వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
కలిమయె తౌహీద్: లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం
లాఇలాహ ఇల్లల్లాహ్, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాంలో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. మరియు సత్కార్యాల అంగీకారము ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్దాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.
దాని వాస్తవ అర్థం: “వాస్తవంగా అల్లాహ్ తప్ప వేరెవరు ఆరాధనలకు అర్హులు కారు“. ఇదే సరియైన అర్థం. ఇది కాక ‘అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడు లేడు’, ‘అల్లాహ్ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు’ లేక ‘విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమి లేదు’ అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం) కావు.
ఈ పవిత్ర వచనములో రెండు విషయాలు (రుకున్ లు) ఉన్నాయి:
(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఈశ్వరత్వాన్ని, ఆరాధన అర్హతను) ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.
(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధనల)కు అర్హత గల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.
అల్లాహ్ తప్ప మరెవ్వరి ఆరాధన, ప్రార్థన చేయరాదు. ఆరాధన లోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట యోగ్యం లేదు.
ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసముంచకుండా ఆచరించువాడు మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవారాధకుడు), కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడు.
లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత:
ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడుతున్నని.
1- తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుంది. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం చెప్పారు:
“లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).
2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ ఇల్లల్లాహ్) కొరకే పుట్టించ బడ్డారు. సూరా జారియాత్ (51: 56)లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను మానవులను జిన్నాతులను నన్ను ఆరాధించుటకే సృష్టించాను).
పై ఆయతులో ‘యఅ౯ బుదూన్‘ అన్న పదానికి అర్థం ఆరాధించుట, అంటే ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట.
3- ప్రవక్తలను పంపబడింది, గ్రంథాలను అవతరింప జేయబడింది దీని ప్రచారం కొరకే. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండి:
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(నీకు పూర్వం మేము ప్రతి ప్రవక్తకు ‘నేను తప్ప వేరు ఆరాధింపదగిన దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించండి’ అని సందేశం పంపియున్నాము). (అంబియా 21: 25).
4- ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే (లాఇలాహ ఇల్లల్లాహ్). ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చాడు. చదవండి అల్లాహ్ ఆదేశం:
يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ
(మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప వేరు దేవుడు మీకు లేడు). (సూరయే ఆరాఫ్ 7: 73).
పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)
ఇతరములు: