ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి [వీడియో & టెక్స్ట్]

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి
బులూగుల్ మరాం | హదీస్ 1237
https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;

“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)

అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు

ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.

వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
(వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ
(ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్)
మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.

وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ
(వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్)
మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.

فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ
(ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్)
మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.

సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.

ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.

ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

رَحِمَ اللَّهُ عَبْدًا
(రహిమల్లాహు అబ్దన్)
అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.

ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!

نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ
(నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు)
ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.

فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ
(ఫ హమిదల్లాహ వ షకరహ్)
ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!

وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు)
మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.

فَجَدَّ وَاجْتَهَدَ
(ఫ జద్ద వజ్తహద్)
ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.

అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:

خَصْلَتَانِ
(ఖస్లతాని)
రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని

شَاكِرًا صَابِرًا
(షాకిరన్ సాబిరా)
కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ

వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?

مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ
(మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్)
ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.

وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ
(వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్)
మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు)
కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,

وَآسَفَ عَلَى مَا فَاتَهُ
(వ ఆసఫ అలా మా ఫాతహు)
అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.

فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا
(ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా)
ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.

అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.

అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.

ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.

తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.

ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.

ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.

ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.

కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19057

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి [వీడియో | టెక్స్ట్]

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280
https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:

“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”

సారాంశం:

ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.

ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.

బులూగుల్ మరాం – హదీథ్ నంబర్ 1280.

وَعَنْ جَابِرٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ، وَاتَّقُوا الشُّحَّ فَإِنَّهُ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ
[ఇత్తఖు జుల్మ ఫఇన్న జుల్మ జులుమాతున్ యౌమల్ ఖియామ, వత్తఖుష్షుహా ఫఇన్నహు అహలక మన్ కాన ఖబ్లకుమ్]

హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.

ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.

షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.

ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.

అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.

మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.

కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.

ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.

ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.

ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.

ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.

అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).

షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.

అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.

وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1