రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది [వీడియో]

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది
https://youtu.be/VhoL0sQNgaY [4 నిముషాలు]
వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ

“హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు ఉన్నాయి. వాటిలో ఒక దానిపై అబూఫులాన్, ఆయన కొడుకు (అంటే తన భర్త, తన కొడుకు) ఎక్కి (హజ్ చేయడానికి మక్కా) వెళ్ళారు. రెండవ దాన్ని మేము నీళ్ళు మోయడానికి వాడుకుంటున్నాము. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “సరే, నువ్వు రమజాన్ నెలలో ఉమ్రా నిర్వహించు. రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 26 వ ప్రకరణం – ఉమ్రా, 4 వ అధ్యాయం – ఉమ్రతి ఫీరమజాన్]

(*) రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే హజ్ విధి నిర్వహించినట్లు దీని అర్ధం కాదు. ఉమ్రా సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయోక్తిగా ఇలా అన్నారని తైబీ (రహిమహుల్లా) అభిప్రాయపడ్డారు.

హజ్ ప్రకరణం – 36 వ అధ్యాయం – రమజాన్ నెలలో చేసే ఉమ్రా అత్యంత పుణ్యప్రదం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

జమ్ జమ్ నీటి పవిత్రత మరియు ప్రాముఖ్యత (Zamzam Water)

well-of-zam-zam

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

చరిత్ర

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం.

అయినా తాను నిరాశ చెందలేదు. నిస్పృహకు లోనవ్వలేదు. తమ వంతు కృషి ప్రారంభించారు. ఒకసారి సఫా కొండపైకి ఎక్కి చూస్తే, మరోసారి మర్వా కొండపైకెక్కి ‘నీళ్ళు లభించే మార్గం దొరక్కపోతుందా!’ అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలా సఫా నుండి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు ఏడు సార్లు దౌడు తీశారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం చివరికి మర్వా కొండపై ఉండగా ఏదో అలికిడి …! ఏమై ఉంటుందా…!! అని బాల ఇస్మాయీల్ వద్దకు చేరుకున్నారు. పసికందు మండుటెండల్లో భరించలేని ఆకలితో అల్లాడిపోతున్నాడు పాపం! అప్పుడే దైవదూత ప్రత్యక్షమై తన రెక్కలతో నేలలో రాజేయంగా చుక్క నీరు కూడా లభ్యం కాని ఆ నల్లరాతి నేల నుండి జలనిధి పెల్లుబికింది. హజ్రత్ హాజిరా అలైహస్సలాం గారు ముందు బాల ఇస్మాయీల్ దాహాన్ని తీర్చి తర్వాత తానూ దాహం తీర్చుకున్నారు. తన అన్వేషణ ఫలించినందుకు, తన శ్రమకు మించిన వరాన్ని అల్లాహ్ అనుగ్రహించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నారు.

జమ్ జమ్ పేరు ఎలా పడింది?

ఆ పిదప పారే ఆ జలనిధిని చూసి “ఇది ఇలానే పారుతూ ఉంటే అతి తొందరగా అంతమైపోతుంద”ని భావించి, దాని చుట్టూ మట్టితో గట్టు వేస్తూ ఈ జలనిధిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తీవ్ర తపనతో ఆమె నోట అప్రయత్నంగా వెలువడిన అమృత వాక్కు ‘జమ్ జమ్’ (అంటే అప్పటి భాషలో ఆగిపో, ఆగిపో అని అర్ధం). ఆ చిన్నపాటి గట్టులో ఆ మహత్తర జలనిధిని ఆపే శక్తి లేకపోయినా ఆమె నోట అపూర్వ విశ్వాసంతో వెలువడిన పలుకు మహిమతో ఆ జలం జలనిధిగా ఓ చోట నిలిచిపోయింది. అదే జమ్ జమ్ బావిగా ప్రసిద్ధి చెందింది.

ఓ సందర్భాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇస్మాయీల్ తల్లిని కరుణించుగాక! ఆమె గనక ఈ జలనిధికి గట్టు వేసి ఆపి ఉండకపోతే ప్రళయం వరకూ జమ్ జమ్ జలం పారే సెలయేరయ్యేది.”

జమ్ జమ్ జల నిధి

జమ్ జమ్ బావి స్వర్గపు సెలయేర్లలోని ఓ సెలయేరు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా కోసం చేసిన దుఆ తర్వాత అల్లాహ్ అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం. మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి, జనవాహినితో, దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమయ్యింది ఈ మహత్తర జలం. కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లాహ్ మహిమ ఈ జలం. ఇహలోకంలో దైవ సూచనల్లోని ఓ సూచన ఈ జలం. ఇక్కడికి వచ్చే ప్రతీ యాచకుడు, ప్రతీ బాటసారి తనివితీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం. ఇంతటి మధురమైన నీరు లోకంలో మరో చోట లేదు. ఈ నీటిలో గొప్ప శుభం ఉంది. అది త్రాగే ప్రతీ వారికి ప్రాప్తమవుతుంది. పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జమ్ జమ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన ప్రవక్తలందరూ త్రాగాలని తహతహలాడిన జలం జమ్ జమ్. ఏ జలానికీ లేని ప్రత్యేకత ఈ జలానికి ఏమిటంటే – ఇది ఆకలి గొన్న వ్యక్తి ఆకలిని తీరుస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది, తలనొప్పి, కడుపునొప్పికి ఇది దివ్య ఔషధం. ఈ జలం వల్ల కoటి చూపు మెరుగవుతుంది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “మావు జమ్ జమ్ లిమా షరిబ లహూ” (ఏ సదుద్దేశంతో జమ్ జమ్ త్రాగుతారో వారి ఆ ఉద్దేశం సిద్ధిస్తుంది).

జమ్ జమ్ విశేషాలు

ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.

జమ్ జమ్ సేవించే సున్నత్ విధానం

జమ్ జమ్ జలాన్ని సేవించే సున్నత్ విధానం; ఈ జలాన్ని కుడి చేత్తో బిస్మిల్లాహ్ అని త్రాగాలి. ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగటం ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి సంప్రదాయం. తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.

జమ్ జమ్ జలం త్రాగే ఓ సౌభాగ్యవంతుడా!

శుభాకాంక్షలు!!

ఉమ్రా

ఉమ్రా : (భాషాపర అర్ధం ) దర్శించుట

ఉమ్రా : ( ధార్మిక అర్దం ) అల్లాహ్ గ్రుహము యొక్క ప్రదక్షిణము చేసి , సఫా మర్వాల మధ్య నడిచి , క్షవరము చేయించు కొనే  అల్లాహ్ యొక్క ఆరాధనను నిర్వర్తించుట .

ఉమ్రా ఆజ్ఞ : జీవిత కాలంలో ఒక సారి

ఉమ్రా ఎప్పుడు విధి అగును : స్థోమత (ప్రాప్తమైన) కలిగిన వెంటనే విధి అగును.

ఆయషా రజి అల్లాహు అన్హ ఇలా ఉల్లేఘించారు – నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ను స్త్రీల పై కూడా జహాద్ విధియా అని ప్రశ్నించాను .దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం -అవును వారి పైకూడా జహాద్ ఉంది , దానిలో యుధ్దం ఉండదు అది హజ్ మరియు ఉమ్రా  , అన్నారు .

