ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.
ఇస్లాం – అల్లాహ్ ప్రసాదించిన గొప్ప వరం
అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.
అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:
إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ [ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం] నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)
మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:
وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ [వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్] ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)
కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.
అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రారంభ జీవితం
అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.
చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.
అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.
తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.
అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.
సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.
నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.
సత్యశోధన ప్రయాణం
అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.
అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.
ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.
కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.
సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.
వివిధ ప్రాంతాలకు వలస
చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.
చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.
మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.
అంతిమ ప్రవక్త ఆగమన సూచనలు
అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.
రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.
అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.
బానిసత్వం మరియు మదీనా చేరిక
అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.
అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.
మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక మరియు పరీక్షలు
రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.
ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.
సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.
‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.
మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.
ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.
స్వేచ్ఛ కోసం ఒప్పందం (ముకాతబత్)
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.
నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”
కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.
ఖందక్ యుద్ధం మరియు విజయ సూచన
అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.
ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!
అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.
ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్] https://youtu.be/-deXYNu670Q[23 నిముషాలు] సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ఇస్లాం యొక్క మొట్టమొదటి ముఅజ్జిన్ అయిన హజ్రత్ బిలాల్ ఇబ్న్ రబాహ్ రదియల్లాహు అన్హు యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని వివరిస్తుంది. అబిసీనియా (ఇథియోపియా) నుండి వచ్చిన ఒక బానిసగా, బిలాల్ గారు ఇస్లాంను స్వీకరించినందుకు తన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ చేత ఎదుర్కొన్న భయంకరమైన హింసను మరియు అతని అచంచలమైన విశ్వాసాన్ని ఇది వివరిస్తుంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారి ద్వారా విముక్తి పొందిన బిలాల్ గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత ప్రియమైన సహచరుడిగా మారి, మక్కా విజయం రోజున కాబా పై నిలబడి అజాన్ ఇచ్చే గౌరవాన్ని పొందారు. ప్రవక్త గారి పట్ల బిలాల్ గారికి ఉన్న అపారమైన ప్రేమను, ఆయన మరణానంతరం బిలాల్ పడిన వేదనను మరియు స్వర్గంలో ఆయనకు దక్కిన ఉన్నత స్థానాన్ని ఈ ప్రసంగం కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన వాస్తవానికి అబిసీనియా అనగా ఇథియోపియా దేశస్థుడు. బానిసగా అరబ్బు దేశంలో జీవితం గడిపేవాడు. రంగు పరంగా చూస్తే నల్ల జాతి వాడు. కానీ ఆయన ఘనత ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అడుగుల చప్పుడు స్వర్గంలో చూశారు. ఆయనను ప్రపంచం ముఅజ్జినే రసూల్, ప్రియ ప్రవక్త వారి ముఅజ్జిన్ అనే బిరుదుతో గుర్తిస్తుంది. ఇస్లాం గురించి ఏ కొద్ది జ్ఞానం ఉన్న వారికైనా సరే మీరు ముఅజ్జినే రసూల్ అంటే ఎవరండి అని ప్రశ్నించండి, టక్కున ఆయన నోటి నుండి ఒకటే సమాధానం వస్తుంది – ఆయన మరెవరో కాదు మన ప్రియ ప్రవక్త వారి ప్రియ సహచరుడు బిలాల్ రదియల్లాహు అన్హు.
అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు బిలాల్. తల్లి పేరు హమామా. తండ్రి పేరు రబాహ్. ఆయనను ముఅజ్జినే రసూల్ అనే బిరుదుతో ప్రపంచం గుర్తిస్తుంది. ఆయన మక్కాలో జన్మించారు. బానిస కుటుంబంలో జన్మించారు, బానిసగానే పెరిగారు. ఆయనగారి యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్.
బిలాల్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకారం మరియు హింస
ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యారో, ఆ రోజుల్లో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రహస్యంగా కొద్దిమంది ప్రజలతో కలిసి ఇస్లాం సందేశాన్ని వినిపించారు. ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ప్రారంభంలో చాలా తక్కువ మంది, పది ఇరవై మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు, వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఒకరున్నారు.
అభిమాన సోదరులారా, ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం స్వీకరించారో, ఆయన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ కు వెంటనే ఆ విషయం తెలిసిపోయింది. యజమానికి ఆ విషయం తెలియగానే పట్టరాని కోపంతో యజమాని బిలాల్ రదియల్లాహు అన్హు వారిని కాళ్లు చేతులు బంధించేసి కొరడాలతో కొట్టాడు.
అభిమాన సోదరులారా, యజమాని అయిన కారణంగా అతని బానిస తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేసి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాడనే కోపంతో హింస ప్రారంభించాడు. ముందుగా తను స్వయంగా కొట్టాడు, ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో తాడు కట్టేసి కుర్రాళ్ల చేతులకి ఇచ్చేసాడు. ఆ యువకులు, కుర్రాళ్లు బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో ఉన్న ఆ తాడుని పట్టుకొని ఈడ్చుకుంటూ కొండల్లో, రాళ్ల ప్రదేశంలో తిరిగేవారు. అభిమాన సోదరులారా, ఎలాగైతే ఒక జంతువుని ఈడ్చేవారో ఆ విధంగా బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఆ కుర్రాళ్లు ఈడ్చేవారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి శరీరానికి గాయాలైపోయేవి. ఆయన మెడ మీద తాడు కట్టేసిన కారణంగా గుర్తులు పడిపోయేవి.
అంతటితో యజమాని కోపం చల్లారలేదు. అతను ఏం చేసేవాడంటే తన కసి తీర్చుకోవడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఎండా కాలంలో మిట్ట మధ్యాహ్న సమయంలో బాగా ఎండ, వేడి తీవ్రంగా ఉన్నప్పుడు – మనకందరికీ తెలిసిన విషయమే మనం అరబ్బు దేశంలో ఇక్కడ ఎండను, ఎండ తీవ్రతను చూసినవాళ్ళమే. అలాంటి సమయంలో ఇక్కడి నేల ఎంతగా వేడెక్కిపోతుందో మన అందరికీ తెలుసు అభిమాన సోదరులారా. అలాంటి నేల మీద బిలాల్ రదియల్లాహు అన్హు వారిని వారి యజమాని ఉమయ్య బట్టలు తీసి పడుకోబెట్టేవాడు. ఆ తర్వాత ఎద మీద పెద్ద పెద్ద రాళ్లు ఉంచేసేవాడు. కింద నుంచి కూడా వేడి తగిలేది, పైన ఉంచిన రాయి వేడి కూడా ఆయనకు తగిలేది. అలాంటి పరిస్థితుల్లో బిలాల్ రదియల్లాహు అన్హు వారి చెవి దగ్గరికి వచ్చి యజమాని ఒకే మాట అనేవాడు – “ఓ బిలాల్! నీవు ముహమ్మద్ ప్రవక్త ధర్మాన్ని వదిలివేయి, నేను నిన్ను హింసించడం వదిలేస్తాను.” బిలాల్ రదియల్లాహు అన్హు అంత బాధను భరిస్తూ కూడా అల్లాహ్ యే ప్రభువు అద్వితీయుడు అహద్! అహద్! అని పలికేవారు.
అభిమాన సోదరులారా, యజమాని హింసిస్తూ హింసిస్తూ అలసిపోయాడు. కానీ బిలాల్ రదియల్లాహు అన్హు వారి నోటి నుండి ఒక్క పదము కూడా, ఒక్క మాట కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఆయన వినలేకపోయాడు. అభిమాన సోదరులారా, చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే బిలాల్ రదియల్లాహు అన్హుతో పాటు ఇతర నవ ముస్లిములను కూడా మక్కా పెద్దలు పట్టుకొని హింసించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడండి అని బలవంతం చేశారు. చాలామంది మాట్లాడేశారు కానీ బిలాల్ రదియల్లాహు అన్హు ఎట్టి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బిలాల్ రదియల్లాహు అన్హు విముక్తి
ఒకసారి అబూబకర్ రదియల్లాహు అన్హు మార్గం నుండి వెళ్తూ వెళ్తూ బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఇవ్వబడుతున్న శిక్షలు, బాధలు, హింసలు చూశారు. ఆ తర్వాత వెంటనే ఉమయ్య బిన్ ఖల్ఫ్ తో వచ్చి “ఓ ఉమయ్య! బిలాల్ కి నేను కొనాలనుకుంటున్నాను, నీవు వెంటనే అమ్మేయ్ నేను కొనేస్తాను” అన్నారు. అప్పుడు అతను ఉమయ్య ఏమన్నాడంటే “ఓ అబూబకర్! నేను బిలాల్ కి ఒక ఊకియా, అంటే ఇంచుమించు 70 దిర్హములు, ఆ రేటులో అమ్మాలనుకుంటున్నాను కొనగలవా?” అన్నాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వెంటనే ఆ ఒక ఊకియా (70 దిర్హములు) అతనికి ఇచ్చేసి బిలాల్ ను కొనేశారు. వ్యాపారం జరిగిపోయిన తర్వాత ఉమయ్య హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ అబూబకర్ రదియల్లాహు అన్హు తో అన్నాడు “ఓ అబూబకర్! నీవు బిలాల్ కి బదులుగా ఒక్క దిర్హమ్ మాత్రమే ఇస్తాను అని నీవు అడిగి ఉన్నా నేను ఇచ్చేసేవాడిని. నీవు ఇంత పెద్ద సొమ్ము ఇచ్చేసావే, చెల్లించేసావే” అని ఎగతాళి చేశాడు. కానీ అబూబకర్ రదియల్లాహు అన్హు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? అబూబకర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ ఉమయ్య! నేను ఎక్కువ ఇచ్చేసానని నీవు ఎగతాళి చేస్తున్నావు. వాస్తవం ఏమిటో తెలుసా? నీవు ఒక ఊకియా మాత్రమే అడిగావు. ఒకవేళ నీవు వంద ఊకియాలు అడిగి ఉన్నా గాని నేను చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు గారిని కొన్న తర్వాత ఆయనకు స్వతంత్రుని చేసేసారు. ఆ తర్వాత నుండి బిలాల్ రదియల్లాహు అన్హు వారు స్వతంత్రులయ్యారు.
మదీనాకు వలస మరియు మొదటి అజాన్
ఆ తర్వాత రోజులు గడిచాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, నవ ముస్లింలకు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోవాలని ఆదేశించినప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మసీదును నిర్మించారు. ఆ మసీదు పేరు మస్జిదే నబవీ. మసీదు నిర్మించబడిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ప్రజలకు నమాజ్ కొరకు పిలవడానికి అజాన్ ఇవ్వాలని ఆదేశం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథమంగా, అందరికంటే ముందు అజాన్ పలుకులు పలికించడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిపించి “ఓ బిలాల్! నీవు అజాన్ పలుకులు పలుకు” అని ఆదేశించినప్పుడు ఇస్లాం లో అజాన్ పలుకులు పలికిన ప్రథమ వ్యక్తి బిలాల్ రదియల్లాహు అన్హు. అభిమాన సోదరులారా, ఆనాటి నుండి ఆయనకు ప్రజలు బిలాల్ ముఅజ్జిన్ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు.
