పిల్లల శిక్షణలో తల్లి పాత్ర – సలీం జామయి [వీడియో & టెక్స్ట్]

పిల్లల శిక్షణలో తల్లి పాత్ర
https://youtu.be/4JQEh-fctIQ [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. పిల్లలు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, వారిని నరకాగ్ని నుండి కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత అని ఖురాన్ ఆయతుతో స్పష్టం చేయబడింది. తండ్రితో పోలిస్తే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లితోనే గడుపుతారని ఒక హదీసు ఉటంకించబడింది. ప్రవక్త నూహ్ మరియు ప్రవక్త ఇబ్రాహీం (అలైహిముస్సలాం)ల కుమారుల ఉదాహరణల ద్వారా తల్లి విశ్వాసం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయబడింది. అలాగే, ఇమామ్ అలీ, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఇమామ్ బుఖారీ, మరియు ఇమామ్ షాఫియీ వంటి గొప్ప ఇస్లామీయ పండితులు మరియు నాయకుల జీవితాలలో వారి తల్లుల పెంపకం, భక్తి మరియు త్యాగాల పాత్రను చారిత్రక సంఘటనలతో వివరించారు. నేటి యువత మార్గభ్రష్టులు కావడానికి ధార్మిక విద్య లోపించడమే కారణమని, సమాజ సంస్కరణ జరగాలంటే బిడ్డలకంటే ముందు తల్లులకు విద్య నేర్పించడం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో ‘పిల్లల శిక్షణలో తల్లి పాత్ర’ అనే అంశం మీద ఇన్ షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులకు అనేక అనుగ్రహాలు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన అనుగ్రహాలలో సంతానం గొప్ప అనుగ్రహం. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సంతానము ఇవ్వలేదో, అలాంటి దంపతులకు వెళ్ళి కలిసి మాట్లాడి చూడండి, సంతానం కోసం, బిడ్డల కోసం వారు ఎంత తపిస్తూ ఉంటారో వారి మాటలు వింటే అర్థమవుతుంది. తద్వారా, ఎవరికైతే అల్లాహ్ బిడ్డలు ఇచ్చాడో, సంతానము ప్రసాదించాడో, వారు అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహము పొంది ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి.

అయితే, ఆ సంతానం విషయంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఖురాన్‌లోని 66వ అధ్యాయము 6వ వాక్యంలో అల్లాహ్ ఆదేశించిన ఆ ఆదేశము ఈ విధంగా ఉంది.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا
[యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా]
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి (66:6)

ఇక్కడ చాలా మంది ఆలోచనలో పడిపోతూ ఉంటారు. మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్నవారికి ఆదేశిస్తున్నాడు, నరకాగ్ని ప్రపంచంలో లేదు కదండీ, పరలోకంలో కదా నరకాగ్ని ఉండేది, ప్రపంచంలో నరకాగ్ని నుండి మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని కాపాడుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయము చూడండి, ఏ పనులు చేయడం వలన మనము వెళ్ళి నరకంలో పడిపోతామో, ఏ పాపాలు చేయడం వలన, ఏ దుష్కార్యాలు చేయడం వలన మన కుటుంబీకులు వెళ్ళి నరకంలో పడిపోతారో, ఆ పనుల నుండి, ఆ కర్మల నుండి మనము కూడా దూరంగా ఉండాలని, మన కుటుంబీకుల్ని కూడా దూరంగా ఉంచమని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేస్తున్నాడు, ఈ వాక్యానికి అర్థము అది అని ధార్మిక పండితులు వివరించారు.

ఏ పనులు చేస్తే మనిషి వెళ్ళి నరకంలో పడతాడు అంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేయమని ఆజ్ఞాపించిన పనులు చేయకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏ పనులైతే చేయవద్దు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారించాడో, ఆ పనులు చేసేస్తే అది పాపం అవుతుంది, అప్పుడు నరకానికి వెళ్ళి పడాల్సి ఉంటుంది. కాబట్టి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ పనులు చేయమని ఆదేశించాడో, ఏ పనులు చేయరాదు అని ఆదేశించాడన్న విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు కూడా తెలియపరచాలి, ఆ విధంగా అల్లాహ్ ఆదేశాలు మనము మరియు మన కుటుంబ సభ్యులు కట్టుబడి ఉంటే ఇన్ షా అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షించబడతాము, స్వర్గానుగ్రహాలకు అర్హులవుతాము.

ఇక రండి మిత్రులారా. అల్లాహ్ ఆదేశాల గురించి మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు తెలియపరచాలి. మన కుటుంబీకులలో ముఖ్యంగా మన సంతానము ఉన్నారు, ఆ మన సంతానానికి అల్లాహ్ ఆజ్ఞలు తెలియజేయాలి. ఒక రకంగా సూటిగా చెప్పాలంటే, ధర్మ అవగాహన, ధార్మిక శిక్షణ వారికి ఇప్పించాలి. అయితే, బిడ్డలకు ధార్మిక శిక్షణ ఇప్పించే బాధ్యత తల్లి, తండ్రి ఇద్దరి మీద ఉంది, ఇందులో ఎలాంటి సందేహము లేదు, కాకపోతే తల్లి మీద కొంత ఎక్కువగా బాధ్యత ఉంది.

చూడండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ప్రవచించారు.

وَالْمَرْأَةُ رَاعِيَةٌ عَلَى بَيْتِ بَعْلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسْؤولَةٌ عَنْهُمْ
[వల్ మర్అతు రాఇయతున్ అలా బైతి బాలిహా వ వలదిహీ వహియ మస్ఊలతున్ అన్హుమ్]
మహిళ తన భర్త ఇల్లు మరియు సంతానము పట్ల బాధ్యురాలు. వారి బాధ్యత పట్ల ఆవిడ ప్రశ్నించబడుతుంది. (సహీహ్ బుఖారీ)

పురుషుడు కూడా బాధ్యుడే. ముఖ్యంగా ఇక్కడ మహిళ గురించి తెలియజేస్తూ, భర్త ఇల్లు మరియు సంతానము పట్ల మహిళ బాధ్యురాలు. ఆ బాధ్యత గురించి ఆమెకు ప్రశ్నించబడుతుంది కాబట్టి ఆ బాధ్యత ఆమె ఇక్కడ ప్రపంచంలో నెరవేర్చాలి అన్నారు. అలా ఎందుకన్నారన్న విషయాన్ని వివరిస్తూ ధార్మిక పండితులు తెలియజేశారు, తల్లి బిడ్డల అనుబంధము చాలా పటిష్టమైనది. బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా ఉంటారు. తండ్రి ఉద్యోగ రీత్యా, వ్యాపారము రీత్యా, ఇతర పనుల రీత్యా బయట ఎక్కువగా ఉంటాడు. కాబట్టి, బిడ్డలు తల్లి వద్ద ఎక్కువ ఉంటారు, తల్లి మాటల ప్రభావము, తల్లి చేష్టల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే చూడండి పండితులు అంటూ ఉంటారు, ‘తల్లి ఒడి శిశువుకి మొదటి బడి’. అలా ఎందుకంటారంటే బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా నేర్చుకుంటారు, తల్లి మాటల ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెలియపరిచారు. అందుకోసమే తల్లి మీద సంతానం పట్ల కొంచెం బాధ్యత ఎక్కువ అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది మిత్రులారా.

ఇక రండి, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఖురాన్‌లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, హదీసులలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అని మనం చూచినట్లయితే, ఖురాన్‌లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు, తూఫాను వచ్చినప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు పిలవగా, “నాన్నా వచ్చి పడవలో ఎక్కు, విశ్వాసులతో పాటు కలిసిపో, ఈ రోజు ఈ తూఫాను నుండి ఎవ్వరూ రక్షించబడరు” అంటే, పడవలెక్కి కాదండీ, నేను పర్వతం ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాను అన్నాడు. పర్వతం ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడికి నీళ్ళలో పడి, మునిగి మరణించాడు.

ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడ్ని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి, “నా కుమారా, నేను కల ద్వారా ఆదేశించబడ్డాను. నేను నిన్ను బలి ఇవ్వాలని అల్లాహ్ కోరుకుంటున్నాడు, నువ్వేమంటావు?” అంటే, “నాన్నగారండీ, మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని వెంటనే మీరు అమలుపరచండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను సహనం పాటించే వారిలో చూస్తారు” అని వెంటనే ఆయన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయారు. జరిగిన విషయం మనకు తెలుసు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని కాపాడాడు, ఆకాశము నుండి ఒక పశువుని పంపించి ఆయనకు బదులుగా ఆ పశువుని జబా చేయించాడు.