ఉమ్రా యొక్క షరతులు :

1. ముస్లిం ఐ వుండాలి  2. స్వతంత్రుడై ఉండాలి ( స్వాతంత్రం లేక పోయినా ఉమ్రా చేయవచ్చును గాని వారి పై విధి కాదు ) 3. యుక్త వయస్సు కు చేరిన వారు         ( పిల్లలు కూడా ఉమ్రా చేయవచ్చును గాని వారి పై విధి కాదు ) 4. మతి స్థిమితం ఉండాలి

  1. ఆరోగ్య వంతులై ఉండాలి  ప్రయాణపు ఖర్చులు తమ ఉపాధి అవసరాలకు మించి ఉండాలి
  2.  స్త్రీ వెంట ముహర్రిం ఉండాలి (ముహర్రిం : ఆమె భర్త లేక ఆమెతో పెళ్ళి చేసుకో కూడని వారు)

ఉమ్రా యొక్కమూల స్థంభాలు: 1. ఉమ్రా సంకల్పము తో ఎహ్ రాం తొడుగుట . 2. కాబా యొక్క ప్రదక్షిణము చేయుట 3. సఫా మర్వాల మధ్య నడుచుట

గమనిక : ఏ మూల స్థంభమును విడిచినా ఉమ్రా పూర్తి కాదు . నియ్యత్ (ఎహ్ రాం ) చేయని ఎడల ఉమ్రా  ప్రారంభమే కాదు .

ఉమ్రా యొక్క విధులు : 1. మీఖాత్ నుండి సంకల్పము చేసి ఎహ్ రాం ( కుట్టు లేని రెండు బట్టలు ) ధరించుట 2. క్షవరము చేయించు కొనుట 3. తవాఫె విదా చేయుట (స్త్రీలకు బహిష్టు వస్తే ఆమె చేయ నవసరం లేదు ) .

గమనిక : విధిని విడిచిన యెడల ఒక గొర్రెను ఖుర్బానీ చేసి హరం లోని బీద వారికి ఇవ్వ వలెను .

మీఖాత్ వివరణ :

కాలపు మీఖాత్ : ఏ సమయము లలో ఈ ఆరాధన చేయ వలెనో ఆ మాసములు – హజ్ కొరకు షవ్వాల్, జుల్ ఖాదా మరియు జుల్ హజ్ .

స్థలపు మీఖాత్ : ఈ 5 ప్రదేశముల నుండి తప్పక సంకల్పము చేసి  బయలు దేర వలెను.

  1. జుల్ హులైఫహ్ : ఇప్పుడు దీనిని అబ్ యారె  అలి అంటారు .ఇది మదీనా వైపు నుండి వచ్చే వారి కొరకు .
  2. అజ్జహఫహ్  : ఇది రాబిగ్ కి దగ్గరలో ఉన్నది . ఇది సిరియా ,ఈజిప్టు వైపు నుండి వచ్చే వారి కొరకు .
  3. యలంలం : దీనిని  ఇప్పుడు అస్సాదియ అంటారు. ఇది యమన్ వైపు నుండి వచ్చే వారి కొరకు.
  4. ఖరన్ అల్ మనాఝజిల్ : దీనిని  ఇప్పుడు అస్సీల్ అ కబీర్  అంటారు. ఇది నజద్ వైపు నుండి వచ్చే వారి కొరకు.
  5. జాత్ అల్ అరఖ్ : ఇది ఈరాఖ్  వైపు నుండి వచ్చే వారి కొరకు.

గమనిక : హజ్ లేక ఉమ్రా కొరకు వెళ్ళే వారు తప్పక ఈ ఐదు మీఖాత్ లలో  ఏదో ఎక మీఖాత్ వద్ద  ఎహ్ రాం కట్టి సంకల్పము చేయవలెను ( బలూగుల్ మరాం  -590,591) . మీఖాత్ లోపల నివసించే వారు వారి నివాస స్థలము నుండియే ఎహ్ రాం కట్ట వలెను (సంకల్పము చేయవలెను)

ఎహ్ రాం విధానము : ఆ ఆరాధన యొక్క సంకల్పము చేయుట.

ఎహ్ రాం తొడి గే ముందు చేయవలసిన సున్నతులు : 1. బొడ్డు క్రింద వెంట్రుకలు , చంక లోని వెంట్రుకలు , గోళ్ళు కత్తిరించ వలెను . 2. స్నానము చేయవలెను . 3. శరీరానికి సుగంధము పూయ వలెను 4. ఎహ్ రాం కుట్టని 2 బట్టలు తొడుగుట ( ఒకటి నడుముకు కట్టు కొని రెండవది భుజముల పైనుండి వేసుకోవలెను) 5. స్త్రీలు తాము తొడిగే బట్టల తోనే సంకల్పము చేయవలెను .

