షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 2
https://youtu.be/eW8NRgoEZ8o [34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు
ఈ ఉపన్యాసంలో, ప్రసంగీకులు ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే గ్రంథం యొక్క రెండవ పాఠాన్ని కొనసాగించారు. గత పాఠంలో చర్చించిన ఆనందానికి కారణమయ్యే మూడు గుణాలను (కృతజ్ఞత, సహనం, క్షమాపణ) పునశ్చరణ చేశారు. ఈ పాఠంలో ప్రధానంగా హనీఫియ్యత్ (ఇబ్రాహీం (అ) వారి స్వచ్ఛమైన ఏకదైవారాధన మార్గం) గురించి వివరించారు. ఆరాధన (ఇబాదత్) అనేది అల్లాహ్ ను ఏకత్వంతో, చిత్తశుద్ధితో ఆరాధించడమేనని, మానవుల మరియు జిన్నుల సృష్టి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేశారు. తౌహీద్ లేని ఆరాధన, వుదూ లేకుండా చేసే నమాజ్ లాంటిదని, అది స్వీకరించబడదని ఒక శక్తివంతమైన ఉపమానంతో వివరించారు. ఆరాధనలో షిర్క్ (బహుదైవారాధన) ప్రవేశిస్తే కలిగే మూడు ఘోరమైన నష్టాలను (ఆరాధన చెడిపోవడం, పుణ్యం వృధా అవడం, శాశ్వతంగా నరకవాసిగా మారడం) ఖుర్ఆన్ ఆయతుల ద్వారా హెచ్చరించారు. షిర్క్ నుండి రక్షణ పొందడానికి ఇబ్రాహీం (అ) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలను ప్రస్తావించారు. చివరగా, గత పాఠంలోని ఒక చిన్న పొరపాటును సరిదిద్దుతూ, ఇమామ్ గారి జన్మస్థలం గురించి స్పష్టత ఇచ్చారు.
మతన్ (టెక్స్ట్):
اعلم أرشدك الله لطاعته أن الحنيفية -مِلةَ إبراهيمَ-: أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال تعالى
అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక! తెలుసుకో! ఇబ్రాహీం అలైహిస్సలాం మతం అయిన హనీఫియత్ అంటే: “నీవు ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట“. అల్లాహ్ సర్వ మానవాళికి ఈ ఆదేశమే ఇచ్చాడు, వారందరినీ పుట్టించినది కూడా దీని కొరకే. అల్లాహ్ ఆదేశం చదవండి:
وَمَا خَلَقتُ الجِنَّ وَالإِنسَ إِلّا لِيَعْبُدوِن
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే. (జారియాత్ 51:56).
فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة).
అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో: ఎలాగైతే వుజూ లేనిది నమాజును నమాజ్ అనబడదో అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంత వరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఎలాగైతే నమాజులో వుజూ భంగమయితే నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో ‘షిర్క్’ ప్రవేశిస్తే అది పాడవుతుంది (స్వీకరించబడదు).
فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى
షిర్క్ ఏదైనా ఆరాధనలో కలుషితమైతే అది దానిని చెడగొడుతుందని, ఆ కార్యం వృధా అవుతుందని (పుణ్యఫలం దొరకదని), షిర్క్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకవాసి అయిపోతాడు అని ఎప్పుడైతే నీవు తెలుసుకున్నావో, “షిర్క్ బిల్లాహ్ (అల్లాహ్ కు ఎవరినైనా భాగస్వామిగా చేయడం)” గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని గమనించు![2] -అల్లాహ్ నిన్ను దాని వలలో చిక్కకుండా కాపాడుగాక!- (ఆమీన్).
مَا كَانَ لِلْمُشْرِكِينَ أَنْ يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَى أَنْفُسِهِمْ بِالْكُفْرِ أُولَئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ[ [التوبة: 17].
[2] “ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు“. (తౌబా 9:17). [కొన్ని పుస్తకాల్లో ఈ దలీల్ కూడా ఉంది].
ఆ షిర్క్ గురించే హెచ్చరిస్తూ అల్లాహ్ ఇలా తెలిపాడు:
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ [النساء: 116].
తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (నిసా 4:116).
అయితే అందుకు నాలుగు నియమాల (4మూల విషయాల)ను) తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది, అల్లాహ్ వాటిని తన దివ్య గ్రంథంలో ప్రస్తావించాడు:
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
ప్రియ వీక్షకుల్లారా! అల్-ఖవాయిద్ అల్-అర్బా, నాలుగు నియమాలు. ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ రచించినటువంటి పుస్తకాలలో చాలా చిన్న పుస్తకం, కానీ చాలా గొప్ప లాభం మరియు చాలా ఎక్కువ విలువైనది.
