హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు :
“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”
”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”
“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”
”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”
“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”
”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”
“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)
(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.
దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.
(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.
(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”
ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “
(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –
وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)
(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:
قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
“వారితో అనండి, తెలిసినవారు, తెలియనివారు ఇద్దరూ సమానులు అవగలరా? హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు.” (అజ్జుమర్ 39 : 9)
(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.
(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “
ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “
(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –
وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)
తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్