ప్రవక్త మరియు యువకులు – ఖతీబ్ షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మరియు యువకులు
ఖతీబ్ షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | అనువాదం: నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/VE5UXDERbwg [21 నిముషాలు]

ఈ శుక్రవార ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువతతో ఎలా వ్యవరించేవారో వివరిస్తుంది. సమాజానికి యువత నిజమైన సంపద మరియు కవచం అని నొక్కిచెబుతూ, ప్రవక్త వారిని ప్రేమ, గౌరవం, మరియు సాన్నిహిత్యంతో ఎలా దగ్గర చేసుకున్నారో ఉదాహరణలతో వివరించబడింది. ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు), ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వంటి యువ సహాబాలతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, వారిని ప్రోత్సహించిన తీరు, మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని ఎలా మార్గనిర్దేశం చేశారో తెలియజేయబడింది. పాపం చేయాలనుకున్న యువకుడితో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సౌమ్యంగా, వివేకంతో వ్యవహరించి మార్పు తెచ్చిన సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, యువత సామర్థ్యాలను గుర్తించి, వారిపై నమ్మకముంచి, మక్కాకు గవర్నర్‌గా, సైన్యానికి అధిపతిగా నియమించడం వంటి పెద్ద బాధ్యతలను ఎలా అప్పగించారో కూడా ఈ ఖుత్బా స్పష్టం చేస్తుంది. యువత పట్ల మన వ్యవహారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శవంతమైన మార్గాన్ని అనుసరించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వనుసల్లీ అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్.

జుమా ఖుత్బా 12వ సెప్టెంబర్ 2025. ఈ ఖుత్బా అరబీ భాషలో రాసిన వారు మరియు ఖుత్బా ఇచ్చిన వారు అష్షేఖ్ రాషిద్ అల్ బిదా. సౌదీ అరబ్ లోని జుల్ఫీ ప్రాంతంలో ఉన్నటువంటి జామే అష్షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ మస్జిద్ లో. మరియు తెలుగు అనువాదం చేసి వాయిస్ ద్వారా వినిపిస్తున్న వారు ముహమ్మద్ నసీరుద్దీన్ జామియి.

ఈరోజు ఖుత్బా యొక్క అంశం ప్రవక్త మరియు యువకులు. అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల పట్ల ఎలా వ్యవహరించే వారు, కొన్ని సంఘటనలు ఈరోజు మనం తెలుసుకుందాము.

వారు ఈ ఉమ్మత్ సమాజానికి కవచం, దాని నిజమైన సంపద. ఎవరు వారు? వారే యువకులు. ఓ యువకుల్లారా! ఈ విషయాన్ని గ్రహించండి.

గత రెండు జుమాల ప్రసంగాలలో మంచి ఆదర్శ ప్రాయులు అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నారులతో మరియు వృద్ధులతో ఎలా వ్యవహరించే వారో తెలుసుకున్నాము. ఈరోజు మనం కొనసాగించే, ఇంకా ముందుకు కొనసాగించి నేర్చుకుంటాము, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వనంలో ఉన్న వారితో ఎలా వ్యవహరించేవారో. వారిని మనం తరుణులు, టీనేజర్స్ అని పిలుస్తాము కదా.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యువకులను గౌరవించేవారు, వారిని తమకు దగ్గరగా చేర్చుకునేవారు, వయసు అనే అడ్డుకట్టలను ఆయన ప్రేమ, సాన్నిహిత్యం మరియు నమ్మకంతో ధ్వంసం చేసేవారు. అర్థమైంది కదా ఈ విషయం? మనం పెద్దలము, తండ్రి వయసులో ఉన్న వారిమి, యువకులతో ఏంటి ఇంత క్లోజ్ గా దగ్గరగా ఉండేది? ఈ రోజుల్లో పెద్దలు అనుకుంటారు, యువకులు కూడా అనుకుంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అడ్డుకట్టలను ధ్వంసం చేశారు. ఎలా? ప్రేమతో, సాన్నిహిత్యంతో, వారికి దగ్గరగా అయి, మరియు వారిలో నమ్మకాన్ని పెంచి. అందువల్ల మనం చూస్తాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా దగ్గర చేసుకున్న వారు, శిక్షణ ఇచ్చిన వారు యువకులే. అవునండీ సహాబాల చరిత్ర మీరు చదవండి, ఎంతమంది యువకులు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరగా ఉండేవారు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సవారీపై వెనుక కూర్చోబెట్టుకోవడం అంటే వారిని దగ్గరగా ఉంచే ప్రేమకు సూచన. అండి, ఒక సంఘటన చూడండి. హజ్జతుల్ విదా అంటే తెలుసు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కంటే సుమారు మూడు నెలల క్రితం చేసినటువంటి హజ్. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో లక్షకు పైగా మంది హాజరయ్యారు కదా. ఆ హజ్జతుల్ విదాలో అరఫాత్ ప్రాంగణంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఒంటెపై ఉండగా, ఆయన చుట్టూ విపరీతమైన జన సమూహం ఉండగా, అకస్మాత్తుగా ఆయన ఇలా పిలిచారు,

