అల్ ఖమ ఇలా అన్నారు –
“నేను మినాలో అబ్దుల్లాహ్ వెంట నడుస్తూ ఉండగా ఆయన్ని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కలుసుకున్నారు. వారు ఆయనతో మాట్లాడసాగారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆయనతో అన్నారు : “ఓ అబూ అబ్దుర్రహ్మాన్! మీ వివాహం ఒక యుక్త వయస్కురాలైన అమ్మాయితో ఎందుకు జరిపించకూడదు? తద్వారా మీకు పూర్వకాలం (యౌవనం) ఎందుకు జ్ఞాపకం చేయకూడదు?” అబ్దుల్లాహ్ బదులిచ్చారు – “మీరు కూడా అదే మాటంటున్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు “ఓ యువకుల్లారా! మీలో నికాహ్ చేసుకోగల శక్తి ఉన్నవారు నికాహ్ చేసుకోవాలి. ఎందుకంటే చూపులను వాల్చడానికి, మర్మాంగాలను పరిరక్షించుకోవటానికి అలా చేయటం మంచిది. ఎవరికయితే నికాహ్ చేసుకునే స్థోమత లేదో వారు తప్పకుండా ఉపవాసం ఉంటుండాలి. అది అతని కొరకు డాలు వంటిది అని ప్రబోధించారు” అని అన్నారు. (ముస్లిం)
అల్ ఖమ గారు, మహాప్రవక్త ప్రియ సహచరుల శిష్యగణంలోని వారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క ముఖ్య శిష్యులు. ఈయన హిజ్రీ శకం 60 తరువాత మరణించారు.
‘మినా’ మక్కా సమీపంలోని ఒక ప్రదేశం. అక్కడ హజ్ యాత్రీకులు జిల్ హిజ్జా 8 నుండి 12వ తేదీ వరకు విడిదిచేస్తారు. ఉస్మాన్ మరియు అబ్దుల్లాహ్ మధ్య ఆ సంభాషణ బహుశా హజ్ దినాలలోనే జరిగి ఉంటుంది.
అబ్దుల్లాహ్ అంటే ఇక్కడ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నమాట. హదీసువేత్తల పరిభాష ప్రకారం – హదీసులో ఎప్పుడు అబ్దుల్లాహ్ ప్రస్తావన వచ్చినా అది అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కే వర్తించటం పరిపాటి.
తొలి తొలి రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన వారిలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఒకరు. మహాప్రవక్త ముహమ్మద్ ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్నవారిలో ఆయన ఆరవవారు. యుద్ధాలన్నింటిలో ఆయన ఇస్లాం తరపున పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించిన తరువాత ఆయన ఇస్లామీయ రాజ్యంలో పలు ముఖ్యమయిన బాధ్యతలను నిర్వర్తిస్తుండేవారు. హిజ్రీ శకం 32వ ఏట హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 60 ఏండ్లకు పైబడింది.
“మీ వివాహం యుక్త వయస్కురాలైన అమ్మాయితో ఎందుకు జరపకూడదు?” అన్న వాక్యం గమనార్హం. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలోనూ, ఆయనకు ముందు మరియు ఆయన అనంతరం, ఆ మాటకొస్తే నేటివరకు కూడా వయస్సు పైబడిన అరబ్బు పురుషులు చిన్న వయసున్న కన్యలను వివాహమాడటం కనిపిస్తుంది. వారి దృష్టిలో ఇది ఆక్షేపించదగ్గ విషయం కాదు, దోషభూయిష్టమయిన విషయం అంతకన్నా కాదు. సుఖవంతమయిన, సంతోషదాయకమయిన దాంపత్య జీవితం కొరకు మనసులు కలుస్తే చాలుగాని వయసుతో పని ఏముందీ? అన్నది వారి అభిమతం. వయసులోని తేడాపాడాలకు సంసార జీవితంలో అంతగా ప్రాముఖ్యం లేదన్నది వారి అభిప్రాయం.
హదీసులో “అల్ బాదహ్” అనే పదం వచ్చింది. దీని భావం ”జోడు” అని ఒక అర్థం వస్తుంది. అంటే ఎవరయితే తోడునీడకై యోగ్యుడయ్యాడో అతను పెండ్లి చేసుకోవాలి. మరెవరయితే లైంగికశక్తి ఉండి కూడా వివాహం చేసుకోగల ఆర్థిక స్థోమత కలిగిలేదో అతను వీలయినన్ని ఎక్కువ నఫిల్ (అదనపు) ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కోసం, మనసును చెడు ఆలోచనల నుండి రక్షించుకోవటం కోసం ఇలా చేయటం అవసరం. అందుకే రోజా (ఉపవాసం)ను లైంగిక వాంఛల నుండి కాపాడే ‘డాలు’గా అభివర్ణించడం జరిగింది. కామవాంఛలను షైతాన్ ఒక ఆయుధంగా వాడుకుని విశ్వాసిపై ఏదో ఒక వైపునుండి దాడి చేయడానికి పొంచి ఉంటాడు. ఏదో ఒక మిషపై అతన్ని చెడుల ఊబిలోకి లాక్కుపోవటానికి ఎత్తులు వేస్తుంటాడు. అయితే ఆ యువకుడు పాటించే ఉపవాసం, అతనికి ఒక డాలు లాగా, ఒక రక్షక కవచంలాగా పనిచేస్తూ అతను దుష్ట కోర్కెల వాతన పడకుండా కాపాడుతూ ఉంటుంది. ఉపవాసం పాటించిన వ్యక్తిలో లైంగిక ఆవేశం తగ్గుముఖం పడుతుంది. దాని స్థానే భయభక్తులు, ధర్మనిష్ఠ ఆధిక్యత వహిస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నవయువకులను ఉద్దేశించి ఈ హితబోధ చేసినప్పటికీ యువతులకు సయితం ఇది వర్తిస్తుంది.
