హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) [పుస్తకం]

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్)
ఉర్దూ సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

[డౌన్లోడ్ బుక్]

1) హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్)

  • జననం
  • సంస్కరణా సరణిలో
  • మూర్తీభవించిన మృదుత్వం
  • సత్యధర్మ వైతాళికుడు
  • విద్యా విషయక సేవలు
  • చెక్కు చెదరని స్థయిర్యం
  • హజ్రత్ షేఖ్ గారి కాలంలో
  • ప్రసంగాలు
  • ఖలీఫాకు హెచ్చరిక
  • ఎల్లరికీ పిలుపు
  • ఏకదైవారాధనకు అధిక ప్రాధాన్యత
  • భగ్న హృదయాలకు ఓదార్పు
  • ప్రపంచం యొక్క వాస్తవ స్థితి
  • సమకాలీన పండితులకు హెచ్చరిక
  • ధర్మచింతన
  • సంస్కరణా సరణి
  • ప్రస్థానం
  • దయాగుణం

2) షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) బోధనలు

  • దుష్టవాంఛల్ని ప్రతిఘటించినపుడే ఏకేశ్వరోపాసనకు పరిపూర్ణత చేకూరుతుంది
  • హృదయాలు నెమ్మదించాలంటే
  • వరాలకై ఓరిమితో వ్యవహరించండి
  • వాస్తవం పట్ల వైముఖ్యం తగదు సుమా!
  • భయము, ఆశ గురించి
  • నిష్కల్మషమైన విశ్వాసమే మోక్షానికి నిచ్చెన
  • దైవేచ్ఛను నిందించకు
  • సందేహాస్పదమైన వస్తువుల్ని విడనాడండి
  • అన్నిటికన్నా గొప్ప అనుగ్రహం విశ్వాసం
  • మంచి మార్గం ఎన్నుకో!
  • ఏకేశ్వరోపాసికి శుభవార్త
  • అల్లాహ్ యేతరుల పట్ల ప్రేమ ‘షిర్క్’ మాత్రమే
  • అసూయాగ్నికి ఆహుతి కారాదు
  • మానవ మనసు
  • అతి నిద్రలోలుడు, తెలివిలేని మూర్ఖుడు
  • మీరు ప్రేమించే వాని గురించి
  • అల్లాహ్ ను వేడుకోవలసినవి
  • అల్లాహ్ తప్ప వేరితరులను మొక్కుకోవటం

ప్రతి విశ్వాసి రుజుమార్గం కొరకు అల్లాహ్ ను ప్రార్థించాలని, పుణ్య పురుషులు ఏ మార్గాన్ననుసరించి కానుకలు పొందారో ఆ మార్గాన్ని చూపవలసిందిగా వేడుకోవాలని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్లోని ఫాతిహా సూరాలో ఉపదేశించాడు. ఈ పుణ్య పురుషుల జాబితాలో దైవ ప్రవక్తలు, సిద్దీఖులు, షహీదులు, సాలిహీన్లు ఉన్నారు.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) కూడా తన కాలపు సాలిహీన్ (సద్వర్తనుల, పుణ్యపురుషుల) కోవకు చెందినవారే. దైవభక్తి, సాత్వికత, సదాచరణల ఆధారంగా ఆయన మానవ సమాజాన్ని సంస్కరించారు. నిరాశా నిస్పృహలకు లోనై పెడదారి పట్టిన వేలాది మంది జీవితాలను తీర్చిదిద్దారు.

దైవధర్మ ఉన్నతి మరియు మానవ సంస్కరణలను ప్రధానాంశాలుగా తీసుకుని ఉద్యమించిన ఈ మహనీయుడు ఏనాడూ తన సమకాలీన గవర్నర్లకు, చక్రవర్తులకు జడవలేదు. సత్య ధర్మానికి, మానవతకు పట్టిన దురవస్థ పట్ల ఆవేదన చెందేవారు. ఈ విషయమై ఆయన ప్రజా చైతన్యాన్ని మేల్కొలిపేందుకు అవిరళ కృషి చేశారు. ప్రజా జీవితాల్లో మంచిని పెంపొందించి, చెడులను రూపుమాపాలన్న తహతహ ఆయన ప్రసంగాలలో కొట్టొచ్చినట్లు కనిపించేది. సాధారణంగా ఆయన సామాన్యులను, ప్రముఖులను, పండితులను, అధికారులను – అందరినీ ఉద్దేశ్యించి ఉపన్యసించేవారు. నిర్మొహమాటంగా హెచ్చరికలు చేసేవారు. ముఖ్యంగా మంత్రుల్ని, ఏలిన వారిని కీలెరిగి వాతలు పెట్టేవారు. ఒక సంస్కర్తకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఇదే మరి.

దురదృష్టవశాత్తు నేడు ముస్లిం సమాజంలో అనేకులు కేవలం ఆయన్ని భక్తితో స్మరించుకుంటారు. కాని ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని గురించి పట్టించుకోరు, ఆయన ఇచ్చిన సందేశమేమిటో ఆలోచించరు, ఆ మహనీయుని అడుగు జాడల్లో నడచి ధర్మోన్నతికై పాటుపడాలన్న ధ్యాసే వారికి ఉండదు. హజ్రత్ పట్ల గల ఈ ‘నామ్ కా ప్రేమ’ వల్ల ఒరిగేదేమీ లేదు. ఆయన యెడల నిజమైన ప్రేమే గనక ఉంటే ఆయన ఉపదేశాలను ఆచరణలో పెట్టాలి. వాటిని సర్వసామాన్యం చేయాలి,

మీ ముందున్న ఈ పుస్తకం అసలు ఉద్దేశ్యం ఇదే. హజ్రత్ షేఖ్ గురుంచి ఉర్దూలో లెక్కకు మించిన రచనలు ఉన్నాయి. ‘ఫుతూహులైబ్‘, ‘ఫుయూజె యజ్దానీ‘, ‘తారీఖె దావత్ వ అజీమత్’, ‘షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) కా అస్లీ కార్నామా‘, ‘మల్ ఫూ జాత్‘ – వంటి కొన్ని ముఖ్యమైన పుస్తకాల ఆధారంగా విషయాన్ని సంకలనం చేసి మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం జరిగింది.

మా సంస్థ తెలుగు విభాగం (అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్) డైరెక్టర్ అయిన ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు ఈ సంకలనాన్ని తెనుగీకరించారు. తెలుగు పాఠక లోకానికి హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఉపదేశాలు హెచ్చు తగ్గులు లేకుండా అందజేయాలన్నదే ఈ చిరుపుస్తకం ఉద్దేశ్యం. పుస్తకం చివర్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, దీనియాత్ విభాగం మాజీ అధిపతి డా॥ మీర్ వలీయుద్దీన్ గారి వ్యాసం “నజర్ లిగైరుల్లాహ్“ను అదనంగా చేర్చడం అవసరమని భావించాము. మొక్కుబడుల వాస్తవికత ఏమిటో పాఠకులకు స్పష్టం చేయాలన్నదే దీని ముఖ్యోద్దేశం.

పరమ ప్రభువు ఈ స్వల్ప కృషిని స్వీకరించుగాక! అనువాదకునికీ, పుస్తక ప్రచురణలో తోడ్పడిన వారికీ, పాఠకులందరికీ, అల్లాహ్ మహనీయుల ఉపదేశాలను అనుసరించే, వాటిని పరివ్యాప్తం చేసే సద్బుద్ధి నొసగుగాక!! (ఆమీన్)

ముహమ్మద్ తఖీయుద్దీన్
(ప్రెసిడెంట్, అల్ హఖ్ ఎడ్యుకేషనల్అండ్ వెల్ఫేర్ సొసైటీ)
హైదరాబాద్ – ఆం. ప్ర.

సయ్యిదినా అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 470లో ‘గీలాన్‘ ప్రాంతంలోని ‘నీఫ్’ అనే గ్రామంలో జన్మించారు. గీలాన్ (లేక జీలాన్) ప్రాంతం ఈరాన్ కు వాయవ్య దిశలో ఉన్న ఒక రాష్ట్రంలో ఉంది. గీలాన్ అందమైన పర్వత ప్రాంతం.

సయ్యిదినా అబ్దుల్ ఖాదిర్ గారు గీలాన్ (జీలాన్) ప్రాంతంలో పుట్టడం వల్ల అబ్దుల్ ఖాదిర్ జీలానీగా పిలువబడతారు. ఈయన వంశ పరంపర పది తరాలు వెనక్కిపోయి చూస్తే సయ్యిదినా ఇమామ్ హసన్ (రదియల్లాహు అన్హు)తో కలుస్తుంది.

ఇస్లాం చరిత్రలో హిజ్రీ 5వ శతాబ్దిలో జన్మించిన సంస్కర్తలలో హజ్రత్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) అత్యుత్తమ శ్రేణికి చెందిన వారు. పరిపాలకులు అధికార మదాంధులై విర్రవీగుతున్న పరిస్థితులలో, ధర్మావలంబనలో కొత్తపోకడలు (బిద్ ఆత్) తలెత్తి ప్రజల విశ్వాసాలు పెడత్రోవ పడుతున్న గడ్డు రోజులలో షేఖ్ ప్రభవించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సయ్యిదినా అబ్దుల్ ఖాదిర్ జీలానీ బాల్యదశ నుండే సత్యసంధతను నిరూపించుకుని లోకానికి ఆశాకిరణం అనిపించారు. తల్లి ఒడిలో లభించిన శిక్షణ ఆయన్ని ధార్మికంగా, నైతికంగా ఉన్నతస్థాయికి చేర్చింది. సత్యం, సదాచారం, భయభక్తులు, నీతి, నిజాయితీ, దయ, ప్రేమ, మృదుత్వం వంటి ఉన్నత గుణాలు ఉగ్గుపాలతోనే ఆయనకు లభించాయి. పల్లెసీమలో విద్యార్జనకై లభించిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని, ఉన్నత విద్యకోసం ‘బుగ్దాద్‘ పట్టణానికి వెళ్ళదలచి తల్లిగారి అనుమతి కోరారు.

బుగ్దాద్కు పయనమవుతున్న సమయంలో తల్లిగారు ఆయనకు నలభై దీనార్లు ఇస్తూ ఒక ముఖ్యమైన ఉపదేశం చేశారు జీవితంలో ఎన్నడూ, ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పరాదని. తల్లిగారిచ్చిన 40 దీనార్లకన్నా, ఆమె చేసిన ఉపదేశమే ఆయన గారికి ముఖ్యమైనది. అమ్మ మాటను మూట కట్టుకుని విద్యాబుద్ధుల కోసం పట్నం బయలుదేరిన ఆ నూనూగు మీసాల కుర్రాడు జీవితంలో ఏ దుష్టశక్తికీ లొంగలేదు. మార్గమధ్యలో బందిపోట్లు ఆయన పయనిస్తున్న బిడారు పై దాడి చేశారు. అందరినీ నిలువునా దోచుకున్నారు. ఇక అబ్దుల్ ఖాదిర్ వంతు వచ్చింది. ‘నీ దగ్గర ఏముందో చెప్పరా?’ అని గర్జించాడు ఒక బందిపోటు. ‘నా దగ్గర 40 దీనార్లు ఉన్నాయి’- తడుముకోకుండా జవాబిచ్చాడా అబ్బాయి. వాడికి నమ్మశక్యం కాలేదు. ఆ కుర్రాడిని బందిపోట్ల నాయకుని సమక్షంలో హాజరుపరచారు. అతని సమక్షంలో కూడా ఆ బాలుడు అదే సమాధానమిచ్చాడు. ‘మరయితే ఆ దీనార్లు ఎక్కడ?’ అడిగాడు ముఠా నాయకుడు. ‘చంక క్రింది భాగంలో చొక్కా లోపలి జేబులో కుట్టబడి ఉన్నాయి’ తడుముకోకుండా చెప్పాడు ఆ సత్యసంధుడు. జేబును కత్తిరించి చూస్తే సరిగ్గా నలభై దీనార్లు ఉన్నాయి. దొంగల ముఠా ఆశ్చర్యపోయింది. ‘నా దగ్గర ఏమీ లేదని చెప్పి ఉంటే నీ దీనార్లు సురక్షితంగా ఉండేవి కదా!’ సందేహంగా అడిగాడు ముఠా సర్దారు.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవద్దని మా అమ్మ నాకు గట్టిగా తాకీదు చేసింది. నేను నా అమ్మ మాటను జవదాటను’ అని నిస్సంకోచంగా జవాబిచ్చాడా ముద్దుబిడ్డ. హజ్రత్ అబ్దుల్ ఖాదిర్(రహిమహుల్లాహ్) గారి సమాధానం ఆ బందిపోటు నాయకుని గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. ఈ బాలుడు కేవలం అమ్మమాటను జవదాటలేకపోయాడు. మరి మేము చూస్తే మమ్ముల్ని పుట్టించిన, పోషిస్తున్న అల్లాహ్ ఆజ్ఞలనే అనుదినం ఉల్లంఘిస్తూ అమాయకులను వేధిస్తున్నామే! అని ఆ దొంగల ముఠా ఆలోచనలో పడింది. ఆ విధంగా ఆ ముఠా వారంతా నిష్కల్మషమైన మనసుతో పశ్చాత్తాపం చెంది దోచుకున్న సామగ్రినంతటినీ ఆ బిడారు వారికి తిరిగి ఇచ్చేశారు. భవిష్యత్తులో అల్లాహ్ ఆయన ద్వారా చేయించుకోదలచిన ఘనకార్యాలకు ఒక చిహ్నంగా సంభవించిన సంఘటన అది!

సుమారు 18ఏళ్ళ ప్రాయంలో ఆయన ‘బుగ్దాద్’ పట్టణానికి చేరుకున్నారు. అది హిజ్రీ 488వ సంవత్సరం. సరిగ్గా ఆ సంవత్సరమే ఇమామ్ గజాలీ (రహిమహుల్లాహ్) అనే ప్రముఖ విద్వాంసులు సత్యాన్వేషణకై, విశ్వాస ప్రాప్తికై బుగ్దాద్ కు వీడ్కోలు చెప్పారు. ఒక గొప్ప ధర్మవేత్తను పోగొట్టుకున్న పట్టణంలో మరో గొప్ప సంస్కర్త అడుగు పెట్టడం కాకతాళీయంగానే జరిగినా అది దైవలీల అనడం సబబు!

హజ్రత్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఏకాగ్రచిత్తంతో విద్యాభ్యాసంలో నిమగ్నులయ్యారు. ఆరాధనలు, కఠోర పరిశ్రమల వైపు మనసు మొగ్గు చూపినప్పటికీ విద్యార్జన విషయంలో ఏ మాత్రం అలసత్వం కనపరచలేదు. ఏ విద్యనైనా నిష్ణాతులైన పండితుల దగ్గర నేర్చుకోవాలన్నది ఆయన అభిమతం. అందులో ఆయన కృతకృత్యులయ్యారు కూడా.

గ్రంథ జ్ఞానాన్ని, మహాప్రవక్త ప్రబోధనల సారాన్ని ఆకళింపు చేసుకుని, ఇస్లామీయ షరీయత్ స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న మీదట (హిజ్రీ 496లో) ఆయన కర్తవ్యానికి ఉపక్రమించారు. ఒకే సమయంలో మూడు రంగాలలో ప్రవేశించి అవిశ్రాంత పోరాటాన్ని సాగించారు. ఆ మూడు రంగాలు ఏవంటే 1) సందేశ ప్రధానమైన సభలు 2) గ్రంథజ్ఞానంతో కూడిన పాఠాలు 3) ఉపదేశాలు, శిక్షణలతో కూడిన సదస్సులు.

ఈ మూడు ముఖ్యాంశాలతో కూడిన ఆయన సంస్కరణోద్యమం దిన దిన ప్రవర్థమానమయింది. అలనాడు బాల్యంలో ఒక దొంగల ముఠా పశ్చాత్తాపం చెందడంతోనే ప్రారంభమైన ఆయన సంస్కరణా కార్యక్రమం ఇప్పుడు వ్యవస్థీకృతమైంది.

మార్గభ్రష్టత యొక్క చివరి అంచుల దాకా చేరిపోయిన వేలాది మంది తండోపతండాలుగా వచ్చి ఆయన సమక్షంలో పశ్చాత్తాపం చెంది ‘రుజుమార్గం’లో పయనించారు. ఆయన ప్రబోధనల్ని, ప్రసంగాలను వినడానికి వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో సదస్సులో కూర్చోవటానికి స్థలం దొరికేది కాదు. పరిస్థితిని గమనించిన శ్రేయోభిలాషులు పాఠశాల భవనాన్ని విస్తరింప జేశారు. అయినా సభాస్థలి జనంతో కిటకిటలాడేది. అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ ఆయన్ని తన కార్యం కోసం ఒక సంస్కర్తగా ఎన్నుకున్నాడు. ఆయన వ్యక్తిత్వం పట్ల ప్రజా బాహుళ్యంలో ఆకర్షణను కలిగించాడు. పెద్ద పెద్ద రాజుల, మంత్రుల సభలకు కూడా రాని ప్రజలు హజ్రత్ షేఖ్ గారి సభలంటే ఎగబడి వచ్చేవారు. ఆఖరికి ఆ కాలపు చక్రవర్తులు, మంత్రులు కూడా ఈ మహనీయుని సమావేశాలకు శ్రద్ధాభక్తులతో హాజరయ్యేవారు. అత్యంత అణకువతో సభల్లో కూర్చునేవారు. ఇక పండితులు, ధర్మవేత్తల సంగతి సరేసరి. ఆయన ప్రవచనాలను గ్రంథస్థం చేసే నిమిత్తం ఒక్కో సదస్సులో నాలుగేసి వందల లేఖకులు తేబడేవారని ప్రతీతి. ఈ సందేశ ప్రధాన కార్యక్రమం నలభై ఏళ్ళపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. సాధారణంగా సందేశ, సంస్కరణాత్మక ప్రసంగాలు వారంలో మూడు రోజులు ఇవ్వబడేవి.

ఆయన (రహిమహుల్లాహ్) స్వతహాగా మృదు స్వభావి. అత్యంత అణకువతో, వినమ్రతతో మెలగేవారు. ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్నారి బాలిక మాట్లాడదలచినా ఆయన నిలబడి ఓపికగా వినేవారు. వారు చెప్పిన పనిచేసేవారు. సాధ్యమైనంత వరకు పేదప్రజలతో, అగత్యపరులతో కలసి కూర్చునేవారు. వాళ్ళ బట్టలు ఉతికేవారు. వాళ్ళ తలలోని పేనుల్ని తీసేవారు. కాని తద్భిన్నంగా ఏ ప్రముఖ వ్యక్తి అయినా, అధికారి అయినా కలుసుకోవడానికి వస్తే వారి గౌరవార్థం లేచి నిలబడేవారు కాదు. ఎప్పుడైనా సమకాలీన ఖలీఫా ఆయన్ని కలుసుకోవడానికి వస్తే ఉద్దేశ్య పూర్వకంగా తన పీఠం వదలి ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఖలీఫా వచ్చి కూర్చున్న మీదట తన పీఠ స్థానానికి వచ్చేవారు. ఆ విధంగా అటు ఖలీఫాకీ అవమానం జరగకుండా, ఇటు తన ఆశ్రమమర్యాదకు కూడా భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడేవారు. ఆయన ఏనాడూ ఏ రాజ దర్బారుకు గానీ, ఏ మంత్రివర్యుని నివాసానికి గానీ వెళ్ళి తలుపు తట్టలేదు. అంతటి అభిమాన ధనులు హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ.

ఆయన్ని చూసినవారు, ఆయన సహచర్యంలో గడిపిన వారు గంటల కొద్దీ ఆయన గుణగణాలను మెచ్చుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా ఆయనలోని ఆత్మ విశ్వాసాన్ని, వినయవినమ్రతలను, త్యాగ నిరతిని, దాతృ స్వభావాన్ని, ఉత్తమ నైతిక సుగుణాలను గురించి అమితంగా అభివర్ణిస్తుంటారు. ఎక్కువ వయసు గల ఒక పెద్ద మనిషి, అనేక మంది సంస్కర్తలను, ప్రముఖులను కలుసుకున్న పండు ముసలి (హరాదా) హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి సహచర్యంలో కూడా కొంత కాలం గడిపారు. హజ్రత్ షేఖ్ గురించి ఆ వ్యక్తి ఇలా అంటున్నారు –

“నా కళ్ళు హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ కన్నా ఎక్కువ నీతిమంతుణ్ణి, ఉదారవాదినీ, దయాశీలుడ్ని, మృదుత్వం గల వాడినీ, ప్రేమ మయుణ్ణి, సత్సంబంధాలు ఏర్పరచుకునే వాణ్ణి చూడలేదు. ఆయన ఘనత వహించిన వారై ఉండి కూడా, విస్తృతమైన జ్ఞానం కలవారై ఉండి కూడా తన కన్నా తక్కువ స్థాయిగల వారిని ఆదరించేవారు. పెద్దలను గౌరవించేవారు. ‘సలాం’ చేయడంలో ముందంజ వేసేవారు. బలహీనులతో కలసి ఎక్కువ సేపు గడిపేవారు. పేదల సమక్షంలో అత్యంత వినమ్రంగా మెలగేవారు. మరి చూడబోతే ఆయన ఏనాడూ ఒక నాయకుని, శ్రీమంతుని గౌరవార్థం లేచి నిలబడలేదు. ఏ రాజుగారి గుమ్మంలో గానీ, ఏ మంత్రిగారి వరండాలో గానీ అడుగు పెట్టలేదు.”

అల్ ఇమాముల్ హాఫిజ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ యూసుఫ్ అల్ బజాలీ అలా షబీలి గారు షేఖ్ జీలానీ గురించి ఇలా అంటున్నారు –

“ఆయన సున్నిత మనస్కులు. (గుణపాఠం గరిపే సంఘటనను గానీ, బాధాకరమైన విషయాన్ని గానీ వింటే) కళ్ళల్లోంచి అశ్రుధార ప్రవహించేది. ఎల్లప్పుడు ధ్యానంలో యోచనలో లీనమై ఉండేవారు. దయార్ద్రహృదయులు. మృదుత్వంలో, పారదర్శకతలో, దానధర్మాలలో, పాండిత్యంలో, ఉత్తమ నైతికతలో, ఆరాధనలలో, కఠోర పరిశ్రమలో ఆయన సాటిలేని మేటి.”

ముఫ్తీ ఇరాఖ్ మొహియుద్దీన్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ హామిద్ అల్ బుగ్దాదీ ఇలా వ్రాస్తున్నారు.

“(హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ) అపసవ్యమైన, అసమంజసమైన వాటికి అత్యంత దూరంగా, సవ్యమైన సమంజసమైన వాటికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అల్లాహ్ ఆజ్ఞలు, అల్లాహ్ విధించిన హద్దుల విషయంలో ఎక్కడైనా సరే ఉల్లంఘన జరిగితే ఆయన ఆగ్రహం చెందేవారు. స్వవిషయంలో ఆయనకు ఎన్నడూ కోపం వచ్చేది కాదు. సర్వోన్నతుడైన అల్లాహ్ విషయంలో తప్ప మరే విషయంలోనూ ఎవరి పైనా ప్రతీకారం తీర్చుకునేవారు కాదు. అడిగిన వారిని వట్టి చేతులతో తిప్పి పంపేవారు కాదు. ఆఖరికి తాను ధరించి ఉన్న చొక్కాను ఇవ్వవలసి వచ్చినా సరే వెనుకాడే వారు కాదు.”

ఆకలిగొన్న వారికి అన్నం పెట్టేవారు. అగత్యపరులపై లెక్కలేకుండా ఖర్చుపెట్టే అలవాటు ఉండేది. ఆయన ఇలా అంటూ ఉండేవారని అల్లామా ఇబ్నుల్ ఖుబార్ వ్రాస్తున్నారు. “ఒకవేళ యావత్ప్రపంచ ధనం నా అధీనంలో ఉన్నా దాన్నంతటినీ ఆకలి గొన్న వారికై వెచ్చిస్తాను.” ఇంకా ఇలా అంటుండేవారు: “నా అరచేతికి బెజ్జం ఉందేమోననిపిస్తోంది. ఏ వస్తువూ ఇందులో నిలవదు. వెయ్యి దీనార్లు నా దగ్గరకు వచ్చినా ఒక్క రాత్రి కూడా నా వద్ద ఉండవు” వేరొక చోట ఇలా వ్రాయబడింది : “రాత్రి భోజనం నిమిత్తం విశాలమైన పంక్తుల్ని ఏర్పరచమని ఆయన తరఫున ఆజ్ఞాపించబడేది. ఆయన స్వయంగా అతిథులతో కలిసి భుజించేవారు. నిరాధార జీవులతో, నిరుపేదలతో కలసి కూర్చునేవారు. విద్యార్థుల సుదీర్ఘమైన ప్రశ్నలను ఓపికగా వినేవారు. ఆయన్ని కలుసుకున్న ప్రతి వ్యక్తి ఆయన తననే అందరికన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారని తలపోసేవాడు. సహచరులలో ఎవరైనా, ఏనాడైనా రాకపోతే అతని ఆరోగ్యస్థితిని గురించి వాకబు చేసేవారు. అనుబంధం ఆత్మీయతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. తప్పు చేసిన వారిని మన్నించేవారు. లోపాలు గల వారి యెడల సడలింపుల వైఖరిని అవలంబించేవారు. ఎవరయినా ఏదైనా విషయంలో ప్రమాణం చేస్తే దాన్ని సమ్మతించేవారు. ఆ విషయానికి సంబంధించిన వాస్తవం తనకు తెలిసిపోయినా దాన్ని రహస్యంగానే ఉంచేవారు.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి అద్భుతాలు అసంఖ్యాకం. ఈ అద్భుతాల విషయంలో చరిత్రకారుల్లో కూడా ఏకాభిప్రాయం ఉంది. షేఖుల్ ఇస్లాం అజీజుద్దీన్ బిన్ అబ్దుస్సలాం, ఇమామ్ ఇబ్నె తైమియా వంటి అగ్రశ్రేణి విద్వాంసులు ఏమంటున్నారో చూడండి.