సంకల్పము  తప్పనిసరి ( చాలామంది 2 కుట్టని బట్టలు వేసుకొనుటయే ఎహ్ రాం అనుకుంటారు గాని సంకల్పము చేయుట ద్వారానే హజ్ మరియు ఉమ్రా ఆరాధన ప్రారంభ మగును )

ఎహ్ రాం స్థితి లో ని నిషిధ్దములు  (స్త్రీ పురుషు లిధ్ధరికీ) : 1. వెంట్రుకలు కత్తిరించుట  2. గోళ్ళు కత్తిరించుట    3. సుగంధము పూసు కొనుట 4. పెండ్లి చేసు కొనుట  ( చేసు కొన్న యెడల ఫిదియా చెల్లించాలి –  3 రోజుల ఉపవాసం లేక 6 గురు బీద వారికి భోజనము పెట్టుట లేక ఒక గొర్రె ను ఖుర్బానీ చేసి హరం లోని బీద వారికి దానంచేయవలెను) 5. భార్యను ముద్దాడుట (ముద్దాడిన యెడల ఫిదియా చెల్లించాలి – మణీ వెలువడిన యెడల ఒక ఒంటె లేక ఆవును ఖుర్బానీ చేసి హరం లోని బీద వారికి దానంచేయవలెను – మణీ వెలువడని యెడల 3 రోజుల ఉపవాసం లేక 6 గురు బీద వారికి భోజనము పెట్టుట లేక ఒక గొర్రె ను ఖుర్బానీ చేసి హరం లోని బీద వారికి దానంచేయవలెను) 6. భార్యతో సంభోగించుట (సంభోగించిన యెడల ఫిదియా చెల్లించాలి – ఒక ఒంటె లేక ఆవును ఖుర్బానీ చేసి హరం లోని బీద వారికి దానంచేయవలెను) 7. నీటి జంతువును తప్ప వేరే జంతువులను వేటాడ రాదు (వేటాడిన యెడల ఫిదియా చెల్లించాలి – అటువంటి జంతువునే కొని విడిచి పెట్ట వేయవలెను )

పురుషులకు మాత్రమే నిషిధ్దములు: 1. తల పై బట్ట కప్పుకొనుట 2. కుట్టిన బట్టలు తొడుగుట.

స్త్రీలకు మాత్రమే నిషిధ్దములు :  1.చేతి తొడుగులు తొడుగుట. 2.ముఖం పై నిఖాబు వేసుకొనుట .

గమనిక : 1. ఎహ్ రాం బట్టలు మీఖాత్ కంటే ముందే తొడగ వచ్చును గాని సంకల్పము మీఖాత్ నుండి మాత్త్రమే చేయవలెను . 2. ఎహ్ రాం బట్టలను మార్చ వచ్చును , కడగ వచ్చును.

3. అత్యవసర సమయములలో తహరత్ లేకపోయినా ఎహ్ రాం సంకల్పము చేయ వచ్చును గాని ఇది ఉన్నత మైన విధానానికి భిన్నము .

తల్బియా   ఎహ్ రాం బట్టలు తొడిగి బండిలో కూచ్చుని మనస్సులో సంకల్పము చేసుకొని – లబ్బయక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ – అనాలి ( ఓ అల్లాహ్ నేను హాజరైనాను ఉమ్మాహ్ చేయుట కొరకు). ఆతర్వాత ఈ విధము గా తల్బియా చదువు తుండ వలెను – లబ్బయక్ అల్లాహుమ్మ  లబ్బయక్ , లబ్బయక్ లాషరీక లక లబ్బయక్ , ఇన్నల్ హంద వన్నీమత లక వల ముల్క్ లా షరీక లక్ – ( నేను హాజరైనాను ,ఓ అల్లాహ్ నేను హాజరైనాను , నేను హాజరైనాను నీకెవరూ భాగస్వాములు లేరు నేను హాజరైనాను , నిస్సంకోచంగా సకల స్తోత్రములు నీ కొరకే  మరియు సకల కారణ్యము నీదే  మరియు సకల అధికారము నీదే నీకెవరూ భాగస్వాములు లేరు )

