ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల ప్రేమ | కలామే హిక్మత్ (వివేక వచనం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మనిషికి తన భార్యాబిడ్డల కంటే, తన సొంత సొమ్ముకంటే, తన వారికంటే ఎక్కువగా నేను ప్రియమైనవాడ్ని కానంతవరకూ అతను విశ్వాసి (మోమిన్) కాలేడు.” (ముస్లిం)

ఈ హదీసులో ”విశ్వాసం” యొక్క ఉన్నతమయిన స్థితి వివరించబడింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నతస్థితికి విశ్వాసం చేరుకోవాలి. అంటే మనం మన స్వయంపై దైవప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మన ప్రాణం కన్నా దైవప్రవక్త ప్రాణమే ప్రీతికరం కాగలగాలి. ఒకసారి హజ్రత్ ఉమర్ మహాప్రవక్తను ఉద్దేశించి, “ఓ దైవప్రవక్తా! నా ప్రాణం తప్ప మిగతా అన్ని విషయాలకన్నా మీరే నాకు ప్రియమైన వారు” అని అన్నారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”లేదు, ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో అతని సాక్షిగా చెబుతున్నాను – నేను మీకు మీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతమం కానంత వరకూ మీరు విశ్వాసి కాలేరు” అని పలికారు. ఉమర్ (రజిఅన్ అన్నారు. “ఇప్పుడు నాకు మీరు నిశ్చయంగా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రీతికరమైన వారు.” దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “అయితే ఉమర్! ఇప్పుడు మీరు విశ్వాసులు” అన్నారు. (బుఖారి)

సహచరులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల అమితమయిన ప్రేమాభిమానం కలిగి ఉండేవారు. చారిత్రక గ్రంథాలు, హదీసు గ్రంథాలే దీనికి నిదర్శనం. హిజ్రత్ సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్తకు చేసిన సేవలను గురించి ప్రఖ్యాత చరిత్రకారులు, హదీసువేత్త అయిన ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ ఇద్దరూ రాత్రిపూట సూర్ గుహలో చేరారు. అయితే అబూబకర్ గుహలోకి మొదట ప్రవేశించారు. దైవప్రవక్తకు కీడు కలిగించే మృగం గాని, పాముగాని గుహలో ఉండవచ్చునేమోనన్న భయంతో అబూబకర్ తొలుత తానే గుహలో ప్రవేశించారు.”

మరో ఉల్లేఖనం ఏమని ఉందంటే; ఆ గుహకు ఎన్నో కన్నాలు ఉన్నాయి. అబూబకర్ ఆ కన్నాలను మూసివేశారు. ఒక కన్నాన్ని మూసివేయటానికి వీలుపడకపోతే తన కాలిని దానికి అడ్డుగా పెట్టారు. కన్నం లోపలినుంచి విషపు పురుగులు కాటేయసాగాయి. బాధతో ఆయన కళ్ళనుంచి అశ్రువులు రాలాయి. అయినా ఆయన కాలు తీయలేదు.

ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరించాలి. ఎవరయినా, తనకు ప్రవక్త యెడల అమితమయిన ప్రేమ ఉందని చాటుకుంటూ ప్రవక్త సంప్రదాయాన్ని (సున్నత్ను) అవలంబించకపోతే, అతను అసత్యవాది, బూటకపు అనుయాయి అనిపించుకుంటాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

“మేము అల్లాహ్ ను మరియు ప్రవక్తను విశ్వసించామని, విధేయతను స్వీకరించామని వారంటారు. ఆ తరువాత వారిలో ఒక వర్గం విధేయత పట్ల విముఖత చూపుతుంది. ఇటువంటి వారు విశ్వాసులు కారు.” (అన్నూర్ : 47)

విధేయతా మార్గం నుండి వైముఖ్యం ప్రదర్శించిన వారిని విశ్వాస పరిధుల నుండి వేరుచేస్తూ పై ఆయత్ అవతరించింది. మనసులో ఎంత అధికంగా విశ్వాసం ఉంటే అంతే అధికంగా విధేయతా భావం ఉంటుంది.

చెప్పుకోవటానికయితే చాలామంది తమకు ప్రవక్తయెడల అపార గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే వారి మాటలు ‘విధేయత’ అనే గీటురాయిపై పరికించబడతాయి. ఒకవేళ వారి ఆచరణ ప్రవక్త ఆచరణకు భిన్నంగా ఉంటే వారు చెప్పేదంతా బూటకం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే, నిష్కల్మషమైన విధేయతా భావం ఉంటే అది ఆచరణ ద్వారా తప్పకుండా వ్యక్తమవుతుంది.

”(ఓ ప్రవక్తా!) వారితో అనండి, ‘ఒకవేళ మీరు అల్లాహ్ యెడల ప్రేమ కలిగి ఉంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, ఎంతగానో కరుణించేవాడు కూడాను.” (ఆలి ఇమ్రాన్ : 31)

హాపిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు :

ప్రవక్తలందరిపట్ల ప్రేమ కలిగి ఉండటం విశ్వాసానికి ప్రతీక. అయితే మనం అందరికన్నా ఎక్కువ ప్రేమ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల కలిగి ఉండాలి :

ఇమామ్ ఖతాబి ఇలా అంటున్నారు:

ఇక్కడ ప్రేమ అంటే భావం లాంఛన ప్రాయమయిన ప్రేమ కాదు హృదయ పూర్వకమయిన ప్రేమ. మహాప్రవక్త ఏమని ఉపదేశించారంటే, మీరు నా అనుసరణలో మీ మనోకాంక్షల్ని జయించనంతవరకు, నా సంతోషానికి మీ సుఖసంతోషాలపై ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ – ఒకవేళ మీకు నష్టం కలిగినాసరే, చివరకు మీరు అమరగతి నొందవలసి వచ్చినా సరే – మీరు నా సంతోషం కొరకు పాటుపడనంతవరకూ మీకు నాపై గల ప్రేమ ధృవీకరించబడదు.

ఖాజీ అయాజ్ మరియు ఇబ్నె బతాల్ తదితరులు ఇలా అభిప్రాయపడ్డారు : ప్రేమ మూడు రకాలు :

(1) గౌరవనీయమయిన ప్రేమ. ఇది తండ్రిపట్ల ఉంటుంది.
(2) అవ్యాజానురాగాలతో కూడిన ప్రేమ. ఇది సంతానంపై ఉంటుంది.
(3) స్వాభావికమయిన ప్రేమ. ఇది ఒక మనిషికి మరో మనిషిపై సాధారణంగా ఉంటుంది.

ఈ హదీసులో మహాప్రవక్త అన్ని రకాల ప్రేమలను ప్రస్తుతించారు.

ఈ హదీసు ఆలోచన, యోచనల వైపు దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా ప్రాప్తమయ్యే మహత్పూర్వకమయిన ప్రయోజనాలకు మూలం ఆలోచన మరియు యోచనలే. ప్రవక్త సహచరులు ఏ విషయంపైనయినా ఎంతో సావధానంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని తరచి చూసేవారు. అందుచేత వారి విశ్వాసం ఎంతో దృఢమయ్యింది. ఈ హదీసు ద్వారా ముస్లిమైన ప్రతి ఒక్కరికీ లభించే సందేశం ఏమంటే సకల ప్రేమలకన్నా ప్రవక్త యెడల ప్రేమకు అతను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో తాను ఏ స్థాయిలో నున్నది అతను సతతం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్