మొదటి క్లాసు సంక్షిప్త పునశ్చరణ
ఈ రోజు మనం రెండవ క్లాసులో ఉన్నాము. అయితే, మరీ మరీ సంక్షిప్తంగా ఇంతకుముందు చదివిన పాఠం, ఇంతకుముందు యొక్క క్లాసులోని మూలం నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు కూడా శ్రద్ధగా చూడండి. ఆ తర్వాత ఈరోజు చదివే అటువంటి పాఠాన్ని మనం ప్రారంభం చేద్దాము.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం.
أَسْأَلُ اللَّهَ الْكَرِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ
(అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీమ్)
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను నేను అర్థిస్తున్నాను.
أَنْ يَتَوَلَّاكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ
(అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్)
ఇహపరలోకాలలో నిన్ను వలీగా చేసుకొనుగాక.
وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَمَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ ఐనమా కున్త)
మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.
وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇదా ఉఅతియ షకర, వ ఇదబ్ తులియ సబర, వ ఇదా అద్నబ ఇస్తగ్ఫర)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.
వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం మరియు అదృష్టం ఉన్నది. సోదర మహాశయులారా! ఇక్కడి వరకు మనం అల్హందులిల్లాహ్ గత పాఠంలో చదివాము, దాని యొక్క వివరణ, ఈ దుఆలో వచ్చినటువంటి ప్రతి విషయం దాని యొక్క సంబంధించిన ఖుర్ఆన్ హదీద్ లో ఇంకా ఎక్కువ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకున్నాము.
రెండవ క్లాస్ ప్రారంభం:
ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు:
اعْلَمْ أَرْشَدَكَ اللَّهُ لِطَاعَتِهِ
(ఇఅలం అర్షదకల్లాహు లితాఅతిహి)
అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక, తెలుసుకో!
أَنَّ الْحَنِيفِيَّةَ مِلَّةَ إِبْرَاهِيمَ
(అన్నల్ హనీఫియ్యత మిల్లత ఇబ్రాహీం)
ఇబ్రాహీం అలైహిస్సలాం మతం అయిన హనీఫియ్యత్ అంటే,
أَنْ تَعْبُدَ اللَّهَ وَحْدَهُ مُخْلِصًا لَهُ الدِّينَ
(అన్ తఅబుదల్లాహ వహ్దహు ముఖ్లిసన్ లహుద్దీన్)
నీవు ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.
అల్లాహ్ సర్వమానవాళికి ఈ ఆదేశమే ఇచ్చాడు.
وَخَلَقَهُمْ لِذَلِكَ
(వ ఖలఖహుమ్ లి దాలిక్)
వారందరినీ పుట్టించినది కూడా దీని కొరకే.
దలీల్ ఏమిటి? దలీల్:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి యఅబుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.“(51:56)
సోదర మహాశయులారా! సంక్షిప్తంగా దీని యొక్క వివరణ కొంచెం విని, ఇంకా ముందుకు మనం సాగుదాము. అయితే ఇక్కడ కూడా మీరు గమనిస్తే:
ఆ నాలుగు నియమాలు ఏమిటో చెప్పేకి ముందు దుఆలు ఇచ్చారు. ఆ నాలుగు నియమాలు ఏమిటో తెలిపేకి ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు, తౌహీద్ అంటే ఏమిటి, ఇబాదత్ అంటే ఏమిటి మరియు షిర్క్ ను మనం అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా మనం గ్రహించగలిగే అటువంటి ఒక ఉపమానం, దృష్టాంతం, ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన హితోపదేశానికి ముందు కూడా మరొక చిన్న దుఆ. అదేమిటి?
أَرْشَدَكَ اللَّهُ لِطَاعَتِهِ
(అర్షదకల్లాహు లితాఅతిహి)
అల్లాహు త’ఆలా నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక. ఎల్లవేళల్లో నీ జీవితం అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయతలోనే గడుస్తూ ఉండాలి, అలాంటి భాగ్యం అల్లాహ్ నీకు ప్రసాదించాలి. చూడండి ఎంత ముఖ్యమైన బోధ, ఎంత మంచి ఆశీర్వాదాలు, దీవెనలు, దుఆలు కదా.
మనం మన పిల్లలకు కూడా ఒరేయ్ నీ పాడగాను, చావరా నువ్వు. ఇలా అంటాం కదా మనం పిల్లల్ని ఒక్కొక్కసారి ఏదైనా పని చేయకుంటే. అవునా? కానీ ఇలా కాకుండా, అల్లాహ్ నీకు హిదాయత్ ఇవ్వుగాక! ఈ పని చెయ్యి నాయనా. గమనించండి, మొదటి దానిలో బద్ దుఆ ఉన్నది, శాపనము ఉన్నది. అది విన్నారంటే ఇంకెంత మన నుండి దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అదే ఒకవేళ, అల్లాహ్ నిన్ను, అల్లాహ్ నీపై కరుణించుగాక, అల్లాహ్ నీకు హిదాయత్ ఇవ్వుగాక, అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ నిన్ను తన ప్రియమైన దాసునిలో చేర్చుగాక, ఇలాంటి ఏదైనా దుఆలు ఇచ్చుకుంటూ మనం ఏదైనా ఆదేశం ఇస్తే, ఏదైనా విషయం బోధిస్తే ఎంత బాగుంటుంది కదా.
హనీఫియ్యత్ మరియు ఇబాదత్ యొక్క వివరణ
ఆ తర్వాత ఏమంటున్నారు? హనీఫియ్యత్, మిల్లతె ఇబ్రాహీం. దీని యొక్క వివరణ రమదాన్లో మేము బోధించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి మరో పుస్తకం ఉసూలె తలాత, త్రిసూత్రాలు, అందులో కూడా వచ్చింది.
ఇక్కడ నాలుగు నియమాలు చెప్పేకి ముందు మరోసారి మిల్లతె ఇబ్రాహీం అంటే ఏమిటి, ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం అంటే ఏమిటి దాని గురించి వివరిస్తున్నారంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోండి.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సమాజంలో వచ్చారో, వారందరూ తమకు తాము ఇబ్రాహీమీయులు అనేవారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతి వారము మేము. ఆయన మా కొరకు వదిలినటువంటి స్వచ్ఛమైన మార్గం మీద ఉన్నాము, ధర్మం మీద ఉన్నాము అని భావించేవారు. కానీ షిర్క్ కు పాల్పడేవారు. అయితే వారికి బోధ చేయడం జరుగుతుంది. ఏ ఇబ్రాహీం పేరు మీరు తీసుకుంటున్నారో, చేస్తున్న పనులు వాటికి ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా దూరంగా ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వైపునకు తమకు తాము అంకితం చేసుకున్నారంటే, ఆయన వద్ద ఇబాదత్, తౌహీద్, ఏకదైవారాధన దేనిని అంటారో దానిని మీరు కూడా గ్రహించండి, అలాగే ఆచరించండి. ఇది ఒకటి.
రెండవది, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏ సమాజంలో వచ్చారో, వారు ముస్లింలు అయి ఎన్నో రకాల షిర్క్ పనులకు పాల్పడి ఉన్నారు. అయితే ఆ షిర్క్ నుండి వారిని బయటికి తీయడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క స్వచ్ఛమైన ధర్మం దాని యొక్క రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఖుర్ఆన్లో అల్లాహ్ ఇదే ఆదేశం ఇచ్చాడు.
أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا
(అనిత్తబిఅ మిల్లత ఇబ్రాహీమ హనీఫా)
“నీవు ఇబ్రాహీం అనుసరించిన ఏకేశ్వరోపాసనా మార్గాన్ని అవలంబించు” (16:123)
ఇందులో రెండు విషయాలు గమనించండి. ఒకటి, మిల్లత ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం. రెండవది హనీఫియ్యత్. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మరీ శ్రద్ధగా వినండి. హనీఫియ్యత్ అంటే ఏంటి? మనిషి అన్ని రకాల షిర్క్ విషయాలకు దూరంగా ఉండి ఒకే ఒక తౌహీద్ వైపునకు, అల్లాహ్ వైపునకు అంకితమై, వంగి, ఒక వైపునకు అంటే కేవలం అల్లాహ్ వైపునకు మాత్రమే మరలి ఉండడం. ఇది హనీఫియ్యత్.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలు అల్లాహ్ తో పాటు ఎవరెవరినైతే షిర్క్ చేసేవారో, వారందరినీ కూడా నాకు వారితో ఎలాంటి సంబంధం లేనని, లేదని స్పష్టంగా చెప్పేశారు. ఎన్నో ఆయతులలో ఈ విషయం ఉంది. సూరత్ అజ్-జుఖ్రుఫ్ చదవండి.
إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ
(ఇన్ననీ బరాఉమ్ మిమ్మా తఅబుదూన్)
“నిశ్చయంగా, మీరు పూజించే వాటితో నాకు ఏ మాత్రం సంబంధం లేదు.” (43:26)
إِلَّا الَّذِي فَطَرَنِي
(ఇల్లల్లదీ ఫతరనీ)
“కేవలం అల్లాహ్, ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నా యొక్క నిజదైవం, నిజ ఆరాధ్యుడు, ఆయన వైపునకే నేను అంకితమై ఉన్నాను, ఆయనకే నేను దాస్యం చేస్తూ ఉన్నాను.”
ఈ విధంగా సోదరులారా! మనమందరము కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఈ ధర్మం, దేనినైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారో, ఏమిటి అది?
أَنْ تَعْبُدَ اللَّهَ وَحْدَهُ
(అన్ తఅబుదల్లాహ వహ్దహు)
నీవు ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు.