తవాఫ్ : కాబా గ్రుహము యొక్క ప్రదక్షిణము చేయుట

తవాఫ్ షరతులు : 1. సంకల్పము చేయవలెను  2. వజూ తో ఉండ వలెను 3. కాబా గ్రుహము ను ఎడమవైపు ఉంచుతూ  7 సార్లు ప్రదక్షిణము చేయ వలెను. మస్జిదే హరంలో ప్రవేశంచునపుడు కూడా  కుడి కాలు ముందు పెట్టి మస్జిద్ లో  ప్రవేశించే దుఆ  యే చదవ వలెను .హజ్రె అస్వద్ నుండి  ప్రదక్షిణము ప్రారంభించ వలెను  (భుజముల పైనుండి కప్పు కున్న బట్టను ఎడమ భుజము పై ఉంచి రెండవ వైపును కుడి చేతి క్రింద నుంచి తీసి మళ్ళీ ఎడమ భుజము పై కప్పు కొన వలెను)

1. హజ్రె అస్వద్ ను కుడి చేతితో తాకి మరి హజ్రె అస్వద్ ను చుంబించి లేదా 2. హజ్రె అస్వద్ ను కుడి చేతితో తాకి ఆచేతిని చుంబించి లేదా  3. హజ్రె అస్వద్ ను కుడి చేతితో సైక చేసి – ఇలా పలికి ప్రదక్షిణము ప్రారంభించ వలెను

 – బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ – అల్లాహుమ్మ ఈమానం బిక వతస్దీఖం బికితాబిక వ వఫఅం బిఅహ్ దిక  వ ఇత్తబాఅన్ లి సున్నతి నబియ్యిక్ ముహమ్మదన్  సల్లల్లాహు అలైహి వసల్లం (అల్లాహ్ నామముతో , అల్లాహ్ యే అత్త్యున్నతుడు – ఓ అల్లాహ్ నిన్ను విశ్వసించి , నీ పుస్తకమును సత్యమని ధ్రువీ కరించి నావాగ్దనమును పూర్తి  చేస్తూ , ప్రవక్త  ముహమ్మద్  సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు  అనుసరిస్తూ.) మొదటి ప్రదక్షిణము పూర్తి అయిన తర్వాత మిగిలిన ప్రదక్షిణముల ప్రారంభములో – అల్లాహు అక్బర్- అని ప్రారంభించ వలెను .

–          ప్రదక్షిణము చేయు నపుడు ఏదుఆ అయినా చేయ వచ్చును

–          యమని మూలకు చేరి నపుడు  దానిని కుడి చేతితో తాకవలెను

యమని మూలకు మరియు హజ్రె అస్వద్ కు మధ్య  – రబ్బనా ఆతినా ఫద్దునియా హసనతవ్ వఫిల్ ఆఖరతి హసనతవ్ వఖినా అజాబన్నార్ ( ఓ మా ప్రభూ  మాకు ఇహ లోకంలోను పరలోకంలోను సాఫల్యం ప్రసాదించు మరియు నరక శిక్షనుండి మమ్మల్ని కాపాడు ) చదువుట సున్నతు .

