హజ్ పాఠాలు – 3: హజ్ సంపూర్ణ విధానం, మస్జిదె నబవి దర్శనం [వీడియో]

బిస్మిల్లాహ్

[19:43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జిల్ హిజ్జ ఎనిమిదవ రోజు:

ఈ రోజు హాజి మినా వెళ్ళి జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు రకాతులు చేయాలి.

తొమ్మిదవ రోజు (అరఫ రోజు):

ఈ రోజు చేయు ధర్మములు ఇవి:

1- సూర్యోదయము తరువాత హాజి అరఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జొహ్ర్, అస్ర్ కలిపి ఖస్ర్ చేయాలి. నమాజ్ తరువాత అల్లాహ్ స్మరణము, దుఆ మరియు తల్ బియలో నిమగ్నులై, వినయ వినమ్రతతో అల్లాహ్ ను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాహ్ తో అడుగుతూ తనిష్ట ప్రకారం దుఆ చేసుకోవాలి. చేతులు ఎత్తి దుఆ చేయడం చాలా మంచిది. అరఫాత్ లో నిలవడం హజ్ రుకున్ లలో ఒకటి. ఇచ్చట నిలవనివారి హజ్ కానేకాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జ సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జ ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజి అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బైట ఉన్నవారి హజ్ నెరవేరదు.

2- అరఫ రోజు కచ్చితంగా సూర్యాస్తమయం అయిన పిదప అరఫాత్ నుండి ముజ్ దలిఫా వైపునకు పూర్తి శాంతి, మర్యాదతో ఘనమైన శబ్దముతో తల్ బియ చదువుతూ వెళ్ళాలి.

ముజ్ దలిఫా:

ముజ్ దలిఫా చేరుకొని మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి ఖస్ర్ చేయాలి. నమాజు తరువాత తన స్వంత పనులు చేసుకోవచ్చును. అది భోజనం తయారీ, తదితర పనులు. చురుకుదనంతో ఫజ్ర్ నమాజుకు మేల్కొనుటకు తొందరగా పడు కోవడం చాలా మంచిది.

పదవ రోజు (పండుగ రోజు):

1- ఫజ్ర్ నమాజు సమయమయిన వెంటనే నమాజు చేసుకొని అక్కడే కూర్చోని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్, దుఆలు చేస్తూ ఉండాలి.

2- ఏడు చిన్న రాళ్ళు తీసుకొని సూర్యోదయాని- కి ముందే తల్ బియ చదువుతూ మినా వెళ్ళాలి.

3- జమ్ర అఖబ (జమ్ర కుబ్రా, సామాన్యాంగా ప్రజలు దాన్ని పెద్ద షైతాన్ అంటారు) చేరుకునే వరకు తల్ బియ చదువుతూ ఉండాలి. ఏడు రాళ్ళు, ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అఖబపై విసరాలి.

4- రాళ్ళు విసిరిన తరువాత తమత్తుఅ, మరి  ఖిరాన్ చేసేవారు ఖుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడం, ఇతరు లకు దానం చేయడం, బహుకరించడం మంచిది.

5- ఖుర్బానీ తరువాత తల కొరిగించాలి. లేదా కటింగ్ చేయించుకోవాలి. తల కొరిగించడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు కూడా తమ తల వెంట్రుకలను వ్రేలు మందము అనగా మూడు సెంటిమీటర్లు కత్తిరించుకోవాలి.  

ఇప్పుడు హాజి స్నానం చేసి, సువాసన పూసుకొనుట, దుస్తులు ధరించుట మంచిది. ఎందుకనగా ఇప్పుడు హాజిపై ఇహ్రామ్ వలన నిషిద్ధమున్న; కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు, వెంట్రుకలు తీయడం లాంటి విషయాలు యోగ్యమగును. కాని భార్యభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును.

6- కాబా వద్దకు వెళ్ళి తవాఫె హజ్ (తవాఫె ఇఫాజ) చెయ్యాలి. అది ఈ విధంగా: ముందు కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చెయ్యాలి. హజ్జె తమత్తుఅ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ చెయ్యాలి. కాని ఖిరాన్ హజ్ లేదా ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలి తవాఫ్ తో సఈ చేసియుంటే ఇప్పుడు సఈ చేయవలసిన అవసరం లేదు. అదే హజ్ యొక్క సఈ అగును. అప్పుడు సఈ చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక చేయాలి.

సఈ తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగి- స్తాయి. భార్యాభర్తల మధ్య నిషిద్ధత కూడా.

7- హాజీ 11వ, 12వ  రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. (ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును). రాత్రి గడపటం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి.

రాళ్ళు విసరడం, ఖుర్బానీ చేయడం, క్షౌరం, తర్వాత తవాఫ్. ఈ నాలుగు పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒక వేళ ఇందులో వెనకా ముందు జరిగినా ఏమీ అభ్యంతరం లేదు.

పదకుండవ రోజు:

ఈ రోజు హాజి రమె జిమార్ (రాళ్లు విసురుట) ఆవశ్యకం. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకు ముందు విసురుట యోగ్యం లేదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరపై, తర్వాత మధ్య దానిపై, ఆ తరువాత అఖబ అంటే పెద్ద దానిపై విసరాలి. క్రింద తెలుపబడే రీతిలో రమె జిమార్ చెయ్యాలి.

