మనుషుల్లో అత్యంత చెడ్డ దొంగ, తన నమాజ్‌ ను దొంగిలించే వాడు [ఆడియో & టెక్స్ట్]

ఈ ప్రసంగంలో, నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరిగ్గా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ఎలా ఆచరించాలో వివరించబడింది. నమాజులో తొందరపాటు చూపడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతి చెడ్డ దొంగతనం”గా అభివర్ణించారని, ఇది ధనాన్ని దొంగిలించడం కంటే ఘోరమైనదని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. అబ్దుల్లా బిన్ జుబైర్, ముస్లిం బిన్ యసార్, సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ వంటి సలఫె సాలిహీన్ (పూర్వపు సత్పురుషులు) తమ నమాజులలో ఎంతటి ఏకాగ్రత మరియు నిమగ్నతను కనబరిచేవారో ఉదాహరణలతో సహా వివరించారు. సరిగ్గా నమాజు చేయని వారిని చూసినప్పుడు వారికి హితబోధ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, మన నమాజు మన జీవితంపై మరియు పరలోకంపై చూపే ప్రభావాన్ని గురించి కూడా నొక్కి చెప్పబడింది.

మనుషుల్లో అత్యంత చెడ్డ దొంగ, తన నమాజ్‌ ను దొంగిలించే వాడు
https://youtu.be/1qJu0BoGg-w [30 నిముషాలు]
నమాజులో కదలిక, చలనం మరియు తొందరపాటు- 10 మంది సలఫె సాలిహీన్ నమాజుల ఉదాహరణ,
అసలు ఖుత్బా అరబీలో: షేఖ్ రాషిద్ అల్ బిదాహ్, అనువాదం: నసీరుద్దీన్ జామిఈ

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.అల్హమ్దులిల్లాహ్.

اَلْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَزَلْ بِنُعُوتِ الْجَلَالِ وَالْجَمَالِ مُتَّصِفًا، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ مُقِرًّا بِوَحْدَانِيَّتِهِ وَمُعْتَرِفًا، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ النَّبِيُّ الْمُصْطَفَى، صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ وَمَنْ سَارَ عَلَى نَهْجِهِ وَاقْتَفَى. أَمَّا بَعْدُ.

అల్హమ్దులిల్లాహిల్లజీ లమ్ యజల్ బినూతిల్ జలాలి వల్ జమాలి ముత్తసిఫా, వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖిర్రన్ బివహ్దానియతిహి వ మో’తరిఫా, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహున్ నబియ్యుల్ ముస్తఫా, సల్లల్లాహు వ సల్లమ అలైహి వ మన్ సార అలా నహ్జిహి వఖ్తఫా. అమ్మా బా’ద్.

فَاتَّقُوا مَنْ هُوَ أَهْلٌ لِلتَّقْوَى وَأَهْلٌ لِلْمَغْفِرَةِ.
ఫత్తఖూ మన్ హువ అహ్లున్ లిత్తఖ్వా వ అహ్లున్ లిల్ మగ్ఫిరహ్.
ఎవరైతే, ఎవరి నుండి అయితే భయపడటం, ఎవరి తఖ్వా అవలంబించడం మనకు ఎక్కువగా హక్కు ఉన్నదో ఆయనతో మీరు భయపడండి, తఖ్వా అవలంబించండి. మరియు ఆయనే మన అందరి పాపాలను క్షమించేవాడు.

ఒక భయంకరమైన దొంగ. ఆ దొంగ ధనాన్ని దొంగలించలేదు. కానీ ధనం కంటే మరీ విలువైన దానిని దొంగలించాడు. తెలుసా మీకు ఎవరు ఆ దొంగ? జవాబు వినడానికి రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును విందాము.

إِنَّ أَسْوَأَ النَّاسِ سَرِقَةً الَّذِي يَسْرِقُ صَلَاتَهُ
[ఇన్న అస్వఅన్నూసి సరిఖతన్ అల్లజీ యస్రిఖు సలాతహు]
“నిశ్చయంగా దొంగల్లో అతి చెడ్డ దొంగ లేదా దొంగతనం చేసే ప్రజల్లో అతి చెడ్డవాడు, నమాజులో దొంగతనం చేసేవాడు.”

قَالُوا: وَكَيْفَ يَسْرِقُهَا؟
[ఖాలూ: వకైఫ యస్రిఖుహా?]
అక్కడ ఉన్నవారు “అతను ఎలా దొంగతనం చేస్తాడు?” అని అడిగారు.

قَالَ: لَا يُتِمُّ رُكُوعَهَا وَلَا سُجُودَهَا
[ఖాల: లా యుతిమ్ము రుకూఅహా వలా సుజూదహా]
దానికి ప్రవక్త, “అతను దాని రుకూ మరియు సజ్దాలను సంపూర్ణంగా చేయడు” అని అన్నారు.

దొంగల్లో అతి చెడ్డ దొంగ లేదా దొంగతనం చేసే ప్రజల్లో అతి చెడ్డవాడు, నమాజులో దొంగతనం చేసేవాడు. నమాజులో దొంగతనం ఎలా చేస్తాడు అని అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు, ప్రవక్త చెప్పారు, అతను తన నమాజులోని రుకూను, నమాజులోని సజ్దాలను సంపూర్ణంగా, సరిగ్గా చేయడు.

ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, 11532. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ యొక్క పుస్తకం అస్సలా నుండి తీసుకోవడం జరిగింది, 286 పేజీ నంబర్. అయితే గమనించారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజులో దొంగతనం చేసేవాడిని ధనం యొక్క దొంగతనం చేసే వాడికంటే చాలా చెడ్డవాడు అని చెప్పారు.

అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని మూడు సార్లు రిటర్న్ చేశారు, తిరిగి పంపేశారు. వెళ్ళు, నీవు నీ నమాజును మళ్ళీ తిరిగి చెయ్యి అని చెప్పారు. ఎందుకంటే అతడు తన నమాజులో ఆ చెడ్డతనానికి పాల్గొన్నాడు. ఏంటి? నమాజ్ హుందాతనంతో, ఎంతో ఇత్మీనాన్ మరియు శాంతియుతంగా చేయలేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అతడు ఒకసారి నమాజ్ చేసి వచ్చాడు. “ఇర్జిఅ ఫసల్లి ఫఇన్నక లమ్ తుసల్లి” (తిరిగి వెళ్ళు మళ్ళీ నమాజ్ చెయ్యి, నువ్వు నమాజు చేయలేదు) అని చెప్పారు. మరోసారి వచ్చాడు, మళ్ళీ తిరిగి పంపారు. మరీ మూడోసారి వచ్చాడు, మళ్ళీ తిరిగి పంపారు. అల్లాహు అక్బర్. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 724, సహీహ్ ముస్లింలో ఉంది 397.

ఇక ఈ నమాజు గురించి హజ్రత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పిన విషయం ఎంత గొప్పదో ఆలోచించండి. ఏం చెప్పారు ఆయన?

وَالصَّلَاةُ مِكْيَالٌ
[వస్సలాతు మిక్యాల్]
“నమాజ్ ఒక కొలమానం (స్కేల్).”

నమాజ్ ఒక స్కేల్. మీరు కొలత కొరకు ఏదైతే సాధనాలు ఉపయోగిస్తారో అలాంటిది.

فَمَنْ أَوْفَى أُوفِيَ لَهُ
[ఫమన్ ఔఫా ఊఫియ లహు]
“ఎవరు నమాజ్ దాని యొక్క సంపూర్ణ రీతిలో చేస్తారో, వారికి సంపూర్ణ రీతిలో పుణ్యం లభిస్తుంది.”

وَمَنْ نَقَصَ فَقَدْ عَلِمْتُمْ مَا قِيلَ لِلْمُطَفِّفِينَ
[వమన్ నఖస ఫఖద్ అలిమ్ తుమ్ మా ఖీల లిల్ ముతఫ్ఫిఫీన్]
“మరెవరైతే కొరత పాటిస్తారో, తూకంలో తగ్గించేవారి గురించి ఏమని చెప్పబడిందో మీకు తెలుసు.”

ఒకవేళ కొరత పాటిస్తే,

وَيْلٌ لِّلْمُطَفِّفِينَ
الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ
وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ
[వైలుల్లిల్ ముతఫ్ఫిఫీన్. అల్లజీన ఇజక్తాలూ అలన్నాసి యస్తౌఫూన్. వ ఇజా కాలూహుమ్ అవ్వజనూహుమ్ యుఖ్సిరూన్.]
(కొలతలు, తూనికల్లో ) తగ్గించి ఇచ్చే వారు నాశనమవుదురుగాక! వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా – ఖచ్చితంగా – తీసుకుంటారు. కాని వారికి కొలచిగానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.” (83:1-3)

సూరతుల్ ముతఫ్ఫిఫీన్ లో కొలతల్లో హెచ్చుతగ్గులు చేసే వారి గురించి ఎలాంటి భయంకరమైన హెచ్చరిక ఉంది. సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ఇమాం బైహఖీ వారు తమ షుఅబుల్ ఈమాన్ గ్రంథంలో ప్రస్తావించారు, వాల్యూం సంపుటి 4 పేజీ నంబర్ 505.

అందుకొరకే, మనం ఈ రోజుల్లో చదువుతున్నటువంటి నమాజ్, మనం నమాజులో ఎలాంటి అనవసరమైన చేష్టలు, చలనము, హరకాత్, మరియు తొందరపాటు ఏదైతే నమాజులో చేస్తున్నామో, దీనిపట్ల మరియు మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ వారు చేసే అటువంటి నమాజు పట్ల శ్రద్ధ వహిస్తే ఎంత స్పష్టమైన తేడా వ్యత్యాసం కనబడుతుంది. అల్లాహు అక్బర్.

రండి, మన సలఫె సాలిహీన్ వారి యొక్క నమాజు కొన్ని ఉదాహరణలు మీ ముందు పెడతాను, శ్రద్ధ వహించండి.

1. హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు త’ఆలా అన్హు, వారు ఉన్న యొక్క ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టడం జరిగింది, దాడి చేయడం కొరకు. అప్పుడు ఆయన నమాజు స్థితిలో ఉన్నారు. దూరం నుండి అగ్నిగుండంతో కలిగినటువంటి రాళ్ళు ఏదైతే యుద్ధాల్లో శత్రువులపై వేయబడతాయో, మంజనీఖ్ ద్వారా (రాళ్లతో దాడి చేసే యంత్రం), దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అందులో ఆ వస్తువును పెట్టి, తిరిగి తింపి తింపి ఇలా పారేస్తారు, చాలా దూరం వరకు పోయి పడుతుంది. అయితే ఆయన ఉన్న, నమాజు చేస్తున్న ప్రాంతం దాని చుట్టుపక్కల్లో వచ్చి పడుతున్నాయి. చివరికి ఒక అగ్నిగుండం లాంటి రాయి వచ్చి ఆయన తొడిగినటువంటి వస్త్రాన్ని దాని యొక్క కొంత భాగాన్ని కూడా కాల్చింది, కానీ నమాజులో ఏమాత్రం అతను కదలకుండా నమాజు చేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ తమ పుస్తకం జుహుద్ లో ప్రస్తావించారు, పేజీ నంబర్ 128, 164 మరియు ఇమాం అబూ దావూద్ రహిమహుల్లాహ్ జుహుద్ అనే పుస్తకంలో ప్రస్తావించారు, పేజీ నంబర్ 325.

2. ఇక ఇమాం అతా, గొప్ప తాబఈ, వృద్ధవయస్సులో చేరారు. అయినా నమాజు నిలబడి చేసేవారు, 200 ఆయతులు సూరె బఖరాలోనివి కూడా నిలబడి చదివేవారు. అల్లాహు అక్బర్. ఏ కొంచెం కదలకుండా. ఈ మాట ఇమాం బైహఖీ రహిమహుల్లాహ్ షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు, వాల్యూం 4, పేజీ నంబర్ 517

3. ఇక మూడో ఉదాహరణ, ముస్లిం బిన్ యసార్. ఆయన నమాజు చేస్తున్నప్పుడు ఎలా చేసేవారంటే, ఏదో ఒక బట్ట, గుడ్డ తీసుకొచ్చి ఏదైనా ఒక కర్ర మీద వేసేసారు అన్నట్లుగా. అంటే ఏ కొంచెం కదలిక లేకుండా, చలనం లేకుండా అటు ఇటూ హరకాత్ లేకుండా. ఒకసారి ఆయన మస్జిద్ లో నమాజు చేస్తూ ఉన్నారు, మస్జిద్ యొక్క గోడ పడిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో అని భయభీతులతో అటూ ఇటూ పారిపోయారు, కానీ ముస్లిం బిన్ యసార్ ఏమాత్రం తమ నమాజులో కదలలేదు. అల్లాహు అక్బర్. ఈ విషయం ఇమాం ఇబ్నుల్ ముబారక్ తమ పుస్తకం అజ్-జుహుద్ లో ప్రస్తావించారు మరియు ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ లో, అలాగే ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ తమ పుస్తకం జుహుద్ లో ప్రస్తావించారు.

4. ఇక నాలుగవ ఉదాహరణ, అంబస్ బిన్ ఉఖ్బా. ఆయన నమాజు చేస్తూ సజ్దాలో వెళ్లారంటే ఎంత దీర్ఘంగా సజ్దా చేసేవారంటే, మరియు ఆ సజ్దాలో ఏమాత్రం కదలిక అనేది ఉండేది కాదు. అందువల్ల, కొన్ని పిట్టలు, చిన్న చిన్న పక్షులు వచ్చి అతని వీపుపై కూడా కూర్చునేవి. అల్లాహు అక్బర్. ఈ విషయం ఇమాం బైహఖీ రహిమహుల్లాహ్ షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు.

5. ఐదవ ఉదాహరణ, ముహమ్మద్ బిన్ నస్ర్. ఆయన ఎంత శ్రద్ధాభక్తులతో నమాజు చేసేవారంటే, ఈగలు వచ్చి ఆయన ముఖాన్ని తినేసినా వాటిని లేపకుండా, ఆ ఈగలు వచ్చి కూర్చున్నాయి అన్నటువంటి స్పృహ లేకుండా నమాజులోనే ఉండేవారు మరియు వాటిని లేపేవారు కూడా కాదు. అంటే దాని పట్ల శ్రద్ధ లేదు, నమాజులో అంతా వారు నిమగ్నులై ఉన్నారు. ఈ విషయం కూడా ఇమాం బైహఖీ రహిమహుల్లాహ్ షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు.