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి అద్భుతాలు తారస్థాయికి చేరుకున్నాయి. వాటిల్లో అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమిటంటే ఆయన మృత హృదయాలలో జీవం పోశారు. అల్లాహ్ ఆయన మాటల్లో ఆకర్షణని పొందుపరచి తద్వారా లక్షలాది మంది మానవులకు సరికొత్త విశ్వాస ప్రదమైన జీవితాన్ని ప్రసాదించాడు. ఆయన ఉనికి ఇస్లాం కొరకు ఓ వరంలా పరిణమించింది. అది మనసుల మరుభూమిలో కొత్త ప్రాణం పోసింది. అది ఇస్లాం జగత్తులో విశ్వాసం మరియు ఆధ్యాత్మికతలకు సంబంధించిన ఓ కొత్త ప్రభంజనాన్ని పుట్టించింది.

షేఖ్ ఉమర్ కేసాని ఇలా అంటున్నారు: “ఆయన ప్రసంగించే సభలలో ఒక యూదుడు గానీ, ఒక క్రైస్తవుడు గానీ ఇస్లాం స్వీకరించకుండా ఉండలేకపోయేవాడు. హంతకులు, నేరప్రవృత్తిగల వారు ఆయన చెంతకు వచ్చి పశ్చాత్తాపం చెందకుండా ఉండలేకపోయేవారు. విశ్వాసపరంగా పెడత్రోవ పట్టి ఉన్నవాడు ఆయన ప్రసంగాన్ని విని పశ్చాత్తాప భావంతో కుంచించుకుపోయేవాడు.”

హజ్రత్ జీలానీ గారు ఒక రోజు తనతో ఇలా చెప్పారని జబాయి వివరించారు: “గడచిపోయిన కాలంలో మాదిరిగా ఎడారి ప్రాంతంలో, కొండలు కోనల్లో ఉండాలనినాకనిపిస్తోంది. ప్రజలు నన్ను గానీ, నేను ప్రజలను గాని చూడకుండా ఏకాంతంలో ఉండాలన్నది నా మనోరథం. కాని అల్లాహ్ కు తన దాసుల ప్రయోజనం ఇష్టకరం అయింది. నా చేతుల మీదుగా అయిదు వేల మంది యూదులు, క్రైస్తవులు ఇస్లాం స్వీకరించారు. ఒక లక్ష కన్నా ఎక్కువ మంది నేరస్థులు, మాంత్రికులు నా సమక్షంలో పశ్చాత్తాపం (తౌబా) ప్రకటించారు. ఇది అల్లాహ్ మహదానుగ్రహం.”

బుగ్దాద్ వాసులలో చాలా మంది ఆయన ద్వారా పశ్చాత్తాప భాగ్యం పొందారని చరిత్రకారులంటారు. అనేక మంది యూదులు, క్రైస్తవులు వారి సంబంధీకులు కూడా ముస్లిములయ్యారని వారు పేర్కొంటున్నారు.

ధర్మపీఠం పై ఆసీనులై ఆత్మ శుద్ధి కార్యక్రమాలలో అహోరాత్రులు నిమగ్నులై ఉన్నప్పటికీ, బోధనాంశాలను, విశ్వాసాల సంస్కరణను, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాల పరివ్యాప్తిని ఆయన ఏ మాత్రం విస్మరించలేదు. విశ్వాసాలు, సూత్రాల పరంగా ఆయన ఇమామ్ అహ్మద్ ను అనుసరిస్తూనే ముహద్దిసీన్ (హదీసువేత్తల)ను ఫాలో అయ్యేవారు. ఆయన ద్వారా అహ్లె సున్నత్ మరియు సలఫీ వర్గీయులకు ఎంతో ప్రోత్సాహం లభించింది. అదే సమయంలో ధర్మంలో కొత్త పుంతలు తొక్కి అపమార్గాన పోదలచిన వారి కార్యకలాపాలకు కళ్ళెం పడింది.

పాఠశాలలో ఖుర్ఆన్ భావాన్ని విడమరచి చెప్పేవారు. హదీసు పాఠమిచ్చేవారు. ధర్మసందేహాలను తీర్చేవారు. దైనందిన జీవితానికి ధర్మసూత్రాల అన్వయింపు విషయంలో నలుగురు ఇమాముల మధ్య గల భిన్నాభిప్రాయాలను విశ్లేషించేవారు. ఇన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా మధ్యాహ్న సమయంలో శాస్త్రోక్తంగా ఖుర్ఆన్ పారాయణం నేర్పేవారు. ఇదిగాక ధర్మాసన (దారుల్ ఇఫ్తా) బాధ్యతలు అదనంగా ఉండేవి. సర్వసాధారణంగా షాఫయి, హంబలీ విధానం ప్రకారం ధార్మిక తీర్పులు ఇచ్చేవారు. ఇరాఖ్ పండితులు ఆయన తీర్పులకు ఆశ్చర్యచకితులై ప్రశంసల వర్షం కురిపించేవారు.

ఒకసారి ఆయన వద్దకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. దాని ప్రకారం ఒక వ్యక్తి విచిత్రమైన ఒట్టేసుకున్నాడు. “తాను విశిష్టమైన రీతిలో అల్లాహ్ ఆరాధన చేస్తాననీ, తాను ఆ సమయంలో చేసే ఆరాధనలో తాను తప్ప మరెవరూ భాగస్థులుగా ఉండరాదని సంకల్పించుకున్నాడు. ఒకవేళ తాను గనక ఈ ఆరాధనను చేయలేని పక్షంలో తన భార్యకు మూడు విడాకులు ఇచ్చేసినట్లే” – ఇదీ అతని ప్రతిజ్ఞ యొక్క సారాంశం. ముఫ్తీలంతా మీమాంసలో పడిపొయ్యారు. అతను ఆరాధన చేస్తున్నప్పుడు అలాంటి ఆరాధన చేసే మరో వ్యక్తి ఎవరూ భూమండలంలో ఉండకూడదంటే ఇది చాలా జఠిలమైన ప్రశ్నే మరి. హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) వద్దకు ఈ కేసు వచ్చింది. ఈ చిక్కుముడిని ఆయన చాలా తేలిగ్గా విప్పేశారు. కాబాలో ‘తవాఫ్’ చేసే స్థలాన్ని ఆ వ్యక్తి కొరకు పూర్తిగా ఖాళీ చేయించాలనీ, కాబా ప్రాంగణంలో ఏ ఒక్కరూ లేని ఆ సమయంలో అతను ఒంటరిగా ఏడుసార్లు ప్రదక్షిణను పూర్తి చేయాలని, ఆ విధంగా అతను పూనిన ప్రతిన నెరవేరుతుందని షేఖ్ జీలానీ (రహిమహుల్లాహ్) తీర్పు చెప్పారు. ఈ తీర్పు విని పండితులంతా ఆనందంతో, ఆశ్చర్యంతో పరవశించిపోయారు. నిజమే. ఈ చిక్కుముడికి ఇంతకన్నా చక్కని పరిష్కారం ఉండదు మరి. ఎందుకంటే భూమండలంలో ఒక్క కాబా గృహం వద్ద మాత్రమే ‘తవాఫ్’ అనే ఆరాధన జరుగుతుంది. ఆ తవాఫ్ స్థలాన్ని ఆ వ్యక్తి కొరకు కాస్సేపు ప్రత్యేకంగా కేటాయించబడింది. అప్పుడతను ఒంటరిగా తవాఫ్ చేసి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.

స్థిరత్వం విషయంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కదలని కొండలాంటి వారు. ధర్మ మార్గంలో ఆయన కనబరచిన శ్రద్ధాభక్తులు ఆయన్ని వేదాంతం యొక్క ఉన్నతస్థాయికి చేర్చాయి. సత్యాసత్యాల మధ్య, వెలుగు చీకట్ల మధ్య, దివ్యప్రేరణ – పైశాచిక ప్రేరణల మధ్య గల వ్యత్యాసాన్ని ఆయన ఇట్టే పసిగట్టేవారు. షరీఅతె ముహమ్మదీలో గానీ, హలాల్ హరాంలకు సంబంధించిన ఆదేశాలలో గానీ ప్రళయకాలం వరకూ ఎలాంటి మార్పులు ఉండవనీ, దీనికి వ్యతిరేకంగా వాదించేవాడు షైతానుకు ప్రతిరూపమన్న సత్యాన్ని ఆయన గ్రహించారు. ఆయన స్వయంగా ఇలా అన్నారు – ఒకసారి ఒక ఉజ్వలమైన కాంతి ప్రస్ఫుటమయ్యింది. దాంతో ఆకాశపుటంచులు కూడా వెలుగుమయమైనాయి. దాన్నుండి ఒక ఆకారం ప్రత్యక్షమయి “ఓ అబ్దుల్ ఖాదిర్! నేను నీ ప్రభువును. నేను నీ కొరకు నిషిద్ధం (హరాం) గా ఉన్న వాటన్నింటినీ ధర్మ సమ్మతం (హలాల్) గావించాను” అని నాతో అన్నది. “శాపగ్రస్తుడా! నాకు దూరమైపో” అని నేనన్నాను. అంతే! ఆ వెలుగు కాస్తా చీకటిగా మారిపోయింది. ఆ ఆకారం పొగలా అయిపోయింది. అప్పుడే మరో ధ్వని వినిపించింది – “అబ్దుల్ ఖాదిర్ ! అల్లాహ్ నిన్ను నీ జ్ఞానం మరియు మనో నేత్రం మూలంగా రక్షించాడు. లేకుంటే ఏం చేసేవాడినో తెలుసా?! ఇప్పటికే 70మంది సూఫీలను అపమార్గం పట్టించాను!” అల్లాహ్ నా పై దయచూపాడని నేనన్నాను. “హజ్రత్! వాడు షైతాన్ అని మీకెలా తెలుసు?” అని ఎవరో అడిగితే, “హరాం వస్తువులన్నింటినీ నీ కొరకు హలాల్ చేశానని అనగానే ఇది షైతాన్ ఎత్తుగడ మాత్రమే అని నాకు తెలిసిపోయింది” అన్నారు ఆ మహనీయులు.

ఇంకా ఆయన ఇలా ఉపదేశించారు :

“ఒకవేళ అల్లాహ్ హద్దులలో (షరియత్ ఆజ్ఞలలో) ఏదేని ఒక హద్దు మీరుతున్నట్టు మీకనిపిస్తే మీరు కఠినాతి కఠినమైన పరీక్షకు లోనయ్యారని, షైతాన్ మీతో ఆడుకుంటున్నాడనీ తెలుసుకోండి. అప్పుడు వెంటనే షరియత్ వైపుకు (పశ్చాత్తాపభావంతో) మరలండి. షరీయత్ను గట్టిగా పట్టుకోండి. మనోవాంఛలకు ధీటుగా జవాబివ్వండి. ఎందుకంటే షరీయత్కు సమ్మతం కాని ప్రతి సత్యమూ సత్యం కాదు, అది మిథ్యమాత్రమే.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) బుగ్దాద్లో 73 ఏళ్ళు గడిపారు. అబ్బాసీ ఖలీఫాలలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒకరి తరువాత ఇంకొకరు సింహాసనం అధిష్టించారు. ఈయన గారు బుగ్దాద్లో తేజరిల్లినపుడు ముస్తజహర్ బిల్లాహ్ అబుల్ అబ్బాస్ (హిజ్రీ 512) ఖలీఫాగా ఉన్నాడు.

షేఖ్ (రహిమహుల్లాహ్) గారి హయాం అనేక చారిత్రక ప్రాముఖ్యం గల సంఘటనలతో నిండి ఉంది. సల్జూఖీ పరిపాలకులకు అబ్బాసీ ఖలీఫాలకు మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. అబ్బాసీ సామ్రాజ్యం పై పట్టు సంపాదించడానికి వాళ్ళు ఎడతెగకుండా పోరాడేవారు. ఒక్కోసారి ఖలీఫా సమ్మతితో కయ్యానికి కాలు దువ్వితే, మరోసారి ఖలీఫా సుముఖంగా లేక పోయినప్పటికీ తగవుకు సిద్ధమయ్యేవారు. మరికొన్ని సార్లయితే ఖలీఫా సైన్యానికి – సుల్తాన్ సైన్యానికి మధ్య పోరు జరిగి రక్తపుటేరులు ప్రవహించేవి.

ఇలాంటి సంఘటనలు ఖలీఫా ముస్తర్షద్ కాలంలో ఎన్నో జరిగాయి. అబ్బాసీ ఖలీఫాలలో అత్యంత పరాక్రమశాలి ముస్తర్షద్. ఈ సంఘర్షణలలో చాలాసార్లు ఇతనిదే పైచేయి అయింది. కాని హిజ్రీ శకం 519లో సుల్తాన్ మసూద్ తో జరిగిన యుద్ధంలో ముస్తర్షద్ కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ యుద్ధం గురించి ఇబ్నె కసీర్ ఇలా వ్రాశారు:

“సుల్తాన్ సైన్యానికి విజయం వరించింది. ఖలీఫా బంధించబడ్డాడు. బుగ్దాద్ ఆస్తులన్నీ లూటీ చేయబడ్డాయి. ఈ వార్త ఇతర రాష్ట్రాలకు దావానలంలా వ్యాపించింది. అత్యంత విషాదకరమైన ఈ వార్త విని బుగ్దాద్ పురం పరాభవ భావంతో కుంచించుకుపోయింది. అక్కడి పౌరుల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ప్రజలు దిక్కుతోచని స్థితికి లోనయ్యారు. వాళ్ళు మస్జిద్ ల లోని వేదికలను సయితం కూల్చివేశారు. సామూహిక ప్రార్థనల్లో పాల్గొనడాన్ని మానేశారు. మహిళలు వీధుల్లో కొచ్చి ఏడ్పులు పెడబొబ్బలు పెట్టసాగారు. రాజ్యంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా బుగ్దాద్ వారినే అనుసరించసాగారు. ఈ అరాచకం దేశమంతా ప్రబలిపోయింది. పరిస్థితులను గమనించిన సంజర్ రాజు తన భ్రాతృజుని హెచ్చరిస్తూ ఖలీఫాను విడిచిపెట్టమని ఆదేశించాడు. మసూద్ ఈ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఖలీఫాను విడిచిపెట్టాడు. కాని బాతినీ వర్గీయులు బుగ్దాద్ మార్గంలో ఖలీఫాను హత మార్చారు”.

విషాదకరమైన ఈ పరిణామాలన్నీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్)కాలంలోనే సంభవించాయి. ముస్లింల మధ్యగల అనైక్యతను, అంతర్యుద్ధాన్ని, పరస్పర వైరభావాన్ని ఆయన కళ్ళారా వీక్షించారు. ప్రాపంచిక వ్యామోహంలో, పదవుల పందేరంలో, అధికార దాహంలో పడి ప్రజలు ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడకపోవడాన్ని ఆయన చూశారు. రాజ్యాలను, పట్టణాలను వశపరచుకునేందుకు వాళ్ళు ఎంతటికైనా తెగించడాన్ని చూసి ఆయన చలించిపోయారు.

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఈ గడ్డు పరిస్థితులకు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన లోలోపల కుమిలిపోతుండేవారు. ఈ పరిస్థితులే ఆయన్ని మరింతగా రాటు దేల్చాయి. మొక్కవోని సాహసంతో, దృఢ చిత్తంతో ఆయన సంస్కరణకు నడుం బిగించారు. ప్రజల దృష్టిని విద్యా శిక్షణల వైపుకు, సందేశ ప్రధాన కార్యకలాపాల వైపుకు మరల్చారు. ఆత్మశుద్ధి యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించేలా చేశారు. కాపట్యం, ప్రాపంచిక వ్యామోహాల స్థానంలో విశ్వాస చైతన్యాన్ని మేల్కొలిపారు. అశాశ్వితమైన ప్రాపంచిక జీవితం బదులు శాశ్వితమైన పరలోక జీవితం పట్ల ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. సభ్యతా సంస్కృతులు, నైతికత, స్వచ్ఛమైన ఏకదైవారాధన, పరిపూర్ణమైన చిత్తశుద్ధి వంటి వాటిని తన సందేశానికి ప్రధానాంశాలుగా తీసుకున్నారు.

హజ్రత్ షేఖ్ గారి ప్రసంగాలు ప్రజల హృదయాలపై విద్యుత్ ప్రభావం చూపేవి. ఇప్పటికీ ఆయన ప్రసంగాలను చదువుతున్నప్పుడు ఆ ప్రభావం కనబడుతూ ఉంటుంది. “ఫుతూహుల్ గైబ్”, “ఫుయూజె యజ్దానీ”, “ఫతహుర్రబ్బానీ” వంటి గ్రంథాలలో గల ఆయన ప్రసంగ భాగాలను, ఉపదేశాలను చదువుతున్నప్పుడు కళ్ళుచెమర్చుతాయి. కొన్ని శతాబ్దాలు గడచిపోయినా ఆ పలుకులు నిత్య నూతనంలా, నేటి రుగ్మతలకు దివ్య ఔషధంలా తోస్తాయి.

ప్రవక్తల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న పుణ్య పురుషుల ఉపదేశాల వలె ఈయన గారి ఉపదేశాలు కూడా ప్రేక్షకుల, పాఠకుల అవసరాలకనుగుణంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రజలు ఏ రుగ్మతలకు లోనై ఉండేవారో, మరే అపార్థాలకుగురై ఉండేవారో వాటినే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ స్పర్శించేవారు. అందుచేతనే ప్రజలు ఆయన ప్రసంగాలలో తమ గాయానికి కావలసిన లేపనాన్ని, తమ రోగానికి తగిన మందును, తమ అపార్థాలను పటాపంచలు చేసే సమాధానాన్ని పొందేవారు. ఆయన ప్రసంగాలు ప్రజా బాహుళ్యం లోకి చొచ్చుకుపోయి, ఆదరణ పొందడానికి ప్రధాన కారణం ఇదే మరి. అదే గాక ఆయన నోటితో ఏది పలికినా అది హృదయపు లోతుల్లోంచి వచ్చేది. అందుకే ఆయన మాటలు ప్రజల హృదయ కవాటాలను తట్టేవి. ఆయన పలుకుల్లో ఒకే సమయంలో – కరకుదనంతో పాటు, కరుణారసం కూడా తొణకిసలాడుతుండేది. “మహనీయుల” ప్రవచనానికి ఉండే ముఖ్య చిహ్నం ఇదేమరి.

ఒకసారి కొంతమంది ఆయన దగ్గరకొచ్చి మీ మాటలు చాలా కరకుగా ఉంటున్నాయనీ, కాస్త మృదువుగా ఉంటే బావుంటాయని సలహా ఇవ్వగా ఆయన ఇలా స్పందించారు : “మురికి బాగా పేరుకుపోయింది. గట్టిగా తోమితే గానీ అది తొలగదు మరి”.

మరో సందర్భంలో ఆయన ఈ విధంగా చెప్పారు.

“మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ధర్మ గోడలు ఒక దాని తరువాత ఒకటి పడిపోతున్నాయి. దాని పునాది కదలిపోతోంది. ఓ భూవాసులారా! రండి, పడిపోయిన దాన్ని ప్రతిష్ఠించి పటిష్టం చేద్దాం. బీటలు వారుతున్న దానికి మరమ్మత్తు చేద్దాం. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. (అందరూ కలిసి చేయవలసిన పని ఇది) ఓ సూర్య చంద్రులారా! ఓ పగలూ!! మీరందరూ రండి” (ఫుయూజె యజ్దానీ)

ధర్మసంస్థాపన కొరకు, ధార్మిక పునరుజ్జీవనం కొరకు షేఖ్ అబ్దుల్ ఖాదిర్జీలానీ ఎంతగా పరితపించేవారో పై మాటలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా ఎప్పుడు ప్రసంగానికి ఉపక్రమించినా తొలుత దివ్యఖుర్ఆన్లోని ఈ క్రింది వచనాన్ని పఠిస్తూ ఉండేవారు :

“హు వల్లజీ అర్సల రసూలహూ బిల్ హుదా వ దీనిల్ హఖ్కి లియుజ్ హిరహు అలద్దీని కుల్లిహీ”

ఈ వచనం దివ్య ఖుర్ఆన్ లోని మూడు సూరాలలో (తౌబా సూరా, సఫ్ సూరా, ఫతహ్ సూరాలలో) ఉంది. ఈ ఆయతు పఠనానంతరం ఆయన సమకాలీన ఖలీఫా సంస్కరణ కోసం దుఆ చేసేవారు. ఈ రెండునూ ఆయన ముఖ్యాశయాన్ని చాటి చెబుతున్నాయి.

ఒకసారి ఖలీఫా ముఖ్తఫిల్ అమ్రుల్లాహ్ అన్యాయాగ్రేసరునిగా పేరుపడిన అబుల్ వఫా యహ్యా బిన్ సయీద్ ని బుగ్దాద్ న్యాయమూర్తిగా నియమించాడు. ఈ సంగతి తెలియగానే హజ్రత్ షేఖ్ (రహిమహుల్లాహ్) వేదికపై నుండే ఖలీఫాను ఉద్దేశ్యించి ఇలా అన్నారు:

“నీవు పెద్ద దౌర్జన్య పరుడైన వ్యక్తిని ముస్లింలపై బలవంతాన రుద్దావు. రేపు ప్రళయ దినాన దయామయుడైన విశ్వప్రభువుకు ఏం సమాధానమిస్తావు?”

అత్యంత గంభీరమైన ఈ పలుకుల్ని విని ఖలీఫా వణికిపోయాడు. తక్షణం ఆ ఖాజీని పదవీచ్యుతుడ్ని చేశాడు.

