ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.
1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-
జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు. [బుఖారీ]
[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]
ముఖ్యాంశాలు :
జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.