సంతాన శిక్షణ – పార్ట్ 08 [వీడియో]

బిస్మిల్లాహ్

[56:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో130 మార్గాలు

అల్ హందు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, అమ్మాబఅద్:

నిశ్చయంగా సంతాన శిక్షణ ఒక కళ మరియు ఒక నైపుణ్యం. అతి తక్కువ మంది ఇందులో పరిపూర్ణులుగా తేలుతారు. ఈ విషయంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. అందులో కొన్ని సంక్షిప్తమైతే మరికొన్ని విపులంగా ఉన్నాయి. వాటిలోని కొన్నింటి సారాంశం మీ ముందు ఉంచదలిచాను. లాభదాయకమైన అనుభవాలతో వాటిని క్రమబద్ధీకరించాను. తమ చిన్నారులకు ఉత్తమ శిక్షణ ఇవ్వదలచిన తండ్రులు మరియు శిక్షకులు ఇలాంటి విషయాల అవసరం లేకుండా ఉండలేరు.

విశ్వాసం

1- నీవు నీ సంతానానికి కలిమయే తౌహీద్ (ఏకత్వ వచనం: లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు అందులో ఉన్న అంగీకారం మరియు నిరాకారం నేర్పు. “లాఇలాహ”లో నిరాకారం ఉంది. అంటే అల్లాహ్ తప్ప సమస్తములో నుండి ‘ఉలూహియత్’ (ఆరాధన హక్కు)ను నిరాకరించుట. “ఇల్లల్లాహ్” లో అంగీకారం ఉంది, అంటే అల్లాహ్ ఏకైకుడు మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని నమ్ముట.

2- మనమెందుకు పుట్టించబడ్డామో? ఈ ఆయతు ఆధారంగా వారికి నేర్పించు.

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 51: 56).

“ఆరాధన” యొక్క భావాన్ని విపులంగా నచ్చజెప్పు.

3- అల్లాహ్ పేరు వింటేనే ఓ భయంకరమైన భావన వారి మదిలో కుదిరే విధంగా మాటిమాటికి నరకం, అల్లాహ్ కోపం, శిక్ష, విపత్తు గురించి బెదిరించకు.

4- అల్లాహ్ నే అధికంగా ప్రేమిస్తున్నవాడిగా వారిని తయారు చేయి. ఎందుకనగా? ఆయనే మనల్ని పుట్టించాడు, మనకు ఉపాధి ఇచ్చాడు, తినిపించాడు, త్రాగించాడు, ధరింపజేశాడు, ఆయనకు భక్తులుగా మెదులుకునే విధంగా చేశాడు.

5- ఏకాంతంలో తప్పు చేయుట నుండి వారించు. ఎందుకనగా అల్లాహ్ అన్ని స్థితుల్లో వారిని గమనిస్తున్నాడు.

6- అల్లాహ్ పేరుగల జిక్ర్ (స్మరణలు) వారి ముందు అధికంగా చేయి. ఉదాః తినేత్రాగేటప్పుడు, లోనికి, బయటికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహ్ అని. బోజనం చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని. ఆశ్చర్యం కలిగినప్పుడు సుబ్ హానల్లాహ్ అని. ఇంకా ఇలాంటి జిక్ర్.

7-వారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ కుదిరించు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు నేర్పించి, వారి ముందు ఆయన చరిత్ర తెలిపి, ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఆయనపై దరూద్ చదివి.

8- వారి మనస్సులో విధివ్రాతపై నమ్మకం పటిష్ఠంగా నాటు. అంటే అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ తలచనిది కానేకాదు.

9- వారికి విశ్వాస ఆరు మూలసూత్రాలు నేర్పు.

10- విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వారి ముందుంచు. ఉదాః నీ ప్రభువు ఎవరు? నీ ధర్మమేది? నీ ప్రవక్త ఎవరు? అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు ఉపాధి, తిను త్రాగు పదార్థాలు మరియు స్వస్థత ప్రసాదించువారు ఎవరు? తౌహీద్ యొక్క రకాలు ఏమిటి? షిర్క్, కుఫ్ర్, నిఫాఖ్ అంటేమిటి? ముష్రిక్, కాఫిర్, మునాఫిఖుల పర్యవసానం ఏమిటి? తదితర విషయాలు.

ఆరాధన

11-  వారికి ఇస్లాం యొక్క ఐదు మూలసూత్రాలు నేర్పు.

12-  వారికి నమాజు అలవాటు చేయించు. (ప్రవక్త ఆదేశం:) “మీ సంతానం వయస్సు ఏడు సంవత్సరాలు పూర్తి అయితే వారికి నమాజు గురించి ఆదేశించండి. వారి వయస్సు పది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నమాజు విషయంలో వారిని దండించండి“.

13-  నీవు మస్జిదుకు వెళ్తూ నీ కూమారుడ్ని వెంట తీసుకెళ్ళు. వుజూ ఎలా చెయ్యాలో అతనికి నేర్పించు.

14- అతనికి మస్జిదులో పాటించవలసిన పద్ధతులు, మస్జిద్ గౌరవం, పవిత్రత తెలియజేయి.

15- ఉపవాసం అలవాటు చేయించు. చివరికి అతను పెద్దగయ్యాక దానికి అలవాటు పడి ఉండుటకు.

16-  సాధ్యమైనంత వరకు ఖుర్ఆన్, హదీస్ మరియు సమయ సందర్భ స్మరణలు (అజ్కార్) కంఠస్తం చేయించుటకు ప్రోత్సహించు.

17-  వారు ఖుర్ఆన్ కంఠస్తం చేస్తున్నా కొద్ది వారికి ఏదైనా బహుమానం ఇస్తూ ఉండు. ఇబ్రాహీం బిన్ అద్ హమ్ చెప్పాడుః నా తండ్రి నాతో ఇలా చెప్పారుః “పుత్రుడా! నీవు ప్రవక్త హదీసులు కంఠస్తం చేయి. నీవు కంఠస్తం చేసే ప్రతి హదీసుకు బదులుగా ఒక దిర్హమ్ ఇస్తాను”. ఈ విధంగా నేను హదీసులు కంఠస్తం చేశాను.

18- ఖుర్ఆన్ పేరు వింటెనే శిక్షగా భావించి, ఖుర్ఆన్ కంఠస్తాన్ని అసహ్యించుకునే విధంగా కంఠస్తం మరియు పారాయణం చేయమని అధికంగా ఒత్తిడి చేయకు.

19- నీవు నీ సంతానానికి ఒక ఆదర్శం అని తెలుసుకో. నీవు ఆరాధనల్లో అలసత్వం పాటిస్తే, లేదా ఎంతో ఇబ్బందిగా పాటిస్తే దాని ప్రభావం వారిపై పడుతుంది. వారు కూడా ఎంతో కష్టంగా దానిని పాటిస్తారు లేదా దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు.

20- వారికి దానధర్మాలు చేసే అలవాటు చేయించు. అదెలా అంటే ఒక్కోసారి వారు చూస్తుండగా నీవు ఏదైనా దానం చేయి. లేదా వారికి ఏదైనా ఇచ్చి ఎవరైనా బీదవానికి లేదా పేదవానికి దానం చేయమని చెప్పు. దీనికంటే మరీ ఉత్తమమేమిటంటే వారు స్వయంగా జమ చేసుకుంటున్న డబ్బులో నుండి దానం చేయాలని ప్రోత్సహించు.

ప్రవర్తన

21-  నీ కొడుకు సత్యవంతుడు కావాలని నీవు కోరుకుంటే అతనిలో భయాన్ని జనింపజేయకు.

