మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – ఇస్రా మరియు మేరాజ్ యాత్ర
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ts0-ZZ_G9D0 [39 నిముషాలు]
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని ఇస్రా మరియు మేరాజ్ యాత్ర గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. ఇందులో ప్రవక్త యొక్క హృదయ శుద్ధి, బురాఖ్ పై ప్రయాణం, మస్జిద్ అల్-అక్సాలో ప్రవక్తలందరికీ ఇమామత్ చేయడం, ఏడు ఆకాశాలలో ఆదం, ఈసా, యహ్యా, యూసుఫ్, ఇద్రీస్, హారూన్, మూసా మరియు ఇబ్రాహీం (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తలను కలవడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. అల్లాహ్ తో సంభాషణ, యాభై పూటల నమాజు ఐదుకు తగ్గించబడటం, స్వర్గ నరకాలలోని కొన్ని దృశ్యాలు, వడ్డీ, అనాథల సొమ్ము తినేవారికి, వ్యభిచారులకు మరియు చాడీలు చెప్పేవారికి విధించబడే శిక్షల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ అద్భుత సంఘటనను మక్కావాసులు అపహాస్యం చేసినప్పుడు, అబూ బక్ర్ రజియల్లాహు అన్హు దానిని దృవీకరించి “సిద్దీఖ్” బిరుదును ఎలా పొందారో కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ
[అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్]
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు
మేరాజ్ యాత్ర
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఆరవ భాగంలోకి మనము ప్రవేశించాము. ఈ భాగంలో మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక గొప్ప యాత్ర, మేరాజ్ యాత్ర గురించి మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉంటున్నప్పటి సంఘటన ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదె హరాంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించగా, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ప్రవక్త వారు మస్జిదె హరాంలో ఉన్న సందర్భంలో ప్రవక్త వారితో కలిసి మాట్లాడి, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ శుద్ధి సంఘటన కూడా ఈ సందర్భంలో చోటు చేసుకుంది.
పసితనంలో కూడా మనము విని ఉన్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పసితనంలో హలీమా సాదియా వారి పిల్లలతో పాటు పశువుల మేపటానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవదూతలు ప్రవక్త వారిని ఒక రాయి మీద పడుకోబెట్టి, వక్షస్థలాన్ని చీల్చి హృదయాన్ని తీసి శుద్ధిపరిచారు అని ప్రవక్త వారి పసితనంలో కూడా ‘షక్కె సదర్’ (వక్షస్థలము చీల్చి హృదయము శుద్ధి చేసే) సంఘటన విని ఉన్నాము కదండీ. అచ్చం అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్య పదవి ఇవ్వబడిన పది సంవత్సరాలు దాటిపోయాయి. బహుశా 11, 12, 13 ఈ మూడు సంవత్సరాలలో నుంచి ఏదో ఒక సంవత్సరంలో ఈ సంఘటన మరొకసారి చోటు చేసుకుంది.
అల్లాహ్ దయవల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రెండవసారి కూడా హృదయ శుద్ధి చేయటం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఆయన వెంట ఒక వాహనాన్ని తీసుకుని వచ్చారు. ఆ వాహనం పేరు “బురాఖ్” అని గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ధార్మిక పండితులు ఆ వాహనం గురించి వివరిస్తూ రెక్కలు కలిగిన గుర్రం ఆకారంలో ఒక పశువు లాంటిది ఆ వాహనము అని చెప్పి ఉన్నారు.
జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వాహనం మీద తీసుకొని మస్జిదె హరాం నుండి మస్జిదె అక్సా (పాలస్తీనాలో బైతుల్ మఖ్దిస్ అని మనము వింటూ ఉంటాము, ఫోటోలలో కూడా చూస్తూ ఉంటాము కదండీ), ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. ఆ ప్రదేశంలో పైనుంచి పూర్తి ప్రదేశాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీక్షించారు. ఆ తర్వాత అక్కడ దిగి బురాఖ్ వాహనాన్ని ఒక ద్వారం వద్ద బంధించేసి, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదులోకి ప్రవేశించారు. మస్జిదులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తలందరికీ కూడా నమాజు చేయించారు, ఇమామత్ చేయించారు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. అయితే మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే వెళ్ళేటప్పుడు కాదండీ, తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ప్రవక్తలకు నమాజు చేయించారు, ఇమామత్ చేయించారు అని అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కే తెలుసు. మొత్తానికి ఆ మస్జిద్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తలందరికీ కూడా ఇమామత్ చేయించారు కాబట్టి ప్రవక్త వారికి ఇమాముల్ అంబియా అని, సయ్యదుల్ అంబియా అని బిరుదులు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చేయించారా లేదంటే తిరిగి వచ్చేటప్పుడు చేయించారా అన్న విషయము అల్లాహ్ కు తెలుసు.
