యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.

తల్లి ఆదేశం ప్రకారం, తల్లి సలహా ప్రకారం, యాఖూబ్ అలైహిస్సలాం వారు అక్కడి నుండి మామయ్య ఇంటికి వెళ్దామని బయలుదేరిపోయారు. వెళ్తూ ఉంటే దారిలో రాత్రి అయిపోయింది, చీకటి పడేసరికి ఒకచోట తల కింద రాయి పెట్టుకుని ఆయన పడుకున్నారు.

అయితే, పడుకున్నప్పుడు నిద్రలో ఆయన కల చూశారు. ఏంటి ఆ కల అంటే, భూమి ఆకాశానికి మధ్య ఒక నిచ్చెన వేయబడి ఉంది, ఆ నిచ్చెన మీద నుండి దైవదూతలు దిగుతూ ఉన్నారు మరియు ఎక్కుతూ ఉన్నారు. మరియు అదే కలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యాఖూబ్ అలైహిస్సలాం వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. మేల్కొన్నప్పుడు, ఇది నిశ్చయంగా అల్లాహ్ తరఫు నుంచి వచ్చిన కల అని అర్థం చేసుకుని ఆయన మనసులో ఒక మొక్కుబడి చేసుకున్నారు. అదేమిటంటే, నేను మామయ్య ఇంటికి వెళ్లి, అక్కడ ఉండి, మళ్ళీ సురక్షితంగా నా ఇంటికి నేను తిరిగి వచ్చేస్తే, ఈ ప్రదేశంలో, అనగా ఎక్కడైతే ఆయన కల చూశారో, ఆ ప్రదేశంలో ఆయన అల్లాహ్ కోసము ఒక పుణ్యక్షేత్రము నిర్మిస్తాను అని మొక్కుబడి చేసుకున్నారు.

అయితే, ఆ ప్రదేశాన్ని కన్ఫ్యూజ్ గుర్తుంచుకోవటానికి, ఆయన ఎక్కడైతే ఆయన పడుకున్నారో అక్కడ ఒక రాయి మీద గుర్తు వేసేశారు నూనెతో. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన లేచి ముందుకు సాగిపోయారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటే, ఆ హరాన్ అనే ప్రదేశానికి యాఖూబ్ అలైహిస్సలాం వారు వెళ్లారు. యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య పేరు లాబాన్. లాబాన్ కు ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒకరి పేరు లయ్యా, రెండవ కుమార్తె పేరు రాహీల్.

యాఖూబ్ అలైహిస్సలాం వారు అక్కడికి వెళ్లి మామయ్య ఇంటికి చేరుకొని, మామయ్యతో ఆయన వచ్చిన విషయము, తల్లి సలహా ఇచ్చి పంపించిన విషయము మొత్తము చర్చించిన తరువాత, నేను ఇక్కడే ఉంటాను అని ఎప్పుడైతే ఆయన తెలియజేశారో, అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య యాఖూబ్ అలైహిస్సలాం వారిని సంతోషంగా ఆయన వద్ద ఉంచుకోవటంతో పాటు, “చూడబ్బాయ్, నువ్వు నాకు సేవ చేస్తే, నేను నీకు కూలి కూడా ఇస్తాను. నువ్వు ఏమి కూలి కోరుకుంటావో కోరుకో” అని ఒక ఆఫర్ ఇచ్చారు.

అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం వారు మామయ్య లాబాన్ తో, “చూడండి, నేను మీకు సేవ చేస్తాను, మీ పనులు చేసి పెడతాను, మీరు మీ రెండవ కుమార్తె అయిన రాహీల్ తో నాకు వివాహం చేయించేయండి” అని అడిగారు. దానికి యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య లాబాన్ ఏమన్నారంటే, “సరే, నాకు అంగీకారమే, అయితే నా షరతు ఏమిటంటే, మీరు నా వద్ద ఏడు సంవత్సరాలు గొర్రెలు మేపాలి. ఏడు సంవత్సరాలు మీరు గొర్రెల కాపరిగా, మేకలు గొర్రెలు మేపి ఇస్తే ఆ తర్వాత నేను నా కుమార్తెతో మీకు వివాహం చేయించేస్తాను” అని మామయ్య లాబాన్ షరతు పెట్టేశారు. యాఖూబ్ అలైహిస్సలాం కూడా సంతోషంగా ఆ షరతుని ఒప్పుకున్నారు. ఏడు సంవత్సరాలు ముగిసాయి. ఏడు సంవత్సరాలు ముగిసిన తరువాత, మామయ్య లాబాను ఒక విందు ఏర్పాటు చేసి, వివాహ విందు అంటారు కదండీ, ఆ విధంగా ఒక వివాహ విందు ఏర్పాటు చేసి, ప్రజలకు అన్నము తినిపించి, వివాహము జరిపించాడు. ఆ తరువాత రాత్రి పూట యాఖూబ్ అలైహిస్సలాం వారి వద్దకు రాహీల్ కు బదులు పెద్ద కుమార్తె లయ్యాను పంపించేశాడు.