1- తన వెంట చిన్న 21 రాళ్ళు (పెద్ద శనగ గింజంత) తీసుకొని ముందు చిన్న జమరపై ఒక్కొక్కటేసి ఏడు రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమర చుట్టున్న హౌజులో పడునట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచం కుడి వైపున జరిగి నిలబడి దీర్ఘంగా దుఆ చేయుట సున్నత్.

2- మధ్యలో నున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొ క్కటేసి ఏడు రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ వైపుకు జరిగి దీర్ఘంగా దుఆ చేయాలి.

3- ఆ తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి ఏడు రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి.

పన్నెండవ రోజు:

1- ఈ రోజు పదకుండవ రోజు చేసిన తీరు చేయాలి. హాజి 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు 11 మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి.

2- 12వ రోజు (మరియు 13వ రోజు ఉన్న వారు ఆ రోజు) రాళ్ళు విసిరిన తరువాత కాబా వద్దకు వెళ్ళి తవాఫె విదాఅ చెయ్యాలి. తర్వాత మఖామె ఇబ్రాహీం వెనక, అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా రెండు రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలంత స్త్రీలు ఈ తవాఫ్ చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళినా పాపమేమి లేదు.

ఎవరైనా పదవ తారీకున చేయవలసిన తవాఫె ఇఫాజ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా ఫరవా లేదు, యోగ్యమే. అదే ఈ తవాఫె విదాఅ కు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్ళే ముందు చేసే తవాఫె విదాఅ కు బదులుగా ఈ తవాఫె ఇఫాజ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫె విదాఅ సంకల్పం తో కాకుండా, తవాఫె ఇఫాజ సంకల్పం చేసుకోవాలి.

3- ఆ తరువాత హాజి ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దుఆ మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరంగా, ఉదాః తన మిత్రుని కొరకు వేచిస్తూ, లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగుతే పాపం లేదు. కాని దూర దేశాల నుండి వచ్చినవారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదలి వెళ్ళిపోయే రోజున తవాఫె విదాఅ చేయాలి.

హజ్ యొక్క రుకున్ లు:

  • 1- ఇహ్రామ్.         
  • 2- అరఫాత్ లో నిలవడం.
  • 3- తవాఫె హజ్.
  • 4- సఫా మర్వా మధ్యలో సఈ.

పై నాలిగిట్లో ఏ ఒక్క రుకున్ వదలినా, తిరిగి దానిని చేయని వరకు హజ్ నెరవేరదు.

హజ్ యొక్క వాజిబులు:

  • 1- మీఖాత్ నుండి ఇహ్రాం చేయడం.
  • 2- పగలు వచ్చినవారు సూర్యాస్తమయం వరకు అరఫాత్ లో నిలవడం.
  • 3- ముజ్ దలిఫాలో ఫజ్ర్ తరువాత ప్రకాశ మాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధు లు, స్త్రీలు అర్థ రాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు.
  • 4- 11, 12, (13) రాత్రులు మినాలో గడపడం.
  • 5- పై మూడు రోజుల్లో రాళ్ళు విసరడం.
  • 6- క్షౌరం చేయించుకోవడం.
  • 7- తవాఫె విదాఅ.

పై ఏడిట్లో ఏ ఒక్క వాజిబ్ వదలినా అతనిపై ‘దమ్’ విధిగా అవుతుంది. అంటే ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో ఏడవ వంతు బలి ఇచ్చి హరంలోని బీదవారికి దానం చేయాలి.

మస్జిదె నబవి దర్శనం:

నమాజ్ చేసే ఉద్దేశ్యంతో మస్జిదె నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీసు ప్రకారం అందులో చేసే ఒక నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే వెయ్యి నమాజుల కన్నా అతిఉత్తమం. మస్జిదె హరాం మక్కా తప్ప. (అందులో ఒక నమాజు పుణ్యం మస్జిదె నబవిలోని వంద నమాజులకు, ఇతర మస్జిదుల్లోని లక్ష నమాజుల కంటే ఉత్తమం). మస్జిదె నబవి దర్శనం సంవత్నరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికొక ప్రత్యేక సమయమేమి లేదు. అది హజ్ లో ఒక భాగం కూడా ఎంత మాత్రం కాదు. మస్జిదె నబవీలో ఉన్నంత సేపట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే, స్త్రీలకు లేదు. మస్జిదె నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, బర్కత్ (శుభం)గా భావించుట, సమాధి యొక్క తవాఫ్ చేయుట, దుఆ సమయాన దాని వైపు ముఖము చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనక యోగ్యం లేవు.

అల్లాహ్ మీ హజ్ మరియు సర్వ సత్కార్యాలు స్వీకరించి, రెట్టింపు పుణ్యాలు ప్రసాదించుగాక!


పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు
హజ్ మరియు ఉమ్రా ఆదేశాలు (Haj Umrah) [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/rulings-of-hajj-and-umrah-telugu-islam/

హజ్, ఉమ్రా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

%d bloggers like this: