ఫాతిహా అంటే ఏమిటి?ఎలా చేయాలి?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=yMaP0GqHX7U [9 నిముషాలు]
ఈ ప్రసంగంలో సూరత్ అల్-ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఉపయోగించాల్సిన సరైన పద్ధతుల గురించి వివరించబడింది. సూరత్ అల్-ఫాతిహా ఖురాన్లోని మొట్టమొదటి సూరా అని, దీనిని నమాజులోని ప్రతి రకాత్లో తప్పనిసరిగా పఠించాలని వివరించారు. అంతేకాకుండా, ఆరోగ్యం కోసం (రుఖ్యా) దీనిని పఠించడం సున్నత్ అని, దీనికి సహీహ్ బుఖారీలో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే, సమాజంలో వ్యాపించి ఉన్న బిద్అత్ ఆచారాలు, అంటే వంటకాలపై ఫాతిహా చదవడం, మీలాద్లు, ఉర్సులు, మరియు ఇతర పండుగల పేరుతో చేసే ఆచారాలను ఖండించారు. పుణ్యపురుషుల పేరుతో చేసే ఇటువంటి పనులు షిర్క్ మరియు బిద్అత్ అని, అల్లాహ్ యే సర్వశక్తుడని, ఆయననే వేడుకోవాలని ప్రబోధించారు. చివరిగా, బిద్అత్ లేదా షిర్క్ ఆచారాలలో భాగంగా చేసిన ఆహారాన్ని తినకూడదని హెచ్చరిస్తూ, సన్మార్గంలో నడవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్ హమ్దులిల్లాహ్! ఫాతిహా గురించి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇక్కడ వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారు అని మరియు ఖురాన్ హదీసు ప్రకారంగా సహీహ్ విషయాలపై ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ మరియు హదీసును అనుసరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
సాధారణంగా ప్రశ్న ఎలా వస్తుంది? ఫాతిహా ఎలా చేయాలి? ఫాతిహా చేసే పద్ధతి ఏంటి? కొంచెం తెలపగలరు. లేదా ఫాతిహా చేసిన అన్నం తినవచ్చా? ఫాతిహా చేసి ఉన్న ఏదైనా పదార్థం త్రాగవచ్చా? అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ ఫాతిహా దివ్య ఖురాన్ అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖురానే మజీద్లోని మొట్టమొదటి సూరత్.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి మొదలవుతుంది. గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలజ్జాల్లీన్ పై సమాప్తమవుతుంది.
ఈ సూరా మనం ఎన్నో సందర్భాలలో చదివేది ఉంది. దీనిని సూరే ఫాతిహా అని అంటారు. ఖురాన్లో అల్ ఫాతిహా అన్న పేరుతోనే ఇది వ్రాయబడుతుంది. పోతే ఇంకా వేరే ఎన్నో ఘనతలు ఈ సూరాకు ఉన్నాయి, ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి.
అయితే మనం రేయింబవళ్లలో, 24 గంటల్లో చేసేటువంటి ఐదు ఫర్జ్ నమాజులలో 17 ఫర్జ్ రకాత్లు ఏవైతే ఉన్నాయో, వాటిలోని ప్రతి ఒక్క రకాత్లో సూరే ఫాతిహా తప్పకుండా చదవాలి. మనం జమాత్ లో ఉండి నమాజ్ చేస్తున్నా గానీ, ఒంటరిగా చేస్తున్నా గానీ, ఇమామ్ గా ఉన్నా గానీ, ముక్తదీగా ఉన్నా గానీ. ఇది ఫాతిహా సూరా చదివేది నమాజులో.
ఇక నమాజులో కాకుండా ఆరోగ్యం పొందే ఉద్దేశంతో దీనిని చదవవచ్చు. సహీహ్ బుఖారీలో దీనికి ఆధారం అనేది ఉంది. ఎవరికైనా ఏదైనా పురుగు కాటేసింది లేదా ఏదైనా పాము, తేలు అట్లాంటిది లేదా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా నొప్పి ఉంది, శరీరంలో ఏదైనా బాధ ఉంది, అలాంటి వారు ఈ సూరా చదివి తమపై ఊదుకోవచ్చు. ఇక్కడ విషయం మరోసారి శ్రద్ధగా వినండి. స్వయం ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో స్వయం మనకు మనం ఈ సూరా చదివి మన శరీరంపై లేదా నొప్పి ఉన్న భాగంపై లేదా కాటేసిన చోటు మనం ఊదుకోవచ్చు. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు? ఫలానా వారి దగ్గరికి వెళ్లాలి, వారు మనకు ఏదైనా మంత్రం చేయాలి, దువా చదవాలి, వారు చదివి ఊదాలి – ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పర్వాలేదు కానీ, సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.
బిద్అత్ మరియు ఫాతిహా
ఇక రండి కొన్ని సందర్భాలలో కొన్ని వంటకాలు చేసి ఏదైతే ఫాతిహా చేయడం అన్నటువంటి పదం మనలో చాలా ప్రబలి ఉందో శ్రద్ధగా వినండి సోదర సోదరీమణులారా. మీలాద్లు, ఉర్సులు, జాతరాలు, చాలిస్వాలు, బిస్వాలు, తీస్వాలు ఇలాంటివి, రజబ్ కే కుండే, ఇంకా ముర్దోం కీ ఈద్, బడోం కీ ఈద్, 15 షాబాన్, షబే బరాత్ ఇట్లాంటి ఇంకా ఎన్నో పేర్లతో ఏ ఏ బిద్అత్లన్నీ జరుగుతున్నాయో, సాధారణంగా అలాంటి బిదాత్లలోనే కొన్ని తిను పదార్థాలపై లేదా మంచి బిర్యానీలు, పలావులు, ఇంకా ఏదైనా తీపి పదార్థాలు వండుకొని ఏం చేస్తారు? అక్కడ ఫాతిహా అని చేస్తారు.
ఇక ఇందులో ఇలా చేసే వారు కొందరు మౌల్వీ సాబులు వారి వ్యక్తిగత లాభం కొరకు చేస్తారా, దేని కొరకు చేస్తారో అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇచ్చుగాక. కానీ శ్రద్ధగా వినండి ఇలా ఇట్లాంటి బిద్అత్లు అవి చేయడమే నిషిద్ధం ఇస్లాంలో. ఎందుకంటే మొహర్రంలో పీరీల పండుగలు గానీ, ఆ తర్వాత నెలలో ఏదైనా చివరి బుధవారం అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ అవ్వల్ నెలలో మీలాద్ అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ ఆఖర్ నెలలో పీరానే పీర్ కా మహీనా గ్యార్వీ షరీఫ్ లో అని, ఇంకా లేదా రజబ్ లో రజబ్ కే కుండే 22 రజబ్ ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లా పేరుతో, కుండే మేరాజ్ యొక్క రాత్రి, ఇట్లాంటివి షాబాన్ లో ఇంకా 15 షాబాన్ షబే బరాత్ ఇట్లాంటివన్నీ కూడా బిద్అత్లు. ఈ బిద్అత్లు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఏమాత్రం లేదు.
షిర్క్ మరియు ఇతర ఆచారాలు
ఇక ఆ బిద్అత్లు చేసి అందులో కొన్ని వంటకాలు చేసుకొని అందులో ఫాతిహాల పేరుతో ఏమైనా చేయడం కూడా నిషిద్ధం హరామ్ కిందికి వస్తుంది, అవన్నీ జాయెజ్ లేవు. కొందరు ఏమంటారో తెలుసా? మేము ఈసాలే సవాబ్ గురించి చేస్తున్నాము. మన పుణ్యాత్ములకు, పూర్వీకులకు, పుణ్యపురుషులకు, మన బంధువులలో చనిపోయిన వారికి పుణ్యం దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము – ఇవన్నీ కేవలం బూటకపు మాటలు, కేవలం ఒక బిద్అత్ ను నడపడానికి పేర్లు మార్చి చేసేటువంటి కొన్ని పనులు. అందుకొరకు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి ఏ ఆధారాలు లేవు.
