ఇమామ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బిస్మిల్లాహ్

ఇమామ్‌ ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్‌. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీన్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశపరంపర ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ ము’గీరహ్‌.

జననం: ఖురసాన్‌ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్‌, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.).
మరణం: 1-10- 256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖంద్ లో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు.
ఇతని శిక్షకులు: అహ్మద్‌ బిన్‌ హంబల్‌, అలీబిన్‌ మదీనీ , ఇస్-హాఖ్ బిన్‌ రహ్వే.
ఇతని శిశ్యులు: ముస్లిం బిన్‌ హజ్జాజ్‌, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్‌ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్‌ బిన్‌ అనస్‌ శిష్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్దులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లా డుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ) 

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవేకాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్ధించడం, దైవభీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొరపెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్న తనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతు లెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను కలలో చూశారు. ‘నీ ప్రార్దన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్టత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని “తారీఖ్‌ కబీర్‌” అనే పుస్తకం వ్రాశారు.

బాల్యం, విద్యాభ్యాసం, శిక్షణ, గురువులు:

బు’ఖారాలో 194 హిజ్రీ శకంలో రమజాన్‌ 13వ తేదీన జుమ’అహ్‌ నమా’జ్‌ తర్వాత జన్మించారు. బు’ఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా, అతని విద్యాభ్యాసం, శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమ మైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక ‘హదీసు’వేత్త. అతని తండ్రి ఇస్మా’యీల్‌ బాల్యం లోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణా బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయస్సు పెరిగిన తర్వాత ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది ‘హదీసు’వేత్తల కుటుంబం.

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “నేనింకా బడిలో ఉండగానే ‘హదీసు’ విద్య నేర్చు కోవాలనే కోరిక నాకు కలిగింది.” వర్రాఖ్‌ బు’ఖారీని “మీకు ‘హదీసు’ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయస్సు ఎంత” అని అడిగితే “అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బు’ఖారీ ‘హదీసు’వేత్తల సభలలో పాల్గొనసాగారు.

ప్రారంభదశలోనే ఒక సంఘటన జరిగింది. బు’ఖారా లోని ప్రఖ్యాత పండితులు దా’ఖలీ అలవాటు ప్రకారం ‘హదీసు’లను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బు’ఖారీ కూడా ఉన్నారు. దా’ఖలి ఒక ‘హదీసు’ ప్రామా ణికతను పేర్కొంటూ, ‘సుఫియాన్‌ అన్‌ అబి’జ్జుబే ర్‌ అన్‌ ఇబ్రాహీమ్‌” అని అన్నారు. బు’ఖారీ అది విని, “అన్న అబా’జ్జుబేర్‌ లమ్‌ యరౌ ఇబ్రాహిమ్‌” – అంటే ‘అబు ‘జ్జుబేర్  ఇబ్రాహీమ్‌ ద్వారా ఉల్లేఖించ లేదు,’ అని అన్నారు. అప్పుడు బు’ఖారీ వయస్సు 11 సంవత్సరాలు.

బు’ఖారీ అప్రమత్తత: అజ్‌లోనీ బు’ఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొన్నారు. “బు’ఖారీ తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అష్రఫీ లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బు’ఖారీకి సేవలుచేసి, చాలా గౌరవభావం వ్యక్తం చేశాడు. బు’ఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించ సాగాడు. బు’ఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అష్రఫీ లు ఉన్నాయని కూడా అతనికి తెలుపడం జరగింది.

ఒక రోజు బు’ఖారీ మిత్రుడు నిద్రలేచి ఏడ్వటం పెడబొబ్బలు పెట్టటం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడసాగారు. అసలు  ఏమయిందని అడిగారు.’ ప్రజలు అంతగా అడుగుతుంటే, ఆ వ్యక్తి నా దగ్గర 1000 అష్రఫీల సంచి ఉండేది. అది పోయింది అని ఏడ్వసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బు’ఖారీ ఎవరికీ తెలియకుండా తన అష్రఫీల సంచిని సముద్రంలో పారవేశారు. ఆ తరువాత బు’ఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్దా అది దొరక్కపోయేసరికి, వారు ఆ వ్యక్తినే చీవాట్లు పెట్టారు.

ప్రజలందరూ ఓడనుండి దిగారు. ఆవ్యక్తి ఏకాంతంలో బు’ఖారీని కలిశాడు. ‘తమరు ఆ అష్రఫీల సంచి ఏం చేశారు?’ అని అడిగాడు. బు’ఖారీ, ‘ఆ సంచిని సముద్రంలో పారవేశాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసెలా ఒప్పింది,’ అని అడిగాడు. “నీకు బుద్దుందా? నా జీవిత మంతా ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ‘హదీసు’లను రాయడంలోనే గడచి పోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం నిందరావటాన్ని నేనెలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అష్రఫీలకు ఎలా బలి చేయగలను,” అని సమాధానం ఇచ్చారు.

