ఖుర్ఆన్ ప్రత్యేకతలు – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ప్రత్యేకతలు
https://youtu.be/C-C0jePaXXc [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ యొక్క అనేక గొప్ప ప్రత్యేకతలు మరియు ఘనతలు వివరించబడ్డాయి. ఇది అల్లాహ్ చే స్వయంగా ప్రళయం వరకు భద్రపరచబడిన, ఎలాంటి సందేహాలకు తావులేని ఏకైక గ్రంథమని నొక్కి చెప్పబడింది. ఖుర్ఆన్ పఠనం హృదయాలకు శాంతిని, మార్గదర్శకత్వాన్ని మరియు శారీరక, ఆత్మిక రోగాలకు స్వస్థతను ఇస్తుందని ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు తుఫైల్ (రదియల్లాహు అన్హు) వంటి వారి ఇస్లాం స్వీకరణ గాథలతో వివరించబడింది. ఖుర్ఆన్ పారాయణ ప్రతి అక్షరానికి పది పుణ్యాలను ఇస్తుందని, ఇది ఇహలోకంలోనే కాక, సమాధిలో మరియు పరలోకంలో కూడా తన సహచరుడికి రక్షణగా, సిఫారసుగా నిలిచి స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేరుస్తుందని చెప్పబడింది.

అల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను’మినుబిహి వ నతవక్కలు అలైహ్. వ న’ఊదుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యి’ఆతి అ’మాలినా. మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్, వ మై యుద్లిల్ ఫలా హాదియ లహ్.వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నదీరా. అమ్మా బ’అద్

ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్. వ ఖైరల్ హద్యి హద్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా. వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్. వ కుల్ల దలాలతిన్ ఫిన్ నార్.

قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ
(ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్)
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. (3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.(4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి). తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (33:70-71)

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానం ఏమిటంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు.

ఆ విధంగా ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే, ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒకచోట పొందుపరిచి, ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనం చూచినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్ షా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని సూర బఖరా, రెండవ అధ్యాయం, 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖుర్ఆన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖుర్ఆన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది, ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇన్ షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖుర్ఆన్ లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్)
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.(15:9)

అనగా, మేమే ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవలసిన ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు, ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు, మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు.

ఈ రోజు మనం కువైట్ లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూచినా పూర్తి ఖుర్ఆన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖుర్ఆన్, మరో దేశంలో మరోలాంటి ఖుర్ఆన్ మీకు కనిపించదు. ప్రపంచ నలుమూలలా మీరు ఎక్కడికి వెళ్లి చూసినా ఒకే రకమైన ఖుర్ఆన్ దొరుకుతుంది.

అలాగే, ఖుర్ఆన్ కి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖుర్ఆన్ గ్రంథాలన్నిటినీ తీసుకుని వెళ్లి సముద్రంలో పడివేసినా, మళ్లీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫిజ్ లు, ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో, వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్లీ ఖుర్ఆన్ ను రచించుకోగలరు. ఎందుకంటే ఖుర్ఆన్ ని ప్రారంభం నుండి చివరి వరకు, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ అ’ఊదు బిరబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫిజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు. అల్ హమ్దులిల్లాహ్. ఏడు సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి కూడా ఖుర్ఆన్ ని కంఠస్థం చేసినవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు.

అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజల హృదయాలలో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖుర్ఆన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూచినట్లయితే, ఆ గ్రంథములోని ఒక్క చాప్టర్ నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ ని మళ్ళీ రచించుకోవడానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసినవాళ్లు ఎవరూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

అలాగే ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరికీ ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవితకాలం నుండి నేటి వరకు కూడా ఎవరూ ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్ షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభువు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి, ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరూ తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరా, రెండవ అధ్యాయం, రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహ్)
“ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” (2:2)

ఈ గ్రంథంలో ఎంతమాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూచినట్లయితే అభిమాన సోదరులారా, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట దేవుడు ఒక్కడు అంటే, ఒకచోట దేవుడు ఇద్దరు, ముగ్గురు అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖుర్ఆన్ ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము.

అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప ఘనుడు కాబట్టి, ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూచినట్లయితే సూర యాసీన్, 36వ అధ్యాయము, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

يس وَالْقُرْآنِ الْحَكِيمِ
(యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్)
“యాసీన్. వివేకంతో నిండిన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!” (36:1-2) అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖుర్ఆన్ ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖుర్ఆన్ రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖుర్ఆన్ చదివిన వాళ్ళు చాలామంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి చాలామంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి రెండు ఇన్ షా అల్లాహ్ ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను.

ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్, దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైనవారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, “చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్.” విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. “అతని మాటలు నువ్వు వినకు. ఎందుకంటే అతని మాటలు నీవు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు. నీ తల్లిదండ్రులకు, నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు. అతనితో నువ్వు దూరంగా ఉండు. నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా” అన్నారు.

వారి మాటలని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసీ, ముహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని. నేను ముహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిదైతే మంచిదనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డదనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకొని ఆయన ముహమ్మద్ వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన చదువుతున్న గ్రంథాన్ని, చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించారు.

ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడికక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, “ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్ర తంత్రాలు కావు. అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు. నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజల వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు ప్రవక్త అని. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ యే దేవుడు అని” అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూశారా అభిమాన సోదరులారా.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, “ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా. ఏదేదో వాగేస్తున్నాడు. నీకు ఏదో మంత్ర తంత్రాలు వచ్చు కదా. పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా. నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా” అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మాడు. నిజమే అని నమ్మి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉంది కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు. నాకు వైద్యం చేయడం వచ్చు. కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను. మీరు వైద్యం చేయించుకోండి” అన్నారు.

దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను. నువ్వు విను. విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తున్నది పిచ్చివాని మాటలా, మంత్ర తంత్రాలా, ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు” అని చెప్పారు. “సరే చెప్పండి ఓ ప్రవక్త” అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ లోని రెండు చిన్న సూరాలు వినిపించారు. సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్. రెండు చిన్న సూరాలు వినిపించగానే, అక్కడికక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేయి పట్టుకొని ఏమన్నాడంటే, “నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను. నేను మాంత్రికుల నోటి నుండి మంత్ర తంత్రాలు విని నేర్చుకొని ఉన్నాను. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది మంత్రము కాదు. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది కవిత్వము కాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్ర తంత్రాలకు అతీతమైన పలుకులు” అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని అల్లాహ్ యే ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు.

చూశారా అభిమాన సోదరులారా, అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ అంధకారంలో ఉన్నవారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత.

అలాగే, మనం ఖుర్ఆన్ కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూచినట్లయితే, ఖుర్ఆన్ ద్వారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్నవారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలిచి నిలబడిపోతాయి ఖుర్ఆన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే గనుక. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి. బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్.

ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేవో చెప్తా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖుర్ఆన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశాడు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖుర్ఆన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా? లేదా మక్కా పెద్దలు చెప్తున్న మాటలు నిజమని నమ్మాలా? అయోమయంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్.

చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువైపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే కదా జరుగుతా ఉండేది, కాబట్టి ముహమ్మద్ నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకొని ఆయన కత్తి పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈ రోజు ప్రాణం తీసేస్తాడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓ ఉమర్, ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసాడు. “ఈ ముహమ్మద్ వల్ల నేను అయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను” అని చెప్పేసాడు.

అప్పుడు ఆయన అన్నారు, “అయ్యా, ముహమ్మద్ విషయం తర్వాత. ముందు నీ చెల్లెలు, నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు. ముహమ్మద్ మాటల్లో వచ్చేసారు. ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో” అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటివారు, సొంత వాళ్ళ చెల్లెలు, బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు అన్న విషయాన్ని తెలుసుకోగా, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళాడు.

దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖుర్ఆన్ చదువుతూ ఉండింది, కొన్ని పత్రాలు తీసుకుని. అవి బంద్ చేసేసి ఒకచోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్లి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు. “నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను నేను. మీరు ఏదో చదువుతా ఉన్నారు. ఏంటి అది?” అని ప్రశ్నించాడు. “నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా. తాత ముత్తాతల ధర్మాన్ని, మార్గాన్ని వదిలేశారంట కదా. నిజమేనా?” అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆవిడ అంది, “లేదు లేదు” అని ఏదో రకంగా ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే, “ఆ నేను వినింది నిజమే” అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని, బావని ఇద్దరినీ చితకబాదేశాడు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనింది అంటే, “ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. మేము ముహమ్మద్ వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాము. అల్లాహ్ యే ప్రభువు అని నమ్మేసాము. తాత ముత్తాతల మార్గాన్ని వదిలేసాము. నువ్వు చంపుతావో, ఏమి చేస్తావో చేసుకో. ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము. ఏం చేస్తావో చేసుకో” అని.

అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, “అమ్మా, నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో, నాకు కూడా కొంచెం వినిపించు చూద్దాం” అన్నాడు. అప్పుడు చెల్లెలు అన్నారు, “లేదయ్యా, ముందు వెళ్లి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను.” వెళ్లి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెలు వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా, ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం ముహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి, ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, “సుబ్ హా నల్లాహ్! ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి! ముహమ్మద్ వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ముహమ్మద్ వారు తీసుకువచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.

