[20:28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సున్నతె ముఅక్కద:
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః
(مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజు లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
(إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు“. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
(فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).
“మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప“. (బుఖారి 6113).
విత్ర్ నమాజ్:
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద.
దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది.
అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.
కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః
أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజు రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
(صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).
“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. (బుఖారి 991, ముస్లిం 749).
విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
ఫజ్ర్ సున్నతులు:
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:
أَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్నతులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724). వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారు:
لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.
“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).
మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.
ప్రవక్తను అనుసరిస్తూ వాటిని సంక్షిప్తంగా చేయాలి.
ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజు తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.
చాష్త్ నమాజ్:
దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః
عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).
“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికీ బదులుగా ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయంలో రెండు రకాతులు సరిపోతాయి”.
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదలిపెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).
దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
You must be logged in to post a comment.