మీరు రాజులు అన్న విషయం గమనించారా?

మీరు రాజులు అన్న విషయం గమనించారా?
https://youtu.be/EzI9yoArZEM [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): “నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు.” (Al-Ma’idah 5:20)

అబూ ‘అబ్దుర్రహ్మాన్‌ ‘హుబ్‌లీ కథనం: నేను ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ ద్వారా ఇలా విన్నాను:

”అతన్ని మేము పేద ముహాజిరీన్లు కామా?” అంటే మమ్మల్ని పేద ముహాజిరీన్లుగా పరిగణించరా? అని ప్రశ్నించడం జరిగింది. దానికి ‘అబ్దుల్లాహ్‌ వారితో, ”నీ భార్య ఉందా?” అని అడిగారు. ఆ వ్యక్తి, ‘అవును,’ అన్నాడు. ‘నీ దగ్గర నివసించడానికి ఇల్లు ఉందా?’ అని అడిగారు, దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌, ‘అయితే నీవు ధనవంతుడవు, పేదవాడవు కావు,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నా దగ్గర సేవకుడు కూడా ఉన్నాడు,’ అని అన్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ మరయితే నీవు రాజుల్లో ఒకడివి.’ ‘అబ్దుర్రహ్మాన్‌ ఇలా అన్నారు, ”ముగ్గురు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ వద్దకు వచ్చారు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ ముగ్గురు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్‌తో అతని కునియత్‌ అబూ ము’హమ్మద్‌. అందువల్ల, ‘ఓ అబూ ము’హమ్మద్‌! మా దగ్గర డబ్బూ లేదు, వాహనమూ లేదు, జీవిత సామగ్రిలేదు.’ ‘అబ్దుల్లాహ్‌ వారితో, ‘మీరేమంటారు,’ అని అన్నారు. అంటే ఏం కావాలి అని అన్నారు. మీరు కోరితే ఇప్పుడు వెళ్ళిపోండి, మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. అల్లాహ్‌ మీకోసం ఏదైనా అనుగ్రహిస్తే రండి, ఉన్నవరకు ఇవ్వగలను. ఒకవేళ మీరు కోరితే మీ విషయాన్ని రాజుగారి ముందు పెడతాను. అతను కోరింది మీకు ఇస్తాడు. ఒకవేళ మీరు కోరితే సహనం పాటించండి. ఎందుకంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”పేద ముహాజిరీన్లు ధనవంతులకంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు,” అని అన్నారు. అప్పుడు వారు మేము సహనం పాటిస్తాం, ఎవరినీ ఏమీ అడగం అని అన్నారు. (ముస్లిమ్‌: 2979)

‘ఉబైదుల్లాహ్‌ బిన్‌ ము’హ్‌’సిన్‌ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:

”క్షేమంగా, ఆరోగ్యంగా ఉదయం లేచి, అతని వద్ద ఒక్క రోజుకు సరిపడే ఆహారం ఉంటే, అతని కోసం ప్రాపంచిక అనుగ్రహాలన్నీ చేర్చటం జరిగింది, ధన సంపదలన్ని అతని కోసం కూడబెట్టడం జరిగింది.” (తిర్మిజి: 2346, సహీహ్)

వీరు అల్లాహ్‌ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది చేసిన మేలును మరిచేవారే. (An-Nahl 16:83)

తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: “అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!” కాని జ్ఞానసంపన్నులు అన్నారు: “మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు.”ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు. (Al-Qasas 28:79-81)

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు. (An-Nahl 16:112)

కావున వారు ఆ ఆలయ (కాబా) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. (Quraish 106:3-4)

అబూ హురైరహ్‌ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:

”తీర్పుదినం నాడు అన్నిటికంటే ముందు అనుగ్రహాల గురించి ప్రశ్నించటం జరుగుతుంది, ‘మేము నీకు ఆరోగ్యం ప్రసాదించలేదా, త్రాగటానికి చల్లని నీరు ప్రసాదించ లేదా’ ” అని ప్రశ్నించటం జరుగుతుంది. (తిర్మిజి: 3358, సహీహ్)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:

”ఇస్లామ్‌ స్వీకరించి, ముస్లిమ్‌ అయి, తగినంత ఉపాధి ఇవ్వబడిన వాడు అంటే అల్లాహ్‌ (తఆలా) ఇచ్చిన దానితో తృప్తి చెందినవాడు సాఫల్యం పొందాడు.” (ముస్లిమ్: 1054)

షుక్ర్ (కృతజ్ఞతా భావం): దాని శుభాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌۭ

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14: 7)

ప్రియ సోదరులారా..!

అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావం: దాని శుభాల గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. మనం నోటితో, ఆచరణతో అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండటం తప్పనిసరి. నోటితో అల్ హమ్దులిల్లాహ్ పలకటం, ఆ అనుగ్రహాన్ని ఆచరణతో కాపాడుకోవటం, గుర్తించటం. దీనినే షుక్ర్ (కృతజ్ఞత) అంటారు. కృతజ్ఞతలు తెలుపుకునే వారికి అల్లాహ్ సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఖుత్బాలో పఠించిన వాక్యం అర్థం అదే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14 : 07)

ఈ ఆయత్ హజ్రత్ మూసా (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంబంధించినది. మూసా (అలైహిస్సలాం) తమజాతి వారితో ఇలా అన్నారు:

“ఓ ప్రజలారా! అల్లాహ్ మీకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. ఇప్పుడు మీ ప్రభువు ఇలా ప్రకటించాడు: ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అల్లాహ్ మరింత సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కాని ఒకవేళ మీరు అనుగ్రహాల పట్ల ఏమరుపాటుగా ఉంటే, అశ్రద్ధ చేస్తే మరి అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉంది: “నా శిక్ష కూడా చాలా వ్యధాభరితంగా ఉంటుంది”。

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి [వీడియో & టెక్స్ట్]

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి
బులూగుల్ మరాం | హదీస్ 1237
https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;

“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)

అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు

ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.

వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
(వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ
(ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్)
మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.

وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ
(వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్)
మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.

فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ
(ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్)
మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.

సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.

ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.

ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

رَحِمَ اللَّهُ عَبْدًا
(రహిమల్లాహు అబ్దన్)
అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.

ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!

نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ
(నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు)
ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.

فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ
(ఫ హమిదల్లాహ వ షకరహ్)
ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!

وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు)
మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.

فَجَدَّ وَاجْتَهَدَ
(ఫ జద్ద వజ్తహద్)
ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.

అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:

خَصْلَتَانِ
(ఖస్లతాని)
రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని

شَاكِرًا صَابِرًا
(షాకిరన్ సాబిరా)
కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ

వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?

مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ
(మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్)
ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.

وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ
(వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్)
మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు)
కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,

وَآسَفَ عَلَى مَا فَاتَهُ
(వ ఆసఫ అలా మా ఫాతహు)
అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.

فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا
(ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా)
ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.

అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.

అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.

ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.

తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.

ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.

ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.

ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.

కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19057

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1