22-  నీవు సత్యమే పలుకుతూ ఉండు అప్పుడు నీ కొడుకు నీతో సత్యం నేర్చుకుంటాడు.

23- సత్యం మరియు అమానత్ (అప్పగింత, బాధ్యత, విశ్వసనీయత)ల ఘనతను వివరించు.

24- అతనికి తెలియకుండానే అతని అమానతును ఒక్కోసారి పరీక్షించు.

25- ఓపిక అలవాటు చేయించు. తొందరపాటు చేయకూడదని నచ్చజెప్పు. ఉపవాస అభ్యాసం ద్వారా లేదా ఓపిక మరియు నెమ్మదితో కూడిన విషయాలపై అమలు ద్వారా ఇది సంభవం కావచ్చు.

26- వారి మధ్య న్యాయం పాటించు. న్యాయగుణం వారికి నేర్పడానికి ఇదే అతిఉత్తమమైన పద్ధతి.

27- వారికి ప్రాధాన్యత గుణం అలవాటు చేయించు. అది క్రియారూపకంగానైనా లేదా ప్రాధాన్యత గుణం యొక్క ఘనతను చాటే కొన్ని సంఘటనలను ప్రస్తావించి అయినా.

28- మోసం, దొంగతనం మరియు అబద్ధాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించు.

29- వారు ఏదైనా సందర్భంలో ధైర్యం ప్రదర్శిస్తే వారిని ప్రశంసించి ఏదైనా బహుమానం ఇవ్వు. వాస్తవమైన మరియు అవసరం ఉన్న చోటే ధైర్యం ప్రదర్శించాలని బోధించు.

30- కఠినంగా ప్రవర్తించకు. దానివల్ల వారిలో భయం, అబద్ధం మరియు పిరికితనాలు చోటు చేసుకుంటాయి.

31-  వారిలో నమ్రత, మెతకవైఖరి గుణాల ప్రేమతో పాటు అహంకారాన్ని వదలుకునే ప్రేమ కుదిరించు.

32- ఘనతల్లో వ్యత్యాసం భయభీతి మరియు సత్కార్యాల ద్వారా ఉంటుంది తప్ప వంశం, డబ్బుధనం వల్ల కాదని నేర్పు.

33- అన్యాయం, అత్యాచారం యొక్క పర్యవసానం మహా చెడ్డదని, దౌర్జన్యం అనేది దౌర్జన్యపరులనే తన పొట్టలో పెట్టుకుంటుందని మరియు నమ్మకద్రోహం అనేది వినాశనానికి దారి తీస్తుందని తెలియజేయి.

34- కొన్ని విషయాల్లో ఉన్న వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పు, బహుశా వారికి తెలియకుండా ఉండవచ్చు. ఉదాహరణకుః ధైర్యం, శౌర్యం మరియు వెర్రిసాహసంలోని వ్యత్యాసం. సిగ్గు మరియు జంకులోని వ్యత్యాసం([1]). వినయం, అణకువ మరియు పరాభవంలోని వ్యత్యాసం. చాతుర్యం మరియు మోసంలోని వ్యత్యాసం.

[1] తప్పు చేసినందువల్ల లేదా లోపంవల్ల మనస్సుకు కలిగే జంకును హయా అని అరబీలో షేమ్ అని ఇంగ్లీషులో అంటారు. చేయవలసిన పని చేయకుండా సిగ్గు పడుటను ఖజల్ అని అరబీలో బాష్ ఫుల్ నెస్ అని ఇంగ్లీషులో అంటారు

35- ఇతరులకు మేలు చేసే అలవాటు వారికి చేయించు. అందుకై నీవు స్వయంగా నీ ఇంట్లో ఉత్తమముగా మెదులు, ఇతరులకు మేలు చేస్తూ ఉండు.

36- ఎప్పుడూ వాగ్దానభంగం చేయకు. ప్రత్యేకంగా నీ సంతానంతో. అందువల్ల వాగ్దానం నెరవేర్చే ఘనత వారిలో మంచిగా చోటు చేసు కుంటుంది.