“అల్ బాదహ్” అనే పదానికి మరో అర్థం వివాహానంతరం అయ్యే ఖర్చుల్ని భరించగలగటం అని. అంటే సహధర్మచారిణికి తగురీతిలో భోజన వసతి సౌకర్యం కల్పించటం, ఆమె దుస్తులు తదితర అవసరాలను తీర్చటం అన్నమాట. ఏ వ్యక్తికయితే భార్య యొక్క కనీస అవసరాలను కూడా తీర్చగలిగే స్థోమత లేదో, అతను ఒకవేళ యుక్త వయస్కుడైనప్పటికీ పెండ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. తనలో కట్టలు త్రెంచుకునే లైంగిక వాంఛలకు పటిష్ఠమయిన ఆనకట్టవేసి ఆపుకోవటానికి అతను తరచూ ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాల మూలంగా అతని కోర్కెల కళ్ళెం పూర్తిగా అతని అదుపులోకి వచ్చేస్తుంది. ఆ విధంగా అతను నీతిబాహ్యమైన చేష్టల నుండి తనను రక్షించుకోగలుగుతాడు.
“ఓ యువకుల్లారా! మీలో వివాహ స్థోమత ఉన్నవారు, నికాహ్ చేసుకోవాలి” అన్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హితవును అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ముందు ప్రస్తుతించటంలోని ఉద్దేశం గమనించదగినది. వివాహం చేసుకోమని ప్రవక్తగారు చెప్పినది యువకులతోనే గాని, ముసలివారితో కాదు. వివాహం ఏ వయసులో నయినా ధర్మసమ్మతమే. అయితే యుక్త వయస్సులో మాత్రం అది అవసరం. ఎవరి వద్దయితే రెండు యోగ్యతలు (స్థోమత) సమకూరాయో వారు పెండ్లాడమని మహాప్రవక్త ప్రబోధించారు. ఆ రెండు యోగ్యతలు ఏమిటంటే; 1. లైంగిక శక్తి. 2. ఆర్థిక స్థోమత.
ప్రాచీన ఉలమాల (విద్వాంసులు) లో నికాహ్ విషయమై పలు అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి ఆయా వ్యక్తుల వ్యక్తిగత స్థితిగతుల దృష్ట్యా నికాహ్ ఆజ్ఞ వారికి వేర్వేరుగా వర్తిస్తుంది. కొంతమంది పరిస్థితి ఎటువంటిదంటే, వారు వివాహ కాంక్ష కలిగి ఉంటారు, ఆర్థికంగా కూడా స్థితిపరులై ఉంటారు. అటువంటివారు పెండ్లి చేసుకోవటం అవసరం. మరికొందరి పరిస్థితి ఏమంటే, వారికి వివాహాపేక్ష లేదు, పెండ్లాన్ని పోషించే స్థోమత కూడా లేదు. అటువంటి వారు వివాహమాడటం ఎంతకీ సమంజసం కాదు. ఇంకా కొంతమంది పరిస్థితి ఎలాంటిదంటే; వారికి పెండ్లి మోజు ఉందిగాని శ్రీమతిని సుఖపెట్టే ఆర్థిక స్థోమత లేదు. అటువంటి వారు వివాహమాడటం తప్పనిసరికాదు, అయితే వారికా అనుమతి మాత్రం ఉంది. నేటి బీదవాడు రేపు శ్రీమంతుడు కావచ్చు. ఒకవేళ యువకులు పెండ్లి గనక చేసుకోని పక్షంలో వారు ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి తద్వారా వారు తమ మర్మాంగాలను కాపాడుకోగలుగుతారు. మరి కొంతమంది ఎలాంటివారంటే, ఆర్థికంగా వారు మంచి స్థితిలోనే ఉన్నారు. అయితే పెండ్లి పట్ల వారికి ఆసక్తి లేదు. అటువంటి వ్యక్తి గురించి ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ఏమంటే, అతనికై వివాహం ‘మక్రూహ్’ కాదు. అతను పెండ్లి చేసుకోకుండా ఉండటం, ఆరాధనల కోసం సమయాన్ని కేటాయించటం ఉత్తమం. అయితే ఇతర ఇమాములు (రహిమహుముల్లాహ్) ఆ వ్యక్తి పెండ్లి చేసుకోవటమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
ఈ హదీసు వల్ల బోధపడేదేమంటే వివాహం ప్రతి ఒక్కరికి అవసరం. అది ప్రవక్తల సంప్రదాయం. దీని మూలంగా మనిషికి నైతికత, పరిశుద్ధత అలవడతాయి.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్