అల్ ఎతెకాఫ్ – Al-Itikaaf

ఎతెకాఫ్ : (భాషాపర అర్ధం ) : ఒక దానితో తప్పక కలసి ఉండుట

ఎతెకాఫ్ : ( ధార్మిక అర్దం ) :అల్లాహ్ యొక్క విధేయత కొరకు మస్జిద్ లో ఆగి ఉండుట

ఎతెకాఫ్ వలన లాభములు:

  1. మనస్సును అల్లాహ్ యొక్క  విధేయతకు దూరము చేసే వాటి నుండి కాపాడు కో గలుగుట.
  2. మనస్సును అల్లాహ్ యొక్క  విధేయతలో  నిమజ్ఞము చేసు కొని అల్లాహ్ యొక్క  కారుణ్యాన్ని పొందగలుగుట

ఎతెకాఫ్ విధములు :

  1. వాజిబ్ (నజర్) ప్రమాణము చేసిన ఎతెకాఫ్
  2. సున్నత్ రంజాన్ నెల చివరి 10 రోజులు ఎతెకాఫ్

అబీ సఈద్ రజి అల్లాహు అన్హు ఇలా తెలిపారు , రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ నెల మొదటి పది రోజులు  ఎతెకాఫ్ చేశారు  మరియు తరవాత పది రోజులు  ఎతెకాఫ్ చేశారు  మరల ఇలా ఉద్భోదించారు  లైలతుల్ ఖదర్ చివరి పది రోజుల లో ఉంది .

ఎతెకాఫ్ మూల స్థంభాలు :

  1. అల్లాహ్ స్వీకరణ యొక్క సంకల్పం
  2. ఐదు పూట్ల సామూహికంగా సలాహ్ చదవబడే మస్జిద్ లో  మాత్రమే ఎతెకాఫ్ చేయాలి (కొంత మంది మత గురువులు జామియ మస్జిద్ లో నే  ఎతెకాఫ్ చేయాలి  అంటారు )

ఎతెకాఫ్ షరతులు :

  1. ముస్లిం ఐ వుండాలి
  2. మతి స్థిమితం ఉండాలి
  3. పరిశుభ్రంగా (తహర్ తో ఉండాలి )

ఎతెకాఫ్ భంగ పరిచే కార్యములు :

  1. అనవసరంగా మస్జిద్ బయటకు వెళ్లుట
  2. భార్యతో సంభోగించుట(మీరు మస్జిద్ లో ఎతెకాఫ్ చేయునపుడు భార్యలతో సంభోగించకండి )187-2
  3. ఎతెకాఫ్ షరతులు  ఏవీ భంగ పరచ రాదు .

ఎతెకాఫ్ భంగ పరచని కార్యములు :

అవసరం తీర్చు కొనుటకు మస్జిద్ బయటకు వెళ్ళ వచ్చును ( ఆహారము కొరకు , స్నానము కొరకు  వజూ కొరకు , జుమా సలాహ్ కొరకు )

రోగిని పర్మార్శించుట కొరకు , మ్రుతుని జనాజా లో  గాని వెళ్ళ రాదు ( సంకల్పము చేయు నపుడు వాటి కొరకు మినహాయించి సంకల్పము చేసి ఉన్న యెడల తప్ప )

ఎతెకాఫ్  సున్నతులు:

  1. ఏకత్వము వహించి ఏకాగ్రతతో అల్లాహ్ యొక్క  స్వీకరణ పొందే తాపత్రయంతో అల్లాహ్ ను స్మరించుట ఖుర ఆన్ పారాయణం చేయుట, అల్లాహ్ ను వేడు కొనుట, అధిక  సలాలను ఆచరించుట
  2. అనవసరంగా  మాట్లాడకుండా ఉండుట .

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) – Zakat-ul-Fitr

zakat-ul-fitrఫిత్రా దానము అర్థము: ఈదుల్ ఫిత్ర్ పండుగకు ముందు ఆహారధాన్యాల నుండి (బియ్యం, గొధుమలు మొదలగు వాటి నుండి) ఒక “సా” (3 కేజీలు) బీద ముస్లిములకు దానం చేయుట. ఇది ఉపవాస స్థితిలో జరిగే చిన్నచిన్న తప్పులకు పరిహారము వంటిది.

ఫిత్రా దానము విధి అగుటకు కారణము: హదీథ్ లలో ఈ విధముగా తెలుపబడినది: ఇది ఉపవాసి యొక్క చిన్నచిన్న పొరపాట్లను దూరము చేయును. బీదవారుకూడా అందరితో కలిసి పండుగ జరుపుకుంటారు, మరియు అల్లాహ్ కు కృతఙతలు తెలుపుకోవడానికి – ఎవరైతే మనచేత రమదాన్ నెల ఉపవాసములు పూర్తి చేయించి ఇస్లాం యొక్క ఒక మూల స్థంభము పై అమలు చేసే శక్తిని మనకు ప్రసాదించాడో.

ఎవరిపై ఫిత్రా విధి చేయబడినది: ‘ప్రతి ఒక్కరిపై’ అనగా అప్పుడే పుట్టిన శిశువునుండి, పెద్దవారి వరకు, మరియు బానిసల తరఫు నుండి, అందరి తరఫు నుండి ఆ ఇంటి పెద్ద ఫిత్రా దానము చెల్లించాలి.

“అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ముస్లిం పై, స్వతంతృడుగాని, బానిసగానీ, పురుషుడుగాని, స్త్రీ గానీ, పిల్లలు గానీ, పెద్దవారుగానీ, అందరిపై ఒక ‘సా’ గోధుమలు లేదా ఒక ‘సా’ బార్లీ దానముగా తీయుటను విధిగావించిరి.” (ముత్తఫఖున్ అలైహ్)

ఫిత్రా దానము ఎవరికి చెల్లించాలి: బీద ముస్లిములకు.

ఫిత్రా దానము గురించి గుర్తుంచుకొన వలసిన విషయాలు:

  1. ఫిత్రా దానము ఈదుల్ ఫిత్రా కి ముందు చెల్లించవలెను.
  2. ఈదుల్ ఫిత్ర్ కు ఒకటి, రెండు రోజులు ముందుగా కూడా చెల్లించవచ్చును.
  3. ఈదుల్ ఫిత్ర్ పండుగ తరువాత చెల్లించిన యెడల అది మామూలు దానము అగును. కనుక పండుగకు ముందే తప్పక చెల్లించవలెను.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting

ఉపవాసపు మూల స్థంభములు:

  1. ఉపవాసపు సంకల్పము.
  2. ఉపవాసమును భంగపరిచే వాటి నుండి వేకువజాము నుండి సూర్యాస్తమయము వరకు వేచి వుండుట.

ఉపవాసపు నిబంధనలు:-

  1. ముస్లిం అయి వుండాలి.
  2. యుక్త వయసుకు చేరి వుండాలి.
  3. బుద్ధి గలవాడై ఉండాలి (పిచ్చి వాడుగాని మతి స్థిమితము లేని వాడై వుండారాదు.)
  4. బాటసారి కోసం ఉపవాసం తప్పని సరికాదు.
  5. ఇది స్త్రీలకు  పరిమితము – బహిష్టు వచ్చిన సమయమున ఉపవాసము ఉండరాదు.

ఉపవాసము సరియగునకు నిబంధనలు:-

  1. ఇస్లాం స్వీకరించుట
  2. ముందు నుంచే (వాజిబ్) ఉపవాసములు సంకల్పము చేయుట
  3. బుద్ది కలిగి ఉండుట.
  4. ఉపవాసము భంగపరిచే వాటి గురించి తెలిసి ఉండుట.
  5. బహిష్టు రాకుండా ఉండుట మరియు ప్రసవించిన తర్వాత శుభ్రతపొందుట.

ఉపవాసపు విధాన మరియు సున్నతులు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆలైహి వసల్లం ఇలా ఉద్బోదించారు “ ప్రజలు ఇఫ్ తార్ తొందరగా చేయుట వలన శుభాలు పొందుతారు. (బుఖారి & ముస్లిం)

ఇఫ్ తార్ ముందు దుఆ చేయుట:-ఉపవాసము ఉన్నవారు ఇఫ్ తార్ కి ముందు చేసే దుఆ రద్దు చేయబడదు.

రమదాన్ ప్రత్యేకంగా శ్రద్ధగా చేయవలసిన శుభకార్యాలు:-

  1. సహరీ చివరి ఘడియలలో చేయవలెను.
  2. అధికంగా నఫిల్ సలాహ్ చేయవలెను
  3. ఖుర్ ఆన్ పఠనము  చాలా ఎక్కువగా చేయవలెను
  4. ఉమ్రా చేయవలెను
  5. తరావీహ్ సలాహ్ చేయవలెను
  6. ఎతెకాఫ్ లో కూర్చో వలెను.
  7. పుణ్యకార్యములు చాలా ఎక్కువగా చేయవలెను

ఉపవాసములో చేయకూడని పనులు:-

  1. గర్ గరా చేయుట గొంతు వరకూ నీళ్ళు వెళ్ళ నివ్వుట లేదా ముక్కులు నీరు లోపలకు పీల్చుట.
  2. అబద్ధము  చెప్పుట, చాడీలు చెప్పుట, అశ్లీల మాటలు మాట్లాడుట.
  3. అశ్లీల పనులను ప్రోత్సహించుట ఉదా: టివి చూడుట, పాటలు వినుట మొదలైనవి.

పైన తెలిపిన వాటి నుండి మిమ్మల్ని మీరు తప్పక కాపాడుకోవలెను.

ఎలాంటి పరిస్థితులలో ఉపవాసము లేకుండా ఉండవచ్చును :-

  1. ప్రయాణము కారణముగా
  2. అనారోగ్యము కారణముగా
  3. ఎవరినైనా ప్రాణాపాయము నుండి కాపాడుట కొరకు, గర్భిణి స్త్ర్రీ లేదా పాలు ఇచ్చే తల్లి. (వీరు తమ ఉపవాసములను తర్వాత పూర్తి చేసూకోవలెను.)

ఉపవాసమును భంగపరిచేవి :-

  1. తినుట, త్రాగుట, ఇటువంటి ఏ పనైనా
  2. భార్యతో కలియుట
  3. బలవంతంగా వాంతి చేయుట
  4. అశ్లీల మాటలు, లేదా చేష్టలు లేదా టివి చూచుట వలన మనీ వెలువడుట
  5. స్త్రీకి మాసపు నెత్తురు లేదా గర్భిణీ స్త్రీకి నెత్తురు రావడంవలన
  6. ఎక్కువగా నెత్తురు పొవుట లేదా తీయుట
  7. ఉపవాసాన్ని  ఉపసంహరించుకున్నట్లు సంకల్పము చేసుకొనుట (అతను తినకపొయిన త్రాగకపొయినా కూడా)

పైన తెలుపబడిన ఉపవాసమును భంగపరిచే కార్యములు ప్రతి ముస్లింనకు తెలిసి వుండవలెను.

ఉపవాసములకు బదులు :-

రమదాన్ మాసములో ఒకవేళ ఏవైనా దినములలో ఉపవాసము పాటించని యెడల, ఎన్ని రోజులు ఉపవాసం పాటించలేదో అన్ని రోజుల పాటు ఆ తర్వాత అయినా తప్పక ఉపవాసం ఉండవలెను. ఎవరైనా రమదాన్ మాసములో ఉపవాస సమయంలో భార్యతో కలిసిన యెడల అతను

  1. ఒక బానిసను విముక్తి చేయాలి.
  2. లేనిచో ఎకధాటిగా రెండు మాసములు ఉపవాసములు ఉండవలెను.
  3. లేనిచో అరవై బీద ముస్లింలకు భోజనము పెట్టవలెను

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

వివిధ రకముల ఉపవాసములు (Types of Fasting)

విధి ఉపవాసములు

  1. రమదాన్ ఉపవాసములు
  2. పరిహారపు ఉపవాసములు
  3. మొక్కుకున్న ఉపవాసములు

విధి కాని ఉపవాసములు

  1. సున్నహ్ ఉపవాసములు
  2. అయిష్టపు ఉపవాసములు
  3. నిషిద్ధింపబడిన ఉపవాసములు

సున్నహ్ ఉపవాసములు :-

  1. హజ్ కి వెళ్ళని వారు 9 జిల్ హజ్ అరఫా రోజు ఉపవాసము ఉండుట
  2. షవ్వాల్ మాసములో 6 రోజులు ఉపవాసము ఉండుట
  3. ముహర్రంలో ఆషురా రోజు ఉపవాసముండుట
  4. దిల్ హజ్ యొక్క మొదటి 9 రోజులు ఉపవాసము ఉండుట
  5. ప్రతి నెల 13,14,15 తారీఖులలో ఉపవాసముండుట
  6. ప్రతి వారంలో సోమవారం మరియు గురువారం రోజు ఉపవాసము ఉండుట
  7. దావుద్ అలైహిస్సలాం లాగా ఒక రోజు విడిచి ఒక రోజు ఉపవాసము ఉండుట
  8. ఎవరికైతే పెళ్ళి చేసుకొనే స్థోమత లేదో వారు ఉపవాసములు ఉండి  తన మనోవాంఛలను తగ్గించుకో వచ్చును

క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుటమకరూహ్:-

  1. హజ్  చేసే వారు అరాఫ్ రోజు ఉపవాసము ఉండుట
  2. జుమహ్ రోజు, శనివారం రోజు, ఆదివారం రోజు ప్రత్యేకించి ఉపవాసము ఉండుట
  3. ఎడతెరిపి లేకుండా ఉపవాసములుండుట (అకారణముగా)
  4. షాబాన్ చివరి రోజు అనుమానం కొద్ది ఉపవాసముండుట (మొడటి రమదాన్ అవ్వచ్చు అనుకొని)
  5. భర్త అంగీకరం లేకుండా భార్య (నఫీల్) ఉపవాసములుండుట
  6. ఎప్పుడూ ఉపవాసములుండుట

క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుట నిషిధ్ధించబడినది:-

  1. రెండు పండగల రోజులలో ఉపవాసముండుట
  2. బహిష్టు స్త్రీ లేదా ప్రసవించిన  స్త్రీ, పరిశుభ్రం కాక  ముందు ఉపవాసముండుట
  3. ఉపవాసము కారణంగా మరణం సంభవించే ప్రమాదమున్న ఎడల
  4. అయ్యామ్ తష్రీఖ్ జిల్ హజ్ 11,12,13 రోజులలో ఉపవాసముండుట

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

ఉపవాసము – దాని ప్రాముఖ్యత (Fasting and its Virtues)

సియాం అర్థం: భాషాపరమైన అర్థము: ఆగుట.

సియాం : ధార్మికపరమైన అర్థము (తర్క తాత్పర్యం): వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అదాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించే వరకు (మగ్రిబ్ అదాన్ వరకు) తినడం, త్రాగడం మరియు భార్యతో కలవడంనుండి ఆగి ఉండుట.

అల్లాహ్ సియాంని విధిగావించెను:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ   (183)

“ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు (సియామ్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా నైతే మీకు పూర్వం వారిపై కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (2: 183)

شَهْرُ رَمَضَانَ الَّذِيَ أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَى وَالْفُرْقَانِ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ
“ఖుర్’ఆన్ రమదాన్ నెలలో అవతరించబడింది. మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్ఠమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమదాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం ఉండాలి.” (2:185)

బుఖారీ ముస్లిం హదీథ్ గ్రంథాలు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:

”ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, 2) సలాహ్ ని స్థాపించుట, 3) జకాహ్ (విధి దానం) చెల్లించుట, 4) హజ్ చేయుట, 5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”

ఉపవాసము ఉండుట వలన కలిగే లాభములు:
ఎన్నో విశ్వాసపు లాభములు మరియు ఆరోగ్య లాభములు కలవు.

  1. చెడు అలవాట్లనుండి దూరం కాగలము. దైవ భక్తి పెంపొందును.
  2. పరలోక భీతి
  3. సహనం ఓపిక పెంపొందుట
  4. బీదలపై కరుణాకటాక్షాలు పెరిగి, మానవత్వ ఏకీభావం పెంపొందుట.
  5. అతిగా భుజించడాన్ని తగ్గించి, జీర్ణశక్తి పెంపొందును.
  6. అల్లాహ్ యొక్క భయభక్తులు పెంపొందును.

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
“ఉపవాసము నరకమునుండి రక్షించు ఢాలు.”

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన “ఎవరైతే రమదాన్ యొక్క ఉపవాసాలు అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే పాటించారో అతని మునుపటి పాపాలన్నీ క్షమించబడును” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉద్బొధించారు”

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు: “ఎవరైతే రమదాన్ నెలలో ఖియాం చేసారో (అంటే తరావీహ్ గానీ తహజ్జుద్ గాని చదివారో) అల్లాహ్ యొక్క స్వీకరణ యొక్క సంకల్పంతోనే వారి మునుపటి పాపములు క్షమించబడును.”

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ప్రారంభముతో స్వర్గ ద్వారములన్నీ తెరువబడును.”

రమదాన్ నెల ప్రారంభమును తెలుసుకునే విధానము :

రమదాన్ మాసపు క్రొత్త నెలవంకను చూడటం, లేదా ఎవరైనా చూసిన వ్యక్తి సాక్ష్యం పలకటం ద్వారా రమదాన్ మాసము ప్రారంభమగును.  (సూరా 2:185)

[فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ {البقرة:185}

“ఎవరైతే రమదాన్ మాసాన్ని పొందుతారో, వారు ఉపవాసం ఉండాలి.” (2:185)

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ఉపవాసములు నెలవంకను చూసి ప్రారంభించండి, మరియు వేరే మాసపు నెలవంకను చూసిన తరువాత విరమించుకండి.”

ముస్లిం హదీసు హదీథ్ గ్రంథం:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “ఆకాశములో మేఘాలు కమ్ముకుని ఉండి మీకు నెలవంక కానరాని యెడల మాసపు 30 రోజులు పూర్తి చేయండి.”(ఇది షాబాన్ మరియు రమదాన్ నెలలకు వర్తిస్తుంది)

రమదాన్ మాసము పూర్తి అగుటకు 30 రోజులైనా పూర్తి అవ్వాలి లేదా 29 రోజుల తరువాత కొత్త నెలవంకనైనా చూడాలి, లేదా కనీసం ఇద్దరు సత్యవంతులైన ముస్లింలు చంద్రుడిని స్పష్టంగా చూచినట్లు సాక్ష్యం అయినా ఇవ్వాలి.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

వేటి పై జకాహ్ చెల్లించుట విధి (తప్పని సరి)

  1. బంగారము, వెండి, ధనము (డబ్బు)
  2. పంటలు, పండ్లు
  3. వ్యాపారపు సామాను
  4. జంతువులు (మేసే జంతువులు మేకలు, ఆవులు, గేదెలు, దున్నపోతులు, ఒంటెలు)
క్రమ
సంఖ్య
సంపద నిర్ణీత పరిమితి (నిసాబ్) జకాహ్ శాతము
1. బంగారము 85 గ్రాములు 2.5% బంగారము లేదా దాని యొక్క విలువ (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
2. వెండి 595 గ్రాములు 2.5% వెండి లేదా దాని యొక్క విలువ (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
3. నగదు ధనం 85 గ్రాముల బంగారం గానీ లేదా 595 గ్రాముల వెండి ఈ రెంటిలో దేని విలువ తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని నగదు ధనం యొక్క నిర్ణీత పరిమితి (నిసాబ్)  గా పరిగణించాలి. దాని విలువ యొక్క 2.5% (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
4. వ్యాపార వస్తువులు 85 గ్రా, బంగారం గానీ లేదా 595 గ్రా, వెండి ఈ రెంటిలో దేని విలువ తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని నగదు ధనపు నిర్ణీత పరిమితి (నిసాబ్)  గా పరిగణించాలి. ఇదే నిర్ణీత పరిమితి (నిసాబ్)  వ్యాపార వస్తువులకు కూడా వర్తిస్తుంది. దాని విలువ యొక్క 2.5% (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
5. నిలువ చేయదానికి & వాటి ఘన పరిమాణం ద్వారా కొలవడానికి వీలైన పంటలు.

ఉదా: గోధుమ, బార్లీ, మొక్కజొన్న, ఖర్జూరాలు, వరి,ఎండబెట్టి నులువ చేయదగిన ఫలాలు, పప్పు దినుసులు ….

618 కిలోగ్రాములు / 300 ‘సా’ (1 ‘సా’ = 4 దోసెళ్ళు) వర్షం ద్వారా ఏ ఖర్చూ లేకుండా పండినచో 10%.

ఖర్చు చేసి కష్టించి పండించినచో 5%

(పంట చేతికి వచ్చిన వెంటనే జకాహ్ చెల్లించాలి).

6. ఖనిజాలు,లోహాలు,మొదలైనవి.
(ఉదా: బంగారము, వెండి, సీసము, రాగి)
బంగారము మరియు వెండి యొక్క నిర్ణీత పరిమితి (నిసాబ్) దీనికి కూడా వర్తిస్తుంది. 2.5% (భూమి నుంచి వెలుపలికి తీసిన వెంటనే జకాహ్ చెల్లించాలి)
7. రికాజ్ (అవిశ్వాసుల యొక్క పాతిపెట్టబడిన ఖజానాలు) దీనికి నిర్ణీత పరిమితి (నిసాబ్)  లేదు. ఎంత కొద్ది మొత్తంలో నిధి బయటపడినా దాని పై జకాహ్ ల్లించవలసిందే. 20% (భూమి నుంచి వెలుపలికి తీసిన వెంటనే జకాహ్ చెల్లించాలి).
జంతువుల పై జకాతు
1). ఇంటిలో పని కొరకు లేదా పాల కొరకు ఉంచిన వాటికి జకాతు లేదు
2). కట్టివేసి మేపే జంతువులకు జకాతు లేదు.
1. మేకలు, గొర్రెలు 40 నుండి 120 వరకు 1 మేక లేదా 1 గొర్రె
మేకలు, గొర్రెలు 121 నుండి 200 వరకు 2 మేకలు లేదా 2 గొర్రెలు
మేకలు, గొర్రెలు 201 … 3 మేకలు లేదా 3 గొర్రెలు
మేకలు, గొర్రెలు తరువాత ప్రతి నూటికి 1 మేక లేదా 1 గొర్రె చొప్పున
2. ఆవు, గేదె, ఎద్దు, దున్నపోతు 30 నుండి 39 వరకు
40 నుండి 59 వరకు
60 ఉన్నట్లైతే – – – 

తరువాత ప్రతి 30 కి

తరువాత ప్రతి 40 కి

1 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు
2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు
2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు – రెండు జకాతుగా ఇవ్వాలి. 

1 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు

2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు

3. ఒంటెలు ప్రతి 5 ఒంటెలకు 20 వరకు 1 మేక (25 ఉంటే 5 మేకలు)
ఒంటెలు 25 నుండి 35 వరకు 1సం. ఆడఒంటె/2 సం. మగఒంటె
ఒంటెలు 36 నుండి 45 వరకు 2 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 46 నుండి 60 వరకు 3 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 61 నుండి 75 వరకు 4 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 76 నుండి 90 వరకు 2 సం. ఆడ ఒంటెలు రెండు
ఒంటెలు 91 నుండి 120 వరకు 3 సం. ఆడ ఒంటెలు రెండు.
ఒంటెలు 121 నుండి  ప్రతి 40 ఒంటెలకు
ప్రతి 50 ఒంటెలకు
2 సం. ఆడ ఒంటె ఒకటి.
3 సం. ఆడ ఒంటె ఒకటి.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

జకాహ్ (విధి దానము) – Zakah: Obligatory Charity

జకాహ్ అర్థము:నిర్నీత సమయంలో, నిర్ణీత ధనమునుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది.

జకాహ్ ఆవశ్యకత: ఇస్లాం మూలస్థంభాలలో జకాహ్ ఒక ముఖ్య మూలస్థంభము. ఖుర్’ఆన్ లో చాలా చోట్ల అల్లాహ్ సలాహ్ తో పాటు జకాహ్ ని కూడ విధిగా పేర్కొన్నాడు.

Al-Baqarah (2):43 : وَأَقِيمُواْ الصَّلاَةَ وَآتُواْ الزَّكَاةَ وَارْكَعُواْ مَعَ الرَّاكِعِينَ

“సలాహ్ ను స్థాపించండి మరియు జకాహ్ ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. (అల్లాహు తఆలా ముందు వంగే వారితో మీరూ వంగిపోండి)” (2:43)

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు:

“ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్యమైన ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట, 2) సలాహ్ ని స్థాపించుట, 3) జకాహ్ (విధి దానం) చెల్లించుట, 4) హజ్ చేయుట, 5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”

2వ హిజ్రీ సంవత్సరములో జకాహ్ విధిగా చేయబడినది. ఎవరైతే జకాహ్ విధిని నిరాకరించారో వారు అవిశ్వాసానికి పాల్బడినట్లు. అతను జకాహ్ చెల్లించినప్పటికీ లేదా చెల్లించకపోయినా. మరియు ఎవరైతే జకాహ్ విధి అని నమ్మి సాక్ష్యమిచ్చి, చెల్లించుటలో సోమరితనం ప్రవర్తించిన ఎడల అతను దుర్మార్గుడు. మరియు ఎవరైనా జకాహ్ చెల్లించుట నిరాకరించిన యెడల వారికి విరుధ్ధంగా ధర్మ యుధ్ధం చేయడం జరుగును.

జకాహ్ ప్రాముఖ్యతలు:

  1. హృదయాన్ని మరియు ధర్మాన్ని శుభ్రపరచును. జకాహ్ పన్ను కాదు. జకాత్ చెల్లించుటవలన ఆ ధనంలో శుభం మరియు అభివృధ్ధి కలుగును.
  2. తోటి మానవులపై దయ కలుగును, మరియు సమాజంలో ఏకత్వం పెంపొందును.
  3. ఎవరిపై అయితే జకాహ్ విధి చేయబడినదో అతనికి పరీక్ష. అతను జకాహ్ చెల్లించుటద్వారా అల్లాహ్ కు సమీపమగును. మరియు అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించిన వాడగును.

జకాహ్ ఎప్పుడు విధి అగును:

  1. ముస్లింలపై, ఎందుకంటే జకాత్ వలన శుభ్రత మరియు శుభం ప్రాప్తమగును. అవిశ్వాసి అశుభృడు.
  2. స్వతంత్రుడై ఉండాలి. వేరే వారిపై ఆధారపడి ఉండరాదు.
  3. జకాతు చెల్లించడానికి కావలసిన నిర్ణీత పరిమితి (నిసాబ్) – పూర్తి అయి ఉండాలి.
  4. సమాజంలో శాంతిబధ్రతలు ఉండాలి మరియు ఆ ధనంలో వేరేవారి హక్కు ఉండరాదు.
  5. ఒక సంవత్సరము పూర్తి కావాలి.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

జకాహ్ ఎవరికి చెల్లించాలి? (Recipients of Zakah)

జకాహ్ ఎవరికి చెల్లించాలి:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاء وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللّهِ وَابْنِ السَّبِيلِ فَرِيضَةً مِّنَ اللّهِ وَاللّهُ عَلِيمٌ حَكِيمٌ

“ఈ జకాహ్ నిధులు కేవలం నిరుపేదలకు, అక్కర గలవారికి, జకాత్ సేవకులకు, ఇంకా ప్రోత్సాహం కొరకు, బానిసల విముక్తికి, ఋణగ్రస్తుల సహాయానికి, దైవమార్గంలో మరియు బాటసారుల కొరకు ఇది అల్లాహ్ తరఫు నుంచి నిర్ణయించ బడినది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూనూ.”  (దివ్య ఖుర్’ఆన్ 9:60).