ادْعُوا لِي أُسَامَةَ بْنَ زَيْدٍ
(ఉద్ఊలీ ఉసామా బిన్ జైద్)
“నా వద్దకు ఉసామా బిన్ జైద్ ను పిలవండి.”

ఎవరు ఈ ఉసామా బిన్ జైద్? అప్పుడు ఆయన్ను ఎరుగని వారు ఎవరు ఈ ప్రత్యేక పిలుపు మరియు గౌరవానికి అర్హుడో అని ఎదురుచూశారు. అక్కడ ప్రజలు ఉన్నారు కదా, అందరికీ తెలియదు ఉసామా ఎవరు అన్నది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ఇలా పిలిచారో, అందరి ఆలోచనలు ఏమవుతాయి? కానీ వారు ఒక పెద్ద వృద్ధుడిని, తెల్ల గడ్డం ఉన్న వాడిని ఊహించి ఉంటారు కదా అక్కడి ఆ ప్రజలు ప్రవక్త ద్వారా ఈ మాట విన్న తర్వాత, “ఉద్ఊలీ ఉసామా”.

వారు అలా ఊహిస్తున్నంతలో 18 ఏళ్ల నవ యువకుడు, నల్ల రంగు గల యువకుడు ఉసామా వచ్చి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెపైకి ఎక్కి, ఆయన వెనుక కూర్చొని ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ విపరీతమైన జన సమూహం ఆశ్చర్యపోయి సంతోషించారు.

మనం గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులను అపారమైన భావోద్వేగాలు మరియు అనురాగంతో కప్పి ఉంచేవారు. గనుక మనం చూస్తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుడైన ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకొని, దానిని తమ చేతిలో ఉంచి, ఇలా అంటారు,

يا معاذُ واللَّهِ إنِّي لأحبُّكَ
(యా ముఆద్ వల్లాహి ఇన్నీ ల ఉహిబ్బుక్)
“ఓ ముఆద్, అల్లాహ్ ప్రమాణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” (అబూ దావూద్ 1522).

ఈ దృశ్యంలో ముఆద్ (రదియల్లాహు అన్హు) గారి హృదయంలో కలిగిన భావాలను, ఆయన హృదయ స్పందనలను, ఆయనకు కలిగిన ఆనందాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ఆయన చెయ్యి ప్రవక్త చేతిలో ఉంది. ఆ సమయంలో ప్రవక్త అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం ఈ మాటనే చెప్పలేదు, అల్లాహ్ సాక్షిగా అని చెప్పారు. ముఆద్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క ఆలోచన దృష్టి అటు ఇటు ఉండకుండా “యా ముఆద్” (ఓ ముఆద్) అని సంబోధించడం ద్వారా మనిషి అటెన్షన్ అయి వింటాడు కదా. సుబ్ హా నల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎలా ఉండిందో గమనించండి, ఇలాంటి ఉత్తమ ఆదర్శం పాటించే ప్రయత్నం చేయండి.