ఆకాశ యాత్ర (మేరాజ్)
సరే, ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆకాశాల వైపుకి తీసుకుని వెళ్లారు. వెళుతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రెండు పాత్రలు ఇవ్వడం జరిగింది. ఒక పాత్రలో మద్యము ఉంది, మరొక పాత్రలో పాలు ఉన్నాయి. ఆ రెండు పాత్రలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ప్రవేశపెట్టగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పాత్రలో పాలు ఉన్నాయో ఆ పాత్రని తీసుకున్నారు. ఆ పాత్ర తీసుకుని పాలు సేవించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా! మీరు ఫిత్రత్ ని పొందారు, ప్రకృతిపరమైన విషయాన్ని మీరు ఎన్నుకున్నారు. మీరు గనుక పాలకు బదులు మద్యాన్ని ముట్టుకుని ఉండినట్లయితే మీ అనుచర సమాజము మార్గభ్రష్టత్వానికి గురైపోయేది. మీరు మాత్రము పాలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఫిత్రత్ ని ఎన్నుకున్నారు, ప్రకృతిపరమైన పదార్థాన్ని ఎన్నుకున్నారు” అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త వారికి తెలియజేశారు.
ఆ తర్వాత మొదటి ఆకాశం వరకు వెళ్లారు. తలుపులు తట్టగా దూతలు ఎవరు అని అడిగినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఆయన గురించి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన వెంట వచ్చి ఉన్నారన్న విషయాన్ని తెలుపగా ద్వారాలు తెరవబడ్డాయి. మొదటి ఆకాశంలోకి జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశించగా, అక్కడ మానవులందరి పితామహుడు అయిన ఆదం అలైహిస్సలాం వారు కనిపించారు. ఆదం అలైహిస్సలాం వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిసి మాట్లాడి పలకరించగా, ఆదం అలైహిస్సలాం వారు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడారు. ఆదం అలైహిస్సలాం వారి వద్ద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక అద్భుతాన్ని ప్రవక్త వారికి చూపించాడు. ఆదం అలైహిస్సలాం వారి కుడి భుజం వైపున పుణ్యాత్ముల ఆత్మలు చూపించాడు, ఎడమ భుజం వైపున పాపాలు చేసే పాపాత్ముల ఆత్మలు చూపించాడు. ప్రవక్త వారు ఆ దృశ్యాన్ని చూసి ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు మొదటి ఆకాశం నుండి రెండవ ఆకాశంలోకి ప్రవేశించారు.
రెండవ ఆకాశంలో ప్రవేశించినప్పుడు, రెండవ ఆకాశంలో ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త యహ్యా అలైహిస్సలాం వారిద్దరూ కనిపించారు. వారిద్దరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలకరించి మాట్లాడారు. వారిద్దరూ కూడా ప్రవక్త వారికి స్వాగతం పలికి మాట్లాడారు.
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు రెండవ ఆకాశము నుండి మూడవ ఆకాశంలోకి ప్రవేశించారు. మూడవ ఆకాశంలో వెళ్ళినప్పుడు అక్కడ ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారు కనిపించారు. మనం విని ఉన్నాము కదండీ, యాఖూబ్ అలైహిస్సలాం వారి చిన్న కుమారుడు, చాలా సుందరాంగుడు అని. ప్రవక్త యాఖూబ్ మరియు యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విని ఉన్నాము కదండీ, ఆ యూసుఫ్ అలైహిస్సలాం వారు మూడవ ఆకాశంలో కనిపించగా ప్రవక్త వారు ఆయనకు కూడా పలకరించారు, మాట్లాడారు. ఆయన కూడా ప్రవక్త వారికి మాట్లాడి స్వాగతం పలికారు.
మూడవ ఆకాశము నుండి జిబ్రీల్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని మళ్ళీ నాలుగవ ఆకాశంలోకి ప్రవేశించారు. నాలుగవ ఆకాశంలో ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం వారు కనిపించారు. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం వారితో కూడా మాట్లాడటము జరిగింది, పలకరించటము జరిగింది. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం కూడా ప్రవక్త వారితో మాట్లాడి స్వాగతం పలికారు.
ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంటబెట్టుకొని ఐదవ ఆకాశంలోకి ప్రవేశించారు. ఐదవ ఆకాశంలో ప్రవక్త హారూన్ అలైహిస్సలాం వారు కనిపించారు. హారూన్ అలైహిస్సలాం వారండీ, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి యొక్క తమ్ముడు లేదా అన్నయ్య అని మనము విని ఉన్నాం. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి అన్నయ్య అయిన హారూన్ అలైహిస్సలాం వారు, ఐదవ ఆకాశంలో కనిపించగా వారితో కూడా మాట్లాడి పలకరించి, ఆ తర్వాత ఆరవ ఆకాశంలోకి. ప్రవేశించగా, ఆరవ ఆకాశంలో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు కనిపించారు.
ఇక్కడ మనము బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఆరవ ఆకాశంలో కనిపించిన ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు ఈ యాత్ర మొత్తంలో ముఖ్య భూమిక పోషించి ఉన్నారండీ. మళ్ళీ నేను ప్రశ్నిస్తాను, ఆరవ ఆకాశంలో కనిపించిన ప్రవక్త ఎవరు అని, అప్పుడు మీరు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆరవ ఆకాశంలో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు కనిపించారు. మూసా అలైహిస్సలాం వారితో పలకరించి మాట్లాడి ప్రవక్త వారు ముందుకు సాగుతూ ఉంటే, మూసా అలైహిస్సలాం వారు కన్నీరు కార్చారు. ఎందుకయ్యా మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన అన్నారు, “నా తర్వాత ప్రపంచంలో పంపించబడిన ఒక ప్రవక్త, ఆ ప్రవక్త అనుచరులు నా అనుచరుల కంటే ఎక్కువ సంఖ్యలో స్వర్గంలోకి ప్రవేశిస్తారన్న విషయము నాకు తెలిసింది. అది గుర్తు చేసుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అని చెప్పారు.
ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంటబెట్టుకొని జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఏడవ ఆకాశంలోకి ప్రవేశించారు. ఏడవ ఆకాశంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కనిపించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో మాట్లాడి అక్కడి నుండి మరీ పైకి జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకువెళ్లారు. “సిద్రతుల్ మున్తహా” అనే ప్రదేశం వరకు తీసుకువెళ్లారు.
సిద్రతుల్ మున్తహా అనే ప్రదేశం వద్ద ఒక రేగు చెట్టు లాంటి ఒక పెద్ద చెట్టు ఉంది. దాని ఫలాలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి మరియు దాని ఆకులు ఏనుగు చెవులంత పెద్దవిగా ఉన్నాయి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. సిద్రతుల్ మున్తహా వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆకాశాల పైన ఉన్న “బైతె మామూర్” చూపించటం జరిగింది. బైతె మామూర్ ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్లారా చూసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, ఇది ఆకాశాల పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతిష్టించిన బైతె మామూర్ పుణ్యక్షేత్రం అండీ. ఇందులో ప్రతిరోజూ 70 వేల దైవదూతలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారు ఆ 70 వేల మంది దైవదూతలు ఆ పుణ్యక్షేత్రంలో ప్రార్థన ముగించుకుని బయటికి వచ్చేస్తే మళ్ళీ వారికి అక్కడికి వెళ్ళటానికి వంతు రాదు” అని చెప్పారు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి దూత అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేసుకుని బయటికి వచ్చేస్తే రెండవసారి అతనికి అక్కడికి వెళ్ళటానికి వంతు రాదు అంటే ఎంతమంది దైవదూతలు అక్కడ ఉన్నారు ఆకాశం మీద మనము ఆలోచించగలము. అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు అని మనకు అర్థమవుతుంది.
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆయన నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో జిబ్రీల్ అలైహిస్సలాం వారిని చూసినప్పుడు ప్రవక్త వారు తెలియజేశారు, ఆయన చాలా అంటే చాలా పెద్దగా ఉన్నారు. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 600 రెక్కలు ప్రసాదించి ఉన్నాడు అని తెలియజేశారు. రెండు రెక్కలు కలిగి ఉండటమే గొప్ప విషయం అంటే రెండు కాదు, పది కాదు, వంద కాదు, 600 రెక్కలు కలిగి ఉన్నారు. ఎంత పెద్ద దైవదూత ఆయన అనేది మనము ఇట్టే గమనించగలం. అంత పెద్ద దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిజ స్వరూపంలో చూశారు.
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరింత పైకి తీసుకువెళ్ళటం జరిగింది. ప్రవక్త వారు మరింత పైకి వెళ్లారు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా దగ్గరికి వెళ్లారు. తెర అడ్డులో నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సంభాషణ జరిపారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య సంభాషణ ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఆకాశాల పైన జరిగింది. అంటే పరదా, తెర వెనుక నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారితో మాట్లాడారు.
అయితే అక్కడ మాట్లాడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూడు కానుకలు ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, మూడు కానుకలు ఇచ్చాడు. మనము ఒక కానుక గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. ధార్మిక పండితులు యాభై పూటల నమాజు ఇచ్చాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న మాట ప్రస్తావిస్తూ ఉంటారు. అది ఒక్కటే కాదండీ, దానితో పాటు మరొక రెండు కానుకలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చాడు. మొత్తం మూడు కానుకలు ఇచ్చాడు. ఏంటి అవి మూడు కానుకలు? మొదటి కానుక ఏమిటంటే యాభై పూటల నమాజు ఇచ్చాడు. రెండవ కానుక ఏమిటంటే అవాఖిరు సూరతిల్ బఖరా, సూరా బఖరాలోని చివరి వాక్యాలు ఉన్నాయి కదండీ, ఆ చివరి వాక్యాలు ఇవ్వబడ్డాయి. మూడవ విషయం, మూడవ కానుక ఏమిటంటే శుభవార్త ఇచ్చాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఏంటి ఆ శుభవార్త? ఏ భక్తుడైతే భూమండలం మీద షిర్క్ (బహుదైవారాధన)కు పాల్పడకుండా జీవితం గడుపుతాడో అతను స్వర్గవాసి అవుతాడు అన్న శుభవార్త ఇచ్చాడు.