అభిమాన సోదరులారా, మదీనాలో ఉంటున్నప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు ఐదు పూటల నమాజులకు అజాన్ పలికేవారు. తర్వాత సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులకు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు. అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటున్నప్పుడు మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు విశ్వాసులను అక్కడి నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించినప్పుడు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా హిజ్రీ శకం రెండవ సంవత్సరంలో మొదటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరు బద్ర్ సంగ్రామం. ఆ సంగ్రామంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు యుద్ధ మైదానంలో వస్తే శత్రువులలో నుంచి ఉమయ్య వచ్చాడు. ఉమయ్య తెలుసు కదా బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క మాజీ యజమాని. మక్కాలో ఆయనకు హింసించిన వాడు, కొట్టినవాడు, బంధించినవాడు, జంతువులాగా ప్రవర్తించిన వాడు శత్రువుల సైన్యంలో వచ్చాడు. అభిమాన సోదరులారా, యుద్ధమైంది ఆ యుద్ధంలో బిలాల్ రదియల్లాహు అన్హు చేతికి చిక్కిపోయాడు. బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు అన్నారు “ఈ రోజు మిగిలితే ఈ భూమి మీద నేను మిగలాలి లేదంటే ఓ దైవ శత్రువా నీవైనా మిగలాలి లేదంటే నేనైనా మిగలాలి, నాతో తలపడు” అని చెప్పేసి బిలాల్ రదియల్లాహు అన్హు అతనితో ఎదుర్కొని అతన్ని హతమార్చేశారు.
అయితే అభిమాన సోదరులారా, మదీనాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున ఇద్దరు అజాన్ పలుకులు పలికే వారు. ఒకరు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అయితే రెండో వారు కళ్ళు లేని, కంటి చూపు లేని ఒక సహాబి ఆయన పేరు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్.
మక్కా విజయం మరియు కాబా పై అజాన్
అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్లిన ఎనిమిదవ సంవత్సరంలో మక్కాని మళ్ళీ జయించేసారు. విజయం పొందిన తర్వాత విజేతల్లాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి శిష్యులు మక్కాలో ప్రవేశించారు. మక్కాలో ప్రవేశించిన తర్వాత మక్కాలోని మస్జిదే హరామ్ లో ఆ రోజుల్లో అవిశ్వాసులు అక్కడ ఉంచిన విగ్రహాలన్నింటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు శిష్యులు అందరూ కలిసి అక్కడి నుంచి తొలగించేశారు. తొలగించిన తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిచి “ఓ బిలాల్! కాబా పైకి ఎక్కి ఈరోజు నీవు అజాన్ పలుకులు పలుకు” అన్నారు. అల్లాహు అక్బర్! అభిమాన సోదరులారా, బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు మక్కా విజయం జరిగిన రోజు కాబా పైకి ఎక్కి అక్కడి నుండి అజాన్ పలుకులు పలికారు.
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ (అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్)
أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ (అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్)
బిలాల్ రదియల్లాహు అన్హు గారు ఈ పలుకులు నిర్మోహమాటంగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా పలికారు. ఒకప్పుడు అదే నగరంలో అల్లాహ్ పేరు తలుచుకోవాలంటే, అల్లాహ్ పేరు పలకాలంటే హింసలు ఎదుర్కోవలసి వచ్చేవి. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే యజమానితో భయపడేవారు. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే ఆ ఊరి పెద్దలతో భయపడేవారు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాతావరణం ఎలాగ మారిపోయిందంటే ఆ రోజు బిలాల్ రదియల్లాహు అన్హు కాబా మీద నిలబడి ఈ పలుకులు పలుకుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా వచ్చి అడ్డు పడటానికి సాహసించలేకపోయాడు. అలా మారిపోయాయి.
ప్రవక్త గారి మరణం మరియు బిలాల్ ఆవేదన
ఆ తర్వాత అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారో, మరుసటి రోజు నుంచే బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలకటం మానేశారు. ప్రజలు వచ్చి ఏమండీ ఎందుకు మీరు అజాన్ పలకటం మానేశారు అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు “అయ్యా అజాన్ పలికేటప్పుడు అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పిన తర్వాత నేను ఎవరి మొహం చూడాలయ్యా? ఆ పలుకు పలికేటప్పుడు నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తుకు వస్తారు కాబట్టి ఆ పలుకు పలికిన తర్వాత మరి వేరే పలుకులు నేను పలకలేను” అన్నారు. ఆ తర్వాత నుంచి బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాన్ అక్కడి నుంచి ఆగిపోయింది.
ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు విశ్వాసులకు నాయకులైనప్పుడు ఆయన ఏమన్నారంటే “ఓ అబూబకర్ రదియల్లాహు అన్హు! నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్లి సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందాలనుకుంటున్నాను” అన్నారు. కానీ ఆయనకు అప్పుడే ఎక్కువ వయసు అయిపోయింది కాబట్టి అబూబకర్ రదియల్లాహు అన్హు అనుమతి ఇవ్వలేదు. అబూబకర్ రదియల్లాహు అన్హు తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు నాయకునిగా ఎన్నికైన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి కూడా బిలాల్ రదియల్లాహు అన్హు వారు అనుమతి కోరితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా వయసు ఎక్కువ అయిపోయింది అని అనుమతి ఇవ్వలేదు. కాకపోతే పట్టుబట్టి ఆయన అనుమతి పొందారు, ఆ తర్వాత సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు. సరిహద్దులో వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో కొన్ని ముఖ్య కారణాల వల్ల ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా సరిహద్దుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు తో ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ బిలాల్! నా కోరిక మేరకు ఒక్కసారి అజాన్ పలకవయ్యా” అన్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు సరిహద్దుల్లో ఒక్కసారి అజాన్ పలికారు.
మరికొన్ని రోజుల తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు మదీనాకు వచ్చినప్పుడు మదీనాలో ఉంటున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవలు హసన్ మరియు హుస్సేన్ మరియు ఇతర సహాబాలు కలిసి బిలాల్ రదియల్లాహు అన్హు ని అజాన్ కోరాలని ప్రాధేయపడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఆయన జీవితంలో చివరిసారి మదీనాలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలికారు. అభిమాన సోదరులారా, ప్రజలు బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదివించడానికి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా విరామం తర్వాత ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు మదీనాలో అజాన్ పలికారో, మదీనాలో ఆయన అజాన్ పలుకులతో వీధి వీధుల్లో శబ్దం మోగిందో ఇళ్లలో నివసిస్తున్న పిల్లల దగ్గరి నుండి మహిళల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తలుచుకొని కన్నీరు కార్చారు. అదే బిలాల్ రదియల్లాహు అన్హు జీవితంలో ఆయన ఇచ్చిన చివరి అజాన్. ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు దిమష్క్ అంటే ఈనాడు డెమస్కస్ అంటూ ఉంటారు ఆ నగరంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయనకు వయసు అయిపోయిన సందర్భంలో ఆయన అక్కడే మరణం పొందారు. నేటికి కూడా ఆయన సమాధి ఆ నగరంలో ఉంది.
స్వర్గంలో బిలాల్ అడుగుల చప్పుడు
అయితే అభిమాన సోదరులారా, ఆయనకున్న ఘనతలను చెప్పేసి ఇన్ షా అల్లాహ్ నా మాటను ముగిస్తాను అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర సందర్భంలో అల్లాహ్ తో కలవడానికి ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గాన్ని కూడా చూపించాడు, నరకాన్ని కూడా చూపించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని చూస్తున్నప్పుడు అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు నడుస్తున్నట్టుగా వారి కాళ్ళ చప్పుడుని విన్నారు. ఆ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హుతో ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే “ఓ బిలాల్! నేను స్వర్గంలో నీ అడుగుల చప్పుడు విన్నాను, నీవు ఏ సత్కార్యము చేస్తున్నావో నాకు కొంచెం తెలుపవా” అన్నారు. దానికి బదులుగా బిలాల్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను ఏదో ఒక పెద్ద సత్కారం ఏమి చేయట్లేదండి, కాకపోతే నా అలవాటు ఏమిటంటే నేను వుజూ చేసిన ప్రతిసారి రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను. నా వుజూ భంగమైపోయిన వెంటనే మళ్ళీ నేను వుజూ చేసేస్తాను, వుజూ చేసిన వెంటనే మళ్ళీ నేను రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను” అన్నారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన చేసిన ఆ సత్కార్యాన్ని మెచ్చుకున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు కాళ్ళ చప్పుడుని వినిపించాడు. ఒకరకంగా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా బిలాల్ రదియల్లాహు అన్హు కి స్వర్గ శుభవార్త కూడా తెలియజేసేశాడు ఒకరకంగా ఇక్కడ.
అలాగే బిలాల్ రదియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్న రోజుల్లో ఒకసారి పండుగ రోజు వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు ఖుత్బా వినిపించేసారు. ఆ తర్వాత మహిళల వద్దకు వెళ్లి మహిళలకు కూడా అల్లాహ్ వాక్యాలు వినిపించారు ఆ తర్వాత దానధర్మాలు చేయాలని ఆదేశించినప్పుడు, కోరినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ వారు తొడిగిన నగలు తీసి విరాళంగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కనే ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు చేయి పట్టుకొని అక్కడ మహిళలకు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడైతే మహిళలు విరాళాలు ఇచ్చారో బిలాల్ రదియల్లాహు అన్హు అక్కడ దుప్పట పరిచిన తర్వాత మహిళలందరూ అందులో విరాళాలు వేశారు.
ఇక చివరిగా మరొక విషయం ఏమిటంటే ఉమర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఒక మాట అనేవారు “అబూబకర్ సయ్యిదునా ఆతకా సయ్యిదనా” అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు మాకు నాయకుడు, మా నాయకుడు మా నాయకుడైన బిలాల్ ని స్వతంత్రుని చేసేసారు అనేవారు. అంటే బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఉమర్ రదియల్లాహు అన్హు వారు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని “మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు” అని చెప్పేవారు. వాస్తవానికి ఆయన బానిసగా జీవించినవాడు. కానీ ఇస్లాం లో నల్ల వారికి, తెల్ల వారికి, బానిసకి, స్వతంత్రునికి ఎలాంటి భేదం లేదు అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ముగింపు మరియు దువా
కాబట్టి అభిమాన సోదరులారా, ఇది బిలాల్ రదియల్లాహు అన్హు యొక్క విశిష్టత, ఆయన యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.