ఆయన బుగ్దాద్ పట్టణంలోని అన్ని వర్గాలకూ పేరు పేరునా పిలుపు ఇచ్చారు. వారిని హెచ్చరించారు. వారిలో ప్రతి ఒక్క వర్గానికీ సత్యధర్మ సందేశాన్ని అందించేందుకు అవిరళ కృషి సలిపారు. వాటన్నింటినీ ఇక్కడ పేర్కొనే అవకాశం లేదు. ఉదాహరణకు బుగ్దాద్ వాసులందరినీ ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఏమన్నారోచూడండి –

“ఓ బుగ్దాద్ వాసులారా! మీలో కాపట్యం పెరిగిపోయింది. చిత్తశుద్ధి సన్నగిల్లి పోయింది. మాటలు పెరిగిపోయాయి. చేతలు తగ్గిపోయాయి. ఆచరణా శూన్యమైన మాటలు నిష్ఫలమని, పైగా ఇది మీకు వ్యతిరేకంగా పరిణమించే ఒక ఆధారమని తెలుసుకోండి. ఆచరణా శూన్యమైన మాటఖర్చుపెట్టడానికి వీలులేని నిధి వంటిది. అది ఎలాంటి ఆధారంగానీ, సాక్ష్యంగానీ లేని బూటకపు దావా వంటిది. అది ప్రాణంలేని శరీరం వంటిది. వాస్తవానికి ప్రాణం ఎప్పుడు వస్తుంది? చిత్తశుద్ధితో మసలు కున్నప్పుడు! ఏకేశ్వరోపాసకులుగా వ్యవహరించినపుడు! దైవ గ్రంథాన్ని, దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించినపుడు! కాని ఈ స్ఫూర్తి మీ ఆచరణల్లో చాలా వరకు లోపించింది. అలసత్వాన్ని దరి చేరనివ్వకండి. అల్లాహ్ వైపుకు మరలండి. ఆయన ఆదేశాలను శిరసావహించండి. ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండండి”.(ఫుయూజె యజ్దానీ)

ఆయన సాధించిన ఘనకార్యాలలో అత్యంత ముఖ్యమైనవి రెండు. అవేమంటే 1) ఇస్లాం పునరుజ్జీవనానికి పాటు పడటం 2) ఇస్లాం జీవన విధానాన్ని సంస్థాపించటం. అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన ప్రత్యక్ష సహచరులతో మొదలయిన ఈ కార్యాన్ని హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ జీవితం లోని అంతిమ ఘడియల వరకు కొనసాగించారు. సమాజంలో సత్యధర్మంతో పొసగని ఏ పని జరగినా ఆయన కళవళపడిపోయేవారు. దీనికి సాక్ష్యం ఆయన గారి ఈ మాటలే! –

“ఈ చివరి కాలంలో ‘వంచన’ పరాకాష్టకు చేరుకుంది. కాగా; నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), సహాబా (రదియల్లాహు అన్హు) మరియు తాబయీన్ల విధానాన్ని పునఃప్రతిష్ఠించే ప్రయత్నంలో ఉన్నాను. ఈ అంతిమ కాలంలో దిర్హములు, దీనార్లు ప్రజల ఆరాధ్య దైవాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈనాటి ప్రజలు మూసా (అలైహిస్సలాం) అనుయాయులుగా తయారయ్యారు. మూసా జాతి ప్రజలు ‘దూడ’ను తయారుచేసుకుని పూజించగా, ఈనాటి ప్రజలు దీర్ఘములు, దీనార్లకు దాసులై కూర్చున్నారు. నీ వైఖరి కడు శోచనీయం! నువ్వీ ప్రాపంచిక రాజు నుండి ఆస్తి అంతస్తులను ఎలా ఆశిస్తున్నావు? త్వరలోనే పదవీచ్యుతుడైపోయే లేక చనిపోయేవాడిని నీవెలా నమ్ముతున్నావు? అతని రాజ్యం, ఐశ్యర్యం, అట్టహాసం – అన్నీ అతన్నుండి దూరమైపోయేవే కదా? ఎట్టకేలకు అతను అంధకారం, భీతి, ఏకాంతం, దుఃఖం, కీటకాలు మొదలగునవి రాజ్యమేలే గోరీలోకి వెళ్ళి నివాస మేర్పరచుకుంటాడు. అతడు రాజ్యాధికారం నుండి వినాశం వైపుకు ప్రస్థానం చేస్తాడు. ఆఁ! ఒకవేళ అతని వద్ద గనక సత్కర్మలుంటే, సంకల్ప శుద్ది ఉంటే సర్వోన్నత ప్రభువు అతన్ని తన అనుగ్రహంతో కప్పుకుంటాడు. అతన్నుండి సులభమైన లెక్కతీసుకుంటాడు. వీడిపోయే, చనిపోయే వానిపై భరోసా చేయకు సుమా! ఒకవేళ నువ్వీ ధోరణిని మానుకోకపోతే నీ ఆశలన్నీ నిష్ఫలమవుతాయి. నీకు లభించే సహాయం నిలిచి పోతుంది”.(ఫుయూజె యజ్దానీ)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ( రహిమహుల్లాహ్) తన ప్రసంగాలలో అల్లాహ్ ఏకత్వం గురించి నొక్కి చెబుతుండేవారు. బహుదైవోపాసన (షిర్క్) ను నిర్ద్వంద్వంగా ఖండించేవారు. ఉదాహరణకు ఆయన ప్రసంగంలోని ఒక భాగం ఈ విధంగా ఉంది:

“మిమ్మల్ని గమనిస్తూ ఉన్న వానిపై దృష్టిని కేంద్రీకరించండి. మీ ముందున్న వాని సన్నిధిలో ఉండండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వానిని మీరు ప్రేమించండి. మిమ్మల్ని పిలిచే వాని మాటను వినండి. మిమ్మల్ని పడిపోకుండా నిలిపి ఉంచిన వాని వైపుకు చేయి చాపండి. ఆయన మిమ్మల్ని అజ్ఞానాంధకారాల నుండి బయటకు తీస్తాడు, వినాశం నుండి కాపాడుతాడు. మలినాలను కడిగి మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తాడు. ఇంకా మిమ్మల్ని కుళ్ళు నుండి, దుర్గంధం నుండి, అధైర్యం నుండి, మానసిక దుష్ప్రేరణల నుండి, చెడు సహచర్యాల నుండి, అపమార్గం నుండి విముక్తుల్ని చేస్తాడు. మీ పైశాచిక కోర్కెలు, మూర్ఖ స్నేహితులున్నారే, వాళ్ళు అల్లాహ్ మార్గంలోని సౌలభ్యాలను, స్వచ్ఛమైన, ఇష్టకరమైన వస్తువులను మీ నుండి దూరం చేస్తున్నారు. ఎంతవరకీ బంధము? ఎప్పటి వరకీ అలవాటు? ఎన్నాళ్ళీ కోర్కెలు? ఎందాక ఈ పెత్తనం? ఏనాటి వరకీ అపసవ్యమైన పోకడలు? సర్వాన్నీ సృష్టించిన, సర్వాన్నీ మలచిన, ఆది, అంతం, గోచరం, అగోచరమైన అల్లాహ్ నువదిలేసి ఎక్కడి కెళుతున్నారు. మీరు? మనసుల ప్రేమ, ఆత్మల సంతృప్తి, బంధనాల విముక్తి, మన్నింపులు మేళ్ళు – ఇవన్నీ ఆయన వైపు నుండే ఉన్నాయి”. (రమూజుల్ గైబ్)

తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కు సంబంధించిన ఈ విషయాన్నే ఆయన మరో సభలో ఈ విధంగా చెప్పారు.

“ప్రాణులన్నీ నిస్సహాయమైనవి. వాటిలో ఎవరూ నీకు లాభం గానీ నష్టం గానీ చేకూర్చలేవు. కాకపోతే సర్వోన్నత ప్రభువు వారి ద్వారా వాటిని చేయిస్తాడు. నీ పాలిట మేలైనా కీడైనా, దానికి సంబంధించి అల్లాహ్ వద్ద లిఖిత పూర్వకమై పోయింది. ఇక దానికి భిన్నంగా జరగనే జరుగదు. ఏకేశ్వరోపాసకులు, సదాచార సంపన్నులైన వారు ఇతర ప్రాణులపై అల్లాహ్ తరపున ఒక నిదర్శనం వంటివారు. వీరిలో కొందరు బాహ్యపరం గానూ, అంతర్గతంగానూ ప్రపంచాన్ని ఏ మాత్రం లక్ష్య పెట్టరు. వారు ధనికులైనప్పటికీ వారి అంతరంగాన్ని ప్రపంచం ఏ మాత్రం వ్యామోహించదు. ఇదే అసలు నిష్కల్మషమైన హృదయం. ఎవరయితే ఈ స్థితికి చేరుకున్నాడో అతనికి ఐహిక సామ్రాజ్యం చేజిక్కినట్లే! అతడే వీరుడు, యోధుడు. అల్లాహ్ తప్ప మరొకరిని హృదయంలో జొరబడ నివ్వకుండా హృదయాన్ని కాపాడుకున్నవాడే సిసలైన యోధుడు. అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే హృదయ ద్వారం దగ్గర తౌహీద్ మరియు షరీఅత్ ల ఖడ్గాలను పట్టుకు నిలబడి ఉంటాడు. ప్రాణులలో ఎవరినీ అందులోకి ప్రవేశించనివ్వడు. తన మనసులను త్రిప్పే వాని పై మనసును కేంద్రీకరిస్తాడు. షరీఅత్ అతని బాహ్యానికి నాగరికతను నేర్పుతుంది. కాగా; అల్లాహ్ఏకత్వ భావన అతని ఆంతర్యాన్ని సంస్కరిస్తుంది”.(ఫుయూజె యజ్దానీ)

మిథ్యా దైవాలను గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన (రహిమహుల్లాహ్) ఇలాఅన్నారు

“ఈ రోజు నువ్వు నీ మనసును, సృష్టితాలను, నీ దీనార్లను, నీ ధిర్హంలను, నీ క్రయ విక్రయాలను, నీ పట్టణ అధికారిని నమ్ముకున్నావు. నీవు ఏఏ వస్తువులను నమ్ముకున్నావో అవి నీ ఆరాధ్య దైవాలవుతాయి. నీవు ఎవరికి భయపడతావో అతడు నీ దేవుడు. నీవు ఎవరిపై ఆశలు పెంచుకుంటావో అతడు నీ పాలిటి దైవం. నీకు లాభనష్టాలను కలిగించే వారెవరయినా సరే, వారిపై నీ దృష్టి పడినపుడు- నిజ ప్రభువు మాత్రమే వారి చేతుల మీదుగా ఇదంతా చేశాడని గనక నీవు తలపోసినట్లయితే అతడు నీ దైవం అవుతాడు.”(ఫుయూజె యజ్దానీ)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కాలంలో ముస్లింలలో ప్రధానంగా రెండు వర్గాల వారుండేవారు. వారిలో ఒక వర్గం ఆధ్యాత్మికంగా, నైతికంగా, ఆచరణల రీత్యా ఎంతో వెనుకబడి ఉండేది. అయితే ప్రాపంచికంగా అది అన్ని విధాలా సుసంపన్నంగా ఉండేది. దీనికి భిన్నంగా రెండవ వర్గం ఆర్థికంగా ఎంతో హీనస్థితిలో ఉండేది. ప్రగతీ వికాసాలకు చాలా దూరంగా దుర్భర స్థితిలో జీవితం గడిపేది. అయితే ఆధ్యాత్మికంగా, నైతికంగా, సదాచరణల రీత్యా ఉచ్ఛస్థితిలో ఉండేది. ధార్మిక రంగంలో ఎంతో ముందంజలో ఉన్న ఈ రెండవ వర్గం ప్రజలు ప్రాపంచికంగా కీర్తి శిఖరాలను చుంబిస్తున్న మొదటి వర్గం వారిని చూసి కించిత్ ఈర్ష్యకు లోనయ్యేవారు. తాము ఎందుకిలా అనామకులుగా, నిరాధార జీవులుగా వదిలివేయబడ్డామా! అని అప్పుడప్పుడు చింతిస్తుండేవారు. ఇలాంటి భగ్న హృదయాలను హజ్రత్ షేఖ్ (రహిమహుల్లాహ్) ఓదారుస్తూ ఉండేవారు. అల్లాహ్ వారికి ప్రసాదించిన మహదానుగ్రహాలను గుర్తు చేస్తూ ఈ ‘విచక్షణ’కు కారణమేమిటో విడమరచి చెప్పేవారు. ఆ విధంగా సత్యధర్మా వలంబీకులు నిరాశా నిస్పృహలకు గురి కాకుండా కాపాడేవారు. ఒకసారి ఇలాంటి భగ్న హృదయాలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు :

“రిక్త హస్తాలతో ఉన్న ఓ పేదవాడా! ప్రపంచం దృష్టిలో గుర్తింపుకు నోచుకోకుండా పోయిన నేస్తమా! ఆకలి దప్పులతో అలమటించే ఓ అనామకుడా! కట్టుబట్టలు లేని ఓ అభాగ్యుడా! మస్జిదుల నుండి, బంధుత్వాల నుండి, గడపలనుండి గెంటివేయబడే ఓ బడుగు జీవుల్లారా! ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడే వారలారా! ఆశల ఆరాటంలో జీవన పోరాటం సాగిస్తున్న ఓ మానవుడా! అల్లాహ్ నిన్ను దిక్కు మాలిన వానిగా చేశాడని దిగులు చెందకు. ప్రపంచాన్ని నీకు దూరం చేశాడనీ, నిన్ను తొక్కి పెట్టేశాడనీ, నిన్ను మరచిపోయాడనీ అనకు. అల్లాహ్ యే నీకు శత్రువుగా మారాడనీ, నిన్ను ఇక్కట్లకు లోను చేశాడని నిందించకు. అల్లాహ్ గౌరవోన్నతుల్ని ప్రసాదించలేదనీ, నిన్ను అనామకునిగా వదిలేశాడనీ, ప్రజా బాహుళ్యంలో, సాటి సోదరుల్లో నీకు పలుకుబడిని ప్రసాదించలేదని చెప్పకు. నా బదులు ఫలానా వాడిని అల్లాహ్ అపారంగా అనుగ్రహించాడనీ, ఆ అనుగ్రహాలతో అతడు అహోరాత్రులు తులతూగుతున్నాడనీ, అందరం ఒకే మాతాపితల (ఆదం- హవ్వాల) సంతానమైనప్పటికీ అల్లాహ్ ఫలానా వారికి నీ వారి పై శ్రేష్ఠత నొసగాడనీ అసూయ చెందకు. అల్లాహ్ నీ యెడల ఇలా ఎందుకు వ్యవహరించాడో తెలుసా?! నీ నేల స్వభావం విలక్షణమైనది. సత్యకారుణ్య వర్షాలు నీపై నిరంతరం కురుస్తున్నాయి. సహనం, ప్రసన్నత, నిశ్చయం, సానుకూలం, జ్ఞానం, విశ్వాసాల కాంతిరేఖలు నీ చుట్టు ప్రక్కలా ప్రసరిస్తున్నాయి. తత్ఫలితంగా నీ విశ్వాస వృక్షం, దాని వ్రేళ్ళు, విత్తనం యధాస్థానంలో పటిష్టంగా ఉన్నాయి. అది దిన దిన ప్రవర్థమానమవుతుంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. నీడనిస్తోంది. పై పైకి ఎదుగుతోంది. దాని పోషణ కోసం ఎరువుగానీ, నీరుగానీ వేయవలసిన అవసరం లేదు. ఈ విషయంలో సర్వోన్నతుడైన అల్లాహ్ నీ అభిమతానికి అతీతుడు (నీ అవసరాలేమిటో ఆయనకు బాగా ఎరుక). ఆయన పరలోకంలో నీ కొరకు ఉన్నతస్థాన మొసగాడు. పరలోకాన్ని నీకై ప్రత్యేకించాడు. నీ కొరకు ఆయన అక్కడ ప్రసాదించిన వరాలను ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు, ఏ మనిషి హృదయంలోనూ అవి సంచరించలేదు. “వారు చేసిన సత్కర్మలకు బదులుగా ఏ కన్నుల చలువ వారి కొరకు దాయబడి ఉందో ఏ ప్రాణికీ తెలియద”ని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే ప్రపంచంలో వీరు (అల్లాహ్ ) ఆదేశాలను పాటించారు. నిషిద్ధ విషయాలను పరిత్యజించారు. తమకు లభించిన దానిపై సంతుష్టులయ్యారు. అన్ని విషయాలలోనూ అల్లాహ్ అభీష్టంతో సమన్వయం చెందారు”.

“ఇకపోతే వారు, ఎవరికయితే అల్లాహ్ ప్రాపంచిక అనుగ్రహాలను ప్రసాదించాడో, ప్రాపంచిక సిరిసంపదలకు యజమానులుగా చేశాడో! అల్లాహ్ వారి యెడల ఈ వ్యవహారం ఎందుకు చేశాడంటే వారిలో “విశ్వాసం”(ఈమాన్) స్థానే ఇసుక మరియు రాతినేల ఉంది. అందులో నీరు ఆగటం, మొక్కలు మొలవడం, పంటలు పండటం అన్నది చాలా కష్టం. ఈ నేలపై ఎరువు వేయబడుతుంది తద్వారా మొక్కలు పెరగటానికి! ఈ ప్రాపంచిక ఎరువే వారి జీవన సామగ్రి. ఎరువు తదితర వస్తువులను ఈ నేల నుండి వేరు చేసినంతనే మొక్కలు ఎండిపోతాయి. పండ్లు వాడిపోయి రాలిపోతాయి. వారి కొంపలే కూలిపోతాయి. మరి చూడబోతే అల్లాహ్ వారి జీవితాలను తీర్చిదిద్ద దలుస్తున్నాడు”

“కనుక ఓ పేదవాడా! ధనవంతుని విశ్వాస వృక్షపు వ్రేళ్ళు అత్యంత బలహీనంగా ఉంటాయనీ, నీ విశ్వాస వృక్షానికి గల బలం అతని వృక్షానికి లేదని తెలుసుకో! అతని వద్ద నీకు కనిపిస్తున్న ధనం, ఇతరత్రా వస్తు సామగ్రిని గనక అతన్నుండి వేరుచేస్తే అతని విశ్వాస వృక్షం ఇట్టే ఎండిపోతుంది. పైగా అతనిలో తిరస్కార (కుఫ్ర్) భావం పొడసూపుతుంది. ఆఖరికి ఆ వ్యక్తి కపటులలోనో, ధర్మభ్రష్టులలోనో, సత్యతిరస్కారులలోనో చేరిపోతాడు. అయితే (ఒకవేళ) అల్లాహ్ ధనవంతుని వద్దకు ఓర్పు, నమ్మకం, జ్ఞానం, విజ్ఞతా వివేకాలను గనక పంపిస్తే, వాటి ద్వారా అతని విశ్వాసం మరింత పటిష్టమయితే ఇక అతనికి జంకు లేదు. ఐహిక అనుగ్రహాలు అతన్నుండి కొల్లగొట్టబడినప్పటికీ అతడు లెక్కచేయడు”. (రమూజుల్ గైబ్)

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) బోధనలలో కరడుగట్టిన సన్యాసత్వం కనిపించదు. ప్రాపంచిక అనుగ్రహాలను పొందరాదని, జీవితావసరాలను తీర్చుకోరాదని ఆయన ఎన్నడూ అనలేదు. అయితే ఈ ఐహిక సుఖాలకు మనిషి దాసోహం అనరాదనీ, ప్రాపంచిక సామగ్రి పట్ల అమితమైన వ్యామోహం పనికి రాదని మాత్రమే ఆయన ఉపదేశించారు. “నిస్సందేహంగా ప్రపంచం మీ కొరకు సృష్టించబడింది. (అంటే అది మీ సేవకురాలు). మీరు మాత్రం పరలోకం కొరకు సృష్టించబడ్డార”న్న మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనానికి ప్రతిబింబంగా ఉండేవి షేఖ్ జీలానీ(రహిమహుల్లాహ్) గారి ఉపదేశాలు. ఒక సందర్భంలో షేఖ్ (రహిమహుల్లాహ్) ఇలా బోధించారు:

“ప్రపంచంలో నీ కోసం రాసి పెట్టి ఉన్న నీ వాటాను అది కూర్చుని ఉండగా నీవు నిలబడి తినకు. పైగా రాజదర్బారులో అది తన తలపై పళ్ళెం పెట్టుకుని ఉండగా నీవు ఠీవీగా కూర్చుని తిను. నిజప్రభువు గడపపై నిలబడి ఉన్న వాడిని ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. ప్రాపంచిక గడపపై నిలబడి ఉన్న వాడిని ప్రపంచం అల్పదృష్టితో చూస్తుంది,అవమానిస్తుంది. కనుక అల్లాహ్ మార్గంలో ముందడుగు వేసి నిజప్రభువు ప్రసాదాన్ని భుజించు.” (ఫుయూజె యజ్దానీ)

వేరొక సందర్భంలో ఇలా నుడివారు :

“ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. జేబులో పెట్టుకోవచ్చు. సంకల్పశుద్ధితో దాన్ని కూడబెట్టవచ్చు. కాని మనసులో పెట్టుకోవటం మాత్రం తగదు. అది (నీ) గుమ్మం వద్ద నిలబడటం సమ్మతమే. గుమ్మం దాటిలోపల జొరబడటం మాత్రం సమ్మతమూ కాదు, నీ కొరకు గౌరవ ప్రదమూ కాదు.” (పుయూజే యజ్దానీ)

స్వప్రయోజనాల కోసం అధికార మదాంధులైన రాజుల పంచన చేరి, వారు చెప్పిన ప్రతి దానికీ డూడూ బసవన్నలా తలూపే పండితులను, భజన పరులైన ధర్మవేత్తలను షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఏ మాత్రం క్షమించలేదు. ఇలాంటి పండితుల, గురువులు ద్వంద్వ వైఖరిని నిర్దుష్టంగా ఖండించి కళ్ళు తెరిపించారు. ఎందుకంటే అవకాశవాదులైన ఈ పండితుల ఆశీర్వాదంతోనే సుల్తానులు చెలరేగిపోయేవారు. ఒక సందర్భంగా ఆస్థాన పండితుల్ని ఉద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు :

“విద్యలోనూ, ఆచరణల్లోనూ ద్రోహానికి పాల్పడే వారలారా! మీకు వీళ్ళతో ఏమిటి సంబంధం? అల్లాహ్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లతో శత్రుత్వం వహించే వారలారా! అల్లాహ్ దాసులను దోచుకునే వారలారా! మీరు స్పష్టమైన అన్యాయానికి, వంచనకు లోనై ఉన్నారు. ఈ వంచన ఎప్పటి వరకూ? ఓ పండితులారా! ఓ సాధువులారా! సుల్తానులు, చక్రవర్తుల మెప్పుకోసం ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు వంచించుకుంటారు? ప్రాపంచిక సిరిసంపదలను, భోగభాగ్యాల సామగ్రిని ఎంతకాలం వరకు వారి నుండి పొందుతుంటారు. మీరు, మీతో పాటు చాలా మంది ఏలినవారు అల్లాహ్ సొమ్ము మరియు ప్రజల విషయంలో అన్యాయస్థులుగా, ద్రోహులుగా తయారయ్యారు. అల్లాహ్! పంచకుల వైభవాన్ని పటాపంచలు చేసెయ్యి, వీళ్ళని పరాభవం పాలేసి, పశ్చాత్తాపం చెందే సద్బుద్ధినొసగు. దుర్మార్గులకోటను తత్తునియలు చేయి. ఈ ధరిత్రిని వీళ్ళ బారి నుండి పవిత్రం చెయ్యి. లేదా వీళ్ళను సంస్కరించు.” (ఫుయూజె యజ్దానీ)

వేరొక సందర్భంలో ఈ పండిత సమూహాన్ని ఉద్దేశించి ఇలా హెచ్చరించారు.

“నీలోని అత్యాశ నిన్ను ఈ దుర్మార్గులకు సేవకునిగా చేసి, నిన్ను అక్రమ సొమ్ము తినేలా చేసింది. ఇది నీకు సిగ్గుచేటు కాదా?! ఎన్నాళ్ళిలా హరాం సొమ్ము తింటావు? ఇప్పుడు నీవు చేస్తున్న చక్రవర్తుల ఊడిగం ఇంకెన్నాళ్ళు? వీళ్ళ రాజ్యాధికారం అతి త్వరలోనే అంతమై పోతుంది. నీవు ఎట్టి పరిస్థితిలోనూ నిజ ప్రభువు సన్నిధికి పోవలసి ఉంటుంది. ఆయనకు పతనమంటూ లేదు.” (ఫుయూజె యజ్దానీ)

ప్రజలు (ముఖ్యంగా బుగ్దాద్ ప్రజలు) ధార్మికంగా, నైతికంగా అధోగతికి లోను కావడం చూసి షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఎంతో కలత చెందేవారు. అదే సమయంలో ఇస్లాం జగత్తు అంతటా ముస్లింలు ధార్మికంగా అలసత్వానికి, ప్రమత్తతకు లోనై ఉండటం షేఖ్ గారిని కలిచి వేసింది. తన గుండెల్లో రేగే జ్వాలలను ఆయన అప్పుడప్పుడూ వ్యక్తపరచకుండా ఉండలేకపోయేవారు. ఆయనలోని ఈ దుఃఖ సాగరం ఆయన ప్రసంగాలలో పొంగి పొరలేది. ఒకసారి ఆయన తన ఆవేదనను ఈ విధంగా వ్యక్తపరచారు:-

“నీ హృదయం ఎంత కఠినంగా తయారయింది!? షికారు చేయటంలో, పంట పొలాలకు, పశువులకు కాపలాకాయటంలో తన యజమానిని కాపాడే విషయంలో కుక్క కూడా తన యజమాని శ్రేయాన్ని అభిలషిస్తుంది. అంతేకాదు, తన యజమానిని చూసి అది ఆనందంతో కేరింతలు కొడుతుంది. మరి చూడబోతే అతడు దాని తిండి కోసం పెద్దగా వ్యయపరచడు. ఆనక రెండు ముద్దల అన్నమో, రెండు మూడు రొట్టె ముక్కలో వేస్తాడు. కాని నీవు మాత్రం అల్లాహ్ ప్రసాదితమైన రకరకాల ఆహార పదార్థాలను ఆరగిస్తున్నావు. కాని నీవు ఆ అనుగ్రహాల పరమార్థాన్ని గ్రహించటం గానీ, వాటిని సద్వినియోగం చేసుకోవటం గానీ చేయటం లేదు. (పైగా) ఆయన ఆజ్ఞను జవదాటుతున్నావు. అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తున్నావు”.

ఆయన గారి విశిష్ట వ్యక్తిత్వం మూలంగాను, ఆయన విప్లవాత్మకమైన ప్రసంగాల ద్వారాను బుగ్దాద్ ప్రజలకు ఆధ్యాత్మికంగా, నైతికంగా ఎంతో ప్రయోజనం చేకూరిందన్న విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. వేలాది మంది జీవితాల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. అయినప్పటికీ అంతకు ముందు కొన్ని దశాబ్దాల నుంచీ ప్రజా జీవితాల్లో తిష్ఠవేసి ఉన్న కొన్ని అపసవ్యమైన పోకడలను సమూలంగా తుడిచిపెట్టడానికి, ఆపాదమస్తకం వారిలో ఆరోగ్యవంతమైన మార్పును తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిరంతరాయంగా శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఆనాడు ఎంతైనా ఉండేది. సాధారణంగా బహిరంగ సభలలో, ఇష్టాగోష్టులలో పాల్గొని వెళ్ళిపోయే వారు నిరంతర శిక్షణా నిబంధనలో ఉండరు. సభలలో పాల్గొన్న ప్రజలు సభలో ఉన్నంతసేపు ప్రసంగం విని వెళ్ళిపోతారు. ఆ తరువాత వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. అందుచేత వారిలో ధార్మిక, నైతిక భావాలు పెంపొందినప్పటికీ క్రమశిక్షణ, నియమ నిబద్ధతల వంటి విషయాల్లో ఎన్నో లోపాలుండేవి.