అల్లాహ్ కు పొగడ్తలు, అల్లాహ్ కు స్తోత్రాలు చెల్లుతాయి. యాభై పూటల నమాజులు, సూరా బఖరాలోని చివరి వాక్యాలు, బహుదైవారాధన షిర్క్ చేయకుండా జీవిస్తే స్వర్గ ప్రవేశము. ఈ మూడు కానుకలు ఇచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారిని పంపించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మూడు కానుకలు తీసుకొని తిరిగి ప్రయాణంలో వస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఆకాశము దిగుతూ వస్తున్నారు. ఏడవ ఆకాశము నుండి ఆరవ ఆకాశం పైకి వచ్చారు. మూసా అలైహిస్సలాం వారు ఆరవ ఆకాశంలో ఉన్నారు. ప్రవక్త వారు తిరిగి వెళుతూ ఉంటే పలకరించారు, “ఏమండీ, ఈ యాత్రలో అల్లాహ్ మిమ్మల్ని పిలిచి ఏ బహుమానము, కానుక ఇచ్చాడు?” అని అడిగినప్పుడు, ప్రవక్త వారు యాభై పూటల నమాజు గురించి మరియు వేరే విషయాల గురించి ప్రస్తావించినప్పుడు, మూసా అలైహిస్సలాం వారు అన్నారు, “చూడండి, మీ అనుచర సమాజము యాభై పూటల నమాజు ఆచరించలేదు, భారమైపోతుంది. మీరు వెళ్ళి అల్లాహ్ తో ఆ సంఖ్య తగ్గించమని కోరండి” అన్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. వెళ్ళవచ్చునా, వెళ్ళరాదా అని ఆయన సందేహంలో పడిపోయి జిబ్రీల్ అలైహిస్సలాం వారి వైపు అలా ప్రశ్నిస్తున్నట్టుగా చూశారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త వారి వైపు చూసి, “మీరు తలుచుకుంటే వెళ్ళవచ్చు” అని సైగ చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధైర్యం చేసి రెండవసారి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సమక్షంలోకి వెళ్ళి అల్లాహ్ తో మాట్లాడి సంఖ్య తగ్గించమని కోరగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పది నమాజులు తగ్గించాడు. నలభై మిగిలాయి. నలభై నమాజులు తీసుకుని వస్తూ ఉంటే మూసా అలైహిస్సలాం వారు మళ్ళీ అడిగి ఎన్ని తగ్గించారు అంటే పది తగ్గించారు అండీ అని చెప్పినప్పుడు, నలభై నమాజులు కూడా మీ అనుచర సమాజము చదవలేదు, భారమైపోతుంది, మళ్ళీ తగ్గించండి అన్నారు. మళ్ళీ వెళ్లారు. ఆ విధంగా వెళుతున్నారు, తగ్గించుకుని వస్తున్నారు, మళ్ళీ వెళుతున్నారు, తగ్గించుకుని వస్తున్నారు. అలా తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ యాభైలో నుంచి ఐదు నమాజులు మాత్రమే మిగిలిపోయాయి.
ఆ ఐదు నమాజులు మాత్రమే మిగిలిపోయి ఉంటే, మూసా అలైహిస్సలాం వారు ఆ ఐదు నమాజులు కూడా మీ అనుచర సమాజం మీద భారమైపోతుంది, అందులో నుంచి కూడా తగ్గించుకోండి అన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, యాభైలో నుంచి నలభై ఐదు తీసేసి ఐదు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఈ ఐదులో నుంచి కూడా తగ్గించుకోవటం అంటే నాకు సిగ్గుగా ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళకుండా ఆ తర్వాత అక్కడి నుండి ముందుకు పయనమైపోయారు.
ముందుకు వెళ్ళగానే ఆకాశంలో నుంచి ఒక శబ్దము వినిపించింది. అదేమిటంటే “నేను నా భక్తుల పైన నా ఆజ్ఞను స్థాపించేశాను, నా భక్తుల కోసము నేను నా భక్తుల మీద నేను భారాన్ని తగ్గించి వారికి సులభమైన నియమాన్ని ఇచ్చేశాను” అని పైనుంచి శబ్దము వినిపించింది. ఆ ప్రకారంగా ఐదు పూటల నమాజు భక్తుల మీద విధి అయిపోయింది. అయితే ధార్మిక పండితులు వివరిస్తూ ఏమంటున్నారంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసిన వాగ్దానం ప్రకారము, భక్తుడు ఐదు పూటల నమాజు ఆచరిస్తే అతనికి యాభై పూటల నమాజు పుణ్యము ఇవ్వబడుతుంది, ఇన్ షా అల్లాహ్ అని తెలియజేశారు. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండీ మనకు!
సరే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి తిరిగి ముందుకు పయనమైపోయారు. ఇక్కడ ఆగి మనము కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంది. ప్రవక్త వారు ఈ యాత్రలో చాలా విషయాలు చూసి ఉన్నారు. ఆయన చూసిన విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. అవన్నీ తెలుసుకుంటూ ఇన్ షా అల్లాహ్ మనము ముందుకు కొనసాగుదాం.
ఈ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్రతుల్ మున్తహా చూపించడం జరిగింది. ఈ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారిని అసలు రూపంలో చూశారు. ఈ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతె మామూర్ ని చూశారు.
స్వర్గ నరకాల దృశ్యాలు
ఈ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గాన్ని కూడా సందర్శించారు. అవునండీ, ప్రవక్త వారికి ఈ యాత్రలో భాగంగా స్వర్గ సందర్శనము కూడా చేయించడం జరిగింది. ప్రవక్త వారు స్వర్గాన్ని చూసి ఏమంటున్నారంటే, స్వర్గంలో ఉన్న మట్టి మిస్క్… మనం ఉర్దూ భాషలో ముష్క్ అంటాం మనము, అరబీలో మిస్క్ అని ఉంటుంది… కస్తూరి సువాసన స్వర్గంలో ఉన్న మట్టిలో నుంచి వస్తూ ఉంది అన్నారు. అల్లాహు అక్బర్! స్వర్గంలో ఉన్న మట్టి కస్తూరి సువాసనతో నిండి ఉంది.