అలాగే 20 ఏళ్ళు రాని యువకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని ఊహించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెయ్యిని ఆయన భుజంపై పెట్టారు, ఇలా చెయ్యి పెట్టారు అంటే ఏంటి? అది ఒక దగ్గరపాటు క్షణం, ప్రేమ నిండిన క్షణం. ఒక పెద్ద మనిషి ఒక యువకుడి భుజం మీద చెయ్యి పెట్టారు అంటే ఏంటి, ఎంతో దగ్గరికి తీసుకున్నారు అని కదా? ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు,

يا عبدَ اللهِ ! كن في الدنيا كأنك غريبٌ أو عابرُ سبيلٍ
(యా అబ్దుల్లాహ్! కున్ ఫిద్దున్యా క అన్నక గరీబున్ అవ్ ఆబిరు సబీలిన్)
“ఓ అబ్దుల్లాహ్, ఈ లోకంలో నీవు ఒక విదేశీయుని వలె లేదా ఒక బాటసారి వలె ఉండు.” (సహీహ్ బుఖారీ 6416).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటనలో మనం ఏదైతే ఇప్పుడు విన్నామో భుజము మీద చెయ్యి పెట్టి చెప్పడం, అది ఒక అద్భుతమైన భావోద్వేగ పాత్రలో అందించబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతమైన వసియత్. వసియత్ అంటే సర్వసామాన్యంగా మరణ శాసనం, చనిపోయే ముందు చెప్పేటువంటి ముఖ్య మాట అని కూడా తీసుకుంటారు, కానీ వసియత్ ఒక ముఖ్యమైన ఉపదేశం, ఏదైనా ఒక ముఖ్యమైన సలహా ఇవ్వడం అన్న భావంలో కూడా వస్తుంది.

ముగ్గురి ఉదాహరణలు మీ ముందుకి వచ్చాయి కదా? ఉసామా బిన్ జైద్ మరియు ముఆద్ ఇబ్ను జబల్ మరియు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్. ఇక రండి ముందుకు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేవారు. హజ్జతుల్ విదాలో ఆయన తమ ఒంటెపై వెనుక కూర్చోబెట్టారు ఫద్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ని. హజ్రత్ అబ్బాస్ వారి కొడుకు ఫద్ల్. ఫద్ల్ ఇబ్నే అబ్బాస్ ఒక అందమైన యువకుడు. అప్పుడే ఒక అందమైన యువతి ప్రవక్తను ప్రశ్నించడానికి వచ్చింది. ఫద్ల్ (రదియల్లాహు అన్హు) ఆమెను చూస్తూ ఉండగా వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ముఖాన్ని తిప్పేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని కొట్టలేదు, గద్దించలేదు, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ యువతిని నేరుగా మందలించలేదు. కానీ పరోక్షంగా ఫద్ల్ కు మృదువుగా బోధించడం ద్వారా ఆమెకు కూడా బోధించేశారు. అల్లాహు అక్బర్. గమనించారా?

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు)తో ప్రవర్తించిన ఈ ప్రవర్తన, ఆయన పట్ల వ్యవహరించిన ఈ సందర్భం సహీహ్ బుఖారీ 1513 మరియు సహీహ్ ముస్లిం 1334లో ఉంది.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకున్న ఉదాహరణల్లో ఒకటి మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాము, మేము అంటే ఇక్కడ ఆయన ఒక్కరు కాదు, మరి కొంతమంది. ఎవరు వారు? మేమంతా ఒకే వయసులో ఉన్న యువకులం, 20 రోజులు ఆయన వద్దే ఉన్నాము, ధర్మం నేర్చుకున్నాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కరుణతో కూడిన మృదువైన వారిగా ఉండేవారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు మా కుటుంబాల కోసం కలిగిన తపనను గమనించి ఇలా అన్నారు,

ارْجِعُوا إِلَى أَهْلِيكُمْ
(ఇర్జిఊ ఇలా అహ్లికుం)
“మీ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళండి.”

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకులు తమ భార్యల కోసం కలిగిన తపనను గమనించారు, ఇది ఆయన వారిపై చూపిన కరుణలో ఓ భాగం. ఈ హదీస్ సహీహ్ బుఖారీ 631, సహీహ్ ముస్లిం 674లో ఉంది. మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ యువకుడు, ఆయనతో వచ్చిన వారు కూడా యువకులు.

ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయతో ఉసామా బిన్ జైద్, ముఆద్ ఇబ్నే జబల్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్, ఫద్ల్ ఇబ్ను అబ్బాస్ మరియు మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ మరియు ఆయనతో పాటు వచ్చినటువంటి యువకుల కొన్ని సంఘటనలు విన్నాము కదా, ప్రవక్త ఎలా వ్యవహరించారో వారితో.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీరి పట్ల పాటించినటువంటి విషయాలు అన్నీ కూడా పాజిటివ్ రీతిలో మనకు కనబడ్డాయి. కానీ ఎవరైనా యువకుడు కొంచెం తల తిరిగినవాడు, ఏదో చెడ్డ ఆలోచనల్లో ఉన్నవాడు, అలాంటి యువకుల పట్ల కూడా ప్రవక్త ఎలా వివరించేవారో ఇక శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకునేవారు, కనుక యువకులు తమ కోరికలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేసేవారు. ఎలా? చూడండి ఈ సంఘటన.

ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అంటాడు, “ఓ ప్రవక్తా! నాకు ఒక అనుమతి ఇవ్వండి, నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను.” అల్లాహు అక్బర్. ప్రవక్త ముందు యువకుడు వచ్చి వ్యభిచారం గురించి అనుమతి కోరుతున్నాడా? ప్రవక్త కొట్టాడా? అస్తగ్ఫిరుల్లాహ్. ప్రవక్త ఆ యువకుడిని కొట్టారా? గద్దించారా? అక్కడి నుండి వెళ్ళగొట్టారా? లేదు లేదు లేదు, వినండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దగ్గరికి తీసుకొని, అతన్ని గద్దించలేదు, నిరోధించలేదు, దూషించలేదు. “ఉద్నుహు మిన్నీ”, అతన్ని నా దగ్గరకు చేర్చండి అని హదీసులో కూడా ఉంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో మెతక వైఖరితో ఆ యువకుడితో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమని?

“నీ తల్లికి ఇది ఇష్టపడతావా? నీ సోదరికి ఇది ఇష్టపడతావా? నీ పిన్నికి ఇది ఇష్టపడతావా? నీ మేనత్తకి ఇది ఇష్టపడతావా?” ప్రతి ప్రశ్నకు ఆ యువకుడు లేదు, లేదు, లేదు అనే సమాధానం ఇచ్చాడు, అంతే కాదు కేవలం లేదు అనలేదు, మిమ్మల్ని సత్యంతో పంపిన అల్లాహ్ సాక్షిగా అనుకుంటూ లేదు అని చెప్పాడు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలాగే ఇతరులు కూడా తమ కూతుర్లకు, తమ తల్లులకు, తమ చెల్లెళ్ళకు దీనిని ఎప్పటికీ ఇష్టపడరు” అని తెలియజేశారు. ఆ తర్వాత మాట పూర్తి కాలేదు ఇంకా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతిని ఆ యువకుడి చాతిపై ఉంచారు, యువకుడు ఆ చెయ్యి చల్లదనాన్ని తన చాతిపై అనుభవించాడు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా దుఆ ఇచ్చారు,

اللَّهُمَّ اغْفِرْ ذَنْبَهُ، وَطَهِّرْ قَلْبَهُ، وَحَصِّنْ فَرْجَهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ దంబహు, వ తహ్హిర్ ఖల్బహు, వ హస్సిన్ ఫర్జహు)
“ఓ అల్లాహ్, అతని పాపాన్ని క్షమించు, అతని హృదయాన్ని పవిత్రం చెయ్యి, అతని గుప్తాంగాన్ని (అనైతికత నుండి) రక్షించు.”

(తహ్హిర్ ఖల్బక్ అని కూడా మరికొన్ని ఉల్లేఖనాల్లో ఉంది). (ముస్నద్ అహ్మద్ 22211). ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రితనమైన వ్యవహారం, సౌమ్యతలో, సహచర్యంలో, జాగ్రత్తగా గమనించడంలో స్పష్టమవుతుంది.