ఆనాటి పరిస్థితుల ప్రభావాన్ని కూడా చూడాలి. ముస్లిం జనాభా బాగా పెరిగింది. దైనందిన జీవిత సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమైపోయాయి. అలాంటి పరిస్థితులలో విద్యాలయాల ద్వారా సంస్కరణాత్మక కార్యక్రమం కొనసాగించటం దుర్లభమైపోయింది. ఎందుకంటే విద్యాలయాలనే సరికి అక్కడ కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. పాఠశాలల ద్వారా భారీ ఎత్తున ఆధ్యాత్మిక, నైతిక విప్లవాన్ని ఆశించనూ జాలము. మరలాంటప్పుడు ముస్లింలు పెద్దసంఖ్యలో తమ విశ్వాసాన్ని పునరుజ్జీవింపచేసుకునే మార్గమేది? వారు తమ ధార్మిక విధులను, నియమాలను మనస్ఫూర్తిగా నిర్వర్తించగలిగేలా వారిని తీర్చిదిద్దే దారేది? వారి భావాలు, భావనలలో ఈమాన్ (విశ్వాసం) తొణకిసలాడగలిగేలా, కరడు గట్టిన వారి హృదయాలలో కరుణా రసం ఉప్పొంగేలా చేయడమెలా?

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని మేల్కొలిపి, వారిలో ఆధ్యాత్మికంగా నైతికంగా ఏర్పడిన రుగ్మతలను దూరంచేసి సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించే ఒక పుణ్యపురుషుని అవసరం ఎంతైనా ఉండింది. అప్పటికే ఖిలాఫత్ వ్యవస్థ బలహీన పడిపోయి, ఈ బాధ్యతను విస్మరించిన కారణంగా (పైగా పరిపాలకులు తమ నియంతృత్వ ధోరణుల ద్వారా ఈ సంస్కరణా సరణికి అవరోధంగా, ప్రమాదకరంగా పరిణమించిన కారణంగా) ప్రజలకు ఏలిన వారిపై నమ్మకాలు సడలిపోయాయి. అదలా ఉంచితే ధార్మిక పునరుజ్జీవనానికి, నైతిక విప్లవానికి నడుం బిగించే సంస్కర్తలను పరిపాలకులు శంకించటం, వారి మార్గంలో అడ్డంకులు కల్పించటం పరిపాటి అయిపోయింది. అందునా ఒక సందేశ ప్రదాత ఇచ్చే సందేశంలో ఆధ్యాత్మికత, నైతికతలతో పాటు రాజనీతిజ్ఞత కూడా మిళితమై ఉందని తెలిస్తే సుల్తానుల భృకుటి ముడిపడేది. అలాంటి ఉద్యమాలను వారు నిర్దాక్షిణ్యంగా అణచివేసేవారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ముస్లిములలో ధార్మికంగా నూతనోత్తేజాన్ని, నవజీవనాన్ని, నవశకాన్ని ప్రారంభించే నిమిత్తం ఒక యుగపురుషుడు జన్మించి, అతడు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి ప్రకారం విశ్వాసం (ఈమాన్), సదాచారం (అమల్), షరీఅత్ అనుసరణల గురించి ముస్లింల చేత బైత్ (ప్రమాణం) స్వీరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముస్లిములు మాజీలో తమ వల్ల జరిగిన అలసత్వం నుండి తేరుకుంటామని, అజ్ఞాన పోకడల్ని విడనాడి పశ్చాత్తాప భావంతో జీవిస్తామని ఆ సత్పురుషుని సమక్షంలో ప్రతిన బూనవలసిన అవసరం ఆనాడు ఎంతైనా ఉంది. మరో వైపు ఆ మహనీయుడు తన శిష్యులకు ధార్మికంగా, నైతికంగా అత్యుత్తమ శిక్షణ నివ్వాలి. తన విలక్షణ వ్యక్తిత్వంతో, ప్రేమానురాగాలతో, స్థిరచిత్తంతో,నిర్దుష్టమైన వైఖరితో తన అనుయాయుల పై చెరగని ముద్ర వేయగలగాలి. ఇంకా తన శిష్యగణంలో పరలోక చింతనను రగుల్గొలిపి వారి విశ్వాసాన్ని ఉజ్వలం గావించాలి. వారిలో మమతానురాగాల దివ్వెలను వెలిగించడంతోపాటు అల్లాహ్ ఏకత్వం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విధానం పట్ల ప్రేమను జనింపజేయాలి. ఆ విధంగా తన అనుయాయు లకు ఓ సరికొత్త జీవితాన్ని ప్రసాదించాలి.

మరోవైపు అనుయాయులు కూడా తాము కొత్త జీవితంలో అడుగు పెట్టామనీ, ఓ పుణ్య పురుషుని చేతిలో చెయ్యేసి ‘బాస’ చేశామని తలపోయగలగాలి. అదే సమయంలో ‘మాట’ తీసుకున్న ఆ మహనీయుడు కూడా తన ప్రియశిష్యుల శిక్షణకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి. వారి జీవితాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను అల్లాహ్ తనకు అప్పగించాడని మనసారా భావించి సంస్కరణకు నడుం బిగించాలి. తన అనుభవాన్ని పాండిత్యాన్నంతటినీ రంగరించి దైవగ్రంథం, దైవప్రవక్త విధానం ప్రకారం తన శిష్యుల్లో ఆధ్యాత్మికతను నూరిపోయాలి. విశ్వాసం, ఆత్మ పరిశీలన, చిత్తశుద్ధి వంటి ప్రధానాంశాలకు ప్రాముఖ్యమిచ్చి వారి ఆచరణల్లో, ఆరాధనల్లో ఊపిరిపోసే ప్రయత్నం చేయాలి. నిజమైన బైత్ (ప్రమాణం) అంటే ఇదే. ఈ పద్ధతిని అనుసరించి మహనీయులు తమ తమ కాలాల్లో ముస్లిం సమాజంలో సంస్కరణ చేశారు. లక్షలాది మంది అల్లాహ్ దాసులకు, ‘ఈమాన్ వాస్తవికత’ను ప్రబోధించి మహోపకారం చేశారు. ఈ సువర్ణ పరంపరకు మూలపురుషుడు ఎవరంటే ఆయనే హజ్రత్ షేఖ్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్). దైవప్రవక్తల నుండి వారసత్వంగా పుణికి పుచ్చుకున్న ఈ మహత్కార్యాన్ని మహాచక్కగా నిర్వర్తించిన ఘనత ఈయనకు దక్కుతుంది.

హజ్రత్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గార్కి పూర్వం కూడా ఈ ‘సత్కార్యాన్ని’ చేపట్టిన పుణ్యపురుషులు లేకపోలేదు. చరిత్ర పుటల్లో వారి ధార్మిక సేవలు పొందుపరచబడి ఉన్నాయి. అయితే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ తన అసాధారణమైన ప్రతిభా పాటవాలతో, అనితర సాధ్యమైన ఆధ్యాత్మిక అద్భుతాలతో, స్వతః సిద్ధమైన సేవా నిరతితో, సునిశితమైన పరిజ్ఞానంతో ఈ సంస్కరణా సరణికి ఓ ప్రత్యేక ఒరవడిని ప్రసాదించారు. ఈ ప్రత్యేక ఒరవడికి పితామహునిగా ఖ్యాతి గడించారు. అంతేకాదు, ఈ వినూత్న ప్రక్రియకు ఓ ‘క్రోడీకరణ’ అనేది ఏదైనా ఉంటే అది ఈ మహనీయుని చేత ప్రసాదించబడినదే అని పండితులు, చరిత్రకారులు నొక్కి చెబుతారు. ఆయన కాలంలో లక్షలాది మంది ఆయన చేతులు మీద ప్రమాణం చేసి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించారు. విశ్వాసం సృజించే నైతిక నడవడిని, సాత్వికతను అలవరచుకున్నారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) తదనంతరం కూడా ఆయన వారసత్వం పొందిన ప్రముఖ శిష్యులు ఈ పరంపరను కొనసాగించి, ఎన్నో దేశాలలో ప్రజలను అల్లాహ్ మార్గం వైపుకు ఆహ్వానించారు. వాళ్ళ ద్వారా ఎన్ని దేశాలలో, ఎంతమంది ప్రజలు ప్రయోజనం పొందారో మనం లెక్కగట్టి చెప్పలేము. (అల్లాహ్ యే ఎరుగు). హజర్ మోత్ (యమన్) లోనూ, భారతదేశంలోనూ, ఇంకా హజర్మీ సత్పురుషులు, వ్యాపారుల ద్వారా జావా, సుమిత్ర ప్రాంతాలలోనూ, ఆఫ్రికా ఖండంలోని ఇతర రాజ్యాలలోనూ లక్షలాది మంది విశ్వాస పరంగా పరిపక్వత చెందారు. వేలాది మంది ముస్లిమేతరులు ఇస్లాం స్వీకరించారు. కారుణ్య ప్రభువు ఆ పుణ్యపురుషుల యెడల ప్రసన్నుడవు గాక! వారి ధార్మిక సేవలను స్వీకరించి ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక!!

ప్రాపంచిక వ్యామోహం, పదవీ వ్యామోహం బాగా ప్రబలిపోయిన కాలంలో హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి ఉనికి ఓ వరం లాంటిది. అపురూపమైన ఆయన వ్యక్తిత్వ ప్రభావం, ఆయన నెలకొల్పిన ఆదర్శాలు, అల్లాహ్ సన్నిధిలో ఆయన కార్యాలకు లభించిన స్వీకృతి, అల్లాహ్ దాసులలో ఆయన పట్ల ఏర్పడిన ఆదరాభిమానాలు, ఆయన శిక్షణలో ఆరితేరిన శిష్యుల నైతిక నడవడి, వారి అసాధారణమైన త్యాగాలు – వీటన్నింటినీ చూస్తుంటే అల్లాహ్ తాను కోరిన వారి చేత తన కార్యాన్ని చేయించుకుంటాడని అనిపిస్తుంది. ఇంకా ఈ ఘనత సత్యధర్మమైన ఇస్లాంకు దక్కుతుంది. వాస్తవానికి ఈ సువర్ణ పరంపర ఇస్లాంలోని సత్యస్వరూపానికి, సిసలైన ఆధ్యాత్మికతకు ప్రబల తార్కాణం.

సుదీర్ఘ కాలంపాటు లోకానికి ప్రేమ పరిమళాన్ని పంచిపెట్టి, ఇస్లాం జగత్తును ఓ మలుపు తిప్పి 90 సంవత్సరాల వయస్సులో హి.శ. 561లో తనువు చలించారు హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) – ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. ఆయన మరణం గురించి ఆయన కుమారుడు హజ్రత్ షర్ఫుద్దీన్ ఈసా (రహిమహుల్లాహ్) ఇలా వివరించారు.

“మరణానికి ముందు ఆయన తీవ్రంగా వ్యాధిగ్రస్తులైనపుడు ఆయన పుత్రుడు షేఖ్ అబ్దుల్ వహాబ్ ‘నాకేదైనా ఉపదేశించండి. మీ తదనంతరం నేను దానిని తు.చ తప్పకుండా పాటిస్తాను,’ అని తండ్రిని విన్నవించు కున్నారు. దానికి ఆయన ఇలా ఉపదేశించారు:

“(నాయనా!) నిత్యం అల్లాహ్ కు భయపడుతూ ఉండు. అల్లాహ్ కు తప్ప మరొకరికి భయపడకు. ఆయన్నుండి తప్ప వేరొకరి నుండి దేనినీ ఆశించకు. నీ అవసరాలు, అక్కరలు తీర్చే భారమంతా అల్లాహ్ పైనే మోపు. ఆయన్నే నమ్ముకో. ఏది కావాలన్నా ఆయన్నే అర్థించు. అల్లాహ్ తప్ప మరొకరిపై విశ్వాసముంచకు. తౌహీద్ (ఏకదైవారాధన) ను అవలంబించు. తౌహీద్ విషయంలో అందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది”.

ఇంకా ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ తో మనసుకు లగ్నం చేస్తే ఏ వస్తువూ అతన్నుండి తప్పిపోదు”. కుమారులను ఉద్దేశ్యించి ఇలా అన్నారు: “మీరు నాకు కొంత దూరం జరగండి. బాహ్యంలో నేను మీకు తోడుగా ఉన్నాను. కాని ఆంతరంగికంగా ఇతరుల వెంట ఉన్నాను. నా వెంట మీరు గాక ఇతరులు (దైవదూతలు) కూడా ఉన్నారు. వారి కోసం స్థలం వదలండి. వారి యెడల మర్యాదగా మెలగండి. ఇక్కడ గొప్ప కారుణ్యం కురుస్తోంది. వారి కోసం స్థలాన్ని ఇరుకుగా ఉంచకండి.” పదేపదే ఈ విధంగా చెప్పుకున్నారు – “మీపై శాంతి కురియుగాక! అల్లాహ్ కారుణ్యం వర్షించుగాక! ఆయన శుభాలు అవతరించుగాక! అల్లాహ్ నన్నూ మరియు మిమ్మల్ని మన్నించుగాక! మనందరి పశ్చాత్తాపాన్ని స్వీకరించుగాక! బిస్మిల్లాహ్! రండి, వెళ్లిపోకండి”. ఒక పగలు, ఒక రేయంతా ఇలాగే గోణుక్కుంటూ ఉండిపోయారు. తరువాత ఇలా అన్నారు. “మీ వైఖరి విచారకరం! నాకిక దాని ఆపేక్షా లేదు. దేనినీ లెక్క పెట్టను. ఏ దైవ దూతను గానీ, మరణ దూతను గానీ లక్ష్యపెట్టను. ఓ మరణదూతా! మా కార్యసాధకుడు (అల్లాహ్) మాకు నీకన్నా అధికమే వొసగాడు”. ఆయన తనువు చాలించిన రాత్రి ఓ పెద్ద కేక పెట్టారు. ఆయన కుమారులిద్దరూ (షేఖ్ అబ్దుర్రజాక్, షేఖ్ మూసా) ఆయన తుది ఘడియల దృశ్యాన్ని చూసి ఇలా వివరించారు: “ఆయన తన రెండు చేతుల్ని ఎత్తి, ‘మీ పై శాంతి శుభాలు కురియుగాక! సత్యం వైపుకు మరలండి. పంక్తిలో కలవండి. నేనిప్పుడే మీ దగ్గరకు వస్తాను’ అని పలికారు. ‘మృదువుగా మెలగండి’ అని కూడా అన్నారు. రావలసినది రానే వచ్చింది. మృత్యువు మగత ఆవరించింది. అప్పుడాయన ఇలా అన్నారు. ‘నాకు, మీకు, ఈ సృష్టికి మధ్య భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. నన్ను వేరొకరితో గానీ, వేరొకరిని నాతో గానీ పోల్చకండి. ఆయన కుమారుడు షేఖ్ అబ్దుల్ అజీజ్ ఆయన బాధాకర స్థితిని గురించి దర్యాప్తు చేయగా, నన్నెవరూ ఏమీ అడక్కండి. నేను దివ్యజ్ఞానంలో ఒత్తిగిలుతున్నాను అని చెప్పారు. మీ అస్వస్థత గురించి చెబుతారా అని కుమారుడు షేఖ్ అబ్దుల్ అజీజ్ అడగ్గా ‘ నా అస్వస్థతను ఎవరూ తెలుసుకోలేరు. నా రోగస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరు. మనుషులే కాదు. జిన్నులు, ఫరిష్తాలు కూడా (అర్థం చేసుకోలేరు). దైవాజ్ఞలో అల్లాహ్ జ్ఞానం త్రెంపుకోదు. కాకపోతే ఆజ్ఞ మారగలుగుతుంది. కాని జ్ఞానం మారదు వీగి పోగలదు కానీ జ్ఞానం వీగిపోదు. అల్లాహ్ తాను తలచుకున్న దానిని రూపు మాపగలడు, తాను కోరుకున్న దానిని మిగిల్చి ఉంచగలడు. ఆయన వద్దనే సిసలైన వ్రాత వుంది. ఆయన చేసిన దానిని గురించి ప్రశ్నించే వారెవరూ లేరు. అయితే సృష్టితాలు ఏది చేసినా దాని గురించి ప్రశ్నించబడతాయి’ అని వివరించారు. తమరి శరీరంలో బాధఎక్కడుందో చెబుతారా? అని కుమారుడు షేఖ్ అబ్దుల్ జబ్బార్ అడిగితే, నా శరీరావయవాలన్నీ నన్ను బాధిస్తున్నాయి. కాని నా మనసుకు మాత్రం ఎలాంటి బాధ లేదు. అది తన ప్రభువుతో సంతృప్తమై ఉంది అని బదులిచ్చారు. ఆఖరికి ఆయనపై చిట్ట చివరి ఘడియలు రాగా “సహవర్తులెవరూ లేని ఆ ఆరాధ్య అల్లాహ్ సహాయం కోర్తున్నాను. ఆయన పవిత్రుడు, ఉన్నతుడు. ఆయన అజరుడు. ఆయనకు నశించే ఆవకాశం లేదు. తన శక్తితో గౌరవాన్ని బహిర్గతం చేసి, మరణం ద్వారా దాసులపై ప్రాబల్యం చూపిన ఆ అల్లాహ్ పవిత్రుడు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ప్రవక్త” అని పలికారు. తన నోటితో ‘తఅజ్జజ్’ అనే పదం ఉచ్చరించారు. ఆ పదం స్పష్టంగా వెలువడకపోవడంతో మాటి మాటికీ దాన్ని పలకసాగారనీ, ఆఖరికి బిగ్గరగా, చాలా స్పష్టంగా ‘తఅజ్జజ్’ అని పలికారని ఆయన పుత్రుడు షేఖ్ మూసా తెలిపారు. ఆ తరువాత (మూడుసార్లు) “అల్లాహ్… అల్లాహ్ ….అల్లాహ్” అని అన్నారు. ఆ తరువాత నిశ్శబ్దం ఆవరించింది. నాలుక నిశ్చలంగా ఉండిపోయింది. ఆత్మ ఉర్ధ్వలోకాలకు సాగిపోయింది”.(రజి అల్లాహు అన్హు వ రజాహు)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ భౌతికంగా ఈ లోకాన్ని వీడిపోయినా ఆయన మొదలు పెట్టిన ఉద్యమం ఆగలేదు. ఆయన తన వెనుక సందేశ ప్రదాతల, సంస్కర్తల ఓ పెద్ద సమూహాన్ని వదలివెళ్ళారు. ఆయన తదనంతరం కూడా ఆయన ఆశయాలను సాధించటానికి శిష్యగణం అవిశ్రాంతంగా శ్రమించింది.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) దయార్ద హృదయులు. ఈయన గుణగణాలు చాలా వరకు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మహోన్నత నైతిక గుణాలను పోలి ఉండేవి. సాధారణంగా అబ్దుల్ ఖాదిర్ జీలానీ బలహీనులతో కలసి కూర్చునేవారు. అభాగ్యులను ఆదరించేవారు. పెద్దలను గౌరవించేవారు. చిన్న వారిపై దయ చూపేవారు. సలాం చేయడంలో ముందంజ వేసేవారు. అతిథులతో, శిష్యులతో కలసి కూర్చున్నప్పుడు ఎంతో నిగ్రహంతో వ్యవహరించేవారు. వాళ్ల వల్ల జరిగే పొరపాట్లను, అవాంఛనీయాలను మన్నించేవారు.

ఆయన పేరు ప్రఖ్యాతులు నలువైపులా వ్యాపించిన తరువాత జరిగిన ఒకసంఘటన….

ఒకసారి ఆయన హజ్ యాత్రకు బయలుదేరారు. బుగ్దాద్ నగరానికి కొంత దూరాన ఒక ప్రదేశానికి చేరుకున్న తరువాత ఆయన అక్కడ విడిది చేయాలనుకున్నారు. ఆ గ్రామంలో అందరికన్నా ఎక్కువ పేదవాడు, అందరికన్నా ఎక్కువ బలహీనుడు, అనామకుడు ఎవరో విచారించమని శిష్యుల్ని ఆదేశించారు. ఆ గ్రామంలో ఎందరో భూస్వాములు, శ్రీమంతులు ఆయనకు ఎదురై తమ ఇంట్లో విశ్రాంతి తీసుకోమని స్వాగతించారు. కాని హజ్రత్ ఆ ధనికుల ఆహ్వానాన్ని స్వీకరించలేదు. చాలా సేపు అన్వేషణ జరిపిన తరువాత ఆ ప్రాంతంలో ఒక నిరుపేద ముసలి వాడున్నాడని, అతనింట ఒక వృద్ధురాలు, ఒక ఆడపిల్ల తప్ప మరెవరూ లేరని తెలిసింది. ఆయన ఆ వృద్ధుని అనుమతితో అతనింటికి దగ్గర్లో మకాం చేశారు. ఆ ప్రాంతవాసులు నగదు రూపంలో, ధాన్యం రూపంలో, పశువుల రూపంలో షేఖ్ కు నజరానాలు సమర్పించుకున్నారు. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ “నాకు పంపబడిన ఈ ధనధాన్యాలు, పశు పక్ష్యాదులు కానుకలు గనక ఈ కానుకల్ని నేను ఈ ముసలి వ్యక్తికి ఇస్తున్నాను. ఇక వీటిపై నాకు ఎలాంటి హక్కులేదు” అని ప్రకటించారు. ఇది విని అక్కడున్న శిష్యులంతా అమితంగా ప్రభావితులయ్యారు. వాళ్లు కూడా తమ దగ్గరున్న ధన ధాన్యాలను ఆ ముసలి వ్యక్తికి కానుకగా సమర్పించారు. ఆ విధంగా అల్లాహ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి ద్వారా ఒక్క రోజులోనే ఆ ముసలి వాణ్ణి ఆ ప్రాంతంలో అందరికన్నా సంపన్నునిగా, గౌరవనీయునిగా చేశాడు.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు :-

“నీవు అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తూ, నీ కోర్కెలను, అభిరుచులను అదుపులో పెట్టుకో. ఇలా చేసినపుడే నీ మనసులో దివ్య జ్ఞానాన్ని ఆస్వాదించే శక్తి జనిస్తుంది. అల్లాహ్ తో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి దుష్టులతో, ప్రాపంచిక మత్తులో మునిగిపోయిన వారితో సంబంధాలు త్రెంచుకోవటం అనివార్యం. కోర్కెలకతీతంగా వ్యవహరించడమంటే లాభనష్టాల విషయంలో, కీడు వైపరీత్యాలను నిర్మూలించే విషయంలో, ప్రాపంచిక ఒనరులు, ప్రయత్నాలు – ఇత్యాది వ్యవహారాలలో తన స్వశక్తి పై ఆధారపడక అల్లాహ్ పైనే ఆధారపడాలి. సమస్త అవసరాలను, అక్కరలను తీర్చగలవాడు అల్లాహ్ యే నని నమ్మాలి. అలా గాకుండా నిన్ను నీవు నమ్ముకొని, నీ వల్లనే ఏదైనా సాధ్యమవుతుందని అనుకుంటే అది ‘షిర్క్’ అవుతుంది. గతించిన కాలంలో అల్లాహ్ మాత్రమే తన దాసులందరి వ్యవహారాలకు కార్యసాధకుడుగా ఉన్నాడు. వర్తమానంలో కూడా ఆయనే అందరి కార్యసాధకుడు. భవిష్యత్కాలంలో కూడా ఆయనే అందరి వ్యవహారాలను చక్కదిద్దుతాడు. నీవు నీ తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు కూడా ఆయనే నిన్ను కనిపెట్టి ఉన్నాడు. నీవు నీ తల్లి ఒడిలో ఉండి పాలు తాగుతున్నప్పుడు కూడా ఆ అల్లాహ్ యే నీ మంచీ చెబ్బరలను చూశాడు.”