అలాగే స్వర్గంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుల కోసము భవనాలు నిర్మించి ఉన్నాడు, కోటలు నిర్మించి ఉన్నాడు. ఆ భవనాల మీద, కోటల మీద గోపురాలు కూడా ముత్యాలతో నిర్మించబడి ఉన్నాయి అన్నారు. అల్లాహు అక్బర్! స్వర్గంలోని భవనాలు, కోటల మీద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముత్యాలతో తయారు చేయబడిన గోపురాలు సిద్ధము చేసి ఉన్నాడు. ముత్యము మెరిసిపోతుంది కదండీ, ఆ విధంగా గోపురము మెరిసిపోతూ ఉంటుంది. అల్లాహు అక్బర్! అంటే స్వర్గంలో ఉన్న ఇండ్లు ముత్యాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి.
స్వర్గంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భవనాలతో పాటు నదులు ఏర్పాటు చేసి ఉన్నాడు. స్వర్గంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుల కోసము రకరకాల పండ్ల ఫలాలతో నిండిన తోటలు, వనాలు సిద్ధము చేసి ఉన్నాడు అని ప్రవక్త వారు స్వర్గం గురించి చాలా విషయాలు తెలియజేసి ఉన్నారు. అవన్నీ ఒక ప్రసంగంలో చెప్పాలంటే కుదరదు. క్లుప్తంగా చెప్తున్నాను, మొత్తానికి స్వర్గంలో భక్తుల కోసం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా చాలా అనుగ్రహాలు నింపి ఉన్నాడు. అక్కడికి చేరుకున్న వారికి ఆ అనుగ్రహాలు దక్కుతాయి.
అలాగే ఈ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరక శిక్షలను కూడా చూసి ఉన్నారు. నరకం మీద ఒక పర్యవేక్షకుడు దైవదూత ఉన్నాడు, అతని పేరు మాలిక్. అతను అస్సలు బొత్తిగా నవ్వడమే లేదు, అతని మొహం మీద చిరునవ్వు అనేదే కనిపించుట లేదు. అలాంటి దైవదూత మాలిక్, అతని పేరు, అతను నరకం యొక్క పర్యవేక్షకునిగా నిలబడి ఉన్నాడు. ఆ పర్యవేక్షకుడిని నేను చూశాను అని ప్రవక్త వారు తెలియజేశారు.
అలాగే పరలోకంలో ప్రవక్త వారు కొంతమందిని చూశారు. కొందరి కడుపులు చాలా పెద్దవిలా ఉబ్బిపోయి ఉన్నాయి. బెలూన్ ఏ విధంగా అయితే ఉబ్బిపోతుందో ఆ విధంగా మనుషుల కడుపులు ఉబ్బిపోయి ఉన్నాయి. ఉబ్బిపోయి ఉన్నప్పుడు ఎవరైనా ముట్టుకుంటే కూడా అతనికి చాలా బాధ కలుగుతుంది. అయితే దైవదూతలు ఆలె ఫిరౌన్ వారిని నరకంలో పడవేయటానికి తీసుకువెళ్లేటప్పుడు వారి కడుపులను తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు భరించరాని బాధతో కేకలు పెడుతూ ఉన్నారు. అది చూసి ప్రవక్త వారు ఆశ్చర్యపోయి, “ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకోసమో వీరి కడుపులు ఈ విధంగా ఉబ్బిపోయి ఉన్నాయి?” అని అడిగితే, దైవదూత ప్రవక్త వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, వీరు ప్రపంచంలో వడ్డీ సొమ్ము తిన్నవారు” అని తెలియజేశారు. అల్లాహు అక్బర్! ఎవరైతే ప్రపంచంలో వడ్డీ సొమ్ము తింటున్నారో రేపు పరలోకంలో ఆ విధంగా శిక్షించబడతారు, జాగ్రత్త!
అలాగే ప్రవక్త వారు కొంతమందిని చూశారు, వారి పెదాలు ఒంటె పెదాల్లాగా వేలాడుతూ ఉన్నాయి. మనం ఒంటెను చూసాం కదండీ, ఒంటె పెదాలు ఇలా లూజుగా వేలాడుతూ ఉంటాయి. ఆ విధంగా మనుషుల పెదాలు కూడా వేలాడుతూ ఉన్నాయి. వారు కూర్చుని బలవంతంగా అగ్నిని మింగుతూ ఉన్నారు. బలవంతంగా మింగుతూ ఉన్నారు. ఆ అగ్ని వారి కడుపులోకి ప్రవేశించి మల విసర్జన ప్రదేశంలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంది. అంత తీవ్రమైన బాధకు వారు ఎందుకు గురవుతూ ఉన్నారు అని దైవ ప్రవక్త వారు దూతతో అడిగితే, దైవదూత ఇలా అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, వీరు ప్రపంచంలో అనాథల సొమ్ము కాజేశారు, తినేశారు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా శిక్షించబడుతున్నారు” అని చెప్పారు. అల్లాహ్ కాపాడాలి! ఎవరైతే ప్రపంచంలో తల్లిదండ్రులు లేని అనాథల సొమ్మును కాజేస్తారో, తినేస్తారో, మింగేస్తారో అలాంటి వారు ఆ విధంగా శిక్షించబడతారు అని తెలపబడింది.
