హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.
మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.
{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ} (అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]
అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).
ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.
ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:
అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.
కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.
దీనినే ఇలా కూడా అంటారు: “కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”
అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ» (మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]
ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?
అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:
{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا} (నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]
మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:
{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ} (మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]
ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.
పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.
పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.
{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ} (మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]
అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:
ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا} (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ} (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]
ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.
వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలో ఆరవది మరియు అత్యంత ముఖ్యమైనదైన విధివ్రాత (ఖద్ర్) పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. విధివ్రాతను అర్థం చేసుకోవడానికి నాలుగు ముఖ్యమైన విషయాలు చర్చించబడ్డాయి: అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది, ప్రతిదీ ‘లౌహె మెహఫూజ్’లో వ్రాయబడి ఉంది, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది, మరియు ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు అని నమ్మడం. మానవునికి మంచి చెడులను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడిందని, దాని ఆధారంగానే తీర్పు ఉంటుందని కూడా స్పష్టం చేయబడింది. చివరగా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు—అసూయ నుండి రక్షణ, ధైర్యం కలగడం, మరియు మనశ్శాంతి, సంతృప్తి లభించడం—వివరించబడ్డాయి.
అల్ హమ్దు లిల్లాహి వహదా, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈమాన్ బిల్ ఖద్ర్ – విధివ్రాత పట్ల విశ్వాసం
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు. అందులోని ఆరవ ముఖ్యాంశం. ఈమాన్ బిల్ ఖద్ర్, విధి వ్రాత పట్ల విశ్వాసం. దీని గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
ఒకసారి ఆ హదీసును మరొకసారి మనం విందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తూ,
أَنْ تُؤْمِنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ [అన్ తు’మిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వ తు’మిన బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]
అని సమాధానం ఇచ్చారు. దీని అర్థం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్, విశ్వాసం అంటే ఆరు విషయాల గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నారు? అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. ఈ ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటాన్ని ఈమాన్ అంటారు, విశ్వాసం అంటారు అని ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆరవ విషయం గురించి ఆలోచించారా, గమనించారా? ఆరవ విషయం ఏమిటి?
اَلْإِيمَانُ بِالْقَدَرِ خَيْرِهِ وَ شَرِّهِ [అల్ ఈమాను బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]
మంచి చెడు విధి వ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. విశ్వాస ముఖ్యాంశాలలో ఈ ఆరవ ముఖ్యాంశం, విధివ్రాత పట్ల విశ్వాసం, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం.
విధివ్రాతను అర్థం చేసుకోవడానికి నాలుగు విషయాలు
మిత్రులారా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి, ఒక క్లారిటీకి, ఒక అవగాహనకు రావటానికి నాలుగు విషయాలు తెలుసుకొని నమ్మితే ఆ వ్యక్తి విధివ్రాత పట్ల ఒక అవగాహనకు వస్తాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ నాలుగు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది అని నమ్మాలి ప్రతి వ్యక్తి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు పూర్వం జరిగినది తెలుసు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ప్రస్తుతం జరుగుచున్నది కూడా తెలుసు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసు. దీనికి ఆధారం మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథము, తొమ్మిదవ అధ్యాయము, 115వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అంటే, నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతీదీ తెలుసు. జరిగిపోయినది తెలుసు, జరుగుచున్నది తెలుసు, జరగబోయేది కూడా అల్లాహ్‌కు తెలుసు. ఆయన మొత్తం జ్ఞానం కలిగి ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు అని మనము ఈ విషయాన్ని నమ్మాలి. ఇది మొదటి విషయం అండి.
ఇక రెండో విషయం ఏమిటి? సృష్టికి సంబంధించిన ప్రతి దాని అదృష్టాన్ని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. ఎక్కడ వ్రాసి పెట్టాడు? లౌహె మెహఫూజ్ అనే ఒక పవిత్రమైన, పటిష్టమైన గ్రంథము ఉంది. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దివ్య దృష్టితో భవిష్యత్తులో ఏమి జరగబోవుచున్నది అనేది మొత్తము చూసేసి, వ్రాయించేసి ఉన్నాడు. దానిని లౌహె మెహఫూజ్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వ్రాసి ఉంచాడు అన్న విషయాన్ని మనము నమ్మాలి. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథము 36వ అధ్యాయము, 12వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
అంటే, ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. అదే లౌహె మెహఫూజ్, అది స్పష్టమైన గ్రంథము. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జరగబోయేది అంతా ముందే చూసి వ్రాయించి భద్రంగా ఉంచి ఉన్నాడు. ఈ విషయం కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.