అయితే ఆలోచించి చూడండి. అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ప్రవక్త పొజిషన్‌లో ఉన్న తండ్రి మాట వినట్లేదు, పర్వతం ఎక్కుతాను అని ప్రయత్నించాడు, చివరికి నీట మునిగి మరణించాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం, ప్రవక్త పదవిలో ఉన్న తండ్రి మాటను వెంటనే శిరసావహించాడు, బలి అయిపోవటానికి సిద్ధమైపోయాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే, ధార్మిక పండితులు ఆ విషయాన్ని కూడా వివరించారు. ఆ తేడా ఎందుకు వచ్చిందంటే, అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు, అవిధేయురాలు కాబట్టి, ఆమె అవిశ్వాస ప్రభావము ఆ బిడ్డ మీద కూడా పడింది, ఆ బిడ్డ కూడా అవిశ్వాసుడయ్యాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజిరా అలైహస్సలాం గొప్ప భక్తురాలు. ఆమె భక్తి, ఆమె ఆరాధన, ఆమె ఆలోచన, ఆమె చేష్టలు వాటి ప్రభావము ఇస్మాయీల్ అలైహిస్సలాం వారి మీద పడింది. కాబట్టి ఆయన కూడా ఒక గొప్ప భక్తుడయ్యాడు. భక్తురాలి బిడ్డ భక్తుడయ్యాడు, అవిధేయురాలు బిడ్డ అవిధేయుడయ్యాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. తద్వారా తల్లి ఆలోచనల, తల్లి విశ్వాసాల, తల్లి చేష్టల, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుందన్న విషయం అక్కడ స్పష్టమైపోయింది మిత్రులారా.

ఇక రండి. పూర్వం ఒక తండ్రి బిడ్డలను పిలిచి, వారు పెద్దవారైన తర్వాత సమావేశపరచి ఏమంటున్నాడంటే, “బిడ్డలారా! మీరు పుట్టిన తర్వాత నేను మీ మీద దయ చూపించాను. అలాగే, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అన్నాడు. బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు, ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం వారి వద్ద ఉన్నింది కాబట్టి వెంటనే నాన్నగారితో, “నాన్నగారండీ! మేము పుట్టిన తర్వాత మన కోసం మీరు కష్టపడ్డారు. మా ఆరోగ్యము రక్షించడానికి, మనకు మంచి ఆహారము తినిపించడానికి, మంచి బట్టలు ధరింపజేయటానికి, మంచి విద్య నేర్పించటానికి మీరు కష్టపడ్డారు, మా మీద దయ చూపించారు. ఇది అర్థమయింది. కానీ మేము పుట్టక ముందే మా మీద మీరు దయ చూపించారు అంటున్నారేమిటి? అది ఎలా సాధ్యమవుతుంది?” అని ఆశ్చర్యంగా వారు ప్రశ్నించినప్పుడు, ఆ తండ్రి అన్నాడు, “బిడ్డలారా! నా బిడ్డలు విద్యావంతులు, సమర్థవంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, విలువలు కలిగిన వారు అవ్వాలంటే, నేను విద్యావంతురాలిని వివాహం చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగిన, ధర్మ అవగాహన కలిగిన, భక్తురాలితో నేను వివాహం చేసుకోవాలి. అప్పుడే నా బిడ్డలు కూడా విద్యావంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, భక్తులు అవుతారు అని నేను అందగత్తెల వెంట పడకుండా, ధనవంతురాలి వెనక పడకుండా, భక్తురాలు ఎక్కడున్నారని వెతికి మరీ నేను ఒక భక్తురాలితో వివాహం చేసుకున్నాను. అలా నేను వివాహం చేసుకోవడానికి కారణము, మీరు మంచి వారు, ప్రయోజనవంతులు, భక్తులు, సామర్థ్యము కలవారు కావాలనే ముందు చూపుతో అలా చేశాను కాబట్టి, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అని తెలియజేయగా, అప్పుడు ఆ బిడ్డలకు ఆ విషయం అర్థమయింది. తద్వారా ధార్మిక పండితులు తెలియజేసే విషయం ఏమిటంటే, మహిళ భక్తురాలు అయితే, విద్యావంతురాలు అయితే, వారి ఒడిలో పెరిగే బిడ్డలు కూడా గొప్ప భక్తులు అవుతారు, గొప్ప విద్యావంతులు అవుతారు.

దీనికి ఉదాహరణలు కూడా మనకు ఇస్లామీయ చరిత్రలో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను, చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూ బకర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము ప్రశాంతంగా గడిచిపోయింది. ఆయన మరణానంతరం ఉమర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము కూడా ప్రశాంతంగా గడిచిపోయింది. ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించి చాలా దూరం వరకు వ్యాపించిపోయింది. ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు త’ఆలా అన్హు ముస్లిముల నాయకులయ్యారు. ఆయన ప్రారంభంలో ప్రశాంతంగానే పరిపాలన జరిపారు, అయితే చివరి రోజుల్లో పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తాయి. చివరికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. అప్పటికే ఇస్లామీయ సామ్రాజ్యము చాలా దూరం వరకు వ్యాపించి ఉంది. పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తి ఉన్నాయి, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. ఆ తర్వాత నాయకుని పోస్టు ఖాళీగా ఉంది. ఎవరు బాధ్యతలు చేపడతారు అని ఎవరి వద్దకు వెళ్ళి మీరు బాధ్యతలు చేపట్టండి అంటే, ఎవరూ సాహసించట్లేదు, ఎవరూ ముందుకు వచ్చి ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పరిస్థితులు అలా క్లిష్టతరంగా మారి ఉన్నాయి కాబట్టి, ఉపద్రవాలు అలా తలెత్తి ఉన్నాయి కాబట్టి, ఎవరూ సాహసించలేకపోయారు.

అలాంటప్పుడు, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముందుకు వచ్చి, బాధ్యతలు స్వీకరించి, తలెత్తి ఉన్న ఆ పెద్ద పెద్ద ఉపద్రవాలన్నింటినీ ఆరు నెలల లోపే పూర్తిగా అణచివేశారు. పరిస్థితులన్నింటినీ అల్హందులిల్లాహ్ చక్కదిద్దేశారు.

మరి అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిలో అలాంటి సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది అని మనము కొంచెం ఆయన చరిత్రను వెతికి చూస్తే, అలీ రజియల్లాహు అన్హు వారు జన్మించినప్పుడు, వారి తండ్రి, అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న, వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. చిన్నాన్న దగ్గరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి, చిన్నాన్న గారి వద్దకు, మీ కుటుంబంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారందరికీ పోషించే భారం మీ మీద ఎక్కువగా పడిపోతూ ఉంది కాబట్టి, అలీని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను అని చెప్పగా, చిన్నాన్న సంతోషంగా అలీ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతికి ఇచ్చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిని, ఆయన పుట్టినప్పుడు పసితనంలో తీసుకొని వచ్చి, విశ్వాసుల మాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి చేతికి ఇచ్చి, ఈయనకు మీరు పోషించండి, మంచి బుద్ధులు నేర్పించండి అని చెప్పగా, ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా అలీ రజియల్లాహు అన్హు వారిని తీసుకొని, అలీ రజియల్లాహు అన్హు వారికి మంచి భక్తి, మంచి క్రమశిక్షణ, ఇలాంటి విషయాలు నేర్పించారు. అలా ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వద్ద శిక్షణ పొందిన అలీ రజియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యాక, అలాంటి సామర్థ్యవంతులు, ప్రయోగవంతులు అయ్యారు మిత్రులారా. కాబట్టి, తల్లి మాటల, తల్లి భక్తి, తల్లి విశ్వాసపు ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఇది పెద్ద నిదర్శనం.

ఇక రండి, రెండవ ఉదాహరణగా మనం చూచినట్లయితే, నలుగురు ఖలీఫాలు, అబూ బకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజియల్లాహు అన్హుమ్ వారు. వారి పరిపాలన యుగము స్వర్ణయుగం. వారి తర్వాత ప్రపంచంలో కేవలం ఒకే ఒక వ్యక్తి వారి లాంటి పరిపాలన, న్యాయంతో కూడిన పరిపాలన కొనసాగించారు. ఒకే ఒకరు. ఒకే ఒకరికి మాత్రమే అలాంటి పరిపాలన, అంటే నలుగురు ఖలీఫాల లాంటి పరిపాలన చేయటానికి వీలు పడింది. ఆ ఒకరు ఎవరంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. మరి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారికి అలాంటి సామర్థ్యము వచ్చిందంటే, ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనము చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళి ఆ సంబంధము కలుస్తూ ఉంది. అది ఎలాగంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, ఆయన మారువేషంలో రాత్రి పూట గస్తీ చేసేవారు. ఒక రోజు గస్తీలో మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక ఇంటి వద్ద తల్లి కూతుళ్ళ మధ్య గొడవ పడుతూ ఉండే శబ్దాన్ని విని, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో వినటం ప్రారంభించారు.