అలాగే మరికొంత మందిని చూశారు. వారి వద్ద మంచి స్వచ్ఛమైన మాంసము పెట్టి ఉంది, కానీ దాన్ని వారు ముట్టుకోవట్లేదు. పక్కనే వ్యర్థమైన, కుళ్ళిపోయిన మాంసము పడి ఉంటే అది వెళ్ళి తీసుకుని తింటూ ఉన్నారు. ప్రవక్త వారు చూసి, “ఎవరు వీరు? మంచి మాంసము ఉంటే అది వదిలేసి, తినకుండా కుళ్ళిపోయిన పనికిరాని వ్యర్థమైన మాంసము తింటున్నారు ఏమిటి? ఎవరు వీరు?” అని అడిగితే, దైవదూత అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, వీరు వ్యభిచారులు. ప్రపంచంలో ధర్మంగా వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భార్యలు ఇచ్చి ఉన్నా గానీ, భార్యలను పెట్టుకుని కూడా వారు పరాయి మహిళలతో, స్త్రీలతో వ్యభిచారము చేస్తూ ఉండేవారు. అందుకోసమే ఇక్కడ ఈ విధంగా శిక్షించబడుతున్నారు” అన్నారు.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, కొంతమంది మహిళలకు వంచి ఉన్న ఇనుప కడ్డీలను వారి రొమ్ములకు గుచ్చి వేలాడించబడి ఉంది. గాలం ఉంటుంది కదండీ ఏ విధంగా వంచేసి, అలా వంచేసి ఉన్న ఇనుప కడ్డీలు మహిళల రొమ్ముల్లో గుచ్చేసి వారిని వేలాడదీయడం జరిగింది. ప్రవక్త వారు చూసి, “ఎవరు వీరు, ఎందుకు ఈ విధంగా వారికి శిక్షించడం జరుగుతుంది?” అని అడిగితే, దైవదూత అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, ఈ మహిళలు ప్రపంచంలో భర్తకు ద్రోహం చేసిన మహిళలు. ఇతరుల వద్ద గర్భము చేయించుకుని, ఇది నీ బిడ్డ అని భర్తకు నమ్మించేవారు. అలా నమ్మక ద్రోహం చేసిన, భర్తలకు నమ్మక ద్రోహం చేసిన మహిళలు వీరు, వీరికి ఈ విధంగా శిక్షించడం జరుగుతుంది” అని చెప్పారు.
అలాగే ప్రవక్త వారు కొంతమందిని చూశారు, వారి చేతి వేళ్ళకి ఉన్న గోర్లు రాగితో తయారు చేయబడి ఉన్నాయి. ఆ రాగితో తయారు చేయబడి ఉన్న చేతి గోళ్ళతో వారు వారి మొహాలను, వారి రొమ్ములను చీల్చుకుంటూ ఉన్నారు, గాయపరుచుకుంటూ ఉన్నారు. ప్రవక్త వారు అది చూసి, “ఎవరు వీరు, ఎందుకు ఈ విధంగా వారిని వారు హింసించుకుంటూ ఉన్నారు?” అని దూతతో అడిగితే, దైవదూత అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, వీరు ప్రపంచంలో గీబత్ చేసేవారు, అంటే ఒకరి గురించి వెనుక, అంటే అతని ముందర కాకుండా అతను లేనప్పుడు అతని వెనుక అతని గురించి చెడుగా మాట్లాడుకోవటాన్ని గీబత్ అంటారు. ఆ గీబత్ చేసేవారు, అలా గీబత్ చేసిన వారు ఇక్కడ ఈ విధంగా శిక్షించబడుతూ ఉన్నారు” అని తెలియజేశారు.
ఇవన్నీ ప్రామాణికమైన సహీ హదీసులలో ఉన్న విషయాలు. బలహీనమైన, కల్పితమైన చాలా హదీసులు దీని గురించి, మేరాజ్ యాత్ర గురించి ఉన్నాయి, వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుట లేదు.
యాత్ర అనంతరం మక్కాలో
సరే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దృశ్యాలన్నీ చూశారు, తిరిగి ప్రయాణంలో ప్రవక్త వారు వస్తూ ఉంటే కొంతమంది మక్కా వైపు ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక బిడారంలోని ఒక ఒంటె బెదిరిపోయి పారిపోతూ ఉంది. ప్రవక్త వారు పైనుంచి చూసుకొని ఆ బిడారం వద్దకు వెళ్ళి, “మీ ఒంటె బెదిరిపోయి పారిపోతూ ఉంది, ఫలానా ప్రదేశంలో అంతటి దూరంలో అది వెళుతూ ఉంది, అది మక్కాకు చేరిపోతుంది ఫలానా సమయానికి” అని వారికి తెలియజేశారు. అలాగే వస్తూ ఉంటే మరి కొంతమంది ప్రయాణం చేసుకుంటూ మక్కాకు వస్తూ ఉన్నారు, వారు ఒకచోట స్థావరం ఏర్పరుచుకుని ఉన్నారు. ప్రవక్త వారు ఆ బిడారంలోకి కూడా వెళ్ళి అక్కడ నీరు కూడా త్రాగి వచ్చారు.