“హదీసె ఖుదసీలో ఇలా అనబడింది విశ్వాసి అయిన నా దాసుడు అల్లాహ్ ఆరాధన, అల్లాహ్ నామస్మరణ ద్వారా నా సామీప్యాన్ని పొందగోర్తాడు. ఆఖరికి అతడు నాకు అత్యంత ప్రియతముడై పోతాడు. పరిపూర్ణ సమన్వయం వల్ల నేనతని చెవినవుతాను. తద్వారా అతడు వింటాడు. నేనతని కన్నులనవుతాను. వాటితోనే అతడు చూడగలుగుతాడు. నేనతని నోరునవుతాను. దాంతోనే అతడు మాట్లాడతాడు. నేనతని చేయినవుతాను. దాంతో అతడు పట్టుకుంటాడు. నేనతని కాళ్లనవుతాను. వాటితో అతడు నడుస్తాడు. కనుక నీవు నీ వ్యక్తిగతాన్ని, సాటి ప్రాణులను ఎంతగా వదలుకుంటావో అంతగానే ఆధ్యాత్మికతను సంతరించుకుంటావు. ప్రాణులు మంచివిగానో లేక చెడ్డవిగానో ఉంటాయి. అలాగే నీవు కూడా మంచి వాడవో లేక చెడ్డవాడివో అయి ఉంటావు. కాబట్టి నీవు నీ సహజ గుణాలను కాపాడుకుంటూ, మనుషుల ధర్మవిరుద్ధమైన పోకడలకు ప్రభావితం కాకుండా జాగ్రత్త పడినట్లయితే, భయ ప్రలోభాలకు లొంగకుండా నిగ్రహం వహించినట్లయితే ఇక నీకు తిరుగు ఉండదు. నీ అంతరంగంలో అల్లాహ్ యే మిగిలి ఉంటాడు. నీ పుట్టుకకు పూర్వం ఎలా నీలో ఉన్నాడో అలాగే ఉంటాడు. మేలైనా కీడైనా – అంతా అల్లాహ్ అధీనంలోనే ఉందన్న వాస్తవాన్ని విస్మరించకు. నీవు గనక ఆ ప్రభువు పై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే చాలు – ఆయన నిన్ను అన్ని రకాల కీడుల నుండి నిశ్చింతగా ఉంచుతాడు. శుభాల ద్వారాలు నీ కోసం తెరుచుకుంటాయి. ఆపైన నీవు సకల శుభాల సరోవరంగా, సకల మేళ్ళ సముదాయంగా, సకల ఆనందాల నిలయంగా మారిపోతావు సుమా!….”.

ఆత్మ తృప్తి, మనో స్థిమితం ఏ మనిషికైనా సిద్ధిస్తే అతడు అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించినట్లే. కఠోర పరిశ్రమ తరువాతే దాసుడు ఈ స్థితికి చేరుకుంటాడు. మరి ఈ స్థితికి చేరుకోవాలంటే మనిషి ఏం చేయాలి? దీని గురించి హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా బోధించారు –

“నీ మనసు వేసే ఉచ్చుల నుండి బయటపడు. నీకు చెందిన సర్వ విషయాలను పూర్తిగా నీ ప్రభువుకే అప్పగించు. నీ హృదయ ద్వారం వద్ద అల్లాహ్ తరఫున కాపలాదారుగా ఉండు. తద్వారా పైశాచిక ప్రేరణలు అందులో జొరబడకుండా ఉంటాయి. అల్లాహ్ ఏ విషయాన్ని మనసులో రానివ్వటానికి అనుమతించాడో వాటిని మాత్రమే రానివ్వు. మరి దేనిని రానివ్వవద్దన్నాడో వాటిని రానీయకు. సత్య సంకల్పం తప్ప మరొక దానికి ఆస్కారం ఇవ్వకు. సత్య సంకల్పం చేసుకుంటే ఇస్లామీయ షరీయత్ కు సంపూర్ణంగా తలొగ్గినట్లే. అత్యధికమైన కోర్కెలు మనిషిని జంఝాటాల దట్టమైన అడవిలోకి నెట్టేసి వినాశానికి హేతువు అవుతాయి. నిత్యం అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తూ ఉండు. అల్లాహ్ నిషేధించిన వాటికి దూరంగా మసలుకో. దైవాధీనమై ఉన్న విషయాలను అల్లాహ్ కు మాత్రమే ఆపాదించాలి. సాటి ప్రాణులలో ఎవరినీ దైవత్వంలో భాగస్వాములుగా చేయరాదు. సత్కార్యం చేసి దాని ఫలితాన్ని సాటి మనుషుల నుండి ఆశించకు. దాన్ని అల్లాహ్ పై వదలిపెట్టు. సాటి మనుషుల నుండి పొగడ్తల్ని ఆశించావంటే అది కూడా ‘షిర్క్’ గానే భావించబడుతుంది. సర్వోన్నత ప్రభువు ఏమని సెలవిచ్చాడో తెలుసా!?

“ఏ వ్యక్తయితే అల్లాహ్ ను కలుసుకోవాలని ఆశిస్తున్నాడో అతడు సదాచరణచేయాలి. సాటి ప్రాణులలో ఎవరినీ అల్లాహ్ కు సహవర్తులుగా నిలబెట్టకూడదు.”

విగ్రహారాధన ఒక్కటే ‘షిర్క్’ కాదు సుమా! మనోవాంఛల్ని గుడ్డిగా అనుసరించటం, క్షణ భంగురమైన ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తితోనయినా లేదా ఏ వస్తువుతోనయినా అమితంగా సంబంధం ఏర్పరచుకోవటం కూడా ‘స్పష్టమైన షిర్క్’గానే పరిగణించబడుతుంది. అల్లాహు తాలా ఇలా సెలవిచ్చాడు : ‘(ఓ ముహమ్మద్!) తన మనో వాంఛలనే తన ఆరాధ్య దైవంగా చేసుకున్న ఆ వ్యక్తిని నీవు చూడలేదా?!’

కనుక అల్లాహ్ మినహా ఈ లోకంలో ఉన్నదంతా దైవేతరమే అవుతుంది. నీవు గనక దైవేతరాల్లో లీనమై పోయినట్లయితే నిశ్చయంగా నీవు అల్లాహ్ కు సహవర్తుల్ని కల్పించిన వాడవవుతావు. ఆ విధంగా నీవు ముష్రిక్ (బహుదైవోపాసకుని)గా వ్యవహరించబడతావు.

కనుక సత్య స్మరణలో జీవితం గడుపు. ముమ్మరంగా పరిశ్రమించు. నిశ్చేష్టుడవై ఉండకు. అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండు. నిర్భయంగా ఉండకు. సత్యాన్వేషణలో అప్రమత్తంగా ఉండు. అప్రమత్తతకు, మరుపుకు లోను కాకు. సద్వ్యవహరణ ఫలితంగా నీకు ప్రాప్తించిన గౌరవోన్నతుల్ని చూసుకుని మురిసిపోకుండా అది అల్లాహ్ ప్రసాదితమని భావించు. ఇంకా నీకు లభించిన గౌరవోన్నతిని సాధ్యమైనంతవరకు గోప్యంగానే ఉంచు. అవివేకుల సమక్షంలో దానిని చాటకు. ఇలా చేయటం వల్ల నీ ఆంతర్యానికి మరింత హాయి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నీ సంబంధం అల్లాహ్ తోనే ఉంది. అల్లాహ్ సెలవిచ్చినట్లు ‘ప్రతి దినం అల్లాహ్ వైభవం నిత్యనూతనంగా ఉంటుంది.’

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు. అల్లాహ్ సత్య ప్రవక్త యొక్క ఆదర్శ జీవితాన్ని అనుసరించు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించిన కొన్ని దివ్య వచనాలు తరువాత రద్దు అయినాయనీ, వాటి స్థానంలో సరికొత్త వచనాలు (ఆయతులు) అవతరింపజేయబడ్డాయనీ, తరువాత అవతరింపజేయబడిన వచనాలనే దైవప్రవక్త అవలంబించారనీ తెలుసుకో. ఇది బహిర్గతమైన షరియత్ స్థితి. అయితే కొన్ని అంతర్గతమైన విషయాలు అల్లాహ్ మరియు దైవ ప్రవక్త మధ్య రహస్యంగా ఉన్నాయి. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నా మనసుపై ఒక్కోసారి ఓ ఆచ్ఛాదన ఆవరించేది. దాని తొలగింపుకై నేను అనుదినం 70 సార్లు అల్లాహ్ ను క్షమాపణ కోరుకునేవాణ్ణి.”

క్షమాపణ కొరకు అల్లాహ్ ను వేడుకోవటం వలన ఆత్మ పరిశుద్ధమవుతుంది. మససు జ్యోతిర్మయమవుతుంది. క్షమాభిక్ష విశ్వాసికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పశ్చాత్తాపం మరియు క్షమాభిక్ష ఒక దాసునిలో ఉండవలసిన రెండు ఉత్తమగుణాలు. ఈ రెండు గుణాలు ఆది మానవుడైన హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) నుండి వారసత్వంగా లభించినాయి. హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) గారి మనః స్థితిపై స్తబ్ధత ఆవరించి, ఆయన మనోవాంఛకు లొంగిపోయి వాగ్దాన భంగానికి పాల్పడగానే ఆయనకు ప్రసాదించబడిన వరాలు నిరర్థకమైపోయాయి. ఆయన అధోగతి అక్కడి నుండే మొదలయింది. అల్లాహ్ సామీప్యం దూరమైంది. తేజస్సు స్థానే తమస్సు ఆవరించింది. మరి ఆయన ఆ చేష్టకు పాల్పడినందుకు మందలించటం జరిగింది. ఆ తరువాత చేసిన తప్పును ఒప్పుకుంటున్నట్లుగా పశ్చాత్తాపం చెందమనీ, క్షమాభిక్షకై వేడుకోమనీ ఉపదేశించబడింది. అందుచేత హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) అల్లాహ్ సన్నిధిలో బాధా తప్త మనసుతో మొరపెట్టుకున్నారు – “ప్రభూ! మేము నీ ఆదేశాన్ని ఉల్లంఘించి మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. నువ్వే గనక ఇక మమ్ము క్షమించకపోతే, మాపై దయ జూపక పోతే మేము నష్టాన్ని చవిచూసే వారి సరసన నిలబడాల్సి వస్తుంది.”

“పశ్చాత్తాప భావంతో కుమిలిపోయి క్షమాపణ వేడుకున్న మీదట కారుణ్య ప్రభువు ఆయన్ని మన్నించాడు. ఆయనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశాడు. దాని మీదట ఆయన ఏది తలచుకున్నా, మరేది చేసినా అది దైవాదేశాలకు లోబడి ఉండేది. ఆయన గారి ప్రతి స్థితి పూర్వ స్థితి కన్నా గొప్పగా ఉండేది. అలా అల్లాహ్ ప్రపంచంలో ఆయనకు గౌరవోన్నతుల్ని ప్రసాదించసాగాడు. ఆయన వేడుకోలు స్వీకరించబడింది. ఆయన సంతతి నేల నలుమూలలా వ్యాపించింది. వారిలో గొప్ప ప్రవక్తలు, సంస్కర్తలు, మహనీయులు కూడా జన్మించారు. ఆ పైన అల్లాహ్ వారికి పరలోకంలో శాశ్విత సుఖ సంతోషాలకు నిలయమైన స్థానాన్ని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు”.

కాబట్టి (ఓ మనిషీ!) నీవు కూడా పశ్చాత్తాపం మరియు మొక్కుబడులకు సంబంధించినంత వరకు మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ల ఆదర్శ విధానాన్ని అనుసరించాలి. అల్లాహ్ నుచిత్తశుద్ధితో సేవించేవారు పాటించవలసిన పద్ధతి అక్షరాలా ఇదే. సాఫల్యానికి సోపానమూ ఇదే.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) జీవనోపాధిని ఆశించేవారినుద్దేశ్యించి ఇలా ఉపదేశించారు –

“దారిద్ర్యం, నిరుద్యోగ స్థితికి లోనై ఉన్న కాలంలో నీలో పెళ్ళి చేసుకోవాలన్న కోరిక పుడితే, అదే సమయంలో సంసార బాధ్యతల్ని మోసే శక్తి సామర్థ్యాలు నీలో లేకుంటే అల్లాహ్ పై భారం మోపి జీవనోపాధిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉండు. ఏ ప్రభువు మనిషికి నికాహ్ ను అవసరంగా ఖరారు చేశాడో, మనిషిలో లైంగిక వాంఛల్ని ఉంచాడో ఆ ప్రభువే ఉపాధి అవకాశాలను కూడా సృజిస్తాడు. అందరి మొరలను ఆలకించే, అందరి కష్టాలను దూరం చేసే ఆ ప్రభువే నీకెలాంటి ఆందోళనా కలిగించకుండా క్రమక్రమంగా నీ నికాహ్క కావలసిన సామగ్రిని సమకూర్చి నీ మనః స్థిమితానికి, అభివృద్ధికి బాట వేస్తాడు.

ఇక ఇప్పటి వరకూ నీవు చూపిన ఓపిక, కృతజ్ఞతగా రూపుదిద్దుకుంటుంది. (రూపుదిద్దుకోవాలి కూడా) కృతజ్ఞతా భావంతో మసలుకునే వారి అనుగ్రహాలను మరింత అధికం చేస్తానని అల్లాహ్ తన గ్రంథంలో వాగ్దానం చేశాడు. “మీరే గనక మాకు కృతజ్ఞులై ఉంటే నిశ్చయంగా మేము మీకు మరింతగా వొసగుతాము. అలా గాకుండా మీరు కృతఘ్నతా వైఖరికి ఒడిగట్టినట్లయితే మా యాతన అత్యంత వ్యధాభరితమైనదన్న సంగతిని మరువకండి (జాగ్రత్త)!”

నీవు ప్రార్థించిన మీదట కూడా ఒకవేళ చాలా కాలం వరకు నీ నికాహ్ కు పరిస్థితులు అనుకూలించకపోతే అప్పటికీ నీవు సహనంతోనే వ్యవహరించాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. అల్లాహ్ యేచ్ఛ మరియు అల్లాహ్ ప్రక్రియపై ఎలాంటి నిందలు మోపక, అల్లాహ్ నామాన్ని అత్యధికంగా స్మరిస్తూ, అల్లాహ్ ఏర్పాటుకై ఎదురుచూడు. అల్లాహ్ ప్రణాళికకు కట్టుబడి ఉంటూ, ఆయనపై పూర్తి విశ్వాసం కలిగి ఉండు. ఎట్టకేలకు నీ ప్రభువు తన ప్రత్యేక కరుణతో నిన్ను అనుగ్రహిస్తాడు. నీ ఉపాధిలో విస్తృతి నొసగుతాడు. అంతే గాకుండా పాపాలకు దూరంగా ఉంటూ, సన్మార్గం పై నిలకడగా ఉండే శక్తినీ, స్థయిర్యాన్నీ నీకు ప్రసాదిస్తాడు. దివ్య గ్రంధంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

“నిశ్చయంగా సహనం వహించే వారికి అమితంగా లెక్కకు మించి పుణ్యం ప్రసాదించ బడుతుంది.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఇలా ఉద్బోధించారు –

“పరమ ప్రభువగు అల్లాహ్ నీకు సిరి సంపదల్ని, ఆస్తి అంతస్థుల్ని అనుగ్రహించగా నీవు వాటిని చూసుకొని మురిసిపోతూ అల్లాహ్ ఆరాధన మరియు విధేయత పట్ల వైముఖ్యం కనబరిచావనుకో, అల్లాహ్ ఇహపరాలలో నిన్ను తన సామీప్యం నుండి దూరం చేసేస్తాడు. అంతే కాదు, నీ ఉదాసీనత మూలంగా నీ సిరిసంపదలు నీ నుండి కొల్లగొట్టబడి, నీవు నిస్సహాయ స్థితికి లోను కావటమూ సంభవమే. సత్యాన్ని విస్మరించి పొద్దస్తమానం పదార్థ పూజలో లీనం కావటం కూడా ‘షిర్క్’ (బహుదైవత్వం) అవుతుంది. కాగా, షిర్క్ అల్లాహ్ సన్నిధిలో క్షమార్హం కాని నేరంగా పరిగణించబడుతుంది. ఒక వేళ నీవు సిరిసంపదల్ని ఆరాధ్య దైవంగా, ఏకైక లక్ష్యంగా చేసుకోకుండా, దైవారాధన, అల్లాహ్ నామస్మరణలో జీవితం గడిపినట్లయితే అల్లాహ్ నీ సిరిసంపదల్ని నీ కొరకు శుభవంతంగా, సౌఖ్యసామగ్రిగా చేస్తాడు. పైగా వాటిలో అనుదినం వృద్ధి జరుగుతుంది. నీ సంపద నీకు లోబడి ఉంటుంది. నీవు నీ పరిపోషకునికి లోబడి ఉంటావు. అంతేగాక నీవు ప్రపంచంలో అసంఖ్యాకమైన అనుగ్రహాలను ఆస్వాదిస్తావు. పరలోకంలో అల్లాహ్ తరఫున ఆదరణ పొంది అనుగ్రహభరితమైన స్వర్గంలో పుణ్యపురుషుల, అమర వీరుల సహచర్యంలో చేర్చబడతావు.”

భయము, ఆశ – ఇవి రెండూ అల్లాహ్ ప్రియతమ దాసులలో ఉండే సద్గుణాలు. వారు అల్లాహ్ ఆగ్రహోదగ్రతకు భయపడతారు, ఆయన క్షమాగుణం పట్ల, దయాదాక్షిణ్యాల పట్ల ఆశ కలిగి ఉంటారు. విశ్వాసుల ఈ రెండు సద్గుణాల గురించి హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ప్రబోధించారు :

“నేనొక కల గన్నాను. ఆ కలలో ఓ మస్జిద్ ఆకారంలో ఉన్న స్థలంలో ఉన్నాను. ఆ స్థలంలో ప్రపంచాన్ని, ప్రపంచ వాసులతో సంబంధాన్ని తెంచుకున్న ఓ సమూహం ఉంది. ఔలియా అల్లాహ్ (అల్లాహ్ ప్రియమైన దాసులు) లోని ఫలానా వ్యక్తి గనక ఇక్కడ ఉంటే వీరికి షరియత్ నియమాలను బోధించేవాడే అని నేను మనసులో అనుకున్నాను. అంతలోనే వాళ్లు నా చుట్టూ చేరారు. వారిలో ఒకతను, “మీరెలా ఉన్నారు? మీరు మమ్మల్ని ఉద్దేశించి ఉపదేశించరేమి?” అని అడిగాడు. “మీరు సృష్టితాల నుండి తెగతెంపులు చేసుకొని సృష్టికర్త వైపుకు మరలి వచ్చారాయె, అటువంటప్పుడు మీరు ఎవరినీ ఏది అడగకండి. నోటి ద్వారా ఏదీ అడగకూడదను కున్నప్పుడు మనసుతో, సంకల్పంతో కూడా ఏదీ ప్రశ్నించకండి….. గుర్తుంచుకోండి, సృష్టితాలను చెడగొట్టడంలో గానీ, తీర్చిదిద్దడంలో గానీ, పడవేయడంలో గానీ, పైకెత్తడంలో గానీ అల్లాహ్ నిత్య నూతన మహిమాన్వితుడు. ఆయన ఏ జాతినయినా పతనాల లోయల్లోకి నెట్టివేస్తాడు. మరే జాతినయినా అత్యున్నత శిఖరాలకు చేర్చుతాడు. అలా ఉన్నత స్థానాలను పొందిన వారికి అభయ హస్తం చూపిస్తాడు. కాని మరి వారే గనక తమ స్థాయిని మరచి నికృష్టంగా వ్యవహరిస్తే వారిని అధోగతికి నెట్టివేస్తానని హెచ్చరిస్తాడు కూడా. అలాగే పాపిష్టి పనుల మూలంగా నికృష్ట స్థాయిలో మ్రగ్గుతున్న వారు గనక పశ్చాత్తాపంతో కుమిలిపోయి, ప్రభువు వైపుకు మరలినట్లయితే వారిని తిరిగి ఉన్నత స్థితికి చేరుస్తానని కూడా వాగ్దానం చేశాడు. తరువాత నాకు మెలకువ వచ్చింది. (స్వప్న జగత్తు నుండి వాస్తవ జగత్తులోకి వచ్చాను)”.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఉపదేశించారు: “నీవు అల్లాహ్ అనుగ్రహాల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావంటే, నీవు కేవలం సృష్టితాలను, ఇతరత్రా కారకాలను నమ్ముకున్నావు. అల్లాహ్ పై పూర్తి భారం మోపలేదు. అందుచేత ధర్మసమ్మతమైన ఉపాధిని సముపార్జించటంలో ఈ ఇతరత్రా సృష్టితాలు నీకు అడ్డంకులుగా నిలిచాయి. నీవు ఈ చిల్లర దైవాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినంత కాలం, వాటి వద్దకు నీవు ఆశతో రాకపోకలు సాగించినంత కాలం నీవు సృష్టికర్తకు సాటిగా సృష్టితాలను నిలబెట్టి షిర్క్ కు పాల్పడినట్లే లెక్క. ఆ విధంగా నీవు ముష్రిక్ (బహుదైవోపాసకుడవు) అవుతావు. ఈ పోకడ మూలంగా అల్లాహ్ నిన్ను యాతనకు లోను చేస్తాడు. ఈ యాతన యొక్క హీనాతిహీనమైన ఒక నిదర్శనం ఏమంటే నీవు ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనకు నోచుకోకుండా పోతావు. ఎందుకంటావేమో, ధర్మసమ్మతమైన సంపాదన కష్టపడి, చెమటోడ్చిన మీదటే లభిస్తుంది. మానసికమైన, శారీరకమైన కష్టాన్ని ఓర్చిన వారికే హలాల్ జీవనోపాధి ముడుతుంది.

ఒకవేళ నీవు అల్లాహ్ తో పాటు ఇతరుల్ని సహవర్తులుగా కల్పించే విషయమై పశ్చాత్తాపం చెంది, శ్రమించడాన్ని కూడా అలవర్చుకుని, కేవలం నీ శక్తియుక్తులనే నమ్ముకున్నావనుకో, అప్పటికీ నీవు షిర్క్ చేసిన వాడవే అవుతావు. అయితే షిర్క్ యొక్క ఈ ‘రకం’ మొదటి షిర్క్ కన్నా ఎక్కువ గోప్యమైనది. ఇట్టి పరిస్థితిలో అల్లాహ్ నీకు ఉపాధినయితే ఇస్తాడు గానీ, నీవు ఆ ఉపాధిలోని మాధుర్యాన్ని ఆస్వాదించ లేకపోతావు.

మరి నీవు ఈ గోప్యమైన షిర్క్ పట్ల కూడా పశ్చాత్తాపం చెంది, కేవలం నీ శక్తి యుక్తులను మాత్రమే నమ్ముకోకుండా, అల్లాహ్ సిసలైన ఉపాధి ప్రదాత అని, అతడే సౌలభ్యాలను ప్రసాదించగలవాడనీ, కష్టాలను తొలగించే శక్తి ఆయనకు మాత్రమే ఉందనీ దృఢంగా విశ్వసించిన నాడు అల్లాహ్ నీకు – తనకు మధ్య గల అడ్డును తొలగిస్తాడు. తన కటాక్షంతో నీ వైపుకు మరలి నీ కష్టాలను తొలగిస్తాడు. నీ అక్కరలను ఆశించిన దాని కన్నా అధికంగా తీరుస్తాడు. నీవు ఎన్నడూ ఊహించనయినా లేని మార్గాల నుండి నీకు వొసగుతాడు. ఇది అల్లాహ్ తరపున నీకు లభించిన ప్రత్యేక తోడ్పాటు. ఈ విధంగా అతడు నిన్ను బహుదైవోపాసన యొక్క అప మార్గాలకు లోను కాకుండా రక్షిస్తాడు. మరి ఆ పైన నీ మనో మస్తిష్కాల నుండి నీ స్వీయ సంకల్పాలు, స్వంత కోర్కెలు వేర్పడిపోతాయి. ఆ పైన నీవు పూర్తిగా అల్లాహ్ పైనే భారం మోపి నీ తలంపులన్నింటినీ అల్లాహ్ తలంపులలో లీనం చేసేస్తావు. కాబట్టి అల్లాహ్ నిశ్చయంగా నీ కొరకు రాసి పెట్టిన ఉపాధిని నీకు పంపిస్తాడు. ఆ ఉపాధి నీకు చేరి తీర్తుంది. అది ఇంకొకళ్ళకు చేరదు. అవసరం ఏర్పడినప్పుడల్లా ఆయన నీకు సాయపడ్తాడు. అంతే కాదు, ఆ ప్రసాదిత ఉపాధికి గాను కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని కూడా నీకువొసగుతాడు.

అల్లాహ్ సెలవిచ్చాడు : “మేము ఇస్రాయీల్ సంతతిలో కొందరిని మా ఆదేశాలను ప్రచారం చేసే నాయకులుగా, మార్గదర్శకులుగా జేశాము. మరి వారు సహనశీలురుగా, మా వాక్యాలను దృఢంగా విశ్వసించేవారుగా మారిన తరువాతనే మేము వారికి సారధ్య లక్షణాలను ప్రసాదించాము సుమా!”

తన దివ్య వచనంలో అల్లాహ్ వేరొక చోట ఇలా సెలవిచ్చాడు. “ఎవరయితే మా మార్గంలో కఠోరంగా పరిశ్రమిస్తారో వారికి మేము నిశ్చయంగా, రుజుమార్గం చూపిస్తాము. ఇంకా వారికి మార్గదర్శకత్వం వహిస్తాము.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఉద్బోధించారు: “నీ విషయంలో అల్లాహ్ తరఫున ఏది జరిగినా దాని గురించి నిందలు మోపరాదని మేము నీకు తాకీదు చేస్తున్నాము. ఒకవేళ నీవు ఏదేని కాలంలో కష్టాలకు లోనై ఉంటే ఉండొచ్చు. కాని కష్టం తరువాత సుఖం, దుఃఖం తరువాత సంతోషం అల్లాహ్ తరపున ప్రాప్తమవుతాయన్న సంగతిని నీవు మరువకు. ‘నిశ్చయంగా కష్టం తరువాత సుఖం ఉన్నద’ని ప్రభువు తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు కదా!