అక్కడ తల్లి కుమార్తెతో, “ఈ రోజు పశువులు పాలు తక్కువ ఇచ్చాయి, కాబట్టి పాలలో నీళ్ళు కలుపు. వినియోగదారులందరికీ పాలు దొరికేలాగా పాలలో నీళ్ళు కలుపు,” అంటూ ఉంటే, కుమార్తె మాత్రము, “లేదమ్మా! విశ్వాసుల నాయకులు పాలలో నీళ్ళు కలపరాదు, స్వచ్ఛమైన పాలు మాత్రమే అమ్మాలి అని ఆదేశించి ఉన్నారు కాబట్టి, అలా చేయటము ద్రోహం అవుతుంది, అలా చేయకూడదమ్మా” అంటుంటే, తల్లి మాత్రము కుమార్తె మీద దబాయిస్తూ, “విశ్వాసుల నాయకుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడా? చెప్పింది చెప్పినట్టు చెయ్యి” అని దబాయిస్తూ ఉంటే, అప్పుడు భక్తురాలైన ఆ కుమార్తె తల్లితో, “విశ్వాసుల నాయకుడు చూడట్లేదమ్మా, నిజమే. కానీ ఈ విశ్వానికి నాయకుడు, విశ్వనాయకుడు ఉన్నాడు కదా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! ఆయన చూస్తున్నాడే, మరి ఆయనకేమని సమాధానం ఇస్తారమ్మా” అని చెప్పారు. ఆ కూతురి, ఆ బిడ్డ మాటలు ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చాయి. ఆమె భక్తి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చింది. వెంటనే ఆ ఇల్లుని గుర్తు పెట్టుకోండి అని చెప్పి, మరుసటి రోజు ఉమర్ రజియల్లాహు అన్హు వారి కుమారుడు ఆసిమ్ అని ఒకరుంటే, ఆయనతో ఆ బిడ్డ వివాహము చేయించటానికి వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించగా, వెంటనే ఆ సంబంధము అల్హందులిల్లాహ్ ఒకే అయింది. ఆ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ అమ్మాయిని, ఆ భక్తురాలిని కోడలుగా చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అల్లాహు అక్బర్.

ఇక్కడికి ఆగలేదండీ, అసలు విషయం ఇప్పుడు వస్తుంది చూడండి. తర్వాత ఆ భక్తురాలికి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు పుట్టిన బిడ్డే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. ఆ విధంగా ఆ భక్తురాలి మనవడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఆయన కూడా గొప్ప భక్తుడయ్యాడు, న్యాయంగా పరిపాలన చేసి నలుగురు ఖలీఫాల తర్వాత ఐదవ ఖలీఫాగా ఆయన కీర్తి పొందారు. కాబట్టి మహిళ భక్తురాలు అయితే ఆమె భక్తి ప్రభావము ఎంత వరకు వ్యాపిస్తుందో చూడండి మిత్రులారా.

ఇక రండి మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ప్రపంచంలో ఖురాన్, అల్లాహ్ వాక్యాలతో నిండిన సురక్షితమైన గ్రంథము. ఖురాన్ తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి బలహీనమైన వాక్యాలు, కల్పిత వాక్యాలు లేకుండా, పరిశుద్ధమైనది మరియు నమ్మకమైనది, ప్రామాణికమైన మాటలు కలిగి ఉన్న గ్రంథము ఏది అంటే సహీ అల్-బుఖారీ. ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహి సహీ అల్-బుఖారీ’ అని పూర్తి ప్రపంచము ఆ గ్రంథము ప్రామాణికమైన హదీసులతో నిండి ఉంది అని, పూర్తి ప్రపంచము ఆ గ్రంథాన్ని ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహ్’, అల్లాహ్ గ్రంథము తర్వాత ప్రామాణికమైన, నిజమైన మాటలతో నిండిన గ్రంథము అని కీర్తిస్తుంది. అలాంటి గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిన వారు ఎవరంటే ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్, ఇమామ్ బుఖారీ అని ప్రజలందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మరి అలాంటి గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి ఆయన కానుకగా ఇచ్చి వెళ్ళారే, ఆయన అంత ప్రయోజకవంతుడు ఎలా అయ్యాడన్న విషయాన్ని మనము ఆయన చరిత్రలో కొంచెం వెళ్ళి చూస్తే, అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆయన బాల్యంలో కంటి చూపుకి దూరమై అంధుడిగా ఉండేవారు. బాల్యంలో ఆయనకు కంటి చూపు ఉండేది కాదు. మరి, ఆయన తల్లి రాత్రి పూట నిద్ర మేల్కొని తహజ్జుద్ నమాజులో కన్నీరు కార్చి ఏడ్చి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాతో బిడ్డకు కంటి చూపు ఇవ్వాలని ప్రార్థించేది. ఆమె అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతలచి, ఆమె ప్రార్థన ఆమోదించి, అంధుడిగా ఉన్న ఆ బాలుడికి కంటి చూపునిచ్చాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. కంటి చూపు వచ్చిన తర్వాత, ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేశ విదేశాలకు కాలినడకన ప్రయాణాలు చేసి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసులన్నింటినీ ప్రోగు చేసి ఒక గ్రంథ రూపంలో పొందుపరిచారు. అదే సహీ అల్-బుఖారీ గ్రంథము. జాబిల్లి వెలుగులో కూర్చొని ఆయన హదీసులు రాసేవారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అలాంటి చూపు అల్లాహ్ ఆయనకు ఇచ్చాడు. అయితే, ఆ చూపు రావటానికి, ఆయన అంత గొప్ప విద్యావంతుడు, భక్తుడు అవ్వటానికి కారణము ఆయన తల్లి. చూశారా? తల్లి భక్తి మరియు తల్లి విద్య యొక్క ప్రభావము బిడ్డల మీద ఎలా పడుతుందో చూడండి.

మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, నలుగురు ఇమాములు ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్, ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్, ఇమామ్ అబూ హనీఫా రహిమహుల్లాహ్. ఈ నలుగురు ఇమాములలో ఇమామ్ షాఫియీ వారు గొప్ప విద్యావంతులు అని అందరికీ తెలిసిన విషయం. అందరూ ఆయన గొప్ప విద్యావంతుడన్న విషయాన్ని అంగీకరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయన చాలా పుస్తకాలు రచించి ప్రపంచానికి కానుకలుగా ఇచ్చారు. అందులో ‘అర్-రిసాలా’ అనేది ఒక పెద్ద, మంచి పుస్తకం. అలాంటి పుస్తకము అంతకు ముందు ఎవరూ రాయలేకపోయారు, ఆ తర్వాత కూడా ఎవరూ రాయలేకపోయారు అని ప్రపంచంలో ఉన్న పండితులు ఆ గ్రంథం గురించి తెలియజేస్తూ ఉంటారు, ఆ పుస్తకం గురించి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి విద్యతో నిండి ఉన్న పుస్తకము ప్రపంచానికి ఆయన ఇచ్చారు.

మరి అంత విద్యావంతులు, అంత గొప్ప భక్తులు, ఇమాముగా ఆయన ఖ్యాతి పొందారు అంటే, అలా ఎలా సాధ్యమైందన్న విషయాన్ని మనం ఆయన చరిత్రలో వెతికి చూస్తే, ఆయన జన్మించక ముందే లేదా ఆయన జన్మించిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారు. ఆయన అనాథగా ఉన్నప్పుడు, పసితనంలోనే ఆయన అనాథగా ఉన్నప్పుడు, ఆయన జన్మించింది యెమెన్ దేశంలో. ఆయన తల్లి యెమెన్ దేశం నుండి చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ యెమెన్ దేశం నుండి మక్కాకు వచ్చేసింది ఆవిడ. మక్కాకు వచ్చి అక్కడ స్థిరపడి, అక్కడ ఈ ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి మంచి విద్య నేర్పించింది. బిడ్డను ఒడిలో తీసుకొని వచ్చి మక్కాలో పండితుల వద్ద విద్య నేర్పించారు. అక్కడ స్థిరపడి, అక్కడ కష్టపడి బిడ్డకు విద్య నేర్పించారు, ప్రయోజవంతులు చేయటానికి ఆమె కృషి చేశారు. ఆమె కృషికి ఫలితంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దాడంటే, ఏడు సంవత్సరాల వయసులోనే ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత లక్షల సంఖ్యలో హదీసులను ఆయన కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు రచించి ప్రపంచానికి ఆయన ఇచ్చారు. ఆ విధంగా అంత పెద్ద ప్రయోజవంతులు, విద్యావంతులు, ఇమాముగా ఆయన ప్రసిద్ధి చెందారు, ఖ్యాతి పొందారు అంటే అక్కడ ఆయన తల్లి యొక్క శ్రమ, ఆయన తల్లి యొక్క కృషి ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి.

వీటన్నింటి ద్వారా, ఈ ఉదాహరణలన్నీ మనము దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, తల్లి విద్యావంతురాలు అయితే, తల్లి భక్తురాలు అయితే, తల్లి వద్ద సామర్థ్యము ఉంటే, ఆ తల్లి భక్తి ప్రభావము, ఆ తల్లి విశ్వాస ప్రభావము, ఆ తల్లి చేష్టల మాటల ప్రభావము బిడ్డల మీద పడుతుంది. ఆ బిడ్డలు పెద్దవారయ్యి గొప్ప విద్యావంతులు, గొప్ప భక్తులు, పండితులు అవుతారు, ఇమాములు అవుతారు, ఖలీఫాలు అవుతారు, ప్రపంచానికి కానుకలు ఇచ్చి వెళ్తారు అని మనకు వీటి ద్వారా అర్థమవుతుంది. ఈ విధంగా పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి కూడా బాధ్యుడే కానీ, బిడ్డల మీద తండ్రి కంటే తల్లి మాటల, చేష్టల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.

