ఖుత్బా యొక్క ముఖ్యాంశాలు:
1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్
4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)
ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ
“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)
అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.
ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?
దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)
ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.
ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.
దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.
ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)
అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.
Read More “రజబ్ మాసపు క్రొత్త పోకడ (బిద్అత్)లు – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]”