అన్నపానీయములు సేవించే విధానం

హదీథ్׃ 04

من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం –

– عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.

అన్ ఉమర్ బిన్ అబి సలమ ఖాల, కున్తు ఫీ హిజ్రి రసులిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం  వ కానత్ యదీ తతీషు ఫిస్సహ్ఫతి. ఫఖాలలీ, “యా గులాము సమ్మిల్లాహ వకుల్ బి యమీనిక్, వకుల్ మిమ్మా యలీక్” రవాహు ముస్లిం

అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” ఓ సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు తన బాల్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలోనే పెరిగారు. 2వ హిజ్రీ సంవత్సరంలో ఆయన జన్మించారు. అలీ బిన్ అబి తాలిబ్ రదియల్లాహు అన్హు ఖలీఫా గా ఉన్నప్పుడు, ఆయనను బహ్రీన్ యొక్క గవర్నర్ గా నియమించారు. మదీనా పట్టణంలో ఆయన 83వ హిజ్రీ సంవత్సరంలో మరణించారు.

వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు.  ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

  1. ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
  2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి అవ్వలుహు, ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో – మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.
  3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
  4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
  5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా