బిద్అత్ అంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

బిద్అత్ అంటే?
https://youtu.be/YlU1aDZFcl0 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘బిద్అత్’ అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తారు. భాషాపరంగా, బిద్అత్ అంటే గతంలో ఉదాహరణ లేని ఒక కొత్త ఆవిష్కరణ అని ఆయన వివరిస్తారు. దీనిని స్పష్టం చేయడానికి ఖుర్ఆన్ నుండి సూరా అల్-బఖర (2:117) మరియు సూరా అల్-అహ్కాఫ్ (46:9) ఆయతులను ఉదాహరిస్తారు. తరువాత, ఆయన బిద్అత్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు: మొదటిది, ప్రాపంచిక విషయాలు మరియు అలవాట్లలోని ఆవిష్కరణలు (ఉదాహరణకు సాంకేతికత, దుస్తులు), ఇవి అనుమతించబడినవి. రెండవది, ధార్మిక (దీన్) విషయాలలో చేసే కొత్త ఆవిష్కరణలు, ఇవి నిషిద్ధం (హరామ్) మరియు తిరస్కరించబడినవి. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఆయన సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం నుండి రెండు హదీసులను ఉదహరిస్తారు. ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రాపంచిక ఆవిష్కరణలు ఆమోదయోగ్యమైనప్పటికీ, ఇస్లాం ధర్మంలో కొత్త పద్ధతులను చేర్చడం తీవ్రమైన తప్పు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం బిద్అత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. బిద్అత్, దీనికి చాలా వివరాలు ఉన్నాయి. ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో దీనిని మనం తెలుసుకుందాం. ఈరోజు అయితే, బిద్అత్ అంటే అర్థం ఏమిటి? బిద్అత్ కి అర్థం తెలుసుకుందాం. తర్వాత ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో బిద్అత్ రకాలు, బిద్అత్ యొక్క ఆదేశాలు అవి తెలుసుకుందాం. ఈరోజు బిద్అత్ అంటే ఏమిటి?

నిఘంటువు ప్రకారం బిద్అత్ అంటే గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే, ఏదేని ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం. ఇది బిద్అత్ పదానికి అర్థం. నిఘంటువు ప్రకారం.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో సూర బఖర, ఆయత్ 117 లో ఇలా సెలవిచ్చాడు,

بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(బదీఉస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. (2:117)

ఇక్కడ బదీఅ అనే పదం ఉంది. దీని నుంచే బిద్అత్. అంటే భూమ్యాకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే, అల్లాహ్ యే. అంటే పూర్వపు ఉపమానం ఏదీ లేకుండానే భూమ్యాకాశాలకు ఉనికిని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే సూర అహ్కాఫ్, ఆయత్ 9 లో, ఒక ఆయత్ ఇలా ఉంటుంది,

قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ
(ఖుల్ మా కున్తు బిద్అమ్ మినర్రుసుల్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (46:9)

అంటే, ఓ ప్రవక్తా, వారితో అను, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. అంటే, అల్లాహ్ తరఫున ప్రజలకు దైవ సందేశం అందజేసే మొట్టమొదటి వ్యక్తిని కాను. నాకు ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు.

అంటే ఈ రెండు ఆయత్ లలో బిద్అ అనే పదానికి అర్థం ఉంది. గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే ఏదైనా ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం అన్నమాట.

“ఇబ్తద’అ ఫులానున్ బిద్అతన్” అని అరబీలో అంటారు. దానికి అర్థం ఏమిటి? అంటే అతను అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం.

ఇక, ఈ లేని కొత్త పద్ధతులు, ఆవిష్కరించటం, ఆరంభం అనేది రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి, అలవాట్లలో ఆవిష్కరణ. కొత్త కొత్త విషయాలు వెతకటం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, ప్రారంభించటం. అలవాట్లలో. రెండవది, ధర్మం, దీన్ లో క్రొంగొత్త ఆవిష్కరణ.

అలవాట్లలో ఆవిష్కారం, ఉదాహరణకు దైనందిన జీవితం కొరకు అవసరమైన వాటిని కొత్తగా కనుగోవటం లేదా ఆవిష్కరించటం. ఇది ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇది అలవాట్లకు సంబంధించినది. దుస్తులు, మనం వాడే వాహనాలు, అలాగే మన జీవితానికి, అలవాట్లకి సంబంధించిన అనేక విషయాలు, మొబైల్ ఉంది, కారు ఉంది. అలవాట్లకు సంబంధించిన విషయాలలో కొత్తది రావటం, కొత్త విధానాన్ని తెలుసుకోవటం, కొత్త విషయం ఆవిష్కరించటం ఇవన్నీ ధర్మసమ్మతమే.

రెండవ రకం, దీన్ లో, ధర్మంలో, ఇస్లాం లో క్రొంగొత్త ఆవిష్కరణ. అంటే ధర్మంలో నూతన విధానాలను, పనులను సృష్టించటం. ఇది నిషిద్ధం. దీనికి ఇస్లాంలో అనుమతి ఉండదు. ఎందుకంటే ధర్మావలంబన విషయంలో ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢీ అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు, చేయటం ధర్మసమ్మతం కాదు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
(మన్ అహదస ఫీ అమ్ రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్) (రవాహుల్ బుఖారీ వ ముస్లిం)
ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది

అంటే ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో – ప్రవక్త గారు “మా” అన్నారు, ఫీ అమ్ రినా – మా ఈ షరీఅత్ విషయంలో (ఫీ అమ్ రినా అంటే ధర్మం విషయంలో, దీన్ విషయంలో, షరీఅత్ విషయంలో) లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది, అది రద్దు చేయబడుతుంది, ఫహువ రద్, రద్దు చేయబడుతుంది.

అలాగే ఇంకో హదీస్ లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ
(మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్ రునా ఫహువ రద్) (రవాహు ముస్లిం)
ఎవడైనా మా షరీఅత్ కు అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది, రద్దు చేయబడుతుంది.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, బిద్అత్ అనే పదానికి అర్థం ఏమిటి? లేని విధానాన్ని సృష్టించటం. కొత్తగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం, ఆరంభం చేయటం. ఇది అలవాట్లలో అయితే ధర్మసమ్మతమే. ఇక రెండవది, దీన్ పరంగా. దీన్ లో కొత్త విధానం ఆవిష్కరించటం, ప్రారంభం చేయటం. ఇది ధర్మసమ్మతం కాదు.

ఈ బిద్అత్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. బిద్అత్ యొక్క రకాలు, అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43296

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/


ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? – షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Y55gGxIgxeM

[63 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)