చివరిగా నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ మనకు కూడా బిలాల్ రదియల్లాహు అన్హు మాదిరిగా అలాగే ఇతర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల మాదిరిగా దృఢమైన విశ్వాసంతో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఇస్లాం పై నిలకడగా జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఎలాంటి కష్టనష్టాలు, బాధలు లేకుండా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
أَقُولُ قَوْلِي هَذَا، وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ، فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ (అఖూలు ఖౌలీ హాజా, వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వ లిసాయీరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్) నేను ఈ మాట చెబుతూ, నా కోసం, మీ కోసం మరియు ముస్లిములందరి కోసం అల్లాహ్ క్షమాభిక్ష కోరుతున్నాను. కాబట్టి ఆయన వద్ద క్షమాపణలు వేడుకోండి, నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, అత్యంత దయగలవాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం మానవుని సృష్టికి సంబంధించిన ఇస్లామీయ గాథను వివరిస్తుంది. అల్లాహ్ దైవదూతలను కాంతి నుండి, జిన్నాతులను అగ్ని నుండి సృష్టించిన తరువాత, భూమండలంలోని మట్టితో మొదటి మానవుడైన ఆదం (అలైహిస్సలం)ను తన స్వహస్తాలతో సృష్టించాడు. అల్లాహ్ ఆదం (అలైహిస్సలం)కు వస్తువుల పేర్ల జ్ఞానాన్ని నేర్పి, దైవదూతల కంటే ఆయన శ్రేష్ఠతను చాటాడు. తరువాత, ఆదం (అలైహిస్సలం) పక్కటెముక నుండి హవ్వా (అలైహస్సలాం)ను సృష్టించి, వారిద్దరినీ స్వర్గంలో నివసించమని ఆజ్ఞాపించాడు, అయితే ఒక నిర్దిష్ట వృక్ష ఫలాన్ని తినవద్దని నిషేధించాడు. అహంకారం కారణంగా స్వర్గం నుండి బహిష్కరించబడిన ఇబ్లీస్ (షైతాన్), వారిద్దరినీ ప్రలోభపెట్టి ఆ ఫలాన్ని తినేలా చేశాడు. ఈ అవిధేయత కారణంగా, ఆదం మరియు హవ్వా (అలైహిమస్సలాం) కూడా స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మొదటి మనిషి ఎవరు? మొదటి మనిషి ఎలా సృష్టించబడ్డాడు? దేనితో సృష్టించబడ్డాడు? ప్రారంభంలో మనిషి ఆకారము ఎలా ఉండేది? మొదటి మానవుని పేరు ఏమిటి? ప్రారంభంలో మనిషి అజ్ఞానినా? మరి అతనికి జ్ఞానం ఎలా ఇవ్వబడింది? మొదటి మహిళ ఎవరు? ఆమె పేరు ఏమిటి? ఆమె ఎలా సృష్టించబడింది? మానవులు ప్రారంభంలో స్వర్గంలో ఉన్నారంట, నిజమేనా? షైతాన్ అంటే ఎవరు? దేనితో సృష్టించబడ్డాడు? పుట్టుకతోనే షైతాను చెడ్డవాడా? లేక మధ్యలో ఏదైనా కారణంగా అతనిలో ఇలాంటి మార్పు వచ్చిందా? ఈ విషయాలు నేటి మన ప్రసంగంలో ఇస్లామీయ ధార్మిక గ్రంథాల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే, దూతల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. దైవదూతల్ని కాంతితో సృష్టించాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త వారి పలుకులు:
మిత్రులారా, దైవదూతల సంఖ్య అనేకం. అల్లాహ్ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటం వారి పని. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించడం, పాపాలకు పాల్పడటం వారి స్వభావంలోనే లేదు. అలాంటి భక్తి కలిగిన ఉత్తమ జీవులు, మంచి జీవులు దైవదూతలు.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, జిన్నాతులని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. జిన్నాతులను అగ్ని జ్వాలతో సృష్టించాడు అని తెలుపబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
وَخَلَقَ الْجَانَّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ [వ ఖలఖల్ జాన్న మిమ్మా రిజిమ్ మిన్నార్] మరియు జిన్నులను అగ్ని జ్వాలతో సృష్టించాడు. (55:15)
అభిమాన సోదరులారా, జిన్నాతులలో ముఖ్యమైన వాడు ఇబ్లీస్. అతని ప్రస్తావన మున్ముందు ఇన్ షా అల్లాహ్ వస్తుంది.
ఆదం (అలైహిస్సలం) సృష్టి
ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమండలంలోని రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ ఆకారాన్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తయారు చేసి కొద్ది రోజుల వరకు అలాగే వదిలేసినప్పుడు, అటువైపు నుంచి దైవదూతలు మరియు జిన్నాతులు వస్తూ వెళ్తూ, వస్తూ వెళ్తూ ఆ ఆకారాన్ని చూసి, ఏదో కొత్త జీవి సృష్టించబడుతున్నది అని అర్థం చేసుకున్నారు.
ఒకసారి అయితే అల్లాహ్ మరియు దైవదూతల మధ్య ఆ కొత్త జీవి గురించి సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. దైవదూతలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ప్రశ్నించారు, “ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎవరు ఈ కొత్త జీవి?” అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమాధానం ఇచ్చాడు:
إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً [ఇన్నీ జాఇలున్ ఫిల్ అర్ది ఖలీఫా] “నిశ్చయంగా నేను భూమిపై నా ప్రతినిధిని (ఖలీఫాను) నియమించబోతున్నాను.” (2:30)
దానికి దైవదూతలు ఒక సందేహం వ్యక్తపరిచారు. ఆ సందేహం ఏమిటంటే:
أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ [అతజ్ అలు ఫీహా మయ్యుఫ్సిదు ఫీహా వయస్ఫికుద్దిమా వనహ్ను నుసబ్బిహు బిహందిక వనుఖద్దిసులక్] “మేము నీ పవిత్రతను కొనియాడుతూ, నీ స్తోత్రపాఠాలు చేస్తూ ఉండగా, నువ్వు భూమిలో కల్లోలం రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసే వాడిని నియమిస్తావా?” అని అడిగారు. (2:30)
ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, నీవు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తున్నావు? నిన్ను కొనియాడటానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని ఉచ్చరించటానికి మేము ఉన్నాము కదా? అని దైవదూతలు అడిగారు.
మిత్రులారా, ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఒక విషయం ఆలోచించాలి. అదేమిటంటే, ఇంకా ఒక ఆకారము సృష్టించబడింది, ఆ జీవి ఇంకా ఉనికిలోనికే రాలేదు. అయితే దైవదూతలకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఈ జీవి భూమిలో రక్తపాతాలు సృష్టించుకుంటాడన్న సందేహము ఎందుకు వచ్చింది? అంటే, ధార్మిక పండితులు దాని వివరణ ఇలా తెలియజేశారు: ఇప్పటివరకు మనం విన్నాం, మానవుని కంటే ముందు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని, జిన్నాతుల్ని సృష్టించాడని. ఆ జిన్నాతులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించి భూమి మీద నివసింపజేసినప్పుడు, ఆ జిన్నాతులు పరస్పరం గొడవ పడ్డాయి, రక్తపాతాలు సృష్టించుకున్నాయి. తత్కారణంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతల్ని పంపించి వారిని శిక్షించాడు. దైవదూతలు వచ్చి జిన్నాతులను ఇక్కడి నుంచి తరిమేసి సముద్రాల మధ్య ఉన్న దీవుల్లోకి పరిమితం చేసేశారు. అంటే, మనిషి కంటే ముందు ఒక జీవిని భూమి మీద అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నివసింపజేస్తే, వారు పరస్పరం గొడవపడ్డారు, వారు రక్తపాతాలు సృష్టించుకున్నారు కదా! కాబట్టి దైవదూతలకు ఆ సందేహం కలిగి, వారు “ఈ జీవి కూడా అలాగే రక్తపాతాలు సృష్టించుకుంటాడేమో” అని అల్లాహ్ ముందర సందేహం వ్యక్తపరిచారు.
దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇచ్చిన సమాధానం ఏమిటంటే:
إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ [ఇన్నీ ఆ’లము మాలా తా’లమూన్] “నాకు తెలిసింది మీకు తెలియదు” అని సమాధానమిచ్చాడు. (2:30)
మిత్రులారా, రోజులు గడిచాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన స్వహస్తాలతో సృష్టించిన ఆ ఆకారంలో తను సృష్టించిన ఆత్మను ఊదాడు. “వ నఫఖ్తు ఫీహి మిర్రూహీ” అని తెలుపబడింది మిత్రులారా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆత్మను ఆ ఆకారంలోకి ఊదినప్పుడు, ఆ ఆకారం శరీర అవయవాలు ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఏర్పడటం ప్రారంభించింది. చూస్తూ ఉండంగానే మనిషి సంపూర్ణంగా అవతరించాడు.
అభిమాన సోదరులారా, మనిషి శరీరం తయారయ్యింది, మానవుడు పూర్తిగా తయారైపోయాడు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ముందర మనిషి నిలబడినప్పుడు, అతనికి తుమ్ము వచ్చింది. అల్లాహ్ ఆజ్ఞతో మనిషి “అల్ హందులిల్లాహ్” అని పలికాడు. మిత్రులారా, మనిషి సృష్టించబడిన తర్వాత అతని నోటి నుండి వచ్చిన మొదటి పలుకు “అల్ హందులిల్లాహ్”, అనగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఆ మాట వినగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనిషికి సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడంటే “యర్ హముకల్లాహు యా ఆదం“, ఓ ఆదం, అల్లాహ్ నీ మీద కరుణించాడు. ఆ విధంగా మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అని పిలిచి, ఆదం అనే నామకరణం చేశాడు.
అభిమాన సోదరులారా, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మొదటి మనిషి అయిన ఆదం అలైహిస్సలం వారికి, అక్కడ కూర్చొని ఉన్న దైవదూతల వద్దకు వెళ్లి వారికి సలాము చెప్పు అని ఆదేశించాడు. ఆదం అలైహిస్సలం దైవదూతల వద్దకు వెళ్లి “అస్సలాము అలైకుం” అని సలాం పలికారు. దానికి దైవదూతలు “వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్” అని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విని ఆదం అలైహిస్సలం అల్లాహ్ వద్దకు వచ్చేసి, “ఓ అల్లాహ్, నేను దైవదూతలకు అస్సలాము అలైకుం అని సలాం చెబితే, వారు వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ అని సమాధానం ఇచ్చారు” అని చెప్పారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “ఓ ఆదం, నీకు మరియు నీ సంతానానికి పరస్పరం పలకరించుకోవడానికి ఇవే పలుకులు నేను ఇస్తున్నాను” అని చెప్పాడు.
మిత్రులారా, ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా, ఇన్ షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా, అల్లాహ్ భక్తులు పరస్పరం ఎదురైనప్పుడు ఇవే పలుకులతో పలకరించుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు మరొక విషయం గుర్తుకు వస్తూ ఉంది. సందర్భానుసారం అది కూడా నేను వివరించి ముందుకు సాగుతాను మిత్రులారా. అదేమిటంటే, అస్సలాము అలైకుం, వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ – ఈ పలుకులు ఏ ధర్మంలో తెలియజేయబడ్డాయి మరియు ఏ ధర్మాన్ని అవలంబించే వాళ్ళు పలుకుతున్నారు? అందరూ ముక్తకంఠంతో ఒకే మాట చెబుతారు, అదేమిటంటే “ఈ పలుకులు ఇస్లాం ధర్మంలో మాత్రమే నేర్పబడ్డాయి, మరియు ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తున్న ముస్లింలు మాత్రమే ఈ పలుకులు పలుకుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం” అంటారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పలుకులు ఇస్లామీయ ధర్మం పలుకులు అయితే, మరి ఇస్లాం ధర్మం ఎప్పటి నుంచి మొదలైంది అండి? మనిషి పుట్టుక నుండే ఇస్లామీయ ధర్మము ఉంది, ఇస్లామీయ ధార్మిక నియమాలు కూడా ఉన్నాయి అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది.
ఆ తర్వాత మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారి వీపు మీద తన చేయితో స్పర్శించగా, అక్కడ చాలా ఆత్మలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నిటికీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాంతిని ప్రసాదించాడు, అవి మెరిసిపోతూ ఉన్నాయి. అది చూసి ఆదం అలైహిస్సలం వారు, “ఓ అల్లాహ్, ఎవరు వీరు?” అని అడిగారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “వీరంతా రాబోయే నీ సంతానము” అని చెప్పాడు.
ఆదం అలైహిస్సలం వారందరినీ బాగా గమనిస్తే, ఒక ఆత్మ వద్ద కాంతి చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. ఆయనను చూసి ఆదం అలైహిస్సలం అల్లాహ్ తో అడిగారు, “ఓ అల్లాహ్, అక్కడ కొంచెం ఎక్కువగా కాంతి ప్రకాశిస్తూ ఉంది, అతను ఎవరు?” అని ప్రత్యేకంగా అడిగారు. దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అన్నాడు, “ఇతను నీ బిడ్డ దావూద్, అతని ఆయుష్షు 40 సంవత్సరాలు” అన్నాడు. అది విని ఆదం అలైహిస్సలం వారు అల్లాహ్ తో అన్నారు, “ఓ అల్లాహ్, అతనికి కేవలం 40 సంవత్సరాలే ఆయుష్షానా? నా ఆయుష్షులో నుంచి ఒక 60 సంవత్సరాలు తీసి అతని ఆయుష్షులో కలిపేయండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో కోరారు. ఆయన కోరిక మేరకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆజ్ఞతో అలాగే 60 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షులో పెంచడం జరిగింది. ఆ విధంగా దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షు 100 సంవత్సరాలు అయింది మిత్రులారా.