మొత్తానికి ప్రవక్త వారు మళ్ళీ మక్కాకు వచ్చి చేరిపోయారు. ఈ కథ మొత్తము ఒకే రాత్రిలో జరిగింది. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకే రాత్రిలో ఒక వ్యక్తి మస్జిదె హరాం నుండి మస్జిదె అక్సా వరకు వెళ్ళిపోవటము, మళ్ళీ అక్కడి నుండి ఆకాశాల పైకి వెళ్ళటము, ఆకాశాల పై నుండి మళ్ళీ తిరిగి రావటము, ఇదంతా జరిగే పనేనా అంటే అల్లాహ్ తలుచుకుంటే జరుగుతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన బురాఖ్ వాహనం గురించి గ్రంథాలలో వ్రాయబడిన విషయం ఏమిటంటే అది ఒక క్షణంలో మనిషి చూపు ఎంత దూరం వెళుతుందో అంత దూరం వెళ్ళిపోతూ ఉంది, అంత వేగంగా అది ప్రయాణిస్తూ ఉంది. అలాంటి వాహనం మీద ప్రవక్త వారికి తీసుకువెళ్ళటం జరిగింది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే ఏదీ అసాధ్యము కాదు.
మొత్తానికి ఈ యాత్ర ముగించుకుని ప్రవక్త వారు మక్కాకు వచ్చేసారు. మక్కాకు వచ్చేసిన తర్వాత, మరిసటి రోజు ఈ యాత్రలో చోటు చేసుకున్న విషయాలన్నీ ప్రజల ముందర వినిపిస్తే, మక్కాలోని ముష్రికులు, తిరస్కారులు ప్రవక్త వారిని హేళన చేయడం ప్రారంభించారు. “మేము చెప్పాము కదా, ముహమ్మద్ పిచ్చివాడైపోయాడు,” అస్తగ్ఫిరుల్లాహ్! “చూడండి, అతనికి పిచ్చి పట్టింది కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇదంతా జరిగే విషయమా? రాత్రికి రాత్రే మక్కా నుండి పాలస్తీనాకు వెళ్ళిపోవడం ఏమిటి, పాలస్తీనా నుండి ఆకాశాల పైకి వెళ్ళిపోవడం ఏమిటి, ఆకాశాల పై నుండి మళ్ళీ తిరిగి మక్కాకు వచ్చి చేరిపోవడం ఏమిటి?” అని వారు హేళన చేస్తూ ఉన్నారు.
కొంతమంది అయితే ప్రవక్త వారి వద్దకు వెళ్ళి, “మేము ఎలా నమ్మాలి, నువ్వు చెప్పేదంతా నిజమే అని?” అంటే ప్రవక్త వారు కొన్ని విషయాలు చెప్పారు: “చూడండి, నేను వచ్చేటప్పుడు ఒక ఒంటె పారిపోయి ఉంటే ఆ ఒంటె గురించి వారి యజమానులకు తెలియజేశాను. కొద్ది రోజుల్లోనే వారు మక్కాకు వచ్చేస్తారు, కావాలంటే మీరు వారితో అడగండి. అలాగే ఒక బిడారంలో నేను నీళ్ళు తాగాను, వారు ఇంత సమయం తర్వాత మక్కాకు చేరుకుంటారు, వారితో కూడా మీరు ప్రశ్నించండి.” అలాగే నేను మస్జిదె అక్సాను కూడా చూశాను అని ఉంటే, కొంతమంది వచ్చి “మస్జిదె అక్సాలో ఫలానా చోట ఏముందో చెప్పు, ఆ చోట ఏముందో చెప్పు, ఈ చోట ఏముందో చెప్పు” అని నిలదీస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర తెర మీద ఎలాగైతే దృశ్యాలు కనిపిస్తాయో ఆ విధంగా ప్రవక్త వారిని అక్కడ మస్జిదె అక్సాలో ఉన్న దృశ్యాలు చూపించగా, ప్రవక్త వారు ఆ దృశ్యాలను చూసి వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానము తెలియజేశారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే కొంతమంది అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళి, “ఏమయ్యా, ఒక వ్యక్తి రాత్రికి రాత్రే మక్కా నుండి పాలస్తీనాకు వెళ్ళిపోవటము, పాలస్తీనా నుండి ఆకాశాల పైకి వెళ్ళిపోవటము, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేయటము జరుగుతుందా?” అంటే “ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది” అంటారు ఆయన. అప్పుడు మక్కా వాసులు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వారితో అడుగుతున్నారు, “అయితే మీరు నమ్ముతున్న ప్రవక్త ముహమ్మద్ ఇదే విషయము చెబుతున్నాడు కదా, మరి ఇది సంభవమేనా?” అంటే అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకవేళ ఈ విధంగా చెబుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. ఎందుకంటే ఆయన నోటి నుండి నిజము తప్ప వేరే విషయము నేను జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదు. ఒకవేళ ఆ విషయం నా మైండ్ లోకి దిగకపోయినా ఏం పర్వాలేదు, కానీ ప్రవక్త వారు చెబుతూ ఉన్నారంటే అది సత్యమే అవుతుంది, ఆయన సత్యమే పలుకుతారు. కల్పిత విషయాలు ఆయన ఎప్పుడూ గానీ మాట్లాడనే మాట్లాడరు. నేను దాన్ని ధృవీకరిస్తున్నాను” అని చెప్పేశారు.
ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ఆయన అడగలేదు. ప్రవక్త వారి వద్దకు వెళ్ళకుండానే, ఒకవేళ ప్రవక్త వారు చెబుతున్నారంటే అది నిజమే, సత్యమే అని నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పారు కాబట్టి అప్పుడే ఆయనకు “సిద్దీఖ్” (ధృవీకరించేవాడు, సత్యాన్ని ధృవీకరించేవాడు) అని బిరుదు ఇవ్వబడింది. అందుకోసమే ఆయనకు అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు అని పిలవటం జరుగుతుంది.