అల్లాహ్ అనుగ్రహాలు చాలా విస్తృతమైనవి. అగణ్యమైనవి. అవి ఎంత అపారమైనవంటే దాసుడు వాటి అంతుకు చేరలేడు. ‘మీరు అల్లాహ్ అనుగ్రహాలు లెక్కించదలిస్తే ముమ్మాటికీ లెక్కించలేరు’ అని ప్రభువు చెప్పనే చెప్పాడు. కనుక అల్లాహ్ అనుగ్రహాలు ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు, ఆయన కరుణానుగ్రహాల పట్ల నిరాశ చెందకు. సృష్టికర్త తప్ప సృష్టితాలతో రహస్య సంబంధం పెట్టుకోకు. నీవు ప్రేమిస్తే ఆయన్నే ప్రేమించాలి. అడిగితే ఆయన్నే అడగాలి. ఏదైనా ఫిర్యాదు చేయదలిస్తే ఆయనకే చేయాలి. ఎందుకంటే లోకంలో ఎన్నెన్ని సంఘటనలు జరిగినా, ఎటువంటి ప్రక్రియలు ప్రభవించినా అవన్నీ ఆ సృష్టికర్త అనుజ్ఞతోనే జరుగుతాయి. ఆయన తన పవిత్ర వచనంలో ఏమంటున్నాడో తెలుసా?! “ఒకవేళ అల్లాహ్ తరఫున నీకేదైనా నష్టం వాటిల్లినట్లయితే ఆ నష్టాన్ని పూడ్చగలవాడు ఆయన తప్ప మరెవరూ లేరు. మరి అల్లాహ్ నీకు ఏదైనా మేలు లేక లాభం చేకూర్చదలిస్తే, ఆయన దాక్షిణ్యం నీకు దక్కకుండా అడ్డు పడగల వారెవరూ లేరు.” ఒకవేళ నీవు అల్లాహ్ అనుగ్రహాలను పొంది ఉండి కూడా కృతఘ్నతకు పాల్పడితే, నిందలూ నిష్ఠూరాలకు దిగితే నీవు మేలును మరచిన వాడవవుతావు. అల్లాహ్ అనుగ్రహాలను నిర్లక్ష్యం చేసిన వాడవుతావు. ఇట్టి స్థితిలో అల్లాహ్ నీ పట్ల ఆగ్రహోదగ్రుడవుతాడు.

కనుక చెప్పవచ్చిందేమిటంటే నీ కొరకు రాసిపెట్టి ఉన్న దాని మీద నిందా ధోరణిని విడనాడు. అల్లాహ్ అభిమతంపై గోల చేయకు. అపార కరుణామయుడు, పరమదయాళువు, దాసులను కటాక్షించేవాడు, తల్లిదండ్రులకన్నా అధికంగా వాత్సల్యం చూపేవాడైన ప్రభువును నీవసలు ఎలా నిందించగలవు? ఆశ్చర్యంగా ఉందే! ‘తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపే జాలి కన్నా ఎక్కువగా అల్లాహ్ తన దాసులపై చూపుతాడ’ని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు కదా!

కాబట్టి మీరు కూడా అల్లాహ్ యెడల అత్యంత వినయంగా మసలుకుంటూ, జీవితంలో ఎదురయ్యే కష్టాలపై ఓర్పు వహిస్తూ, ఆయన్నుండి క్షమాభిక్షను, దయాదాక్షిణ్యాలను అర్థిస్తూ ఉండండి. ఎందుకంటే క్షమాపణ కోరిన వారిని క్షమించటం, కష్టాలను తొలగించటం ఆయన సంవిధానం. నీ ఇచ్ఛను దైవేచ్ఛతో అనుసంధానం చెయ్యి. నీ పాలిట భరించశక్యం కాని సంఘటనలు సంభవించినా వాటి గురించి నిందారోపణలకు పూనుకోకు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చిన సంగతి నీకు తెలియదా:- “ఓ ముస్లిములారా! మీ పై జిహాద్ విధిగా చేయబడింది అది మీకు ఎంత భరించశక్యం కానిదైనా సరే. మీరు ఇష్టపడని ఒక వస్తువు వాస్తవానికి మీ కొరకు ప్రయోజనకరమైనది కావచ్చు. అలాగే మీరు ఎంతగానో ఇష్టపడే ఒక వస్తువు మీ పాలిట హానికరంగా పరిణమించవచ్చు! వాస్తవ స్థితిని కేవలం అల్లాహ్ మాత్రమే ఎరుగు.”

అందుకే నీవు ఏ వస్తువునూ అది చెడ్డదని అనకు. ఎవరినీ ఆడిపోసుకోకు. దానికి బదులు నిర్ణీత విధానాన్ని అనుసరించు. సద్వ్యవహరణలో తొలి అడుగు ‘తఖ్వా’ (అల్లాహ్ భయభీతి) అయితే రెండో అడుగు ‘సామీప్య స్థితి’ మనిషి ‘తఖ్వా’లో పరిపూర్ణుడు కానంతవరకూ అతినికి అల్లాహ్ సామీప్యం ప్రాప్తించదు. మరి మనిషి ఈ ఉన్నత స్థితికి చేరడానికి అతడు మనోవాంఛల్ని అదుపులో పెట్టుకోవడం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం అనివార్యం…..”

మహనీయులైన హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ప్రబోధించారు :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏమని ప్రవచించారంటే “ఏ వస్తువు నిన్ను మీమాంసకు లోను చేస్తుందో (ఇది ధర్మమా లేక అధర్మమా అని సందేహంలో పడవేస్తుందో) దాన్ని విడనాడు.” ధర్మ సమ్మతమైన సంపాదనను ఆర్జించడానికీ, అధర్మమైన సంపాదనను విడనాడడానికి గాను ఇది అత్యంత ముఖ్యమైన వైఖరి. ఏదైనా వస్తువు యొక్క ధర్మాధర్మాల విషయమై నీ మనసు ఊగిసలాటలో పడి, అసంతృప్తి చెందితే దాన్ని ఇక వదలుకోవటమే మంచిది. అలాంటి కీలక తరుణంలో నీవు అల్లాహ్ దర్బారు వైపుకు మరలి, ధర్మ సమ్మతమైన ఆర్జన కోసం ప్రార్థించు. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ వాగ్దానం చేసిన విధంగా నిశ్చయంగా లేమి తరువాత కలిమి ప్రాప్తమవుతుంది. కష్టాల తరువాత సుఖాలు లభిస్తాయి. ఆయన వాగ్దానం సత్యమైనది. వాగ్దానాన్ని భంగపరచవలసిన లేక వాయిదా వేయవలసిన అగత్యం ఆయనకు లేదు. ఆయన నిన్ను విస్మరించలేదు, నీ స్థితిగతులు ఆయన దృష్టిలో లేకుండా లేవు. ఆయన ఎంత ఉదార స్వభావుడంటే తనను లక్ష్యపెట్టని వంచకులకు, దుష్టులకు, ధిక్కారులకు కూడా ఉపాధిని వొసగుతాడు. అటువంటప్పుడు ఓ విశ్వసించేవాడా! అల్లాహ్ దాస్యాన్ని అవలంబించే ఓ దాసుడా!! ఓ ఏకదైవారాధకుడా!!! ఆయన నిన్ను విస్మరిస్తాడని ఎలా అనుకుంటావు? హదీసులో చెప్పబడినట్లుగా – నీవు సాటి వాళ్ళ కానుకలపై, దానాలపై ఆశలు పెట్టుకోవడం గానీ, వాళ్ళకు భయపడటం గానీ చేయకు. ఇలా చేయటం కూడా షిర్కే సుమా! షిర్క్ కన్నా అవాంఛనీయమైన, సందేహాస్పదమైన వస్తువు ఇంకేముంది? అల్లాహ్ దయాదాక్షిణ్యాలపై నమ్మకముంచు. ఆయన ప్రసాదించిన ఉపాధి నీ దాకా చేరడం తథ్యం. కాబట్టి నీ ఆశలకు, ఆశయాలకు కేంద్ర బిందువు ఒక్కటే అయి ఉండాలి. నీవు ఒక్కరి నుండే కోరాలి. నీ కోర్కెలు తీర్చేవాడు ఒక్కడే అయి ఉండాలి. ఆ ఒక్కడు ఎవడంటే నీ సృష్టికర్త, పాలకుడు. రాజాధిరాజు దర్బారులో రాజుల తలలు వాలి ఉంటాయి. భూమ్యాకాశాల్లోని సృష్టితాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. ప్రాణుల వద్ద ఉన్నదంతా అసలు ఆయనదే. నీకు ఎవరి ద్వారానయినా కానుక రూపంలో ఏదైనా లభిస్తే అది ఆ ప్రభువు ఆజ్ఞతోనే, ప్రేరణతోనే లభించింది. “అల్లాహ్ ను ఆయన దయాదాక్షిణ్యాల కోసం వేడుకొనండి” అని పవిత్ర గ్రంథంలో అల్లాహ్ ఉపదేశించాడు. “మీరు అల్లాహ్ ను కాదని ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, వారు మీ ఉపాధికి యజమానులు కారు” అని కూడా ఆయన స్పష్టీకరించాడు.

కనుక ఒక్కడైన మీ ప్రభువును మాత్రమే ఉపాధికై అడగండి. ఆయన్నే సేవించండి. ఆయనకు మాత్రమే కృతజ్ఞులై ఉండండి. అల్లాహ్ ఇంకా ఈ విధంగా సెలవిచ్చాడు :- “(ఓ ప్రవక్తా!) నా దాసుడు నా గురించి నిన్ను అడిగితే, నేను అతని మొరను ఆలకించి ఆమోదిస్తానని చెప్పేయి.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఇలా ఉద్బోధించారు :- “జీవిత కాలంలో ఎప్పుడైనా పరిస్థితులు నీకు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఆపదల మూలంగా నీవు అశాంతికి లోనుకావచ్చు. అంతమాత్రానికే నీవు నిగ్రహం కోల్పోయి నిందారోపణలకు దిగకు. అల్లాహ్ నన్ను అభాగ్యునిగా చేశాడనీ, కష్టపెట్టి కఠినంగా పరీక్షిస్తున్నాడనీ, పరాయి వారికి పసందైన విలాస సామగ్రిని వొసగి నన్ను నిరాధారునిగా చేశాడనీ చెప్పుకోకు. వాస్తవానికి మనమందరం ఆదం హవ్వాల సంతానమే. హక్కులను పొందే విషయంలో మనమంతా సమానమే. నీవు ఎదుర్కొంటున్న ఈ పరీక్ష, నీవు లోనై ఉన్న ఆపదలు బహుశా నీ ఉన్నతి కోసం, నీ కలిమి కోసం, సుఖశాంతులు కోసం అల్లాహ్ విధించాడేమో! నీ సహన స్థయిర్యాలను పరీక్షించడానికీ, కష్టాలు కడగండ్ల నుండి నీవు నిఖార్సుగా నెగ్గుకు రావడానికని అల్లాహ్ కారుణ్యం ఇలా నిర్ధారించిందేమో! నీ విశ్వాస వృక్షం ఎటువంటిదంటే, దాని వ్రేళ్ళు ఎంతో బలమైనవి. అది బాగా ఏపుగా పెరిగి ఫలవంతమవుతుంది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తన నీడను పెంచుకుంటుంది. విశ్వాసమనే ఈ మహా వృక్షం దినదిన ప్రవర్ధమానమై అల్లాహ్ కటాక్షంతో మధురమైన ఫలాలను అందిస్తుంది. నీ ఈ స్థితిని అల్లాహ్ ఇహపరాలలో సాఫల్యానికి, శుభాలకు కారకంగా చేశాడు. ఏ కన్నూ కానని, ఏ కర్ణపుటానికీ సోకని అనుగ్రహాలను నీ కొరకు ప్రత్యేకించాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: “తన సత్కర్మలకు బదులుగా తన కండ్లకు చలువను ఇచ్చే ఏ ఏ వస్తువులు భద్రపరచబడి ఉన్నాయో ఏ వ్యక్తికీ తెలియదు. ఎవరయితే అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తారో, పాపాలకు దూరంగా ఉంటారో, వ్యవహారాలన్నింటిలోనూ వినమ్రత ద్వారా అల్లాహ్ ప్రసన్నతను బడయటానికి ప్రయత్నిస్తారో వారి కొరకు ఇహపరాల శుభాలు నిర్ణీతమై ఉన్నాయి. వారి మనసులు ఆస్వాదించిన ‘నెమ్మది’ ఏనాటికీ అంతమవదు. కాని దీనికి విరుద్ధంగా ఎవరయితే తమ సృష్టికర్తను, ఆరాధ్య అల్లాహ్ ను విస్మరించి, వైముఖ్య ధోరణిని కనబరిచారో, మనోవాంఛల జగత్తునే తమకు ఆరాధ్యంగా చేసుకున్నారోవారు ఎటువంటి నిస్సారమైన నేల వంటి వారంటే దానికి అయ్యే నీటి సరఫరా ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. దాన్నుండి ఎలాంటి మొక్క మొలకెత్తదు. ఎటువంటి కాయా కాయదు. దానిలో ఎలాంటి పంటా పండదు. కర్తవ్యాన్ని విస్మరించి, దుర్మార్గాన్ని అనుసరించిన మనిషి పరిస్థితి కూడా ఇంతే. కాని అల్లాహ్ మాత్రం దాసుల పట్ల ఎంతో ప్రేమ మరియు దయ గలవాడు. వారు పురోభివృద్ధి చెందాలన్నది, సుఖ సంతోషాలతో విరాజిల్లాలన్నదే ఆయన అభిలాష.

….. మనిషి జీవిత వృక్షంలో నుండి విశ్వాసమనే గుణం క్షీణిస్తే అది పూర్తిగా వాడిపోతుంది. అప్పుడు అతని ఉనికి వల్ల అతని స్వయానికి గానీ, మానవ జాతికి గానీ ఎలాంటి మేలు చేకూరదు. లోకంలో కానవచ్చే వ్యక్తిగత, సామూహిక ప్రగతులు, శుభాలన్నీ విశ్వాసానుగ్రహం యొక్క ఫలమేనన్నది నిర్వివాదాంశం. ఎవరిలోనయితే విశ్వాస (ఈమాన్) భాగ్యం లేదో వారు ఖుర్ఆన్ ప్రకారం తిరస్కారులు, అవిధేయులు, కపటులు, అల్లాహ్ ఆగ్రహానికి గురైనవారు, ఇహపర లోకాలలో పరాభవం పొందిన వారు అవుతారు.

అల్లాహ్ తన కృపతో మన విశ్వాసాన్ని (ఈమాన్ ను) దృఢతరం చేయుగాక! మనల్ని రుజుమార్గంపై నడిపించుగాక!!

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు :-

“ఈ లోకంలో మంచీ మరియు చెడు రెండూ ఉన్నప్పటికీ, మనిషి ప్రవర్తన ద్వారా ఈ రెండు గుణాలూ బహిర్గతమవుతున్నప్పటికీ అసంఖ్యాకమైన దివ్యవచనాల ప్రకారం మంచికి బాట వేసే పనులన్నీ అల్లాహ్ తరపునే జరుగుతాయి. కాగా; చెడు వైపుకు దారి తీసే పనులన్నీ షైతాన్ తరఫున గానీ, దుష్ట మనసు (నఫ్సె అమ్మార) తరఫున గానీ జరుగుతాయి. కాబట్టి మేలుకు సంబంధించిన వాటన్నింటినీ అల్లాహ్ కు ఆపాదించాలి. ఎందుకంటే కీడు అన్నది ఆయన నామంలో గానీ, గుణగణాలలో గానీ ఎక్కడా లేదు. ఇది వాస్తవానికి మనిషిలోని దుష్ట మనసు చేత సృష్టించబడినది మాత్రమే. ఆ విషయాన్నే పరమ ప్రభువైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు : ‘మీకు ఏ మంచి చేరినా అది అల్లాహ్ తరఫున చేరుతుంది. మరి మీకు ఏ చెడు వాటిల్లినా అది స్వయంగా మీ మనసు మూలంగానే వాటిల్లుతుంది. కనుక మంచి మార్గాన్ని అంటే ఏకేశ్వరోపాసన మరియు భయభక్తుల మార్గాన్ని – అవలంబించవలసిందిగా, దుర్మార్గానికి అంటే షిర్క్ మరియు పాపాలను విడనాడవలసిందిగా నేను నీకు తాకీదు చేస్తున్నాను. అల్లాహు తాలా ఇలా ఉపదేశిస్తున్నాడు – ‘ఓ నా దాసులారా! మీరు స్వర్గంలో మీ సత్కర్మలకు బదులుగా ప్రవేశించండి’. సుబహానల్లాహ్! ఎంతటి ఔదార్యం ఇది!! మానవుడు తన పుణ్యకార్యాల ఆధారంగా స్వర్గానికి అర్హత సంపాదించాడని అల్లాహ్ ఖరారు చేశాడంటే నిస్సందేహంగా ఇది ఆయన చలువ మరియు కటాక్షం మాత్రమే. వాస్తవానికి ఈ పుణ్య కార్యాలు కూడా అల్లాహ్ తోడ్పాటు వల్లనే లభించినవే.

“ఏ వ్యక్తీ కేవలం తన సత్కర్మల ఆధారంగా స్వర్గ ప్రవేశం చేయలేడు” అని అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించి ఉన్నారు. ‘ఓ దైవ ప్రవక్తా! మీరు కూడా అంతేనా?!’ అని సహచరులు అడిగితే ‘నేనైనా అంతే. అల్లాహ్ తన ప్రత్యేక కరుణతో నన్ను కప్పుకుంటే అది వేరే విషయం’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) ఉల్లేఖించిన హదీసు ఇది. కాబట్టి షరీఅత్ను గౌరవించవలసిందిగా, సన్మార్గాన్ని అవలంబించవలసిందిగా నేను నిన్ను గట్టిగా కోర్తున్నాను. నీవు అల్లాహ్ ఆదేశాలను శిరసావహించసాగితే, షరియత్ విధానాన్ని గౌరవించసాగితే అల్లాహ్ నిన్ను కీడు నుండి కాపాడుతాడు. మంచి మార్గం వైపుకు దర్శకత్వం వహించి, షరియత్ సూత్రాలను నీ కొరకు సులభతరం గావిస్తాడు. ఈ ప్రాతిపదిక పైనే హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “మేము యూసుఫ్ (అలైహిస్సలాం)ని అన్ని రకాల చెడుల నుండి, నీతి బాహ్యమైన పనుల నుండి కాపాడాము. ఎందుకంటే అతడు మా నికార్సయిన దాసుల కోవకు చెందినవాడు.” వేరొక చోట ఇలా అంటున్నాడు ‘మీరు గనక విశ్వసించి, కృతజ్ఞులుగా వ్యవహరిస్తే మిమ్మల్ని యాతన పెట్టవలసిన అవసరం అల్లాహ్ కు ఏం పడింది?’

పై వచనం ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే విశ్వాసులు మరియు కృతజ్ఞులు అయిన దాసులు ప్రపంచంలో కూడా కష్టాలకు, ఆపదలకు దూరంగా ఉంచబడతారు. పరలోకంలో కూడా అవమానాల నుండి, యాతనల నుండి ముక్తి పొందుతారు. కాబట్టి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్న కొద్దీ అల్లాహ్ అనుగ్రహాలలో వృద్ధి వికాసాలు జరుగుతుంటాయి.

“ఓ విశ్వాసీ! నీ విశ్వాస జ్యోతి పరలోకంలో నరకాగ్నిని సయితం ఆర్పగలిగినప్పుడు అది ఇహలోకంలోని ఆపదల బడబాగ్నిని ఎందుకు చల్లార్చదు? ఆఁ! విశ్వప్రభువు తరఫున నియుక్తమైన మహనీయులకు, సజ్జనులకు కూడా ఈ లోకంలో ఒక్కోసారి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాల వెనుక కూడా పరమార్థం తప్పక ఉంటుంది. కష్టాల కడలిలో ఎదురీత ద్వారా వారి విశ్వాసాన్ని మరింత దృఢతరం చేయడం, వారి మనో మస్తిష్కాలను శుద్ధి చేయడం అల్లాహ్ అభిమతం అయి ఉండవచ్చు. లేదా నిరంతర పరీక్షల ద్వారా ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా వారిని మలచాలన్నది, అలా చేయడం వల్ల వారు సత్యపథంలో నికార్సుగా నెగ్గుకు రాగలుగుతారన్నది అల్లాహ్ ప్రణాళిక కావచ్చు. మానవాత్మలో ఒకే ఆరాధ్య అల్లాహ్ కు చోటుండాలి. అందులో ఇద్దరు స్థిరపడలేరు. ఒక్క అల్లాహ్ ను గాక ఇతర అస్థిత్వానికి కూడా హృదయంలో చోటిస్తే అది షిర్క్ (బహుదైవోపాసన) అయిపోతుంది. విశ్వాస పరమైన చెడుగు గానీ, క్రియాత్మకమైన కీడు గానీ నిజానికి ఇక్కడి నుండే మొదలవుతుంది.

తద్భిన్నంగా తౌహీద్ మనిషి హృదయాన్నీ, అవయవాలను పరమోన్నతునికే ప్రత్యేకిస్తూ, అతని మనసును అన్ని రకాల వక్రతల నుండి, మలినాల నుండి పరిశుద్ధంగా ఉంచుతుంది. ఆ విధంగా మనిషికి సంపూర్ణ స్థిమితం ప్రాప్తిస్తుంది. ఏ వ్యక్తి యొక్క ఏకేశ్వరోపాసనాతత్వం ఎంత బలంగా ఆరోగ్యవంతంగా ఉంటుందో అల్లాహ్ సామీప్యం కూడా అతనికి అంతగానే లభిస్తుంది. ఈ కారణంగానే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా ప్రవచించారు: “నేను అల్లాహ్ ను మీ అందరికన్నా ఎక్కువ తెలుసుకున్న వాడను. మరి మీ అందరికన్నా అధికంగా అల్లాహ్ కు భయపడేవాడను.”

కాబట్టి విదితమయ్యేదేమిటంటే ఏ వ్యక్తి తన సృష్టికర్తకు ఎంత సమీపంలో ఉంటాడో అంతే అతనికి భయపడుతూ మసలుకుంటాడు. అతని ఆజ్ఞలకు బద్ధుడై ఉంటాడు. సత్య సామీప్యం వల్ల జనించే మరో సత్ప్రభావం ఏమిటంటే, ఆ దాసుడు అల్లాహ్ అనుగ్రహాలను గౌరవిస్తాడు, అతని ఒక్కో ‘శ్వాస’లో కృతజ్ఞతా భావం తొణికిసలాడుతూ ఉంటుంది. అతని మనసు అల్లాహ్ యేతరుల వైపుకు మొగ్గదు.”

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఉపదేశించారు : “నీవు నీ మనోవాంఛల్ని అనుసరిస్తూనే అల్లాహ్ కటాక్షాన్ని, అల్లాహ్ సహాయాన్ని అర్థిస్తున్నావు. మరి అతని సహాయానికి తౌహీద్ ఒక మౌలికమైన అంశం. ‘తన మనసునే తన ఆరాధ్యునిగా చేసుకున్న ఆ వ్యక్తిని మీరు చూడలేదా?’ అని అల్లాహ్ సెలవిస్తున్నాడు.