ఉదయాన్నే యాఖూబ్ అలైహిస్సలాం వారు విషయం చూసి ఆశ్చర్యపోయి, మామయ్య వద్దకు వెళ్లి గొడవకు దిగారు. “అదేంటి, నేను రాహీల్ తో కదా వివాహం చేయమని అడిగింది, నువ్వు నా వద్దకు లయ్యాను పంపించేశావు ఏమిటి?” అని అడిగితే, అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య లాబాన్ ఏమన్నాడంటే, “మా ప్రదేశంలో పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తె వివాహము చేయించేయటము రివాజు కాదు. కాబట్టి పెద్ద కుమార్తె వివాహమే ముందు జరగాలి, అందుకోసమే నేను పెద్ద కుమార్తెనే నీకు భార్యగా ఇచ్చాను” అని తెలియజేయగా, అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం మళ్ళీ లాబాన్ తో ఏమని అడిగారంటే, “నేను రాహీల్ తో వివాహం చేసుకుంటాను, లయ్యను కూడా నా భార్యగానే, అలాగే ఇన్ షా అల్లాహ్ జీవితం కొనసాగిస్తాను, రాహీల్ తో కూడా నాకు వివాహం చేయించేయండి” అంటే, అప్పుడు లాబాన్ అన్నారు, “మరొక ఏడు సంవత్సరాలు నువ్వు గొర్రెలు మేపితే అప్పుడు రాహీల్ తో కూడా వివాహం చేయిస్తాను” అంటే, దానికి కూడా యాఖూబ్ అలైహిస్సలాం ఒప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల తరువాత రాహీల్ తో కూడా యాఖూబ్ అలైహిస్సలాం వారు వివాహం చేసుకున్నారు. ఆ ప్రకారంగా మామయ్య ఇద్దరు కుమార్తెలు, లయ్యా మరియు రాహీల్, ఇద్దరితో కూడా యాఖూబ్ అలైహిస్సలాం వారి వివాహం జరిగింది.

అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, అది ఏమిటంటే, ఏమండీ అక్కచెల్లెల్లిద్దరినీ ఒకేసారి వివాహం చేసుకోవచ్చునా? అంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో అక్కచెల్లెళ్లను ఒకేసారి వివాహం చేసుకోవటం నిషేధం చేయబడింది. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల పూర్వము జరిగిన గాథ. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు వీరు, వారి శాసనంలో ఈ నిబంధన ఉండేది కాదు. వారి శాసనం ప్రకారము వారు ఒకేసారి అక్కచెల్లెల్లిద్దరిని కూడా వివాహం చేసుకోవటానికి అనుమతి ఉండేది కాబట్టి యాఖూబ్ అలైహిస్సలాం వారు లయ్యా మరియు రాహీల్ ఇద్దరినీ, అక్కచెల్లెల్లని వివాహము చేసుకున్నారు.

అయితే మిత్రులారా, వివాహం చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల వరకు యాఖూబ్ అలైహిస్సలాం వారు అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య అయిన లాబాను ఇద్దరు కుమార్తెలకు కూడా ఇద్దరు బానిసరాళ్ళను బహుమానంగా ఇచ్చాడు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, లయ్యా, పెద్ద కుమార్తెకు, జుల్ఫా అనే ఒక బానిసరాలును బహుమానంగా ఇచ్చాడు. అలాగే చిన్న కుమార్తె అయిన రాహీల్ కు బిల్హా అనే ఒక బానిసరాలును బహుమానంగా ఇచ్చాడు. ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు బానిసరాళ్ళను బహుమానంగా ఇచ్చినప్పుడు, వారు ఇద్దరూ కూడా ఆ బానిసరాళ్ళతో సేవ చేయించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు.

అయితే అల్లాహ్ అనుగ్రహము చూడండి, అల్లాహ్ అనుగ్రహంతో యాఖూబ్ అలైహిస్సలాం వారికి మొదటి భార్య అయిన లయ్యా ద్వారా నలుగురు కుమారులు జన్మించారు. తర్వాత కొద్ది సంవత్సరాలకి మరొక కుమార్తె కూడా జన్మించింది. నలుగురు కుమారులు జన్మించారు కానీ రెండవ భార్య అయిన రాహీల్ తో ఒక బిడ్డ కూడా, ఒక కొడుకు గానీ, కుమార్తె గానీ పుట్టలేదు. అప్పుడు రాహీల్ కు రోషం వచ్చింది. అక్కకేమో బిడ్డలు పుట్టారు, నాకు బిడ్డలు లేకుండా పోయారే అని రాహీల్ కు రోషం వచ్చేసరికి, ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ వద్ద ఉన్న బానిసరాలు, అనగా బిల్హాను యాఖూబ్ అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చేశారు. “నేను ఈమెను మీకు బహుమానంగా ఇచ్చేస్తున్నాను, మీరు ఈమెతో వివాహం చేసుకుంటే బహుశా ఈమె ద్వారా సంతానం కలుగుతుందేమో” అనగా, యాఖూబ్ అలైహిస్సలాం వారు స్వీకరించారు. ఆ తర్వాత రాహీలు బహుమానంగా ఇచ్చిన బిల్హా ద్వారా యాఖూబ్ అలైహిస్సలాం వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. లయ్యా తో నలుగురు కుమారులు, ఇప్పుడు బహుమానంగా దొరికిన బిల్హా ద్వారా ఇద్దరు కుమారులు, మొత్తం ఆరు మంది కుమారులు అయిపోయారు.

అది గమనించిన లయ్యా, “నా చెల్లెలు నా భర్తకు బానిసరాలును బహుమానంగా ఇచ్చేసినప్పుడు, నేనెందుకు వెనుకడుగు వెయ్యాలి?” అని ఆమె కూడా ఆమె వద్ద ఉన్న బానిసరాలు, అనగా జుల్ఫాను యాఖూబ్ అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అల్లాహ్ అనుగ్రహంతో లయ్యా వారు బహుమానంగా ఇచ్చిన బానిసరాలు జుల్ఫా ద్వారా యాఖూబ్ అలైహిస్సలాం వారికి మరో ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ప్రకారంగా లయ్యా తో నలుగురు కుమారులు, ఇద్దరు బానిసరాళ్ళతో నలుగురు కుమారులు, మొత్తం ఎనిమిది మంది కుమారులు మరియు లయ్యా తో ఒక కుమార్తె. తొమ్మిది మంది బిడ్డలయ్యారన్నమాట.

అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న రెండవ భార్య అయిన రాహీల్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సమక్షంలో ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు, “ఓ అల్లాహ్, నాకు కూడా నువ్వు మంచి సంతానము ప్రసాదించు” అని అల్లాహ్ తో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆలస్యంగా ఇచ్చినా మంచి అనుగ్రహం ఇస్తాడు కదా, ఆ ప్రకారంగా రాహీల్ వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆలస్యంగానైనా సరే ఒక అందమైన కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరే యూసుఫ్ అలైహిస్సలాం. ఇన్ షా అల్లాహ్ మున్ముందు ఆయన ప్రస్తావన కూడా మనము ఇన్ షా అల్లాహ్ ఆయన చరిత్ర కూడా తెలుసుకుందాం.అయితే ప్రస్తుతం మనం యాఖూబ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని వింటున్నాం, ఆయన గురించి తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్. ఇప్పుడు మొత్తం ఎంత మంది అయ్యారండీ? నలుగురు కుమారులు మొదటి భార్యతో, నలుగురు కుమారులు ఇద్దరు బానిసరాళ్ళతో, ఇప్పుడు రెండవ భార్య అయిన రాహీల్ తో ఒక కుమారుడు, మొత్తం తొమ్మిది మంది కుమారులు అయిపోయారు.

అయితే మిత్రులారా, యాఖూబ్ అలైహిస్సలాం వారు, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఇంచుమించు 20 సంవత్సరాల వరకు మామయ్య ఉంటున్న చోట ఉన్నారు. 20 సంవత్సరాల తరువాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు అక్కడి నుండి బయలుదేరి వారి తండ్రి నివసిస్తున్న ప్రదేశము, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. ఎప్పుడైతే ఆ ఆదేశము ఇవ్వబడిందో, అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం వారు కుటుంబ సభ్యులకు ఆ విషయము తెలియజేశారు. ఆ విషయము తెలియజేశాక, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆ విషయాన్ని అంగీకరించారు.

అయితే మిత్రులారా, యాఖూబ్ అలైహిస్సలాం వారు 20 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నప్పుడు, ఆ 20 సంవత్సరాలలో ఆయనకు మరికొంత మంది బిడ్డల్ని కూడా ఇచ్చాడు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ముందుగా నలుగురు కుమారులు ఇచ్చిన లయ్యా వారితోనే మరో ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఆ ప్రకారంగా మొదటి భార్యతో మొత్తం ఆరు మంది కుమారులు యాఖూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ తరఫున ఇవ్వబడ్డారు అన్నారు.

ఇప్పుడు లెక్క ఒకసారి సరిచూసుకోండి. ఆరు మంది కుమారులు మొదటి భార్యతో, నలుగురు మంది కుమారులు ఇద్దరు బానిసరాళ్ళతో, మరియు ఒక కుమారుడు రెండవ భార్య అయిన రాహీల్ తో, మొత్తము 11 మంది సంతానం అయ్యారు, ఒక కుమార్తె కూడా ఉన్నారు.

అల్లాహ్ ఆదేశం పొందిన తరువాత, కుటుంబ సభ్యుల్ని తీసుకొని, అక్కడ ఆయన 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అల్లాహ్ అనుగ్రహంతో ఆయన వద్ద కొన్ని పాడిపశువులు కూడా వచ్చేసాయి, ధనము కూడా వచ్చేసింది. ఆ ధనము, పాడిపశువులు అన్నీ తీసుకొని ఆయన బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే, మామయ్య కూడా వచ్చి యాఖూబ్ వారితో ఒక ఆఫర్ ప్రకటించాడు, అదేమిటంటే, “నీవు చాలా సంవత్సరాల వఱకు నా వద్ద ఉండి, నాకు సేవలు చేశావు కాబట్టి నా నుండి నేను నీకు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఏమి కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకునింది నేను నీకు ఇచ్చేస్తాను” అని ఆఫర్ ప్రకటించినప్పుడు, యాఖూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఈ సంవత్సరము జన్మించిన పశువుల బిడ్డలన్నింటినీ నాకు ఇచ్చేయండి.” అంటే దూడలు, మేకపిల్లలు, గొర్రెపిల్లలు, ఈ సంవత్సరము పుట్టిన పిల్లలన్నింటినీ నాకు ఇచ్చేయండి అని కోరినప్పుడు, మామయ్య యాఖూబ్ అలైహిస్సలాం వారికి ఆ సంవత్సరము పశువులకు పుట్టిన పిల్లలన్నింటినీ ఆయనకు ఇచ్చేశాడు. ఆ ప్రకారంగా ఆయన వద్ద చాలా పశువులు వచ్చేసాయి. ఆ పశువులన్నీ తీసుకొని, ఇద్దరు భార్యలు, ఇద్దరు సేవకురాళ్ళు, మరియు 11 మంది సంతానము, అందరినీ తీసుకొని యాఖూబ్ అలైహిస్సలాం వారు మళ్ళీ తండ్రి నివసిస్తున్న ప్రదేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు.

దారిలో యాఖూబ్ అలైహిస్సలాం వారు కొంతమందిని ముందుగానే వెళ్లి అన్నయ్యకు కబురు వినిపించాలని, తమ్ముడు వస్తున్నాడన్న విషయము వినిపించాలని పంపించారు. వారు వెళ్లి, యాఖూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య అయిన ఈస్ వారికి, “మీ తమ్ముడైన యాఖూబ్ కుటుంబ సభ్యులతో పాటు వస్తూ ఉన్నాడు” అనే విషయము తెలియజేసినప్పుడు, ఆయన “సరే, నేను నా తమ్ముడితో కలవటానికి వస్తున్నాను, పదండి” అని చెప్పి పంపించేశాడు.

అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారు యాఖూబ్ అలైహిస్సలాం వారికి తెలియజేసిన విషయం ఏమిటంటే, “మీ అన్నయ్య మీకు ఆహ్వానించటానికి వస్తున్నాడు, బయలుదేరి, అయితే ఆయన వెంట ఒక 400 మందిని కూడా వెంటబెట్టుకుని వస్తున్నాడు” అని తెలియజేశారు. ఎప్పుడైతే ఆ విషయము అక్కడి నుంచి వచ్చిన వారు తెలియజేశారో, అప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం వారు కంగారు పడిపోయారు. “అదేంటి, నా అన్నయ్య నా వద్దకు ఒంటరిగా రావాలి గానీ, 400 మందిని వెంటబెట్టుకుని వస్తున్నాడంటే ఏంటి అర్థము?” అని ఏ ఉద్దేశంతో వస్తున్నాడో ఏమో అని కంగారు పడిపోయి, ఆయన ఏం చేశారంటే, ముందుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేశారు, దుఆ చేశారు.

“ఓ అల్లాహ్, మా అన్నయ్య నా మీద దాడి చేయకుండా, నన్ను నా కుటుంబ సభ్యుల్ని నువ్వు రక్షించు, కాపాడు” అని ప్రార్థన చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక ప్రణాళిక రచించారు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఆయన వద్ద ఉన్న పశువులన్నింటినీ కూడా, ఆ పశువుల్లో నుంచి కొన్ని కొన్ని పశువుల్ని ఆయన విడదీశారు. అనగా, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, 200 మేకలు, 200 గొర్రెలు, అలాగే 30 ఒంటెలు, 40 ఆవులు, ఆ విధంగా ఆయన వద్ద ఉన్న పశువులు కొన్ని కొన్నిగా విడదీశారు. ఒక వ్యక్తికి గొర్రెలు అప్పగించి, “నువ్వు ముందుకు వెళ్లి, నా అన్నయ్య ఎదురైతే ఎవరివి ఈ గొర్రెలు అంటే, మీ తమ్ముడు మీ కోసం కానుకగా ఇచ్చాడు అని ఆయనకు అందజేయమని” చెప్పారు. రెండవ వ్యక్తికి మేకలు ఇచ్చారు. మూడవ వ్యక్తికి ఒంటెలు ఇచ్చారు. నాలుగవ వ్యక్తికి ఆవులు ఇచ్చారు. ఆ విధంగా ఒకరి తరువాత ఒకరిని పంపించారు. వారందరూ కూడా వెళ్లి, వారి అన్నయ్య వస్తూ ఉంటే, “ఎవరి ఒంటెలు ఇవి? ఎవరి ఆవులు ఇవి? ఎవరి మేకలు ఇవి?” అని ఆయన అడుగుతూ ఉంటే, “మీ సేవకుడు, మీ తమ్ముడైన యాఖూబ్ మీకు బహుమానంగా ఇచ్చి పంపించాడు” అని వారు చెబుతూ వచ్చారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు కుటుంబ సభ్యుల్ని తీసుకొని నెమ్మదిగా వెనుక నుంచి వచ్చారు. ఆ తర్వాత అన్నాతమ్ముళ్లిద్దరూ ఇంచుమించు 20 సంవత్సరాల తరువాత కలిసి, కన్నీరు కార్చారు. వెంటనే యాఖూబ్ అలైహిస్సలాం వారు, ఆనాటి ఆచారం ప్రకారం యాఖూబ్ అలైహిస్సలాం వారు అన్నయ్యను గౌరవిస్తూ వెంటనే ఆయన ముందర సాష్టాంగ పడ్డారు, అంటే ఆయన ముందు సజ్దా చేశారు అని అర్థం. (చూడండి, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం కాదు, యాఖూబ్ అలైహిస్సలాం వారి శాసనం గురించి మాట జరుగుతా ఉంది). తర్వాత, యాఖూబ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు, వారు కూడా ఒక్కొక్కరుగా, ఒక్కొక్కరుగా వచ్చి యాఖూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య ముందర సాష్టాంగ పడ్డారు.

ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఒక సందేహానికి గురవుతారు, అదేమిటంటే, సజ్దా కేవలం అల్లాహ్ కే చెయ్యాలి కదా, అల్లాహ్ కు తప్ప ఇతరుల ముందర సజ్దా చేయడము నిషేధము కదా అని సందేహ పడతారు. అయితే మిత్రులారా, ఇక్కడ కూడా మనము ధార్మిక పండితులు తెలియజేసిన విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి, అదేమిటంటే, యాఖూబ్ అలైహిస్సలాం వారి శాసనంలో గౌరవంగా ఒకరి ముందర సాష్టాంగ పడటానికి అనుమతి ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఆ నిబంధన తొలగించబడింది. ఒక అల్లాహ్ ముందర మాత్రమే సజ్దా చెయ్యాలి, సాష్టాంగ పడాలి. అల్లాహ్ తప్ప ఇతరులు ఎవరి ముందర కూడా సాష్టాంగ పడరాదు అన్న నిబంధన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే ఉంది. ఇక్కడ యాఖూబ్ అలైహిస్సలాం వారి శాసనంలో దానికి అనుమతి ఉండింది కాబట్టి, యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా అన్నయ్య ముందు సాష్టాంగ పడ్డారు, తర్వాత యాఖూబ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు కూడా యాఖూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య ముందర సాష్టాంగ పడ్డారు.

ఆ తరువాత ఇద్దరూ కలిసి వారు నివసిస్తున్న, అంటే తండ్రితో పాటు నివసిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చేరిన తరువాత, యాఖూబ్ అలైహిస్సలాం వారు కానుకలన్నీ అన్నయ్యకు అందజేసేసి, తర్వాత సాహూర్ అనే ప్రదేశంలో ఆయన ఒక ఇల్లు నిర్మించుకున్నారు, నివసించటానికి. ఆ తర్వాత అక్కడే పశువులను కూడా భద్రంగా ఉంచుకోవటానికి కొన్ని డేరాలు కూడా ఆయన కట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ రోజుల్లో ఓర్ షలేం అని చెప్పేవారు, నేడు ఆ నగరాన్ని యెరూషలేం అంటున్నారు, ఆ నగరానికి సమీపంలో ఆయన నివాసము ఏర్పరచుకున్నారు.

తర్వాత, ఆయన వెళ్లేటప్పుడు ఒకచోట పడుకొని కల కన్నాడు అని చెప్పాము కదా, అక్కడ నూనెతో ఒక గుర్తు కూడా వేసేశారు అని మనం విన్నాము కదా, ఆ ప్రదేశానికి మళ్ళీ ఆయన చేరుకున్నారు. చేరుకొని ఆ భూమి యజమానికి 100 గొర్రెలు ఇచ్చి ఆ భూమిని కొనుగోలు చేసుకొని, అక్కడ ఆయన అల్లాహ్ కోసము ఒక పుణ్యక్షేత్రము నిర్మించారు. మొక్కుబడి చేసుకున్నారు కదా ముందు, ఇక్కడ నేను అల్లాహ్ కోసము పుణ్యక్షేత్రము నిర్మిస్తాను అని. ఆ ప్రకారంగా ఆయన అక్కడ పుణ్యక్షేత్రము నిర్మించారు. ఆయన అక్కడ నిర్మించిన ఆ పుణ్యక్షేత్రానికి ఆయన ఒక పేరు పెట్టారు, దాని పేరు బైతు ఏల్ అని ఉండింది, అంటే బైతుల్లాహ్ అని అర్థం. నేడు ఆయన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకు మరొక ప్రవక్త ఆ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు, సులైమాన్ అలైహిస్సలాం వారు ఆ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు, దానికి బైతుల్ మఖ్దిస్ అని పేరు పడింది. ఆ ప్రకారంగా మనం చూచినట్లయితే, ముస్లింలు కాబతుల్లాహ్, మస్జిద్ నబవీ తర్వాత అందరికంటే ఎక్కువగా గౌరవించే మూడవ పుణ్యక్షేత్రము ఈ బైతుల్ మఖ్దిస్. ఈ బైతుల్ మఖ్దిస్ ని నిర్మించింది యాఖూబ్ అలైహిస్సలాం వారు.

అయితే మిత్రులారా, ఈ ప్రదేశానికి వచ్చిన తరువాత, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న తరువాత, యాఖూబ్ అలైహిస్సలాం వారి రెండవ సతీమణి అయిన రాహీల్ ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక కుమారుడిని ఆయనకు ప్రసాదించాడు, ఆయన పేరు బిన్యామీన్. అయితే బిన్యామీన్ పుట్టినప్పుడే యాఖూబ్ అలైహిస్సలాం వారి రెండవ భార్య అయిన రాహీల్ మరణించారు అని చరిత్రకారులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ, యాఖూబ్ అలైహిస్సలాం వారు మళ్ళీ నాన్న నివసిస్తున్న ప్రదేశం, అనగా కనాన్ ప్రదేశానికి వచ్చేశారు. ఇక్కడ ఆయన నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వద్ద మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆ తరువాత ఆయన జీవితంలో సంతానం తరఫున కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ విషయాలన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ తర్వాత వచ్చే భాగంలో, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని వస్తుంది, అందులో ఇన్ షా అల్లాహ్ యాఖూబ్ అలైహిస్సలాం మరియు ఆయన ముద్దుల కుమారుడైన యూసుఫ్ అలైహిస్సలాం గురించి మనము తెలుసుకుందాం. అక్కడ ఇన్ షా అల్లాహ్ యాఖూబ్ అలైహిస్సలాం మరియు యూసుఫ్ అలైహిస్సలాం వారి ఇద్దరి కథ కూడా సమాప్తమవుతుంది.

ఇంతటితో నా మాటను ముగిస్తూ, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ధార్మిక విషయాలు బాగా తెలుసుకొని, ప్రవక్తల జీవిత చరిత్రలను విని మన విశ్వాసాన్ని పెంచుకొని, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَ جَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

బనీ ఇస్రాయీల్ అని ఏ జాతి వారికైతే పేరు వచ్చిందో, అది యాఖూబ్ అలైహిస్సలాం వారి తర్వాత వారి సంతానానికి వచ్చింది ఆ పేరు. ఆయన అసలు పేరు యాఖూబ్ అలైహిస్సలాం. ఆయనకు ఇవ్వబడిన ఒక బిరుదు ఇస్రాయీల్. యాఖూబ్ అలైహిస్సలాం వారి సంతానము, వారి సంతానము తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన, ఆయన సంతానంలో ఇచ్చిన వృద్ధి ప్రకారము, వారి బిడ్డలు, బిడ్డల బిడ్డలు, బిడ్డల బిడ్డలు చాలామంది వ్యాపించారు, వారినే బనీ ఇస్రాయీల్ అంటారు. అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి బిడ్డల, బిడ్డల బిడ్డలు చాలామంది ప్రపంచంలో వ్యాపించారు కదా, వారి సంతానము, వారిని బనీ ఇస్రాయీల్ అంటారు. ఇస్రాయీల్ అనే ఒక పునాది యాఖూబ్ అలైహిస్సలాం తో పడింది అన్నమాట. యాఖూబ్ అలైహిస్సలాం తర్వాత బనీ ఇస్రాయీల్ అనే వారు ఒక తెగ వారుగా, ఒక జాతి వారుగా ఉనికిలోకి వచ్చారు. పునాది ఈయనే.

అయితే యాఖూబ్ అలైహిస్సలాం వారు పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా పంపించబడలేదు. ఏ ప్రదేశంలో అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు పుట్టించి, కల ద్వారా, ఆ తర్వాత మళ్ళీ దైవదూతల ద్వారా వాక్యాలు పంపించాడో, ఆ ప్రదేశంలో మాత్రమే ఆయన ప్రవక్తగా ఉండేవారు. పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా పంపించబడింది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. బనీ ఇస్రాయీల్ అనే ఉనికి అప్పటికి లేదు. ఆయన తర్వాత ఆయన పేరు మీద వచ్చిన సంతానమే బనీ ఇస్రాయీల్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41253

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8