ఆదం (అలైహిస్సలం) కు జ్ఞానం ప్రసాదించడం
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారికి విద్య నేర్పాడు, వస్తువుల పేర్లు నేర్పాడు, వాటి వినియోగం కూడా నేర్పాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో తెలియజేశాడు:
وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا [వ అల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా] తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు. (2:31)
అంటే, మనిషి పుట్టిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ఆయనకు జ్ఞానం ఇవ్వబడింది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలను పిలిచి, దైవదూతల ముందర ఆ వస్తువులన్నింటినీ ప్రవేశపెట్టి, అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలతో మరొక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే:
أَنْبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِنْ كُنْتُمْ صَادِقِينَ [అంబిఊనీ బి అస్మాఇ హాఉలాఇ ఇన్ కున్తుం సాదిఖీన్] “మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లు చెప్పండి” అని అన్నాడు. (2:31)
ఇక్కడ కనిపిస్తున్న వస్తువుల పేర్లు నాకు చెప్పండి అంటే, దైవదూతలు అల్లాహ్ తో అన్నారు:
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ [సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్] వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
అంటే, వీటి జ్ఞానము మాకు లేదు, మేము చెప్పలేము అని దైవదూతలు అక్కడ చెప్పేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ ఆదం అలైహిస్సలం వారితో, “ఓ ఆదం, వీటి పేర్లు నువ్వు తెలుపు” అని ఆదేశించాడు. అప్పుడు ఆదం అలైహిస్సలం అక్కడ ఉన్న వస్తువుల పేర్లన్నీ చకచకా తెలియజేశారు. ఇది నది, ఇది భవనము, ఇది వృక్షము, ఇది ఫలము, ఈ విధంగా వస్తువుల పేర్లన్నీ ఆయన పలికేశారు. మిత్రులారా, అప్పుడు దూతలకు అర్థమయింది, ఈ కొత్త జీవిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ముఖ్యంగా విద్య ఉంది, జ్ఞానం ఉంది అని. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా దూతలతో అన్నాడు, “నేను ముందే మిమ్మల్ని చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని. ఇందులో, ఈ కొత్త జీవిలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయి, చూడండి” అన్నాడు.
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతలందరినీ ఆదం అలైహిస్సలం వారి ముందర సాష్టాంగపడమని, సజ్దా చేయమని ఆదేశించాడు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, దైవదూతలందరూ సజ్దా చేశారు, సాష్టాంగపడ్డారు. కానీ, అప్పటికే ఎంతో గౌరవ మర్యాదలతో స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఇబ్లీస్ మాత్రం సాష్టాంగపడలేదు.
అది చూసి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇబ్లీస్ తో అడిగాడు:
يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ [యా ఇబ్లీసు మా మనఅక అన్ తస్జుద లిమా ఖలఖ్తు బియదయ్య] “ఓ ఇబ్లీస్! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది?” (38:75)
దానికి ఇబ్లీస్ అల్లాహ్ కు సమాధానం ఇచ్చాడు, చూడండి ఏమంటున్నాడో:
قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ [ఖాల అన ఖైరుమ్ మిన్హు ఖలఖ్తనీ మిన్నారిన్ వ ఖలఖ్తహు మిన్తీన్] “నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్నేమో మట్టితో సృష్టించావు” అని వాడు సమాధానమిచ్చాడు. (38:76)
అంటే, నేను అతని కంటే గొప్పవాణ్ణి, అగ్నితో పుట్టినవాణ్ణి కదా, నేను గొప్పవాణ్ణి. అతను మట్టితో పుట్టాడు కదా, అతను అల్పుడు అని అతను భావించాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను లోలోపల గర్వపడ్డాడు, అహంకారానికి గురయ్యాడు. అదే విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో కూడా తెలియజేసి ఉన్నాడు:
أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ [అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్] వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు. (2:34)
మిత్రులారా, అహంకారం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలో ఇష్టపడడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఎవరి వద్ద అయినా రవ్వంత అహంకారం ఉన్నా, అతను స్వర్గంలో ప్రవేశింపజాలడు” అన్నారు. మనిషికి అహంకారం తగదు మిత్రులారా. అదేవిధంగా ఇబ్లీస్ కూడా అదే పొరపాటు చేశాడు, అహంకారానికి గురయ్యాడు, అల్లాహ్ సాష్టాంగపడమంటే సాష్టాంగపడలేదు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కోపగించుకొని, ఆగ్రహించి, అతన్ని స్వర్గం నుండి బహిష్కరించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:
فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ [ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్] (అప్పుడు అల్లాహ్ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు ధూత్కరించబడ్డావు. (38:77)
మిత్రులారా, అతను ప్రదర్శించిన అహంకారం కారణంగా తన గౌరవాన్ని కోల్పోయాడు, తన ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు, స్వర్గ బహిష్కరణకు గురైపోయాడు షైతాను.
హవ్వా (అలైహస్సలాం) సృష్టి మరియు స్వర్గంలో నివాసం
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారిని స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు పుట్టారో అది జుమా రోజు, అంటే శుక్రవారం రోజు. మరియు ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలో ప్రవేశించారో అది కూడా జుమా రోజు, శుక్రవారం రోజు. అంటే శుక్రవారం రోజున ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలోకి ప్రవేశించారు.
స్వర్గంలో వెళ్ళిన తర్వాత, ఆదం అలైహిస్సలం ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు ఒంటరితనం అనిపించింది. ఒక రోజు ఆయన పడుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన పక్కటెముకల నుండి, ఎడమ వైపున ఉన్న పక్కటెముక నుండి ఒక మహిళను సృష్టించాడు. ఆమె పేరు హవ్వా. ఆదం అలైహిస్సలం వారు నిద్ర లేచి చూస్తే, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండటాన్ని గమనించి “ఎవరు మీరు?” అని ప్రశ్నించారు. హవ్వా అలైహస్సలాం వారు అన్నారు, “నా పేరు హవ్వా, నన్ను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీ కోసం పుట్టించాడండి” అని చెప్పారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “మీరిద్దరూ జంటగా ఈ స్వర్గంలో తిరగండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి త్రాగండి” అని చెబుతూ, ఒకే ఒక నిబంధన పెట్టాడు. ఏంటి ఆ నిబంధన?
وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ [వలా తఖ్రబా హాదిహిష్షజరత ఫతకూనా మినజ్జాలిమీన్] కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” (2:35)
ఆదం అలైహిస్సలం మరియు హవ్వా అలైహస్సలాం వారిద్దరూ జంటగా స్వర్గంలో ప్రశాంతంగా, హాయిగా జీవిస్తూ ఉన్నారు మిత్రులారా.
షైతాను ప్రలోభం మరియు స్వర్గ బహిష్కరణ
అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి వారు స్వర్గంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించుకుంటూ ఉంటే, స్వర్గ బహిష్కరణకు గురైన షైతాను వారిని చూసి లోలోపల కుళ్ళిపోయాడు, అసూయకు గురయ్యాడు. అసూయకు గురయ్యి, ఎలాగైనా సరే వీరిద్దరితో నేను తప్పు చేయించాలి, వారిని కూడా స్వర్గ బహిష్కరణకు గురి చేయాలి అని లోలోపలే అతను అసూయపడ్డాడు.
ఆ తర్వాత, వారిద్దరి వద్దకు షైతాన్ దుష్ప్రేరేపణ కల్పించడం మొదలెట్టేశాడు. దాన్ని వస్వసా అని అంటారు మిత్రులారా. దుష్ప్రేరణ రేకెత్తించడం ప్రారంభించాడు. అతను ఏమన్నాడంటే, “ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మిమ్మల్ని స్వర్గంలో స్వేచ్ఛగా అన్నీ తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తాగండి అని చెబుతూ, కేవలం ఆ ఒక్క వృక్ష ఫలమే ఎందుకు తినవద్దు అని నిబంధన పెట్టాడో తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే, మీరు దైవదూతలుగా మారిపోతారు, శాశ్వతమైన రాజ్యం మీకు దక్కుతుంది, శాశ్వతమైన జీవితం మీకు దక్కుతుంది. అందుకోసమే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీకు ఆ వృక్షం వద్దకు కూడా వెళ్ళవద్దు అని నిబంధన పెట్టేశాడు” అని చెబుతూ, షైతాన్ ఒట్టేసుకున్నాడండి, ప్రమాణం చేసేశాడు.
అతను ప్రమాణం చేసి మరీ చెబుతూ ఉంటే, మిత్రులారా, వారిద్దరూ అతని మాటల్లో పడిపోయారు. అతని మాటల్లో పడి, వారిద్దరూ కలిసి ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. మిత్రులారా, ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. 20వ అధ్యాయం, 121వ వాక్యంలో:
فَأَكَلَا مِنْهَا [ఫ అకలా మిన్హా] చివరకు వారిద్దరూ దానిని తిన్నారు. (20:121)
అలాగే, 7వ అధ్యాయం, 20వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
మిత్రులారా, ఇద్దరూ కూడా షైతాను మాటల్లో పడి ఆ వృక్ష ఫలము తిన్నారు అని ఖుర్ఆన్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే, మహిళ ఒక్కరే ఈ పాపానికి ఒడిగట్టారు, దీనికి కారణము మహిళ అని నిందించడము సమంజసము కాదు అని మనకు ఖుర్ఆన్ ద్వారా తెలియజేయబడింది మిత్రులారా.
ఎప్పుడైతే వారు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో, వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారు స్వర్గంలోని ఆకులు తీసుకొని వారి మర్మస్థానాలను కప్పుకోవడం ప్రారంభించారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “ఏమండీ, నేను నిషేధించిన చెట్టు, వృక్ష ఫలాన్ని మీరు తిన్నారు అంటే, మీరు కూడా నా ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి, మీరు కూడా శిక్షార్హులు, మీకు శిక్ష ఏమిటంటే మీరు కూడా స్వర్గం నుండి బయటికి వెళ్ళండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరినీ, ఆ తప్పు చేసిన కారణంగా, ఆ నిషేధించబడిన వృక్ష ఫలము తిన్న కారణంగా, స్వర్గం నుంచి బయటికి బహిష్కరించాడు మిత్రులారా.
ఆ తర్వాత ఏమి జరిగింది? స్వర్గం నుంచి బహిష్కరించబడిన తర్వాత మానవులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎక్కడికి చేర్చాడు? ఆ తదుపరి జరిగిన వృత్తాంతాన్ని ఇన్ షా అల్లాహ్ మనం రెండవ భాగంలో తెలుసుకుందాం.
అల్లాహ్ తో మేము దుఆ చేస్తున్నాము, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ, అహంకారానికి గురికాకుండా, అల్లాహ్ ఆరాధన చేసుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఈ ప్రసంగం ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్రలో రెండవ భాగాన్ని వివరిస్తుంది. స్వర్గం నుండి బహిష్కరించబడిన తరువాత, ఆదం (అలైహిస్సలం) మరియు హవ్వా (అలైహస్సలాం) భూమిపై వేర్వేరు ప్రదేశాలలో దిగి, పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ వారిని క్షమించి, అరఫా మైదానంలో తిరిగి కలిపాడు. వారికి కవలలుగా సంతానం కలిగింది. వారి కుమారులైన కాబిల్ మరియు హాబిల్ మధ్య వివాహ విషయంలో వివాదం తలెత్తగా, దానిని పరిష్కరించడానికి అల్లాహ్ వారిని ఖుర్బానీ (బలి) చేయమని ఆదేశించాడు. హాబిల్ ఖుర్బానీ స్వీకరించబడి, కాబిల్ ఖుర్బానీ తిరస్కరించబడటంతో, అసూయతో కాబిల్ తన సోదరుడైన హాబిల్‌ను హత్య చేశాడు. ఇది భూమిపై జరిగిన మొదటి హత్య. తరువాత, ఒక కాకి ద్వారా అల్లాహ్ శవాన్ని ఎలా ఖననం చేయాలో కాబిల్‌కు నేర్పాడు. చివరగా, ఆదం (అలైహిస్సలం) 960 సంవత్సరాలు జీవించి మరణించగా, దైవదూతలు ఆయన ఖనన సంస్కారాలు నిర్వహించి మానవాళికి మార్గనిర్దేశం చేశారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
మిత్రులారా, మనిషి భూమి మీద మొదటిసారి ఎక్కడ పాదం మోపాడు? మనిషికి భూమి మీద పంపించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల ఆయుష్షు ఇవ్వబడింది? మొదటి మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎంత మంది బిడ్డలను ప్రసాదించాడు? మనిషికి పుట్టిన బిడ్డలలో, ఓ ఇద్దరు బిడ్డల గురించి ప్రత్యేకంగా ధార్మిక గ్రంథాలలో తెలుపబడిన విషయాలు, మొదటి మనిషి యొక్క మరణం మరియు అతని ఖనన సంస్కారాలు, ఈ విషయాలన్నీ మనము ఈనాటి ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.
