ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: అల్లాహ్ నామాలపై, గుణగణాలపై విశ్వాసం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండండి. అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఇస్లాంలో అఖీదా పరంగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, గుణగణాలపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఇస్లాంలో దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. అల్లాహ్ తన మహోత్తరమైన దివ్య గ్రంథం ఖురాన్ లో తన గుణగణాలను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు:
وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا
మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మరొకచోట ఇలా ప్రస్తావించబడింది.
إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعَۢا بَصِيرٗا
నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు మరియు చూసేవాడు
ఇలాంటి వాక్యాలు దివ్య ఖురాన్ లో అనేక చోట్ల అనేకమార్లు ప్రస్తావించబడ్డాయి. అదే విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా హదీసులలో అనేకసార్లు అల్లాహ్ యొక్క స్తోత్రం, ఆయన గుణగణాలను గురించి కొనియాడేవారు.
అల్లాహ్ యొక్క నామాలపై, గుణగణాలపై విశ్వాసం ఉంచడం వలన దాసునిలో దైవభీతి మరియు భక్తితత్వం పెరుగుతుంది. దాని ద్వారా అల్లాహ్ దాసుని పట్ల ఎంతో సంతోషిస్తాడు. (ఎందుకంటే వాస్తవికత కూడా ఇదే) దాసుడు అల్లాహ్ గురించి ఎంత తెలుసుకుంటాడో అల్లాహ్ తో అంతే భయపడతాడు. ఉదాహరణకి, అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّمَا يَخۡشَى ٱللَّهَ مِنۡ عِبَادِهِ ٱلۡعُلَمَٰٓؤُاْۗ
అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు.
సర్వం అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, ఆయన గుణగణాలపై విశ్వాసం తేవడం యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు వీటి ద్వారా తెలుస్తుంది. అందుకే దాసునిపై విధి ఏమిటంటే అతను అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, గుణగణాలపై అదే విధంగా విశ్వాసం తీసుకురావాలి ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ లో మరియు ప్రవక్త హదీసులలో బోధించబడిందో.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క నామాలను ఆయన గుణగణాలను విశ్వసించడానికి రెండు ఆవశ్యకతలు ఉన్నాయి.
మొదటిది: అవి వెల్లడి చేసిన విధానంలో, వాటి స్పష్టమైన అర్థంలో ఎలాంటి ఎలాంటి వక్రీకరణలు, అనుసరణులు, దిద్దుబాటులు లేకుండా అర్థం చేసుకోవడం.
క్రింది వక్రీకరణలు చేయకూడదు:
- తహ్ రీఫ్’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట.
- ‘తతీల్’ అంటే: అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. ఉదాహరణకు అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట.
- ‘తక్ యీఫ్’ అంటే: అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. ఉదాహరణకు అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట.
- ‘తమ్‌సీల్ అంటే: అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.
అల్లాహ్ ఇలా తెలియజేశాడు:
وَلِلَّهِ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰۚ
మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు.
మరొకచోట ఇలా తెలియజేయడం జరిగింది.
لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ
ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు.
రెండవ ఆవశ్యకత ఏమనగా: అల్లాహ్ యొక్క ఏయే పేర్లు మరియు గుణగణాలు ఖురాన్ మరియు హదీసులలో తెలియ చేయబడ్డాయో కేవలం వాటిపై మాత్రమే సరిపెట్టుకొని, వాటిపై మాత్రమే విశ్వాసము ఉంచడం. అందులో కొత్త పేర్లు చేర్చడం కానీ లేక మార్పు చేర్పులకు గురిచేయడం కానీ చేయరాదు.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ ఇలా తెలియచేశారు:
“అల్లాహ్ తఆలా ఏవైతే తన ప్రియమైన పేర్లను, ఉన్నతమైన స్వభావం కలిగిన గుణాలను గురించి తెలియజేశారో వాటికంటే గొప్పగా ఎవరూ కూడా తెలియజేయలేరు. ఇది అల్లాహ్ యొక్క ఔన్నత్యం”.
