
[26:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ముస్లిం వనిత [పుస్తకం]
“హైజ్”, “నిఫాసు”ల ధర్మములు
“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువు: స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.
1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఆరోగ్యం, వాతవరణం మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని రావచ్చు.
2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.
గర్భిణి యొక్క బహిష్టు: సామాన్యంగా గర్భం నిలిచిన తర్వాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవ వేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాసు” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాసు” కాదు, బహిష్టు కాదు.
అసాధారణ బహిష్టు:
అసాధారణ బహిష్టు రకాలు:
1- ఎక్కువ, తక్కువ: ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు వచ్చింది, ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులే వచ్చింది.
2- వెనక, ముందు: ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో వచ్చింది. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలో వచ్చింది.
పరిష్కారం: వెనక, ముందు అయినా, ఎక్కువ, తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.
3- పసుపు లేదా గోదుమ రంగు: బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు లేదా గోదుమ రంగు వలే అంటే పుండు నుండి వెళ్ళే నీటి మాదిరిగా చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.
4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం.
ఇది రెండు రకాలుగా కావచ్చు.
మొదటి రకం: ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.
రెండవ రకం: ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి వచ్చి, ఆ తరువాత పరిశుభ్రం అవుతుంది.
ఎవరికి ఒకరోజుకన్నా తక్కువ రక్తస్రావం ఆగిపోతుందో అది పరిశుద్ధతలో లెక్కించబడదు. ఒకవేళ ఏదైనా గుర్తు ఉంటే అది వేరే విషయం; ఉదా: అలవాటుగా ఉన్న చివరి రోజుల్లో ఆగిపోవడం, లేదా తెల్లని ద్రవం రావడం (తెల్లబట్ట అవడం కూడా అంటారు కొందరు).
5- రక్తస్రావం ఉండదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధమయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.
బహిష్టు యొక్క ధర్మములు
1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పకుండా చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధమయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయవలెను. ఎందుకనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.
ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, తహ్మీద్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం, హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ చేయడం, దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, నోటితో కాకుండా చూస్తూ గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు, యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్ గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో ఇంకా ఒకరి కరెక్షన్ కొరకు ఖుర్ఆన్ చూస్తూ చదవడం, చదివించడం పాపము కాదు, కాని ఆ సమయంలో చేతులకు గ్లౌజులు ధరించి ఉండాలి, లేదా ఏదైనా అడ్డుతో పట్టుకోవాలి.
2- ఉపవాసం (రోజా): ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. ఉపవాస స్థితిలో బహిష్టు వస్తే ఆ ఉపవాసం నెరవేరదు, అది సూర్యాస్తమయానికి కొన్ని క్షణాల ముందైనా సరే. అది ఫర్జ్ ఉపవాసమయితే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయం తరువాతనే అయితే ఆ ఉపవాసం పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తర్వాత పరిశుద్ధమయితే ఆ రోజు యొక్క ఉపవాసం ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.
3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫె హజ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.
4- మస్జిదులో నిలవడం: బహిష్టు స్త్రీ మస్జిదులో ఉండుట నిషిద్ధం.
5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట ఇతర విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.
6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యం చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకులివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకోవడం లేదా విడాకులివ్వడం మంచిది.
7- స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందరపడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”(1) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.
(1) దాని విధానం ఇది: ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.
ముందు పాఠాలు:
- ముస్లిం వనిత – పార్ట్ 01 : స్త్రీల హక్కులు, భర్తలపై భార్యల హక్కులు [వీడియో]
ఇస్లాంలో స్త్రీ స్థానం, స్త్రీ యెక్క సామాన్య హక్కులు, భర్త పై భార్య హక్కులు - ముస్లిం వనిత – పార్ట్ 02: పరద, బురఖా (హిజాబ్) [వీడియో]
You must be logged in to post a comment.