హజ్జ్ ఘనత – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

హజ్జ్ ఘనత
షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YE1Djv32h40 [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.

اَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.

చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.

కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్

హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్

అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.

దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:

بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ
(బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్: షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, వఇకామిస్సలాతి, వఈతాయిజ్జకాతి, వహజ్జు బైతిల్లాహి, వసౌమి రమదాన్)

ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.

ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.

ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.

ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.

అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.

ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.

హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ
(అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్)
స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.

అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.

రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.

ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.

ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا، وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ

“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.

మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.

అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

أَدِيمُوا الْحَجَّ وَالْعُمْرَةَ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوبَ كَمَا تَنْفِي الْكِيرُ خَبَثَ الْحَدِيدِ

మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.

అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:

أَيُّ الْعَمَلِ أَفْضَلُ
(అయ్యుల్ అమలి అఫ్దల్)
ఏ సత్కార్యము గొప్పది?

అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:

إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ
(ఈమాను బిల్లాహి వ రసూలిహి)
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.

గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:

جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ
(జిహాదున్ ఫీ సబీలిల్లాహ్)
అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.

మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

حَجٌّ مَبْرُورٌ
(హజ్జున్ మబ్రూర్)
స్వీకరించబడిన హజ్.

అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.

అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ
(లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్)
మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]

మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ
(జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా)
వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.

అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.

అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:

الْغَازِي فِي سَبِيلِ اللَّهِ، وَالْحَاجُّ، وَالْمُعْتَمِرُ وَفْدُ اللَّهِ، دَعَاهُمْ فَأَجَابُوهُ وَسَأَلُوهُ فَأَعْطَاهُمْ

అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.

అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.

మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.

దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.

అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:

مَنْ خَرَجَ حَاجًّا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْحَاجِّ إِلَى يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ خَرَجَ مُعْتَمِرًا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْمُعْتَمِرِ إِلَى يَوْمِ الْقِيَامَةِ

ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)

అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:

اغْسِلُوهُ بِمَاءٍ وَسِدْرٍ، وَكَفِّنُوهُ فِي ثَوْبَيْهِ، وَلاَ تُخَمِّرُوا رَأْسَهُ، وَلاَ تُحَنِّطُوهُ، فَإِنَّهُ يُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ مُلَبِّيًا

“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”

అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ
(లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్)
“ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”

అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.

ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.

ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,

“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.

మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.

ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.

కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.

అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.

హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:

స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

مَنْ أَرَادَ الْحَجَّ فَلْيَتَعَجَّلْ، فَإِنَّهُ قَدْ يَمْرَضُ الْمَرِيضُ، وَتَضِلُّ الضَّالَّةُ، وَتَعْرِضُ الْحَاجَةُ
(మన్ అరాదల్ హజ్జ ఫల్ యతఅజ్జల్, ఫఇన్నహు ఖద్ యమ్రదుల్ మరీదు, వ తదిల్లుజ్జాలతు, వ త’అరిదుల్ హాజతు)

ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.

కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.

చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.

అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.

ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”

అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.

ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا
(యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,

ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:

وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ

అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?

అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.

అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ
(ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల ఫిల్ హజ్జ్)
హజ్‌ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.” (2:197)

ప్రవక్త వారు తెలియజేశారు:

مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ
(మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు)
“ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”

ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:

يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا
(యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”

ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:

لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ
(లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్)
“నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”

నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.

అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:

لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ
(లబ్బైక్ అన్ షుబ్రుమా)
“ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ
(హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా)
“ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”

కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.

అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

نَعَمْ وَلَكِ أَجْرٌ
(నఅమ్ వలకి అజ్ర్)
“అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”

“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.

మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.

అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.

అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.

ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్

వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43235

హజ్జ్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/