  1. నిరుపేదలు: తమ కొరకు భోజన సదుపాయాలు చేకూర్చుకొనలేరు
  2. అక్కరగలవారు: తమ ఇంటివారి కొరకు భోజన సదుపాయములు చేకూర్చుకొనలేరు.
  3. జకాహ్ సేవకులు: వారికి వేరే ఉపాధి లేనిచో దీని నుండి ఉపాధి ఇవ్వ వచ్చును.
  4. ప్రోత్సాహం కొరకు: ఇస్లాం వైపుకు మొగ్గు చూపిన యెడల అతనికి దీని నుండి అతని మనస్సు కుదుట పడడానికి ఇవ్వవచ్చును.
  5. బానిసలవిముక్తికి:బానిసలను, ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ ధనమును వినియోగించవచ్చును
  6. ఋణగ్రస్తుల సహాయానికి: అప్పు తీసుకుని తీర్చలేని వారి కొరకు.
  7. అల్లాహ్ మార్గములో కష్టపడే వారి కొరకు: కష్టాల పాలైన వారికి, కష్టాలకు గురి అవుతున్న వారికి, ధర్మపోరాటం కొరకు, ఖర్చు చేయవచ్చును.
  8. బాటసారికి: ప్రయాణీకుల దగ్గర డబ్బులు లేని యెడల అతను ధనవంతుడైనా ఆ సమయములో అతని దగ్గర ప్రయాణపు ఖర్చులు మరియు భోజన ఖర్చులు లేని యెడల అతనికి ఇవ్వ వచ్చును.

జకాహ్ కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు:

  1. జకాహ్ నిధిని పైన తెలిపిన అన్నింటి పై లేదా ఒక దానిపై లేదా కొన్నిటి పై ఖర్చు చేయవచ్చును.
  2. అవిశ్వాసులకు జకాహ్ ఇవ్వబడదు. ఇస్లాం లోకి రాదలచుకుంటే  ప్రోత్సహించుట కొరకు తప్ప.
  3. ధనవంతులకు లేదా బనీ హాషీం తెగ వారికి గాని జకాహ్ ఇవ్వరాదు.
  4. సమీప బంధువులలో నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి జకాహ్ చెల్లించుట ఉత్తమము.
  5. తమపై ఆధారపడిన వారికి జకాతు చెల్లించుట నిషిధ్ధము. ఉదా: తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనుమలు, మునుమరాళ్ళు, తాత ముత్తాతలు.
  6. ఎక్కడ జకాహ్ వసూలు చేయబడునో అదే ప్రాంతములో జకాహ్ ఖర్చు చేయుట ఉత్తమము.
  7. భార్య తన భర్తకు జకాహ్ ఇవ్వ వచ్చును.  భర్త భార్యకు ఇవ్వరాదు.
  8. తమ వాడుకలో ఉన్న వస్తువులపై జకాతు లేదు. కాని బంగారం, వెండినగలపై జకాతు చెల్లించివేయుట ఉత్తమం
  9. కిరాయి కొరకు ఇవ్వబడే వస్తువులపై జకాహ్ లేదు. కానీ దానిపై వచ్చే ఆదాయం పై జకాతు చెల్లించాలి.
  10. పంటలు మరియు పండ్ల పై, పంట పండిన వెంటనే, కోసినప్పుడే జకాతు చెల్లించి వేయాలి.
  11. భూమి త్రవ్వకాలలో లభ్యమైన ధనము, ససంపదలో 20% జకాతు చెల్లించాలి.
  12. జకాహ్ సమయం పూర్తికాగానే జకాత్ చెల్లించాలి.
  13. జకాహ్ చెల్లించకుండా చనిపోయిన యెడల అతని వారసులు జకాహ్ చెల్లించి అతని జకాహ్ అప్పును తీర్చవలెను

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

పుణ్యఫలాలు [పుస్తకం]

Punya-Falaalu-Doors-to-Great-Rewards


టైటిల్
: పుణ్యఫలాలు (Doors to Great Rewards)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ : దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు

(Great Rewards of certain acts of worship in Islam) – E-Book

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

దివ్య ఖుర్ఆన్ శ్రేష్ఠత

حفظ القرآن: عَنْ عَائِشَةَ رَضي الله عنها عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَثَلُ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَهُوَ حَافِظٌ لَهُ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَمَثَلُ الَّذِي يَقْرَأُ وَهُوَ يَتَعَاهَدُهُ وَهُوَ عَلَيْهِ شَدِيدٌ فَلَهُ أَجْرَانِ).

1-ఖుర్ఆన్ కంఠస్తం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఆయిషా ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).

تلاوة القرآن الكريم: عَنْ أَبِي أُمَامَةَ البَاهِلِي  رَضِيَ ٱللَّٰهُ عَنْهُ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ).

2-ఖుర్ఆన్ పారాయణం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

تعلم القرآن وتعليمه: عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ).

3- ఖుర్ఆన్ నేర్చుకోవటం, నేర్పించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ నేర్చుకునేవాడు మరియు నేర్పేవాడు మీలో మేలైనవారు”. (బుఖారీ 5027).

4- సూర ఇఖ్లాస్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రశ్నించారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?” దానికి సహచరులు ‘ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఎలా చదవగలడు? ప్రవక్తా!’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “ఖుల్ హువల్లాహు అహద్ (సూరా) ఖుర్ఆన్ లో మూడవ వంతుకు సమానం”. (ముస్లిం 811. బుఖారీ 5015).

5- “ముఅవ్విజతైన్”: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఈ రాత్రి అవతరించిన ఆయతుల గురించి నీకు తెలియదా? అంతటి గొప్ప ఆయతులు ఎప్పుడూ అవతరించలేదుః ‘ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్’ మరియు ‘ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్’ సూరాలు”. (ముస్లిం 814)

6- సూర బఖర: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీరు మీ ఇళ్ళను శ్మశానంగా చేసుకోకండి. సూర బఖర పారాయణం ఏ ఇంట్లో జరుగుతుందో అందులో నుంచి షైతాన్ పారిపోతాడు”. (ముస్లిం 780).

7-సూర బఖర మరియు ఆలె ఇమ్రాన్: అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానుః “ఖుర్ఆన్ చదవండి. అది ప్రళయదినాన తన్ను చదివినవారి పట్ల సిఫారసు చేస్తుంది. రెండు పుష్పములైన సూర బఖర, సూర ఆలె ఇమ్రాన్ లు చదవండి. అవి రెండు మేఘాలుగా లేక రెండు ఛాయాలుగా లేక రెండు వరుసల్లో ఎగురుతున్న పక్షుల్లాగా ప్రళయదినాన వస్తాయి. వాటిని చదివినవారి కోసం అవి వాదిస్తాయి. సూర బఖర చదవండి. దాన్ని చదివితే భాగ్యం. విడనాడితే దౌర్భాగ్యం. మాంత్రికులకు అది అసాధ్యం”. (ముస్లిం 804).

8- ఆయతుల్ కుర్సీ: ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “అబూ ముంజిర్! నీవు కంఠస్తం చేసిన అల్లాహ్ గ్రంథంలో గొప్ప ఆయతు ఏదో నీకు తెలుసా?” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ప్రశ్నించారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేనన్నాను. ప్రవక్త మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. {అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం…} (సూర బఖరలోని 255వ ఆయతు) అని జవాబిచ్చాను. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (సంతోషంతో) నా ఛాతిపై కొట్టి “అల్లాహ్ సాక్షిగా! జ్ఞానం నీకు సులభంగా అబ్బుతుంది అబుల్ ముంజిర్” అని చెప్పారు. (ముస్లిం 810)

9- సూర బఖర చివరి ఆయతులు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సూర బఖరలోని చివరి రెండు ఆయతులు రాత్రి వేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు”. (బుఖారీ 5009). ఇమాం నవవీ రహిమహుల్లాహ్ దీని భావం ఇలా చెప్పారుః ‘తహజ్జుద్ కొరకై లేవకున్నాపరవాలేదు అని ఒక భావం. షైతాన్ బారి నుండి కాపాడుకోవటానికి ఇవి సరిపోతాయనేది రెండవ భావం. ఆపదల నుండి రక్షించబడటానికి అనేది మూడవ భావం. అయితే ఇవన్నీ కూడా దీని భావంలో వస్తాయని కూడా చెప్పబడింది.

10- సూర కహఫ్ లోని మొదటి ఆయతులు కంఠస్తం చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ” సూర కహఫ్ యొక్క మొదటి ఆయతులు కంఠస్తం చేసిన వ్యక్తి దజ్జాల్ కీడు నుండి రక్షింపబడుతాడు”. (ముస్లిం 809). మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః “మొదటి పది ఆయతులు కంఠస్తం చేసినవారికి……”.

అల్లాహ్ స్మరణ మహత్త్వం

11-అల్లాహ్ యొక్క అధిక స్మరణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారరు: “‘ముఫర్రిదూన్’ ముందుకు వెళ్ళారు. ‘ముఫర్రిదూన్’ ఎవరు ప్రవక్తా! అని అడిగారు సహచరులు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు”. (ముస్లిం 2676).

12- “అల్లాహ్ ను స్మరించేవాని మరియు స్మరించనివాని ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 6407). ముస్లింలోని ఉల్లేఖనం ఇలా ఉందిః “అల్లాహ్ స్మరణ జరిగే ఇల్లు మరియు అల్లాహ్ స్మరణ జరగని ఇల్లు ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది”. (ముస్లిం 779).

13- సుబ్ హానల్లాహ్: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమక్షంలో ఉండగా “ప్రతి రోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించడం మీలో ఎవరికైనా కష్టమా?” అని అడిగారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). ఆ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ‘మాలో ఎవరైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “వంద సార్లు సుబ్ హానల్లాహ్ అని స్మరిస్తే వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి. లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి” అని సమాధానమిచ్చారని సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2698).

14- “సుబ్ హానల్లాహి వబిహందిహీ” అని రోజుకు వంద సార్లు ఎవరు పఠిస్తాడో అతని పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2691).

15- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “సుబ్ హానల్లాహి వబి హందిహీ” అని ఉదయం వందసార్లు, సాయంకాలం వంద సార్లు ఎవరైతే పఠిస్తారో, అతనికంటే ఉత్తమమైన సత్కార్యం ప్రళయదినాన మరెవరిదీ ఉండదు. అదే విధంగా లేదా అంతకు మించి పఠించిన వ్యక్తి సత్కార్యం తప్ప”. (ముస్లిం 2692).

16- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః  “రెండు వచనాలున్నాయి. అవి (పఠించడానికి) నాలుక పై తేలిగ్గానే ఉంటాయి. కాని పరలోకపు త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడయిన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి, (అవేమిటంటేః) సుబ్ హానల్లాహి వబిహందిహీ, సుబ్ హానల్లాహిల్ అజీం (అల్లాహ్ పరమపవిత్రుడు, పరిశుద్ధుడు నేనాయన్ని స్తుతిస్తున్నాను. పరమోత్తముడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు). (బుఖారీ 6406. ముస్లిం 2694).

17- అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారుః “సూర్యుని కాంతి ఎన్నిటిపై పడుతుందో వాటన్నిటి కంటే అధికంగా “సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అనడం నాకు చాలా ఇష్టం”. (ముస్లిం 2695).

18- “ఎవరైనా ప్రతి నమాజు తర్వాత 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ మరియు 33 సార్లు అల్లాహు అక్బర్ అని పఠిస్తే, ఇవి 99, మరియు లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అని 100 పూర్తి చేస్తే అతని పాపాలు క్షమించబడతాయి. ఒక వేళ అవి సముద్రం నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే. (ముస్లిం 597).

19-లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాః అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి “నేను స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా? అని చెప్పారు. తప్పకుండా తెలియజేయండని నేనన్నాను. అప్పుడాయన r “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”. (బుఖారీ 6409. ముస్లిం 2704).

20-సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వఅన అబ్దుక వఅన అలా అహ్దిక వవఅదిక మస్తతఅతు అఊజుబిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారుః “ఎవరు ఈ దుఆ పూర్తి నమ్మకంతో ఉదయం చదివి, సాయంకాలం రాక ముందే చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడు. ఎవరు రాత్రిపూట దాన్ని చదివి, తెల్లవారక ముందే చనిపోతాడో అతడూ స్వర్గవాసుల్లో ఒకడు”. (బుఖారీ 6306). (అనువాదం: ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడెవ్వడూ లేడు. నీవే నన్ను సృష్టించావు. నేను నీ దాసుణ్ణి. నేను నీతో చేసిన (దాస్య) ప్రమాణాన్ని, వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటాను. నా ద్వారా జరిగిన చెడు (వల్ల కలిగే దుష్పరిణామాల) నుండి నీ శరణు వేడుకుంటున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకొంటున్నాను. నేను చేసిన అపచారాలను ఒప్పుకుంటున్నాను. నా అపరాధాలను మన్నించు. పాపాలను మన్నించేవాడు నీవు తప్ప నాకు మరెవ్వరూ లేరు).

21- నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవ వలసిన దుఆ: “ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని వేడుకుంటే లేదా మరేదైనా దుఆ చేసుకుంటే అది అంగీకరింపబడు తుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

22-లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ వచనాలను ప్రతి రోజూ వంద సార్లు పఠించే వాడికి పది మంది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది.  పైగా అతని కర్మల రికార్డులో వంద సత్కర్మలు అదనంగా వ్రాయబడతాయి. ఆ రికార్డులో నుంచి వంద దుష్కర్మలు తొలగించి వేయబడతాయి. అంతే గాకుండా ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ వచనాలు అతడ్ని షైతాన్ బారి నుండి రక్షిస్తాయని హామీ కూడా ఉంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాజాలదు. (బుఖారీ 6403. ముస్లిం 2691). [అనువాదం: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటి లేరు. రాజ్యాధికారం అంతా ఆయనదే. సర్వ స్తుతి, స్తోత్రాలకు ఆయనే యోగ్యుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు].

23- అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ప్రవచించారుః “ఎవరైనా “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పది సార్లు చదివితే అతనికి ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురి మనుషులను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 2694).

24- జిక్ర్ సమావేశాల శ్రేష్ఠత: అబూ హురైరా మరియు అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః  “ఎవరైనా కొంత మంది అల్లాహ్ ను స్మరిస్తూ కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడుతారు. (అల్లాహ్) కారుణ్యం వారిని ఆవరిస్తుంది. శాంతి వారిపై అవతరిస్తుంది. అల్లాహ్ వారి ప్రస్తావన తన వద్ద ఉన్నవారి ముందు చేస్తాడు”. (ముస్లిం 2700).

25- ప్రవక్తపై దరూద్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒకసారి దరూద్ పంపుతారో అతనిపై అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

26- తిన్నత్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనండి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అనడం అల్లాహ్ కు చాలా ఇష్టం. (ముస్లిం 2734).

వుజూ, నమాజుల ఘనత

27- ఉత్తమ రీతిలో వుజూ చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తాడో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”. (ముస్లిం 245).

28- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా ఎవరైనా వుజూ చేసి, ఆ తర్వాత (ఐదు పూటల) ఫర్జ్ నమాజులు చేస్తే, అవి వాటి మధ్యలో జరిగే పాపాల పరిహారానికి కారణమవుతాయి”. (ముస్లిం 231).

29- వుజూ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సజావుగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు” అని పలికితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తనకు ఇష్టమైన ద్వారం గుండా అందులో అతను ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

30- అజాన్ యొక్క జవాబు, ప్రవక్తపై దరూద్: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారుః “ముఅజ్జిన్ అజాన్ ఇస్తుండగా విన్నపుడు అతను చెప్పిన విధంగానే చెప్పి ఆ తరువాత నాపై దరూద్ పంపండి. నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ పదిసార్లు కరుణ పంపుతాడు”. (ముస్లిం 384).

31- అజాన్ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ؆ ఉల్లేఖించారుః “అజాన్ విని (దాని జవాబు ఇచ్చిన  తర్వాత) ఈ దుఆ చదివిన వ్యక్తి ప్రళయం దినాన నా సిఫారసుకు అర్హుడవుతాడుః “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ”. (బుఖారీ 614).

32- అజాన్ యొక్క మహత్తు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ యొక్క అజాన్ శబ్దాన్ని విన్న మానవులు, జిన్నాతులు ఇంకా ఎవరైనా సరే,  ప్రళయదినాన వారు దానికి తప్పక సాక్ష్యం ఇస్తారు. (బుఖారీ 609).

33- మస్జిద్ నిర్మాణం: ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) మస్జిదె నబవీని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారుః మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నానుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు”. (బుఖారీ 450. ముస్లిం 533).

34- ఇమాంతో పాటు ఆమీన్ అనటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమామ్ ఆమీన్ అన్నప్పుడు మీరూ అమీన్ అని పలకండి. (అప్పుడు దైవదూతలు కూడా ఆమీన్ అంటారు). ఎవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ కు అనుగుణంగా ఉంటుందో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 780. ముస్లిం 410).

35- నమాజుకు తొలి వేళలో బయలుదేరటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశిం చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “వేళ కాగానే తొలి వేళలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615. ముస్లిం 437).

36- ఇంట్లో వుజూ చేసి, మస్జిద్ కు కాలినడకతో వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారు: “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

37- మస్జిద్ కు నడచి వెళ్లటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం మహనీయ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి మాటల్ని నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 587).

38- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తికి అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (బుఖారీ 662. ముస్లిం 669).

39- సున్నతె ముఅక్కద: ఉమ్మె హబీబా ؅ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజు పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు”. (ముస్లిం: 1696).

అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.

40- తహజ్జుద్ నమాజ్: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే (తహజ్జుద్) నమాజు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బదులిచ్చారు. (ముస్లిం 2756).

41- ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయటం: నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నాను అని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

42- సక్రమంగా వుజూ చేసి జుమాకు వెళ్ళి, నిశబ్దంగా, శ్రద్ధగా ఖుత్బా వినటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా t ఉల్లేఖించారుః “ఎవరైతే సక్రమంగా వుజూ చేసి, జుమా కొరకు వచ్చి, నిశబ్దంగా ఉండి, శ్రద్ధగా ప్రసంగం వింటాడో అతని ఈ జుమా నుండి మళ్ళీ జుమా వరకు ఇంకా మూడు రోజుల అదనంగా (అంటే మొత్తం పది రోజుల పాపాలు) మన్నించబడతాయి”. (ముస్లిం 1987).

43-శీఘ్రంగా జుమా నమాజు కొరకు వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జుమా రోజు దైవదూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటె ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తికి లభించే పుణ్యానికి సమానం. ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం ). 

44- జనాజా నమాజ్ మరియు ఖననంలో పాల్గొనుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూహురైరా r ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).

ఉపవాస (రోజా) ఘనతలు

45- విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను రోజాలుండుట: “ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 38. ముస్లిం 760).

46- విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ చేయుట: “విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ పాటించిన వ్యక్తి పూర్వ పాపాలు క్షమించ బడున”ని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చినట్లు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 37. ముస్లిం 759). 

47- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా రమజానుపవా సాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర కాలం రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).

48- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు మూడు విష యాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).

42- అరఫా దినాన ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, వచ్చే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

43- ఆషూరా దినపు ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

వివిధ ఘనతలు

51- పశ్చాత్తాపం: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః “పశ్చిమ దిశ నుండి సూర్యోదయానికి ముందు వరకు అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు”. (ముస్లిం 2703).

52- హజ్, ఉమ్రాల ఘనత: “ఎవరైనా ఒక ఉమ్రా తరువాత మరొక ఉమ్రా చేస్తే, ఆ రెండు ఉమ్రాల మధ్య కాలంలో అతని వల్ల జరిగిన పాపాలకు రెండవ ఉమ్రా పరిహారం అవుతుంది. మబ్రూర్ హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1773. ముస్లిం 1349).

53- జిల్ హిజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జిల్ హిజ్జ మొదటి దశలో చేసిన సత్కార్యాలకున్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన r “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధన ప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).

54- విద్యాభ్యాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లే ఖించారుః “విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అల్లాహ్ అతని కొరకు ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు. (ముస్లిం 2646).

55- ధర్మావగాహన: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని ముఆవియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “అల్లాహ్ ఎవరి పట్ల మేలు కోరుతాడో అతనికి ధర్మావగాహన ప్రసాదిస్తాడు”. (బుఖారీ 71. ముస్లిం 2389).

56- ధర్మప్రచారం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు సన్మార్గం వైపునకు పిలుస్తారో, అతనికి దానిని అనుసరించేవారంత పుణ్యం లభిస్తుంది. (ఆచరించేవారి) పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. (ముస్లిం 2674).

57- మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా చెడును చూసినచో తన చేత్తో దాన్ని రూపు మాపాలి. ఈ శక్తి లేకుంటే తన నోటి (మాట, ఉపదేశం)తో, ఈ శక్తి కూడా లేనిచో మనుస్సులో దాన్ని చెడుగా భావించి (దానికి దూరంగా ఉండాలి). ఇది విశ్వాసం యొక్క అధమ స్థానం”. (ముస్లిం 49).

58- సలాంను వ్యాపింపజేయటం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ‘ఏ ఇస్లాం మేలైనది’ అని ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని. ఆయన r ఇలా సమాధానమిచ్చారుః “అన్నం తినిపించు. నీకు పరి చయం ఉన్నవారికీ, లేనివారికీ సలాం చేయి”. (బుఖారీ 12. ముస్లిం 29).

59- అల్లాహ్ కొరకే ప్రేమ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ప్రళయదినాన అల్లాహ్ ఇలా అంటాడుః నా కొరకే పరస్పర ప్రేమ సంబంధాలను పెంచుకున్న వారెక్కడున్నారు? ఈ రోజు నా ఛాయ తప్ప ఏ ఛాయాలేని రోజు, నేను వారిని నా ఛాయలో ఉంచుతాను”. (ముస్లిం 6548).

60- సత్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సత్యాన్ని మీరు విడనాడకండి. సత్యం మనిషిని పుణ్యకార్యాల వైపునకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లపుడు సత్యం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి)గా మార్చేస్తుంది”……. (బుఖారీ 6094. ముస్లిం 2607).

61- సత్ప్రవర్తన: “మీలో ఉత్తమ నడవడికగలవారే మేలైనవారు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనేవారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 3559. ముస్లిం 2321).

62- చిరునవ్వు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబూ జర్ r ఉల్లేఖించారుః “ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు – అది నీ తోటి సోదరునితో నగుమోముతో కలియుటయే అయినా సరే”. (ముస్లిం 2626).

63- మృదుత్వం: “మృదుత్వం కోల్పోయిన వ్యక్తి సర్వ మేళ్ళను కోల్పోయినట్లే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని జరీర్ t ఉల్లేఖించారు. (ముస్లిం 2592).

64- రోగిని పరామర్శించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఆయన r సేవకుడైన సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారుః “ఎవరు రోగిని పరామర్శించ టానికి వెళ్తాడో అతను (తిరిగి వచ్చే వరకు) స్వర్గపు తోటలో ఉంటాడు”. (ముస్లిం 2568).

65- సహనం: “ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప పరిహారానికి కారణభూతం అవుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 5642. ముస్లిం 2573).

66- సత్కార్యం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ప్రతి సత్కార్యం సదకాయే”. (బుఖారీ 6021. ముస్లిం 1005).

67- ఒకరి కష్టం దూరం చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారుః “ఇహలోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్నయినా ఎవరయినా దూరం చేస్తే, పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఋణగ్రస్తునికి వ్యవధి ఇస్తాడో, ఇహపరాల్లో అతడికి అల్లాహ్ సుఖసంపదలు నొసంగుతాడు”. (ముస్లిం 2699).

68- అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “అల్లాహ్ ప్రళయదినాన ఆపదల నుండి కాపాడుట ఎవరికి ఇష్టమో వారు రుణగ్రస్తుని రుణ చెల్లింపుకై గడువు ఇవ్వాలి. లేదా మొత్తానికే మన్నించాలి”. (ముస్లిం 1563).

69- అనాథ సంరక్షణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ r ఉల్లేఖించారుః “నేను మరియు అనాథుల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళ్ళను కలిపి చూపించారు. (బుఖారీ 6005).

70- వితంతువులు మరియు పేదలను ఆదుకోవటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “పేదలు మరియు వితంతువుల సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారిలాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ రాత్రిళ్ళు దైవారాధనలో గడిపే వారితో సమానుడవుతాడు”. (బుఖారీ 5353. ముస్లిం 2982).

71- ముస్లిం సోదరుని కోసం దుఆ చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా t: “ఎవరు తన సోదరుని వెనక అతని కొరకు దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).  

72- రక్త సంబంధం పెంచుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “తన ఉపాధిలో సమృద్ధిని, దీర్ఘా యుష్షును కోరే వ్యక్తి బంధుత్వ హక్కులను నెరవేర్చాలి”. (ముస్లిం 2557).

73-సదఖా: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా తన మంచి (ధార్మిక) సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ మంచి వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది”. (బుఖారీ 1410. ముస్లిం 1014).

74-ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్నాశించటం: అబూ మస్ఊద్ బద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశ్యంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే, అది అతని ‘సదకా’ (మంచి దానం)గానే పరిగణించ బడుతుంది”. (బుఖారీ 55. ముస్లిం 1002).

75- కూతుళ్ళకు సుశిక్షణ: అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “ఎవరైతే ఇద్దరు బాలికలకు వారు పెళ్ళి ఈడుకు చేరుకునే వరకు మంచి శిక్షణ ఇస్తాడో అతను మరియు నేను ప్రళయదినాన ఇలా ఉంటాము అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ వ్రేళ్ళను కలిపారు”. (ముస్లిం 2631).

76- ఎడతెగని పుణ్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికి లభిస్తునే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).

77- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలగించుటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారుః “ఒక వ్యక్తి దారిన నడచిపోతూ దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతని (గత పాపాల్ని) మన్నించాడు”. (బుఖారీ 2472 ముస్లిం 1914).

78- ఆరోగ్యం, తీరిక: హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారుః “రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడియున్నారు. ఒకటిః ఆరోగ్యం. రెండవదిః తీరిక”. (బుఖారీ 6412).

79-సంతానం చనిపోయినవారు చేసే సహనానికి ఫలితం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః నేను నా దాసునికి ప్రియమైనవారిని చంపినపుడు అతను సహనం వహిస్తే, పుణ్యాన్నాశిస్తే దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారీ 6424).

80-ఏడుగురిని అల్లాహ్ తన ఛాయలో ఉంచుతాడు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడా తప్ప మరెలాంటి నీడ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలోః (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. (2) తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 1423. ముస్లిం 1031).

81- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి దర్శించటానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి ఉండమని పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు. అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడుః “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో పాటు నీ వైపు పంపాడు. నీవు అతడ్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).

82- అతి స్వల్పమైన షిర్క్ నుండి కూడా దూరముండాలి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఏ మాత్రం షిర్క్ చేయనివాడు (భాగస్వామ్యం కల్పించనివాడు) అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటే స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనకు సాటి కల్పించే మనిషి అదే స్థితిలో కలుస్తే నరకంలో చేరుతాడు”. (ముస్లిం 270).

83- బల్లిని చంపుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దెబ్బకే బల్లిని చంపినవారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ. మూడు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ”. (ముస్లిం 2240).

84- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం: ఆయిషా ؅ ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?’ అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని ఆయన సమాధానమిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).

85- మంచి సంప్రదాయం (సున్నతె హసన): ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(ప్రజలు మరచిపోయిన) ఇస్లాంలోని ఒక మంచి సంప్రదాయాన్ని ఎవరు పునరారంభిస్తారో అతనికి దాని పుణ్యంతో పాటు అతని తర్వాత దాన్ని అనుసరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు.  ఇక ఎవరు ఇస్లాంలో ఒక చెడు సంప్రదాయాన్ని మొదలెడతారో దాని పాప భారం అతనిపై పడుతుంది. ఇంకా అతని తర్వాత ఎవరు దాన్ని అవలంబిస్తారో వారి పాప భారం కూడా అతనిపై పడుతుంది. మరి వారి పాపాల్లో ఏ కొరతా జరగదు”. (ముస్లిం 2351).


(1) రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.

హజ్ యాత్రికులకు ప్రత్యేక సూచనలు

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్

హజ్ యాత్రికుల కోసం కొన్ని ముఖ్య సూచనలు

1. కేవలం అల్లాహ్ కోసమే మీ సంకల్పాన్ని నిశ్చయించుకోవటం.