6. అలాగే మరో ఉదాహరణ, మన్సూర్ బిన్ మో’తమిర్ యొక్క పొరుగులో ఉండే అటువంటి వారి కూతురు చెబుతుంది, ఆ చిన్న కూతురు, తన తండ్రితో అడుగుతుంది, ఓ నాన్నా, మన ఇంటి పక్కన ఉండే మన్సూర్ వారు వారి యొక్క ఇంటి కప్పు మీద, టెర్రస్ మీద ఒక కర్ర ఉండింది కదా, నిలబడి రాత్రి పూట మనం చూసేవారిమి, ఏంటి అది కనబడటం లేదు? అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, నా కూతురా, అది కర్ర కాదమ్మా, అది ఏదో అక్కడ పెట్టబడినటువంటి నిట్టాడు లేదా ఏదో పిల్లర్ లాంటిది కాదమ్మా, అతడు మన్సూర్. రాత్రి పూట అంతా దీర్ఘంగా అతను నమాజ్ చేసేవాడు. అల్లాహు అక్బర్. ఇది ముస్నద్ ఇబ్నుల్ జా’ద్ లో ఉన్నది ఈ ఉల్లేఖనం.

చూశారా, గమనించారా? ఎంత శ్రద్ధాభక్తులతో, ఎంత భయభీతితో వారు నమాజ్ చేస్తున్నారు? ఆ మన సలఫె సాలిహీన్ ఇంత తృప్తిగా, శాంతిగా, ఇత్మీనాన్ తో నమాజ్ చేసేవారు గనుక, ఎవరైనా కోడి చించువుల మాదిరిగా, “కవ్వే ఔర్ ముర్గీ కీ టోంగో కీ తరహా,” నమాజ్ చేసే వారిని చూస్తే మౌనం వహించేవారు కాదు, వారికి వెంటనే బోధ చేసేవారు, వారికి నమాజ్ విధానం నేర్పేవారు, నమాజులో ఇలాంటి చెడ్డ దొంగతనాల నుండి ఆపేవారు. దీని యొక్క కొన్ని ఉదాహరణలు చూస్తారా?

7. మైమూన్ ఇబ్ను మెహరాన్ అంటున్నారు, “ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూస్తున్నాడు, అతడు నమాజ్ చాలా చెడ్డ స్థితిలో చేస్తున్నాడు, అయినా ఈ చూసిన వ్యక్తికి తెలిసి కూడా అతన్ని ఆపడం లేదు అంటే ఈ వ్యక్తి ఉదాహరణ ఎలాంటిదో తెలుసా? అతను ఒక వ్యక్తి పడుకున్న వ్యక్తిని చూస్తున్నాడు. ఆ నిద్ర, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఒక పాము కాటు వేస్తుంది. ఇది చూసుకుంటూ కూడా అతన్ని లేపకుండా, అతన్ని నిద్ర నుండి మేల్కొల్పకుండా ఉండడం ఎలాంటిదో, ఒక వ్యక్తిని నమాజును సరియైన రీతిలో చేయనిది చూస్తూ కూడా అతనికి బోధ చేయకపోవడం ఇలాంటిదే.” మైమూన్ ఇబ్ను మెహరాన్ యొక్క ఈ మాట ఇమాం ఇబ్ను అబిద్దున్యా అల్-అమ్రు బిల్-మారూఫ్ వన్నహ్యు అనిల్-మున్కర్ లో ప్రస్తావించారు, ఇమాం బైహఖీ రహిమహుల్లాహ్ షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు.

8. రెండో ఉదాహరణ, హుదైఫా రదియల్లాహు త’ఆలా అన్హు, గొప్ప సహాబీ. ఒక వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తి నమాజులో తన రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు, ఇత్మీనాన్ గా, హుందాతనంగా, శాంతిగా చేయడం లేదు. అతడు నమాజు పూర్తి చేసిన తర్వాత అతన్ని పిలిచి చెప్పారు, “మా సల్లైత్,” (నీవు నమాజు చేయలేదు). “వలౌ ముత్త అలా గైరి సున్నతి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం,” (ఒకవేళ ఇదే స్థితిలో నీవు చనిపోయావంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ కు వ్యతిరేకంగా నీ చావు అయ్యేది). అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

9. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక వ్యక్తిని చూశారు, అతడు తన రుకూను, సజ్దాలను నమాజులో సరిగ్గా చేయడం లేదు. ఏమన్నారు? “అఇద్,” (నీవు నీ నమాజుని మరోసారి చదువు). ఈ హుదైఫా రదియల్లాహు త’ఆలా అన్హు మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా వీరి యొక్క ఉల్లేఖనాలు సహీహ్ బుఖారీలో వచ్చి ఉన్నాయి. హదీస్ నంబర్ 382, అలాగే హదీస్ నంబర్ 3529.

మరొక ఉదాహరణ, ఒక సహాబీ మరొక సహాబీని చూస్తారు, అతను నమాజ్ చేశాడు కానీ చాలా చాలా స్పీడ్ గా, తొందరగా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ నమాజ్. అతన్ని దండించారు. అయితే ఆ వ్యక్తి ఒక సాకు చెప్పాడు, ఏమని? అయ్యో నా మేకలు ఎక్కడ పారిపోతాయో అని నేను అదే ఆలోచించుకుంటూ ఉన్నాను, అందుకొరకు నేను ఇంత తొందరగా నమాజ్ చేసినట్టుగా నాకు. అప్పుడు ఆ సహాబీ చెప్పారు, “అక్బరు ద్దైఅతి అదా’త్” (నీ మేకలు అన్నీ కూడా దొంగలించబడ్డా, నీ మేకలన్నీ కూడా నీ నుండి పారిపోయినా, నీకు దాని నష్టం కలిగినా, నీవైతే ఇప్పుడు ఏ స్థితిలో నమాజు చేశావో ఆ నష్టానికంటే ఎక్కువ నష్టంలో పడిపోయావు కదా, దీన్ని ఎందుకు గ్రహించవు?). ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ అజ్-జుహుద్ లో ప్రస్తావించారు, 140 పేజీ నంబర్.

10. ఇంకా మరొక సంఘటన వినండి. అమ్రు బిన్ షద్దాద్ అంటున్నాడు, నేను మిస్వర్ ఇబ్ను మఖ్రమా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ముందు నమాజ్ చేస్తూ ఉన్నాను. అయితే కోడి ఎలాగైతే “టోంగే మారనా” తన చుంచువును టక్ టక్ అని కొట్టుకుంటూ తీసుకుంటుందో గింజల్ని, ఆ విధంగా ఎక్స్ప్రెస్ నమాజ్ నేను ఫటాఫట్ ఫటాఫట్ చేసేసాను. అయితే మిస్వర్ ఇబ్ను మఖ్రమా నాతో చెప్పారు, నిలబడు మళ్ళీ నమాజ్ చెయ్యి. నేను అన్నాను, “ఖద్ సల్లైత్” (నేను నమాజ్ చేశాను కదా). మిస్వర్ ఇబ్ను మఖ్రమా చెప్పారు, “కజబ్త, వల్లాహి మా సల్లైత్” (నీవు అబద్ధం పలుకుతున్నావు, అల్లాహ్ సాక్షిగా నీవు నమాజ్ చేయలేదు). నీవు నమాజ్ చేయకుంటే ఇక్కడి నుండి కదిలేదే లేదు. అమ్ర్ అంటున్నాడు, నేను మళ్ళీ నిలబడి నమాజ్ చేశాను. ఈ రెండవసారి చేసిన నమాజ్ లో రుకూ సజ్దాలు, “ఫఅత్మమ్తుర్ రుకూఅ వస్సుజూద్,” నిన్ను హుందాతనంగా, నిదానంగా, తృప్తిగా చేశాను. అప్పుడు మిస్వర్ బిన్ మఖ్రమా చెప్పారు, “వల్లాహి లా తఅసూనల్లాహ వనహ్ను నంజురు మస్తతఅనా” (ఏంటి ఏమనుకుంటున్నావ్? అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విధంగా అల్లాహ్ యొక్క నాఫర్మానీ, అల్లాహ్ కు అవిధేయత పాటిస్తూ ఉంటే మేము చూసుకుంటూ ఉంటాము అని అనుకుంటున్నావా? లేదు, ఇలా కుదరని పని). అల్లాహు అక్బర్. ఇమాం ఇబ్ను అబిద్దున్యా ఈ ఉల్లేఖనాన్ని అల్-అమ్రు బిల్-మారూఫ్ వన్నహ్యు అనిల్-మున్కర్ లో ప్రస్తావించారు, పేజీ నంబర్ 96.

ఇక రండి, ఇక రండి. చివరిలో చాలా గొప్ప సంఘటన వినిపిస్తాను. చాలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి గురించి, కానీ వ్యక్తిగతంగా అతన్ని ఇప్పటికీ ఎంత చెడ్డవారు అని అనుకున్నా గానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు అతనివి చాలా విచిత్రంగా, ఎంత గొప్ప అల్లాహ్ వాడు అన్నటువంటి ఉదాహరణ మనకు కనబడుతుంది. ఎవరి విషయం అనుకుంటున్నారు?

11. హజ్జాజ్ బిన్ యూసుఫ్. అతడు తన నవయువకుడైన ఆ వయసులో ఏమైంది ఒకసారి, నమాజ్ చేశాడు, అక్కడ పక్కనే ఇమాముత్తాబిఈన్, తాబిఈన్ల యొక్క ఇమాం సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ ఉన్నారు. అయితే ఈ సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ పక్కనే ఈ నవయువకుడైనటువంటి హజ్జాజ్ బిన్ యూసుఫ్ నమాజ్ చేస్తున్నాడు. సామూహిక నమాజ్, జమాత్ యొక్క నమాజ్. అందులో ఈ యువకుడు, హజ్జాజ్ బిన్ యూసుఫ్, ఇమాం కంటే ముందు ముందు, ముందు ముందు చేస్తున్నాడు. హజ్జాజ్ స్వయంగా అంటున్నాడు, ఎప్పుడైతే ఇమాం సలాం తింపేశాడో, సయీద్ నా యొక్క బట్టను, నేను తొడిగి ఉన్నటువంటి డ్రెస్ ని ఒక మూలను పట్టి నన్ను మరింత దగ్గరికి చేశాడు. ఏమన్నాడు? “యా సారఖ్! యా ఖాయిన్!” (ఓ దొంగ! ఓ నమ్మకద్రోహి!), “తుసల్లీ హాజిహిస్ సలా?” (ఈ విధంగా నీవు నమాజ్ చేస్తావా?). “లఖద్ హమమ్తు అన్ అజ్రిబ బిహాజన్నఅలి వజ్హక” (నేను నా ఈ చెప్పుతో నీ ముఖం మీద కొట్టాలి అని అనిపిస్తుంది, ఈ విధంగా నీవు నమాజ్ చేశావు). కొట్టలేదు, కొట్టాలనిపిస్తుంది అని చెప్పారు. ఆ సమయంలో ఇమాముత్తాబిఈన్ సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ చాలా గొప్ప మనిషి, పెద్ద మనిషి, చాలా గొప్ప ఆలిం. ఇతను నవయువకుడు. మౌనంగా ఉండిపోయాడు. సంవత్సరాలు గడిసిపోయాయి. ఆ తర్వాత ఈ హజ్జాజ్ ఇబ్ను యూసుఫ్ మదీనాకు గవర్నర్ గా అయ్యాడు. మదీనా గవర్నర్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఒక సందర్భంలో మస్జిద్ నబవీలో వచ్చాడు. అయితే అప్పుడు సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్, ఇమాముత్తాబిఈన్, తన శిష్యుల మధ్యలో, తుల్లాబ్, స్టూడెంట్స్ మధ్యలో వారికి హదీస్ జ్ఞానం, ధర్మ జ్ఞానం నేర్పుకుంటూ ఉన్నారు. అయితే ఎవరైతే కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం హజ్జాజ్ కు సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ చెప్పినటువంటి మాటలు, నమాజ్ గురించి చేసినటువంటి ఉపదేశం చూసి ఉన్నారో, వారు భయపడ్డారు. అయ్యో ఇప్పుడు ఇతను నాయకుడుగా అయ్యాడు కదా, గవర్నర్ గా అయ్యాడు కదా, సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ తో ఏమైనా పగ తీర్చుకుంటాడో, ఏం చేస్తాడో అన్నట్లుగా. అయితే అక్కడికి వచ్చిన తర్వాత హజ్జాజ్, సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ తో కలిసి దగ్గరికి వచ్చాడు, కలిసి నీవే కదా నాకు ఫలానా సందర్భంలో ఈ మాటలు చెప్పింది? సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ ఎప్పటికీ పెద్ద మనిషి, చాలా వయసు గల వారు కూడా, వయసుపైబడిన వారు, భయపడలేదు. తన చేతితో హజ్జాజ్ యొక్క ఛాతిపై ఇలా కొట్టి, అవును అని చెప్పారు. అప్పుడు హజ్జాజ్ అన్నాడు, వినండి, “ఫజజాకల్లాహు మిన్ ముఅల్లిమిన్ వముఅద్దిబిన్ ఖైరా” (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించు గాక. నీవు ఎంత మంచి ముఅల్లిమ్, జ్ఞానం నేర్పేవారివి. నీవు ఎంత మంచి శిక్షణ ఇచ్చేవారివి). “మా సల్లైతు బా’దక సలాతన్ ఇల్లా వఅన అజ్కురు ఖౌలక” (నేను ఆ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ నమాజ్ చేసినా నీ ఈ మాటే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది). మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఈ సంఘటన అల్-బిదాయ వన్నిహాయ లో ప్రస్తావించారు, సంపుటి 12, పేజీ నంబర్ 513.

ఓ విశ్వాసులారా! ఎవరైతే ఈ చెడ్డ రీతిలో నమాజు చేస్తారో, అతని నుండి అతని సంతానం నేర్చుకుంటారు. ఒకవేళ ఈ చెడ్డ స్థితిలో చేసేవాడు ముఅల్లిమ్ ఒక టీచర్ అయితే, స్టూడెంట్స్ అలాగే అతని నుండి నేర్చుకుంటారు. ఇక ఒకవేళ ఎవరైనా ఇమాం ఇలా చేస్తే, ఇది మరింత చాలా భయంకరమైన సంఘటన. కనుక నీవు ఇలా చెడ్డ స్థితిలో నమాజ్ చేసే వాడిని చూస్తే అతని యొక్క ఆ ఇబాదత్, ఆ నమాజును కరెక్ట్ చెయ్యి, సరి చెయ్యి. అతనికి చెప్పు. ఈ చెప్పడం అతనికే లాభదాయకం కాదు, అతనికి మరియు అతని వెనుక వచ్చే వారందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. అవును! ఎలా అంటారా? వినండి ఈ సంఘటన.

మాలిక్ ఇబ్ను దీనార్ ఒక వ్యక్తిని చూశాడు. మాలిక్ ఇబ్ను దీనార్ ఒక వ్యక్తిని చూశారు, అతడు చాలా చెడ్డ స్థితిలో నమాజ్ చేస్తున్నాడు. అప్పుడు ఏమన్నారు? అయ్యో పాపం, ఇతని యొక్క సంతానం, ఇతని నుండి నేర్చుకునే వారందరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది కదా! ఈ మాలిక్ ఇబ్ను దీనార్ అన్నటువంటి ఈ మాటలు అక్కడ పక్కన ఉన్న వారు ఎవరో విన్నారు. విని ఏమన్నారు? అయ్యో ఏంటయ్యా, నమాజులో తప్పు చేస్తున్నది వీడు, నీవు ఇతని సంతానం గురించి, ఇతని వెనుక వచ్చే అతని దగ్గరి వారి గురించి ఆలోచిస్తున్నావు, వారి మీద ఎంతో దయ చూపుతున్నావు. అప్పుడు మాలిక్ ఇబ్ను దీనార్ ఏమన్నారు? అవును, ఇతడు ఈ పెద్ద మనిషి, ఇతడు ఇంటికి ఒక బాధ్యుడు లాంటి వాడు. ఇతడు ఈ తప్పు చేస్తే, అతని సంతానం, అతని ఇంటి వారందరూ కూడా ఇలాగే నేర్చుకుంటారు కదా. అందుకే నాకు ఆ బాధ కలుగుతుంది. ఇమాం అబూ నుఐమ్ హిల్యతుల్ ఔలియా లో ఇది ప్రస్తావించారు.

కనుక మనమందరము కూడా మన యొక్క నమాజుల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. నమాజులో అనవసరమైన ఏ చలనం, ఏ కదలిక చేయకూడదు. మరియు నమాజును తొందరపాటుగా, ఎక్స్ప్రెస్ గా కూడా చేయకూడదు. ఒక్కసారి నీవు తొందరపాటు లేకుండా, అనవసరమైన చలనము, కదలికలు లేకుండా నమాజ్ చెయ్యి, నిజంగా నీవు చాలా గొప్ప వ్యత్యాసాన్ని గమనిస్తావు. నిజం. అల్లాహ్ కూడా చెప్పాడు కదా,

قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
[ఖద్ అఫ్లహల్ మూ’మినూన్. అల్లజీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్.]
“తమ నమాజులలో శ్రద్ధాభక్తులు మరియు అనుకువ పాటించిన వారే నిజమైన విశ్వాసులు, వారే సాఫల్యం పొందే వారు.” (23:1-2)

కనుక మనం మన నమాజులు, మన సంతానం యొక్క నమాజులు, మన స్టూడెంట్స్ యొక్క నమాజులు అందరిపై దృష్టి వహించి, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో, తప్పు జరుగుతుందో దానిని మనం సరి చేస్తూ ఉండాలి. వాస్తవంగా మనలో అనేక మంది నమాజు పరిస్థితి వారు తమ ప్రభువు ముందు నిలబడినప్పుడు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. అల్లాహ్ ముందు నిలబడి ఇన్ని రకాల కదలికలు, ఇన్ని అనవసరమైన చేష్టలు, పనులు, చలనము మరియు ఇంత తొందరగా. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్.

మనం మన ప్రభువు ముందు నిలబడ్డాము అంటే మన స్థితి ఎలా ఉండాలి? మన ఆ నమాజ్ ఈ భావంతో మనం నిలబడినప్పుడు ఆ నమాజ్ యొక్క రుచి, దాని యొక్క టేస్టే వేరుగా ఉంటుంది. మరియు దాని యొక్క ప్రభావం మన యొక్క జీవితంలో కూడా ఉంటుంది. దీని యొక్క లాభం పరలోకంలో కలుగుతుంది. ఎలా? వినండి.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు, అల్లాహ్ ముందు నిలబడే అటువంటి స్థితులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి నమాజులో మనం అల్లాహ్ ముందు నిలబడినప్పుడు. మరొకటి లెక్క తీర్పు కొరకు ప్రళయ దినాన అల్లాహ్ ముందు నిలబడినప్పుడు. ఎవరైతే ఇహలోకములో అల్లాహ్ ముందు నమాజులో నిలబడినప్పుడు ఎంతో హుందాతనంగా, భయభీతితో, సంపూర్ణ రీతిలో నమాజ్ చేసుకుంటూ ఉంటాడో, పరలోక స్థితిలో నిలబడే ఆ సమయంలో అతనికి చాలా తేలికగా ఉంటుంది, అతనికి అక్కడ ఎలాంటి బాధ, అవమానం, ఎలాంటి ఏ రంది అనేది ఉండదు. ఒకవేళ ఇక్కడ ఈ స్థితి మనిషి చాలా సిగ్గుచేటుగా చేసుకున్నాడు అంటే, చాలా దీనిని పాడు చేశాడు అంటే, అల్లాహ్ ముందు నిలబడడం అనేది చాలా భయంకరమైనదిగా ఉంటుంది. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విషయం తన ప్రఖ్యాతి గాంచిన పుస్తకం అల్-ఫవాయిద్ లో ప్రస్తావించారు, పేజీ నంబర్ 200.

ఇక్కడికి ఈ ఖుత్బా యొక్క అనువాదం సంపూర్ణమైంది. అరబీలో చెప్పేందుకు సమయం లేదు గనుక ఎక్కువైపోయింది గనుక దుఆ చేస్తున్నాను.

اللَّهُمَّ أَحْسِنْ وُقُوفَنَا بَيْنَ يَدَيْكَ.
[అల్లాహుమ్మ అహ్సిన్ వుఖూఫనా బైన యదైక్]
ఓ అల్లాహ్! నీ ముందు నిలబడే మా స్థితిని (మా నమాజ్‌లను) సుందరంగా చేయి.

اللَّهُمَّ اجْعَلْنَا مِنَ الْمُقِيمِينَ لِلصَّلَاةِ وَمِنْ ذُرِّيَّاتِنَا، رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءَ.
[అల్లాహుమ్మ జ’అల్నా మినల్ ముఖీమీన లిస్సలాతి వమిన్ జుర్రియ్యాతినా. రబ్బనా వతఖబ్బల్ దుఆ]
ఓ అల్లాహ్! మమ్మల్ని, మా సంతతిని కూడా, నమాజ్ స్థిరంగా నిలిపే వారిలో చేర్చు. మా ప్రభూ! మా ప్రార్థనలను స్వీకరించు.

اللَّهُمَّ حَبِّبْ إِلَيْنَا الْإِيمَانَ وَزَيِّنْهُ فِي قُلُوبِنَا، وَكَرِّهْ إِلَيْنَا الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ وَاجْعَلْنَا مِنَ الرَّاشِدِينَ.
[అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన వజయ్యిన్హు ఫీ ఖులూబినా వకర్రిహ్ ఇలైనల్ కుఫ్ర వల్ఫుసూఖ వల్ ఇస్యాన్ వజ్’అల్నా మినర్రాషిదీన్]
ఓ అల్లాహ్! విశ్వాసాన్ని మాకు ప్రియంగా చేయు, దాన్ని మా హృదయాలలో అలంకరించు. మరియు కుఫ్ర్‌ (అవిశ్వాసం), పాపాచారం, అవిధేయతను మాకు అసహ్యంగా చేయు.మమ్మల్ని సన్మార్గంలో నడిచే జ్ఞానులలో చేర్చు.

اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ.
[అల్లాహుమ్మ ఇన్న నస్’అలుకన్నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్]
ఓ అల్లాహ్! ఎప్పటికీ మారిపోని, తగ్గిపోని నిత్యమైన అనుగ్రహాలను మేము నిన్ను అడుగుతున్నాము.

اللَّهُمَّ احْفَظْ دِينَنَا وَبِلَادَنَا وَحُدُودَنَا وَجُنُودَنَا، وَأَدِمْ أَمْنَنَا وَاحْمِ أَرْجَاءَنَا وَأَجْوَاءَنَا وَادْحَرْ أَعْدَاءَنَا وَأَجِبْ دُعَاءَنَا.
[అల్లాహుమ్మ హఫజ్ దీననా వబిలాదనా వహుదూదనా వజునూదనా వఅదిమ్ అమ్ననా వహ్మి అర్జా’అనా వఅజ్వా’అనా వద్ హర్ అ’దా’అనా వఅజిబ్ దుఆ’అనా]
ఓ అల్లాహ్! మా ధర్మాన్ని, మా దేశాన్ని, మా సరిహద్దులను, మా సైన్యాన్ని కాపాడు, మా భద్రతను కొనసాగించు. మా చుట్టుప్రక్కల్లో, మా గగణతలాన్ని రక్షించు, మా శత్రువులను దూరం చేయు, మా దుఆలను స్వీకరించు.

اللَّهُمَّ احْفَظْ إِمَامَنَا خَادِمَ الْحَرَمَيْنِ الشَّرِيفَيْنِ وَسَدِّدْهُ وَوَلِيَّ عَهْدِهِ لِلْهُدَى.
[అల్లాహుమ్మ హఫజ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్షరీఫైన్ వసద్దిద్హు వవలియ్య అహ్దిహిల్ హుదా]
ఓ అల్లాహ్! మా ఇమామ్‌, రెండు పవిత్ర మస్జిద్‌ల సేవకుడిని కాపాడు, ఆయనను మరియు ఆయన వారసుడిని నీ మార్గదర్శనంలో నిలుపు.

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ.
[అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్]
ఓ అల్లాహ్! నీ బానిస మరియు నీ దూత ముహమ్మద్ ﷺ మీద దయా–శాంతులు కురిపించు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41921