ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.
యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తక్వీర్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1eUZmfRFb8Sghnt6K-nwlM
Read More “81. తఫ్సీర్ సూర తక్వీర్ (Tafsir Surah Takweer) [వీడియోలు]”