(ఖాజీ అబూ యాలా “తిబఖాతుల్ హనాబిల లో ఈ విషయాన్ని తెలియచేసారు)
ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క పేర్లకు, గుణగణాలకు విరుద్ధం ఏమిటంటే వాటిలో నాస్తికత్వాన్ని చేర్చడము (ఇల్ హాద్ కి పాల్పడటం) అనగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలను మరియు గుణగణాల అర్ధాలను ఏవిధంగానైతే మన పూర్వీకులు సలఫ్ పండితులు అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోకపోవడం.
ఇల్ హాద్ అనేక రకాలు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ పేర్ల యొక్క అసలు అర్ధాన్ని మార్చడం, లేకపోతే అసలు అర్థమే లేకుండా చేయడం. ఈ రెండు విషయాలు విశ్వాసానికి విరుద్ధమైనవి మరియు అలాంటి మార్పుచేర్పులకు గురి అయిన పేర్లను అజ్ఞానంతో అల్లాహ్ వైపు ఆపాదించడం ఘోరమైన పాపం మరియు సలఫ్ పండితులు వారించినటువంటి బిద్అత్ లలో ఒకటి అవుతుంది. అల్లాహ్ అలాంటి వారిని శిక్ష గురించి హెచ్చరిస్తున్నాడు.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.
మరో చోట ఇలా సెలవిచాడు:
[وَلَا تَقۡفُ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۚ إِنَّ ٱلسَّمۡعَ وَٱلۡبَصَرَ وَٱلۡفُؤَادَ كُلُّ أُوْلَٰٓئِكَ كَانَ عَنۡهُ مَسُۡٔولٗا]
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.
ఓ విశ్వాసులారా! ఇల్ హాద్ రకాలలో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం. అనగా అసలు పేరు యొక్క అర్ధాన్ని మార్చడం. వీటి గురించి సలఫ్ పండితులు అనగా మన పూర్వీకులు ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం ఉన్నవారు మాత్రమే వీటి అసలు అర్థాలను గ్రహించగలరు. ఉదాహరణకు మన సహాబాలు జ్ఞానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి నేర్చుకున్నారు మరియు చిత్తశుద్ధితో ఆయనకు విధేయత చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైతం వారి గురించి ఇలా సాక్ష్యం ఇచ్చారు – “అందరికంటే మంచివారు, ఉత్తమమైన వారు నా కాలం నాటివారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చిన వారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వారు“. (బుఖారి -2652 ముస్లిం -2533)
దీని ద్వారా మనకు తెలిసొచ్చే దేమిటంటే ఏ విషయమైతే సహాబాల ఆలోచనకు విరుద్ధంగా ఉంటుందో ఆ విషయానికి ధర్మానికి ఏ సంబంధం లేదు. అది కేవలం ఒక కల్పితం మాత్రమే అవుతుంది. అల్లాహ్ యొక్క నామాలలో సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం యొక్క ఉదాహరణ: (అల్లాహ్ సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) దీని భావం ఆయన అక్కడి నుండి తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. కానీ భావించే వాళ్ళు మాత్రం ఆయన అక్కడ సింహాసనంపై ఉన్నతంగా ఉన్నాడు అనే విషయాన్ని తిరస్కరిస్తారు.
మరొక రకం ఏమిటంటే అల్లాహ్ పేర్లలో ఏదైనా పేరు గురించి దాని స్వభావాన్ని గురించి అనేక రకాలుగా ఆలోచించడం. ఇది పూర్తిగా నిషేధించబడింది. ఎవరు కూడా తమ జ్ఞానం తో అల్లాహ్ ను గ్రహించలేరు. అల్లాహ్ ఇలా అంటున్నాడు [وَلَا يُحِيطُونَ بِهِۦ عِلۡمٗا] (కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.) అనగా ఈ వాక్యంలో అల్లాహ్ గురించి ఆయన ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాల గురించి ఆలోచించడాన్ని అల్లా పూర్తిగా వారించాడు.
మన సలఫ్ పండితులు కూడా ఈ విషయాన్ని కఠినంగా తిరస్కరించారు. ఒక వ్యక్తి ఇమామ్ మాలిక్ బిన్ అనస్ (రహిమహుల్లాహ్) గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఓ (అబూ అబ్దుల్లాహ్) అల్లాహ్ (రహ్మాన్) ఆర్ష్ పై ఎలా ఆసీనుడై ఉన్నాడు.? అని ప్రశ్నించాడు. దానికి ఇమామ్ గారు కొద్దిసేపు తలవంచుకున్నారు. చమటలు కూడా పట్టసాగాయి. కొద్దిసేపు తర్వాత ఇలా సమాధానమిచ్చారు:
అల్లాహ్ ఆసీనుడై ఉన్నాడు అనేటువంటిది అర్థమయ్యేటువంటి విషయమే. కానీ ఎలా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? అనే విషయం ఇది మనిషి ఊహకు అందనటువంటిది. కనుక దీనిపై విశ్వాసం తేవడం తప్పనిసరి, మరియు దాని గురించి అనవసరమైన ప్రశ్నలు వేయడం బిద్అత్ అవుతుంది. నువ్వు నాకు బిద్అతి లాగే కనిపిస్తున్నావు.
వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. (బైహఖీ ఫీ అస్మా వ సిఫాత్)
ఇబ్నెఉతైమీన్ (రహిమహుల్లాహ్) గారు ఇమామ్ మాలిక్ గారి మాట గురించి వివరణ ఇస్తూ ఇలా తెలియజేశారు.
ఇమామ్ మాలిక్ చెప్పినటువంటి మాట అన్నింటికీ కొలమానం. అల్లాహ్ యొక్క పవిత్ర నామాలకు మరియు గుణగణాలకు సంబంధించిన అతి ఉన్నతమైన మాట. అల్లాహ్ గుణగణాలు ఎలా కలిగి ఉన్నాడు? అని ప్రశ్నించడం బిద్అత్ అవుతుంది. ఎందుకంటే సహాబాలు మేలు కలిగేటువంటి ప్రతి విషయాన్ని గురించి మరియు అల్లాహ్ యొక్క సద్గుణ విశేషాలకు సంబంధించిన ప్రతి జ్ఞానం గురించి తెలుసుకోవడానికి మనకంటే చాలా ముందుండేవారు. అయినప్పటికీ వారిలో ఎవరు కూడా అల్లాహ్ గురించి ఆయన సద్గుణ విశేషాల గురించి ఏవిధమైన అనవసర విషయాల జోలికి వెళ్లలేదు. (షరహ్ అఖీదతుల్ వాసితియా)
అల్లాహ్ యొక్క పవిత్ర నామాలలో ఇల్హాద్ కు పాల్పడటం యొక్క మరొక రకం ఏమిటంటే అల్లాహ్ ను ఇతరులతో పోల్చడం: ఉదాహరణ ఇతరుల చేతులను అల్లాహ్ చేతుల్లా ఉన్నాయి అనడం. అల్లాహ్ వీటి అన్నిటినుండి పరమ పరిశుద్ధుడు.
నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) ఆయన ఇలా అన్నారు:
ఎవరైతే అల్లాహ్ ను సృష్టి తో పోల్చారో వారు కాఫిర్ అవుతారు మరియి ఎవరైతే ఆయన గుణ గణాలను తిరస్కరిస్తారో వారు కూడా కాఫిర్ అవుతారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ గుణగణాల గురుంచి అయితే తెలియచేశారో అందులో ఏ విధమైన పోలిక మనకు లభించదు. (అల్ ఉలూ 464)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క పవిత్ర పేర్లు మరియు ఆయన గుణగణాలలో ఎటువంటి మార్పు చేర్పులు చేయకుండా అర్థం చేసుకోవడం అఖీదాలోని భాగం. నలుగురు ఇమాములు కూడా ఈ విషయాన్ని ఏకీభవించారు
ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అల్ షైబాని (వీరు ఇమామ్ అబూ హనీఫా గారి శిష్యులు) ఈ విధంగా తెలియజేశారు:
పడమర నుండి తూర్పు వరకు ఉన్నటువంటి జ్ఞానవంతులైన పండితులు, ఇస్లాం ధర్మ శాస్త్రవేత్తలు అందరూ ఏకీభవించిన విషయం ఏమిటంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నుండి ఆయన అనుచరులు సత్యవంతులైన ఉల్లేఖుకులు ఎవరి ద్వారా అయితే ఈ ఖురాన్ మరియు హదీస్ మనదాక చేరిందో అందులో అల్లాహ్ యొక్క ఉన్నత మైన గుణగణాలు ఏవైతే వెల్లడించ బడ్డాయో వాటిపై ఎటువంటి పోలిక మరియు ఇతర భావాలు తీయకుండా విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. మరియు ఎవరైతే ఆ పేర్లలో లేక గుణగణాలలో తమ ఇష్టానుసార భావాలను తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తారో, వారు ఇస్లామియా పరిధి నుంచి తప్పుకుంటారు. కనుక ఖురాన్ మరియు హదీస్ లో తెలియ చేయబడిన వాటి పైనే విశ్వాసం తెచ్చి సరిపెట్టుకోవాలి. (షరహ్ ఉసూల్ ఎతెఖాద్ అహ్లు స్సున్నహ్)
ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు:
“నేను అల్లాహ్ పై ఆయన కోరుకున్న విధంగా మరియు ప్రవక్త పై ఆయన కోరుకున్న విధంగా విశ్వాసం తీసుకువస్తాను”. (జమ్ అత్తావీల్)
ఇబ్నె తైమీయా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:
దివ్య ఖురాన్ లో అల్లాహ్ యొక్క గుణగణాల పై ఎన్ని వాక్యాలు అయితే ఉన్నాయో వాటి అర్ధాలలో కానీ లేక భావంలో కానీ సహాబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. నేను సహాబాల ద్వారా లిఖించబడిన ఎన్నో తఫ్సీర్ లను మరియు హదీసులను చదివాను. వాటికి సంబంధించిన చిన్న,పెద్ద పైపెచ్చు గ్రంధాలను సైతం పరిశీలించాను. కానీ నేను ఇప్పటి వరకు ఏ సహాబీని కూడా అల్లాహ్ యొక్క గుణాలు ఉన్న ఖురాన్ వాక్యాలలో లేక హదీసుల్లో కానీ విరుద్ధమైన లేక వ్యతిరేకమైన అర్ధాలను వారు తెలియపరచినట్లు చూడలేదు. ఖురాన్ వాక్యాలలో మరియు హదీసులలో వచ్చినటువంటి అల్లాహ్ యొక్క గుణగణాలను వారు స్వీకరించారు మరియు ఎవరైతే దీనికి విరుద్ధంగా అనేక మార్పులకు ప్రయత్నించారో వారిని వ్యతిరేకించారు మరియు వారి మాటలను కొట్టివేశారు . (మజ్మూఅల్ ఫతావా)
ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) అల్లాహ్ యొక్క వాక్యం [ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ] (ఆయన సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) యొక్క తఫ్సీర్ లో ఇలా రాశారు.
[ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ] (ఆయన సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) అన్నటువంటి అల్లాహ్ వాక్యం గురించి పండితుల యొక్క ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, నేను వాటిని ఇక్కడ తెలియపరచలేను. ఎందుకంటే మన పూర్వీకుల విధానం పైనే నేను అమలు చేస్తున్నాను. ఉదాహరణకి మాలిక్, ఔజాయి, సౌరీ, లైస్ బిన్ సాద్, షాఫయీ, అహ్మద్, ఇస్ హాక్ బిన్ రాహ్వై ఇలాంటి ఎందరో పూర్వ పండితులు మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఇస్లాం ధర్మవేత్తల విధానం ఏమిటంటే, అల్లాహ్ యొక్క పవిత్ర నామాలను మరియు గుణగణాలను అలానే నిరూపించాలి ఎలా అయితే అవి వెల్లడించబడ్డాయో. అందులో ఎటువంటి వక్రీకరణ గాని లేక ఎవరితోనైనా పోల్చడం గాని ఎటువంటి మార్పు చేర్పులకు గాని గురి చేయరాదు. మరియు అల్లాహ్ పవిత్ర నామాలు, గుణగణాల యొక్క ఏదైతే అర్థం మన యొక్క ఆలోచనలో వస్తుందో ఆ అర్ధాన్ని అల్లాహ్ తిరస్కరించారు. ఎందుకంటే ఏ సృష్టి కూడా అల్లాహ్ ను పోల్చలేదు. [لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ] (ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు)
వాస్తవికత కూడా ఇదే. ధార్మిక పండితులు దీని గురించే వివరించారు. అందులో నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) కూడా ఉన్నారు. ఆయన ఇలా అన్నారు:
ఎవరైతే అల్లాహ్ ను సృష్టితో పోల్చారో వారు కాఫిర్ అవుతారు. మరియు ఎవరైతే ఆయన గుణగణాలను తిరస్కరిస్తారో వారు కూడా కాఫిర్ అవుతారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ గుణగణాల గురించి అయితే తెలియచేశారో అందులో ఏ విధమైన పోలిక మనకు లభించదు. కనుక ఎవరైతే అల్లాహ్ పవిత్ర నామాలను ఖురాన్ మరియు హదీస్ లో ఉన్న విధంగా నిరూపిస్తారో అసలు వారే సరైన మార్గం పై ఉన్నవారు.
అబ్దుర్రహ్మాన్ బిన్ అల్ ఖాసిం అల్ మక్కీ (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:
అల్లాహ్ ఖురాన్ లో తన ఏ గుణగుణాల గురించి అయితే తెలియజేయలేదో అలాంటి వాటిని అల్లాహ్ వైపు ఆపాదించడం ఏ వ్యక్తికి కొరకు తగదు. మరియు ఆయన చేతులను కూడా మరొకరితో పోల్చడం తగదు. ఉదాహరణకి ఇలా అనవచ్చు – ఆయనకు రెండు చేతులు ఉన్నాయి, ఏ విధంగానైతే ఖురాన్ లో దీని గురించి ప్రస్తావించబడిందో అలానే ఉన్నాయి. మరియు ఆయనకు ఒక ముఖం కూడా ఉంది, ఖురాన్ లో అల్లాహ్ దాని గురించి కూడా తెలియజేశాడు. అయితే మనం వీటిని విశ్వసించాలి మరియు వాటితోనే సరిపెట్టుకోవాలి, ఎందుకంటే అల్లాహ్ ను పోలినటువంటి వస్తువు ఈ సృష్టిలో లేదు. ఆయన తప్పనిజ ఆరాధ్య దైవం కూడా సృష్టిలో లేడు. అల్లాహ్ తన ఒక గుణం గురించి ఇలా తెలియజేశాడు – “ఆయన రెండు చేతులు తెరవబడి ఉన్నాయి” మరి ఆ చేతులు ఎలా ఉన్నాయి? అనేటువంటి విషయం కూడా ఖురాన్ లో వెల్లడించబడింది [وَٱلۡأَرۡضُ جَمِيعٗا قَبۡضَتُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَٱلسَّمَٰوَٰتُ مَطۡوِيَّٰتُۢ بِيَمِينِهِۦۚ] (పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి) (ఉసూలు స్సున్నహ్)
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ ముస్లింలారా! మనిషి యొక్క హృదయం, తెలివి మరియు శరీర అవయవాలకు అల్లాహ్ యొక్క గుణగణాలు తెలుసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా ప్రస్తావించారు:
“అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు ఉన్నత మైన గుణగణాలు మనిషి యొక్క దైవ దాస్యం మరియు జీవిత వ్యవహారాలపై అదే విధంగా ప్రభావం చూపుతాయి, ఏ విధంగా అయితే సృష్టి ప్రక్రియ పై ప్రభావం చూపే అవశ్యకత ఉందో. అల్లాహ్ యొక్క ప్రతి గుణానికి ప్రత్యేక ఆరాధన ఉంది. వాటి గురించి జ్ఞానం సముపార్జించడం యొక్క అవశ్యకత ఎంతైనా ఉంది. కనుక దాసుడు తప్పనిసరిగా లభనష్టాలు, కలిమిలేములు ఇవ్వడం, తీసుకోవడం, సృష్టి జీవనోపాది, చావు బ్రతుకులు ప్రసాదించడంలో అల్లాహ్ కు సాటి ఎవరు లేరని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో విశ్వసించాలి. అలా విశ్వసించడం వలన కలిగే లాభం ఏమిటంటే మనిషిలో అంతర్గత హృదయంలో అల్లాహ్ పై నమ్మకం కలుగు తుంది మరియు అల్లాహ్ యొక్క శుభఫలాలు వారి జీవితంలో వర్షిస్తాయి.