అల్లాహ్ సహాయానికి, తోడ్పాటుకు, అనుగ్రహాల ప్రాప్తికై నీవు ఏకేశ్వరోపాసిగా మారడం తప్పనిసరి అన్నది బహిరంగ సత్యం. షిర్క్ వైపుకు దారి తీసే అవకాశాలన్నింటినీ అంతం చేసి అంతర్గతంగానూ, బహిర్గతంగానూ ఒక్కడైన అల్లాహ్ కు విధేయుడుగా రూపొందనంతవరకూ నీవు ఇహపరాలలో సాఫల్యం పొందజాలవు. వేరే మాటల్లో – ఈ ప్రపంచం నీ మనసైన కోర్కెలకు మారుపేరు. కాగా, మనోవాంఛల దాస్యాన్ని త్యజించి, దైవేచ్ఛకై అర్పించు కోవటమే తౌహీద్. ఆ తౌహీద్ నిన్ను విశ్వాసం మరియు ఆచరణల యొక్క చెడుగులన్నింటి నుండి పరిశుద్ధం చేసి, ఒక స్వచ్ఛమైన దాసునిగా నిన్ను పరమోన్నతుని పవిత్ర దర్బారులో నిలబెడుతుంది. అక్కడ నీకు శుభవార్త ఇవ్వబడుతుంది. ‘ఈ రోజు నీవు మా దృష్టిలో సంపన్నుడవు, ప్రియుడవు, కార్యబద్ధుడవు’ అని. ఈ స్థానం పొందిన మీదట నీ కొరకు అల్లాహ్ అనుగ్రహాలు విస్తారమవుతాయి. అల్లాహ్ సామీప్యం నీకు ప్రాప్తిస్తుంది. అల్లాహ్ ప్రసన్నత నీ ఆత్మ తృప్తికి ప్రాతిపదికగా నిలుస్తుంది. ఖనిజాలు, లోహాదులన్నీ సానబెట్టక ముందు ఎంతో వికృతంగా, అపసవ్యంగా ఉంటాయి. ఆపైన రసాయనిక ప్రక్రియ ద్వారా మట్టి, ఇసుక వంటి రేణువులు తొలగించబడతాయి. ఫలితంగా ఆ ఖనిజాలు నాణ్యతను సంతరించుకుని లాభసాటిగానూ, అమూల్యమైనవిగానూ రూపొందుతాయి. మానవ అస్థిత్వం కూడా ఇటువంటిదే. నాస్తికత్వం, బహుదైవారాధన, మూఢనమ్మకాలు, దుష్టపోకడలు, మనోవాంఛల దాస్యం వంటి అవలక్షణాల నుండి అతడు పరిశుద్ధం అయిననాడు పరిపూర్ణ మానవుడుగా రూపొందుతాడు. అప్పుడు అతని వల్ల అతని స్వయానికే గాక మానవ జాతికి కూడా అమితమైన ప్రయోజనం చేకూరుతుంది. కనుక విశ్వాసం మరియు ఆచరణల యొక్క తుప్పును తొలగించుకుని నీవు కూడా నికార్సయిన ఏకదైవారాధకునిగా తయారుకమ్మనీ, షిర్క్ మరియు పాపకార్యాలకు దూరంగా ఉండమనీ నేను నీకు గట్టిగా తాకీదు చేస్తున్నాను. ఇలా చేసిన నాడు నీవు నిశ్చయంగా అల్లాహ్ సామీప్యం పొందుతావు. విజ్ఞతా వివేచనలు నీకు వొసగబడుతాయి. పరలోకంలో ప్రవక్తలు మరియు సిద్దీఖుల సరసన నీకు గౌరవప్రదమైన స్థానం కల్పించబడుతుంది.

కాబట్టి అల్లాహ్ విధేయతా మార్గాన్ని అనుసరించు. దాని శుభం వల్ల నీకు విషయం లోతుల్లోకి వెళ్ళే జ్ఞానం ప్రసాదించబడుతుంది. అల్లాహ్ కటాక్ష వీక్షణాలు నీపై అధికంగా ప్రసరిస్తాయి. ఒక విషయం బాగా గుర్తుంచుకో- ప్రపంచంలో నీకు ఎన్ని గోచరాగోచర అనుగ్రహాలు లభ్యమైనా, పరలోకంలో నీకు ఎన్ని గౌరవోన్నత స్థానాలు ప్రాప్తించినా అవన్నీ తౌహీద్ (ఏకదైవారాధన) యొక్క తీపి ఫలాలే సుమా! (“ఫుతూహుల్ గైబ్”” ఆధారంగా)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు:-

“ప్రేమ అన్నది నిజ భావంలో అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడింది. అందులో అల్లాహ్ యేతరులకు ప్రమేయం కల్పిస్తే అది షిర్క్ అవుతుంది. ఎందుకంటే మానవ హృదయం స్వతహాగా అల్లాహ్ ప్రేమనే కాంక్షిస్తుంది. అయితే ఆ హృదయంలో అల్లాహ్ యేతరుల ప్రేమ కూడా గూడు కట్టుకున్నట్లయితే అల్లాహ్ ఏకత్వాన్ని అగౌరవ పరచినట్లే లెక్క. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు ‘విశ్వాసులు, ఏకదైవారాధకులయిన నా దాసులు నన్ను ప్రేమిస్తారు. నేను వారిని ప్రేమిస్తాను‘ ఇంకొక చోట ఏమన్నాడో చూడండి : ‘మీరు గనక అల్లాహ్ ను విశ్వసిస్తున్నట్లయితే, ఆయన్నే సేవిస్తున్నట్లయితే మరి కేవలం ఆయన్నే ప్రేమించండి‘. మరోచోట ఇలా సెలవిచ్చాడు. ‘ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ ఆలుబిడ్డలు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం పట్ల మరుపుకు గురి చేయరాదు సుమా! ఎవరయితే వీటి ప్రేమలో లీనమైపోయి అల్లాహ్ ధ్యానాన్ని విస్మరిస్తారో వారే దారి తప్పినవారు, నష్టాన్ని చవిచూసినవారు“.

“ఇలాంటి హితోపదేశాలే ఖుర్ఆన్తో పాటు హదీసులలో కూడా అనేకం ఉన్నాయి. కనుక నీవు నీ ప్రేమను, శ్రద్ధాభక్తులను అల్లాహ్ కొరకే ప్రత్యేకం చేసుకోవలసిందిగా నేను తాకీదు చేస్తున్నాను. అల్లాహ్ యేతరుల జోలికి పోకు. మానవ నైజంలో పొందుపరచబడి ఉన్న అల్లాహ్ పట్ల గల ఆ పవిత్ర ప్రేమ భావాన్ని ఇతరులకోసం ధారబోయకు. నువ్వు గనక ఒకవేళ ఇలా చేశావంటే నీ హృదయం ఏకేశ్వరోపాసనాభావాన్ని, అది కోరే పరివర్తనను ఆస్వాదించలేకపోతుంది. నీవు అల్లాహ్ ఏకత్వాన్ని, అది కోరే ముఖ్యాంశాలను అర్థం చేసుకున్ననాడు, తాత్కాలికమయిన వాటికి బదులు కలకాలం ఉండే శక్తి మంతుని ప్రేమించిన నాడు అతని మధురిమ, కటాక్షం నిన్ను స్వాగతిస్తుంది. అప్పుడు నీకు ఇహపరాలు రెండింటిలోనూ ఏకేశ్వరోపాసకునిగా గౌరవోన్నతులు లభిస్తాయి. అల్లాహ్ యేతరులను పూజించే వారికి ఈ భాగ్యం ఎన్నటికీ లభించదు”.(“ఫుతూహుల్ గైబ్” నుండి)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు:

“ఓ ముస్లిం! అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), దైవగ్రంథంపై విశ్వాసంతో ఊపిరి పీల్చే నీవు సాటి ముస్లిం పట్ల అసూయ చెందటం చూసి నాకెంతో బాధ కలుగుతుంది. నీ విశ్వాసం వార్ధక్య స్థితికి చేరుకుందని, అల్లాహ్ పై గల నీ నమ్మకం సన్నగిల్లిందని నేను గట్టిగా చెప్పగలను. నీవు అతని (నీ సోదరుని) కలిమిని, నిశ్చింత స్థితిని చూసి ఓర్వలేకుండా ఉన్నావు. నీవతని మంచి దుస్తులను, మంచి ఆహారాన్ని, వివాహాన్ని, ఆలుబిడ్డలను చూసి అసూయతో దహించుకుపోతున్నావు. నీ సంకుచిత మనస్తత్వం, అల్ప బుద్ధి వల్ల సృష్టికర్త, ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ ప్రసాదించిన వరాలన్నింటికీ దూరమైపోవాలని నీవు కోరుకుంటున్నావు. వేరే మాటల్లో చెప్పాలంటే నీవు అల్లాహ్ దైవత్వంలో, ఆయన ఉపాధి పంపిణీలో, అభిమతంలో జోక్యం చేసుకో గోరుతున్నావు. ఇది అత్యంత హానికరం, వినాశానికి హేతువు వంటిది.

బాగా గుర్తుంచుకో! అల్లాహ్ అధికారాలు నీ అధికారాలు కాలేవు. అల్లాహ్ ఏ వ్యక్తికయినా ఏదైనా ఇస్తే లేదా ఇవ్వదలిస్తే నీవు నీ ఓర్వలేనితనంతో ఆ వరాలు అతనికి దక్కకుండా చేయబూనుతావా? ఇది అల్లాహ్ తో పోటీపడటం కాదా? ఇది అల్లాహ్ నిర్ణయాన్ని సవాలు చేయటం కాదా? ఒకవేళ ఇదే నిజమైతే (ముమ్మాటికీ నిజమే కదా!) నీవు పరాభవానికి, వినాశానికి లోనవుతావు. అసూయ ఎంత భయంకరమైన మహమ్మారి అంటే అది నీ విశ్వాసాన్ని లోపలి నుంచి డొల్లగా చేసివేస్తుంది. అది నిన్ను ప్రభువు కటాక్షవీక్షణాలకు నోచుకోకుండా చేసేస్తుంది. అల్లాహ్ ను నీకు విరోధిగా చేసేస్తుంది. దివ్య ఖుర్ఆన్లోని హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) మరియు ఆయన సోదరుల వృత్తాంతంలోని పరమార్థాన్ని గురించి కాస్త ఆలోచించండి. యూసుఫ్ సోదరులు తమ కుటిల పన్నాగాల ద్వారా, శత్రుత్వ విధానాల ద్వారా ఆయనకు ప్రాప్తించే గౌరవోన్నతుల్ని అడ్డుకోగలిగారా? ఎట్టకేలకు ఆ అసూయపరులు పరాభవంపాలై, ఈజిప్టుకు అధిపతిగా ఉన్న యూసుఫ్ (అలైహిస్సలాం) ముందు తల వంచవలసి వచ్చింది. ‘అల్లాహ్ సాక్షి! ఆయన నీకు మాపై శ్రేష్ఠత నొసగాడు. నీపై మేమెన్నో దౌర్జన్యాలు చేశాము. మమ్మల్ని క్షమించు’ అని ప్రాధేయపడాల్సి వచ్చింది. ఈ విధంగా పెక్కు చోట్ల ఖుర్ఆనీ వచనాలు అసూయను ఖండిస్తున్నాయి.

హదీసులలో కూడా పదే పదే ‘అసూయ’ ఖండించబడింది. “అగ్ని కట్టెల్ని దహించి వేసినట్లుగానే అసూయ ముస్లింల పుణ్యకార్యాల్ని దహించి వేస్తుంద”ని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు. మరో సందర్భంలో అసూయ గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అసూయ చెందేవారు నాకు మరియు నా వరాలకు శత్రువులు అని అల్లాహ్ సెలవిచ్చాడు”.

“ఎవరయినా అల్లాహ్ కు, అల్లాహ్ ప్రసాదిత వస్తువులకు శత్రువులుగా ఎలా రూపొందుతారని అనవచ్చు. అల్లాహ్ తన అభిమతానికి, ప్రణాళికకు అనుగుణంగా ఎవరయినా ఏదైనా ప్రసాదించ దలుస్తున్నపుడు అసూయాపరులు లోలోపలే ఉడుక్కుంటారు. ఈ వరాలు ఎదుటి వారికి దక్కకుండా ఉంటే బావుండునే! అని దుష్ట సంకల్పం చేసుకుంటారు. అల్లాహ్ గ్రంథంలోని ఈ వచనం చెప్పేదేమిటి? “మేము ప్రాపంచిక జీవితంలోనే మా దాసులు ఉపాధిని, ఆర్థిక స్థోమతను పంపిణీ చేసే శాము”. ఇక అల్లాహ్ నిర్ణయాన్ని గానీ, ఈ పంపిణీ వ్యవస్థను గానీ ఛాలెంజ్ చేసే ధైర్యం ఏ ధర్మ భ్రష్టుడికైనా ఎక్కడుంటుంది? ఒకవేళ ఎవరయినా ఇలాంటి పోకడకు పూను కుంటే అది శుద్ధ అవివేకమే. పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “మేము మా దాసులకు అన్యాయం చెయ్యము. వాళ్ళే తమ అసూయ మూలంగా, దుష్కర్మల మూలంగా తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటారు”. ఇంకా ఇలా అనబడింది: “మా ఆజ్ఞలు, నిర్ణయాలు మారవు. మేము మా దాసులపై కొద్దిపాటి అన్యాయానికి కూడా ఒడిగట్టము”.

“కనుక నేను నీ శ్రేయోవికాసాలను కాంక్షించి చెప్పేదేమిటంటే, నీవు ఏ ముస్లిం సోదరుని బాగోగులనైనా చూసి అసూయ చెందకు. పైగా అతని సిరిసంపదల్ని, పురోభివృద్ధిని చూసి ఆనందించు. మనస్ఫూర్తిగా అతన్ని అభినందించు. నీ ఈ ధోరణిని చూసి అల్లాహ్ కూడా ప్రసన్నుడవుతాడు. అసంఖ్యాకమైన తన అనుగ్రహాల ద్వారాల్ని నీ కొరకు కూడా తెరుస్తాడు. అల్లాహ్ నిన్ను మరియు మమ్ము కూడా అసూయ లాంటి వినాశకర వస్తువు నుండి సురక్షితంగా ఉంచుగాక! మమ్మందరికీ కృతజ్ఞతా భావాన్ని ప్రసాదించు గాక”.

“నువ్వు నీ స్వవిషయంలో కూడా అసూయ చెందరాదని ఈ సందర్భంగా నీకు చెప్పదలిచాను. స్వవిషయంలో అసూయ చెందడమేమిటీ? అంటావా. దీని అర్థం ఏమిటంటే ఉపాధి ప్రదాత తన కృపతో నీకు పుష్కలంగా ప్రసాదించినపుడు వాటిని వినియోగించే విషయంలో నీవు పిసినారిగా మారడం, బొత్తిగా ఖర్చు పెట్టకుండా ఉండటం. ఉదాహరణకు: రూపాయిని మిగిల్చడానికి సరిగ్గా తినకపోవటం, సరైన దుస్తులు ధరించకపోవటం, సరైన ఇల్లు నిర్మించుకోక పోవటం, ఆలుబిడ్డల కనీసావసరాలు కూడా తీర్చకపోవటం ఇత్యాదివన్నీ తమ ఆత్మపై అసూయ చెందటంగా, ఆత్మపై అన్యాయానికి ఒడిగట్టడంగా, అల్లాహ్ అనుగ్రహాలను ఖాతరు చేయకపోవటంగా భావించబడుతాయి. అనుగ్రహాల క్రియాత్మక సిద్ధాంతం ఏమిటంటే, అవి ఎవరికయినా ప్రాప్తించినపుడు వాటిని గోప్యంగా ఉంచే బదులు బహిర్గతం చేయాలి. వాటిని విరివిగా వినియోగించి గౌరవించాలి. అల్లాహ్ తన అంతిమ ప్రవక్తను ఉద్దేశ్యించి “మీ ప్రభువు ప్రసాదించిన అనుగ్రహాలను వ్యక్తపరచండి (వాటిని వినియోగించండి)” అని చెప్పాడు. అల్లాహ్ మనందరికీ మనోవాక్కాయ కర్మల ద్వారా అల్లాహ్ ప్రసాదితాలకు కృతజ్ఞతలు తెలిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక! (ఆమీన్)”(“ఫుతూహుల్ గైబ్ ” నుండి)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు-

“ఈ ప్రపంచంలో మానవ మనసు రెండు స్థితులకు లోనవుతుంది. ఒక స్థితిలో అది సుఖ సౌఖ్యాలను, ఆనందానుభూతిని పొందుతుంది. రెండవ స్థితిలో కష్టాలు కడగండ్లను ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఈ రెండు స్థితులలోనూ మానవుడు పరీక్షించబడతాడు. అతడు తన ప్రభువుకు ఏ మేరకు విధేయుడై ఉంటాడో టెస్ట్ చేయబడతాడు. మానవుడు సుఖ సౌఖ్యాలను పొందినపుడు పరధ్యానానికి, అప్రమత్తతకు లోనై అల్లాహ్ ను నిర్లక్ష్యం చేస్తాడని, కష్టాలొచ్చి పడగానే కృతఘ్నుడై నిందలు నిష్ఠూరాలకు సిద్ధమవుతాడనీ అల్లాహ్ సెలవిచ్చాడు.”

“మానవ మనసు యొక్క ఓ పెద్ద బలహీనత ఏమిటంటే సుఖశాంతులు, సిరిసంపదలు ప్రాప్తించినపుడు అది అణకువతో ఉండి అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో మెలగదు సరికదా కష్టాలు సోకగానే సహన స్థయిర్యాలను విడనాడి అల్లాహ్ కు వ్యతిరేకంగా నిందారోపణలకు దిగుతుంది.

“ఇంతకీ చెప్పవచ్చిందేమిటంటే అనుచితంగా, అపసవ్యంగా వ్యవహరించటమే మనసు పని. అల్లాహ్ చేత సృష్టించబడిన వాటిని అల్లాహ్ కు సాటిగా నిలపటం, అల్లాహ్ ప్రసాదితమైన ఉపాధి పట్ల సంతృప్తి చెందకపోవటం దానికి అలవాటు. అంతేకాదు, గొంతెమ్మ కోర్కెలతో అది మనిషిని ఆందోళనా భరితమైన స్థితిలో పడవేస్తుంది. మరి ఆ మనసునే గనక కష్టాలు, బాధల నుండి విముక్తం చేసి కలిమిని ప్రసాదిస్తే తన పూర్వస్థితిని మరచిపోయి అహంకారంతో విర్రవీగుతుంది. అల్లాహ్ విధేయత పట్ల విముఖత చూపుతుంది. అనంతరం దానికి మళ్ళీ కష్టాల రుచి చూపటం జరుగుతుంది. దాని తిక్క కుదర్చటానికే, ఘోరమైన పాపాల నుండి ప్రక్షాళనం చేయడానికే ఇలా చేయబడుతుంది. మరి ఆ మనసు నిర్లక్ష్య వైఖరిని మాని రుజువర్తన చెందినట్లయితే, కృతజ్ఞతా వైఖరిని అలవరచుకున్నట్లయితే అల్లాహ్ తనకానుకల్ని నిరంతరం ప్రసాదిస్తాడు. సర్వావస్థల్లో అండగా నిలుస్తాడు”.

“కాబట్టి ఇహ పరలోకాల్లో గౌరవ మర్యాదలను, శ్రేయోవికాసాలను కోరుకునే వ్యక్తి సహన స్థయిర్యాలను అలవర్చుకోవాలి, అల్లాహ్ యెడల వైముఖ్య ధోరణిని విడనాడాలి. తన సృష్టికర్తను గురించి సాటి మనుషులతో ఫిర్యాదు చేయడం మానుకోవాలి. తమ అక్కరలకై అల్లాహ్ నే అడగాలి. అల్లాహ్ ప్రసాదించిన దానిపై కృతజ్ఞతా భావంతో మెలగాలి”.

“అల్లాహ్ తన అభిమతాన్ని, పరమార్థాన్ని దాసులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతాడు. అయితే దాసుడు వినయవినమ్రతలతో మెలగుతూ, దైవేచ్ఛతో సమరసం చెందటం అనివార్యం. తన మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ, వైఖరి ద్వారా గానీ అల్లాహ్ కు విరుద్ధంగా నిందలు మోపరాదు. ఈ మాటలన్నింటి సారాంశం హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) చేత ఉల్లేఖించబడిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలో ఉంది. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ ఇలా తెలియచేశారు. “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) వెనుక స్వారీ అయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ఉద్దేశ్యించి ఉపదేశించారు – ‘అబ్బాయి ! నీవు అల్లాహ్ హక్కులను కాపాడు. అల్లాహ్ నీ హక్కులను కాపాడుతాడు. అల్లాహ్ నిన్ను ప్రత్యక్షంగా గమనిస్తున్నాడని తెలుసుకో. అప్పుడు నీవు అతన్ని నీ ఎదుట ఉన్నట్లే భావించగలవు. నీవు అడగదలచుకున్నప్పుడు అల్లాహ్ నే అడుగు. సహాయం కొరకు అర్థించదలచినప్పుడు అల్లాహ్ సహాయాన్నే అర్థించు. అల్లాహ్ తన దాసుల కోసం ఏదయితే రాసిపెట్టాడో, అది ఆది నుండే నిర్ధారితమైపోయింది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఏ వ్యక్తికయినా చేకూరవలసిన లాభం చేకూరి తీరుతుంది. వాటిల్ల వలసిన నష్టం వాటిల్లి తీరుతుంది. మరి నీవు గనక అల్లాహ్ పై పూర్తిగా భారం మోపినట్లయితే, దృఢ నమ్మకంతో వ్యవహారం చేసినట్లయితే ఆయన నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు….(“ఫుతూహుల్ గైబ్” – ఆధారంగా)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు.

“ఎవరయితే మెలకువ, జాగరణపై నిద్రకు శ్రేష్ఠత నొసగాడో అతడు రెండు లోకాలలోనూ నష్టాన్ని చవిచూస్తాడు. ఎందుకంటే నిద్ర మృత్యువుకు తోబుట్టువుగా ఖరారు చేయబడింది. మోతాదుకు మించి నిద్రపోతే అది ప్రమత్తతకు, స్తబ్ధతకు ప్రతీక అవుతుంది: అతి నిద్ర మోమిన్ (విశ్వాసి)ని అల్లాహ్ ధ్యానం నుండి, పుణ్యకార్యాల నుండి దూరంగా ఉంచుతుంది. పైగా అతి నిద్ర మూలంగా హృదయం కఠినమైపోతుంది. మనసుపై చీకటి అలుము కుంటుంది. సహజ సిద్ధమైన ఆధ్యాత్మికత అతన్నుండి మటుమాయమైపోతుంది. ఆ విధంగా మనిషి విషయలాలస వైపుకు మొగ్గుతాడు. అందుకే అల్లాహ్ నిద్రపోడు. ఆయనకు కనీసం కునుకు కూడా పట్టదు. ఎందుకంటే ఆయన మానవ సహజమైన దౌర్బల్యాలన్నింటికీ అతీతుడు. అలాగే దైవదూతలకు కూడా నిద్ర నిషేధించబడింది. ఎందుకంటే దైవదూతలు అల్లాహ్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.”

“కాబట్టి ఒక విశ్వాసి అవసరానికి మించి నిద్రపోవటం ఎంతకీ సమంజసం కాదు. పైగా అది అతన్ని పరధ్యానానికీ, దరిద్రావస్థకు, దుర్భర స్థితికి లోనుచేస్తుంది. తద్భిన్నంగా మేల్కొని ఉండి అల్లాహ్ ధ్యానంలో, అల్లాహ్ ఆరాధనలో, సాటి జీవుల సేవలో గడిపినట్లయితే అది సాఫల్యానికి బాటవేస్తుంది. కనుక మనోవాంఛకు బానిసై మోతాదుకు మించి నిద్రపోయేవాడు అమూల్యమైన సత్కార్యాలకు దూరమై పోతాడు. మళ్ళీ ఆ లోటును పూడ్చుకునే అవకాశం అతనికి తిరిగిరాదు. ఈ కారణంగా ప్రవక్తలు, సిద్దీఖులు, పుణ్యపురుషులు – వీళ్లందరూ తమ జీవితకాలంలో చాలా కొద్ది సేపు మాత్రమే నిద్రించేవారు. ఎక్కువ సేపు మేల్కొని ఉండేవారు. మేల్కొని ఉన్నంత సేపూ అల్లాహ్ ధ్యానం, అల్లాహ్ దాస్యం, ధర్మప్రచారం, మానవసేవ వంటి పుణ్యకార్యాలు చేసి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలను అధిరోహించారు. నిద్రమత్తులో మునిగి ఉన్న వారికి ఈ స్థానాలు ప్రాప్తం కాలేవు కదా! మేల్కొని ఉండి అల్లాహ్ నామస్మరణ చేసే వ్యక్తిమనోనేత్రం కూడా మేల్కొనే ఉండి అతని పవిత్ర జీవితానికి బాట వేస్తుంది”.

“నిజభావంలో మీరు జాగృతమై ఉండాలంటే హరాం (అధర్మమైన) సంపాదనను కూడా పరిత్యజించాలి. ఎందుకంటే ‘హరాం’ అనేది మనిషి మనోమస్తిష్కాలను అంధకారమయంగా చేసేస్తుంది. హృదయంపై చీకటి ఆవరించి, తుప్పు పట్టినప్పుడు ఆరాధనలు స్వీకారయోగ్యమవటం కూడా సందేహాస్పదమే. కనుక హృదయం సజీవంగా ఉండటానికి, ధార్మికత అలవడటానికి ధర్మ సమ్మతమైన సంపాదన తప్పనిసరి. హరాం నిలువెల్లా కీడైనదైతే హలాల్ (ధర్మసమ్మతం) నిలువెల్లా మేలైనది. హలాల్ ద్వారా విశ్వాసి వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. అతనిలోని సుగుణాలు ప్రస్ఫుటమవుతాయి”.