ఇక రెండో ఖుత్బా. అల్హందులిల్లాహి ఖైర్ రాహిమీన్, వస్సలాతు వస్సలాము అలల్ మబ్ఊతి రహమతల్లిల్ ఆలమీన్, అమ్మాబాద్.

అందుకని ఓ విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులపై నమ్మకం ఉంచేవారు, వారి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసేవారు కారు, వారి ప్రతిభలను నిర్లక్ష్యం చేసేవారు కారు, వారిని అర్హులుగా చూసినప్పుడు గొప్ప పనులు, గొప్ప బాధ్యతలను వారికి అప్పగించేవారు. చూశారా మరో కోణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉన్నటువంటి ప్రతిభను, వారిలో ఉన్నటువంటి ఎవరికి ఏ విషయంలో ఎలాంటి ఎబిలిటీ, సలాహియత్ ఉన్నదో గమనించి ఆ బాధ్యతలు అప్పగించేవారు.

గమనించండి ఇక్కడ, మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి బయలుదేరేకి ముందు అక్కడ పాలకుడిగా, మీరు చెప్పవచ్చు మక్కాకి గవర్నర్ గా అత్తాబ్ బిన్ ఉసైద్ (రదియల్లాహు అన్హు) వారిని నియమించారు. అప్పుడు అతని వయసు సుమారు 20 సంవత్సరాలు మాత్రమే. ఇమామ్ ఇబ్ను సాద్ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని అత్తబకాతుల్ కుబ్రాలో ప్రస్తావించారు.

గమనించండి, ఆ సమయంలో మక్కాలో ఖురైష్ పెద్దలు, వయసు పైబడిన నాయకులు ఉన్నా, వారి మీద అధికారి ఒక 20 సంవత్సరాల యువకుడు అయ్యాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల్లో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఎలా వారికి చాన్స్ ఇచ్చేవారో చూడండి.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరియాకు ఒక సైన్యాన్ని పంపి వారిపై సైన్యాధికారిగా ఉసామా బిన్ జైద్ ను నియమించారు, అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు మాత్రమే. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఆ సైన్యంలో అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు) లాంటి పెద్ద సహాబాలు కూడా ఉన్నారు.

తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ అంత పెద్ద సైన్యానికి సైన్యాధికారిగా చేశారు కదా, అతనికి మరో ధైర్యం ఇస్తూ, ఇంకా ఇతరులకు అతని ప్రతిభని చాటుతూ చెప్పారు,

وأيمُ اللهِ لَقَدْ كان خَلِيقًا لِلْإمارَةِ
(వ ఐముల్లాహి లకద్ కాన ఖలీకన్ లిల్ ఇమారతి)
“అల్లాహ్ సాక్షిగా, నిశ్చయంగా అతడు ఈ అధికార హోదాకి (నాయకత్వానికి) తగినవాడు.” (సహీహ్ బుఖారీ 2450, సహీహ్ ముస్లిం 2426).

అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త తరం యువతను చిన్న వయసులోనే బాధ్యతలు భరించడానికి, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేసేవారు. అందుకే ఆయన తర్వాత ఆ యువకులు ఉమ్మత్ పెద్దలయ్యారు, సత్యం వైపునకు పిలిచేవారయ్యారు. అల్లాహ్ వారందరితో సంతోషంగా ఉండుగాక. ఆ సహాబాలను ఆ రీతిలో పెంచి, పవిత్రం చేసి, ఉన్నత గుణాలు వారికి నేర్పిన ప్రవక్తపై అల్లాహ్ యొక్క లెక్కిలేనన్ని దరూద్ సలాం, సలాతో సలాం, బరకాత్, దయా, శాంతి, శుభాలు కలుగుగాక.

لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ

“అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు”(3:164)

అందువల్ల మనం యువత పట్ల మన వ్యవహారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గాన్ని అనుసరించాలి, ఆయన సున్నతులను ఫాలో అయ్యే అనుచరులుగా ఉండడానికి.

సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43563