జుమా రోజు ఘనత (మూడు హదీసులు) [ఆడియో]

బిస్మిల్లాహ్

(9 నిముషాలు )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Recorded : 29-4-1441


6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం

496. హజత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”

[సహీహ్‌ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్‌ యమాన్‌]

నుండి: జుమా ప్రకరణంఅల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


1148. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:

“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.” (ముస్లిం )

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజుహదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


ఇతర లింకులు: 

జుమా రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది [ఆడియో & హదీసులు]

బిస్మిల్లాహ్

(8:12 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


وعنه أن رسول الله صلى الله عليه وسلم ، ذكر يوم الجمعة، فقال‏:‏ ‏ “‏فيها ساعة لا يوافقها عبد مسلم، وهو قائم يصلي يسأل الله شيئًا، إلا أعطاه إياه‏”‏ وأشار بيده يقللها، ‏(‏‏(‏متفق عليه‏)‏‏)‏ ‏.

1157. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్‌ ను ఏదయినా అడిగితే అల్లాహ్‌ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు.

(బుఖారీ-ముస్లిం) (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజుకి సంబంధించిన మరొక మహత్యాన్ని ఈ హదీసులో పొందుపరచటం జరిగింది. ఆ రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తులు చేసుకునే విన్నపాలను అల్లాహ్‌ తప్పకుండా మన్నిస్తాడు. ఆ ఘడియ చాలా తక్కువగా ఉంటుంది.

అదీగాక ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకని ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా అల్లాహ్ ను ధ్యానిస్తూ, ప్రార్థనలు, విన్నపాల్లో నిమగ్నులై ఉండాల్సిందే.


وعن أبي بردة بن أبي موسى الأشعري، رضي الله عنه، قال‏:‏ قال عبد الله بن عمر رضي الله عنهما‏:‏ أسمعت أباك يحدث عن رسول الله صلى الله عليه وسلم ، في شأن ساعة الجمعة‏؟‏ قال‏:‏ قلت‏:‏ نعم، سمعته يقول‏:‏ سمعت رسول الله صلى الله عليه وسلم ، يقول‏:‏ ‏ “‏هي ما بين أن يجلس الإمام إلى أن تقضى الصلاة‏”‏ ‏(‏‏(‏رواه مسلم‏)‏‏)‏‏.

1158. హజ్రత్‌ అబూ బుర్దా బిన్‌ అబూ మూసా అష్‌ అరీ (రది అల్లాహు అన్హు) కథనం: ఒకసారి అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) నాతో మాట్లాడుతూ “శుక్రవారం నాటి ఘడియ గురించి మీ నాన్న ఏదయినా దైవప్రవక్త హదీసు చెప్పినప్పుడు నువ్వు విన్నావా?” అని అడిగారు. దానికి నేను సమాధానమిన్తూ, “విన్నాను ఆ ఘడియ ఇమామ్‌ వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజ్‌ ముగిసేవరకు మధ్య కాలంలో ఉంటుందని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధిస్తుండగా తాను విన్నానని మా నాన్నగారు చెప్పారు” అని అన్నాను.

(ముస్లిం) (సహీహ్  ముస్లిం లోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజు ఆ ఘడియ ఎప్పుడొస్తుందనే విషయమై పండితుల మధ్య భిన్నాభి ప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు పై హదీసును నిదర్శనంగా చేసుకొని ప్రార్థనలు స్వీకరించబడే ఆ శుభఘడియ శుక్రవారం రోజు ఇమామ్‌ ఖుత్బా కొరకు వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజు ముగిసేవరకు మధ్యకాలంలో ఉంటుందనీ, అన్నింటికన్నా బలమైన అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేఖ్‌ అల్‌బానీ తదితర హదీసువేత్తలు అబూ మూసా (రది అల్లాహు అన్హు) వివరించిన ఈ హదీసుని ‘మౌఖూఫ్‌‘గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి విన్నారో లేదో ఆయన అనుచరుడు తెలుపలేదని దాని భావం. (వివరాల కోసం షేఖ్‌ అల్‌బానీ చేత పరిశోధించబడిన “రియాజుస్సాలిహీన్‌’ గ్రంథం చూడండి). అందుకే మరికొంతమంది పండితులు అబూదావూద్‌ మరియు నసాయి గ్రంథాల్లోని వేరొక హదీసుని ప్రాతిపదికగా చేసుకొని ఆ శుభఘడియ అస్ర్‌ మరియు మగ్రిబ్‌ నమాజుల మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఆ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభఘడియను అస్ర్‌ నమాజ్‌ తర్వాత చివరివేళలో అన్వేషించమని ఆదేశించటం జరిగింది. మొత్తానికి ఆ ఘడియ నిర్ణయం అస్పష్టంగానే మిగిలిపోయింది కనుక ఆ రోజు సాంతం అత్యధికంగా దైవధ్యానంలో నిమగ్నులై ఉండటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరం.


నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/