ఇక మూడో విషయం ఏమిటి అంటే, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది. ఈ సృష్టి మొత్తంలో ఎక్కడైనా సరే, అల్లాహ్ ఎలా తలుస్తాడో అలాగే జరుగుతుంది. ఎక్కడ వర్షాలు కురవాలి, ఎక్కడ ఎండ పడాలి, ఎక్కడ చలి వీయాలి, ఎక్కడ గాలులు వీయాలి, ఎక్కడ పంటలు పండాలి, ఇదంతా అల్లాహ్ తలచినట్లే జరుగుతుందండి, మీరు మేము అనుకున్నట్లు జరగదు. ఎక్కడైనా సరే ఏదైనా సంభవించాలి అంటే అది అల్లాహ్ తలచినట్టుగానే సంభవిస్తుంది, జరుగుతుంది. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథం 81వ అధ్యాయం, 29వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అంటే, సర్వలోక ప్రభువైన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు. మీరు కోరుకున్నట్లు ఎక్కడా ఏమీ జరగదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచినట్లే జరుగుతుంది అన్న విషయము ఈ వాక్యంలో అల్లాహ్ తెలియపరిచి ఉన్నాడు. అది కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.
ఇక నాలుగో విషయం, అదేమిటంటే, విశ్వంలో ఉన్న వాటన్నింటినీ సృష్టించినవాడు, సృష్టికర్త ఒక్కడే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని తెలుసుకొని మనము గట్టిగా నమ్మాలి. ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో, అవన్నీ సృష్టించబడి ఉన్నవి. ఒక అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే సృష్టికర్త. సృష్టికర్త ఆయన అల్లాహ్. ఆయన తప్ప ఈ సృష్టిలో ఉన్నది మొత్తము కూడా సృష్టించబడినది. సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అన్న విషయము ప్రతి వ్యక్తి నమ్మాలి. మరి దానికి ఆధారం ఏమిటి అని మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం, 25వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అంటే, ఆయన ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. అంటే ఈ సృష్టిలో ఉన్న మొత్తాన్ని సృష్టించినవాడు, దాని లెక్కను నిర్ధారించినవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే. ఆ విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి తెలుసుకొని గట్టిగా నమ్మాలి.
ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మనిషి బాగా అర్థం చేసుకొని నమ్ముతాడో అప్పుడు విధివ్రాత పట్ల అతనికి ఒక అవగాహన వచ్చేస్తుంది.
మానవునికి ఎన్నుకునే అధికారం
అలాగే విధివ్రాతల పట్ల మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారము ఇచ్చి ఉన్నాడు. అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి మంచి చెడుల మధ్య వ్యత్యాసము గ్రహించే అధికారం ఇచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది గ్రహించే శక్తి మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చి ఉన్నాడు. అలాగే, మంచి చెడు అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత, మంచిని ఎన్నుకోవాలా చెడుని ఎన్నుకోవాలా ఎన్నుకునే అధికారము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి ఇచ్చి ఉన్నాడు. మానవుడు తలిస్తే, మంచి చెడు అనేది తెలుసుకున్న తర్వాత, అతను మంచిని కూడా ఎన్నుకొని మంచివాడు కావచ్చు. అలాగే చెడ్డను, చెడును ఎంచుకొని అతను చెడ్డవాడుగా కూడా అయిపోవచ్చు. ఆ ఎన్నుకునే అధికారము మానవునికి ఇవ్వబడి ఉంది.
చూడండి, ఖురాన్ గ్రంథంలో, 76వ అధ్యాయం, మూడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:
అంటే, మేమతడికి మార్గం కూడా చూపాము, ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతఘ్నతకు పాల్పడినా వాడి ఇష్టం, మేము వాడి స్వేచ్ఛను హరించలేదు అని తెలుపబడి ఉంది. అల్లాహు అక్బర్! అంటే, మంచి చెడు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి చూపించేశాడు. ఇక ఎన్నుకునే అధికారం అతనికి ఉంది కాబట్టి, అతను మంచిని ఎన్నుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లుస్తూ మంచివాడిగా ఉండిపోతాడో, లేదా చెడును ఎన్నుకొని అల్లాహ్‌కు కృతఘ్నుడైపోయి మార్గభ్రష్టుడైపోతాడో, అతని స్వేచ్ఛలోకి, అతనికి మనము వదిలేశామని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారం ఇచ్చి ఉన్నాడు, మంచిని ఎన్నుకునే బాధ్యత మనది, చెడు నుంచి దూరంగా ఉండే బాధ్యత మనది.
