“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్ అన్‌కబూత్:45)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జాబిర్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).
ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్ మర్యం:59).
నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్:34-35).
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్ అల్ జామీ :2020).
నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్ ముద్దసిర్:42-47).
నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్ జిహాద్ ఫీ సబీలిల్లాహ్”’ (ముస్లిం).
ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.
ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)
You must be logged in to post a comment.