ఆదం మరియు హవ్వా (అలైహిముస్సలాం) భూమిపైకి రాక మరియు పశ్చాత్తాపం
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం స్వర్గంలో నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని అల్లాహ్ ఆజ్ఞను అతిక్రమించారో, వారిని స్వర్గం నుండి బహిష్కరించి భూమి మీదకి దింపేశాడు. దైవదూతలు ఇద్దరినీ భూమి మీదికి తీసుకువచ్చారు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం వారిని దైవదూతలు భారతదేశంలో దింపారు. నేడు శ్రీలంక అని ఒక దేశం పేరు మనం వింటూ ఉన్నాము కదా, ఒకప్పుడు అది భారతదేశపు భూభాగంలోనే ఒక భాగము. అక్కడ దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారిని దింపారు. మరియు హవ్వా అలైహస్సలాం వారిని దైవదూతలు సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వద్ద దింపారు. అంటే ఇద్దరినీ కూడా వేరు వేరు ప్రదేశాలలో దైవదూతలు దింపేశారు.
భూమి మీద దిగిన తర్వాత, వారు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమక్షంలో కన్నీరు కార్చి, ఏడ్చి, పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకున్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి కొన్ని పలుకులు కూడా నేర్పాడు. ఆ పలుకులతో ఆదం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో క్షమాభిక్ష కోరారు. ఏమిటి ఆ పలుకులు అంటే, ఖుర్ఆన్ గ్రంథంలో మనం చూచినట్లయితే, ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:
[రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లమ్ తగ్ఫిర్లనా వ తర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్] వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు (7:23)
ఈ విధంగా అల్లాహ్ నేర్పిన ఆ పలుకులను నేర్చుకొని, ఆది దంపతులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం ఇద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి వేడుకోగా, కరుణామయుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి మీద కరుణించి, వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి పాపాన్ని మన్నించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు, “ఫతాబ అలైహి ఇన్నహూ హువత్తవ్వాబుర్రహీం.” అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి తౌబా స్వీకరించి మన్నించేశాడు. నిశ్చయంగా ఆయన కరుణించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు.
మిత్రులారా, మనిషి చేసిన పాపము క్షమించబడింది, మన్నించబడింది అని ఖుర్ఆన్ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మిత్రులారా, ఎప్పుడైతే వారి పాపము మన్నించబడిందో, క్షమించబడిందో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని పంపించి, వేరు వేరు ప్రదేశాలలో ఉన్న వారిద్దరినీ మళ్ళీ ఒకచోట కలిపేశాడు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, దైవదూతలు వచ్చి, ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారి ఇద్దరినీ మక్కా సమీపంలో ఉన్న అరఫా మైదానంలోని జబలె రహ్మా వద్ద వారిద్దరినీ కలిపేశారు. మిత్రులారా, విడిపోయిన ఆ ఆలుమగలిద్దరూ, దూరం దూరంగా ఉన్న ఆ ఆలుమగలిద్దరూ పరస్పరం అక్కడ, అరఫా మైదానంలో జబలె రహ్మా వద్ద ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరూ అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు కాబట్టి ఆ మైదానానికి పరిచయ స్థలం అనే భావన వచ్చేటట్టుగా అరఫా అని పేరు పడింది అని ధార్మిక పండితులు తెలియజేస్తారు.
ఆదం సంతానం
సరే, ఆ విధంగా ఆది దంపతులు ఇద్దరూ ఒకచోట వచ్చారు, వారిద్దరూ కలిసి నివసించడం ప్రారంభించారు. మిత్రులారా, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని భూమండలం మీద, మీకు ఒక నిర్దిష్ట కాలం వరకు జీవితం ఇవ్వబడింది, మీరు అక్కడ ఆ నిర్దిష్ట కాలం వరకు జీవించండి, మీకు సంతానము కూడా కలుగుతుంది, ఆ విధంగా ప్రపంచము నడుస్తుంది, మళ్ళీ మీకు మరణం అని ఒకటి వస్తుంది, ఆ మరణం సంభవించిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి నా సమక్షంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ నేను మీ స్థానమైన స్వర్గానికి చేరుస్తాను అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.
అయితే మిత్రులారా, ఎప్పుడైతే మనిషి యొక్క పాపము మన్నించబడిందో, అతను మరణించి మళ్ళీ స్వర్గానికి వెళ్లిపోబోతున్నాడు అన్న విషయము తెలిసిందో, అసూయకు గురై ఉన్న షైతాను మరింత అసూయకు గురయ్యాడు. మామూలుగా చేయాల్సింది ఏమిటండి? మనిషితో తప్పు దొల్లింది, షైతానుతో కూడా తప్పు దొర్లింది. ఇద్దరికీ ఒకే శిక్ష. షైతాను కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు, మానవుడు కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు. మానవుడు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి, క్షమాభిక్ష వేడుకున్నాడు, అతని పాపము క్షమించబడింది. మరి అలాంటప్పుడు షైతాను ఏమి చేయాలి? అతను కూడా అల్లాహ్ వద్ద వెళ్లి, క్షమాభిక్ష వేడుకొని, మన్నింపు వేడుకొని, తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. కానీ అతను ఏం చేశాడంటే, మరింత అసూయకు గురైపోయి, “అరే, నేను స్వర్గం నుంచి మనిషిని బయటికి వచ్చేటట్టు, బహిష్కరించబడేటట్టు చేస్తే, ఇతను మళ్ళీ స్వర్గవాసి అయిపోతున్నాడే” అని అల్లాహ్ వద్దకు వెళ్లి మళ్ళీ అతను సవాలు చేశాడు. ఏమని సవాలు చేశాడంటే, “ఓ అల్లాహ్, నేను కూడా భూమి మీదకు వెళ్లి, మనిషి దారిలో కూర్చొని, కుడి వైపు నుండి, ఎడమ వైపు నుండి, నలువైపుల నుండి నేను అతన్ని నీ మార్గములో, నీ దారిలో నడవకుండా మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్టు చేస్తాను, దారి తప్పేటట్టు చేసేస్తాను” అని సవాలు విసిరాడు.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని మాటలు వింటూ ఉంటే, అతను మళ్ళీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో అడిగాడు, “ఇదంతా చేయటానికి నాకు కొన్ని శక్తులు కావాలి” అన్నాడు. ఏమిటి ఆ శక్తులు అంటే, అతను అన్నాడు:
أَنْظِرْنِي إِلَى يَوْمِ يُبْعَثُونَ “ప్రజలు తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు.” (7:14)
అనగా, అందరూ తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు. అంటే ప్రళయం వరకు నాకు చావు రాకూడదు అన్న విషయం అతను అల్లాహ్ తో కోరాడు. అలాగే, మరిన్ని కొన్ని కోరికలు అతను కోరాడు. ముఖ్యంగా మనం చూచినట్లయితే, మనిషి హృదయం పక్కన కూర్చొని, మనిషి మనసులో చెడు ఆలోచనలు కలిగించడానికి స్థానము కావాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా మరిన్ని కోరికలు అతను కోరుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని కోరికల ప్రకారం అతనికి ఆ శక్తులన్నీ ఇచ్చాడు. “ప్రళయం వరకు నాకు మరణం సంభవించకూడదు” అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనికి ఇచ్చేశాడు. “కాల ఇన్నక మినల్ ముంజరీన్, సరే, నీకు ఆ గడువు ఇవ్వబడింది, వెళ్ళు” అని చెప్పాడు. అతను ఆ శక్తులు తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనితో అన్నాడు, “నీవు వెళ్లి నీ ప్రయత్నము చెయ్. నేను కూడా నా భక్తుల వద్దకు నా వాక్యాలు పంపిస్తాను. ఒకవేళ ఎవరైనా నీ మాట విని, నా దారి వదిలేసి, దారి తప్పిపోయి మార్గభ్రష్టత్వానికి గురైపోతే, నిన్ను మరియు నీ మాట విని మార్గభ్రష్టత్వానికి గురవుతున్న వారిని ఇద్దరినీ కూడా నేను నరకంలో శిక్షిస్తాను” అని చెప్పేశాడు.
సరే, ఏది ఏమైనను మిత్రులారా, ఇద్దరూ ఇటు మానవులు, అటు జిన్నాతులు భూమి మీద నివసించడం ప్రారంభించారు. మొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహస్సలాం తో కలిసి ఈ భూమి మీద నివసిస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారికి సంతానాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో హవ్వా అలైహస్సలాం వారికి ప్రతి కాన్పులో ఇద్దరు బిడ్డలు పుట్టేవారు, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. ఇద్దరు బిడ్డలు ప్రతి కాన్పులో పుట్టేవారు. ఆ విధంగా హవ్వా అలైహస్సలాం వారికి 20 కాన్పుల్లో 40 మంది బిడ్డలు పుట్టారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.
కాబిల్ మరియు హాబిల్ వృత్తాంతం
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి సంతానం ఇచ్చినప్పుడు, ఆ సంతానాన్ని పోషించుకుంటూ, వారికి దైవ వాక్యాలు, నిబంధనలు నేర్పించుకుంటూ ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఈ భూమండలం మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండంగానే, ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం వారి సంతానము పెరుగుతూ పోయింది భూమండలం మీద. ప్రజల సంఖ్య పెరుగుతూ పోయింది, రోజులు గడుస్తూ పోయాయి. ఆ తర్వాత, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల మధ్య ఒక విషయంలో గొడవ జరిగింది.
మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల్లో కాబిల్ మరియు హాబిల్ అనే వారు ఇద్దరూ ముఖ్యమైన వ్యక్తులు. కాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు వ్యవసాయం చేసేవాడు. హాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు పశువుల కాపరిగా, పశువులను మేపేవాడు. అయితే, వారిద్దరూ పెరిగి పెద్దవారయ్యాక, వివాహ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆనాటి నియమ నిబంధనల ప్రకారము, ఏ అమ్మాయినైతే కాబిల్ వివాహం చేసుకుంటాను అని కోరాడో, ఆ అమ్మాయిని హాబిల్ కి ఇచ్చి వివాహం చేయాలి. కానీ, కాబిల్ ఆ అమ్మాయితో నేనే వివాహం చేసుకుంటాను అని పట్టుపట్టాడు. ఆనాటి నియమ నిబంధనలకు అతని ఆ కోరిక విరుద్ధమైనది.
విషయం తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఆదం అలైహిస్సలాం, కాబిల్ కి చాలా రకాలుగా నచ్చజెప్పారు, “బిడ్డా, నువ్వు కోరుతున్న కోరిక అధర్మమైనది, ఈ విధంగా నీవు పట్టుపట్టడం, మొండి వైఖరి వివలంబించడం మంచిది కాదు” అని ఆదం అలైహిస్సలాం కాబిల్ కి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా, అతను మాత్రం వినలేదు. చివరికి ఆదం అలైహిస్సలాం వారు ఏమన్నారంటే, “సరే, ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి అల్లాహ్ సమక్షంలో ఖుర్బానీ చేయండి. ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతనికి ఇచ్చి ఆ అమ్మాయితో వివాహం చేసేస్తాము” అని చెప్పారు.