గమనిక : పురుషులు మాత్రము మొదటి మూడు ప్రదక్షిణము లలో రమల్ (వేగముగా నడుచుట)చేయుట సున్నతు

ప్రదక్షిణములు పూర్తి చేసిన పిదప  కుడి భుజము క్రిందకు తీసిన బట్టను మళ్ళీ రెండు భుజముల పై కప్పు కొని మఖామె ఇబ్రాహీం వైపుకు వెళ్తూ ఇలా చదవ వలెను – వత్తఖిజూ మిమ్మఖామి ఇబ్రాహీమ ముసల్లా  (మరియు మఖామి ఇబ్రాహీమును ప్రార్ధనా ప్రదేశముగా  చేసు కొండి).       ఆ తర్వాత మఖామి ఇబ్రాహీం వద్దకు వెళ్ళి రెండు రకాతుల సలాహ్ ఆచరించ వలెను. మొదటి రకాతులో  సూరె కాఫిరూన్ (109) రెండవ రకాతులో సూరె ఇఖ్ లాస్ (112) పఠించుట సున్నతు . ఆ తర్వాత జంజం నీరు కడుపు నిండా త్రాగ వలెను . ఆ తర్వాత సయి ప్రారంభించ వలెను

సయి:  సఫా మరియు మర్వా  కొండల మధ్య ఆరాధన కొరకు నడుచుట

సయి షరతులు: 1. సంకల్పము 2. తవాఫు ముందు పూర్తి చేసి ఉండాలి 3. సఫా నుండి ప్రారంభించి మర్వా వరకు ఏడు సార్లు తిరుగుట (సఫా నుండి మర్వాకు ఒకటి మర్వా నుండి సఫా కు వేరొకటి అగును)

సఫా కొండ ఎక్కుతూ ఈ విధముగా చదవ వలెను – ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ (నిశ్చయముగా సఫా మరియు మర్వా  అల్లాహ్ యొక్క సూచనలు ) ఆ తర్వాత – అల్లాహ్ ప్రారంభించిన  దగ్గర నుండే నేనూ ప్రారంభిస్తాను – అని పలికి సఫా కొండ పై ఎక్కి కాబా గ్రుహము వైపుకు తిరిగి దుఆ కొరకు చేతులు ఎత్తి ఈ దుఆ చదవ వలెను  – అల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్ , లా ఇలాహ ఇల్లాహు వహ్దహు లాషరీక లహ్ ,లహుల్ ముల్కు వలహుల్ హంద్ , వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్ – లా ఇలాహ ఇల్లాహు వహ్ద , అన్ జజ వాదహు వనస్రహ్  అబ్దహు వహజమల్ అహ్ జాబ వహదహ్ –

(ఎవరూ  ఆరాధనకు అర్హులు లేరు ఒక్క అల్లాహ్ మాత్రమే తప్ప ,ఆయనకు భాక స్వాము లెవరూ లేరు , సకల రాజ్యములూ ఆయనవే, సకల స్తోత్రములు ఆయనకే , సకల స్రుష్టి పై ఆయన మాత్రమే అధికారము కలిగి ఉన్నాడు ). (ఎవరూ  ఆరాధనకు అర్హులు లేరు ఒక్క అల్లాహ్ మాత్రమే తప్ప,ఆయన తన వాగ్దానమును పూర్తి చేసెను , తన దాసునికి సహాయము చేసెను , ఆయన ఏకంగానే శత్రువులను ఓడించెను ) ఆ తర్వాత వేరే దుఆ చేసుకొనవచ్చును .

సయి చేయునపుడు ప్రత్తేక దుఆలు ఏమీ తెలుప బడలేదు, ఏ దుఆ లైనా చేసు కొన వచ్చును. మర్వా కొండపై ఎక్కి కూడా సఫా కొండ పై చేసిన దుఆలు చేయవలెను.  పురుషులు రెండు ఆకు పచ్చని ద్వీపముల మధ్య పరుగెత్త వలెను

క్షవరము చేయించు కొనుట:  పురుషులు క్షవరము చేయించు కొనుట,  వెంట్రుకలు కత్తిరించుట కంటే  3 రెట్లు ఉత్తమము. స్త్రీ లు తమ జడ చివరి భాగపు ఒక అంగుళము పొడుగు వెంట్రుకలు కత్తిరించు కో వలెను. దీని తో అల్హందు లిల్లాహ్  ఉమ్రా పూర్తి అగును . తఖబ్బల్ మిన్నా మిన్ కుం . ఆమీన్