సభ్యత సంస్కారం

37-  నీవు వారికి సలాం చేయి.

38- నీ మర్మ ప్రదేశాల మీద వారి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండు.

39- నీ పొరుగువారితో మంచి విధంగా మెలుగు.

40- వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించాలని వారికి నేర్పు. మరియు వారిని బాధించడంలో ఉన్న నష్టం గురించి తెలియజేయి.

41- నీవు నీ తల్లదండ్రుల పట్ల సద్వర్తన పాటించు. నీ బంధువులతో కలుస్తూ ఉండు. ఇలాంటి సందర్భాల్లో నీ సంతానాన్ని నీ వెంట ఉంచుకో.

42- ఇతరులకు ఇబ్బంది కలిగించని మంచి అలవాట్లు గల పిల్లలను ప్రజలు మెచ్చుకుంటారని తెలియజేయి.

43- వారికి ఒక పత్రం వ్రాసి పెట్టు. అందులో కొన్ని ఉత్తమ పద్ధతులు, హితోపదేశాలుండాలి.

44- కొన్ని పద్ధతులు మంచివి కావని తెలియజేస్తూ వాటి కారణం ఏమిటో స్పష్టపరచు.

45- వారితో కూర్చొని వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి గురించి చదువుతూ ఉండు. వారు దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో కనుక్కో. ఒక్కోసారి వారిలో ఎవరితోనైనా చదివించి నీవు వింటూ ఉండు.

46- వారిలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అతనికి ఒంటరిగా నచ్చజెప్పు. నలుగురి ముందు అతన్ని దండించకు.

47- సాధ్యమైనంత వరకు శాపనార్దాలు పెట్టకు.

48- వారి గదిలో ప్రవేశించేటప్పుడు, ముందుగా వారి అనుమతి తీసుకో, వారికి అనుమతి పద్ధతి నేర్పుటకు ఇది ఉత్తమ మార్గం.

49- నీవేదైనా ఆదేశించినప్పుడు తొలిమాటలోనే వారు అర్థం చేసుకుంటారని ఆశించకు. (ఒక్కోసారి ఏదైనా విషయం రెండు మూడు సార్లు కూడా చెప్పవలసి వస్తుంది అలాంటప్పుడు ఓపికతో చెప్పు):

[وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا] {طه:132}

నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. (తాహా 20: 132).

50- భోజనం చేసే ముందు బిస్మిల్లాహ్ అని, చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని వారికి వినబడే విధంగా చదవడం మరచిపోకు.

51-  వారి కొన్ని తప్పిదాలను చూసిచూడనట్లుగా ఉండు. నీ మెదడును వారి తప్పిదాలను భద్రపరిచే స్టోర్ రూంగా చేయకు.

52- నీ నుండి ఏదైనా తప్పు జరిగితే దానికి నిజమైన సాకు చెప్పుకో.

53- నీవు విలక్షణం, ప్రత్యేక విశిష్టత గలవాడివని, నీవు ఇది చేయగలుగుతావని అతడ్ని ప్రోత్సహించు.

54- వారికి ఓ ప్రత్యేకత నీవు ప్రసాదించు.

55- అతని మాటను లేదా పనిని అవహేళన చేయకు.

56- అభినందన వాక్యాలు, శుభకాంక్ష పదాలు, స్వాగతం, మర్యాద పద్ధతులు నేర్పు.

57- (పెడమార్గం పట్టేవిధంగా) ఎక్కువగా గారాభం చేయకు.

58- ఏదైనా పని చేయించుకొనుటకు మాటిమాటికి డబ్బుల ఆశ చూపకు. అందువల్ల అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

59-  వారిని నీ యొక్క నెంబర్ వన్ స్నేహితునిగా ఉంచు.


పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

%d bloggers like this: