మానవ సేవ – ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో అల్లాహ్ ప్రసన్నత ఇమిడి ఉంది – కలామే హిక్మత్ 

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు-

“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’

ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’

‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)

ఈ హదీసులో మనిషి స్థానం ఎంత ముఖ్యమైనదో వివరించబడింది. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో దైవ ప్రసన్నత ఇమిడి ఉందని సోదాహరణగా విశదీకరించటం జరిగింది. ఆపదలో ఒండొకరిని ఆదుకోవడం తప్పనిసరి. అందులో ఏ మాత్రం లోటు కనబరచినా ప్రళయదినం నాడు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. నిర్దయుడైన మనిషిని అల్లాహ్ “ఓ ఆదం పుత్రుడా!” అని సంబోధించాడు. దివ్య ఖుర్ఆన్లోనూ సంబోధనా తీరు ఇలాగే ఉంది. అందులోనూ హెచ్చరించవలసి వచ్చినప్పుడు ”యా బనీ ఆదమ్” అని వాక్యం మొదలవుతుంది. ఇదిగో చూడండి:

“ఓ ఆదం సంతానమా! మీరు షైతాను దాస్యం చేయరాదని నేను మీ నుండి ప్రమాణం తీసుకోలేదా? నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు.” (యాసీన్: 60)

ఇక ప్రజలకు శుభవార్త ఇవ్వవలసి ఉన్నప్పుడు ”నా దాసులు” అని సంబోధించ బడింది. ఉదాహరణకు,

“విషయాన్ని సావధానంగా వినే, మరియు దాని ఉత్తమ కోణాన్ని పాటించే నా దాసులకు శుభవార్త వినిపించండి. వారెవరంటే, అల్లాహ్ వారికి మార్గం చూపాడు. వారే వివేచనాపరులు.” (అజ్జుమర్ : 17, 18)

“నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు. నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు. నేను నిన్ను మంచినీళ్ళు అడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.” వ్యాధి, ఆకలిదప్పులను అల్లాహ్ తన వైపునకు వర్తింప జేసుకుని ప్రశ్నించాడని ఉలమాలు (పండితులు) అభిప్రాయపడ్డారు. హదీసులోని తరువాయి వచనాల ద్వారా తెలిసిపోతుంది వ్యాధిగ్రస్తుడు, ఆకలిగొన్నవాడు, దప్పికగొన్నవాడు మనిషేకాని సర్వలోకాల ప్రభువు ఎంతమాత్రం కాదని. నిజానికి ప్రభువు ఈ బలహీనతలన్నింటికీ అతీతుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ దౌర్బల్యమూ లేదు. వాస్తవానికి ఆయన అక్కరలేనివాడు.

“నా ఫలానా దాసుడు రోగగ్రస్తుడయ్యాడు.”
”నా ఫలానా దాసుడు అన్నం అడిగాడు.”
“నా ఫలానా దాసుడు నీళ్ళు అడిగాడు.”

ఇటువంటి బాధితులను అల్లాహ్ ”నా దాసుడు” అని ప్రస్తుతించాడు. ఎందుచేత నంటే కష్టకాలంలో దాసుడు తన ప్రభువుకు అత్యంత చేరువవుతాడు. ఆయన కరుణకు అర్హుడవుతాడు. అటువంటి తరుణంలో గనక ఏ మనిషయినా ఆ బాధితుణ్ణి ఆదుకున్నాడంటే అతను కూడా దైవకారుణ్యంలో భాగం పొందుతాడు.

“నువ్వు నన్ను అతని దగ్గర పొందివుండేవాడివి” అంటే నువ్వు గనక ఆ రోగగ్రస్తుడ్ని పరామర్శించి, అతని దుఃఖభారాన్ని తగ్గించి ఉంటే, ఇంకా అతనికి సపర్యలు చేసివుంటే నా దయాదాక్షిణ్యాలకు నోచుకునేవాడివి. ఈ రోజు నీకు దాని బహుమతి లభించి ఉండేది అని భావం.

”దాన్ని నా వద్ద పొందేవాడివి” అంటే నువ్వే గనక ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టి ఉంటే నేను ఈ రోజు స్వర్గపు ఫలాలు తినిపించేవాడిని. నువ్వు గనక దప్పికగొన్నవాడి దాహం తీర్చి ఉంటే ఈ రోజు నీకు కౌసర్ సరస్సులోని అత్యుత్తమమైన పానీయం ఇవ్వబడేది. ఎందుకంటే ప్రపంచం పరీక్షా స్థలమైతే పరలోకం పరీక్షా ఫలితాల నిలయం.

ఈ హదీసు ద్వారా దైవ సన్నిధిలో మనిషికి ఎంత ఉన్నత స్థానం ఉందో తెలుస్తోంది. ఏ విధంగానైతే ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోకపోవటం వల్ల అల్లాహ్ కారుణ్యానికి నోచుకోకుండా పోతామో అదేవిధంగా సముచితమైన కారణమేదీ లేకుండా ఒక మనిషిని అవమానించడం వల్ల కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఈ హదీసు ద్వారా రూఢీ అయ్యే మరో విషయమేమిటంటే, ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం, దప్పికగొన్నవాడి దాహం తీర్చడం, రోగగ్రస్తుడ్ని పరామర్శించడం ఉత్తమ నీతి నడవడికలకు తార్కాణం. పైగా ఇవి ఎటువంటి ధర్మాలంటే వాటిని ఉపేక్షించడం వల్ల ప్రళయ దినాన ప్రభువు సమక్షంలో సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. సర్వోన్నత ప్రభువు తన గ్రంథంలో ఎన్నోచోట్ల అన్నం తినిపించటాన్ని, పరస్పరం సాయం చేయటాన్ని ఆదేశించాడు. పైగా వాటిని విశ్వాస లక్షణాలుగా పేర్కొన్నాడు. ఈ విధ్యుక్త ధర్మాల నిర్వర్తనలో ఉద్దేశ్యపూర్వకంగా వెలితి కనబరచేవాడు, తన అలక్ష్యధోరణి వల్ల ప్రపంచంలో ఏ విధంగా మనుషులు సాయానికి నోచుకోకుండా పోతారో అదేవిధంగా అతను తీర్పు దినం నాడు అల్లాహ్ కటాక్షానికి నోచుకోకుండా పోతాడని ఈ పవిత్ర హదీసు వల్ల బోధపడుతుంది.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్