ధైవస్మరణ మెల్లిగా చేయడం అభిలషణీయం

1728. హజ్రత్ అబూ మూసా అష్అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ మీద దాడి చేశారు – లేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ కు బయలుదేరారు – అప్పుడు ప్రవక్త అనుచరులు గుట్టపై నుండి ఒక లోయను చూసి “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని బిగ్గరగా పలకసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “మీ పట్ల మీరు మృదువుగా వ్యవహరించండి (గొంతు చించుకుంటూ) అలా కేకలు పెట్టకండి. మీరు చెవిటివాడినో, లేక ఇక్కడ లేని వాడినో పిలవడం లేదు. మీరు అనుక్షణం వినేవాడ్ని, మీకు అతిచేరువలో మీ వెంట ఉన్నవాడిని పిలుస్తున్నారు” అని అన్నారు.

నేనా సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాహనం వెనుక నిలబడి “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అన్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇదివిని “అబ్దుల్లా బిన్ ఖైస్!”(*) అని పిలిచారు నన్ను.  నేను “మీ సేవకై సిద్ధంగా ఉన్నాను ధైవప్రవక్తా!” అన్నాను. “నేను నీకు స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా?” అన్నారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం). నేను “తప్పకుండా తెలియజేయండి ధైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కోసం సమర్పితం” అని అన్నాను. అప్పుడాయన “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (దైవాజ్ఞ తప్ప ఏ శక్తీ ఏ బలమూ లేదు)” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 64 వ ప్రకరణం – మగాజి, 38 వ అధ్యాయం – గజ్వతి ఖైబర్]

(*) హజ్రత్ అబూ మూసా అష్అరీ (రధి అల్లాహు అన్హు) అసలు పేరు అబ్దుల్లా బిన్ ఖైస్. (అనువాదకుడు)

ప్రాయశ్చిత్త ప్రకరణం : 13 వ అధ్యాయం – ధైవస్మరణ మెల్లిగా చేయడం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

%d bloggers like this: