మహా సంపన్నుడు ఖారూన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

(పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ సంపద’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.)

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ

“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)

ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.

జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.

ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.

ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.

అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/