూడవది – అవిశ్వాసి (కాఫిర్) గనక అవిశ్వాస స్థితిలో మరణిస్తే, అతని ఏ మంచి కార్యానికైనా పుణ్యఫలం లభించదు అన్న విషయంలో సలఫ్ (మొదటి తరాల సజ్జనులు) మరియు ఖలఫ్ (తర్వాతి తరాల సజ్జనులు)ల మధ్య ఏకాభిప్రాయం వుంది.
- 4) నాల్గవది – అబూ లహబ్ సంతోషమనేది సహజ సిద్ధంగా కలిగిన సంతోషం, ఆరాధనా పరమైనది కాదు మరియు సంతోషమనేది అల్లాహ్ కొరకు కాకపోతే దానికి పుణ్యం లభించదు.
- 5) ఐదవది – ఒక విశ్వాసి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జననంపై ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలి. దాని కోసం కేవలం ఆయన జన్మ దినాన్ని ప్రత్యేకించుకోవడం సరైనది కాదు
2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అఖిఖా స్వయంగా చేసుకున్నారని ఉల్లేఖించబడుతుంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాతగారు కూడా ఆయన అఖిఖా చేశారు మరియు అఖిఖా రెండు సార్లు చేసుకోరు కనుక వాస్తవానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జననానికి గాను అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపడానికే అఖిఖా చేసుకున్నారు, అందుకే ఆయన అనుచర సమాజం కూడా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదినం నాడు ప్రత్యేకంగా భోజనం ఏర్పాట్లు చేయాలి.
దీని జవాబు ఏమిటంటే
- 1) ఇదొక బలహీన ఉల్లేఖనం మరియు ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) దీనిని అసత్యమైనదిగా ఖరారు చేశారు. (మజ్మూఅ లిన్నవవీ – 8వ సంపుటం – 431 పేజీ)
- 2) ఒకవేళ దీనిని ప్రామాణికమైనదని ఒప్పుకున్నా – దీనిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అఖీఖాను తన జననానికి కృతజ్ఞతగా చేశారని ఎక్కడుంది? ఇది కేవలం ఒక అనుమానమే మరియు అనుమానానికి (సత్యం ముందు) ఏ మాత్రం విలువ వుండదు. “సత్యం ముందు అనుమానాలు ఏ మాత్రం పనికిరావు.” (నజ్మ్ : 28)
- 3) ఇక దీని మూడవ జవాబు ఏమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం ఒక్కసారే అఖిఖా చేసుకున్నారు. ప్రతి సంవత్సరమూ చేయలేదు కదా! మరి మీలాద్ జరుపుకునే వాళ్ళు ప్రతి యేటా దీనిని (మిలాద్)ను జరుపుకుంటున్నారు!
3) సహీ (ప్రామాణిక) హదీసులో ఇలా వుంది – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆషూరా రోజు ఉపవాసం వుండి, దాని గురించి ఆజ్ఞాపించారు కూడా. దాని గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగినప్పుడు, ఆయన ఇలా వివరించారు: ఇదొక మంచి రోజు, ఈ రోజు అల్లాహ్, మూసా (అలైహిస్సలాం) మరియు బనీ ఇస్రాయీల్ కు ఫిరౌన్ బారి నుండి రక్షించాడు….. (అసంపూర్ణ హదీస్). మూసా (అలైహిస్సలాం) మరియు బనీ ఇస్రాయీలను ఫిరౌన్ బారి నుండి దొరికిన ముక్తికి కృతజ్ఞతగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ఉపవాసముండి దాని గురించి ఆజ్ఞాపించారు. మరి మేము కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదినాన్ని ఉపవాస దినం కాక, తినే త్రాగే, సంబరాలు జరుపుకునే దినంగా చేసుకుందాం. ఎంత విచిత్రమైన మాట ఇది?
అసలీ రోజు మనం కూడా (ప్రవక్తలాగే) ఉపవాసముండి, భోజన ఏర్పాట్లు చేయడాన్ని, డప్పుల ద్వారా సంబరాలు జరుపుకోవడాన్ని త్యజించాల్సింది. అలాంటిది, సంబరాలు జరుపుకొని భోజన ఏర్పాట్లు చేసి అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుతారా? (అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే పద్ధతి ఇదేనా?)
4) సహీ హదీసులో ఇలా వుంది – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతి సోమవారం, గురువారం నాడు ఉపవాసముండి దాని కారణాన్ని ఇలా వివరించారు – సోమవారం నాడే నేను జన్మించాను మరియు ఈ రోజే ప్రవక్తగా నియమించబడ్డాను….. (అసంపూర్ణ హదీస్)
దీని సమాధానం ఏమిటంటే –
1) తన జననాన్ని పురస్కరించుకొని స్వయానా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన కృతజ్ఞతా విధానాన్నే మనం కూడా అవలం బించాలి.
2) రెండవది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జన్మదినమైన రబీఉల్ అవ్వల్ 12వ తారీఖు నాడు ఉపవాసముండలేదు, ప్రతి నెలా నాలుగైదు సార్లు విచ్చేసే సోమవారం నాడు వున్నారు. ఈ కారణంగా – రబీ ఉల్ అవ్వల్ 12వ తారీఖును ఒక ఆచరణ నిమిత్తం ప్రత్యేకించుకుని ప్రతివారం విచ్చేసే సోమవారాన్ని వదిలేయడం వాస్తవానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహీ వ సల్లం) ను సరిదిద్దడమే అవుతుంది. దీనిని ఏ ముస్లిమయినా ఊహించగలడా?