అల్లాహ్ యొక్క వినికిడి, ఆయన చూపు, ఆయనకున్న మహత్తర జ్ఞానం ఎంత ఉన్నతమైనది అంటే ఈ భూమ్యాకాశాలలో ఉన్న ఏ రవ్వంత వస్తువు కూడా దాగి లేదు. అంతర్గత బహిర్గత విషయాలన్నీ ఎరిగినవాడు. అల్లాహ్ కనుచూపు కోణలను సైతం ఎరిగిన వాడు. హృదయాలలో దాగి ఉన్న గుట్టు సైతం తెలిసినవాడు అల్లాహ్. ఈ విషయాలు తెలుసుకోవడం వలన కలిగే లాభం ఏమిటంటే దాసుడు తన నాలుకను, శరీర అవయవాలను మరియు తన ఆలోచనలను అల్లాహ్ కు అయిష్టమైన పనుల నుండి కాపాడు కుంటాడు మరియు ఏ పనులు అయితే ఇష్టమో వాటి పై ఆచరిస్తాడు.
అదేవిధంగా దాసుడు అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆయన మహిమ, గౌరవం గురించి తెలుసుకోవడం వలన అతనిలో అవి వినయం, వినమ్రత, ప్రేమ పెంచుతాయి. ఆరాధనలో మనసును లీనం చేయడానికి తోడ్పడతాయి. దాని ద్వారా మనిషిలో దైవ దాస్యం పెరుగుతుంది.
అదే విధంగా ఆరాధనలు అన్నీ అల్లాహ్ యొక్క పవిత్ర నామాలు గుణగణాల వైపే మరులుతాయి. దాని వలన అల్లాహ్ మరియు దాసుని మద్య సంభందం బలపడుతుంది. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సృష్టి పరంగా కానీ లేక , ఆయన అజ్ఞా పాలన పరంగా కానీ ఈ విశ్వంలో అల్లాహ్ పవిత్ర నామాల యొక్క ప్రభావం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది”. (మిఫ్ తాహు దారు స్సఆదహ్)
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యాని కై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు:
[إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا]
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి .
ఓ అల్లాహ్! మమ్ములను ఇస్లాం మరియు ముస్లింలను నష్టంలో ముంచే ఆలోచన ఎవరికైతే ఉందో వారిని వారిలోనే నిమగ్నం చేసేయి. వారి ఆలోచనను వారివైపే త్రిప్పికొట్టు . ఓ అల్లాహ్! ఖరీదుల పెరుగుదల, వడ్డీ, వ్యబిచారము, భూకంపాలు, పరీక్షలను మా నుండి దూరం చేయి. ప్రత్యేకంగా మా దేశము నుండి మరియు సాదారణంగా ముస్లిముల అన్నీ దేశాలనుండి బాహ్యమైన, అంతర్గత కల్లోలాలను మానుండి దూరం చేసేయి. ఓ అల్లాహ్! మా నుండి కష్టాలను, ఇబ్బందులను దూరం చేయి. ఓ మా ప్రభువా! ఇహలోకంలో మాకు పుణ్యాన్ని, పరలోకంలో మేలును మరియు నరకం నుండి రక్షణ ను ప్రసాదించు . ఆమీన్.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
—
అల్లాహ్ (త’ఆలా) (మెయిన్ పేజీ):
https://teluguislam.net/allah/