“మరి ధర్మ సమ్మతమైన సంపాదనను కూడా ఓ పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి. అడ్డు ఆపూ లేకుండా దుబారా ఖర్చు చేస్తే అది కూడా అపసవ్యంగానే భావించబడుతుంది. ఎందుకంటే దుబారా ఖర్చు మూలంగా మనిషిలో మదాంధత ఆవరిస్తుంది. మనిషి తన నిజస్థాయిని మరచిపోతాడు. అతి నిద్రకు బానిసవుతాడు. కాబట్టి ధర్మసమ్మతంగా ఆర్జించిన సొమ్ములో కూడా మనిషి సమతూకం పాటించాలి. ఎట్టి పరిస్థితిలోనూ మనిషి అదుపు తప్పి, సంతులనం కోల్పోరాదన్నదే దీని సారాంశం. అందుకే అల్లాహ్ సెలవిచ్చాడు :

“విశ్వాసులగు ఓ నా దాసులారా! నేనుప్రసాదించిన ధర్మబద్ధమైన ఆహారాన్నితినండి, త్రాగండి. కాని మితి మీరకండి.” (“ఫుతూహుల్ గైబ్” నుండి)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) ఇలా ఉద్బోధించారు:

“జీవితంలో కష్టాలు, ఆపదలు వచ్చిపడినపుడు నీవు అల్లాహ్ పై నిందలకు దిగుతావు. ఆయన పోషకత్వాన్ని రకరకాలుగా తూలనాడుతావు. కాని యదార్ధానికి ఆయన తన దాసుల్లో ఎవరికీ రవ్వంత అన్యాయం కూడా చేయడు. నిజానికి దాసునిపై ఏ ఆపద వచ్చి పడినా అది అతని స్వయంకృత ఫలితమై ఉంటుంది. అతని బహుదైవోపాసనా చేష్టలో లేక పాపిష్టి పనులో లేక షరియత్ ఉల్లంఘనో అతని దుస్థితికి కారణభూతమై ఉంటుంది. తన దాస్యం విషయంలో అల్లాహ్ బహుదైవోపాసనను త్రోసిపుచ్చడంతో పాటు దాసుడు కేవలం తననే ప్రేమించాలనీ అల్లాహ్ యేతరుల వైపు మరలటాన్ని మానుకోవాలని కోరుకుంటున్నాడన్న సంగతి నీకు తెలియదా? ఈ కారణంగానే అవిశ్వాసులకు సంబంధించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. ‘బహుదైవారాధకులు తమ కొరకు కొంత మంది దేవతల్ని, అక్కరలు తీర్చే వారిని కల్పించుకున్నారు. కేవలం అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమను వారు వాళ్ళ పట్ల కలిగి ఉన్నారు‘. “సారాంశం ఏమిటంటే నిజదైవంపై కలిగి ఉండవలసిన ప్రేమాభిమానాలను, శ్రద్ధాభక్తులను నీవు అల్లాహ్ యేతరులపై, ప్రాపంచిక స్వాములపై కురిపిస్తున్నావు. మరలాంటప్పుడు నీపై వచ్చిపడే విపత్తులను, కడగండ్లను గురించి నిజ దైవమైన అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకునే హక్కు నీకెక్కడుందీ? నిందించుకోదలిస్తే నీవు నీ బహుదైవోపాసనా చేష్టలనే నిందించుకోవాలి. అసలు నీకు ఈ ఆపదలు ఎందుకు సోకుతున్నాయో ఆలోచించు. నీ విశ్వాసాలను, ఆచరణలను చక్కదిద్దేందుకు, అవిశ్వాస భావాల నుండి నిన్ను దూరంగా ఉంచేటందుకు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని ఎందుకు అనుకోవు? నీవు నీ మనోమస్తిష్కాలను, నీ అంతరాహ్యాలను కేవలం తన కోసమే ప్రత్యేకించాలని, అల్లాహ్ యేతరులపై దృష్టిని నిలపరాదని అల్లాహ్ కోరుకుంటున్నాడు. నీవు మేలును పొందినా, కీడును చవిచూసినా ఆయన తరఫుననే జరుగుతుంది. నీవు విధేయత చూపినా ఆయన ప్రసన్నత కోసమే అయి ఉండాలి. ఇంకా నీవు నీ మనసు యొక్క దుష్ట వాంఛలకు దూరంగా ఉండాలి. సృష్టితాలను కొలవకుండా ఉండాలి- అల్లాహ్ నీ నుండి కోరుకునేది ఇదే. నీవు ఈ గీటురాయిపై నిగ్గు తేలిన నాడు అల్లాహ్ తన అపారమైన అనుగ్రహాలను, కానుకలను నీపై కురిపిస్తాడు. నిన్ను ప్రశంసించేందుకు, శ్లాఘించేందుకు ఎన్నో నోళ్ళు తెరిపించబడతాయి. ఇహపర లోకాలు రెండింటిలోనూ అల్లాహ్ నీకు హాయిని, ఆహ్లాదాన్ని వొసగుతాడు….

“….. నీవు అలవాట్లలో, అభిరుచులలో సాటి జీవుల స్నేహాలలో ఎంత కాలం చిక్కుకుని ఉంటావు? మనోవాంఛల అనుసరణలో పడిపోయి ఎంతకాలం నిజ దైవమైన అల్లాహ్ నువి స్మరిస్తావు? నీ సృష్టికర్తకు దగ్గరవ్వు. ఆదిలోనయినా, అంతంలోనయినా నీకు తోడ్పడేవాడు ఆయన మాత్రమే. సకలప్రాణుల అక్కరలను తీర్చేవాడు, పర్యవేక్షకుడు, ఉపాధి ప్రదాత ఆయనే సుమా! మహోపకారాలు, బహుమతులన్నీ ఆయన తరఫుననే లభిస్తాయి.”

“గుర్తుంచుకో! ఆయన్ని ప్రేమించి, ఆయన నామాన్ని స్మరించినపుడే ఆత్మలు నెమ్మదిస్తాయి. ఆ విషయాన్నే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. “విశ్వాసులు హృదయాలయితే అల్లాహ్ నామస్మరణతోనే నెమ్మదిస్తాయి”.(“పుతూహుల్ గైబ్” సౌజన్యంతో)

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ(రహిమహుల్లాహ్) ఇలా ఉపదేశించారు:

“నీవు అల్లాహ్ సమక్షంలో అడగదలచుకుంటే ఇలా వేడుకో. గత కాలంలో జరిగిన పాపాలను మన్నించమనీ, భవిష్యత్తులో పాపకార్యాలకు దూరంగా మసలుకునే సద్బుద్ధి నొసగమనీ ప్రార్థించు. ఆయనకు విధేయుడై ఉండేలా, ఉపాసనలు నెరవేర్చే వానిలా తీర్చిదిద్దమనీ, మంచిని ఆచరించి చెడును నిర్మూలించేవానిలా మలచమనీ, దైవేచ్ఛతో రాజీపడేవానిలా చేయమనీ, కష్టాలను ఓపికతో సహించేవానిలా తీర్చిదిద్దమనీ మొరపెట్టుకో. ధర్మసమ్మతమైన అనుగ్రహాలను పుష్కలంగా ప్రసాదించమనీ, ఉపాధిలో కలిగిన సమృద్ధికిగాను కృతజ్ఞతలు చెల్లించే మనసు నివ్వాలనీ విన్నవించుకో. చరమ ఘడియ వరకూ విశ్వాస భాగ్యంతో జీవించేలా చేయమనీ, పునరుత్థాన దినాన ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరుల, పుణ్యపురుషులతో లేపబడాలనీ ప్రార్థించు. ఎందుకంటే ఇది కూడా చాలా గొప్ప భాగ్యం. అలాగే ధార్మికంగా, షరియత్ పరంగా అక్రమంగా, నిషిద్ధంగా ఖరారు చేయబడిన వాటి జోలికి పోకు. నీ వ్యవహారాలను, పరమార్థాలన్నింటినీ అల్లాహ్ వైపుకు మరల్చు. అందులో నీ ప్రమేయానికి తావుండకుండా చూసుకో.”

“హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి గురించి ఒక ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు) ఇలా అంటుండేవారు – “నేనే స్థితిలో తెల్లవార్చుతాననే విషయమై నాకెలాంటి చింతలేదు. నేను మంచిదిగా భావించే ఉదయమైనా, చెడుగా భావించే ఉదయమైనా నాకేం ఫరవాలేదు. ఎందుకంటే దివ్యజ్ఞానం ప్రకారం ఎందులో నా కొరకు శుభం ఉందో నాకు తెలీదు. కనుక నేను నా వర్తమాన స్థితిగతుల్నీ, భవిష్యత్ కార్యాచరణనూ అల్లాహ్ కే అప్పగించాను. ఆయనే నా అత్యుత్తమ స్నేహి, గొప్ప సంరక్షకుడు, సహాయకుడూను.”

“దైవేచ్చపై, దైవాధికారాలపై సంపూర్ణ భరోసా, నమ్మకం మూలంగానే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాటల్ని అనగలిగారు. సాధారణంగా మానవులు తమ మిడి మిడి జ్ఞానం మూలంగా, చిన్నచిన్న సంఘటనల ఆధారంగా కలవరం చెందుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశ్యించి పరమ ప్రభువు ఇలా అంటున్నాడు: “ముస్లింలారా! జిహాద్ మీ కొరకు విధి గావించబడింది. నిజానికి అది మీకు సుఖ సౌఖ్యాల కాముకత కారణంగా అయిష్టకరమైనదిగా, సహించరానిదిగా ఉంటుంది. దేనిని మీరు మీ కోసం చెడుగా భావిస్తున్నారో బహుశా అదే మీ పాలిట మేలైనదిగానూ, ప్రయోజనకరమైనది గానూ పరిణమించవచ్చు. అలాగే మరి దేనిని మీరు మీకొరకు మేలైనదిగా తలపోస్తున్నారో యదార్థానికి అదే మీ యెడల కీడుగా, వినాశకరంగా పరిణమించవచ్చు.” కనుక మేలు – కీడుల వాస్తవికతను అగోచరాల జ్ఞానియగు అల్లాహ్ మాత్రమే ఎరుగుననీ, అది మీకు తెలియదనీ తెలుసుకోండి. కాబట్టి దుష్ట మనసు (నఫ్సె అమ్మార) యొక్క చిక్కుల నుండి ముక్తి పొందే దాకా అల్లాహ్ ప్రసన్నతా దీక్షలో నిమగ్నులై ఉండు. ఆపైన నీ వ్యక్తిగత కోర్కెలు, స్వీయ సంకల్పాలు బలహీనపడి విశ్వజనీన వ్యవస్థతో అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒక్కడైన ప్రభువు తప్ప వేరెవరికీ నీ మనసులో చోటుండదు. ఇదే సిసలైన అల్లాహ్ ఏకత్వం (తౌహీద్). ఈ స్థితికి చేరుకున్ననాడు నీ మనసు అల్లాహ్ ప్రేమతో నిండి పోతుంది. అల్లాహ్ ను పొందడమే నీ జీవిత ధ్యేయం అయిపోతుంది. అట్టి పరిస్థితిలోనే నీ ప్రభువు నీకు ప్రాపంచిక ప్రసాదాలను, పదవులను వొసగుతాడు. దానికి ప్రతిగా నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటావు. ఆయన అభీష్టంతో సమన్వయం చెందుతూ, ఆయన ప్రసాదించిన వరాలను క్రియాత్మకంగా గౌరవిస్తావు. మరి ఈ ప్రాపంచిక జీవితపు మెట్టపల్లాలలో ఎప్పుడైనా ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా నీవు నీ ప్రభువు యెడల అప్రసన్నుడవకుండా, నిందలు నిష్ఠూరాలకు దిగకుండా జాగ్రత్తపడతావు. ఎందుకంటే విశ్వాసి మరియు ఏకేశ్వరోపాసి అయిన కారణంగా నీవు నీ వాంఛల సంగతిని అలా పక్కన పెట్టి నీ సర్వ వ్యవహారాలను అల్లాహ్ కు అప్పగించేశావు”.(“ఫుతూహుల్ గైబ్” ఆధారంగా)

[మీరింతవరకూ, హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి ఉపదేశాల్ని, హెచ్చరికల్ని గురించి చదివారు. ఆయన గారి ఏ ప్రసంగం కూడా ‘తౌహీద్‘ ప్రస్తావన లేకుండా లేదు. అల్లాహ్ దాసులందరినీ బహుదైవోపాసనా భావాల నుండి రక్షించి వారిని నికార్సయిన ఏకేశ్వరోపాసకులుగా మలచాలన్న తహతహ ఈ మహనీయుని మాటల్లో మనకు కనిపిస్తోంది. మరి ఈ గొప్ప సంస్కర్త పవిత్ర జీవితాన్ని అధ్యయనం చేసిన మనం ఇకపై చిత్తశుద్ధితో నిజ దైవాన్ని సేవిస్తూ, అల్లాహ్ యేతరుల దాస్యానికి, అల్లాహ్ యేతరుల మొక్కుబడులకు దూరంగా ఉండాలి. ఈ చిరుపుస్తకానికి ముగింపుగా డా. మీర్ వలీయుద్దీన్ గారి వ్యాసాన్ని పొందుపరచటం అవసరమని భావించటం జరిగింది. అల్లాహ్ యేతరులను మొక్కుకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం ఎంత వినాశకరమైన పనో డా. మీర్ వలీయుద్దీన్ గారు సూటిగా చెప్పారు.- సంకలనకర్త]

బహుదైవారాధకులు తమ సంపాదనలోని ఒక భాగాన్ని అల్లాహ్ యేతరుల్ని మొక్కుకోవడానికి వెచ్చిస్తారు. అల్లాహ్ యేతరుల కోసం పశువుల్ని బలి ఇస్తారు. ఈ విధంగా వాళ్ళ పట్ల తమకు గల అపారమయిన భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.

“అల్లాహ్ కొరకు ఈ ప్రజలు స్వయంగా ఆయనే సృష్టించిన పొలాల నుండీ పశువుల నుండీ ఒక భాగాన్ని కేటాయించారు. ‘ఇది అల్లాహ్ కొరకు, ఇది మేము నిలబెట్టిన భాగస్వాముల కొరకు’ అని స్వయంగా తామే తీర్మానించుకుని అంటారు.”(అల్ అన్ ఆమ్ – 136)

వేరొకచోట ఇలా సెలవీయబడింది.

మేము ప్రసాదించిన ఉపాధిలోనుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లాహ్‌ సాక్షి! మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది”.(అన్ నహ్ల్ 16:56)

హజ్రత్ షాహ్ అబ్దుల్ ఖాదిర్ (రహిమహుల్లాహ్) పై ఆయతులకు తాత్పర్యంగా ఇలా అభిప్రాయపడ్డారు: అవిశ్వాసులు తమ పొలాల పంట నుండీ, పశువుల్లో నుండీ, వ్యాపారంలో నుండీ కొంత భాగాన్ని తీసి దానిలో అల్లాహ్ కోసమని, మిగిలింది దేవతల కోసమనీ మొక్కుకునేవారు. వారు తమ అజ్ఞానం మూలంగానో, తెలియకపోవటం మూలంగానో ఈ అల్లాహ్ యేతరుల్ని కూడా ఆరాధ్యులుగా, లాభనష్టాలు చేకూర్చగల వారుగా తలపోసేవారు. వారి ఈ అన్యాయ పోకడను, అభూతకల్పనను గురించి అల్లాహ్ నిర్ద్వంద్వంగా ఖండించాడు.

మొక్కుబడుల ఈ సంప్రదాయం ఈ మధ్య బాగా ప్రబలిపోయింది. అందుచేత ఈ విషయాన్ని గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకోవలసి ఉంది. అదేమిటో గాని అన్ని కాలాల ముష్రికుల హృదయాలలో ఒక విషయం గూడు కట్టుకుని ఉన్నట్లు అనిపిస్తుంది. వారు ఒడిగట్టే షిర్క్ న్ను గురించి అడిగితే తమ పూర్వీకులను ఉదాహరించి, వాళ్ళ అడుగు జాడల్లో తామూ నడుచుకుంటున్నా మని చెబుతారు.

మొక్కు‘ అనేది ఒక విధంగా అల్లాహ్ సామీప్యం పొందే ఉద్దేశ్యంతో చేసే ఆరాధన అని ధర్మవేత్తలు (ఫుకహా) అంటారు. దానికి ఆధారంగా వారు దివ్య ఖుర్ఆన్ లోని క్రింది ఆయతును ఉదాహరిస్తారు :

మీరేమి ఖర్చు పెట్టారో, మరేమి మొక్కుబడి చేసుకున్నారో, అంతా అల్లాహ్ కు తెలుసు”.(అల్బఖర -270)

దీనికి తాత్పర్యంగా ‘తఫ్సీరె అబూ మసూద్ ‘లో మనసులో సంకల్పం చేసుకుని దానిని విధిగా నెరవేర్చటమే మొక్కుబడి అని నిర్వచించటం జరిగింది.

మరి మొక్కుబడి (నజర్) ఒక ఆరాధన (లేక దాస్యం) అయినపుడు ఆ ఆరాధనను అల్లాహ్ యేతరుల కోసం ప్రత్యేకించటం షిర్క్ అవుతుంది. సాధారణంగా ప్రజలు తమ పెద్దల పేర ఏ మొక్కుబడి చేసినా ఏదో ‘స్వార్ధం’ తోనే చేస్తారు. ఏదేని లక్ష్యాన్ని సాధించటమో, లేక ఏదేని గండం నుంచి గట్టెక్కడమో ఈ మొక్కుబడి వెనుక వారి ఉద్దేశ్యమై ఉంటుంది. అంటే ఒక విధంగా వారు తమ అక్కరలు తీర్చుకోవడానికి గాను, తాము కల్పించుకున్న ‘పెద్దలకు లంచం ఇచ్చుకుంటున్నారన్నమాట! ఈ నేపథ్యంలో హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)లు ఉల్లేఖించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాన్ని చూడండి :

“లా తన్ జిరూ ఫ ఇన్నన్నజర లా యుగ్నీ మినల్ ఖదరి షయిఅన్. వ ఇన్నమా యుస్తఖ్రజూ బిహీ మినల్ బఖీలి”.

“అంటే మొక్కుబడిని నమ్ముకోకండి. ఎందుకంటే మొక్కుబడి నొసటి రాతను చెరపజాలదు. కాకపోతే, దీని ద్వారా పిసినారి ధనం వెలికి తీయబడుతుంది (ఖర్చులోనికి వస్తుంది)”.

మరలాంటప్పుడు తమ పూర్వీకులు, పెద్దల పేర ప్రజలు చేసుకునే మొక్కుబడుల ఉద్దేశ్యం ఏమిటో అడగాలి.

  1. వారి సామీప్యం పొందడమా? ఆరాధించడమా? ఇదే అయితే ఇది స్పష్టమైన బహుదైవోపాసనే.
  2. ఆశయ ప్రాప్తికోసం లేక అక్కరలు తీరడం కోసం మొక్కుకుంటున్నారా? ఇదికూడా షిర్క్ క్రిందకే వస్తుంది.
  3. పుణ్యాన్ని చేకూర్చడం (ఈసాలె సవాబ్) కోసం మొక్కుకుంటున్నారా? ఇది మాత్రం సమ్మతమైనది. అయితే ఇక్కడ కూడా సంకల్పశుద్ధి అవసరం.

ఆలోచించండి. మిమ్మల్ని మీరు కాపాడుకునే, యుక్తి పొందే చింత మీకు ఉండాలి. స్వయంగా పుణ్యం సంపాదించేందుకు ముందుకు రావాలి. దీన్ని వదిలి మీరు ఇతరులకు పుణ్యం చేకూర్చటం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మీ ద్వారా తమకు పుణ్యం చేకూరాలని మీ పూర్వీకులు మీ నుండి ఆశిస్తే అది అసమంజసం ఏమీ కాదుగాని, కాస్త మీరు మీ అంతరంగంలోకి తొంగి చూడండి. మీరు కేవలం మీ పూర్వీకులకు పుణ్యం చేకూరాలన్న ఉద్దేశ్యంతోనే మొక్కుబడులు చేస్తున్నారా? లేక మరి ఇతరత్రా ఉద్దేశ్యాలు కూడా ఉన్నాయా? మీ సిరిసంపదలలో వృద్ధి కలగాలనీ, పిల్లాజల్లా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనీ, వ్యాపారంలో నష్టం జరగరాదనీ, కాలపు కడగండ్ల బారిన పడకుండా ఉండాలనీ మొక్కుకుంటున్నారా? ఒకవేళ ఈ స్వప్రయోజనాల చాటున గనుక మీరు మీ పూర్వీకుల పేర మొక్కుకుంటే (ఉదాహరణకు గ్యారవీలు వంటివి చేస్తే) ముష్రిక్కుల మాదిరిగా మీరు కూడా మీ పూర్వీకుల్ని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారన్న మాట! వాళ్ళని లాభనష్టాలు చేకూర్చేవారుగా తలపోస్తున్నారన్నమాట! ఇది సుస్పష్టమైన షిర్క్ అని తెలుసుకోండి. ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా వెనుకటి పంక్తుల్లో ఈ విషయం అవగతం అయింది. అల్లామా షారహ్ దరర్ గారి ఈ వ్యాఖ్యానంపై కాస్త యోచన చేయండి, ఆయన ఇలా అన్నారు :

“ప్రజలు చేసే మొక్కుబడుల గురించి- ఉదాహరణకు వాళ్ళు (ఎవరైనా వలీ లేక ప్రవక్తను ఉద్దేశ్యించి) ఏమంటారంటే, ‘ఓ మహనీయుడా! నాకు కనిపించకుండా ఉన్న ఫలానా వస్తువు లభ్యమైనట్లయితే, లేక రోగగ్రస్తుడు ఆరోగ్యవంతుడైనట్లయితే, లేక నా అక్కర తీరినట్లయితే మీ పేరు ఇంత బంగారమో లేక వెండియో, భోజనమో, పానీయమో లేక తైలమో నైవేద్యంగా సమర్పిస్తాను’. ఇది మిధ్య (అధర్మం) అన్న విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. ఎందుకంటే ఈ మొక్కుబడి సృష్టికర్త కోసం గాకుండా సృష్టితాల పేర జరిగింది. అందుచేత ఇది ధర్మ సమ్మతం కాదు. మొక్కుబడి కూడా ఆరాధనే. కాగా, ఆరాధన అల్లాహ్ కే చేయాలి. ఇక్కడ చనిపోయిన వారి నుద్దేశ్యించి మొక్కు కోవటం జరిగింది. కాగా, చనిపోయిన వారు దేనికీ యజమాని కాజాలరు. చనిపోయిన వాడు ఏదేని కార్యం సాధించే విషయంలో అధికారం కలిగి ఉంటాడని, మొక్కుకున్న వ్యక్తి మనసులో తలపోస్తే అతడు అవిశ్వాసి అయిపోయే ప్రమాదం కూడా వుంది. ఒకవేళ మొక్కుకునేవాడు గనక “ఓ అల్లాహ్ ! నేను నిన్నే మొక్కు కుంటున్నాను. నీవు గనక నా ఫలానా మనోరథాన్ని ఈడేరిస్తే నేను సయ్యిదా నఫీసా లేక ఇమామ్ షాఫయి గుమ్మం వద్ద పేదవాళ్ళకు అన్నం పెడతాను” అని చెబితే అది ధర్మ సమ్మతమే. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళకు ప్రయోజనం కలుగుతోంది. మొక్కుబడి అల్లాహ్ నుద్దేశ్యించి చేయబడింది”.

పై వ్యాఖ్యానాన్ని విశ్లేషిస్తే క్రింది విషయాలు మనకు స్పష్టంగా అవగతమవుతాయి.

1. ప్రజలు తమ పూర్వీకుల పేర చేసుకునే మొక్కుబడులు ముమ్మాటికీ మిథ్యగా,అధర్మంగా పరిగణించబడతాయి. ఎందుకంటే-

2. సాటీ ప్రాణుల పేరిట మొక్కుకోవటం ఏ విధంగానూ ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే మొక్కుబడి ఒక ఆరాధన. ఆరాధన అనేది ఒక్క సృష్టికర్త కొరకే సమ్మతం.

3. విపత్తులు, కడగండ్ల బారినుండి సురక్షితంగా ఉండాలనీ, సిరిసంపదలలో వృద్ధి వికాసాలు జరగాలనీ, ఆలుబిడ్డలు సుఖసంతోషాలతో ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ప్రజలు తమ పూర్వీకుల పేర మొక్కుకుంటారు. వాళ్ళ సంకల్పం ఇదైనపుడు తమ పూర్వీకులకు పుణ్యం చేకూర్చే ఉద్దేశ్యంతో ఈ తతంగం చేస్తున్నామని వాళ్ళు నోటితో చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. పైగా ఇది ఒక మోసం. వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

4. ‘ఇది ఫలానా వలీ లేక ఫలానా నబీ యొక్క మొక్కుబడి అని చెప్పటం కూడా సరైనది కాదు. ఇది అల్లాహ్ పేర జరిగే మొక్కుబడి. దీని పుణ్యం మాత్రం ఫలానా వ్యక్తికి చేరాలన్నది మా అభిమతం’ అని అంటే ఫరవాలేదు.

ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం గమనార్హం.

“ఎవరయితే అల్లాహ్ కు విధేయుడై ఉంటానని మొక్కుకున్నాడో అతడు విధేయత చూపి తన మొక్కుబడిని తీర్చుకోవాలి. మరెవరయితే అల్లాహ్ కి అవిధేయుడుగా ఉంటానని మొక్కుకుంటాడో అతడు ఆ అవిధేయతకు పాల్పడకూడదు”.