సద్గుణాలు, అలవాట్లు, ప్రవర్తన: బు’ఖారీకి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రిగారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటుపాట్లు జరుగుతుంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బు’ఖారీ తండ్రి ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్స్‌తో, ‘నేను నా ధనంలో ఒక్క దిర్‌హమ్‌ కూడా అధర్మమైనదిగా ఎరుగను.’ అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మా’యీల్‌ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండే వారు. ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో అబూ హఫ్స్‌తో నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచివెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు,’ అని హితవుచేశారు.

‘హదీసు’వేత్త ముహమ్మద్‌ బిన్‌ అబీ  హాతిమ్‌ కథనం: బు’ఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమై పోయారు. అల్లాహ్‌ అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురికాకుండా సంరక్షించాడు.

స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25వేల దిర్‌హమ్‌లు నొక్కేశాడు. శిష్యులు, ‘అప్పు తీసుకున్న వాడు వచ్చాడు, అతన్నుండి అప్పు వసూలు చేసుకోండి, ‘ అని అన్నారు. దానికి బు’ఖారీ, ‘అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు’ అని అన్నారు. బు’ఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్దులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్‌హమ్‌లు దీనికి కేటాయించేవారు. పండితులకు, విద్యార్దులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్నపానీయాల విషయంలో భోగ, విలాసాలకు దూరంగా ఉండేవారు.

బు’ఖారీ గుమస్తా అయిన ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ కథనం: ఒకసారి విద్యార్జన  కాలంలో ఆదమ్‌ బిన్‌ అబీ అయాస్‌ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామగ్రి అంతా అయిపోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు అలములు తిని గడిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ ఏదీ అడగలేదు. బు’ఖారీ దైవభీతి, దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ అస్సియార్ ఫీ   కథనం: నేను ఒకసారి ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని ప్రక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది. వెంటనే బు’ఖారీ ఆగ్రహంచెంది, ‘ఎలా నడుస్తున్నావు?’ అని అన్నారు. దానికి సేవకురాలు, ‘దారిలేకపోతే ఎలా నడిచేది? ‘ అని చెప్పింది. అది విని బు’ఖారీ ఆగ్రహం చెందడానికి బదులు, “పో నిన్ను నేను విడుదల చేసి వేశాను,” అని అన్నారు. అప్పుడు నేను “ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది. తమరు కోప్పడటానికి బదులు ఆమెను విడుదల చేసివేశారా?” అని అడిగాను. దానికి బు’ఖారీ, “ఆమె చేసిందానికి నన్ను నేను సంతృప్తి పరచుకున్నాను.” అంటే బు’ఖారీ ఆమెను చీవాట్లు పెట్టేబదులు తన్ను తాను చీవాట్లు పెట్టుకున్నారు.

ఒకసారి బు’ఖారీ తండ్రిగారి శిష్యుడైన అబూ ‘హఫ్‌స్‌ కొంతసరుకును బు’ఖారీ వద్దకుపంపారు. కొంత మంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5000 రుసుము ఇచ్చి సరుకు తీసుకొని వెళతామని అన్నారు. దానికి బు’ఖారీ ‘ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, ఇచ్చి తీసుకువెళ్ళండి’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి, 5వేలకు బదులు 10 వేలు ఇచ్చి సరకు తీసుకువెళతా మన్నారు. కాని బు’ఖారీ తరువాత వచ్చిన వ్యాపారులను రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపి వేశారు. అనంతరం మొదట వచ్చిన వ్యాపారులకు ఆ సరకును అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చారు.

‘హదీసు’వేత్తల నాయకుడు బగ్దాద్‌ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్‌ బనీ ‘అబ్బాస్‌ పరపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్‌, మామూన్‌ వంటి మహారాజులు దీని అభివృద్ధికి కృషి చేశారు. బగ్దాద్‌ గొప్పగొప్ప పండితులకు, ధార్మికవేత్తలకు నిలయంగా మారింది. బు’ఖారీ పేరు ప్రఖ్యాతులు బగ్దాద్‌ వరకు వ్యాపించాయి.

బు’ఖారీ బగ్దాద్‌ వచ్చారు. అతని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించటానికి బగ్దాద్‌ నగర పండితులు, ‘హదీసు’వేత్తలందరూ ఏకమయ్యారు. వంద ‘హదీసు’లను వాటి సాక్ష్యాధారాలను కలగా పులగం చేసి, బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహా విద్యావంతు లందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు ‘హదీసు’లు చదవసాగారు. బు’ఖారీ, “నాకు తెలియదు” అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన, మార్పులు చేర్పులు చేసిన ‘హదీసు’లు చదవగా బు’ఖారీ కేవలం, “నాకు తెలియదనే” సమాధానం ఇచ్చారు. ఈవిధంగా నిర్ణయించిన ‘హదీసు’లన్సీ అయిపోయాయి.