مُخْلِصًا لَهُ الدِّينَ
(ముఖ్లిసన్ లహుద్దీన్)
ధర్మాన్ని, దీన్ ను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించి.
ఖులూస్, లిల్లాహియ్యత్, చిత్తశుద్ధి. ఇదే ఆదేశం అల్లాహు త’ఆలా ఖుర్ఆన్లో అనేక సందర్భాలలో ఇచ్చాడు. ఉదాహరణకు,
وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ
(వమా ఉమిరూ ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్)
“వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ వారికి ఆదేశించబడింది” (98:5)
సూరతుల్ బయ్యినాలో. ఇంకా సూరత్ జుమర్, వేరే అనేక సందర్భాలలో. విషయం అర్థమైంది కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం తీసుకువచ్చినటువంటి మిల్లత్, ధర్మం, హనీఫియ్యత్, ఒకే వైపునకు మరలి ఉండడం, అంకితమై ఉండడం, అది అల్లాహ్ వైపునకు, ఎలాంటి షిర్క్ లేకుండా, అదేమిటి? అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఏ రవ్వంత కూడా అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయకూడదు. అయితే, ఇదే ఆదేశం అల్లాహు త’ఆలా సర్వమానవాళికి ఇచ్చాడు.
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి యఅబుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే.” (జారియాత్ 51:56).
మానవులను పుట్టించింది కూడా దీని కొరకే అని ఈ ఆయత్, సూరత్ జారియాత్, సూరా నెంబర్ 51, ఆయత్ నెంబర్ 56 ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా!
తౌహీద్ లేని ఆరాధన – వుదూ లేని నమాజ్ వంటిది
فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة).
అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో: ఎలాగైతే వుజూ లేనిది నమాజును నమాజ్ అనబడదో అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంత వరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఎలాగైతే నమాజులో వుజూ భంగమయితే నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో ‘షిర్క్’ ప్రవేశిస్తే అది పాడవుతుంది (స్వీకరించబడదు).
ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు. కొంచెం ఈ యొక్క సెంటెన్స్, పేరాగ్రాఫ్ పై శ్రద్ధ వహించండి. అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో, (ఫఅలం) ఎలాగైతే వుదూ లేనిది నమాజ్ ను నమాజ్ అనబడదో, అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంతవరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు.
అర్థమైందా? మరోసారి చదువుతున్నాను, చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆ తర్వాత వివరిస్తాను.
అల్లాహ్ నిన్ను పుట్టించింది ఎందుకు? ఆయన ఆరాధన కొరకు మాత్రమే కదా. అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడు అన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో, ఏంటి? ఎలాగైతే వుదూ లేని నమాజ్ ను నమాజ్ అనబడదో, అలాగే తౌహీద్, ఏకదైవారాధన లేని ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు.
సోదర మహాశయులారా! సోదరీమణులారా! ఎంత ఎక్కువగా పెద్ద జ్ఞానం లేకున్నా, నమాజ్ ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి, వుదూ లేనిది నమాజ్ కాదు అని తెలిసిన వ్యక్తి, ఏం చేస్తాడు? వుదూ చేసుకొని వస్తున్నాడు. ఇంకా అతని యొక్క వుదూ అవయవాలలో తడి ఆరలేదు. వుదూ చేసుకున్నటువంటి ఆ నీరు ఇంకా కారుతూ ఉన్నది చేతుల నుండి, ముఖం నుండి. అంతలోనే అపాన వాయువు (gas) జరిగింది. అయితే, ఇంకా నా నేను వుదూ చేసుకున్న స్థితిలోనే ఫ్రెష్ గానే ఉన్నాను కదా. పోనీ జరిగిందేదో జరిగిపోయింది, పోయి నమాజ్ చేసుకుంటాను అని చేసుకుంటాడా? ఒకవేళ అతను అలా చేసుకున్నా గానీ, ఆ నమాజ్ నమాజ్ అవుతుందా? నెరవేరుతుందా? నమాజ్ చేసిన వారి జాబితాలో అతడు లెక్కించబడతాడా? కాదు కదా. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ ఉంది.
إِنَّ اللَّهَ لا يَقْبَلُ صَلاةً بِغَيْرِ طَهُورٍ
(ఇన్నల్లాహ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్)
అల్లాహు త’ఆలా వుదూ లేని నమాజును స్వీకరించడు.
అలాగే మరొక హదీస్ లో ఉంది. ఎవరైనా నమాజ్ చేశారు మరియు అతను నమాజ్ చేస్తున్న స్థితిలో అతనికి ఏదైనా జరిగి వుదూ భంగమైపోయింది, తిరిగి అతను వుదూ చేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చి కొత్తగా నమాజ్ ప్రారంభించాలి. అప్పుడే అల్లాహ్ అతని నమాజును స్వీకరిస్తాడు. ఈ రెండవ హదీస్ బుఖారీలో ఉంది.
