ఈద్ పండుగల నమాజు :
రమజాన్ మరియు బక్రీద్ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ పండుగ నమాజు వాజిబు.
పండుగ రోజు స్నానం చేయడం మన శక్తిని బట్టి మంచి దుస్తులు ధరించడం సున్నతుగా భావించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్ల దుస్తులు ధరించేవారు. తెల్ల దుస్తులంటే చాలా ఇష్టపడేవారు. మరియు సువాసనలో అన్నిటికంటే మంచి సువాసన పూసుకునేవారు. అలాగే యమని అబాయా తొడిగేవారు” (తబ్రాని).
రమజాన్ పండుగ నమాజుకు బయలుదేరక ముందు అల్పాహారం చేయడం సున్నతు. బక్రీద్ పండుగ నమాజు తరువాత అల్పాహారం చేయడం సున్నతు. (సహీహుల్ జామీ :4845, ఇబ్నుమాజా)
బక్రీద్ పండుగ నమాజుకు, రమజాన్ పండుగ నమాజుకు బయలు దేరేటప్పుడు బిగ్గరగా తక్బీర్ చెబుతూ ఈద్గాహ్ చేరుకోవాలి.
అరఫా రోజు ఫజర్ నమాజు నుండి అయ్యాముత్ తష్రీఖ్ (బక్రీద్ నెల 9,10,11,12,13) రోజుల్లో తక్బీర్ పదాలు పఠిస్తూ ఉండాలి.
“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ్ అక్బర్, అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్హమ్ద్”. అలాగే బక్రీద్ నాలుగు (10,11,12,139) రోజులలో ఖుర్చాని ఇవ్వవచ్చును.
(సహీహుల్ జామీ :5004, ఇర్వావుల్ గలీల్:654).
బక్రీద్ పండుగ రోజు తరువాత మూడు రోజులు ఖుర్బానీ చెయ్యవచ్చును. కాని పండుగ (జుల్హజ్10వ) రోజు ఖుర్బానీ చెయ్యడం ఉత్తమమైనది.
అయ్యాముత్ తష్రిఖ్ అంటే జిల్హజ్ నెల 11,12,13, రోజులు ఖుర్బానీ రోజులే. జిల్హజ్ 13వ రోజు సూర్యాసమయం వరకూ ఖుర్బానీ చెయ్యవచ్చును.
ఖుర్చానీ ఇవ్వదలుచుకున్నవారు తమ చేతులతోనే ఖుర్బానీ జంతువును జబహ్ చెయ్యడం మంచిది. అలాగే స్త్రీలు కూడా తమ ఖుర్బానీ జంతువును జబహ్ చెయ్యవచ్చును. లేక ఇతరుల ద్వారా జబహ్ చెయ్యించడం కూడా ధర్మమే.
పండుగ నమాజు తరువాత ఒక మంచి ధారుగల కత్తిని తీసుకొని “ఖుర్బానీ దుఆ” పఠించి జంతువును జబహ్ చేయాలి. తరువాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని బీదవారికి, మరొక భాగాన్ని బంధువులకు పంచాలి. మూడవ భాగాన్ని తమ సొంతానికై ఉంచుకోవాలి.
ఖుర్బానీ దుఆ:
“ఇన్నీ వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ, హనీఫఃవ్ వమా అనా మినల్ ముష్రికీన్, ఇన్న సలాతి వ నుసుకీ వ మహ్యా వమమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లీమీన్. అల్లాహుమ్మ మిన్క వ లక అన్ ……” ఖుర్బానీ ఎవరిపేరుతో ఇవ్వబడుతుందో వారి పేరు పేర్కొని “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని జబహ్ చెయ్యాలి.
రమజాన్ పండుగ నమాజుకు బయలదేరక ముందు ‘ఫిత్రా దానం చెల్లించాలి. బక్రీద్ పండుగ నమాజుకు తరువాత ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి, ముస్లిం)
ఫిత్రా దానం చెల్లించే స్తోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఫిత్రా దానం చెల్లించాలి. ఇంట్లో ఉన్నవారి ప్రతి వ్యక్తికి బదులు ఒక ‘సా’ (2.500 కి.) హిజాజి ధాన్యాలు (బియ్యం లేక గోదుమలు లేదా మనం నిరంతరాయంగా వాడుకునే ధాన్యం) దానంగా ఇవ్వాలి. (అహ్మద్)
ముస్లిం సమాజానికి చెందిన బీదవారికి మాత్రమే ఫిత్రా దానం ఇవ్వాలి. అది ధాన్యం రూపంలో దానం చెయ్యడం ఉత్తమమైన ఆచారం.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రి;ఈ కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: “ప్రతి పండుగ నమాజు ఆచరించుటకై ఈద్గాహ్ వెళ్ళేవారు” (బుఖారి, ముస్లిం).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు కాలి నడన వెళ్ళేవారు” (సహీహుల్ జామీ :4710).