అలాగే, మానసిక వైద్య నిపుణులు కూడా, వైద్య రంగానికి చెందిన ఈ నిపుణులు కూడా ఏమంటుంటారంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉంటున్నప్పటి నుంచి, తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి విశ్వాసాల ప్రభావము తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే పడుతుంది. ఆ బిడ్డ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి చేష్టల, తల్లి విశ్వాసాల ప్రభావము మరీ ఎక్కువగా పడుతూ ఉంటుంది అని వైద్యులు, మానసిక వైద్య నిపుణులు కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు.

ఇక నేటి పరిస్థితుల్ని మనం ఒకసారి చూచినట్లయితే, నేటి తరం, నేటి మన యువత, నేటి మన బిడ్డలు మార్గభ్రష్టులయ్యారు, మార్గం తప్పారు, అశ్లీలతకు బానిసయ్యారు, మద్యపానానికి, జూదానికి, ఇంకా వేరే చాలా దుష్కార్యాలకు, అక్రమాలకు వారు పాల్పడుతున్నారు. అలా వారు మార్గభ్రష్టులవటానికి కారణం ఏమిటి అంటే, చాలా కారణాలు దృష్టిలోకి వస్తాయి. అందులో ముఖ్యంగా మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డల ధార్మిక శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. బిడ్డలకు భక్తి విషయాలు నేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు. బిడ్డలకు విలువలు నేర్పించాలి, బిడ్డలకు భక్తి నేర్పించాలి, మంచి చెడు అలవాట్లు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి అనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవట్లేదు. కేవలము ప్రాపంచిక విద్య, ప్రాపంచిక ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ, భక్తి, ధర్మ అవగాహన అనే విషయం మీద వారు దృష్టి సారించట్లేదు కాబట్టి నేటి యువత, నేటి మన తరాలు, రాబోయే తరాలు వారు మార్గభ్రష్టులైపోతున్నారు. ఆ విధంగా సమాజంలో అశాంతి, అలజడులు వ్యాపించిపోతున్నాయి అన్న విషయం దృష్టికి వస్తుంది. కాబట్టి, సమాజంలో శాంతి రావాలన్నా, మన బిడ్డలందరూ మంచి క్రమశిక్షణ కలిగిన వారుగా మారాలన్నా, రాబోయే తరాల వారందరూ కూడా ప్రయోజవంతులు కావాలన్నా, వారికి ధార్మిక శిక్షణ ఇప్పించడము తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా, ముఖ్యంగా తల్లులు భక్తురాళ్ళు అవ్వటం చాలా ముఖ్యము. అందుకోసమే ఒక కవి ఉర్దూలో ఈ విధంగా కవిత్వాన్ని తెలియజేశాడు,

اسلاہ معاشرہ آپ کو منظور ہے اگر
بچوں سے پہلے ماؤں کو تعلیم دیجئے

[ఇస్లాహె మాషరా ఆప్కో మంజూర్ హై అగర్,
బచ్చోంసె పెహ్లే మావోంకో తాలీమ్ దీజియే]

మీరు సమాజాన్ని సంస్కరించాలనుకుంటున్నారా?,
అలాగైతే, బిడ్డలకంటే ముందు తల్లులకు మీరు విద్య నేర్పించండి.

తల్లులు సంస్కారవంతులు, విద్యావంతులు అయితే అప్పుడు బిడ్డలు కూడా సంస్కారము కలవారు, విద్యావంతులు అవ్వటానికి మార్గము సుగమం అయిపోతుంది అని తెలియజేశారు.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యము ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరినీ ధర్మ అవగాహన చేసుకొని మంచి కార్యాలలో చేదోడు వాదోడుగా ముందుకు కొనసాగాలని, అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించు గాక, దుష్కార్యాల నుండి, పాపాల నుండి అల్లాహ్ మమ్మల్నందరినీ దూరంగా ఉంచు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43475

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు [ఆడియో]

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు
https://youtu.be/H4nt2ZIXdcA [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6] ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు.

అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ఆదర్శ తండ్రి యొక్క ఆసక్తికరమైన ఉపదేశం – అబ్దుల్ ముహ్సిన్ అల్ అబ్బాద్ అల్ బద్ర్ (హఫిౙహుల్లాహ్)

ఆదర్శ తండ్రి తన సంతానానికి కొన్ని అమూల్యమైన హితోపదేశాలు - అబ్దుల్ ముహ్సిన్ అల్ అబ్బాద్ అల్ బద్ర్ (హఫిౙహుల్లాహ్)

ముహద్దిస్ మదీనతుర్ రసూల్, అల్లామహ్ అబ్దుల్ ముహ్సిన్ బిన్ హమ్ద్ అల్ అబ్బాద్ అల్ బద్ర్ హఫిౙహుల్లాహ్ తమ‌ సంతానానికి కొన్ని అమూల్యమైన హితోపదేశాలు చేసారు వాటికి “ వసాయా నఫీసహ్ ఉఖాతిబు బిహా ౙుర్రియ్యతీ - నఫఅహుముల్లాహ్ వ గైరహుమ్ బిహా "- అని నామకరణం చేయడం జరిగింది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్

తెలుగు పాఠకుల కోసం📖

🖊️📚 ముహద్దిస్ మదీనతుర్ రసూల్, అల్లామహ్ అబ్దుల్ ముహ్సిన్ బిన్ హమ్ద్ అల్ అబ్బాద్ అల్ బద్ర్ హఫిౙహుల్లాహ్ తమ‌ సంతానానికి కొన్ని అమూల్యమైన హితోపదేశాలు చేసారు వాటికి “ వసాయా నఫీసహ్ ఉఖాతిబు బిహా ౙుర్రియ్యతీ – నఫఅహుముల్లాహ్ వ గైరహుమ్ బిహా “– అని నామకరణం చేయడం జరిగింది.

🎁అందరికి ప్రయోజనకరంగా ఉండేందుకు విలువ కట్టలేని ఈ హితోపదేశాల యొక్క తర్జుమా సమర్పిస్తున్నాము.

ఆదర్శ తండ్రి యొక్క ఆసక్తికరమైన ఉపదేశం
💐💐💐💐💐💐💐💐
కింద ఉన్న లింక్ ద్వారా Pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు
https://teluguislam.net/wp-content/uploads/2023/08/some-precious-advice-to-the-children.pdf

మీ పిల్లలకు ఖుర్ఆన్ నేర్పిస్తున్నారా? అయితే మీకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసా? [వీడియో]

మీ పిల్లలకు ఖుర్ఆన్ నేర్పిస్తున్నారా? అయితే మీకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసా? [వీడియో]
https://youtu.be/wkL5OjKiSxY [2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పిల్లలకు చెవులు కుట్టించినప్పుడు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఫంక్షన్లు చేసుకోవచ్చా? వాటికి వెళ్లవచ్చా?

పిల్లలకు చెవులు కుట్టించినప్పుడు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఫంక్షన్లు చేసుకోవచ్చా? వాటికి వెళ్లవచ్చా?
https://youtu.be/hBJsEa1uiKk [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అనారోగ్య కారణంగా పిల్లలు పుట్టకుండా కొంతకాలం ఎడబాటు కోసం టాబ్లెట్, ఇంజక్షన్ ద్వారా ఫామిలీ ప్లానింగ్ పాటించవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

కొందరు జగమొండి పిల్లలు ఎంత నచ్చ చెప్పినా మాట వినరు, వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పుస్తకం & వీడియో పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

సంతాన శిక్షణ – పార్ట్ 09 – చివరి క్లాస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[47:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో130 మార్గాలు

శారీరక నిర్మాణం

60- వారి ఆట కొరకు సరిపడు సమయం వారికివ్వు.

61- వారి కొరకు ప్రయోజనకరమై క్రీడాసామానులు తెచ్చిపెట్టు.

62- కొన్ని ఆటలు స్వయంగా వారే ఎన్నుకునే స్వేచ్ఛ వారికివ్వు.

63- వారికి ఈతాడుట, పరుగెత్తుట లాంటి శక్తిని పెంచే కొన్ని ఆటలు నేర్పు.

64- కొన్ని ఆటల్లో కొన్ని సందర్భాల్లో నీ కొడుకు నీపై గెలుపు పొందే అవకాశమివ్వు.

65- ఆచి తూచి మంచి ఆహారం వారికివ్వు.

66- వారి తిండి విషయంలో సమయపాలన పాటించు.

67-  తిండి విషయంలో వారిని మితిమీరినతనం, అత్యాశ గుణాల నుండి హెచ్చరించు.

68-  తినేటప్పుడు వారి ఒక్కో తప్పును లెక్కించే ప్రయత్నం చేయకు. (మంచి విధంగా నచ్చజెప్పు).

69- వారు ఇష్టపడే రుచుల వంటకాలు చేసే, చేయించే ప్రయత్నం చేయి.

మానసిక నిర్మాణం

70- వారు చెప్పే మాట నిశబ్దంగా విను. ఒక్కో పదం పట్ల శ్రద్ధ వహించు.

71- వారి ఇబ్బందులను వారే స్వయంగా ఎదురుకొని వాటి నుండి బైటికి రానివ్వు, పోతే వారు గ్రహించకుండా తగిన సహాయం కూడా వారికి అందించు.

72- వారిని గౌరవించు, వారు ఏదైనా మంచి కార్యం చేస్తే ధన్యవాదం తెలుపు.

73- ఏ మాటలోనైనా ప్రమాణం చేసే స్థితికి తీసుకురాకు, నీవు ప్రమాణం చేయకుండా చెప్పినా నేను నీ మాటను నమ్ముతాను అని ధైర్యం ఇవ్వు.

74- హెచ్చరికలు, బెదిరింపుల పదాలకు దూరంగా ఉండు.

75- వారు చాలా చెడ్డవాళ్ళు, మూర్ఖులు అర్థం చేసుకోరు అన్న భ్రమలో ఉండకు.

76- వారు ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటే వారిని కసరుకోకుండా, సంక్షిప్తంగా మరియు నమ్మే విధంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయి.

77- ఒక్కోసారి వారిని కౌగలించుకొని వారి పట్ల ప్రేమ, అప్యాయత చూపు.

78- కొన్ని విషయాల్లో వారి సలహా అడిగి, వారి సలహా ప్రకారం అమలు చేయి.

79- ఏవైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతపాటి స్వేచ్ఛ వారికిస్తున్నట్లు గ్రహింపనివ్వు.

సామాజిక నిర్మాణం

80- వేసవిలో (విద్యార్థుల కొరకు) ఏర్పాటయ్యే ప్రత్యేక శిబిరాల్లో వారి పేరు వ్రాయించి, అందులో పాల్గొనే స్వేచ్ఛనివ్వు. (అందులో ఇస్లాం ధర్మానికి వ్యెతిరేకమైన విషయాలు ఉంటే పాల్గోనివ్వకు). ఖుర్ఆన్ కంఠస్తం కొరకు ప్రత్యేకించబడిన క్లాస్ లో చేర్పించు. జి.కే. పోటీల్లో మరియు స్కౌట్ లో పాల్గొనె అవకాశం కలగజేయి.

81- అతిథుల ఆతిథ్యం స్వయంగా వారినే చేయనివ్వు, అది చాయ్, కాఫీ, ఫలహారాలు ఇవ్వడమైనా సరే.

82- నీవు నీ స్నేహితులతో ఉన్నప్పుడు నీ కొడుకు మీ వద్దకు వస్తే నీవు అతనికి స్వాగతం పలుకు.

83- మస్జిదులో అనాథల మరియు వితంతువుల సంక్షేమం లాంటి ఏవైనా సామాజిక కార్యక్రమం జరుగుతే అతడ్ని అందులో పాల్గొనే అవకాశమివ్వు.

84- కష్టపడి పని చేయడం మరియు క్రయవిక్రయాల, ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారా సంపాదించే పద్ధతులు నేర్పు.

85- ఇతరుల ఇబ్బందులను గ్రహించి వాటిని (తన శక్తానుసారం) తగ్గించే ప్రయత్నం చేయడం నేర్పు.

86- అలా అని లోకమంతటి దిగులు తనే మోసుకునే వానిగా కూడా చేయకు.

87- నీ సామాజిక సేవల ఫలం అతడు చూసే అవకాశం కల్పించు.

88- కొన్ని పనులు పూర్తి చేసుకొని రా అని నీ కుమారుడ్ని పంపు, ఇంకా నీవు అతడ్ని నమ్ముతున్నావని గ్రహించనివ్వు.

89- అతడికి స్వయంగా తానే తన స్నేహితుడిని ఎన్నుకునే స్వేచ్ఛనివ్వు. నీవు ఇష్టపడేవారిలో ఏ ఒకరినైనా తన స్నేహితునిగా ఎన్నుకోనివ్వు. కాని నీవు తెలిసితెలియనట్లుగా నటించు.

ఆరోగ్యకరమైన నిర్మాణం

90- వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు.

91- ఏ వయసులో ఏ టీకాలు ఇప్పించాలో అందులో అశ్రద్ధ వహించకు.

92- ఏ మందు ఏ పరిమాణంలో ఇవ్వాలో అంతే ఇవ్వు. నీ ఇష్టముతో ఎక్కువగా ఇవ్వకు.

93- వారిపై ధార్మిక దుఆలు చదవడం మరువకు.

94- వారిని రాత్రి తొందరగా పడుకోబెట్టి ప్రొద్దున తొందరగా మేల్కొలుపు.

95- తానే స్వయంగా తన శరీరం, పళ్ళు మరియు బట్టలు శుభ్ర పరుచుకునే అలవాటు చేయించు.

96- ఏదైనా రోగం ముదిరే వరకు వేచి ఉండకు.

97- అంటువ్యాదుల నుండి నీ సంతానాన్ని దూరంగా ఉంచు.

98- వారిలో ఎవరికైనా ఏదైనా భయంకరమైన వ్యాది సోకితే అది అతనికి తెలియనివ్వకు.

99- అల్లాహ్ వైపునకు మరలి ఆయన్నే వేడుకో. సర్వ రోగాల నివారణ ఆయన చేతుల్లోనే ఉంది.

సంస్కృతి మరియు విద్యపరమైన శిక్షణ

100- వారికి కొన్ని పొడుపుకథలు తెలియజేయి.

101- తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఏదైనా వ్యాసం వ్రాయమని కోరు.

102- అతను వ్రాసేది నీవు ఎల్లప్పుడూ చదువు.

103- వ్యాకరణ, లేదా భాషా పరమైన ప్రతి తప్పు వద్ద ఆగి మందలించకు.

104- చదువుకొనుటకు తానే స్వయంగా ఏదైనా పుస్తకం లేదా కథలు ఎన్నుకోనివ్వు.

105- చదువుతూ ఉండమని ప్రోత్సహించు.

106- ఏదైనా చదవడంలో నీవు వారితో పాల్గొను.

107- చురుకుతనాన్ని పెంచే కొన్ని ఆటలు, క్రీడా సామానులు తెచ్చిపెట్టు.

108- అతడు ఎప్పుడూ తన చదువులో విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఉండు.

109- తన చదువులో ముందుకు వెళ్ళే దారిలో వచ్చే అంతరాయాలను అధిగమించేవానిగా అతడ్ని తయారు చేయి.

110- పూర్వికుల మరియు ప్రస్తుత కవుల కొన్ని మంచి కవిత్వాలు మరియు వారి వివేకవంతమైన విషయాలను జ్ఞాపకం చేసుకోమని ప్రోత్సహించు.

111- అరబీ (మరియు తన మాతృ) భాషలోని కొన్ని సామెతలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రోత్సహించు.

112- ప్రసంగం మరియు (ఎటువంటి స్థాన, సందర్భంలోనైనా) సంభాషించే కళ (పద్ధతి) నేర్పు.

113-    అతనికి సంవాదన మరియు ఒప్పించే కళ (పద్ధతులను) నేర్పు.

114- వ్యక్తిగత యోగ్యతలను, సామర్థ్యాలను పెంచే క్లాస్ లలో పాల్గోనివ్వు.

115- మాతృ భాషే కాకుండా చాలా ప్రాచుర్యమైన వేరే భాష కూడా సంపూర్ణంగా నేర్చుకొనుటకు ప్రోత్సహించు.

సత్ఫలితం, దుష్ఫలితం

116- ఒక్కోసారి శిక్షా మరియు ప్రతిఫలాల పద్ధతి అనుసరించు.

117- ప్రతిఫలమైనా లేదా శిక్ష అయినా ఎల్లప్పుడూ ఇవ్వకు.

118- ఎల్లప్పుడూ డబ్బు రూపంలోనే కాకుండా వేర్వేరు రకాల బహుమానాలిస్తూ ఉండు. అది ఎటైనా టూర్/ ప్రయాణం గాని, లేదా కంప్యూటర్ ఆట గాని, లేదా గిఫ్టు గాని లేదా ఫ్రెండ్ తో కలసి బైటికి వెళ్ళడానికి అనుమతి గాని కావచ్చు.

119- అలాగే శిక్ష కూడా వివిధ రకాల్లో ఉండాలి. కేవలం కొట్టడం ఒకటే నీ దృష్టిలో ప్రధానంగా ఉండకూడదు. ఆగ్రహంతో కూడిన దృష్టి కావచ్చు, గద్దించటం కావచ్చు, కొంత సేపు వరకు మాట్లాడ కుండా ఉండడం కావచ్చు, రోజువారిగా ఇచ్చే ఏదైనా ప్రత్యేక వస్తువు ఇవ్వకుండా ఉండడం కావచ్చు లేదా సెలవు రోజు పార్కు లేదా మరే వినోదానికైనా వెళ్ళడం మానుకొనుట కావచ్చు.

120- తప్పును తిరిగి చేయకుండా ఉంచగలిగే శిక్ష సరైన శిక్ష.

121- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సేవకుడిని ఒక్కసారైనా కొట్టలేదన్న విషయం గుర్తుంచుకో.

122- తొలిసారే శిక్ష విధించకు.

123- శిక్షించడంలో కఠినత్వం వహించకు.