ఇక కొందరు మౌల్వీ సాబులు ఫాతిహా అన్న పేరుతో ఈ సూరే ఫాతిహా చదువుతారు, కుల్ హువల్లాహు అహద్ చదువుతారు, దరూద్ షరీఫ్ చదువుతారు, ఇంకా కొందరు ఇంకొన్ని పెంచుతారు, మరికొందరు కొన్ని తగ్గిస్తారు. ఆ తర్వాత ఇక ఫాతిహా అయిపోయింది, ఇక దీంట్లో చాలా బర్కత్ ఉంటుంది తినాలి అని అంటారు. మరికొందరు ఈ సూరాలు చదవడమే కాకుండా కొందరు అల్లాహ్ యొక్క వలీలు, అల్లాహ్ యొక్క భక్తులు ఎవరైతే గడిచిపోయారో, వారి పేర్ల మీద కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. ఇట్లాంటివి షిర్క్ వరకు చేరిపిస్తాయి. మొదటి విషయం ఏదైతే ఉందో కేవలం ఆ సూరాలు చదవడం ఖురాన్ లోని – ఇది బిద్అత్ కిందికి వస్తుంది, అది కూడా హరామ్. కానీ మరికొందరు ఏం చేస్తారు? పుణ్యపురుషుల పేర్లతో వాళ్ళ పేర్లు తీసుకొని మనం ఈ విధంగా చదివేది ఉంటే ఇంత ఇంత బర్కత్, ఇంత ఇంత శుభము, ఇంత ఇంత పుణ్యము లభిస్తుంది అన్నటువంటి మూఢనమ్మకాలలో ఉంటారు. వారికి అవన్నీ ఏమీ లభించవు, వాస్తవానికి అన్నీ ప్రసాదించేవాడు అల్లాహ్ యే. ఏదైనా పరీక్ష వచ్చినా గానీ అల్లాహ్ వైపు నుండే వస్తుంది. కానీ ప్రజలలో ఉన్న మూఢనమ్మకం ద్వారా వారు ఇలా చేస్తారు, ఇది షిర్క్ వరకు చేరిపిస్తుంది. అందుకొరకు మనం ఎలాంటి ఫాతిహాలు చేయకూడదు.
ఫాతిహా చేసిన ఆహారం తినవచ్చా?
ఇక మన ఇంటికి ఎవరైనా ఫాతిహా చేసిన వస్తువు తీసుకొచ్చి వస్తే ఇస్తే అవి తినాలా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ కేవలం బిద్అత్ కు సంబంధించినది అయ్యేది ఉంటే అది తీసుకోకూడదు. ఎందుకు? తీసుకోవడంలో ఒక బిద్అత్ కు, ఒక నిషిద్ధ కార్యానికి మనం సపోర్ట్ చేసే వాళ్లం అవుతున్నాము అని. కానీ ఏమీ తెలియకుండా వచ్చేసింది మనం తినేసాము, అల్లాహ్ క్షమించుగాక అని మనం ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి.
ఇక ఒకవేళ నేను రెండో రకం ఏదైతే చెప్పానో చూడండి, ఆ ఫాతిహాలలో షిర్క్ లాంటి విషయాలు కూడా ఉంటాయి అని. అవి గైరుల్లాహ్ యొక్క పేరు కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఖురాన్ లో నాలుగు చోట్ల అల్లాహ్ త’ఆలా గైరుల్లాహ్ యొక్క పేరు మీద, అల్లాహ్ యేతరుల పేరు మీద ఇట్లాంటి మొక్కుబడులు చేసిన వాటిని తినకూడదు అని నిషేధించాడు. అది షిర్క్ కిందకి వస్తుంది, దాని నుండి అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మనం జాగ్రత్త వహించాలి.
అయితే ఈ ఫాతిహాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు వచ్చేసాయి అని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ త’ఆలా అన్ని రకాల చెడుల నుండి, అన్ని రకాల దురాచారాల నుండి ఇస్లాం యొక్క పేర్లు లేబుల్ లు తగిలించి చేసేటువంటి పనుల నుండి, ఇట్లాంటి మోసపూరితమైన మాటలు చేష్టల నుండి అల్లాహ్ మనందరినీ కూడా కాపాడుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరైన పద్ధతిని అనుసరిస్తూ అల్లాహ్ యొక్క ఆరాధన పూర్తి ఇఖ్లాస్ చిత్తశుద్ధి మంచి సంకల్పంతో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
బారకల్లాహు ఫీకుమ్ వ జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మయీన్.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6885
బిద్అత్ (నూతనాచారం) – Bidah
- [నూతనాచారం]
- బిద్అత్ (నూతనచారము) – “దైవ ప్రవక్త ధర్మము” పుస్తకము నుండి (ఖలీలుల్ రహ్మాన్)
- కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు– హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
- ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [Video]