యాత్ర నుండి పాఠాలు
ఈ యాత్ర ద్వారా రెండు ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి మిత్రులారా.
మొదటి విషయం ఏమిటంటే, ప్రవక్త వారికి మస్జిదె హరాం నుండి మస్జిదె అక్సా వరకు తీసుకువెళ్ళటం జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో ఒక సమూహాన్ని ఎత్తుతూ ఉన్నాడు. ఆ సమూహం చేతిలోకి ఈ మస్జిదె హరాం మరియు మస్జిదె అక్సా యొక్క పాలనా బాధ్యత వెళ్ళిపోతుంది అన్న సూచన ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అలాగే మరొక సూచన ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అంటే, ధర్మ ప్రచార కార్యక్రమం చాలా వేగంగా ప్రపంచంలో వ్యాపించిపోవటానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయి అని కూడా సూచిస్తూ ఉంది అన్న విషయము ధార్మిక పండితులు తెలియజేశారు. అలాగే జరిగింది కూడా.
ప్రవక్త వారు ఈ యాత్ర ముగించుకుని వచ్చేసారు. ముగించుకుని వచ్చిన తర్వాత కొద్ది రోజులకు హజ్ సందర్భం వచ్చింది. హజ్ సందర్భం వచ్చినప్పుడు మక్కాలో ఉన్న కాబతుల్లాహ్ కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు హజ్ కోసము వస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా హజ్ ఉండేది. కాకపోతే ప్రవక్త వారి శాసనం ప్రకారంగా కాదు, పూర్వపు శాసనం ప్రకారంగా ఉండేది.
ప్రజలు నలువైపుల నుంచి వచ్చారు. అలా వచ్చిన వారిలో యస్రిబ్ అంటే నేడు మదీనా అని చెబుతున్నాము కదండీ, ఆ మదీనా నుండి కూడా కొంతమంది, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఒక ఆరు మంది యస్రిబ్ (మదీనా) నుండి హజ్ కోసము మక్కాకు వచ్చి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు సాయంత్రం పూట, చీకటి సమయంలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వారిని, అలీ రజియల్లాహు అన్హు వారిని వెంటబెట్టుకొని అలా లోయలో నుంచి వెళుతూ ఉంటే కొంచెం శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని ప్రవక్త వారు అక్కడికి వెళ్లారు. వెళ్ళి చూస్తే ఒక ఆరు మంది సమూహంగా ఉన్నారు. “ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు?” అని అడిగితే, “మేము యస్రిబ్ నుంచి హజ్ కోసం వచ్చినాము” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు, “మీరు కూర్చుంటే నేను కొన్ని విషయాలు మీకు వినిపిస్తాను” అని వారిని కూర్చోబెట్టి దైవ వాక్యాలు వినిపించి, అల్లాహ్ ఏకత్వం గురించి, ఇస్లాం గురించి బోధించగా వెంటనే వారు ఏం చేశారంటే, “ఇదిగో, మా యస్రిబ్ లో యూదులు నివసిస్తూ ఉన్నారు. వారు త్వరలోనే ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆ ప్రవక్త వస్తే ఆ ప్రవక్త మీద మేము విశ్వాసం తీసుకుని వచ్చి, ఆ ప్రవక్త ఆధ్వర్యంలో మీ మీద మేము దండయాత్ర చేసి మిమ్మల్నందరినీ అణచి వేస్తాము అని మాకు బెదిరిస్తూ ఉన్నారు. వారు తెలియజేసిన దాని ప్రకారము రాబోతున్న ప్రవక్త బహుశా ఈయనే. కాబట్టి యూదులకు అవకాశం దొరకముందే ఆ అవకాశాన్ని మేము తీసుకుందాము” అని వారందరూ కూడా, ఆ ఆరు మంది వెంటనే ప్రవక్త వారి చెయ్యి పట్టుకుని ప్రతిజ్ఞ చేసి ఇస్లాం స్వీకరించేశారు.
ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఇస్లామీయ మౌలిక విషయాలు నేర్పించారు. ఆ తర్వాత వారు హజ్ ముగించుకుని మక్కా నుండి యస్రిబ్ అనగా మదీనా అంటున్నారు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి, “ప్రవక్త రాబోతున్నాడు అన్న మాట మీరు వింటున్నారు కదా, ఆ ప్రవక్త మక్కాలో వచ్చి ఉన్నాడు” అని బాగా ప్రచారం చేసేశారు. అలా మదీనాలో, యస్రిబ్ లో మక్కాలో ప్రవక్త వచ్చి ఉన్నారన్న విషయము ప్రచారమైపోయింది. తత్కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా మంచి విజయం దక్కింది. ఆ విజయం ఎలా దక్కింది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ విజయం దక్కింది అన్న విషయాన్ని ఇన్ షా అల్లాహ్ వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.
ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరినీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరినీ నమాజులో ఐదు పూటల క్రమం తప్పకుండా సామూహికంగా ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరినీ పెద్ద పెద్ద పాపాల నుండి రక్షించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తి శ్రద్ధలతో మమ్మల్నందరినీ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43927