ఈ విధంగా మనిషి వుదూ చేసుకొని వచ్చి, ఇంకా అతని ముఖం ఆరనప్పటికీ, చేతులు ఆరనప్పటికీ, ఒకవేళ వుదూ తెగిపోయింది, భంగమైపోయింది, అపాన వాయువు జరిగి ఇంకా ఏదైనా కారణం వల్ల, వుదూ నీళ్లు ఆరలేదు కదా అని నమాజ్ చేయలేడు అతను. చేసినా అది నమాజ్ అనబడదు. అలాగే, మనం ఏ ఆరాధన అయినా, అందులో అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరినైనా భాగస్వామిగా చేస్తున్నామంటే, ఇక షిర్క్ వచ్చింది అంటే తౌహీద్ మాయమైపోయింది. ఎందుకంటే షిర్క్ వచ్చింది అంటే కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన జరగలేదు కదా. ఎలాగైతే వుదూ లేనిది నమాజ్ నమాజ్ అనబడదో, తౌహీద్ లేనిది ఆరాధన ఆరాధన అనబడదు.
ఈ పద్ధతిని ఏమంటారు? పాజిటివ్ గా నచ్చజెప్పడం, అర్థం చెప్పడం. ఇక రండి, ఇదే విషయాన్ని అపోజిట్ గా, మళ్ళీ మరింత వివరించి మనకు బోధిస్తున్నారు షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్. ఒకసారి ఈ విషయాన్ని కూడా శ్రద్ధగా వినండి, చూడండి. ఏంటి?
ఎలాగైతే నమాజ్ లో వుదూ భంగమైతే, నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో షిర్క్ ప్రవేశిస్తే, ఆ ఆరాధన పాడవుతుంది. అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. గమనించండి ఇక్కడ. ఇంతకుముందు పాజిటివ్ లో అర్థం చేసుకున్నాము కదా. ఇప్పుడు ఇది అపోజిట్ గా.
వుదూ లేని నమాజ్ నమాజ్ అనబడదు. అలాగే తౌహీద్ లేని ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఇక మనిషి వుదూ చేసుకున్నాడు, నమాజ్ చేస్తున్నాడు. కానీ ఏమైంది? నమాజ్ లో ఉండగానే అపాన వాయువు వచ్చేసింది. గాలి వెళ్ళింది. ఏమైపోయింది? వుదూ భంగం, ఆ నమాజ్ కూడా భంగమే కదా. ఎలాగైతే వుదూను అపాన వాయువు భంగపరుస్తుందో, నమాజ్ ను అపాన వాయువు భంగపరుస్తుందో, అలాగే ఆరాధనను పాడు చేస్తుంది ఏమిటి? షిర్క్. అందుకొరకే ఎలాగైతే మనం మంచిగా వుదూ చేసుకున్న తర్వాత నమాజ్ స్వీకరించబడాలని చేస్తున్నాము, కానీ అపాన వాయువు జరిగితే మళ్ళీ వుదూ చేసుకొని వస్తాము. అలాగే ఆరాధన మనం చేస్తున్నప్పుడు ఏదైనా షిర్క్ జరిగింది అంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని, ఆ షిర్క్ నుండి మనం దూరమైపోవాలి. ఆ ఆరాధనను కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలి. అప్పుడే అది స్వీకరించబడుతుంది.
ఇక ఈ విషయాన్ని నేను మరికొన్ని ఆధారాలతో మీకు తెలియజేస్తాను. కానీ ఆ తర్వాత సెంటెన్స్ ను మరొకసారి గమనించండి. ఆ తర్వాత సెంటెన్స్, షిర్క్ ఇబాదత్ లో వస్తే, ఆరాధనలో వస్తే మూడు రకాల నష్టాలు జరుగుతాయి. మూడు రకాల నష్టాలు. ఏంటి అవి? వినండి ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో.
“షిర్క్ ఏదైనా ఆరాధనలో కలుషితమైతే అది దానిని చెడగొడుతుంది. ఆ కార్యం వృధా అవుతుంది. పుణ్యఫలం దానికి దొరకదు. ఇంకా షిర్క్ కు పాల్పడిన వాడు శాశ్వతంగా నరకవాసి అయిపోతాడు.”
ఈ మూడు నష్టాలు మంచిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మరొక ముఖ్య విషయం ఇక్కడ మనకు తెలియజేస్తారు ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్.