124- శిక్షించినప్పుడు ఎందుకని శిక్షించావో దాని కారణం విశదీకరించు.

125-    నీవు శిక్షించి ఆనందిస్తున్నావన్న భావన రానివ్వకు. లేదా మనసులో అతని గురించి ఏదైనా కపటం ఉంచుకున్నావని కూడా అర్థం కానివ్వకు.

126- ప్రజల ముందు కొట్టకు అలాగే కోపంగా ఉన్నప్పుడు కొట్టకు.

127- అతని ముఖం మీద కొట్టకు. మరియు అవస్త, నొప్పి కాకూడదంటే అవసరం కంటే ఎక్కువ కొట్టకు.

128- కొట్టనని వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ కొట్టకు. ఇలా వారు నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు.

129- నీవు శిక్షిస్తున్నది అతని మేలు కొరకే అని గ్రహింపజేయి. మరియు నీ పట్ల గల ప్రేమే ఒక్కోసారి ఈ స్థితి తెప్పిస్తుందని నచ్చజెప్పు.

130- శిక్ష అనేది నిన్ను బాధించుటకు కాదు నీవు ఉత్తమ శిక్షణ పొందుటకు మాత్రమే అని తెలియజేయి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం, సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రవక్త పై అనేకానేక కరుణ, శాంతులు కురియింప జేయుగాక


పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

సంతాన శిక్షణ – పార్ట్ 08 [వీడియో]

బిస్మిల్లాహ్

[56:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో130 మార్గాలు

అల్ హందు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, అమ్మాబఅద్:

నిశ్చయంగా సంతాన శిక్షణ ఒక కళ మరియు ఒక నైపుణ్యం. అతి తక్కువ మంది ఇందులో పరిపూర్ణులుగా తేలుతారు. ఈ విషయంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. అందులో కొన్ని సంక్షిప్తమైతే మరికొన్ని విపులంగా ఉన్నాయి. వాటిలోని కొన్నింటి సారాంశం మీ ముందు ఉంచదలిచాను. లాభదాయకమైన అనుభవాలతో వాటిని క్రమబద్ధీకరించాను. తమ చిన్నారులకు ఉత్తమ శిక్షణ ఇవ్వదలచిన తండ్రులు మరియు శిక్షకులు ఇలాంటి విషయాల అవసరం లేకుండా ఉండలేరు.

విశ్వాసం

1- నీవు నీ సంతానానికి కలిమయే తౌహీద్ (ఏకత్వ వచనం: లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు అందులో ఉన్న అంగీకారం మరియు నిరాకారం నేర్పు. “లాఇలాహ”లో నిరాకారం ఉంది. అంటే అల్లాహ్ తప్ప సమస్తములో నుండి ‘ఉలూహియత్’ (ఆరాధన హక్కు)ను నిరాకరించుట. “ఇల్లల్లాహ్” లో అంగీకారం ఉంది, అంటే అల్లాహ్ ఏకైకుడు మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని నమ్ముట.

2- మనమెందుకు పుట్టించబడ్డామో? ఈ ఆయతు ఆధారంగా వారికి నేర్పించు.

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 51: 56).

“ఆరాధన” యొక్క భావాన్ని విపులంగా నచ్చజెప్పు.

3- అల్లాహ్ పేరు వింటేనే ఓ భయంకరమైన భావన వారి మదిలో కుదిరే విధంగా మాటిమాటికి నరకం, అల్లాహ్ కోపం, శిక్ష, విపత్తు గురించి బెదిరించకు.

4- అల్లాహ్ నే అధికంగా ప్రేమిస్తున్నవాడిగా వారిని తయారు చేయి. ఎందుకనగా? ఆయనే మనల్ని పుట్టించాడు, మనకు ఉపాధి ఇచ్చాడు, తినిపించాడు, త్రాగించాడు, ధరింపజేశాడు, ఆయనకు భక్తులుగా మెదులుకునే విధంగా చేశాడు.

5- ఏకాంతంలో తప్పు చేయుట నుండి వారించు. ఎందుకనగా అల్లాహ్ అన్ని స్థితుల్లో వారిని గమనిస్తున్నాడు.

6- అల్లాహ్ పేరుగల జిక్ర్ (స్మరణలు) వారి ముందు అధికంగా చేయి. ఉదాః తినేత్రాగేటప్పుడు, లోనికి, బయటికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహ్ అని. బోజనం చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని. ఆశ్చర్యం కలిగినప్పుడు సుబ్ హానల్లాహ్ అని. ఇంకా ఇలాంటి జిక్ర్.

7-వారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ కుదిరించు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు నేర్పించి, వారి ముందు ఆయన చరిత్ర తెలిపి, ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఆయనపై దరూద్ చదివి.

8- వారి మనస్సులో విధివ్రాతపై నమ్మకం పటిష్ఠంగా నాటు. అంటే అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ తలచనిది కానేకాదు.

9- వారికి విశ్వాస ఆరు మూలసూత్రాలు నేర్పు.

10- విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వారి ముందుంచు. ఉదాః నీ ప్రభువు ఎవరు? నీ ధర్మమేది? నీ ప్రవక్త ఎవరు? అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు ఉపాధి, తిను త్రాగు పదార్థాలు మరియు స్వస్థత ప్రసాదించువారు ఎవరు? తౌహీద్ యొక్క రకాలు ఏమిటి? షిర్క్, కుఫ్ర్, నిఫాఖ్ అంటేమిటి? ముష్రిక్, కాఫిర్, మునాఫిఖుల పర్యవసానం ఏమిటి? తదితర విషయాలు.

ఆరాధన

11-  వారికి ఇస్లాం యొక్క ఐదు మూలసూత్రాలు నేర్పు.

12-  వారికి నమాజు అలవాటు చేయించు. (ప్రవక్త ఆదేశం:) “మీ సంతానం వయస్సు ఏడు సంవత్సరాలు పూర్తి అయితే వారికి నమాజు గురించి ఆదేశించండి. వారి వయస్సు పది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నమాజు విషయంలో వారిని దండించండి“.

13-  నీవు మస్జిదుకు వెళ్తూ నీ కూమారుడ్ని వెంట తీసుకెళ్ళు. వుజూ ఎలా చెయ్యాలో అతనికి నేర్పించు.

14- అతనికి మస్జిదులో పాటించవలసిన పద్ధతులు, మస్జిద్ గౌరవం, పవిత్రత తెలియజేయి.

15- ఉపవాసం అలవాటు చేయించు. చివరికి అతను పెద్దగయ్యాక దానికి అలవాటు పడి ఉండుటకు.

16-  సాధ్యమైనంత వరకు ఖుర్ఆన్, హదీస్ మరియు సమయ సందర్భ స్మరణలు (అజ్కార్) కంఠస్తం చేయించుటకు ప్రోత్సహించు.

17-  వారు ఖుర్ఆన్ కంఠస్తం చేస్తున్నా కొద్ది వారికి ఏదైనా బహుమానం ఇస్తూ ఉండు. ఇబ్రాహీం బిన్ అద్ హమ్ చెప్పాడుః నా తండ్రి నాతో ఇలా చెప్పారుః “పుత్రుడా! నీవు ప్రవక్త హదీసులు కంఠస్తం చేయి. నీవు కంఠస్తం చేసే ప్రతి హదీసుకు బదులుగా ఒక దిర్హమ్ ఇస్తాను”. ఈ విధంగా నేను హదీసులు కంఠస్తం చేశాను.

18- ఖుర్ఆన్ పేరు వింటెనే శిక్షగా భావించి, ఖుర్ఆన్ కంఠస్తాన్ని అసహ్యించుకునే విధంగా కంఠస్తం మరియు పారాయణం చేయమని అధికంగా ఒత్తిడి చేయకు.

19- నీవు నీ సంతానానికి ఒక ఆదర్శం అని తెలుసుకో. నీవు ఆరాధనల్లో అలసత్వం పాటిస్తే, లేదా ఎంతో ఇబ్బందిగా పాటిస్తే దాని ప్రభావం వారిపై పడుతుంది. వారు కూడా ఎంతో కష్టంగా దానిని పాటిస్తారు లేదా దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు.

20- వారికి దానధర్మాలు చేసే అలవాటు చేయించు. అదెలా అంటే ఒక్కోసారి వారు చూస్తుండగా నీవు ఏదైనా దానం చేయి. లేదా వారికి ఏదైనా ఇచ్చి ఎవరైనా బీదవానికి లేదా పేదవానికి దానం చేయమని చెప్పు. దీనికంటే మరీ ఉత్తమమేమిటంటే వారు స్వయంగా జమ చేసుకుంటున్న డబ్బులో నుండి దానం చేయాలని ప్రోత్సహించు.

ప్రవర్తన

21-  నీ కొడుకు సత్యవంతుడు కావాలని నీవు కోరుకుంటే అతనిలో భయాన్ని జనింపజేయకు.

22-  నీవు సత్యమే పలుకుతూ ఉండు అప్పుడు నీ కొడుకు నీతో సత్యం నేర్చుకుంటాడు.