మిత్రులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు, ఐదవ అధ్యాయం, 27వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి ఖుర్బానీ సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు.(5:27)
ఎవరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడలేదు అన్న విషయాన్ని ధార్మిక పండితులు తెలియజేశారు. అదేమిటంటే, ఆదం అలైహిస్సలాం వారు చెప్పిన ప్రకారం, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా ఖుర్బానీ చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, ఒక సమయాన్ని ఎన్నుకున్నారు. నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు, కాబిల్, అతను వ్యవసాయం చేసేవాడు కాబట్టి, అతను కొన్ని ధాన్యాలు తీసుకొని వెళ్లి ఒక మైదానంలో ఉంచాడు. ఇటు హాబిల్, గొర్రెల కాపరి కాబట్టి, ఒక గొర్రెను లేదా ఒక పశువుని తీసుకొని వెళ్లి మైదానంలో నిలబెట్టాడు. ఆ రోజుల్లో ఖుర్బానీ ఇచ్చే విధానం ఏమిటంటే, వారి ఖుర్బానీ తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచితే, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతని ఖుర్బానీని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, ఫలానా ఫలానా వ్యక్తుల ఖుర్బానీ స్వీకరించబడింది అని.
కాబట్టి, వారిద్దరూ కూడా, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా, వారి వారి ఖుర్బానీని తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచారు. మైదానంలో ఉంచగా, అగ్ని వచ్చి హాబిల్ పెట్టిన ఖుర్బానీని కాల్చి వెళ్లిపోయింది. అప్పుడు స్పష్టమైపోయింది, హాబిల్ మాత్రమే సత్యం మీద ఉన్నాడు, అతని మాట న్యాయమైనది. కాబిల్ అసత్యం పైన ఉన్నాడు, అతను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని స్పష్టమైపోయింది. ఎప్పుడైతే కాబిల్ కు తెలిసిందో, “నా ఖుర్బానీ స్వీకరించబడలేదు, తిరస్కరించబడింది” అని, అతను అతని తమ్ముని మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని, అతని తమ్ముని వద్దకు వెళ్లి అతను ఏమన్నాడంటే:
لَأَقْتُلَنَّكَ “నిశ్చయంగా నేను నిన్ను చంపేస్తాను.” (5:27)
నువ్వు నాకు అడ్డుపడుతున్నావు, నేను నిన్ను హతమార్చేస్తాను అన్నాడు. అంటే చంపేస్తాను అని అతన్ని బెదిరించాడు. మిత్రులారా, అది విని హాబిల్, అతను మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఆయన ఏమన్నాడంటే:
దైవభీతి ఉన్నవారి ఖుర్బానీ అల్లాహ్ త’ఆలా స్వీకరిస్తాడు, నాలో దైవభీతి ఉండింది కాబట్టి అల్లాహ్ నా ఖుర్బానీ స్వీకరించాడు, నీవు అన్యాయంగా పోతున్నావు కాబట్టి నీ ఖుర్బానీ స్వీకరించబడలేదు. నువ్వు నన్ను చంపుతాను అని బెదిరిస్తున్నావు కదా!
لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ఒకవేళ నువ్వు నన్ను హత్య చేయటానికి చెయ్యి ఎత్తితే, నేను మాత్రం నిన్ను హత్య చేయటానికి నా చెయ్యి ఎత్తను. (5:28)
ఒకవేళ నువ్వు నా ప్రాణము తీస్తే, నా పాపము మూటగట్టుకుంటావు అని చెప్పాడు. మిత్రులారా, కాబిల్ ఆ మాటలు విని కూడా మారలేదు. అతని మనసులో ఒకే మొండిపట్టు ఉండింది, ఎలాగైనా సరే నా మాటను నేను నెగ్గించుకోవాలి అని అతను పట్టుపట్టాడు. షైతాను కూడా అతనికి పురికొల్పాడు.
భూమిపై మొదటి హత్య
ఒకరోజు హాబిల్ నిద్రిస్తూ ఉంటే, అతను ఒక పెద్ద రాయి తీసుకొని వెళ్లి అతని తల మీద పడేశాడు. ఆ విధంగా కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు. మరికొన్ని ఉల్లేఖనాలు ఏమని ఉందంటే, ఒక గట్టి వస్తువు తీసుకొని అతని తల మీద కొట్టాడు, తత్కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పబడింది. ఏది ఏమైనను సరే, కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు.
మొదటిసారి ఈ భూమండలం మీద ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి, ఒక నేరము జరిగింది. ఆ నేరం ఏమిటంటే హత్య. ఒక హత్యా నేరము ఈ భూమండలం మీద మొదటిసారి జరిగింది మిత్రులారా. ఇక్కడ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకుందాం. అదేమిటంటే, మొదటి హత్య ఈ భూమండలం మీద కాబిల్ చేశాడు. ఆ తర్వాత ప్రపంచం నడుస్తూనే ఉంది, ప్రజలు పుడుతూనే పోతున్నారు. ప్రతి యుగములో కూడా కొంతమంది దుర్మార్గులు, కొంతమంది యువకుల ప్రాణాలు తీసేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ ప్రపంచంలో, భూమండలం మీద ఎక్కడ హత్య జరిగినా, హంతకునికి పాపం ఉంటుంది. దానితో పాటు, ఒక భాగము పాపమిది ఆ కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది. ఎందుకంటే ఆ పాపాన్ని ఈ భూమండలం మీద ప్రవేశపెట్టింది అతడే కాబట్టి.
మిత్రులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహూ మిస్లు అజ్రి ఫాయిలిహి,” ఎవరైనా ఒక మంచి మార్గం చూపిస్తే, ఆ మంచి మార్గంలో ఎంతమంది నడుచుకుంటారో, నడుచుకున్న వాళ్ళకి కూడా పుణ్యం ఉంటుంది, దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తూనే ఉంటాడు.
అలాగే, “వ మన్ దల్ల అలా ఇస్మిన్ ఫలహూ మిస్లు అజ్రి మా ఆసామా,” ఎవరైనా ఒక చెడ్డ దారి చూపిస్తే, ఆ చెడ్డ దారిలో ఎంతమంది నడుచుకుంటారో, ఆ చెడ్డ దారిలో నడుచుకొని ఎంతమంది పాపాలు మూటగట్టుకుంటారో, పాపం చేసిన వారికి కూడా పాపం ఉంటుంది, ఆ దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము పాపం దొరుకుతూనే ఉంటుంది అని చెప్పారు.
కాబట్టి, జాగ్రత్త పడాలి మిత్రులారా. మనం మన ఇరుపక్కల ఉన్న వారికి మంచి విషయాలు నేర్పిస్తున్నామా, మంచి దారి చూపిస్తున్నామా, లేదా మా తరఫు నుంచి ఇతరులకు మేము చెడ్డ అలవాట్లు నేర్పిస్తున్నామా అనేది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
సరే, ఇక్కడ కాబిల్, హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, మొదటిసారి ఒక వ్యక్తి ప్రాణము పోయింది, అక్కడ శవం మిగిలింది. ఆ శవాన్ని ఇప్పుడు ఏమి చేయాలి? ఇంతవరకు, ఒకరి మరణం కూడా సహజంగా సంభవించలేదు కాబట్టి, ఎవరికీ తెలియదు మరణించిన వ్యక్తికి ఏమి చేయాలి అనేది. అతనికి కూడా తోచలేదు ఏమి చేయాలి అనేది. అతను ఏం చేశాడు, తన తమ్ముని శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, అతనికి అర్థం కావటం లేదు.
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాకిని పంపించాడు. ఒక కాకి వచ్చింది. అది భూమి మీద దిగి కాళ్ళతో మట్టిని తవ్వ సాగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో, ఐదవ అధ్యాయం, 31వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేశాడు:
فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. (5:31)
ఒక కాకిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పంపాడు. అది నేల మీద దిగి త్రవ్వ సాగింది. తన తమ్ముని శవాన్ని ఎలా కప్పి పెట్టాలో అతనికి నేర్పించటానికి అని చెప్పబడింది మిత్రులారా. కొంతమంది ధార్మిక పండితులు ఈ వాక్యాన్ని వివరిస్తూ ఏమని చెప్పారంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రెండు కాకిల్ని పంపించాడు, ఆ రెండు కాకులు పరస్పరం గొడవ పడ్డాయి, ఒక కాకి మరొక కాకిని చంపేసింది. చనిపోయిన ఆ కాకిని, బతికి ఉన్న ఆ కాకి తన కాళ్ళతో మట్టి తవ్వి, ఆ కాకి మరణించిన కాకిని ఆ గుంతలోకి తోసేసి, దానిపైన మళ్ళీ మట్టి కప్పేసింది. ఇది అంతా ఆ కాబిల్ ముందరే జరిగింది. అది చూసి, కాబిల్ తల పట్టుకొని, “అయ్యో, ఈ కాకికి ఉన్నంత జ్ఞానము కూడా నాకు లేకపోయేనే, నా తమ్ముని శవాన్ని ఏమి చేయాలో నాకు అర్థం కాకపోయేనే” అని అతను, ఆ తర్వాత భూమిలో గుంత తవ్వి, తన తమ్ముని శవాన్ని భూమిలో కప్పేశాడు.
ఆ విధంగా మిత్రులారా, కాబిల్ తన తమ్ముడు హాబిల్ ని చంపి, హత్య చేసి, భూమిలో పాతిపెట్టేశాడు. నేరం జరిగింది కదా, తప్పు చేశాడు కదా! ఇక తల్లిదండ్రుల ముందర వెళ్లి, అక్క చెల్లెళ్ళ, తమ్ముళ్ళ ముందర తలెత్తుకొని తిరగగలడా? తిరగలేడు. కాబట్టి, అప్పుడు అతను ఏం చేశాడంటే, తల్లిదండ్రుల వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయి స్థిరపడిపోయారు. మిత్రులారా, అతను వెళ్లి దూరంగా స్థిరపడిపోయాడు. ఇన్ షా అల్లాహ్, ఆ తర్వాత ఏమి జరిగింది అన్న విషయం తర్వాత తెలుసుకుందాం.
ఆదం (అలైహిస్సలం) మరణం
ఇక్కడ ఉన్న మన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం మరియు వారి సంతానము అందరూ కలిసిమెలిసి నివసిస్తూ ఉన్నారు. ఆదం అలైహిస్సలాం వారి వయస్సు 940 సంవత్సరాలకు చేరింది. అప్పుడు దైవదూతలు మనిషి ఆకారంలో భూమి మీదకి దిగారు.
ఆ రోజు జరిగిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం తన బిడ్డల్ని పిలిచి, “బిడ్డలారా, నాకు కొన్ని పండ్లు తినాలని అనిపిస్తుంది, మీరు వెళ్లి కొన్ని పండ్లు తీసుకొని రండి” అంటే, బిడ్డలు తండ్రి కోసము పండ్లు తీసుకురావటానికి బయలుదేరారు. అంతలోనే అటువైపు నుంచి దైవదూతలు మనిషి ఆకారంలో, ఖనన వస్త్రాలు, శవ వస్త్రాలు తీసుకొని, అలాగే సువాసనలు తీసుకొని వస్తూ ఉన్నారు. వారికి ఎదుటపడి, “ఎక్కడికి మీరు వెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తే, “మా తండ్రి కోసము పళ్ళు ఫలాలు తీసుకురావడానికి వెళ్తున్నాము” అంటే, అప్పుడు దూతలు అన్నారు, “లేదండి, మీ తండ్రి వద్దకు వెళ్ళండి, మీ తండ్రి మరణ సమయము సమీపించింది” అని వారు పంపించేశారు.
