అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి(హఫిజహుల్లాహ్)
https://youtu.be/omW0Jrb-7Xk [5 నిముషాలు]

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రమైన విధేయతను చర్చిస్తుంది. ఒక విశ్వాసి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ఆదేశాల కంటే ఇతరుల—కుటుంబం, పండితులు లేదా తనతో సహా—మాటలకు లేదా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చా అనే కేంద్ర ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. అలాంటి ప్రాధాన్యత అనుమతించబడదని వక్త ఖురాన్ (సూరా అల్-హుజురాత్ 49:1 మరియు సూరా అల్-మాయిదా 5:2) మరియు బుఖారీ, ముస్లింల నుండి ఒక హదీసును ఉటంకిస్తూ దృఢంగా స్థాపించారు. నిజమైన విశ్వాసానికి దైవిక ఆదేశాలకు సంపూర్ణ లొంగుబాటు అవసరమని, మరియు మతపరమైన విషయాలలో ఏదైనా విచలనం, జోడింపు లేదా స్వీయ-ఉత్పన్నమైన తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే “ముందుకు వెళ్ళడంగా” పరిగణించబడుతుందని దీని ముఖ్య సారాంశం. పుణ్యం మరియు ధర్మబద్ధమైన పనులలో సహకారం ప్రోత్సహించబడింది, కానీ పాపం మరియు అతిక్రమణ విషయాలలో ఖచ్చితంగా నిషేధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా? ఈ ప్రశ్నకి మనము ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలపై మనం ఇతరులకు, ఆ ఇతరులు బంధువులు కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, పండితులు కావచ్చు, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?ముమ్మాటికీ లేదు. మనము అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలపై ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరతుల్ హుజురాత్, ఆయత్ నంబర్ ఒకటిలో ఇలా సెలవిచ్చాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లహి వ రసూలిహీ వత్తఖుల్లాహ, ఇన్నల్లాహ సమీవున్ అలీమ్)

విశ్వాసులారా, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడు.” (49:1)

అంటే ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం గానీ, తమ ఆలోచనలకు పెద్ద పీట వేయటం గానీ చేయరాదు. దీనికి బదులు వారు అల్లాహ్ కు, దైవ ప్రవక్తకు విధేయత చూపాలి. తమ తరఫున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించటం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తకు మించిపోవటంగా భావించబడతాయి.

అలాగే, ఖురాన్ మరియు హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరీఅతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే, ఇక దాని కోసం ప్రాకులాడకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలను శిరోధార్యంగా భావించటమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి.

దీనికి సారాంశం బుఖారీ మరియు ముస్లింలోని ఒక హదీస్ ఉంది. దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిధేయతకు, అంటే అల్లాహ్ అవిధేయతకు దారి తీసే ఏ విషయంలోనూ ఎవరికీ విధేయత చూపకూడదు. అయితే మంచి విషయాలలో విధేయత చూపవచ్చు అన్నమాట. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.

ఈ విషయాన్నే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో సెలవిచ్చాడు,

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَلْعُدْوَانِ
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి (5:2)

అంటే అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరుని తోడుపడుతూ ఉండండి, సహాయం చేస్తూ ఉండండి, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండండి, తోడుపడుతూ ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత అల్లాహ్ కి, ప్రాధాన్యత ఆయన ప్రవక్తకి మాత్రమే ఇవ్వాలి.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43614