విధివ్రాత పట్ల విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇక చివర్లో, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఫలితం ఏమి దక్కుతుంది మానవునికి అనేది తెలుసుకొని ఇన్షా అల్లాహ్ మాటను ముగిద్దాం. విధివ్రాతను నమ్మితే మనిషికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందులోని మూడు ముఖ్యమైన ప్రయోజనాలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను, చూడండి.
మొదటి ప్రయోజనం ఏమిటంటే, మనిషి అసూయ నుండి రక్షించబడతాడు. ఎవరికైనా దైవానుగ్రహాలు దక్కాయి అంటే, వారికి అల్లాహ్ ఇచ్చాడులే అని మానవుడు సంతృప్తి పడతాడు. అసూయ పడితే అల్లాహ్ నిర్ణయానికి ఎదురెళ్లడం అవుతుంది అని అతను భయపడతాడు. మానవులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొందరికి బాగా ఇస్తాడు కదా, మరి కొందరికి ఇవ్వకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడతాడు కదా. విధివ్రాతను నమ్మిన వ్యక్తి, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచి వారికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చాడు, అది అల్లాహ్ చిత్తం ప్రకారం జరిగిందిలే అని, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి ఇతను అసూయ పడడు. అల్లాహ్ వారికి ఇచ్చాడులే అని, వారి మీద అసూయ పడడు. ఒకవేళ నేను వారి మీద అసూయ పడితే, వారికి ఇవ్వబడిన అనుగ్రహాలు చూసి నేను లోలోపల కుళ్ళిపోతే, దైవ నిర్ణయానికి నేను ఎదురెళ్లిన వాడిని అవుతానేమోనని అతను భయపడతాడు, అసూయ పడడు. ఇది మొదటి ప్రయోజనం.
రెండో ప్రయోజనం ఏమిటి? మనిషికి ధైర్యం వస్తుంది. విధివ్రాతను నమ్మితే, విధివ్రాతను విశ్వసిస్తే మనిషికి ధైర్యం వస్తుంది. అది ఎట్లాగంటే, ఏదైనా అల్లాహ్ తలిస్తేనే జరుగుతుంది, లేదంటే జరగదు అని అతను బాగా నమ్ముతాడు కాబట్టి, ఏదైనా విషయం కొనాలి అన్నా, ఏదైనా పని ప్రారంభించాలి అన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా అతను అటూ ఇటూ చేసి లేదా ఏమేమో ప్రపంచంలో జరుగుతున్న వార్తలు చూసి భయపడడు. అల్లాహ్ ఎలా తలిస్తే అలా జరుగుతుందిలే అని నమ్మకంతో, ధైర్యంతో ముందడుగు వేస్తాడు. కాబట్టి, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండితే మనిషికి ధైర్యము వస్తుంది, ఆ ధైర్యంతో అతను ముందడుగు వేస్తాడు. ఇది రెండవ ప్రయోజనం.
ఇక మూడవ ప్రయోజనం మనం చూచినట్లయితే, మనిషికి మనశ్శాంతి, సంతృప్తి చెందే గుణం వస్తుంది. మన కోసం అల్లాహ్ నిర్ణయించినది మనకు దొరికింది, ఏదైనా మనకు దొరకలేదు అంటే అది అల్లాహ్ నిర్ణయం ప్రకారమే జరిగింది. కాబట్టి, నేను ఎందుకు తొందరపడాలి, లేదంటే నాకు దక్కలేదు అని నేను ఎందుకు బెంగపడాలి? ఆ విధంగా అతను తెలుసుకొని, నాకు దక్కిన కాడికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయం ప్రకారమే దక్కిందిలే అని అతను సంతృప్తి పడతాడు, దిగులు పడకుండా అతను మనశ్శాంతిగా జీవిస్తాడు మిత్రులారా.
ఇవి విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండే వారికి లభించే ప్రయోజనాలలో మూడు ముఖ్యమైన ప్రయోజనాలు. విధివ్రాత పట్ల ఈ కొన్ని విషయాలు మనము తెలుసుకొని నమ్ముదాం.
నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవితాంతము జీవించే భాగ్యము ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net