ఇక్కడ పూర్తి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి
ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)
[డైరెక్ట్ PDF] [203 పేజీలు] – [అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్]
ముందుమాట
మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలు, దినచర్యలు, ఆయన వ్యవహార సరళి గురించి తెలిపే పుస్తకాలు తెలుగు భాషలో కొన్ని వచ్చాయి. అలాగే, ఆయా గ్రంధాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులను గురించి వారి గృహస్థ జీవితంలోని ముఖ్య సంఘటనలను గురించి సవివరంగా తెలిపే పుస్తకాలు తెలుగులో దాదాపు లేవనే చెప్పవచ్చు.
ఒక మహాసాధ్వి జీవిత చరిత్రనే గాకుండా భార్యవలన భర్తకు ఏవిధంగా మనశ్శాంతి, ఊరట లభిస్తాయో, లభించాలో ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ఆయా పరిస్థితులలో తనకెదురయిన వివిధ సంఘటనల్ని ఇబ్బందుల్ని, పరీక్షల్ని ఆ మహిళా లోక మార్గదర్శి ఎలా అధిగమించారో కళ్ళకు కట్టినట్లు చూపే ఓ సజీవ దృశ్య కావ్యం ఈ గ్రంధం. ఇంకా ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి’ అన్నట్లుగా కష్టాలయినా, సుఖాలయినా భర్తతో ఆమె ఎలా కలిసి పంచుకున్నారో మనకు విశదమవుతుంది.
నేటి ముస్లింల పతనావస్థకు గల కారణాలలో సగభాగం ముస్లిం మహిళలే అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. కాని రకరకాల భయాలకు భ్రమలకు దాసోహం కావడాలు, సమాధుల పూజలు, అనాగరిక మూఢాచారాలు, వివాహ సందర్భాల లోనయినా, దుఃఖ సందర్భాలలోనయినా జరుగుతున్న మూఢత్వపు తంతులు, దుబారా వ్యయం మన ప్రాంగణాలలో బ్రతికి బట్టకడుతున్నాయంటే అందుకు కారణం ఏమిటీ? నేటి ముస్లిం మహిళల్లో ఇస్లామీయ చైతన్యం మృగ్యమవడం కాదా? అయితే ఒక్క విషయం! ముస్లిం స్త్రీ యొక్క పరిపూర్ణ నమూనా ఏదీ వారికి లభించనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు? ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ హస్తం ఉండాలి, ఉంది, అంటే ఆ విజయం సాధించిన పురుషుల తోడ్పాటూ, సహకారం, సమన్వయం వారికి లభించడం వల్లనే కదా!
ఇక ఈ పుస్తకం ద్వారా…
దైవదౌత్య ప్రాతినిధ్యంలో సహధర్మచారిణిగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రాంగణంలో దాదాపు 40 ఏళ్ళు బోధనామృత మణిదీపికగా భాసిల్లి, విశ్వాసుల మాతగా ఆచంద్రతారార్కం కీర్తించబడే మహిళా శిరోమణి అపురూప వ్యవహరణా శైలిని మహిళాలోకానికి పరిచయం చేసే భాగ్యం లభించడం మా అదృష్టం!!
స్త్రీ… తరతరాలుగా పీడనకు, పురుషాహంకారానికీ బలవుతూ వచ్చింది. స్త్రీ తన తోటి స్త్రీల వల్ల కూడ చిక్కులకు, వేదనకు, క్షోభకు గురి అయింది. అవుతూ వుంది కూడా. అందుకేనేమో “స్త్రీకి స్త్రీయే శత్రువు” అన్నారు.
‘పితారక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, సుతా రక్షతి వార్ధక్కే, న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అంటూ కొందరు స్త్రీకి స్వాతంత్య్రమే లేదు పొమ్మన్నారు. మరికొందరు మహానుభావులు స్త్రీని మోక్ష సాధనకు ఆటంకమని ఘోషించారు.
ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అనాగరిక అరబ్బులు స్త్రీని భోగ వస్తువుగా, కోర్కెలు తీర్చుకునే యంత్రంగా చేసుకున్నారు.
ఇస్లాం ఈ విధమయిన రెండు అతివాద భావాలను ఖండిస్తూ ఆమె శారీరక, మానసిక స్వభావానికి అతికినట్లుగా సరిపోయే సమతౌల్యంతో కూడిన కార్యక్షేత్రాన్ని సూచించింది. “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది” అంటూ స్త్రీకి మహోన్నత స్థానం కల్పించింది. స్వాతంత్ర్యం, ఆస్తిహక్కు, సమాజంలో సమున్నత స్థానం ఇస్లాం ద్వారా మాత్రమే స్త్రీకి లభించాయి. ఇస్లాం స్త్రీకి కల్పించిన స్థానం ఎటువంటిదో పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. ఆధారాల్లేని విమర్శలతో, పసలేని వాదాలతో వ్యాఖ్యలు చేయడంలో ఔచిత్యం ఏముంటుంది?
హజ్రత్ ఆయిషా జీవితం సుఖ, దుఃఖాల సంభరితం. జీవితంలో ఎన్నో. మార్పుల్ని, కష్టాల్ని, ఎదుర్కొన్నారా మహావనిత. భర్తతో కాపురం, విరహం, ఇల్లు చక్కబెట్టుకోవడం, సవతుల ఈర్ష్యా అసూయల్ని ఆమె చవిచూశారు. వైధవ్యం పొందారు. అనాధ అయ్యారు. ఉత్థాన పతనాల తెరల వెనుక జరిగిన రాజకీయాలను అవలోకనం చేసుకున్నారు. వైముఖ్య ధోరణులను ఎదుర్కొన్నారు. ఒకటేమిటి జీవితంలోని అన్ని పరిస్థితుల్నీ అధిగమించడంలో ఆయా సందర్భాలలో ఆమె వ్యవహరణా సరళి నేటి ముస్లిం స్త్రీకి మార్గదర్శకం. నైతిక, విజ్ఞాన ఆచరణాత్మక ఆణిముత్యాలతో సుసంపన్నమైన ఆమె పవిత్ర జీవితం చదవదగ్గదీ, చదివి తీరవలసినదీను.
ఇందులో మహిళాలోకానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాల్యం నుండే విద్యా విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకోవడం, భర్త ఆశయాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం, నిస్సంతు అయినప్పటికీ అనాధ పిల్లల్ని పెంచి, వారికి బోధనా శిక్షణలు గరపడంతోపాటు, వారి వివాహాలు చేయడం, భర్త వియోగానంతరం ఆయన నడిపిన ఉద్యమాన్ని కొనసాగించడం, ధార్మిక తీర్పులు ఇవ్వడం, ఇంకా చాలా చాలా విషయాలు ఈనాటికీ ఆదర్శనీయములే. ఒక మహిళ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబర్చడం చూస్తుంటే “ముదితల్ నేర్వగరాని విద్య కలదే!” అనిపిస్తుంది.
పాఠకులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పుస్తకం అభిమానపాత్రం కావాలని కాంక్షించడంలో విడ్డూరమేముందీ..!? మజ్లిసె ఇషాఅతె ఇస్లాం తెలుగు ప్రచురణా విభాగం స్థాపకులైన మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్ గారి ప్రోద్బలం, సోదరులు ముహమ్మద్ అజీజు రహ్మాన్ గారి ప్రోత్సాహం… అన్నింటికీ మించి అల్లాహ్ తోడ్పాటు వల్ల ఇది పుస్తక రూపం దాల్చింది. ఇందలి లోపాలను పాఠకులు దృష్టికి తెస్తే మలిసారి ముద్రణలో సరిదిద్దుకోగలము. ఈ చిరు కృషిని కారుణ్య ప్రభువు స్వీకరించాలని వేడుకుంటూ..
కృతజ్ఞతలతో
ఇఖ్బాల్ అహ్మద్
—
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

You must be logged in to post a comment.