స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది – కలామే హిక్మత్

అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)

పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :

అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)

“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.

“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.

పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)

ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :

“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)

మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :

ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.

పోతే – మద్యపానం, జూదం, వ్యభిచారం, అపసవ్యమైన అనర్థదాయకమయిన విషయాలు, అసత్యం, చాడీలు, మనోవాంఛల దాస్యం, పదార్థపూజ, వంశం, కులం గోత్రాల ప్రాతిపదికపై అహంకారాన్ని ప్రదర్శించడం, దురాచారాలు, దుస్సంప్రదాయాలు — ఇవన్నీ సరకానికి గొనిపోయేవే.

అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.

అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.

హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :

وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)

పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్