ఉమ్రా లేక హజ్ యాత్ర కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామని దృఢసంకల్పం చేసుకోవలెను. ఈ పుణ్యయాత్రలో వెచ్చించే సమయానికి, సంపదకు, శారీరక ప్రయాసలకు ప్రసాదించబడే ప్రతిఫలితం మీ సంకల్పంలోని చిత్తశుద్ధి మరయు అల్లాహ్ ను మెప్పించే మీ ప్రయత్నంలోని దైవసమర్పణ, భయభక్తుల పై ఆధారపడి ఉంటుంది. దివ్యఖుర్ఆన్ లో సూరహ్ బఖరా 2:197 లో అల్లాహ్ హజ్ యాత్రికులను ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు – హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామగ్రి. ఇంకా ఇదే వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు అరఫాత్ నుండి బయలుదేరి, మష్ అఁరె హరామ్ వద్ద ఆగి, అల్లాహ్ ను స్మరించండి. అల్లాహ్ మీకు హితోపదేశం చేసిన విధంగా ఆయనను ధ్యానించండి. చేసిన పాపాల గురించి పశ్చాత్తాపం, తౌబా (క్షమాపణ వేడుకోవటం), అల్లాహ్ ధ్యానం, నమాజు, ఖుర్ఆన్ పఠనం, ఇంకా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అల్లాహ్ తప్పక చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవటం, మరియు తోటివారికి కష్టం, నష్టం కలిగించకుండా సహనంతో , ఓర్పుతో మెలగటం, వీలయినంత ఎక్కువగా సహాయసహకారాలు అందించటం మొదలైన వాటిని మీరు అత్యుత్తమైన విధంగా ఆచరించటానికి ప్రయత్నించవలెను.  సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని ‘హజ్జె మబ్రూర్ (అంటే సున్నత్ ప్రకారం చేసిన హజ్) వలన గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి’ అనే  ముఖ్యవిషయం తప్పక గుర్తుంచుకోవలెను. కాబట్టి హజ్ యాత్రను చాలా జాగ్రత్తగా, ప్రతి అడుగు అల్లాహ్ స్వీకరించే విధంగా వేయవలెను. ప్రతి మాట అల్లాహ్ మెచ్చే విధంగా పలక వలెను. అల్లాహ్ యొక్క ధ్యానం, ఆయా ఆరాధనా పద్ధతులతో పాటు ఇతరులకు ఎటువంటి కష్టం కలిగించకుండా హజ్ యాత్ర పూర్తి చేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను.

2. హజ్, ఉమ్రా మరియు వాటికి సంబంధించిన నియమ నిబంధనలను నేర్చుకోవటం.

ప్రతి ఒక్కరు హజ్ యొక్క షరతులు మరియు తప్పని సరిగా ఆచరించవలసిన ఆచరణలు, హజ్ యొక్క మూలస్థంభాలు మరియు సున్నత్ విధానములు పూర్తిగా నేర్చుకుని అల్లాహ్ ఆదేశించిన ఈ ఆరాధనను సరైన జ్ఞానంతో ఉత్తమంగా నెరవేర్చటానికి  ప్రయత్నించవలెను.  హజ్ గురించి తెలుసుకునే అన్ని సౌకర్యాలు ఉన్నా, స్వయంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంతోనే ఏదో విధంగా పూర్తిచేయాలనుకోవటం ఎంతటి అవివేకం. అజ్ఞానం వలన చేయవలసిన ఆచరణలు వదిలివేయటం లేక చేయకూడని పనులు చేయటం ద్వారా తప్పులు జరిగి, పాపములు జరిగి, హజ్ నిర్వీర్యం కావటానికి  అవకాశం ఉన్నది. పూర్వకాలంలోను మరియు ప్రస్తుత కాలంలోను అనేక మంది ఇస్లామీయ పండితులు (ఉలేమాలు) హజ్ యాత్ర గురించి వివరంగా వ్రాసిన అనేక పుస్తకములు వివిధ భాషలలో మనకు అందుబాటులో ఉన్నాయి. హజ్ యాత్రికులు వీటిని చదవ వలెను.  ఏదైనా విషయం అర్థం కాకపోతే, పండితులను(ఉలేమాలను) లేక జ్ఞానవంతులను సంప్రదించి తెలుసుకోవలెను.

3. పాపముల నుండి క్షమాపణ వేడుకోవటం (తౌబా చేయటం)

దివ్యఖుర్ఆన్ సూరహ్ అత్ తహ్రీమ్ 66:8 – అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – విశ్వసులారా! చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకుంటూ అల్లాహ్ వైపుకు మరలండి”

నిజమైన తౌబా (అంటే పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ) యొక్క చిహ్నాలు:-

ü   చెడు పనున్నింటినీ మరియు పాపములన్నింటినీ వదిలివేయటం.

ü   చేసిన చెడు పనుల మరియు పాపముల గురించి చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం.

ü   మరల అటువంటి చెడు పనులు, పాపములు తిరిగి చేయకుండా దృఢంగా నిర్ణయించికోవటం.

ü   ఇతరులకు చెందిన సంపద, గౌరవమర్యాదలు..మొదలైన వాటిని తిరిగి వారికి అప్పగించడం.

ü   హజ్ యాత్ర ఖర్చుల కోసం ధర్మబద్ధమైన (హలాల్) సంపాదనను ఎన్నుకోవడం.

ప్రతి ఒక్కరు హజ్ చేయటం కోసం ధర్మబద్ధమైన (హలాల్) పద్ధతి ద్వారా సంపాదించిన ధనాన్ని మాత్రమే ఎన్నుకోవలెను.  ఎవరైనా హజ్ యాత్ర పూర్తిచేసినా గాని, ఒకవేళ వారి సంపాదన అధర్మ పద్ధతుల ద్వారా సంపాదించినదైతే, వారి హజ్ స్వీకరించబడినదనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు ఒకవేళ ఎవరైనా పవిత్రమైన సంపాదనతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్అని పలకగానే, లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు పవిత్రమైనవి, మీ వాహనం పవిత్రమైనది మరియు మీ హజ్ స్వీకరించబడుతుందిఅని ఆకాశం నుండి జవాబు వస్తుంది.కాని ఒకవేళ ఎవరైనా అధర్మపద్ధతిలో సంపాదించిన ధనంతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్అని పలకగానే, లా లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు అపవిత్రమైనవి, మీ వాహనం అపవిత్రమైనది మరియు మీ హజ్ పాపములతో నిండి ఉన్నది మరియు అది స్వీకరించబడదుఅని ఆకాశం నుండి జవాబు వస్తుంది. కాబట్టి హజ్ యాత్ర ఖర్చులకు కేవలం పవిత్రమైన, ధర్మంగా మరియు ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా సంపాదించిన ధనం మాత్రమే వెచ్చించవలెను. హజ్ ప్రయాణం కోసం మంచి నడవడిక గల స్నేహితులను ఎన్నుకోండి. ప్రయాణ సంప్రదాయములు (ఆదాబె సఫర్), ప్రయాణంలో చేసే వివిధ దుఆ (ప్రార్థన) లు ముందుగా తెలుసుకోవలెను. ప్రయాణ ప్రారంభంలో చేయవలసిన ప్రార్థనలు మీకు తెలుపబడును. వాహనం ఎత్తుగా ఉండే ప్రదేశం వైపుకు ప్రయాణించేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని, పల్లం వైపుకు ప్రయాణించేటప్పుడు సుభహానల్లాహ్ అని, దారిలో విరామం కోసం ఆగినప్పుడు అఊదు బి కలిమాతిల్లాహిత్తామత మిన్ షర్రి మా ఖలఖ్ అంటే అతడే సృష్టించిన దుష్టశక్తుల బారి నుండి నేను పవిత్రమైన, సంపూర్ణమైన అల్లాహ్ యొక్క పదాల ద్వారా రక్షణ వేడుకుంటున్నాను అని ప్రార్థించినట్లయితే విశ్రాంతి ప్రదేశాలలో వారికి అల్లాహ్ కృప వలన ఎటువంటి హాని కలుగదు.

4. హజ్ యాత్రికులకు కొన్ని ముఖ్యసూచనలు

1.    నమాజు సమయం అయినప్పుడు, వెంటనే చేస్తున్న పని ఆపి, నమాజు కోసం తయారు కావలెను. నమాజును ఆలస్యం చేసే లేక నమాజు ను నిరోధించే ఏ పనిలోను అల్లాహ్ యొక్క శుభాలు ఉండవు.

2.    మీ ఖాళీ సమయాలలో, వీలయినంత ఎక్కువగా ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం చేయటానికి ప్రయత్నించవలెను. మీరు చదివే ప్రతి ఒక్క అక్షరానికి కనీసం 10 పుణ్యాలు ప్రసాదించబడతాయనే హదీథ్ ను మరిచిపోవద్దు.

3.    తోటి వారితో మంచిగా ప్రవర్తించండి, ఉత్తమమైన పద్ధతిలో వ్యవహరించండి.

4.    ఎటువంటి ప్రయోజనం కలిగించని అనవసర విషయాల గురించిన వాదనలు, ఘర్షణలు చేయవద్దు. దీని వలన మీ అమూల్యమైన దుఆల సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్ వీటిని నిషేధించాడు. సూరహ్ బఖరా 2:197 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు  హజ్ సమయంలో అతడు కామచేష్టలకూ, దుష్కార్యాలకూ, ఘర్షణలకూ దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం అల్లాహ్ కు తెలుస్తుంది’. కాబట్టి హజ్ యాత్రకోసం సంకల్పం (నియత్) చేసుకున్న ప్రతి ఒక్కరు, అన్ని విధాల తప్పుడు మాటలను, అశ్లీలపు (బూతు)  పదాలను పలుకరాదు. నాలుకను పూర్తిగా అదుపులో ఉంచుకోవలెను. ఏదేని కారణం వలన అల్లాహ్ యొక్క ధ్యానంలో, స్మరణలో నాలుకను బిజీగా ఉంచలేకపోయినా, అనవరపు నిషేధించబడిన మాటలలో దానిని బిజీ చేయవద్దు. కాబట్టి ప్రతి హజ్ యాత్రికుడు అరఫాత్, మీనా, ముజ్దలిఫాలలోని ఈ ఉత్తమమైన సమయాన్ని తమకు ఇహపరలోకాలలో ప్రయోజనం కలిగించే ఇస్లామీయ ధర్మవిషయాలు నేర్చుకోవటంలో, తోటివారికి సహాయ పడటంలో, అల్లాహ్ యొక్క ధ్యానంలో, వివిధ ఆరాధనలలో, ప్రార్థనలలో పూర్తిగా గడపవలెను. హాని కలిగించే విషయాల నుండి, మాటల నుండి, సమయాన్ని వృధా చేయటం నుండి దూరంగా ఉండవలెను.

5.    ఇస్లాం ధర్మం ప్రకారం జీవిస్తున్న స్నేహితుడితో హజ్ యాత్ర చేయటానికి ప్రయత్నించండి. తోటివారిలో అటువంటి వ్యక్తిని కనిపెట్టి వారితో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించవలెను.

6.    మీకు అందజేయబడిని వివధ ఇస్లామీయ కార్యక్రమముల నుండి ప్రయోజనం పొందటానికి ప్రయత్నించవలెను.

7.    మీ గ్రూపులోని ముఅఁల్లిమ్ (బాధ్యులైన వారు) అనుమతి లేకుండా ఆయా ప్రాంతాల నుండి వేరే చోటుకి వెళ్ళవద్దు. మీకు వేరే చోటుకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడినట్లయితే, ఆరోగ్యం పాడైతే, అలసిపోతే, మీ గ్రూపు ముఅఁల్లిమ్ (సూపర్ వైజరు)కు వెంటనే తెలియజేయవలెను. దీని వలన మీకు త్వరగా సహాయం అందించటానికి అవకాశం ఉంటుంది.

8.    ప్రయాణ సౌలభ్యం కోసం మన కేంద్రం నుండి హజ్ కు వెళ్ళుతున్న వారందరినీ కొన్ని గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకు ఒక్కో ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్)ను నియమించటం జరుగుతుంది. మీకు కేటాయించబడిన గ్రూపు పేరు (నెంబరు), ముఅఁల్లిమ్ పేరు, మొబైల్ నెంబరు, మీనాలోని టెంట్ నెంబరు తప్పక గుర్తుంచుకోవలెను. ఒక గ్రూపులోని వారు వేరే గ్రూపువారితో అనుమతి లేకుండా ఎక్కువ సమయం గడపటం నిషేధించబడినది.

9.    హజ్ యాత్ర మొదలైనప్పటి నుండి తిరిగి వచ్చేవరకు పొగత్రాగటం (సిగరెట్) పూర్తిగా నిషేధించబడినది. ఒంటరిగా ఉన్నా (బాత్రూమ్ లోనైనా సరే), అందరితో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, తమ తమ టెంట్ లలో ఉన్నా – ఏ సమయంలోను మొత్తం హజ్ యాత్రలో అస్సలు పొగత్రాగరాదు.

10. విశ్రాంతి, విరామ సమయాలలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించవలెను.

11. మీకు ఏదైనా సందేహం కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మీ గ్రూపుకు బాధ్యత వహిస్తున్న ధర్మ ప్రచారకుడిని (దాయిని) వెంటనే సంప్రదించవలెను. ఇన్షా అల్లాహ్ మీకు సరైన సహాయం ఉత్తమమైన రీతిలో వెంటనే లభిస్తుంది.  అలా వీలుపడక పోతే కనీసం మీతో ఉన్న ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్) నైనా సంప్రదించ వలెను.

5. క్రింది విషయాలను మరచిపోవద్దు.

1.    ఇన్షా అల్లాహ్ మన హజ్ ప్రయాణం జిల్ హజ్ నెల 6వతేదీ అంటే 15th Dec 2007, శనివారం నాడు ప్రారంభం కాబోతున్నది.

2.    మీతో పాటు ఒరిజినల్ ఇఖామా తో పాటు దాని ఫోటోకాపీ కూడా తీసుకు రావలెను.

3.    ఉదయం 11.30 గంటలకు మస్జిదె సుదైరీ, రబువా ప్రచార కేంద్రం దగ్గర తప్పక హాజరు కావలెను.

4.    స్వంత బట్టలు, ఇహ్రామ్, బెల్టు, సబ్బు, రబ్బరు చెప్పులు, టూత్ బ్రష్, టూత్ పేష్టు మొదలైన పర్సనల్ వస్తువులు ఒక చిన్న బ్యాగులో సర్దుకుని  వెంట తీసుకు రావలెను. దీనిని బస్సు క్రింది భాగంలోని లగేజీ ప్రాంతంలో ఉంచవలెను. ఇంకో ఇహ్రామ్ మరియు బెల్టు మాత్రం వేరే చేతిసంచి (ప్లాష్టిక్) లో బస్సులోని తమ తమ సీటు పై భాగంలో ఉంచవలెను.

5.    హజ్ యాత్రకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన పుస్తకాలు ముందుగానే మీకివ్వబడును. దీనితో పాటు దివ్యఖుర్ఆన్ భావం యొక్క తెలుగు అనువాదం కూడా ఇవ్వబడును.

6.    హజ్ లో ఖుర్బానీ ఇవ్వటం కోసం అవసరమైన ధనం మీతో పాటు ఉంచుకో వలెను.

7.     మీతో పాటు బ్లాంకెట్లు, పరుపులు తీసుకు రావద్దు. అవసరమైన చోట అందజేయబడును.

8.    ప్రతి ఒక్కరు తోటి ప్రయాణికుడికి వీలయినంతగా సహాయసహకారాలు అందజేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను. వారు కూడా మీలాగే అల్లాహ్ యొక్క గౌరవ అతిథులనే విషయం మరచిపోవద్దు.

6. అత్యంత ముఖ్యమైన విషయం

ఇక్కడ నుండి మా గ్రూపులో బయలుదేరిన హజ్ యాత్రికులందరూ, తిరిగి ఇక్కడకు వచ్చే వరకు ఎట్టిపరిస్థితులలోను ఎటువంటి కారణం వలనైనా సరే, గ్రూపును వదలకూడదు. ఎవరైనా తమ దూరదేశాల నుండి హజ్ కోసం వచ్చిన బంధువులను, స్నేహితులను కలవాలనే ఆలోచనలతో ఉన్నట్లయితే, ఇప్పుడే మాకు తెలియజేయవలెను. మక్కా చేరిన తర్వాత, మా గ్రూపును వదిలి వేరే వారితో గడపటం పూర్తిగా నిషేధించబడినది. ఇది మనందరి శ్రేయస్సుకోసం లాభదాయకం.

7. ఎమర్జన్సీ సందర్భంలో సంప్రదించ వలసిన వ్యక్తుల ఫోను నెంబర్లు చిన్న పేపరు పై వ్రాసుకుని ఎల్లప్పుడూ దగ్గరగా ఉంచుకోవలెను. మధ్య మధ్యలో వారికి ఫోను చేసి మీ క్షేమసమాచారములు తెలియజేస్తూ ఉండవలెను.

8.హజ్ యాత్ర నుండి తిరుగు ప్రయాణంలో తీసుకు రావలసిన ముఖ్యమైన సందేశం.

హజ్ యాత్రలో ఎక్కువ సమయం స్మరిస్తూ, పలుకుతూ, వింటూ గడిపిన తల్బియా (లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లాషరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద, వన్నేమత, లకవుల్ ముల్క్, లాషరీక లక్) లోని లాషరీక లక్ అనే పవిత్ర ప్రవచనాన్ని జీవితాంతం పాటించాలనే దృఢసంకల్పం. ఇక నుండి కేవలం ఒక్క అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాస్యం చేయననే తిరుగులేని నిర్ణయం. ఏ చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఇక నుండి కేవలం అల్లాహ్ నే వేడుకోవాలనే కృతనిశ్చయం – ఇయ్యాక నాఅఁబుదు ఇయ్యాక నస్తయీన్ (కేవలం నిన్నే ఆరాధిస్తాను మరియు సహాయం కోసం కేవలం నిన్నే అర్థిస్తాను) పై అచంచల విశ్వాసం. లబ్బైక్ – అల్లాహుమ్  లబ్బైక్ (హాజరయ్యాము, యా అల్లాహ్ హాజరయ్యాము) – అనే పవిత్ర ప్రవచనాలను అల్లాహ్ కు డైరక్టుగా ఎటువంటి మధ్యవర్తులు (ఇమాములు, ముజావర్లు, పూజారులు) లేకుండా విన్నవించుకుంటున్నామో, హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా సుఖసంతోషాలలో, కష్టనష్టాలలో మన వేడుకోళ్ళను కేవలం అల్లాహ్ కే సమర్పించుకోవాలనే ఏకైక లక్ష్యం. మనల్ని ప్రతి క్షణం గమనిస్తాడనే కఠోర సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అల్లాహ్ ఇష్టపడే విధంగా మన శేషజీవితాన్ని ఇస్లాం ధర్మం ప్రకారం జీవించాలనే తపన & కృషి.

9. అల్లాహ్ మీ హజ్ యాత్రను స్వీకరించుగాక!

10. హజ్ మబ్రూర్…………………….. హజ్ మబ్రూర్………………………………. హజ్ మబ్రూర్