షిర్క్ యొక్క నష్టం అర్థమైందా మీకు? మరొకసారి వివరిస్తున్నాను. షిర్క్ యొక్క మూడు నష్టాలు ఇక్కడ తెలపడం జరిగింది. ఒకటి ఏమిటి? ఏ ఆరాధనలో షిర్క్ కలుషితం అవుతుందో, ఆ ఆరాధన పాడైపోతుంది, చెడిపోతుంది. రెండవ నష్టం, దానికి ఏ పుణ్యం లభించాలో, అది లభించదు. మూడవది, ఆ షిర్క్ చేసినవాడు, ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, అదే స్థితిలో మరణించేది ఉంటే, శాశ్వతంగా నరకానికి వెళ్తాడు.
షిర్క్ ఎంత భయంకర విషయమో తెలుస్తుందా? ఇంకా తెలియలేదా? వినండి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు డ్యూటీలో వచ్చారు. ఈ రోజుల్లో ఎన్నో కంపెనీలలో, ఫ్యాక్టరీలలో, వర్క్ షాప్ లలో, ఫింగర్ అటెండెన్స్ అనేది ఇంతకుముందు మాదిరిగా లేదు, బయోమెట్రిక్. మీ యొక్క కళ్ళ ద్వారా లేదా బొటనవేలిని ‘బస్మా’ అంటారు అరబీలో, ఈ విధంగా కరెక్ట్ టైం కు హాజరయ్యారు. ఏ పని మీరు చేయాలో, చాలా కష్టపడి ఎన్నో గంటలు ఆ పని చేశారు. కానీ ఏం జరిగింది? మీరు ఆ పని చేస్తున్న సందర్భంలో మీ యొక్క యజమాని యొక్క ఆజ్ఞా పాలన చేయకుండా, ఆ పనిలో ఎక్కడో మీరు చాలా ఘోరమైన తప్పు చేశారు. అందుకొరకు మీ యొక్క యజమాని, మీ యొక్క ఫ్యాక్టరీ యొక్క బాధ్యుడు ఏం చేశాడు? మీపై కోపగించుకొని, ఆ రోజు మీరు వచ్చిన ఏదైతే ప్రజెంట్ ఉందో, డ్యూటీలో హాజరయ్యారో, దాన్ని ఆబ్సెంట్ గా చేసేసాడు. రాలేదన్నట్లుగా. రెండవది, ఆ రోజంతా ఏదైతే మీరు శ్రమించారో, పని చేశారో, దానికి రావలసిన మీ యొక్క జీతం ఏదైతే ఉందో, అది కూడా దొరకదు అని చెప్పేశాడు. ఇలా జరుగుతూ ఉంటుంది కదా కొన్ని సందర్భాలలో మనం చూస్తాము కూడా, వార్తల్లో వింటాము కూడా. ఇక్కడ గమనించండి, చేసిన ఆ పని, చేయనట్లుగా లెక్క కట్టాడు. డ్యూటీకి హాజరయ్యారు, కాలేదు అన్నట్లుగా లెక్క కట్టాడు. మీకు రావలసిన ఆ శ్రమ, ఆ పని ఏదైతే జీతం ఉందో, అది కూడా ఇవ్వను అని అన్నాడు.
సోదర మహాశయులారా! ఇది కేవలం అర్థం కావడానికి చిన్న ఉదాహరణ అంతే. ఇంతకంటే మరీ ఘోరమైనది షిర్క్. మీరు దుఆ చేస్తూ కేవలం అల్లాహ్ తో దుఆ చేయకుండా వేరే ఎవరికైనా చేశారు. ఇంకా ఏదైనా ఆరాధన, ఉదాహరణకు తవాఫ్. కేవలం అల్లాహ్ కొరకు కావాలి, కఅబతుల్లాహ్ యొక్క తవాఫే జరగాలి. కానీ మీరు ఏదైనా దర్గాకు తవాఫ్ చేశారు. జిబహ్, కేవలం అల్లాహ్ పేరు మీద, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, అల్లాహ్ కొరకే జరగాలి. కానీ ఏదైనా బాబా, వలీ, ఏదైనా సమాధి వారికి అక్కడ జిబహ్ చేశారు. ఈ ఆరాధనలు, ఇందులో తౌహీద్ ను పాటించలేదు, షిర్క్ చేశారు. ఒక నష్టం ఏమిటి? ఆ పని మీరు ఏదైతే చేశారో, ఆరాధన ఏదైతే చేశారో, చేయనట్లుగానే లెక్కించబడుతుంది. రెండవది, దాని యొక్క పుణ్యం మీకు ఏ మాత్రం దొరకదు. వృధా అయిపోతుంది. ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, తౌబా చేయకుండా ఆ షిర్క్ స్థితిలోనే చనిపోతే, శాశ్వతంగా నరకంలో ఉంటారు.
అల్లాక్ అక్బర్! ఎంత ఘోరమైన విషయం చూడండి. అయితే దీనికి ఆధారం, సూరత్ అత్-తౌబా ఆయత్ నెంబర్ 17 చూడండి మీరు. అల్లాహు త’ఆలా ఎలా మనల్ని హెచ్చరిస్తున్నాడో.
مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ
“ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వాహకులుగా ఉండటానికి ఎంత మాత్రం తగరు. వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. వారు శాశ్వతంగా నరకాగ్నిలో ఉంటారు.” (9:17)
సోదర మహాశయులారా! సూరత్ జుమర్ మీరు చదివారంటే,
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ
“అల్లాహు త’ఆలా మీకు మరియు మీ కంటే ముందు ప్రవక్తలందరి వైపునకు వహీ చేసినది ఏమిటంటే, నీవు షిర్క్ చేశావంటే, అల్లాహ్ కు ఎవరినైనా భాగస్వామిగా కలిపావంటే, నీ యొక్క సర్వసత్కార్యాలు వృధా అయిపోతాయి.”
ఇంకా
مِنَ الْخَاسِرِينَ
(మినల్ ఖాసిరీన్)
మరి షిర్క్ చేసేవారు పరలోక దినాన చాలా దివాలా తీస్తారు, నష్టపోతారు, లాస్ లో ఉంటారు.
సోదర మహాశయులారా! గమనిస్తున్నారా షిర్క్ నష్టం. సూరతుల్ అన్ఆమ్ లో కూడా ఈ విషయం తెలపడం జరిగింది.
وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
“వారు గనుక షిర్క్ చేస్తే వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్,
مَنْ لَقِيَ اللَّهَ لا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ
ఎవరైతే చనిపోయే స్థితిలో, అంటే అల్లాహ్ ను కలుసుకునే స్థితిలో, ఎలాంటి షిర్క్ లేకుండా, తౌహీద్ పై వారి చావు వస్తుందో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ النَّارَ
మరి ఎవరైతే అల్లాహ్ ను, అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరినైనా భాగస్వామిగా చేస్తూ షిర్క్ స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటారో, అతను నరకంలో ప్రవేశిస్తాడు.
శాశ్వతంగా నరకంలో ఉంటాడు అంటే ఏంటి భావం అర్థమైంది కదా? ఎవరైతే షిర్క్ చేసిన తర్వాత ఇహలోకంలో కొద్ది రోజులైనా, కొన్ని క్షణాలైనా జీవించే భాగ్యం కలిగి ఉండి, షిర్క్ యొక్క నష్టాన్ని తెలుసుకొని తౌబా చేశాడో, అతడు శాశ్వతంగా నరకంలో ఉండడు. ఎవరికైతే ఈ లోకంలో ఉండే భాగ్యం కలిగింది, షిర్క్ నష్టాన్ని తెలుసుకోలేదు, లేదా తెలుసుకున్నాడు కానీ తౌబా చేయలేదు, ఆ షిర్క్ స్థితిలోనే చనిపోయాడు.
షిర్క్ నుండి రక్షణ కొరకు దుఆలు
అందుకొరకే ఎల్లవేళల్లో మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటి? మనం అల్లాహ్ తో అన్ని రకాల షిర్క్ ల నుండి క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
إِنَّ الشِّرْكَ أَخْفَى مِنْ دَبِيبِ النَّمْلِ
(ఇన్నష్షిర్క అఖ్ఫా మిన్ దబీబిన్నమ్ల్)
“షిర్క్ మీలో చీమ నడక కంటే మరీ ఎంతో సూక్ష్మంగా మీలో ప్రవేశిస్తుంది”
ఈ మాట విని సహాబాలు చాలా భయపడిపోయారు. భయపడి ప్రవక్తా, ఒకవేళ పరిస్థితి ఇలా ఉండేది ఉంటే, మరి మేము ఈ షిర్క్ నుండి ఎలా రక్షణ పొందాలి? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ దుఆ ఎక్కువగా చదువుతూ ఉండండి. నేర్చుకోండి ఈ దుఆ:
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أُشْرِكَ بِكَ وَأَنَا أَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا لا أَعْلَمُ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక అన్ ఉష్రిక బిక వ అన అఅలమ్, వ అస్తగ్ఫిరుక లిమా లా అఅలమ్)
“ఓ అల్లాహ్! తెలిసి తెలిసి ఏదైనా షిర్క్ చేయడం, ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాకూడదు, అందుకని నేను నీ శరణు కోరుతున్నాను. ఇది షిర్క్ అని తెలిసింది. కానీ ఏదైనా ప్రలోభానికి, ఏదైనా భయానికి, ఒకరి ఒత్తిడికి అది చేసేటువంటి పరిస్థితి నాకు ఎదురు కాకూడదు. అలా ఎదురయ్యే విషయం నుండి నీవు నన్ను కాపాడుకో.ఒకవేళ నాకు తెలియక పొరపాటున ఏదైనా షిర్క్ జరిగిపోతే, నేను నీతో క్షమాపణ కోరుతున్నాను. నా యొక్క అన్ని రకాల షిర్క్, చిన్నది, పెద్దది, తెలిసినది, తెలియనిది, అన్ని రకాల షిర్క్ లను ఓ అల్లాహ్, నీవు క్షమించు, నన్ను మన్నించు, ఆ షిర్క్ కు పాల్పడకుండా నన్ను కాపాడుకో.”