చూశారా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లిపోయారు. చూసిన వాళ్ళు కంగారుపడిపోయారు, ఉమర్ వచ్చేసాడు ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. అల్లాహ్ యే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త” అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ “అల్లాహు అక్బర్” అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసివచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి శక్తి అల్లాహ్ పెట్టి ఉన్నాడంటే కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది. హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

అలాగే అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ కు ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకుని వ్యక్తి ప్రారంభిస్తే, ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తికి పదేసి పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్లీ చెప్పారు, “ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి మూడు అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి మూడు అక్షరాలు చదివిన పుణ్యం, అనగా ముప్పై పుణ్యాలు అతనికి లభిస్తాయి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖుర్ఆన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు, కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు, మనిషి శరీరంలో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖుర్ఆన్ ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతని ఇస్తుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా.

అలాగే ఈ ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, “మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గానీ, సైన్స్ కూడా ఖుర్ఆన్ లో ఉందా?” అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకునిపోతే చాలా విషయాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించేవాళ్లు అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది, “రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, రండి చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి చదివి గ్రహించండి” అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనం.

అలాగే, పరలోకంలో కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఇన్ షా అల్లాహ్ రెండు మూడు విషయాలు చెప్పేసి నా మాటను ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖుర్ఆన్ ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న.

ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, “నీ ప్రభువు అల్లాహ్ అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని నీకు ఎలా తెలిసింది?” అని నాలుగవ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, “నేను దైవ గ్రంథమైన ఖుర్ఆన్ ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను” అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారట, “నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభము కలుగుగాక. నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో” అని దూతలు అతనికి చూపించేస్తారట. అతను సంతోషపడిపోతాడు అభిమాన సోదరులారా.

చూశారా? సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖుర్ఆన్ గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తల వైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తల వైపు నుంచి వస్తారో, ఖుర్ఆన్ గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందట, “ఈ వ్యక్తి ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివిన వాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పేస్తుందట. అల్లాహు అక్బర్. చూశారా.

ఆ తర్వాత దూతలు అతని కుడి వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దానధర్మాలు అక్కడికి వచ్చి, “మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఈ భక్తుడు ప్రపంచంలో దానధర్మాలు చేసేవాడు కాబట్టి, మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని దానధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రపంచంలో అతను నమాజ్ చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ, వెళ్తూ, వస్తూ, వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, “మీరు ఎక్కడికి వస్తున్నది? ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్ళతోనే నడిచి నమాజ్ కు వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూశారా అభిమాన సోదరులారా. సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం.

ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరినీ మళ్లీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు. ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గానీ, తండ్రి గానీ, స్నేహితుడు గానీ, సోదరి గానీ, భార్య గానీ, బిడ్డలు గానీ ఎవరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారుపడిపోతూ ఉంటే, ఖుర్ఆన్ గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖుర్ఆన్ గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖుర్ఆన్ చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను. ఇతనిని మన్నించి నీవు స్వర్గానికి పంపించు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఈ ఖుర్ఆన్ గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖుర్ఆన్ యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట.

చూశారా అభిమాన సోదరులారా. ఎవరూ పనికిరాని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా.

మరొక విషయం ఏమిటంటే, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునితో అంటారట, ఏమని అంటాడో తెలుసా? “ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివేవాడివో, ఇక్కడ కూడా స్వర్గంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు, ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం పూర్తి అవుతుందో అప్పటివరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ, ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం ఆగిపోతుందో అదే నీ స్థానము” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటిస్తాడు. చూశారా. ఈ ఖుర్ఆన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, ఖుర్ఆన్ గ్రంథం యొక్క ప్రత్యేకతలని అర్థం చేసుకుని ఖుర్ఆన్ గ్రంథాన్ని గౌరవిస్తూ, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖుర్ఆన్ ద్వారా ప్రపంచంలో కూడా మాకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు స్వర్గం ప్రసాదించు.” ఆమీన్.

అఖూలు ఖౌలీ హాదా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25451

ఖుర్ఆన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

దైవ ప్రవక్త ﷺ మహత్యం , అద్భుతాలు మరియు ప్రత్యేకతలు | జాదుల్ ఖతీబ్

ఖత్బా యందలి ముఖ్యాంశాలు:

  • 1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మహత్యం
  • 2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలు అద్భుతాలు
  • 3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకతలు

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/greatness-miracles-of-the-holy-prophet
[PDF [32 పేజీలు]

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సహోదరులారా! 

దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు 

కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత 

1) శ్రేష్ట వంశము 

తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు. 

ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు: 

నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276) 

ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773) 

2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం 

వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: 

“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164) 

ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”

(హాకిమ్: 1/91 – సహీ)