23- సత్యం మరియు అమానత్ (అప్పగింత, బాధ్యత, విశ్వసనీయత)ల ఘనతను వివరించు.

24- అతనికి తెలియకుండానే అతని అమానతును ఒక్కోసారి పరీక్షించు.

25- ఓపిక అలవాటు చేయించు. తొందరపాటు చేయకూడదని నచ్చజెప్పు. ఉపవాస అభ్యాసం ద్వారా లేదా ఓపిక మరియు నెమ్మదితో కూడిన విషయాలపై అమలు ద్వారా ఇది సంభవం కావచ్చు.

26- వారి మధ్య న్యాయం పాటించు. న్యాయగుణం వారికి నేర్పడానికి ఇదే అతిఉత్తమమైన పద్ధతి.

27- వారికి ప్రాధాన్యత గుణం అలవాటు చేయించు. అది క్రియారూపకంగానైనా లేదా ప్రాధాన్యత గుణం యొక్క ఘనతను చాటే కొన్ని సంఘటనలను ప్రస్తావించి అయినా.

28- మోసం, దొంగతనం మరియు అబద్ధాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించు.

29- వారు ఏదైనా సందర్భంలో ధైర్యం ప్రదర్శిస్తే వారిని ప్రశంసించి ఏదైనా బహుమానం ఇవ్వు. వాస్తవమైన మరియు అవసరం ఉన్న చోటే ధైర్యం ప్రదర్శించాలని బోధించు.

30- కఠినంగా ప్రవర్తించకు. దానివల్ల వారిలో భయం, అబద్ధం మరియు పిరికితనాలు చోటు చేసుకుంటాయి.

31-  వారిలో నమ్రత, మెతకవైఖరి గుణాల ప్రేమతో పాటు అహంకారాన్ని వదలుకునే ప్రేమ కుదిరించు.

32- ఘనతల్లో వ్యత్యాసం భయభీతి మరియు సత్కార్యాల ద్వారా ఉంటుంది తప్ప వంశం, డబ్బుధనం వల్ల కాదని నేర్పు.

33- అన్యాయం, అత్యాచారం యొక్క పర్యవసానం మహా చెడ్డదని, దౌర్జన్యం అనేది దౌర్జన్యపరులనే తన పొట్టలో పెట్టుకుంటుందని మరియు నమ్మకద్రోహం అనేది వినాశనానికి దారి తీస్తుందని తెలియజేయి.

34- కొన్ని విషయాల్లో ఉన్న వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పు, బహుశా వారికి తెలియకుండా ఉండవచ్చు. ఉదాహరణకుః ధైర్యం, శౌర్యం మరియు వెర్రిసాహసంలోని వ్యత్యాసం. సిగ్గు మరియు జంకులోని వ్యత్యాసం([1]). వినయం, అణకువ మరియు పరాభవంలోని వ్యత్యాసం. చాతుర్యం మరియు మోసంలోని వ్యత్యాసం.

[1] తప్పు చేసినందువల్ల లేదా లోపంవల్ల మనస్సుకు కలిగే జంకును హయా అని అరబీలో షేమ్ అని ఇంగ్లీషులో అంటారు. చేయవలసిన పని చేయకుండా సిగ్గు పడుటను ఖజల్ అని అరబీలో బాష్ ఫుల్ నెస్ అని ఇంగ్లీషులో అంటారు

35- ఇతరులకు మేలు చేసే అలవాటు వారికి చేయించు. అందుకై నీవు స్వయంగా నీ ఇంట్లో ఉత్తమముగా మెదులు, ఇతరులకు మేలు చేస్తూ ఉండు.

36- ఎప్పుడూ వాగ్దానభంగం చేయకు. ప్రత్యేకంగా నీ సంతానంతో. అందువల్ల వాగ్దానం నెరవేర్చే ఘనత వారిలో మంచిగా చోటు చేసు కుంటుంది.

సభ్యత సంస్కారం

37-  నీవు వారికి సలాం చేయి.

38- నీ మర్మ ప్రదేశాల మీద వారి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండు.

39- నీ పొరుగువారితో మంచి విధంగా మెలుగు.

40- వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించాలని వారికి నేర్పు. మరియు వారిని బాధించడంలో ఉన్న నష్టం గురించి తెలియజేయి.

41- నీవు నీ తల్లదండ్రుల పట్ల సద్వర్తన పాటించు. నీ బంధువులతో కలుస్తూ ఉండు. ఇలాంటి సందర్భాల్లో నీ సంతానాన్ని నీ వెంట ఉంచుకో.

42- ఇతరులకు ఇబ్బంది కలిగించని మంచి అలవాట్లు గల పిల్లలను ప్రజలు మెచ్చుకుంటారని తెలియజేయి.

43- వారికి ఒక పత్రం వ్రాసి పెట్టు. అందులో కొన్ని ఉత్తమ పద్ధతులు, హితోపదేశాలుండాలి.

44- కొన్ని పద్ధతులు మంచివి కావని తెలియజేస్తూ వాటి కారణం ఏమిటో స్పష్టపరచు.

45- వారితో కూర్చొని వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి గురించి చదువుతూ ఉండు. వారు దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో కనుక్కో. ఒక్కోసారి వారిలో ఎవరితోనైనా చదివించి నీవు వింటూ ఉండు.

46- వారిలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అతనికి ఒంటరిగా నచ్చజెప్పు. నలుగురి ముందు అతన్ని దండించకు.

47- సాధ్యమైనంత వరకు శాపనార్దాలు పెట్టకు.

48- వారి గదిలో ప్రవేశించేటప్పుడు, ముందుగా వారి అనుమతి తీసుకో, వారికి అనుమతి పద్ధతి నేర్పుటకు ఇది ఉత్తమ మార్గం.

49- నీవేదైనా ఆదేశించినప్పుడు తొలిమాటలోనే వారు అర్థం చేసుకుంటారని ఆశించకు. (ఒక్కోసారి ఏదైనా విషయం రెండు మూడు సార్లు కూడా చెప్పవలసి వస్తుంది అలాంటప్పుడు ఓపికతో చెప్పు):

[وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا] {طه:132}

నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. (తాహా 20: 132).

50- భోజనం చేసే ముందు బిస్మిల్లాహ్ అని, చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని వారికి వినబడే విధంగా చదవడం మరచిపోకు.

51-  వారి కొన్ని తప్పిదాలను చూసిచూడనట్లుగా ఉండు. నీ మెదడును వారి తప్పిదాలను భద్రపరిచే స్టోర్ రూంగా చేయకు.

52- నీ నుండి ఏదైనా తప్పు జరిగితే దానికి నిజమైన సాకు చెప్పుకో.

53- నీవు విలక్షణం, ప్రత్యేక విశిష్టత గలవాడివని, నీవు ఇది చేయగలుగుతావని అతడ్ని ప్రోత్సహించు.

54- వారికి ఓ ప్రత్యేకత నీవు ప్రసాదించు.

55- అతని మాటను లేదా పనిని అవహేళన చేయకు.

56- అభినందన వాక్యాలు, శుభకాంక్ష పదాలు, స్వాగతం, మర్యాద పద్ధతులు నేర్పు.

57- (పెడమార్గం పట్టేవిధంగా) ఎక్కువగా గారాభం చేయకు.

58- ఏదైనా పని చేయించుకొనుటకు మాటిమాటికి డబ్బుల ఆశ చూపకు. అందువల్ల అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

59-  వారిని నీ యొక్క నెంబర్ వన్ స్నేహితునిగా ఉంచు.


పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

సంతాన శిక్షణ – పార్ట్ 07 [వీడియో]

బిస్మిల్లాహ్

[38:49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

6- యధాపూర్వ స్థితిపై వదలటం

శిక్షణలోని తప్పుల్లో ఒకటి యధాపూర్వ పరిస్థితిని వదలి పాతరకమైన పద్ధతినే అవలంభించుట. కాలానికి తగిన నూతన విషయాల్ని విడనాడుట. ఉదాహరణకు కొందరు శిక్షణ ఇచ్చేవారు ఈతాడుట, బాణము విడుచుట మరియు గుఱ్ఱపు స్వారి నేర్పుట పట్ల మంచి శ్రద్ధ చూపుతారు మరి ఈ కాలానికి అవసరమైన ఇతర నైపుణ్యాలను వదిలేస్తారు. ఉదాహరణకుః కంప్యూటర్ శిక్షణ, అత్యవసరమైన ఇతర భాషలు, ప్రసంగం, రచన పద్ధతులు నేర్పాలి. తమ రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)కు పనికొచ్చే ఆధునిక ఆటల్లో ఏదైనా మంచి ఆటలో నైపుణ్యం ఉండేట్లు చేయాలి. శిక్షణ ఇచ్చేవారు వారి (శిక్షితుల) ఈ శక్తి సామర్థ్యాలను పెంచుతూ ఉండుటకు ఎక్కువ శ్రద్ధ చూపాలి. లేనిచో వారు తమ తోటి వాళ్ళతో వెనకే ఉండిపోతారు. అందువల్ల వారిలో న్యూనతాభావం జనిస్తుంది. జీవిత వ్వవహారాల్లో వారికంటే ముందుకు వెళ్ళిపోయిన వారి తోటివాళ్ళకు దూరదూరంగా ఉంటుంటారు.

7- తప్పును ఒప్పుకోకపోవడం

తన పిల్లవాని తప్పులేకున్నా అతడ్ని శిక్షించి అతనిపై అన్యాయం చేసిన తండ్రి మనలో లేడా?
తన పిల్లవాడు నిర్దోషి అయినా అతనిపై నిందమోపిన తండ్రి మనలో లేడా?
అబద్ధపు చాడీలను నమ్మి తన కొడుకును కొట్టిన తండ్రి మనలో లేడా?

అవును, నేను నా కొడుకు పట్ల తప్పు చేశాను అని తర్వాత తండ్రి తెలుసుకుంటాడు. కాని తన సంతానం ముందు తన పశ్చాత్తాప భావం వ్యక్త పరచడు, అస్సలు తన తప్పునే ఒప్పుకోడు. బహుశా అతని సంతానానికి ఏ హక్కూ, గౌరవం, మర్యాద మరియు వాటి భావాలు లేవు కావచ్చు అతని దృష్టిలో?

నిశ్చయంగా ఇది అసవ్యమైన పద్ధతి. ఇది పిల్లల మనస్సులో గర్వం, అహంకారం మరియు తప్పుడు అభిప్రాయంపైన పక్షపాతం లాంటి దుర్గుణాలను జనిస్తుంది. తప్పులో ఉండి కూడా తలబిరుసుతనం వహించే గుణాలు పుట్టిస్తాయి.

ఒకవేళ తండ్రి తన కొడుకు ముందు పశ్చాత్తాప భావం వ్యక్తపరిస్తే, ఇది చాలా మంచి పద్ధతి. ఇలా శిక్షకుడు తనతో జరిగిన తప్పును ఓ సానుకూల ప్రవర్తలో మార్చగలడు, దీని వల్ల పిల్లల్లో మంచి ప్రభావం కలిగి, ధర్మం మరియు సత్యం పట్ల అణకువ, తప్పు జరిగితే ఒప్పుకునే భావం, ఇతరుల పట్ల మన్నింపు వైఖరి తదితర గుణాలు పుడుతాయి.

8- వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం

తండ్రియే తనింట్లో బాధ్యుడు, వారి వ్యవహారాలు చూసేవాడు మరియు వారి గురించి అతనితోనే విచారించడం జరుగుతుంది. ఇలా అని ఇంట్లో ఉన్నవారితో సంప్రదించకుండా, ప్రతి విషయంలో తానే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కూడా సరి కాదు. దీని వల్ల పిల్లల మధ్య ఒకరిపై మరొకరు పెత్తనం నడిపించాలన్న బుద్ధి పుడుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళపై చేయిజేసుకుంటారు. వారిని అణచి ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎలాగైతే వారి తండ్రి నిర్ణయాలు తీసుకోవడంలో వారితో ప్రవర్తిస్తున్నాడో.

సెలవు రోజున తన భార్యపిల్లల్ని తన కారులో పార్క్ తీసుకెళ్లే ఒక వ్యక్తి నాకు ఇచ్చట గుర్తుకొచ్చాడు. అతడు వారిని ఎటు తీసుకెళ్తున్నాడో వారికేమీ తెలియదు. వారిలో ఏ ఒక్కడైనా (నాన్నా ఎక్కడికి వెళుతున్నారు? అని) అడిగితే, పాపం! వారు పార్క్ పోవడానికి ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్న ఆ సెలవు రోజు ‘వెనక్కి మళ్ళించి ఇంటికి తీసుకెళ్తాను’ అన్న బెదిరింపులతో శిక్షించేవాడు.

ఆ తండ్రి తన సంతానాన్ని దగ్గరికి పిలుచుకొని ఎటు వెళ్తే బాగుంటుందని వారితో సలహా తీసుకుంటే ఉత్తమం కాదా? ఇలా చేస్తే అతడు ఏమి నష్టపోతాడు? కాని కొందరు ఇతరులను అణచి ఉంచడం, వారిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారిపై తమ పెత్తనం చూపడమే మేలు అని అనుకుంటుంటారు.

9- ప్రత్యేకతలను గౌరవించకపోవడం

ప్రత్యేకతలకు సంబంధించిన గౌరవం మన పిల్లలకు నేర్పించడం ఎంతైనా అవసరం. దాని వల్ల వారు వారి వ్యక్తిగత వ్యవహారాలు మరియు ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల మధ్యగల వ్యత్యాసాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు.

విశ్రాంతి తీసుకునే సమయాల్లో మరియు ఇతరులతో కలవడం ఇష్టం లేని సమయాల్లో మనం మన సంతానానికి మరియు మన సేవలో ఉన్నవారికి మన గదిలోకి ప్రవేశించే ముందు అనుమతి తీసుకోవాలనే విషయం తప్పనిసరిగా నేర్పాలని ఖుర్ఆన్ మనకు బోధించింది.

అందుకే తల్లిదండ్రులు -ప్రత్యేకంగా తల్లి- ఇతరుల ప్రత్యేకతల గురించి వాటి హద్దుల గురించి తమ సంతానానికి తెలుపాలి. ఇతరులకు ప్రత్యేకించబడిన స్థలం లేక గదిలో వారు అనుమతి లేనిదే ప్రవేశించరాదు. మూయబడి ఉన్న ఏ వస్తువును తెరువరాదు. అది ఏ ఇంటి తలుపైనా, ఫ్రిజ్ అయినా, పుస్తకం, ఆఫీసు, పెట్టె లాంటిదేదైనా ఎప్పడి నుండి పడి ఉన్నా సరే.

కొన్ని ఇళ్ళల్లో ప్రత్యేకతల గౌరవం అనేది నశించిపోయింది. అందువల్ల సంతానం అరాచకత్వం, క్రూరత్వ వాతవరణంలో పెరుగుతూ ఇతరుల హక్కులను నెరవేర్చకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.

అందుకు తండ్రులు ముందు తమ సంతానం యొక్క ప్రత్యేకతలను గౌరవించాలి. వారి గదిలో ప్రవేశించే ముందు తలుపు తట్టాలి. వారి రహస్యాలను దాచి ఉంచాలి. ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే వారిని నిందించకుండా దాన్ని స్పష్టపరచకుండా ఉండాలి, మన్నించాలి. ఇలా తండ్రులు చేశారంటే ఇతరుల ప్రత్యేకతల గురించి వారికి నేర్పడంలో సఫలులైనట్లే.

10- దూరదూరంగా ఉంచడం

పెద్దల సమావేశంలో తమ సంతానం పాల్గొనటాన్ని కొందరు తండ్రులు ఒక న్యూనత, లోపంగా భావిస్తారు. ఎప్పుడు వారు పెద్దల సమక్షంలో రావాలనుకుంటారో వారిని నెట్టేస్తూ, చివాట్లు పెడుతూ, దూరం చేస్తూ ఉంటారు.

నిస్సందేహంగా ఒక్కోసారి పిల్లవాడిని పెద్దల సమావేశంలో కూర్చోనివ్వాలి. అతడు వారితో నేర్చుకుంటాడు. వారి అనుభవాలను సేకరిస్తాడు. బుఖారి (5620), ముస్లిం (2030)లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ త్రాగే పదార్థం వచ్చింది. ఆయన అందులో నుండి త్రాగారు. అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు. ఎడమ ప్రక్కన పెద్దమనుషులున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లవాడినుద్దేశించి: “ఇటువైపున ఉన్న పెద్దలకు ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు ఆ పసివాడు ‘అల్లాహ్ సాక్షిగా! ఓ ప్రవక్తా, మీ నుండి లభించే నా వంతులో నేను ఇతరులకు ప్రధాన్యత నివ్వను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి గొప్ప మార్గదర్శి, ఉత్తమ శిక్షకులు, మరియు మంచి విధంగా నేర్పేవారు. ప్రతి కాలం మరియు స్థలంలో ప్రతి వయస్సువారు ఆయన నుండి నేర్చుకోగలరు. ఇస్లామీయ దైవ విధానం పిల్లలను పెద్దల సమావేశంలో, వారున్న మస్జిదుల్లో, వారితో ప్రయాణానికి, వారు పోగు అయ్యే చోట పాల్గొనడాన్ని నివారించదు. వారు పాల్గొని వారి అనుభవాలను నేర్చుకుంటారు. వారితో పనుల్లో పాల్గొంటారు. బాధ్యత గుణాల్ని అన్వయించు కుంటారు.

చిన్నారులను పెద్దలతో  వేరుంచడం అనేది అవాంఛనీయ విధానం, మరియు కార్య శూన్య పద్ధతి. ఇలా చిన్నారులను పరస్పరం ఒకరికొకరు కలసినట్లు వదిలేస్తే, వారు అల్లరి, చిల్లరి పనులు నేర్చుకుంటూ, షైతాన్ వారిని తన చిక్కులో పడవేసుకుంటాడు, అందువల్ల వారు చెడు నేర్చుకుంటారు. దానికి బదులు పెద్దలతో ఉంటే గొప్ప విషయాలు, అనుభవాలు నేర్చుకుంటారు.


పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697