బు’ఖారీని ఎరుగని వారు, బు’ఖారీ ఓడిపోయారని భావించారు. కాని అతన్ని గురించి తెలిసిన వారు బు’ఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బు’ఖారీ వెంటనే నిలబడి వారు కలగాపులగం చేసి, మార్పులు చేర్పులు చేసి చదివిన ‘హదీసు’లను సరైన రీతిలో ఏమాత్రం తప్పులేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన ‘హదీసు’లన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా  వినిపించారు. అది చూసి బగ్దాద్‌ ప్రజానీకం ఆశ్చర్య పడకుండా ఉండలేక పోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు.

మరణం: బు’ఖారీ 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయస్సులో ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రాత్రి 256 హిజ్రీ శకంలో మరణించారు. మరణించిన తరువాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్‌ చుట్టువేయడం జరిగింది. కొంతమంది సమర్‌ఖంద్‌ తీసుకువెళదామని కోరారు. ఇంకా ఖనన ప్రదేశం విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాని తరువాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు “జుహర్‌ నమాజు తర్వాత ఖననం చేయబడ్డారు.

వర్రాఖ్  కథనం: బు’ఖారీ తన మరణానికి ముందు తనను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) సాంప్రదాయం ప్రకారం 3 వస్త్రాల్లో  ఖననం చేయాలని ఉపదేశించారు.

ఖతీబ్‌ అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ ఆదమ్‌ అత్తవాల్‌లేసీ  యొక్క సంఘటన పేర్కొన్నారు, “నేను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను తన సహచరుల బృందం వెంట ఒకచోట వేచిఉన్నారు. ఎవరి గురించో ఎదురుచూస్తున్నారు. నేను సలామ్‌ చేసి, ‘ఎవరి గురించి ఎదురుచూస్తున్నారు’ అని అడిగాను. దానికి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం), ‘నేను ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీ’ల్‌ గురించి ఎదురుచూస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బు’ఖారీ మరణవార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని, మరణసమయాన్ని కలిపి చూశాను. ఆ రెండూ ఒకే సమయం, ఒకే దినంగా నిర్దారించాను. ఎందు కంటే షరీఅత్‌లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలో ని 46వ భాగంగా నిర్దారించటం జరిగింది. బు’ఖారీ మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

బు’ఖారీ రచనలు; అత్తార’ఖుల్‌ కబీర్‌, అత్తారీఖుల్‌ అవ్‌ సత్‌, అత్తారీఖ్‌ అస్సగీర్‌, అల్‌ జామిఉల్‌ కబీర్‌, ఖల్‌ఖు అఫ్‌ఆలిల్‌ ఇబాద్‌, కితాబుద్దుఅఫాయిల్‌ అస్సగీర్‌, అల్‌ ముస్నదుల్‌ కబీర్‌, అత్తఫ్‌సీరుల్‌ కబీర్‌, కితాబుల్‌ హిబహ్‌, అసామిస్సహాబహ్‌, కితాబుల్‌ విజ్‌ దాన్‌, కితాబుల్‌ మబ్‌సూత్‌, కితాబుల్‌ ఇలల్‌, కితా బుల్‌ కినా, కితాబుల్‌ ఫవాయిద్‌, అల్‌ అదబుల్‌ ముఫ్రద్‌, జుజ్ఉరఫ్‌ఉల్‌ యదైన్‌, బిర్రుల్‌ వాలిదైన్‌, కితాబుల్‌ అష్‌రిబహ్‌, ఖ’దాయస్సహాబహ్‌ వత్తాబి యీన్‌, కితాబుర్రిఖాఖ్‌, అల్‌ జామిఉస్సగీర్‌ పిల్‌ ‘హదీస్‌’, జు’జ్‌ ఉ ఖిరాఅతి ‘ఖల్‌ఫల్‌ ఇమామ్‌ మొదలైనవి.

సహీ బు’ఖారీ ఆదరణ, దాని గొప్పతనం: బు’ఖారీ రచనల్లో ”అల్‌ జామిఉ’స్స’హీ’హ్‌” ఈనాడు ‘స’హీహ్‌ బు’ఖారీ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఇస్లామీయ  ప్రాంతాలన్నింటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బు’ఖారీకి ‘హదీసు’వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ పుస్తకం కూడా ఒక కారణమే. దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ తరువాత ఏ పండితుని పుస్తకానికి ఈ స్థానం  లభించలేదు.

‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయాలనే ఆలోచన: ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ బు’ఖారీని ‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయమని కోరారు. ఇబ్రాహీమ్‌ బిన్‌ మాఖల్‌ నసఫీ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, “ఒకరోజు మేము ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పు డతను, “నువ్వు ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ప్రామాణిక ‘హదీసు’లను ఒకచోట చేర్చితే బాగుండు,” అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుంది. నేను అప్పటి నుండే ‘స’హీ’హ్‌ బు’ఖారీని వ్రాయడం ప్రారంభించాను.

మరో కారణం ఏమిటంటే, బు’ఖారీ ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూశారు. “నేను ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసనకర్రతో ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై నుండి ఈగలను తోలుతున్నాను.”” మేల్కొన్న తరువాత పండితులతో దాని పరమార్దాన్ని  గురించి అడిగాను. దానికి వారు, ‘ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై కల్పించిన అసత్య ‘హదీసు’లను నీవు తొలగిస్తావు ,’ అని పరమార్దం తెలిపారు. ఎందు కంటే సత్యస్వప్పాలు దైవదౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూసిన వారు నిజంగా కలలోచూశారు. ఈకల కూడా మరింత కుతూహలాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈవిధంగా “జామె’ ‘స’హీహ్‌” రచనలో బు’ఖారీ నిమగ్నంఅయిపోయారు.

రచనా సమయం మరియు సరళి: ‘స’హీహ్‌ బు’ఖారీని, బు’ఖారీ ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఎలా రచించారు. రచించిన తరువాత, ఎవరి ముందు ప్రవేశపెట్టారు. ప్రతి విషయంపై చర్చించారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు: “నేను జామె’ ‘స’హీహ్‌ను మూడుసార్లు రచించాను. అంటే దాన్ని మూడుసార్లు సరిదిద్దాను.”

అబుల్‌ ‘హైస’మ్‌ కష్‌మిష్నీ కథనం: నేను ఫర్‌బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు. బు’ఖారీ కథనం: “నేను ఏ ‘హదీసు’నూ స్నానం చేసి రండు రకాతులు చదవనంత వరకు అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌లో చేర్చలేదు.”

మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: “దాన్ని నేను మస్టిదె ‘హరామ్‌లో రచించాను. ఇంకా ప్రతి ‘హదీసు’పై రెండు రకాతుల నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవాడిని. దానిపట్ల పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే ‘అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌’లో చేర్చేవాడిని. దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను. 6 లక్షల ‘హదీసుల్లో ప్రామాణికమైన ‘హదీసు’లను ఎంచి వ్రాశాను.”

ఇబ్నె అదీ తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు: బు’ఖారీ అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌ యొక్క అధ్యాయాలన్నిటిని ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గది మరియు మింబర్ల మధ్య కూర్చొని, ప్రతి అధ్యాయానికి ముందు రెండు రకాతులు నమా’జు చదివి వ్రాసేవారు.

వర్రాఖ్‌ కథనం: నేను బు’ఖారీ వెంట ఉన్నాను. నేను బు’ఖారీని కితాబుత్తఫ్‌సీర్‌ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15, 20 సార్లు లేచి దీపం వెలిగించి ‘హదీసు’లపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్నిబట్టి బు’ఖారీ ఎల్ల ప్పుడూ, ప్రతిచోట తన ధ్యానం అంతా దానిపైనే పెట్టే వారు. ఒక ‘హదీసు’ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తు పెట్టేవారు. ఇక అధ్యాయాలను బు’ఖారీ ఒకసారి ‘హరమ్‌లో మరోసారి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గదికి మింబరుకు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో ‘హదీసు’లను సంకలనం చేసినపుడు ముందు స్నానం చేసి నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవారు.

అబూ జ’అఫర్‌ అఖీలీ కథనం: బు’ఖారీ, ‘స’హీహ్‌ బు’ఖారీని రచించి, ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్‌ బిన్‌ హంబల్‌, ‘అలీ బిన్‌ మదీనీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలామెచ్చుకున్నారు. ఇంకా ప్రశంసించారు. దాని ప్రామాణికతను మెచ్చుకున్నారు. కాని నాలుగు ‘హదీసు’ల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ నాలుగు ‘హదీసు’ల విషయంలో కూడా బు’ఖారీ అభిప్రాయం సరైనదిగా తేలింది. ఆ నాలుగు ‘హదీసు’లు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి.(సీరతుల్‌ బు’ఖారీ).


ఇది మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] అను పుస్తకంలో “హదీసు వేత్తల జీవిత విశేషాలు నుండి తీసుకోబడింది

%d bloggers like this: