ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు – 2
వక్త: హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s95wqnlrv94 [9 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ పట్ల విశ్వాసికి ఉన్న హక్కులలో రెండవదాని గురించి వివరించబడింది. ఖుర్ఆన్‌ను విశ్వసించడం మొదటి హక్కు అయితే, దానిని నిరంతరం పఠించడం రెండవ హక్కు అని స్పష్టం చేయబడింది. ఖుర్ఆన్ పఠించడం వలన ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు పేర్కొనబడింది. ప్రళయదినాన ఖుర్ఆన్ తనను పఠించిన వారి కొరకు సిఫారసు చేస్తుందని కూడా చెప్పబడింది. ఖుర్ఆన్‌ను పఠించవలసిన రీతిలో (హక్క తిలావతిహి) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది, దీనికి పలు అర్థాలు వివరించబడ్డాయి: ఏకాగ్రతతో చదవడం, అందులోని ధర్మాధర్మాలను అంగీకరించడం, దాని సందేశాన్ని ఇతరులకు వివరించడం, మరియు స్పష్టమైన ఆజ్ఞలను పాటిస్తూ, అస్పష్టమైన విషయాల జ్ఞానం కోసం పండితులను ఆశ్రయించడం. చివరగా, ఖుర్ఆన్‌ను తజ్విద్ (ఉచ్ఛారణ నియమాలు) మరియు తర్తీల్ (ఆగి ఆగి, స్పష్టంగా పఠించడం)తో చదవాలని సూచిస్తూ ప్రసంగం ముగించబడింది.
ఇన్నల్హమ్దులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య కడలి రమజాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ రోజు మనం ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించడం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించాలి. మొదటి హక్కు, ఖుర్ఆన్‌ను విశ్వసించడం. దాని గురించి ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఖుర్ఆన్‌ను పఠించడం.
ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు ఏమిటంటే, మనం ఖుర్ఆన్‌ను పఠిస్తూ ఉండాలి. కేవలం విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించిన తరువాత ఖుర్ఆన్‌ను మనం పఠించాలి. ఖుర్ఆన్ పఠించడం వలన ఒక అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒక అక్షరానికి పది పుణ్యాలు. ఇంకా ఇలా ప్రవచించారు:
اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ
(ఇఖ్రవుల్ ఖుర్ఆన ఫఇన్నహు య’అతీ యౌమల్ ఖియామతి షఫీఅన్ లిఅస్ హాబిహి)
“ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది.”
ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ఖుర్ఆన్ తిలావత్ చేస్తూ ఉండండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:
وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا
(వత్లు మా ఊహియ ఇలైక మిన్ కితాబి రబ్బిక లా ముబద్దిల లికలిమాతిహి వలన్ తజిద మిన్ దూనిహి ముల్తహదా)
“నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.” (సూర కహఫ్ 18:27)
ఖుర్ఆన్ పఠించే విధానం
ఖుర్ఆన్ పారాయణం చేసే విధానం కూడా బోధించబడింది. రెండవ హక్కు ఖుర్ఆన్‌ని పఠించాలి. ఖుర్ఆన్ పారాయణం చేయాలి, తిలావత్ చేయాలి. ఆ విధానం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ఆజ్ఞాపించాడు:
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَنْ يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతిహి ఉలాయిక యు’మినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫఉలాయిక హుముల్ ఖాసిరూన్)
“మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.” (2:121)
ఈ ఆయతులో ‘హక్క తిలావతిహి’ గురించి ఫత్హుల్ ఖదీర్ ఆధారంగా అహ్సనుల్ బయాన్‌లో ఇలా ఉంది: పఠించవలసిన విధంగా పఠిస్తారు అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి. ఉదాహరణకు ఒక అర్థం ఏమిటి? బాగా చదువుతారు, శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే, స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. నరక ప్రస్తావన వస్తే, దాని బారి నుండి రక్షించమని ప్రార్థిస్తారు. ఇది ఒక అర్థం.‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. పఠించవలసిన విధానంగా పఠించాలి అంటే ఇది ఒక అర్థం.
రెండో అర్థం ఏమిటి? అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వాటిని ధర్మసమ్మతాలుగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడటం గానీ, తప్పుడు అన్వయింపులు చేయడం గానీ చేయరు. అంటే, ఖుర్ఆన్‌లో దేనిని హలాల్ అని చెప్పబడిందో దానిని హలాల్‌గా నమ్ముతారు, అంగీకరిస్తారు, ఆచరిస్తారు. ఖుర్ఆన్‌లో దేనిని హరాం అని, నిషిద్ధం అని, అధర్మం అని చెప్పబడిందో దానిని అధర్మం అని నమ్ముతారు, విశ్వసిస్తారు, దాని నుండి దూరంగా ఉంటారు. ఇది దీనికి ఒక అర్థం. ఖుర్ఆన్‌ని పఠించవలసిన రీతిలో పఠించాలి. ‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. ఖుర్ఆన్‌లో ఏదైతే ధర్మం ఉందో, ధర్మం అని భావించాలి. అధర్మానికి అధర్మం అని భావించాలి. దానికి తప్పుడు అర్థాలు చెప్పరాదు, చేసుకోకూడదు.
అలాగే మూడవ అర్థం ఏమిటంటే, అందులో పొందుపరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు.
అలాగే ఇంకో అర్థం, అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని—మహ్కమాత్ ఆయతులను—చేస్తారు. అస్పష్టంగా ఉన్న ముతషాబిహాత్ విషయాలను విశ్వసిస్తారు. అర్థం కాని విషయాల గురించి విద్వాంసులను, ధర్మ పండితులను అడిగి తెలుసుకుంటారు. ఇది చాలా ముఖ్య విషయం. తెలియకుండా, ధర్మ అవగాహన లేకుండా, మనమే ఊహించుకుని, కొంచెం వస్తే దానికి ఇంకా కొన్ని విషయాలు అల్లుకుని, మనమే దానికి భావాలు, అర్థాలు చెప్పటం చాలా తప్పు. ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం. ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త గారు ఏ విధంగా దానికి అర్థం చెప్పారు, సహాబాలు ఏ విధంగా అర్థం తీసుకున్నారో, అదే అర్థం మనం తీసుకోవాలి. ఆ ఆయతులు మహ్కమ్ ఆయతులు ఉండినా, ముతషాబిహ్ ఆయతులు ఉండినా. అర్థం కాని విషయాలు, ఆ విషయాల గురించి ధర్మ పండితులను, విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి.
అలాగే చివరి మాట, ఖుర్ఆన్‌లో ఒక్కొక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. పఠించవలసిన రీతిలో పఠిస్తారు అన్న వాక్యంలో ఎన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి! వీటన్నింటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నవారికే అల్లాహ్ మార్గదర్శకత్వం ప్రాప్తిస్తాడు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు:
وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
(వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా)
“ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.” (73:4)
అంటే ఖుర్ఆన్‌ను, ఖుర్ఆన్‌ను మాత్రం బాగా ఆగి ఆగి, నింపాదిగా, స్పష్టంగా పఠించు. అంటే తజ్విద్‌తో, తర్తీల్‌తో, సరైన ఉచ్ఛారణతో. ఖుర్ఆన్‌కి ఒక పద్ధతి ఉంది, తిలావత్ చేసే ఒక విధానం ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక సబ్జెక్టే ఉంది, దానికి తజ్విద్ అంటారు. ఏ అక్షరం ఎక్కడ నుండి ఉచ్ఛరింపబడుతుంది, అవి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు అరబీలో ‘ح’ (హా) అని ఒక అక్షరం ఉంది, ‘ه’ (హా) అని ఒక అక్షరం ఉంది. తెలుగులో ‘హ’ మాత్రమే ఉంటుంది. ‘ح’ (హా) అనే ఉచ్ఛారణ తెలుగులో లేదు, ఇంగ్లీషులో కూడా లేదు. అలాగే అరబీలో ‘ز’ (జా) ఒక అక్షరం ఉంది, ‘ج’ (జా) ఒక అక్షరం ఉంది. తెలుగులో రెండింటికీ ‘జ’ మాత్రమే ఉంటుంది. ‘ز’ (జా) అనే అక్షరం తెలుగులో లేదు. అలాగే ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. తెలుగులో ‘ప’ ఉంటుంది, లేకపోతే ‘ఫ’ ఉంటుంది. ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. చెప్పడం ఏమిటంటే, ఖుర్ఆన్‌ను తజ్విద్‌తో చదవాలి. ‘వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా’, ఖుర్ఆన్‌ను బాగా ఆగి ఆగి, నింపాదిగా, తజ్విద్‌తో, ప్రతి అక్షరాన్ని తన మఖ్రజ్‌తో మనము చదివే ప్రయత్నం చేయాలి. రాకపోతే నేర్చుకోవాలి.
రెండవ హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్‌ను పఠించాలి, ఖుర్ఆన్‌ను పారాయణం చేయాలి. ఇవి ఖుర్ఆన్‌కి సంబంధించిన రెండవ హక్కు. ఇన్షా అల్లాహ్, మిగతా హక్కు తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44374
యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఖుర్ఆన్ హక్కులు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2GoH_kZfwdME8eHCJumoPq