ఆ తర్వాత దైవదూతలు, ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. “మీ సమయం ముగిసింది, మీ ఆయుష్షు పూర్తయ్యింది. ఇక పదండి, మీకు ఇప్పుడు మరణం సంభవిస్తుంది” అంటే, ఆదం అలైహిస్సలాం వారు అన్నారు, “అదేంటండి, నాకు 940 సంవత్సరాలే కదా, ఇంకా 60 సంవత్సరాలు నా ఆయుష్షు మిగిలి ఉంది కదా! అప్పుడే మీరు వచ్చేసారు ఏమిటి?” అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు దైవదూతలు ఆయనకు జరిగిన సంఘటన తెలిపారు, “ప్రారంభంలో, మీ ఒక బిడ్డ ఆయుష్షు 40 సంవత్సరాలే అని మీకు తెలిసినప్పుడు, మీరు మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు అతని ఆయుష్షులో కలపండి అని చెప్పారు కదా! కాబట్టి మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు తీసి అతనికి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మీ ఆయుష్షు 940 సంవత్సరాలే, అది పూర్తి అయిపోయింది” అని చెప్పారు. మిత్రులారా, ఈ విషయం చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఆది మానవుడు కూడా మరిచిపోయాడు, మనుష్యుల్లో కూడా మరిచిపోవటం అనేది ఒక సహజ లక్షణం” అన్నారు.
ఆ తర్వాత మిత్రులారా, దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారి ప్రాణము తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, హవ్వా అలైహస్సలాం ఏడవడం ప్రారంభించారు. హవ్వా అలైహస్సలాం ఏడుస్తూ ఉంటే, ఆది మానవుడు ఆమెకు చెప్పారు, “లేదు, నాకు దూతలతో పాటు వదిలేయండి” అని చెప్పేశారు. ఆ తర్వాత దైవదూతలు ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత, దైవదూతలే ఆదం అలైహిస్సలాం వారికి స్నానము చేయించారు, శవ వస్త్రాలు తొడిగించారు, సువాసనలు పూశారు, భూమి తవ్వి, ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అక్కడ ఖనన సంస్కారాలు చేయించి, “మానవులారా, మీలో ఎవరైనా మరణిస్తే, ఇదే విధంగా మీరు ఖనన సంస్కారాలు చేసుకోవాలి” అని దైవదూతలు అక్కడ ఉన్న ఆదం అలైహిస్సలాం వారి సంతానానికి నేర్పించి వెళ్లిపోయారు.
మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర పూర్తయింది. ఆ తర్వాత విషయాలు వచ్చే ఎపిసోడ్లలో ఇన్ షా అల్లాహ్ ఆ భాగాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ దైవ ప్రవక్తల జీవితాలను తెలుసుకొని, మన భక్తిని పెంచుకొని, దైవ విధేయులుగా, భక్తులుగా జీవించే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఈ ప్రసంగంలో, ఆదం (అలైహిస్సలం) జీవిత చరిత్ర నుండి నేర్చుకోవలసిన పాఠాలు వివరించబడ్డాయి. మొదటిది, మానవుని సృష్టి – అల్లాహ్ తన స్వహస్తాలతో, తన ఆత్మను ఊది, జ్ఞానాన్ని ప్రసాదించి మానవుడిని సృష్టించాడు, ఇది ఇతర సృష్టితాలపై మానవుని ఆధిక్యతను సూచిస్తుంది. రెండవది, అహంకారం యొక్క పరిణామం – షైతాన్ తన అహంకారం కారణంగా శపించబడి స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడు. అహంకారం సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటమేనని, ఇది వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించబడింది. మూడవది, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు అని, అతను ఎల్లప్పుడూ చెడు మరియు నీతిబాహ్యత వైపు ప్రేరేపిస్తాడని, అతని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. నాలుగవది, అల్లాహ్ దయ మరియు క్షమాపణ – ఆదం (అలైహిస్సలం) తప్పు చేసి పశ్చాత్తాపపడగా, అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ నిరంతరం క్షమాపణను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడని, కాబట్టి మనం ఎల్లప్పుడూ పశ్చాత్తాపపడాలని బోధించబడింది. చివరిగా, మొదటి నేరమైన హత్య గురించి చర్చిస్తూ, ఒక చెడు మార్గాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఆ మార్గాన్ని అనుసరించేవారి పాపంలో కూడా భాగస్వామి అవుతాడని, కాబట్టి చెడుకు దూరంగా ఉండాలని నొక్కి చెప్పబడింది.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, “ఆదం అలైహిస్సలాం జీవిత పాఠాలు” అనే నేటి ప్రసంగ అంశానికి మిమ్మల్నందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర చదివి లేక విని మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.
మొదటి పాఠం: మానవుని పుట్టుక
ముందుగా మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మానవుని పుట్టుక ఎలా జరిగింది? నేడు ప్రపంచంలో మానవుడు కోతి జాతి నుండి అభివృద్ధి చెందిన జీవి అని ప్రచారం చేయబడి ఉంది. మరికొందరైతే సముద్రం నుండి బయటకు వచ్చిన ఒక జీవి క్రమంగా అభివృద్ధి చెందుతూ మానవునిగా రూపం దాల్చింది అని ప్రచారం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మానవుని పుట్టుక గురించి ప్రచారాలు ప్రపంచంలో జరిగి ఉన్నాయి. అయితే అభిమాన సోదరులారా, వాస్తవం ఏమిటంటే, ఇవన్నీ కేవలం మానవుని ఊహా కల్పితాలు మాత్రమే. మనిషి పుట్టుక ఎలా జరిగింది అనేది మనిషిని మరియు మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఏమి చెబుతున్నాడో తెలుసుకుంటే, మనిషి పుట్టుక ఎలా జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా యొక్క నైజం ఏమిటంటే, ఆయన ఏదైనా ఒక వస్తువుని తయారు చేయదలిస్తే, కేవలం అతను నోటితో “కున్” అనగా “అయిపో” అని చెప్పగానే అది అయిపోతుంది. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో 36వ అధ్యాయం, 82వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు.
إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయిపోతుంది. (36:82)
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించాడు. మానవుడిని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కేవలం నోటితో “కున్ (అయిపో)” అని చెప్పేస్తే మానవుడు కూడా సృష్టించబడేవాడే. కానీ అలా చేయలేదండి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించటానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, భూమండలం మీద ఉన్న రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో మానవ ఆకారాన్ని రూపుదిద్దాడు.
మిత్రులారా, ఖుర్ఆన్ లోని 38వ అధ్యాయం 75వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
خَلَقْتُ بِيَدَيَّ నేను నా స్వహస్తాలతోసృష్టించాను. (38:75)
అలాగే మరోచోట 15వ అధ్యాయం, 29వ వాక్యంలో తెలియజేశాడు:
وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي నేను మానవునిలో నా ఆత్మను ఊదాను. (15:29)
అలాగే మరొకచోట మానవుని గురించి రెండవ అధ్యాయం 31వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:
وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ఆది మానవుడైన ఆదంకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వస్తువులన్నింటి పేర్లు నేర్పాడు. విద్యాబోధన స్వయంగా అల్లాహ్ చేశాడు. (2:31)
ఏ మానవునికైతే అల్లాహ్ తన స్వహస్తాలతో సృష్టించాడో, తన ఆత్మను ఊదాడో, తానే స్వయంగా విద్యాబోధన చేశాడో, అలాంటి మానవుడిని పట్టుకొని, కోతితో అభివృద్ధి చెందిన జీవి అని చెప్పటము లేదా సముద్రం నుంచి బయటికి వచ్చిన జీవి అని చెప్పటము, ముమ్మాటికీ ఇది మానవజాతిని కించపరచటమే సోదరులారా. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో మానవుడిని ఉత్తమ జీవిగా, శ్రేష్టమైన జీవిగా చేశాడు.
ఒక ఆది మానవుడే కాదు, ఆ ఆది మానవుడి సంతానమైన మానవులందరికీ కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇతర జాతుల మీద గౌరవ స్థానం కల్పించాడండి. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లోని 17వ అధ్యాయం 70వ వాక్యంలో తెలియజేశాడు:
وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى كَثِيرٍ مِمَّنْ خَلَقْنَا تَفْضِيلًا మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. (17:70)
ఇది చివర్లో చెప్పిన మాట ఒకసారి మనము దయచేసి జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. అంటే, ప్రపంచంలో అల్లాహ్ చే సృష్టించబడిన సృష్టితాలన్నింటి మీద మానవజాతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆధిక్యతను, గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి, మనిషి ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో శ్రేష్టమైన జీవి మరియు అతని పుట్టుక మట్టితో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవ రూపంలోనే తన స్వహస్తాలతో చేశాడన్న విషయం మనము గమనించాలి మిత్రులారా.
రెండవ పాఠం: అహంకార పరిణామం
అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం తెలుసుకోవలసిన రెండవ విషయం, అహంకార పరిణామం ఎలా ఉంటుంది?
మిత్రులారా, అహంకారం అల్లాహ్ కు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఇష్టపడడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడండి అని ఆదేశించాడో, అల్లాహ్ ఆదేశాన్ని షైతాన్ శిరసావహించలేదు. ఏమిటయ్యా ఎందుకు నీవు సాష్టాంగపడలేదు అంటే, అతనేమో “నన్ను అగ్నితో సృష్టించావు, మానవుడిని మట్టితో సృష్టించావు, నేను ఉత్తముణ్ణి” అని చెప్పాడు. అంటే, లోలోపల అతను అహంకారానికి గురి అయ్యి, “నేను అగ్నితో తయారు చేయబడిన వ్యక్తిని, గొప్పవాడిని, మానవుడు మట్టితో తయారు చేయబడ్డవాడు అల్పుడు,” అని లోలోపల అహంకారానికి గురి అయ్యి అతను ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడలేదు.
తత్కారణంగా జరిగిన విషయం ఏమిటి? అహంకారం ప్రదర్శించిన కారణంగా అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడు. అల్లాహ్ అతనికి ఎంతో గౌరవంగా స్వర్గంలో ప్రసాదించి ఉన్న గౌరవ స్థానాన్ని కోల్పోయాడు. స్వర్గం నుండి ధూత్కరించబడ్డాడు, బహిష్కరించబడ్డాడు. అంటే, అహంకారం వలన మనిషి తన గౌరవ స్థానాలను కోల్పోతాడు, దైవ శిక్షకు గురవుతాడని స్పష్టమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియజేశారు:
మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం మరియు నరకం గురించి తెలియజేస్తున్నారు. స్వర్గము మరియు నరకం పరస్పరము సంభాషణ చేసుకుంటాయి. స్వర్గంలో ఉన్నవారు ఎవరు, నరకంలో ఉన్నవారు ఎవరు అని పరస్పరము మాట్లాడుకుంటే, అప్పుడు నరకము స్వర్గముతో ఇలా అంటుంది:
فَقَالَتِ النَّارُ فِيَّ الْجَبَّارُونَ وَالْمُتَكَبِّرُونَ [ఫకాలతిన్నారు ఫియ్యల్ జబ్బారూన వల్ ముతకబ్బిరూన] నరకం స్వర్గంతో అంటుంది, “నా లోపల అందరూ దౌర్జన్యపరులు మరియు అహంకారులు ఉన్నారండి” అని చెబుతుంది.
అంటే మిత్రులారా, నరకంలో వెళ్ళేవాళ్ళలో అధిక శాతం ప్రజలు ఎవరు ఉంటారంటే, దౌర్జన్యపరులు ఉంటారు మరియు అహంకారులు ఉంటారు. అంటే, అహంకారి నరకానికి వెళ్తాడు, స్వర్గాన్ని కోల్పోతాడని స్పష్టమవుతుంది.