3) మూడవది – మరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తన జననానికి గాను కృతజ్ఞతా పూర్వకంగా ఉపవాసం పాటించినప్పుడు, దానితోపాటు – మిలాదీలలో కానవచ్చే జన సమూహాల సమీకరణ, కవిత్వం, పాటల కచేరీలు, ప్రత్యేక వంటకాల ఏర్పాట్లు …… లాంటివి కూడా చేశారా?
ఇస్లామీయ పండుగలు మిలాద్ జరుపుకొనే వాళ్ళు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుభ పుట్టుకను ‘పర్వదినం’గా ఖరారు చేస్తారు. కానీ ఈ అనుచర సమాజపు మొదటి తరం నుండే ముస్లిములలో ప్రతి యేటా కేవలం రెండే పండుగలు చెలామణిలో వున్నాయి.
ఈ విషయాన్నే అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు:
“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు విచ్చేసినపుడు అక్కడి ప్రజలకు సంవత్సరంలో రెండు రోజులు (పండుగల నిమిత్తం) నిర్ధారించబడి వుండేవి. ఆ రెండు రోజుల్లో వాళ్ళు ఆడుతూ (సంబరాలు జరుపుకొంటూ) వుండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో – ఈ రోజులు ఎలాంటివి? అని అడిగారు. వారు – అజ్ఞాన కాలం నుండి మేమీ రోజుల్లో ఆడుతూ, సంబరాలు జరుపుకొంటూ వస్తున్నాం అని జవాబిచ్చారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు – అల్లాహ్ మీకు ఈ రెండు దినాలకు బదులుగా ఎంతో ఉన్నతమైన మరో రెండు దినాలు అనుగ్రహించాడు. అవి ‘ఈద్ ఉల్ ఫిత్ర’ మరియు ‘ఈదుల్ అద్ హా‘ దినాలు” (నసాయి : 1566, సహీ – అల్ బానీ)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – ఇస్లామీయ పండుగల లాగా జరుపుకోవడానికి షరీయత్తులో గల పండుగల సంఖ్య కేవలం రెండు మాత్రమే. అవి అల్లాహ్ ద్వారా నిర్ధారించబడ్డవి.
వీటితోపాటు శుక్రవారాన్ని కూడా ‘వారపు పండుగ’గా ఖరారు చేయడం జరిగింది.
ఈ విషయాన్నే ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు: “నిశ్చయంగా ఈ రోజు పండుగ దినం, అల్లాహ్ దీనిని కేవలం ముస్లిముల కొరకు (పండుగ దినంగా) చేశాడు, కనుక, జుమా నమాజు కొరకు వచ్చే వ్యక్తి స్నానం చేయాలి మరియు సువాసన వుంటే దాన్ని పూసుకొని మరీ రావాలి. మిస్వాక్ చేయడం మీకు తప్పనిసరి.” (ఇబ్నె మాజా : 1098, సహీ – అల్ బానీ)
ఆఖరిగా మేము అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనల్ని సత్యాన్ని గ్రహించి దాని కనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!
రెండవ ఖుత్బా
ప్రియ శ్రోతలారా! ఖుర్ఆన్, హదీసులు మరియు సహాబాల ఆచరణ ద్వారా ఆధారం లభించని క్రొత్త ఆచరణలను ధర్మంలో చేర్చడం ఎంతో ప్రమాదకరమైన విషయం.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి నిలబడి చేసిన హితబోధలో ఇలా కూడా ఉద్బోధించారు:
“జాగ్రత్త! నా అనుచర సమాజానికి చెందిన కొందరిని ప్రళయం రోజు తీసుకురావడం జరుగుతుంది. వారిని ఎడమ వైపునకు (నరకాగ్నిలోకి) నెట్టివేయడం జరుగుతుంది. నేనప్పుడు – ఓ నా ప్రభువా! వారు నా (అనుచర సమాజం) వారే అని అంటాను, అప్పుడు నాతో ఇలా అనబడుతుంది – మీ (మరణం) తర్వాత వీళ్ళు ఏ యే క్రొత్త ఆచరణలను ధర్మంలో ప్రవేశ పెట్టారో మీకు తెలియదు!” (బుఖారీ : 6526, ముస్లిం : 2860)
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నా అనుయాయుల్లో కొందరిని (ప్రళయం నాడు) (కౌసర్) సరస్సు వద్దకు ఖచ్చితంగా తేవడం జరుగుతుంది. నేను వారిని గుర్తు పట్టేసరికి వారిని నా నుండి దూరంగా నెట్టేయడం జరుగుతుంది. నేనప్పుడు – వీరు నా అనుయాయులే అని అంటాను. అప్పుడు నాతో – మీ (మరణం) అనంతరం ఏయే క్రొత్త ఆచారాలను వీరు ధర్మంలో ప్రవేశపెట్టారో మీకు తెలియదు అని చెప్పబడుతుంది.”(బుఖారీ :6582)
దీని ద్వారా రూఢీ అయిన విషయం ఏమిటంటే – ధర్మంలో క్రొత్త ఆచారాలు (బిదాత్) ప్రవేశపెట్టే వారిని ప్రళయం నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా కౌసర్ సరస్సు నీరు త్రాగడం నుండి దూరంగా వుంచడం జరుగుతుంది. అందుకే ప్రతి ముస్లింపై విధిగా వున్న విషయమేమిటంటే – తను క్రొత్త ఆచారాలను (బిదాత్) విడనాడి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత ను అనుసరించాలి. సంతోషం, దుఃఖం – ఈ రెండు సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ను త్యజించకూడదు. దీనిలోనే ఎంతో మేలు, శుభం ఉంది. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/muhammad/