ఈ విధంగా దుఆలు మనం చేస్తూ ఉండాలి. చేయాలా వద్దా? అన్ని రకాల షిర్క్ నుండి కాపాడడానికి దుఆ చేయాలని ప్రవక్త నేర్పారు మనకు ఒక దుఆ. అంతే కాదు, ఈనాటి పాఠంలో ఆరంభంలో ఇబ్రాహీం అలైహిస్సలాం మిల్లత్ అని మనం తెలుసుకున్నాము, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సత్యధర్మం గురించి, ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ తనకు ఖలీల్, అత్యంత ప్రియుడు అని బిరుదు ఇచ్చాడో, అంతటి గొప్ప ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, ఏమని?
وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ
(వజ్నుబ్నీ వ బనియ్య అన్ నఅబుదల్ అస్నామ్)
“నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు ఓ అల్లాహ్”
గమనిస్తున్నారా? మనం ఈ రోజుల్లో ఇలాంటి దుఆలు చేయడం ఇంకా ఎంత అవసరం ఉందో గమనించండి. అరే అవసరం లేదండి, నేను పక్కా తౌహీద్ పరుడను, నేను మువహ్హిద్ ని. ఇలాంటి గర్వాలు మనకు ఏమీ లాభం రావు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేసేవారు. అందుకొరకు మనం కూడా అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండడానికి దుఆ చేయాలి. రండి ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్.
అల్లాహు త’ఆలా షిర్క్ గురించి హెచ్చరిస్తూ సూరతున్నిసా ఆయత్ నెంబర్ 116 లో తెలిపారు.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
“తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించడాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (4:116)
అయితే, ఈ షిర్క్ యొక్క ఇంత భయంకరమైన పరిస్థితిని మనం తెలుసుకున్నాక, ఇక ఆ షిర్క్ లో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి నాలుగు మూల విషయాలను, నియమాలను తెలుసుకోవడం చాలా తప్పనిసరి అవుతుంది. ఆ విషయాలే ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠాల్లో మనం చెప్పబోతున్నాము. ఇక్కడివరకు అల్హందులిల్లాహ్ ఈ రోజు పాఠం పూర్తి కాబోతుంది. ఇక నుండి అంటే వచ్చే పాఠం ఆదివారం ఏదైతే జరుగుతుందో, అందులో ఈ అల్-ఖవాయిద్ అల్-అర్బా, నాలుగు నియమాలలో మొదటి నియమం ఏమిటో తెలపడం జరుగుతుంది. మరియు ఈ నియమాలు తెలుసుకోవడం చాలా అవసరం. వీటి ద్వారా మనం షిర్క్ లో పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము.
విన్న విషయాలను అర్థం చేసుకొని అల్లాహు త’ఆలా మనందరికీ తౌహీద్ పై స్థిరంగా ఉండే భాగ్యం కలిగించుగాక. ఆమీన్,
వ ఆఖిరు దఅవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
గత పాఠంలోని ఒక చిన్న పొరపాటు (A Clarification)
మొదటి పాఠంలో నేను ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క చాలా సంక్షిప్తంగా పుట్టుక, దావత్ గురించి ఒకటి రెండు విషయాలు, రెండు మాటలు చెప్పాను. అయితే అందులో ఒక చిన్న పొరపాటు నాతో జరిగింది. అదేమిటి? ఆయన దిర్ఇయ్యాలో పుట్టారు అని చెప్పాను. అయితే దిర్ఇయ్యాలో కాదు, ఉయైనా అనే ప్రాంతంలో పుట్టారు. అది కూడా రియాద్ కు దగ్గరలోనే ఉంది. కాకపోతే, ఆయన జీవితంలో దిర్ఇయ్యా చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే దిర్ఇయ్యాలో అప్పుడు ముహమ్మద్ ఇబ్న్ సఊద్ రహిమహుల్లాహ్ రాజుగా ఉన్నారు. ఆయన ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారికి తోడ్పాటు ఇచ్చారు. ఇద్దరూ కలిసి మాషా అల్లాహ్ తౌహీద్ ను ఈ మొత్తం అరబ్ ద్వీపములో, జజీరతుల్ అరబ్ లో ప్రచారం చేయడానికి ఏకమయ్యారు. ఆ రకంగా దిర్ఇయ్యా దాని ప్రస్తావన వారి యొక్క చరిత్రలో ఉన్నది. కానీ ఆయన పుట్టిన యొక్క ప్రాంతం ప్లేస్ అది ఉయైనా.
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41663