ఈ ఉల్లేఖనాలు విన్న తర్వాత కొంతమందికి ఒక అనుమానం కలుగుతుంది. అదేమిటంటే, ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రసాదించిన మంచి బట్టలు ధరించటం, మంచి పాదరక్షలు ధరించటం, ఇవి కూడా అహంకారానికి చిహ్నమేనా అని అనుమానం కలిగి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక వ్యక్తి అడిగాడు. ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు:
إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَنًا وَنَعْلُهُ حَسَنَةً ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మనిషి తన బట్టలు మంచివి ఉండాలని, తన పాదరక్షలు కూడా మంచివి ఉండాలని కోరుకుంటాడు. అలా మంచి బట్టలు, మంచి పాదరక్షలు ధరించడము కూడా అహంకారమేనా? అని అడిగితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదులిచ్చారు:
إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అత్యంత సుందరుడు. సుందరమైన వాటిని ఇష్టపడతాడు.
ప్రజల్ని చిన్నచూపుతో చూసే భావం మరియు సత్యాన్ని అంగీకరించకుండా తిరస్కరించే భావాన్ని అహంకారం అంటారు అని చెప్పారు.
మిత్రులారా, పరిశుభ్రంగా ఉంచటం, మంచి బట్టలు ధరించటం, పరిశుద్ధంగా ఉండటం అహంకారము కాదు. కానీ ఒకవేళ బట్టల నుండే, వస్త్రాల నుండే ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే, అది కూడా అహంకారం అనబడుతుంది. ఉదాహరణకు, ముఖ్యంగా పురుషుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా పురుషుడు చీలమండల కింద భూమికి ఆనుతూ బట్టలు ధరించి, గర్వంగా అతను నడిస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని కూడా ఎంత భాగమైతే అతను చీలమండల కిందికి వదిలాడో బట్టల్ని, అంత భాగాన్ని నరకంలో కాల్చుతాడు అని చెప్పారు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పూర్వం ఒక వ్యక్తి తన బట్టల్ను భూమిపై ఈడ్చుకుంటూ గర్వంతో, అహంకారంతో ప్రజల మధ్య నడుస్తూ ఉంటే, అందరూ చూస్తూ ఉండంగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అలాగే భూమిలోకి పాతేశాడు. అల్లాహు అక్బర్. ఈ ఉల్లేఖనాలన్నింటినీ, షైతాను మరియు ఆదం అలైహిస్సలాం వారి వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, అహంకారము మానవునికి ఎట్టి పరిస్థితుల్లో తగదు. అహంకారం వల్ల మనిషి తన గౌరవ స్థానాన్ని, అల్లాహ్ అనుగ్రహాలను కోల్పోతాడు, నరకవాసి అయిపోతాడు. కాబట్టి, అహంకారం నుండి దూరంగా ఉండాలి.
మూడవ పాఠం: షైతాన్ మానవుని శత్రువు
అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక విషయం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో తప్పు చేసిన తర్వాత క్షమించమని వేడుకున్నారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయ తలచి ఆదం అలైహిస్సలాం వారి తప్పుని మన్నించేశాడు. ఆ విషయాలన్నీ మనము ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుసుకున్నాం.
అయితే, షైతాన్ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో సవాలు చేశాడు. నేను మళ్ళీ వెళ్లి మానవుని దారిలో కూర్చుండిపోయి, నలువైపుల నుండి అతన్ని నీ మార్గం మీద నడవకుండా పక్కకి దారి తప్పేటట్టు చేసేస్తాను అని సవాలు విసిరి వచ్చాడు. మిత్రులారా, అతను సవాలు విసిరి వస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించాడు. ఏమన్నాడు?
وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. [2:168]
మానవులారా, మీరు షైతాను అడుగుజాడలలో నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు అని చెప్పారు. మిత్రులారా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు. అతను మానవునికి ఏమంటాడు, ఏ పనులు చేయమంటాడు, అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో తెలియజేశాడు. ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం, 169వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:
إِنَّمَا يَأْمُرُكُمْ بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. (2:169)
అనగా, కేవలం చెడు వైపుకు, నీతిబాహ్యత వైపుకు పురికొల్పుతాడు ఆ షైతాన్. కాబట్టి, మీరు జాగ్రత్తపడండి. ఎందుకంటే, అతను మీకు తెలియని వాటిని అల్లాహ్ పేరుతో చెప్పండి అని ఆజ్ఞాపిస్తాడు. నీతిబాహ్యమైన పనులు చేయమని, తెలియని విషయాలు అల్లాహ్ చెప్పాడు అని చెప్పమని అతను ఆజ్ఞాపిస్తాడు కాబట్టి, షైతాను మాటల్లో పడకుండా జాగ్రత్త పడండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించి ఉన్నాడు.
మిత్రులారా, షైతాన్ ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారిని తప్పు చేయించి స్వర్గం నుండి బహిష్కరణకు గురయ్యేటట్టు చేశాడు. మన నుండి కూడా తప్పులు చేయించి, మనల్ని కూడా స్వర్గానికి చేరకుండా నరకానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు కాబట్టి, షైతాన్ మన శత్రువు అన్న విషయము తెలుసుకొని, మనసులో అతను కలిగించే ఆలోచనలకు మనము గురికాకుండా జాగ్రత్త పడాలి.
నాల్గవ పాఠం: అల్లాహ్ దయ, క్షమాపణ
అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయామయుడు. ఆయన ఎంత గొప్ప దయ కలిగినవాడంటే మిత్రులారా, మనిషి వల్ల తప్పు దొర్లితే, తప్పు దొర్లిన తర్వాత మానవుడు అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటే, పశ్చాత్తాపపడితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన దయతో మనిషి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, అతని పాపాన్ని తుడిచేస్తాడు, మన్నించేస్తాడు, క్షమించేస్తాడు.
మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారు కూడా షైతాను మాటల్లో పడి, అతను చెప్పిన మాటల్ని నమ్మి, నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పెట్టిన నిబంధనను అతిక్రమించారు కాబట్టి, ఆయనతో కూడా పొరపాటు జరిగింది. ఆయనతో పొరపాటు దొర్లిన తర్వాత, ఆయన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో క్షమాభిక్ష వేడుకున్నారు. ఆయన క్షమాభిక్ష వేడుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ రెండు విషయాలు కూడా ఖుర్ఆన్ లో తెలుపబడి ఉన్నాయి. ఖుర్ఆన్ లోని ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో, ఏ పలుకులు తీసుకొని ఆదం అలైహిస్సలాం అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకున్నారని తెలుపబడింది:
رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు. (7:23)
ఈ పలుకులతో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో క్షమాభిక్ష వేడుకోగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని మన్నించేశాడు. మన్నించేశాడన్న విషయం కూడా తెలియజేసి ఉన్నాడు, రెండవ అధ్యాయం, 37వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
فَتَابَ عَلَيْهِ ఆదం అలైహిస్సలాం క్షమాభిక్ష వేడుకుంటే, “ఫతాబ అలైహి“, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన తోబాను, పశ్చాత్తాపాన్ని ఆమోదించి, ఆయనను క్షమించేశాడు.
మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడింది:
అనగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రాత్రంతా చేయి చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అండి? ఉదయం పూట తప్పు చేసిన వారు రాత్రి తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో, వారిని మన్నించేద్దాము అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే, పగలంతా కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే, రాత్రి పూట తప్పులు చేసిన వారు బహుశా ఉదయాన్నే తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని క్షమించటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, సూర్యుడు పడమర దిక్కు నుంచి ఉదయించే రోజు వచ్చేంతవరకు కూడా ఇదే విధంగా భక్తుల పాపాలను మన్నించటానికి రేయింబవళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అల్లాహు అక్బర్. ఎంత దయామయుడండి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! మన్నించటానికి, క్షమించటానికి రేయింబవళ్ళు ఆయన ఎదురు చూస్తూ ఉంటే, తప్పులు చేసే మనము అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోవటానికి ఆలస్యం ఎందుకు చేయాలి మిత్రులారా? వెంటనే మనము కూడా అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటూ ప్రతిరోజు గడపాలి. ఎందుకంటే, మనం ప్రతిరోజు తప్పులు దొర్లుతూనే ఉంటాయి కాబట్టి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉల్లేఖనంలో ఇలా తెలుపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతున్నారు:
يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللَّهِ فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ ఓ మానవులారా, మీరు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాప పడండి. నేను కూడా ప్రతిరోజు అల్లాహ్ సమక్షంలో 100 సార్లు పశ్చాత్తాప పడతాను అని చెప్పారు.
అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పులు చేయరండి ఆయన. తప్పులు చేయకపోయినా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో ఆయన 100 సార్లు క్షమాభిక్ష వేడుకుంటున్నారు ప్రతిరోజు అంటే, అడుగడుగునా తప్పులు చేసే మనము అల్లాహ్ తో ఎన్ని సార్లు క్షమాభిక్ష వేడుకోవాలి, పశ్చాత్తాప పడాలి, గమనించండి మిత్రులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేశారు, ఆయన ఏమన్నారంటే:
كُلُّ بَنِي آدَمَ خَطَّاءٌ وَخَيْرُ الْخَطَّائِينَ التَّوَّابُونَ ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. అయితే తప్పు చేసిన వాళ్ళలో క్షమాభిక్ష వేడుకున్నవాడు ఉత్తముడు అని చెప్పారు.
కాబట్టి మిత్రులారా, నాతో, మనందరితో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. అయితే మన బాధ్యత ఏమిటంటే, మనము వెంటనే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకోవాలి. ఆది మానవునితో కూడా తప్పు జరిగింది, ఆయన కూడా క్షమాభిక్ష వేడుకున్నారు. ఆదిమానవుని సంతానమైన మనతో కూడా తప్పులు దొర్లుతాయి, మనము కూడా క్షమాభిక్ష వేడుకుంటూనే ఉండాలి.
ఐదవ పాఠం: మొదటి నేరం, దాని పరిణామం
ఇక ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటి నేరం ఎవరు చేశారు? మొదటి నేరం చేసిన కారణంగా, దాని దుష్ప్రభావం అతనిపై ఎలా పడుతూ ఉంది?
మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబిల్ మరియు కాబిల్ మధ్య వివాహ విషయంలో గొడవ జరిగింది. అయితే, కాబిల్ అన్యాయంగా, దౌర్జన్యంగా, మొండిపట్టు పట్టి, చివరికి తన సోదరుడైన హాబిల్ ని హతమార్చేశాడు.
మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
لَا تُقْتَلُ نَفْسٌ ظُلْمًا إِلَّا كَانَ عَلَى ابْنِ آدَمَ الْأَوَّلِ كِفْلٌ مِنْ دَمِهَا لِأَنَّهُ كَانَ أَوَّلَ مَنْ سَنَّ الْقَتْلَ ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఎక్కడైనా అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయబడింది, హత్య చేయబడింది అంటే, ఆ హత్య యొక్క పాపములోని ఒక భాగము కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది.
ఎందుకంటే, ప్రపంచంలో హత్య అనే ఒక నేరాన్ని ప్రారంభించి మానవులకు అతనే చూపించాడు కాబట్టి, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అయితే హత్యలు జరుగుతాయో, హత్య చేసిన వారికి కూడా పాపము ఉంటుంది, ఆ హత్య ప్రపంచానికి నేర్పించిన కాబిల్ కి కూడా ఆ నేరములోని పాప భాగము చేరుతుంది అని చెప్పారు.
మిత్రులారా, అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హెచ్చరించారు:
وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا అనగా, ఎవరైనా ఒక వ్యక్తి ప్రజలను మార్గభ్రష్టత్వానికి గురిచేసే ఏదైనా ఒక కార్యం నేర్పిస్తే, ఆ మార్గంలో ఎంతమంది అయితే నడుచుకొని పాపానికి పాల్పడతారో, వారికి కూడా పాపము ఉంటుంది, ఆ మార్గము చూపించిన వ్యక్తికి కూడా ఆ పాపము యొక్క భాగము చేరుతుంది అని చెప్పారు.
మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనము అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మనము ఒక్కొక్కటిగా నేర్చుకొని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో భయపడుతూ, పశ్చాత్తాపపడుతూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.