ప్రవక్త ముహమ్మద్: ఈద్గాహ్కు చిన్నారి పాపలను, యువతులను, వయసు మీరిన స్త్రీలను మరియు ఎవరి దగ్గరనైతే దౌని (స్కార్ఫ్) లేదో, వారు తమ సహోదరి వద్దనుండి దౌని తీసుకొని ఈద్గాహ్ పోవాలని ఆజ్ఞాపించారు. దీని ఉద్దేశ్యం ఏమంటే, స్త్రీలుకూడా ముస్లిం సమూహంలో వారి దుఆ పొందగలరని. దీనికి ఆధారంగా ఒక హదిసులో ఉమ్మే అతియ్యా ఈ ఉల్లేఖించారు: “పురిటి స్త్రీలు, బహిష్టు స్త్రీలు, పరదాలో ఉన్న మహిళలు నమాజ్ నెరవేర్చుటకై ఈద్గాహ్ పోవాలని, ముస్లిం పురుషులతో పాటు దుఆలో పాల్గొనాలనీ మాకు ఆజ్ఞాపించారు. కాని బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు నుండి తప్పుకోవాలనీ ఆదేశించారు” (బుఖారి, ముస్లిం).
పండుగ నమాజుకు ముందు ఎలాంటి నఫిల్ నమాజు నెరవేర్చకూడదు.హజ్రత్ అబూ సయీద్ ఖుద్రి (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు ముందు (నఫిల్) నమాజు నెరవేర్చలేదు. కాని పండుగ నమాజు తరువాత ఇంటికి వచ్చి రెండు రకాతులు (నఫిల్) చదివేవారు. (బుఖారి, ముస్లిం)
పండుగ నమాజాకై అజాన్ లేక ఇఖామత్ చెప్పకూడదు. హజత్ జాబిర్ బిన్ సముర (రధి అల్లాహు అన్హు) కథనం: “నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో పండుగ నమాజు ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు అజాన్ మరియు ఇఖామత్ లేకుండానే చదివాను.” (ముస్లిం)
పండుగల నమాజు సమయం: హజ్రత్ జున్దుబ్-ఈ కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు రెండింతలు అయిన తరువాత రమజాన్ నమాజు చదివేవారు. మరియు సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు సమానంగా అయిన తరువాత బక్రీద్ నమాజు చదివేవారు”
ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్ అలైహి) గారు ఇలా తెలియజేసారు. “ఈ హదీసు పండుగ నమాజు సమయాల హదిసులలో చాలా ప్రామాణికమైన హదీస్గా భావించారు” (ఫిఖ్హుస్ సున్నా:1/279).
[అరబ్ దేశాలలో ఈద్ నమాజ్ సున్నత్ సమయం ప్రకారం నెరవేర్చుచున్నారు. కాని మన దేశాలలో ఈద్ నమాజ్ చాలా ఆలస్యంగా నెరవేర్చే అలవాటుకు గురికాబడ్డారు. ఇది ఎంత మాత్రం సున్నత్ పద్దతి కాదు.]
పండుగ రోజు పిల్లలు దఫ్ వాయించి ధర్మ పద్దతిలో మంచి గీతాలు మరియు ఇతర ఆటలతో ఖుషీ చేయవచ్చును. (బుఖారీ)
పండుగల రోజు ఇతరులతో కలసినప్పుడు “తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కా” అని చెప్పవలెను. (మా పుణ్యాలు మీ పుణ్య కార్యాలను అల్లాహ్ స్వీకరించుగాక) (తమాముల్ మిన్నా లిల్ అల్బాని:1/ 356)
పండుగల నమాజ్ ఆచరించే విధానము:
1) కాబతుల్లాహ్ దిశకు తిరిగి నిలబడాలి.
2) నమాజు కొరకై నియ్యత్ మనసులో అనుకోవాలి.
3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)
4) తక్సీర్ (అల్లాహు అక్బర్) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) చెవులను తాకవలసిన అక్కర లేదు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చెయ్యి మణికట్టుని పట్టుకొని రెండు చేతులను రొమ్ముపై (ఛాతిఫై) ఉంచాలి. (నసాయి, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, అల్ అల్పానీ రహిమహుల్లాహ్ | పేజీ: 88)
5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88)
6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి.
“సుబ్హాన కల్లాహుమ్మ వబిహమ్దిక వతబార కస్ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93)
7) తరువాత 7 సార్లు తక్బీర్లు (అల్లాహు అక్బర్ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్)
ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.
8) తరువాత ఇమామ్ బిగ్గరగా సూరతుల్ ఫాతిహా చదవాలి. ఇమామ్ వెనుక ఉన్నవారు (ముఖ్తదీలు) మెల్లగా చదవాలి. ఆ తరువాత ఇమామ్ వేరొక సూరా చదవాలి. ఇమామ్ వెనుక ఉన్నవారు నిశబ్దంగా వినాలి. సూరతుల్ ఫాతిహా మినహా ఇతర సూరాలు ముఖ్తదీలు చదవకూడదు.
9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్)
10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్ వల్ ఖుర్ఆనిల్ మజీద్) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్ సాఅతు వన్ షఖ్బల్ ఖమర్” సూరా చదవాలి. (ముస్లిం)
లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్ అతాక హదిసుల్ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్ గలీల్: 644)
11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్, మరియు హజ్రత్ ఉమర్ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)
12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)
అంటే ఈద్గాహ్లో మింబర్ తీసుకొపోవడం లేక అక్కడ మింబర్ లా కట్టించి దానిపై ఎక్కి ప్రసంగం చేయకూడదు. మామూలుగా నిలబడి ప్రసంగించాలి.
ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)