వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/3aASE6ZWQGQ [40 నిముషాలు]
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త యూసుఫ్(అలైహిస్సలాం)
(క్రీ.పూ. 1700 నుంచి క్రీ.పూ.1680 వరకు)
(దివ్యఖుర్ఆన్లో ఈ కథ చాలా వివరంగా, చాలా ఆసక్తిదాయకంగా చెప్పడం జరిగింది. ఇందులో హాస్యం, మానవ బలహీనతలు, ఉన్నత గుణగణాలు, ఈర్ష్యాసూయలు, విద్వేషం, అహం, వాంఛలు, మోసం, కుట్ర, క్రూరత్వం, భీభత్సం, సహనం, విశ్వాసం, ధైర్యం, సద్వర్తనం, సానుభూతి వంటి అనేక గుణగణాలు మన ముందుకు వస్తాయి. ప్రాచ్య దేశాల కవులపై ఈ కథ చాలా గొప్ప ప్రభావాన్ని వేసింది. ఈ కథ ఆధారంగా అల్లిన కొన్ని కవితలు సాహిత్యంలో అత్యుత్తమ కళాఖండాలుగా నిలిచి పోయాయి. దివ్యఖుర్ఆన్లో ఈ కథ ప్రస్తావించబడిన తీరు నైతికంగా మనిషిని తీర్చిదిద్దేదిగా ఉంది.)
యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు.
సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు.