సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8